Home వ్యాసాలు వీడిపోను – వాడిపోను కవిత పై విశ్లేషణా వ్యాసం

వీడిపోను – వాడిపోను కవిత పై విశ్లేషణా వ్యాసం

by Narendra Sandineni

కవిత్వాస్వాదన ధారావాహికవిశ్లేషణా వ్యాసాలు.

ఇది ఈ సంపుటిలోని భావ సంపుటి.నిండైన జీవితానికి అను స్పందించి లోతైన లోకానికి ప్రతి స్పందించి నీతిలోనూ రీతిలోనూ విచ్చలవిడిగా పెచ్చు పెరుగుతున్న అన్యాయాన్ని అసమానతలను తొలగించి మానవతకు మణి మకుటం తొడగాలని ఈ కవిత్రయం ముదిగొండ ఈశ్వర చరణ్,మాదాడి నారాయణ రెడ్డి,ముదిగొండ వీరేశ లింగం గారలు తమ కవితల ద్వారా చేసిన ప్రయత్నం ఈ సంపుటి నిండా కనబడుతుంది.ఈ ముగ్గురు కవులు భావుకులు మనీషులు,భాషను ఉచిత రీతి ప్రకటించడంలోనూ,భావాలను ఉజ్వలంగా పలికించడంలోనూ నేర్పరులు.ఆవేశమున్నా దానిని అదుపులో ఉంచే సంయమనం కూడా కలిగి ఉండడం వీరిలోని విశేషం.ఈ కవిత్రయం ముందు ముందు ఇతోధిక భావ ప్రాభవాన్ని కవితా రచన సాగించాలని కవి మిత్రుడిగా కాంక్షిస్తున్నాను.వీడి పోను వాడి పోను కవితను ఆసక్తితో చదివాను. నాలో ఆలోచనలు రేకెత్తించింది.వీడి పోను ఏమిటి? వాడి పోను ఏమిటి? ఈ భూమి మీద పుట్టిన మనిషి ఏదో ఒక రోజు నేలను విడిచి వెళ్లి పోవాల్సిందే.అది తిరుగు లేని సత్యం.కవి వీరేశ లింగం కవితకు వీడి పోను – వాడి పోను అని శీర్షిక పెట్టాడు.వీడి పోని వాళ్లు, వాడి పోని వాళ్లు ఎవరైనా ఉంటారా? అని మనకు ఆశ్చర్యం కలుగుతుంది.మరణానంతరం మనిషి చేసిన మంచి కార్యాల ఫలితం వల్ల స్వర్గానికి పోతారు అని అంటారు.మరణానంతరం మనిషి చేసిన దుష్కార్యాల ఫలితం వల్ల నరకానికి పోతారు అని అంటారు.స్వర్గంలో మనుషులు వీడి పోకుండా కలిసి ఉంటారు.స్వర్గంలో చెట్లకు పూచిన పూలు వాడి పోకుండా ఎల్లప్పుడూ నిగనిగలాడుతూ ఉంటాయని అంటారు.వీడి పోను – వాడి పోను కవిత చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారిద్దాం.అలౌకిక అనుభూతిని సొంతం చేసుకుందాం.” చెమ్మగిలిన నయనాలతో/ మందహాసానికి నోచుకోని ముఖంతో/ బరువెక్కిన హృదయంతో/ గద్గద కంఠంతో చెబుతున్నా ఈ కవిత.బాధలో ఉన్నప్పుడు మనిషి కళ్ళు చెమ్మగిల్లుతాయి.బాధలో మనిషికి దుఃఖం పొంగి పొర్లుతుంది.బాధను అనుభవించిన వారికే తెలుస్తుంది.బాధంటే ఏమిటి? బాధలో ఉన్నప్పుడు మనిషి ముఖం మీద నవ్వు మాయమై పోతుంది. బాధను అనుభవిస్తున్నప్పుడు మనిషి నవ్వును మరిచిపోతాడు.బాధలో ఉన్నప్పుడు ఎందుకో తెలియకుండానే మనిషి హృదయం బరువెక్కుతుంది.హృదయం బాధగా ఉంటే మనిషి కళ్ళ నుండి కన్నీళ్లు ధారలుగా వస్తాయి.గధ్గధ కంఠంతో బిగ్గరగా చెబుతున్నాడు.ఈ కవితను వ్రాస్తున్నా వ్రాయాలని లేకున్నా అని ఆవేదనతో చెబుతున్నాడు. ‘ఎడారిలో నీరు కనిపిస్తుంది ఎక్కడో ఒక చోట/మానవత మాత్రం అసలే కనబడదు జనమున్న చోట.”ఎటు వంటి వృక్ష సంపద లేకుండా కేవలం ఇసుకతో నిండి ఉన్న విశాలమైన భూభాగం ఎడారి.భూమిపై ⅓ వంతు వైశాల్యాన్ని ఎడారులు ఆక్రమించి ఉన్నాయి.ఎడారుల్లో అక్కడక్కడ కనిపించే ఒయాసిస్సులు మాత్రం సారవంతమై జనావాసాలకు అనుకూలంగా ఉంటాయి. ఒయాసిస్సులు ఉన్న చోట నీరు లభ్యమవడమే కాకుండా భూమి కూడా మంచి సారాన్ని కలిగి ఉంటుంది.కేవలం ఇసుకతోనే కాకుండా మంచుతో నిండి ఉన్న మంచు ఎడారులు ఉన్నాయి.ఎడారుల్లో కొన్ని నిస్సారమైన భూముల్లో ఖనిజ లవణాలు కూడా లభ్యమవుతుంటాయి.ఎడారులు జీవ కోటి మనుగడకు సహకరిస్తాయనే పేరు ఉంది.అయితే నిజానికి మనం ఎడారుల్లో కూడా చక్కటి జీవ వైవిధ్యాన్ని గమనించవచ్చు.సృష్టిలో మానవత్వాన్ని మించిన మతం లేదంటారు.మానవత్వం లేని మతం రాణించదు.మతాలన్నీ మానవత్వం కలిగి ఉండమని బోధిస్తాయి.మానవత్వం లేని వాళ్లకు స్వర్గంలో చోటు లభించదు అని అంటారు .మానవత్వం అంటే కరుణ,ప్రేమ,దయ,అహింసను పాటించడం.మానవ ప్రేమే మానవ ఆదర్శం.ఇతర విలువల కంటే మానవ విలువలే మిన్న అని చెబుతారు.వసుధైక కుటుంబ నిర్మాణం జరగాలి .ఎడారిలో నీరు కనిపిస్తుంది ఎక్కడో ఒక చోట. ఎడారిలోని ఒయాసిస్సుల్లో నీరు లభిస్తుంది అని చదివి ఉన్నాం.మనుషులు ఉన్న చోట మానవత మాత్రం అసలే కనబడదు.సమాజంలో నివసిస్తున్న ప్రజలు సాటి మనుషుల పట్ల ప్రేమ,దయ,కరుణ జాలి చూపాలి.ఇవ్వాళ మను‌షుల్లో మానవత్వం మృగ్యమై పోయింది అని కవి వీరేశ లింగం వ్యక్తీకరించిన భావం చక్కగా ఉంది. “చక్కెర రుచి మాటల్లోనే /మార్కెట్లోకెళ్తే చుక్కెదురవుతుంది.” చక్కెరను మనం బజారులో కొనుక్కొని వంటశాలలో వాడుకుంటాం.