కడుపు సేతెట్టుకుని,కూలి సేసుకుని
కుసింతగ గెంజి నీళ్ళు తాయి,
పది పరక మిగిల్సి
అమ్మ అయ్య బువ్వకి పంపిస్తూ
సల్లంగ ఉందేమని
పొరుగు రాష్టానికి బోయిన మమ్మలీని
మాయదారి రోగాలొచ్చి ముంచినాది
దేవుడో ! దేవుడా!
కూలి బందాయెనని ఓళ్ళూ.. చెరువు పూడ్చినామని ఓళ్ళూ… గుడిసెలెక్కబీకినారు,
కూలి లేక,గుడిసే లేక తిన మెదుకు లేదాయె పో!
తాగ బుక్కెడు గెంజి లేగపాయె!
సొంతూరు బోవ సేతీలో పైసాలు లేక
రైలుకు పైసలు లేక,బొస్సు కూ లేక,బండీ లేక
మా బతుగులు బండలాయె గదరా
దేవుడో ! దేవుడా!
సావో బదుగో ఉన్నూరు బోవాల
అమ్మని నాయన్ని సూడాలని
మూట ముల్లె సరదుకొని నెత్తినెట్టుకొని
కడుపున్న ఆలిని,ఒక సేతట్టుకొని,
సంటిదాన్ని సంకనెట్టుకొని,
సెప్పుల్లేని కాళ్ళతో ఎండలో,ఆనలో
జఱ్ఱి గొడ్డులాటి తారు రోడ్డు మీద
నడుత్తుంటే ఎంతకీ దూరం తరగకబాయె,
రోజులు వారాలాయె వారాలు నెలలాయె,
కాళ్ళు బండలాయె
సంటిది శోసొచ్చి
ఎండకొట్టి,ఆనకి తడిసి సచ్చిపోనాది
ఏడుద్దామంటే గొంతు బెగలక బాయె
ఆనాటి రోజులే కన్నులకు కట్టె…
కల్ల నీల్లు రావాయె
దేవుడో! దేవుడా!
ఒక బరువు తగ్గినాదని సంతోషమాయె
గందా మరి మోయతాలికి నాకేడకట్టం?
బండలు పిండి సేసిన కండలాయె నాయి,
గాని బిడ్డ ఆకలంటే. నాతావేంటుంది?
మట్టి బీడులో కట్టెతో గుంత తవ్వి
గుండె రాయి సేసుకొని బిడ్డను పూడ్సా!!!
ఆనాటి రోజులే మళ్ళీ మళ్ళీ వత్తాండె ..
దేవుడో!ఓరి దేవుడో!
మా బదుకులిట్టా బుగ్గి సేయబోకు
దేవుడో!ఓరి దేవుడో!
పోయిన బిడ్డను సూసి మాట మరిసి
కడుపులో బిడ్డతో నా యాడది
కష్టపడతాంటె ఆదుకోడానికి
సేతకాని మొగోన్ని నేను.
” ఏమయ్యా! కడుపునొస్తోంది ఇంకెట్లనయ్యా అన్న దాని మాటకి తలెత్తిసూసినా!
నా వల్ల కాదని ఆడనే సతికీలా బడినాది నా యాడది.నేనేటి సేతునో
దేవుడో ! ఓరి దేవుడో!
మూటలోని పాతసీర తీస్తి,
బుజాలంట జోలె కట్తి,
నాయాలిని కూకుండెట్టి
నా పయానం సాగించా!
పగోనికీ ఆ కష్టాలు రావద్దు
నా పేరు శి య్య,
ఆ శివయ్య గంగనెత్తి నెత్తుకున్నాడంట
సగం పార్వతిఅయ్యాడంట.
మా ఊరి పంతులు సెప్పిండు.
నాకు సానా సానా. తుప్తిగాఉంది
నేను ఆ శివయ్యకి తీసిపోనని.
నా ఆలిని నా జోలె లో కూకుండెట్టి మోస్తున్నా!
కట్టాలు నీవే ఇత్తావు ఉపాయమూ నీవే సెప్తావు
దేవుడో ! ఓరి దేవుడో!
సితరాల దేవుడో!
.* * *
అడుగులు పరుగులాయె
అల్లంత దూరానఊరాయె!
ఆనాటి కథలన్నీ ఏకరువులేనాయె…
* * *
అదిగయే బవానీ ఊరొచ్చేసినాది
అమ్మతావుకి బోయ
ఏడి ఏడి నీళ్ళోసుకొని
ఉడుకుడుకు బువ్వతిందామె! నులకమంచంలో పెసాంతంగా తొంగుందాం!
దిగయే! పల్లకీలా అమ్మోరు లెక్క కూసున్నావు.
* * *
అంటూ జోలేదింపిన శీవయ్య కి ఉలుకు పలుకు
లేని కట్టె జారిపడింది
నాలుగు నెలల కడుపుతో మొదలు పెట్టిన ప్రయాణం ముగిసింది.
ఎడపిల్ల చావు,సరి అయిన ఆహారమే లేక బిడ్డ కడుపు లో
అడ్డం తిరిగింది కూడా తెలియని స్థితిలో భవాని శివయ్యను వదిలి శివ సాన్నిహిత్యం
చేరింది.
* * *
భోరు భోరుమంటూ గుడిసె దగ్గిరకెళ్ళి తల్లిని
పిలువబోవ పందుల గుంపు గుర్రు గుర్రు మంటూ
మీద పడ్డాయి.
దూరాన గుడిసె లోంచి గవరయ్య,
“శివయ్యా! వచ్చినా వా! శివయ్యా!
ఊరు శశానం అయి పోయినాదిరా!
ఊరిలో సగానికి సగంమందిని ఆనాడు కరోనామహమ్మారి పొట్టనెట్టుకున్నాది ఎవ్వురీకీ ఒక్క అగ్గిపుల్ల ఖర్చెట్టలేదురా శివయ్యా!
ఊరి శివార్లలో ని శివయ్య ఊరుని మరిసాడు
ఆనాటి ఏడుపు మళ్ళ మళ్ళ వచ్చేత్తాంది
* * *
దేవుడో !ఓరి దేవుడో! ఏమి మాయ సేసావురా?
బంగారు తల్లి ని బిడ్డని పోగొట్టుకొని,నా ప్రాణమైన నా బవాని ని పోగొట్టు కొని అమ్మ వడి కని వడి వడిగా వచ్చిన నాకు అమ్మ అయ్య ని అట్టుకెళ్ళినావే
దేవుడో! ఓరి దేవుడో ! నువ్వుండావా? అసలుండావా?
పొట్టకూటికోసం సొంత ఊళ్లకు దూరం అవుతున్న ఎందరో … ఎన్నెన్నో …లెక్కలేనంతమందికి అంకితం.