విధి చేసిన మది గాయం అగాధపు అంచులు తాకింది
పగిలిన అద్దంలో ప్రతిబింబం వికృతంగా వెక్కిరిస్తోంది
కమ్ముకున్న నైరాశ్యపు మేఘాలు నీలాల నింగిని కరిమబ్బును చేశాయి
శృతి తప్పిన కళ్యాణ వీణ ప్రణయరాగం విరిసే వేళ విషాద గీతం పలికిస్తోంది
సగాలు రెండు సమాంతర రేఖలై గమనం సాగిస్తున్నాయి
మృగాల వేటలో సగాల ఘోష మిన్నంటుతోంది
పుట్టలోని కాలనాగులు పడగవిప్పి బుసలు కొడుతున్నాయి
సోలో పయనంలో ముసుగుచాటు వికృతం అంతకంతకూ విజృంభిస్తోంది
ముడివడిన బంధం ద్విదళ బీజమై చీలుతోంది
అంకురచ్ఛదాలు అడకత్తెరలో పోకచెక్కలవుతున్నాయి
ప్రేమ కోసం పిందెలు చెకోరాలై పరితపిస్తున్నాయి
తెగిన దారాలను సవరించుకుంటూ
విరిగిన మనసులను అతికించుకుంటూ
సమాంతర రేఖలు దిశ మార్చుకుని సరళ రేఖలైతే
ఖండన బిందువు అనురాగ సంగమమౌతుంది
బాల్యానికి భద్రతావలయమౌ తుంది
శూన్యం నిండిన ఎదలోయల్లో సుస్వర వీణ మోహనరాగం పలికిస్తుంది
శిశిరం పలాయనం పఠించి మది వసంతమై విరబూస్తుంది