చక్కెర అనే మాటను జీవ రసాయన శాస్త్రంలో మరొక విధంగా చెప్పుకుంటారు.గ్లూకోజ్, ప్రక్టోస్,సుక్రోస్,మాల్టోస్,లాక్టోస్ మొదలైన కార్బోహైడ్రేట్లు అనే దృష్టితో చర్చ జరుపుతారు. మామూలు చక్కెరను సుక్రోస్ అంటారు.చక్కెర స్పటికాల రూపంలో స్వచ్ఛంగా ఉన్నప్పుడు తెల్లగా ఉంటుంది.చక్కెర తొందరగా శరీరానికి శక్తిని చేకూర్చేవి.కొందరు మనుషులు చక్కెర రుచిని మాటల్లోనే ఒలకబోస్తారు.చక్కెర రుచి తెలవాలంటే మనం నోట్లో వేసుకోవాలి.చక్కెర నోట్లో వేసుకుంటే నోరు తీయగా అవుతుంది.ఇవ్వాళ నడుస్తున్న సమాజం గురించి చెబుతూ మనుషులు చక్కెరకు గల రుచిని మాటల ద్వారానే తెలియజేస్తారు.తీయ తీయని తేనెల మాటలతో తీస్తారు సుమా గోతులు అని సినిమా పాట ఉంది.కొందరు వ్యక్తులు చక్కెర నోట్లో పోసినట్లుగా చక్కగా మాట్లాడుతారు.ఇవ్వాళ మార్కెట్ కు వెళ్లి చక్కెర కొందామంటే చక్కెర దొరకదు,కృత్రిమ కొరతను సృష్టించి చక్కెరను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారు.చక్కెర కొందామంటే దొరకక చుక్కెదురవుతుంది అని సమాజంలోని మనుషుల్లో పేరుకు పోయిన అవినీతిని చక్కెరను ఉదాహరిస్తూ కవి వీరేశ లింగం చెప్పిన తీరు అద్భుతంగా ఉంది.” కొంత కాలం పోతే /ఈ జనాభా పెరుగుతూ పోతే /మనం పోవాల్సింది విదేశ యాత్రకు మాత్రం కాదు / పరలోక యాత్రకు” సామాజిక శాస్త్రం లోను జీవ శాస్త్రంలోను జనాభా అనే పదాన్ని ఒక జాతికి చెందిన జీవుల సంఖ్యను చెప్పడానికి వాడతారు.జనాభా అనే పదాన్ని గణాంక శాస్త్రంలోను ఇతర విజ్ఞాన శాస్త్రాలలోను సముదాయం అనే అర్థంలో కూడా వాడుతారు. నిర్ణీత ప్రాంతాలలో నివసించే ఒకే జాతికి చెందిన జీవుల సమూహమే జనాభా.అధిక జనాభాతో వనరులు నానాటికి తగ్గిపోతున్నాయి.దేశంలో జనాభా పెరుగుదల వనరుల అభివృద్ధి మధ్య భారీ వ్యత్యాసం నెలకొంది.భవిష్యత్తులో జరిగే యుద్ధం,ధనం ఉన్న వారికి ధనం లేని వారికి మధ్య జరుగుతుంది.శరీరం విడిచిన తర్వాత మనిషి యొక్క ఆత్మ చేరే లోకాన్ని పర లోకం అంటారు. కొంత కాలం పాటు జనాభా పెరుగుతూ పోతే మన దేశంలో నివసిస్తున్న వారు పోవాల్సింది విదేశాలకు కాదు.అధిక జనాభా వల్ల మన దేశ వాసులు పర లోకానికి చేరుకుంటారు అని కవి చెప్పిన తీరు చక్కగా ఉంది. “ఎవరినడిగినా ఏమడిగినా /భగభగ మండుతారు,దావాగ్నిలా”.ఈనాటి సమాజంలో జీవిస్తున్న మనుషులను ఏదైనా విషయం గురించి ఎవరినడిగినా ఏమి అడిగినా దావాగ్నిలా భగభగ మండిపోతారు.దావానలం అంటే దావాగ్ని లేదా కార్చిచ్చు.అడవులలో సంభవించి అతి త్వరగా వ్యాపించే అగ్ని ప్రమాదాలు దావాగ్నులు.ఇవి మానవుల అలక్ష్యం వలన,మెరుపుల మూలంగా లేదా అగ్నిపర్వతాల వలన సంభవిస్తాయి.దావాగ్ని వల్ల మంటలు విస్తృతంగా వ్యాపించి అక్కడ నివసించే జంతు జాలాన్ని కూడా నాశనం చేస్తాయి.“గడబడ చేస్తారు బస్సు స్టాండులా.” విపరీతంగా పెరిగిన జనాభా వల్ల బస్సు స్టాండ్ లో రద్దీ ఎక్కువగా ఉంటుంది.ఇసుక పోస్తే రాలనంతగా జనాలు గుమి గూడి ఉంటారు.బస్సు స్టాండులో ఉన్న జనాలు తీవ్రమైన అసహనంతో గడబిడ చేస్తారు. ” అశాంతి ఈనాటి ఆత్మీయత.” మనుషులు ఏదేని చింతించాల్సిన సంఘటన కారణంగా కలిగే భయం చేత కలత చెందుట అశాంతి.అనుకోకుండా అసాంఘిక శక్తుల వల్ల బాంబు పేలుడు సంఘటన జరిగితే ప్రజలలో అశాంతి వ్యాపిస్తుంది.మనిషికి దగ్గరి బంధువుల వల్ల ఆత్మీయత నెలకొంటుంది.తల్లికి పిల్లలపై ఉండే ప్రేమ ఆత్మీయత.ఆత్మీయత అనేది ఒక వ్యక్తిగత సంపద.ఆత్మీయతను పెంపొందించుకోవడానికి మనుషులు ప్రయత్నించాలి.ఆత్మీయత మనిషికి బలం.ఈనాటి మనుషుల్లో ఆత్మీయత కొరవడింది. ఈనాటి మనుషుల్లో నైతికత లేకపోవడం వలన, విశ్వాసం లేకపోవడం వలన,ఆత్మీయతకు దూరమై కలత చెందుతారు.ఈనాటి మనిషి వ్యాకులత వలన ఏ పని పైన ధ్యాసను ఉంచలేక పోతున్నాడు.పెరిగిన జనాభా వల్ల కలవరంతో మనుషుల్లో అశాంతి పెరిగి ఆత్మీయతకు దూరమవుతున్నారు.అశాంతిని తొలగించాల్సిన అవసరం చాలా ఉంది.” ద్రోహం ఈనాటి దేశ భక్తి.” మంచికి వ్యతిరేక భావన ద్రోహం గా చెప్పవచ్చు. మనిషి ఎప్పుడైనా మంచిని గూర్చే ఆలోచించాలి.మనుషులకు ద్రోహ భావన పనికి రాదు.దేశ భక్తి అంటే ప్రజలకు వారు జన్మించిన దేశం మీద గల మక్కువ.ఇది ఒక ప్రాంతం లేదా పట్టణము లేదా గ్రామానికి పరిమితమై ఉండవచ్చు.దేశ భక్తితో వారి దేశం సాధించిన ప్రగతి,సంప్రదాయాలు మొదలైన వాటిని గొప్పవిగా భావిస్తారు.దేశ భక్తి, జాతీయత భావం ఒక్కటే.