పరాయి చోటయినా
మెట్టినింటిలో పాదుకొంటో!
పెరిగిన చోటేదైనా…
కాలు పెట్టిన ఇంటిని తన ఇంటిగా తీర్చిదిద్దుకొంటూ!
బాధల వేవిళ్ళెన్నో భరించి
మరో జీవికి పునర్జన్మనిస్తూ!
ఉనికిలోనే తెగువ కల మగువలు!
కట్టుబాట్ల సంకెళ్లను తెంచుకున్న మగువలు…
చైతన్యంతో చూపుతున్నారు తెగువ!
గలగలలాడే గాజుల చేతులు…
గగన విహారం చేస్తున్నాయి!
గరిట మాత్రమే పట్టిన చేతులు…
గడగడలాడిస్తూ లాఠీ ఝుళిపిస్తున్నాయి!
జోలలు పుచ్చే కరములు…
జోరుగా నడుపుతున్నాయి కార్లు!
కుసుమ కోమల కరములు…
కంప్యూటర్ కీ బోర్డును టకటకలాడిస్తున్నాయి!
నేలను మాత్రమే చూసే
వారి చూపులు…
తలెత్తి అందరినీ శాసిస్తున్నాయి!
వంటింటి గడప వరకే
పరిమితమైన వారి అడుగులు…
అంతరిక్షానికి సైతం పయనిస్తున్నాయి!
ఇంటి బడ్జెట్ నిర్వహణకు మాత్రమే పరిమితమైన వారి మేధ…
దేశ బడ్జెట్ ను రూపొందిస్తో…
శాస్త్రీయ పరిశోధనలో పాలుపంచుకుంటో…
పదవీ నిర్వహణను సమర్థంగా చేపడుతూ…
సవ్యసాచిలా ఇంటా బయటా…
సంయమనంతో,సహనంతో
సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తోంది!
చెప్పండి అందరూ ఇప్పటికైనా…
ఆడాళ్ళూ-మీకు జోహార్లని!!!