దేశ భక్తి కలిగి ఉండుట, ఇందులో వ్యక్తి కంటే దేశానికే ప్రాధాన్యత ఎక్కువ. దేశ భక్తిని కలిగిన వారు ప్రాణాన్ని కూడా త్యాగం చేయడానికి వెనుకంజ వేయరు.దేశం పట్ల గల ప్రేమను విధేయతను దేశ భక్తిగా చెప్పవచ్చు.దేశ భక్తి అంటే దేశం,చరిత్ర,సంప్రదాయాల పట్ల ప్రేమ,గౌరవం ఉండడం.దేశ భక్తులు తమ దేశ అభివృద్ధికి దాని చారిత్రక వారసత్వాన్ని పరిరక్షించడానికి కృషి చేస్తారు.దేశ భక్తితో చాలామంది తమ దేశానికి సేవ చేసి ప్రాణాలను కూడా అర్పించారు.ఇప్పటికి చాలా మంది ప్రజలు భక్తి శ్రద్ధలతో తమ దేశానికి నిస్వార్ధంగా సేవ చేస్తూనే ఉన్నారు.భారత స్వాతంత్ర్య సమరంలో ఎంతో మంది ప్రజలు తమ దేశం కొరకు ప్రాణాలు కోల్పోవడం జరిగింది.దేశ భక్తి వల్ల దేశ ప్రజలు తరతమ భేదాలు లేకుండా ఐకమత్యంగా ఉంటారు.దేశ భక్తి వల్ల దేశం బలోపేతంగా తయారవుతుంది.జనాభా పెరుగుదల వల్ల ప్రజలు ద్రోహ చింతనను దేశ భక్తిగా భావించడం తీవ్రమైన ఆవేదన కలిగిస్తుంది. “అహంకారం అంతకన్నా రక్తి. ”అహంకారం,దర్పము లేదా గర్వము ఒక విధమైన ఆలోచనా పద్ధతి.రక్తి అంటే ఏమిటి? ఆహ్లాదకరమైన మనోహరమైన ఆకర్షణీయమైన అందమైన అనే అర్థంలో రక్తిని వాడుతారు. పెరిగిన జనాభా వల్ల మనుషుల్లో అహంకారం పెరిగి పోయింది.మనుషులు మితిమీరిన అహంకారంతో ప్రవర్తిస్తున్నారు. అహంకారం వల్ల సాటి మనిషిని గౌరవించ లేరు. సాటి మనిషిని హీనంగా చూస్తారు.అహంకారం వల్ల మనిషిలోని ఆత్మజ్ఞానం అడుగంటి పోతుంది. “అదేమంటే,ఉందంటారు మాకు శక్తి.అహంకారం గురించి అదేమని అడిగితే గర్వంతో ఉందంటారు మాకు శక్తి.“దీనికంతా కారణం ఏమిటి? / కల్తీ లేని శాల్తీ కనబడకపోవడం/ఏ రంగంలో చూచిన/ఏ మనిషినడిగినా,సోదా చేసినా/సాదాయైన సీదా జీవితం కనబడదు.” నిత్యావసర వస్తువులలో ఇతర పదార్థాలను కలిపి చలామణి చేయడం నేరం. వస్తువులను కల్తీ చేయడం Aduleration అంటారు. కల్తీ వలన మనిషి ప్రాణాలకు ప్రమాదం జరుగుతుంది.ఆహార కల్తీ విపణిలో ఏ వస్తువు ఎక్కువ డిమాండ్ ఉంటుందో ఏ వస్తువుకు ధర ఎక్కువగా ఉంటుందో ఆ వస్తువు కల్తీ కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.నూనె,పాలు, నెయ్యి,కారం, పప్పు దినుసులను ఎక్కువగా కల్తీ చేస్తున్నారు.ప్రమాదకరమైన రంగులు వేసి అమ్ముతుంటారు.మనిషి మితి మీరిన అహంకారంతో వ్యవహరిస్తున్నాడు.దీనికంతా కారణమేమిటి అని ప్రశ్నించడమే కాకుండా జవాబు కూడా ఇస్తున్నాడు.ఇవ్వాళ సమాజంలో మనుషులు అందరు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ నైతికంగా దిగజారిపోతున్నారు.సమాజంలో మంచి వారు ఒక్కరు కూడా కనబడడం లేదు అని కవి వీరేశ లింగం ఆవేదన చెందుతున్నాడు.సమాజంలో ఏ రంగంలో చూచినా ఏ మనిషిని అడిగినప్పటికీ సరైన సమాధానం లభించదు.సమాజంలో ఏ మనిషిని సోదా చేసినా స్వచ్ఛత కనబడడం లేదు.ఏ మనిషి జీవితం కూడా మంచితనంతో మానవత్వంతో పరిమళించడం లేదు అని కవి వీరేశ లింగం వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“ కౌటిల్యుడు పోయి ఎన్ని శతాబ్దాలు అయింది/ కాని,నేడు కౌటిల్యుడు లేని ప్రదేశమే లేదు. కౌటిల్యుడు మహోన్నత మానవతావాది.కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రం చాణిక్య నీతి శాస్త్రంగా పేర్కొంటారు.కౌటిల్యుడు ఈ లోకాన్ని వీడిపోయి ఎన్నో శతాబ్దాలు గడిచాయి అనేది వాస్తవం.నేటి సమాజంలో కౌటిల్యుల లాంటి వ్యక్తులు అడుగడుగునా తారసపడతారు.నేడు ఎక్కడ చూసినా కౌటిల్యుడు అన్ని ప్రదేశాల్లో ఉన్నాడు అని వెల్లడి చేయడం,కవి వీరేశ లింగం సమాజాన్ని ఔపోషణ పట్టినట్టుగా తోస్తోంది.కౌటిల్యం అంటే కుటిల రాజకీయం అని లోకంలో స్థిరపడిపోయింది. సమాజాన్ని అడుగడుగునా కలుషితం చేస్తున్న కుటిల రాజకీయ నాయకుల నుండి అప్రమత్తంగా ఉండాలని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది. “కనీసం చంద్రగోళమైనా వెళ్లి బ్రతుకుదామా అంటే, /అక్కడా ఉన్నది గందరగోళం/కనిపించేది రాళ్లు,అదో రకం బూడిద/గాలి అసలే లేదు./అనువైన వాతావరణం ఏమీ లేదు.”మానవులు అడుగు పెట్టిన మొదటి కొత్త ప్రపంచం ఏది? అంటే చంద్రమండలం అని తోస్తుంది.చంద్రుడు భూమికి సమీపంలో ఉండటం వల్ల గ్రహ శాస్త్రానికి ప్రయోగశాలగా దానిని వాడుకుంటున్నాం. అంతరిక్షంలో ఎక్కువ కాలం జీవించడం,పని చేయడం ఎలాగో తెలుసుకోవడానికి చంద్రుడు ఒక ప్రధాన ప్రదేశంగా మిగిలిపోయాడు.ఈ లోకంలో మనుషులు చేస్తున్న అక్రమాలు చూసి విసుగు చెందిన అతడు కనీసం చంద్రుని వద్దకు వెళ్లి బ్రతుకును కొనసాగిస్తానని ఆలోచించాడు.అక్కడ కూడా తన ఆలోచనలకు భిన్నంగా ఉంది.చంద్ర లోకంలో కూడా తాను ఊహించిన దానికి అతీతంగా ఉంది.ఎందుకో చంద్ర గోళం చిందర వందరగా ఉండడం,ఒక క్రమ పద్ధతిలో లేక పోవడంను చూసి అతనికి ఆందోళన కలిగింది.అక్కడ అతడు చూడగానే చంద్రుని వద్ద కనిపించేవి రాళ్లు మరియు అదో రకం బూడిద అక్కడ పేరుకు పోయి ఉంది. ఎందుకో? ఏమిటో? చంద్రుని వద్ద గాలి అసలే లేదు. చంద్రుని వద్ద నివసించడానికి అనువైన వాతావరణం కూడా అక్కడ లేదు అని కవి వీరేశ లింగం కవితలో వ్యక్తీకరించిన భావం చక్కగా ఉంది. ”మరింకే గోళంలో ఉందా వీలైన వాతావరణం ? /సైంటిస్టుల నుండి సమాధానం లేదు.” మరింకే గోళంలో ఉందా వీలైన వాతావరణం అని ప్రశ్నిస్తున్నాడు మరియు అతనే జవాబు చెబుతున్నాడు.శాస్త్రవేత్తల నుండి ఎటువంటి సమాధానం లభించడం లేదు అనే వాస్తవము ఒప్పుకుంటున్నాడు.కవి వీరేశ లింగం కవితలో చెప్పిన తీరు చక్కగా ఉంది. “అందుకే చివరికిది నా నిర్ణయం -’.నిర్ణయం తీసుకునే చర్య లేదా ప్రక్రియ. నిర్ణయం తీసుకోవడం ద్వారా ఒక ప్రశ్న లేదా సందేహం వంటి నిర్ణయం.నిర్ణయం అంటే ఏదైనా పని చేయుట కోసం తీసుకోబడే దృఢ సంకల్పం లేదా నిశ్చయం.ఏదైనా కారణం ద్వారా ఒక ఉద్దేశానికి రావటం నిర్ణయం.ఏదైనా ఒక విషయంపై నిర్ధారణ చేసుకోవటం నిర్ణయం.ఒక పని చేయాలనే ఆలోచన లేదా భావన నిర్ణయం.ఒక ఆలోచన లేక పథకం గురించి ఒక నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించుకోవడం జరుగుతుంది.అందుకే అతను చిట్ట చివరిది అయిన నా నిర్ణయంలో ఎలాంటి మార్పుకు ఆస్కారం లేదు అని బహిరంగంగా వెల్లడి చేస్తున్నాడు.“ఉంటాను భూమి మీదే,/ తొలగిస్తాను ముళ్ల కంపలు.” అతను తీసుకున్న అసలైన నిర్ణయం గురించి చెబుతూ పుట్టి పెరిగిన ఈ భూమి మీదనే ఉంటాను.ఈ భూమి మీద విచ్చలవిడిగా పెరిగిన ముళ్ళ కంపలను గొడ్డలితో నరికి తొలగిస్తాను.ముళ్ళ కంపల లాంటి మనుషుల వల్లనే భూమి మీద మానవ పురోగతికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి.ఈ భూమికి అడ్డంకులు కలిగిస్తున్న ముళ్ళ కంపలను తొలగిస్తాను అని ప్రతిన చేసి చెప్పుతున్నాడు. ”మారుస్తాను జీవితాలూ – వాటి ధోరణులూ – పెను తుపానులా ముంచుకు వస్తున్న విప్లవ ధోరణులను/ దిగ మ్రింగుతాను అపర శివుడిలా.” మానవుడి సామాజిక సంబంధాలు,తాత్విక మరియు మతపరమైన ఆలోచనల ధోరణులను మారుస్తాను అంటున్నాడు.పెను తుపాను వేగంగా గాలితో వచ్చే వర్షం.దివిసీమ తుఫాను వల్ల వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.సునామీ వచ్చి వైజాగ్ పట్టణం విలవిలలాడింది.ప్రపంచ సమాజంలో కొన్ని కొన్ని విధానాలు ప్రజాస్వామ్యము కమ్యూనిజం అనే సిద్ధాంతాలు ప్రసిద్ధిలో ఉన్నాయి.ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క విధానాన్ని ఎక్కువమంది అనుసరిస్తూ ఉంటారు.ఒక్కొక్కసారి ఒక్కొక్కరి పద్ధతిని జనాలు అనుసరిస్తూ ఉంటారు.విప్లవం అంటే ఒక దేశం యొక్క ప్రభుత్వ వ్యవస్థ,పరిపాలన వ్యవస్థ, రాజ్యాంగం లేదా సామాజిక వ్యవస్థలో అసాధారణమైన ఊహించని మార్పు అని చెప్ప వచ్చు.విప్లవం అంటే సమాజంలోని తరగతి,జాతి లేదా మతపరమైన నిర్మాణాల యొక్క వేగవంతమైన పరివర్తన.విప్లవం అనేది రాజకీయ పాలనలో మార్పునకు ప్రయత్నిస్తుంది. గణనీయమైన సామూహిక సమీకరణ,రాజ్యాంగేతర మార్గాల ద్వారా సామూహిక ప్రదర్శనం,నిరసనలు, సమ్మెలు లేదా హింస వంటి వాటి చేత సమాజాన్ని బలవంతంగా మార్చే ప్రయత్నాలను విప్లవ ధోరణి కలిగి ఉంటుంది.మానవ చరిత్రలో అనేక విప్లవాలు తల ఎత్తినాయి.ఏదైనా ఒక వ్యవస్థ మీద కలిగే అసహ్యం,విరక్తి,విరాగం,అకస్మాత్తుగా తీవ్రంగా ఏర్పడిన ఏహ్యా భావం విప్లవంగా రూపు దిద్దుకుంటుంది.సాధారణంగా రాజకీయ మార్పుని విప్లవం అంటారు.అణచివేత,అన్యాయమైన పాలన, లంచగొండితనం,అసమర్ధ రాజకీయ వ్యవస్థ, సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా ప్రజల తిరుగుబాటు,వలస పాలన పై ప్రజల తిరుగుబాటు మొదలైనవి విప్లవాలు.ఒక భావజాలానికి అనుకూలంగా ఉద్యమం రూపంలో ఉంటాయి. ప్రజల మనస్సుల్లో,భావోద్వేగాల్లో పాత ఆలోచనలకు బదులుగా కొత్త ఆలోచనలు రేకెత్తించే ప్రయత్నం విజయవంతం అయితే అది విప్లవంగా పరిగణించబడుతుంది.సమాజంలోని ఏదైనా సామాజిక సమూహం,తరగతి లేదా వర్గానికి చెందిన వ్యక్తుల పట్ల పక్షపాతం కారణంగా కూడా విప్లవాలు సంభవించవచ్చు.ఎవరైనా మీకు నచ్చని పనిని చేయమని బలవంతం చేస్తే చేయనని ఖరాఖండిగా చెప్పడం విప్లవంగా చెప్పవచ్చు.ప్రజల జీవితాలను మారుస్తాను.ప్రజల జీవితంలో వెల్లువెత్తుతున్న తీవ్రమైన ధోరణులను కూడా మారుస్తాను. సమాజంలో మార్పు కోసం సాగుతున్న పెను తుపానులా ముంచుకు వస్తున్న విప్లవ ధోరణులను కూడా మారుస్తాను.క్షీరసాగర మథనంలో దేవతలకు రాక్షసులకు అమృతం కొరకు సాగుతున్న పోరులో దేవతలు శివుని ప్రార్థించగా శివుడు హాలాహలం మింగి దేవతలకు అమృతం దక్కేటట్లు చేశాడు. ఇవ్వాళ సమాజంలో తుఫాను వలె ముంచుకు వస్తున్న విప్లవ ధోరణులను కూడా దిగ మ్రింగుతాను అపర శివుడిలా అంటున్నాడు.అర్రులు చాచుతాను అంటూ అతను అమరత్వం కొరకు అర్రులు చాస్తాను.అమరత్వం కొరకు ఎదురు తెన్నులు చూస్తూ పోరాడుతాను అనే సంకల్పాన్ని తెలియజేస్తున్నాడు.సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కొరకు ప్రయత్నిస్తూ సమస్యల అంచుల వరకు ఆలోచిస్తాను.ఆలోచనల ఫలితాన్ని అందుకుంటాను. ఇవ్వాళ దేశం ఎదుర్కొంటున్న ఇక్కట్లకు పరిష్కారం కనుగొని నా దేశానికి పూర్ణత్వం చేకూరుస్తాను.ఇది తానూ ఎన్నుకున్న తీర్మానం,తిరుగులేని నా నిర్ణయం అంటున్నాడు.అందుకే ఈ భూమిని వీడి పోను వాడిగా అసలే పోను అని అతనిలో చెలరేగుతున్న భావాలు నిత్య నూతనత్వంతో కూడుకుని ఉన్నాయి.వాడి పోను వీడి పోను అని మనలో ఆలోచనలు రేకెత్తిస్తున్నాడు.మనలను ఏదో కొత్త లోకంలోకి తీసుకొని పోతున్నాడు.అతను వ్యక్తం చేస్తున్న భావాలకు స్వాగతం పలుకుతున్నాను.వీడి పోను వాడి పోను.నా భావాలను సజీవంగా నిలిపే ప్రయత్నం చేస్తాను అనే అతని ఊహలు ఆశ్చర్యంగా ఉన్నాయి.కవి వీరేశ లింగం కవితలో వ్యక్తం చేసిన భావాలు అద్భుతంగా ఉన్నాయి.కవి వీరేశ లింగం మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.
డాక్టర్ ముదిగొండ వీరేశ లింగం తేది 08 – 06 -1940 రోజున వరంగల్ జిల్లాలో జన్మించాడు.వీరి తల్లిదండ్రులు భవానమ్మ,శంకర శాస్త్రి.వీరి తండ్రి శంకర శాస్త్రి వరంగల్ పట్టణంలో విశ్వేశ్వర సంస్కృత కళాశాల,దుర్గేశ్వర మహిళా కళాశాలలను నడిపాడు.ఆచార్య డాక్టర్ రవ్వా శ్రీహరి గారు శంకర శాస్త్రి వద్ద సంస్కృతం నేర్చుకున్నారు.శంకర శాస్త్రి ప్రియమైన శిష్యుడు ఆచార్య డాక్టర్ రవ్వా శ్రీహరి. వీరి తండ్రి శంకర శాస్త్రి 1993 సంవత్సరంలో ఈ లోకాన్ని వీడి పోయారు.వీరి తాత వీరేశ లింగం నాయనమ్మ అన్నపూర్ణమ్మ.వీరి తాత వీరేశ లింగం,1916 సంవత్సరంలో ఈ లోకాన్ని వీడి పోయారు.వీరు 5 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు ఎ.వి. హై స్కూల్ హన్మకొండలో చదివారు. వీరు 10 వ తరగతి1957 సంవత్సరంలో ఉత్తీర్ణత సాధించారు.వీరు పి.యు.సి. నుండి బి.ఏ. డిగ్రీ 1959 – 1962 వరకు ప్రభుత్వ ఆర్ట్స్& సైన్స్ డిగ్రీ కళాశాల,వరంగల్ లో చదివారు.వీరు ఎం.ఏ. తెలుగు ఉస్మానియా యూనివర్సిటీ,హైదరాబాదులో చదివారు.వీరు ఎం.ఏ. తెలుగు 1965 సంవత్సరంలో ఉత్తీర్ణత సాధించారు.వీరు జైమిని భారతం సంశోధనాత్మక పరిశీలన అంశంపై ప్రొఫెసర్ యం.కుల శేఖర రావు గారి పర్యవేక్షణలో ఉస్మానియా యూనివర్సిటీ,హైదరాబాద్ నుండి 1978 సంవత్సరంలో పి.హెచ్.డి.అవార్డు పొందారు. వీరు డిగ్రీ కళాశాలలో చదువుతున్నప్పటి నుండి సాహిత్య సృజన చేయడం ప్రారంభించారు.వీరు18 – 09 – 1969 రోజున ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గూడూరు,నెల్లూరు జిల్లాలో లెక్చరర్ గా నియమింపబడ్డారు.వీరు వివిధ హోదాలలో పనిచేస్తూ కాకతీయ డిగ్రీ కళాశాల,హన్మకొండ నుండి రీడర్ గా 30 – 06 -1998 రోజున రిటైర్ అయ్యారు. వీరు రీడర్ గా కాకతీయ డిగ్రీ కళాశాల,హన్మకొండలో పని చేస్తున్నప్పుడు వీరి పర్యవేక్షణలో ఇద్దరు విద్యార్థులు పి.హెచ్.డీ. అవార్డు పొందారు.వీరి పర్యవేక్షణలో పిన్న శారద “మల్లంపల్లి వీరేశ్వర శర్మ గారి జీవితం సాహిత్యం” అంశంపై పరిశోధన చేసి పి.హెచ్.డి అవార్డు పొందింది.పిన్న శారద దుర్గేశ్వర మహిళా సంస్కృతాంధ్ర కళాశాల,వరంగల్ నుండి ప్రిన్సిపల్ గా పని చేసి రిటైర్ అయింది.వీరేశలింగం గారి పర్యవేక్షణలో హరి సనత్ కుమార్ విశ్వనాథ సత్యనారాయణ గారి ఖండ కావ్యాలు పరిశోధన అంశం” పై పరిశోధన చేసి పి.హెచ్.డి.అవార్డు పొందినాడు.హరి సనత్ కుమార్ ప్రొఫెసర్ హరి శివకుమార్ తమ్ముడు.హరి సనత్ కుమార్ యొక్క విశ్వనాథ సత్యనారాయణ గారి ఖండ కావ్యాలు పరిశోధన గ్రంథం ప్రచురింపబడింది.
వీరేశ లింగం గారు ఇస్కాన్ ముంబాయి సంస్థలో నవంబర్ 1998 నుండి 2011 వరకు ఉచితంగా పని చేశాడు.వీరు సంస్కృతం భగవద్గీతకు సంపాదకత్వం వహించారు.వీరు సంస్కృత భాగవతం 18 వాల్యూమ్స్ లకు సంపాదకత్వం వహించారు.వీరి సంపాదకత్వంలో ఇస్కాన్ సంస్థ నుండి 25 పుస్తకాలు వెలువడ్డాయి. శివానందమూర్తి గారు ప్రచురించిన వ్యాస గ్రంధాలలో వీరు రాసిన వ్యాసాలు యోగ శాస్త్రం,తెలంగాణలో శైవ మత వ్యాప్తి ప్రచురింపబడినవి.వీరేశ లింగం గారి వివాహం జ్ఞాన ప్రసూనాంబతో తేది 08 – 06 – 1966 రోజున పెసరమిల్లి గ్రామం కృష్ణా జిల్లాలో జరిగింది. వీరేశ లింగం,జ్ఞాన ప్రసూనాంబ దంపతులకు ముగ్గురు సంతానం :1)ప్రథమ సంతానం : కుమారి శివ కౌముదీ దేవి, కవయిత్రి,రచయిత్రి,జర్నలిస్ట్, కథలు వ్యాసాలు రాశారు.వీరు రాష్ట్రపతి ఆర్ వెంకట్రామన్ ను ఇంటర్వ్యూ చేసారు.వీరు రేడియోలో ప్రసంగాలు చేశారు.కుమారి శివ కౌముదీ దేవి అనారోగ్యంతో 02 – 06 -2016 రోజున ఈ లోకాన్ని వీడిపోయింది. సాహిత్య లోకం ఒక గొప్ప కవయిత్రిని కోల్పోయింది.
2) ద్వితీయ సంతానం : దుర్గాప్రసాద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అమెరికాలో పని చేస్తున్నాడు.
3)తృతీయ సంతానం : భావనా శంకర్ భార్య శైలవర్తన.భావనా శంకర్ కెనడాలో బ్యాంక్ మేనేజర్ గా పని చేస్తున్నాడు.
వీరేశ లింగం గారు వెలువరించిన పుస్తకాల వివరాలు.
1) స్పందన కవితా సంపుటి – 1982.
2) జైమినీ భారతం సంశోధనాత్మక పరిశీలన గ్రంథం -1983.
వీరేశ లింగం వరంగల్ పట్టణంలో స్వగృహం నిర్మించుకున్నాడు.వీరికి 84 సంవత్సరాల వయస్సు.ప్రత్యేక తెలంగాణ 1969 గురించి అడిగితే తెలంగాణలోని రాజకీయ నాయకులకు ఎవరి స్వార్థం వారికే ఉంది.రాజకీయ నాయకులు నిజాయితీగా తెలంగాణ కోసం పని చేయ లేదు అన్నారు.2014 తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడం నాకు చాలా సంతోషంగా అనిపించింది.తల్లిదండ్రులు పిల్లలను ప్రేమగా చూసుకోవాలి.తల్లిదండ్రులను బట్టి పిల్లలు తయారవుతారు.తల్లిదండ్రులు పిల్లల పట్ల ప్రేమగా ఉండాలి.చేతనైనంత వరకు ఎవరికైనా సహాయం చేయాలి.మాటలు చెప్పడం కాదు పని చేసి చూపించాలి అని అన్నారు.వీరు 50 మందికి హోమం చేసి లింగ ధారణం,పంచాక్షర మంత్రం ఉపదేశం చేశారు.వీరు నూతన రచయితలకు కొన్ని సూచనలు చేశారు.చేతిలో కలం ఉంది కదా అని ఏది పడితే అది రాయ కూడదు.రాసే వాళ్ళు ఆలోచించి రాయాలి.నేను రాసిన దానివల్ల ఎవరికన్నా ప్రయోజనం ఉందా? లేదా? అని ఆలోచించాలి.నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడకూడదు.సమాజంలో రాయి రాయక పో.మనసును వాక్కును కంట్రోల్ చేయడం చాలా అవసరం.పెద్దల ఎడ గౌరవాన్ని కలిగి ఉండాలి.బుద్ధి,మనస్సు,ఆలోచనలను అదుపులో పెట్టుకోవాలి.ఎవరిని అవమానించ కూడదు. అందరికీ మంచి జరగాలని కోరుకోవాలి.తామరాకు మీద నీటి బొట్టు లాగా బతకాలి.ప్రాచీన,ఆధునిక సాహిత్యం రెండు చదవాలి.మనసులో ద్వేషం పెట్టుకుని పుస్తకాలు చదవ వద్దు.ఎవరిని గూర్చి కూడా చెడు మాట్లాడ కూడదు అని చెప్పినారు.వీరు 5 గంటలకు నిద్రలేస్తారు.కాలకృత్యాలు తీర్చుకుంటారు.రోజు శివ పూజ చేస్తారు.సమయం దొరికినప్పుడు సాహిత్య అధ్యయనం చేస్తారు.రాత్రి 10 గంటలకు నిద్ర పోతారు.

ప్రముఖ కవి,రిటైర్డ్ తెలుగు భాషా రీడర్,కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల,హన్మ కొండ,డాక్టర్ ముదిగొండ వీరేశ లింగం కలం నుండి జాలువారిన స్పందన కవితా సంపుటిలోని విప్లవానికి మలుపు కవిత పై విశ్లేషణా వ్యాసం.విప్లవానికి మలుపు కవితను ఆసక్తితో చదివాను.నాకు నచ్చింది.నాలో ఆలోచనలు రేకెత్తించింది.విప్లవాలు ఒక భావజాలానికి వ్యతిరేకంగా లేదా అనుకూలంగా ఉద్యమ రూపంలో ఉంటాయి.ప్రజల మనస్సుల్లో భావోద్వేగాల్లో పాత ఆలోచనలకు బదులు కొత్త ఆలోచనలు రేకెత్తించే ప్రయత్నం విజయవంతమైతే విప్లవంగా పరిగణించబడుతుంది.చరిత్రలో ఎన్నో విప్లవాలు జరిగాయి.విప్లవానికి మలుపు ఉంటుందా? అని మనకు ఆశ్చర్యం కలిగించవచ్చు. ధనిక,పేద అసమానతలు తొలగించడానికి పేద ప్రజలు ఐక్యమై పోరుబాట సాగిస్తారు.ఆ పేద ప్రజల పోరు బాట అనేక మలుపులు తిరిగి చివరికి విప్లవం విజయవంతం అవుతుంది.
“ఈనాటి నా జాతి స్వరూపం
“రంగు రంగుల సుమాల వనం
“నానా జాతి సమితి మినీ స్వనం
“విపుల బాంధవ్య వైవిధ్యాలు లేని గుణం – నిక్వణం.
సమాజంలో జాతుల స్వరూపం అనేక తెగలతో నెలకొని ఉంది.వివిధ తెగలు గల జాతి రంగు రంగుల పూల తోటలా ఉంది.సమాజంలో అనేక తెగల మధ్య దేశాల మధ్య యుద్ధాలు ఆధిపత్యం కోసం జరుగుతూ ఉండేవి.ప్రపంచ దేశాల మధ్య అనేక తెగల మధ్య సయోధ్య చేకూర్చడానికి నానా జాతి సమితి అనే ప్రపంచ సంస్థ ఏర్పడింది.నానా జాతి సమితి లోని తెగల మధ్య ఏర్పడిన చిన్న ధ్వని ప్రభవించింది.మనం నివసించు ప్రదేశం మనకు తల్లి లాంటిది.అలాంటి ప్రదేశాలలో నివసించు ప్రజల మధ్య సంబంధాలు ఏమీ లేకపోయినప్పటికీ అనేక తెగలు కలిసిన బాంధవ్యాల మధ్య ఒక చక్కని ధ్వని వినబడింది.
“ఈ జాతికి ఎందుకో పుట్టింది విప్లవం
“ఏనాటికి మారకూడదు ప్లవంగంలా
“మారినా పరవా లేదు అది లవంగంలా
“ఎందుకైనా మంచిది : అది అలానే కావాలి.
ఈ దేశంలో పుట్టిన ఈ జాతి జనులకు ఎందుకో పుట్టింది విప్లవం? అని ప్రశ్నిస్తున్నాడు. అరాచకాలకు,అణిచివేతకు,దోపిడీకి,వివక్షకు గురి అవుతున్న ప్రజలు తమ హక్కుల సాధన కోసం ఉద్యమాల బాట పట్టి పోరాటం సాగిస్తారు.మార్పు కోరే హక్కు ప్రజలకు ఉంది.అట్టి ఆ మార్పే విప్లవంగా రూపు దిద్దుకుంటుంది.ప్రజలలో చైతన్యంతో పుట్టుకు వచ్చిన విప్లవం హక్కుల సాధన కోసం మార్పు కోసం నిరంతరం ఉద్యమాలుగా కొనసాగుతుంటాయి.ప్రజలు సాగిస్తున్న అట్టి విప్లవం సరైన పంథాలో సాగాలి.ప్రజలు సాగిస్తున్న ఆ విప్లవం ఏనాటికి మారకూడదు కోతిలా అని ప్రజలను హెచ్చరిస్తున్నాడు.విప్లవాలలో పాల్గొన్న వారి ప్రవర్తన క్షణ క్షణం మారే కోతి చేష్టల వలె ఉండకూడదు.విప్లవాలు నడిపే వాళ్ళ ప్రవర్తన కోతిలా ఉంటే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు అనే ఉద్దేశంతో తెలియజేస్తున్నాడు.తమ హక్కుల కోసం ప్రజలు సాగిస్తున్న విప్లవం మారినా ఫర్వాలేదు లవంగంలా అని అంటున్నాడు.లవంగం ప్రజల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.విప్లవం కూడా లవంగం వలె ఆరోగ్యకరమైనదిగా కొనసాగాలి అని కోరుకుంటున్నాడు.ఎందుకైనా మంచిది విప్లవం అలానే కొనసాగాలని అంటున్నాడు.ఆరోగ్యకరమైన విప్లవం కొరకు ఆరాటపడుతున్న తపన కనబడుతుంది.మంచి కోసం పాటు పడే విప్లవాలు చోటు చేసుకోవాలి అని చెబుతూ ప్రజల్లో విశ్వాసాన్ని నింపుతూ ప్రేరణ కలిగిస్తున్నాడు.
“విప్లవ రుధిర జ్వాల కోసం
“ఎదురుచూస్తున్నారు ఈనాటి యువకులు
“కాని ఎందరున్నారు.ఈ జాతిలో రక్తం ధార పోసే వారు.”
సమాజంలో ఎందరో యువకులు విప్లవాల బాటన సాగుతున్నారు.సమాజంలో ఎందరో యువకులు విప్లవ రుధిర జ్వాల కోసం తమ రక్తాన్ని ధార పోయడానికి ఎదురు చూస్తున్నారు.ఈనాటి సమాజంలో రక్తాన్ని ధార పోసే యువకులు ఎందరు ఉన్నారు.విప్లవాల కోసం ఉద్యమాలు ఉవ్వెత్తున రగులుతున్నాయి.కాని తమ జాతి హక్కుల సాధన కోసం రక్తం ధార పోసే యువకులు ఎందరు ఉన్నారు అని ప్రశ్నించడం చక్కగా ఉంది.సమాజంలో చెలరేగుతున్న ఉద్యమాల్లో పాల్గొని యువకులు జాతి కొరకు పాటు పడాలని ప్రేరణ కలిగిస్తున్నాడు.
“రక్తమంటే ఏమో కాదు
“అర్థం చేసుకున్న వారికి
“తెలుస్తుంది దాని విలువ
“ఆరోగ్యానికి కావాలి రక్తం
“ఆయుర్దాయానికి కావాలి రక్తం.
రక్తం మానవులు ఇతర జంతువులలో కణజాలాలకు పోషకాలను,ఆక్సిజన్ ను సరఫరా చేసే ద్రవం.రక్తం జీవ క్రియలో భాగంగా ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను ఆ కణజాలాల నుండి తీసుకుపోతుంది.రక్తమును నెత్తురు అని కూడా అంటారు.జీవి మనుగడకు రక్తం అత్యవసరం.రక్తాన్ని చూడగానే వెంటనే ఆకట్టుకునేది దాని ఎర్రటి ఎరుపు రంగు.రక్తానికి ప్రాణం హిమగ్లోబిన్.దీన్నే రక్తచందురం అంటారు. కవి వీరేశ లింగం రక్తం యొక్క విలువ అర్థం చేసుకున్న వారికే తెలుస్తుంది అని అంటున్నాడు. రక్తం లేకుంటే మనిషి నీరసించి అనారోగ్యం బారిన పడి ప్రాణాలు కోల్పోతాడు.మానవుని సంపూర్ణ ఆరోగ్యానికి రక్తం కావాలి.రక్తం ఉంటేనే మనిషి ఆయుర్దాయం కలిగి సుఖంగా ఎక్కువ కాలం జీవించగలుగుతాడు అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“చైతన్యానికి కావాలి అదే
“యువతకు కావాలి అదే
“అందుకే అంటాం
“ఆపరేషన్ థియేటర్లో
“ఆరోగ్య పూరిత రక్తమే కావాలని.”
చైతన్యం లేదా స్పృహ అంటే ఆలోచనలు, జ్ఞాపకాలు,భావాలు,అనుభూతులు మరియు పరిసరాలపై వ్యక్తిగత అవగాహన కలిగి ఉండటం. చైతన్యం లేదా స్పృహ అనేది మీ గురించి మీ చుట్టూ ఉన్న ప్రపంచం గురించి మీకున్న అవగాహన అని చెప్పవచ్చు.చైతన్యం అంటే శక్తి లేదా ఉత్సాహం అని అర్థం.చైతన్యమంటే ప్రాణము లేదా జీవ శక్తి అని కూడా చెప్ప వచ్చు.కవి వీరేశ లింగం మానవుని చైతన్యానికి కావాలి రక్తం.మనిషి చైతన్యం లేకుంటే ఏ పని చేయ లేడు.చైతన్యం లేకుంటే మనిషి నీరసించి పోతాడు.మనిషి చైతన్యంతో ఉండాలి అంటే రక్తం తప్పనిసరి కావాలి అని చెప్పిన తీరు బాగుంది.యువత అనగానే తమ కుటుంబం,సమాజం,రాష్ట్రం,దేశం యొక్క అభివృద్ధిలో ఎల్లప్పుడు సానుకూల మార్పును కోరుకునే శక్తివంతమైన సమూహంగా చెప్పవచ్చు. యువత దేశానికి వెన్నెముకగా పేరు గాంచింది.దేశం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోవాలంటే చైతన్యంతో,దృఢ సంకల్పంతో యువత ఒక ప్రణాళిక ప్రకారం కృషి చేయాలి.భారత దేశం ఇప్పటికి పేదరికం,నిరుద్యోగం,అవినీతి, ఆత్మహత్యలు మరియు వివిధ రకాల సామాజిక సమస్యలను ఎదుర్కొంటుంది.ఉత్సాహంతో పరుగులు తీస్తున్న యువతకు కూడా రక్తం కావాలి. యువత రక్తం ఉంటేనే చైతన్యంతో ఉంటారు. యువత చైతన్యంతో సమాజాభివృద్ధి కొరకు పాటు పడతారు అని చెప్పిన తీరు బాగుంది.ఆసుపత్రిలో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి ఆపరేషన్ థియేటర్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నప్పుడు అతనికి ఆరోగ్యపూరితమైన రక్తం ఎక్కిస్తేనే ప్రాణాపాయం నుంచి బయటపడ గలుగుతాడు.రక్తం ఎక్కించిన తర్వాత అతను ఆరోగ్యకరమైన వ్యక్తిగా జీవించగలుగుతాడు అనుటలో సందేహం లేదు.
“కాబట్టి ఈనాటి జాతికి
“పనికి వచ్చే నవయువకుల నవచైతన్యం
“ఆలోచించే అర్థవంతపు జీవితం
“అమరత్వం కొరకు అర్రులు చాచే
“మతి భ్రమణం లేని యువకుల చైతన్యం
“కావాలి అదే – చివరంటా సాగాలి అదే –
“సంకేతాలను తప్పించుకునే వారు
“సంకటాలను తప్పించు కొనాలి
“దానికే ఈనాటి యువతరం
“పడాలి మధనం పొందాలి ఆవేదన.
దేశం ఎదుర్కొంటున్న సమస్యల విష వలయం నుంచి బయటపడాలంటే చైతన్యవంతులైన నవ యువకుల వల్లనే సాధ్యమవుతుంది.అలాంటి నవ యువత మాత్రమే దేశ అభివృద్ధి,సమాజ అభివృద్ధి కొరకు కృషి చేస్తూ ప్రాణాలను పణంగా పెట్టగలరు. నవ యువత అమరత్వానికి అర్రులు చాస్తారు. అమరత్వం అనేది శాశ్వత జీవితం యొక్క భావన. అమరత్వం అనగా మరణము లేని తనం.కొండలు పిండి చేసే నవ యువకులలోని చైతన్యం మతి భ్రమణం కోల్పోయేలా ఉండకూడదు.నవ యువకుల చైతన్యం వెర్రి తలలు వేయకూడదు. ఈనాటి నవ యువత సానుకూల భావాలతో ముందుకు సాగాలి.అలాంటి సానుకూల భావాలు ఉన్న నవ యువకులు కావాలి.అలాంటి నవ యువకులు దేశ శ్రేయస్సు కొరకు జీవితాంతం వరకు ముందుకు సాగాలి అని పిలుపునిస్తున్నాడు.ఈ దేశంలో నివసించే యువత నిర్దిష్టమైన ప్రణాళికలతో చైతన్యవంతులై ఆపదల నుండి తప్పించుకునే వారుగా ఉండాలి.ఈనాటి నవ యువత తమ ఆశయాలను సాధించడానికి ఎదురయ్యే కష్టాలను తప్పించుకొని ఎదుర్కొంటూ తమ కృషిని కొనసాగించాలి.కవి వీరేశ లింగం ఈనాటి యువతరం ఉత్సాహంతో మధనపడి ఆవేదన చెంది దేశం కోసం పాటుపడాలని చైతన్యాన్ని కలిగిస్తున్నాడు.
“పది మందిలో బడ్డ పామైనా చావదు
“అదే నేటి మన సమాజపు లోటు
“దిద్దు కోవాలి ఈ లోపం
“హద్దు మీరితే పరితపించ గలం పాపం.
పది మందిలోకీ వచ్చిన పాము చావదు అని తెలుగులో సామెత ఉంది.అదే నేటి మన సమాజం యొక్క లోటు అని తెలియజేస్తున్నాడు.నేటి సమాజంలో కొందరు తెలిసి తెలియక తప్పులు చేస్తుంటారు.చేసిన తప్పు తెలుసుకొని చివరికి బాధ పడుతుంటారు.ఈ లోపాన్ని దిద్దుకోవాలని అని చైతన్యం కలగిస్తున్నాడుమనిషి చేసిన తప్పులు హద్దులు మీరితే పరితపించక తప్పదు అని చెబుతున్నాడు.
“చీకాకుల చిడిముడిపాటులో
“ఆకుల పాటులో ఆకతాయితనాన్ని
“అణగ ద్రొక్కేయి నేస్తం అణగ ద్రొక్కేయి
“నిర్లిప్తంగా పడి ఉంటే నువ్వు
“నిజంగా పడిపోతావు
“జాగ్రత్తే నీ జన్మ హక్కని
“పోరాడు శాశ్వతంగా గెలుస్తావు
“తస్మాత్ జాగ్రత్త : జాగ్రత్త : జాగ్రత్త :.
మనిషి చీకాకుగా ఉండడం వలన బాధలను ఎదుర్కొంటాడు.మనిషి చీకాకుతో ఏర్పడిన బాధల వలన కలిగిన ఫలితం అనుభవిస్తాడు.మనిషి చిన్న పిల్లల చేష్టల వంటి ఆకతాయితనాన్ని విడిచి పెట్టాలని స్నేహితుడి వలె సలహా ఇస్తున్నాడు. నిర్లిప్తంగా పడి ఉంటే ఏ పనిలోను మనసును నిమగ్నం చేయ లేక పోతాడు.నిర్లిప్తంగా ఉంటే బాధకు లోనై పడి పోతావు అని సలహా ఇస్తున్నాడు. చిన్న పిల్లల చేష్టలను మనస్సులోనే అణగ ద్రొక్కేయి నేస్తం అణగ ద్రొక్కేయి అని చెప్పడం చక్కగా ఉంది. మంచి చెడు ఆలోచించకుండా నువ్వు కళ్ళు మూసుకుని ఉంటే నిజంగా పడిపోతావు.యువత ఎక్కడ పడిపోకుండా జాగ్రత్తగా ముందుకు సాగాలి. యువత చర్యలు తీసుకోవడంలో జాగ్రత్తలు తీసుకోవాలి.యువత నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటిలో జాగ్రత్తగా ఉండాలి.యువత ప్రమాదాన్ని నివారించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.జాగ్రత్తగా ఉండడం యువత యొక్క జన్మ హక్కు. యువతా అచంచల ఆత్మ విశ్వాసంతో పోరాడు శాశ్వతంగా గెలుస్తావని జాగ్రత్త వహించమని కవి వీరేశ లింగం వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.విప్లవానికి మలుపు కవిత ద్వారా యువత సమాజం పట్ల తమ బాధ్యతను ఎలా నెరవేర్చుకోవాలి?యువత అమాయకత్వంతో దుందుడుకు చర్యలకు పాల్పడకూడదు అనే కర్తవ్య బోధ ఉంది.విప్లవానికి మలుపు కవిత ద్వారా యువతకు కవి వీరేశ లింగం గొప్ప సూచనలు ఇచ్చారు.ఈ కవిత యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు.కవి వీరేశ లింగం మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

ముదిగొండ వీరేశ లింగం, జ్ఞాన ప్రసూనంబ

You may also like

Leave a Comment