సావిత్రికి చిన్నప్పటి నుండి ఒక అలవాటున్నది. తల్లి ఏదైనా వంటకము చేసి పెట్టి రుచి ఎలా వున్నది ? అని అడిగితే “ యమహా “ గా వున్నది … అనేది- తండ్రి కొత్త బట్టలు తెచ్చి అమ్మడూ!బాగున్నాయా? అనడిగితే నాన్న గారూ! “ యమహా “గా వున్నాయనేది. స్నేహితులు ఫలానా సినిమా చూసావా ? ఎలా వుంది ? అని అంటే “ యమహా “ గా ఉన్నదంటుంది.
సావిత్రి రేడియో జాకీగా పనిచేస్తుంది. మైకు పట్టుకుని … హలో !!! హైదరాబాద్ !!!గుడ్ మార్నింగ్ !! ఎలా వున్నారు? నేనైతే యమాహా గా వున్నాను.మీశ్రోతలందరికీ యమా యమాగా మీరు కోరుకున్న పాటలు విని పిస్తాను.ట్రింగ్ …ట్రింగ్ …హలో !! ముందుగా కాల్ చేస్తున్నారు యమాహాగా! M.ధర్మరాజు గారూ ! ఈ రోజు మీరు ఏ పాట వినాలనుకుంటున్నారు.
హలో ! హలో ! సావిత్రి గారూ ! మీ వాయిస్ బాగుంటుంది .. అది వినాలనే చాలా సార్లు కాల్ చేసాను అదృష్ట వశాత్తూ ఈ రోజు కలిసింది. థాంక్సండీ మీకు ఏ పాట కావాలి ? అవతలి వైపునుండి .. ”యమహో ..యమా యమా అందం “ అనే పాట కావాలి.శ్రీదేవి గారు లేరు కదా ! మరొక్క సారి గుర్తు చేసుకుందామని …
ఓ ! సరే సరే యమ్ ధర్మరాజు గారూ వినిపిస్తాను …వినండి వినండి ఉల్లాసంగా ..ఉత్సాహంగా !!అలా తన డ్యూటీ ముగించుకుని సావిత్రి తన “యమహా “మోటారు సైకిల్ మీద యమా స్పీడుగ భర్త ఆఫీస్ కు వెళ్ళి, ఆయనను పికప్ చేసుకుని , వస్తుంటే… తోవలో ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ యమ ధర్మ రాజులా కనపడి( ఈ మధ్య ట్రాఫిక్ పోలీసులు యమధర్మరాజు వేషము వేసుకుని … హెల్మెట్ పెట్టుకోకుంటే మీ ఇంటికి వస్తామని నటిస్తున్నారు జనాలు రూల్స్ పాటించడానికి కొత్త పద్ధతి) హెల్మెట్ లేదనిసఅడ్డగిస్తే …సర్ది చెప్పి బయట పడేసరికి ఆలస్యమయింది. తోవలో ఏదైనా తిని పిల్లలకు తీసుకుని పోదామని అటు చూసేసరికి…స్వర్గలోక్ రెస్టారెంటు కనపడింది. హోటల్ ముందు బోర్డ్ మీద రుచి గా చేసేందుకు ఐదు నక్షత్రాలహోటల్ చెఫ్ యమ్ ( అతని పూర్తి పేరు యామినేని మార్కండేయులు .పేరు పెద్దగా వున్నదని అలా యమ్ అని రాసుకుంటాడు.) చాలా రుచిగా శుచిగ చేస్తాడని, అతనికి సహాయకులుగా నల్,భీమ్ లున్నారని రాసి వున్నది. ఇద్దరూ నవ్వుకున్నారు. కొంప దీసివీడి హోటల్ లో పుఱ్ఱెలలో వడ్డిస్తారేమో అపిటైజర్ కు బదులు ఏ రక్తమో ఇవ్వరు కదా! అని బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు.
భోజనమైన తరువాత వాళ్ళకు ఒక అలవాటు ఎప్పుడైన సరే లోపల కిచెన్ లోపలికి వెళ్ళి ఫలాన నంబరు గల టేబిల్ పై సర్వ్ చేసిన ,భోజనము తయారు చేసిన చెఫ్ ఎవరో తెలుసుకోవచ్చా? అని అడిగితే మాస్టర్ యమ్ (యామినేని మార్కండేయులు) వచ్చి నేనే చేసాను . మీకు నచ్చలేదా ? అనగానే , కాదు కాదు యమహా గా వున్నదని అభినందించి, అక్కడి విజిటర్స్ బుక్ లో రాసి వచ్చినారు.
ఇద్దరూ కూర్చుని మాట్లాడు కుంటూ ఒక మంచి యమహా ఇల్లు కట్టుకోవాలి… ఎన్ని రోజులు ఈ నరకంలో వుంటాము అనుకుంటూ టీవీ ఆన్ చేసినారు. కామెడీ సీన్స్ వస్తున్నాయి. ఇద్దరికీ కామెడీ ప్రోగ్రామ్ లు చాలా నచ్చుతాయి.ఇంతలో స్క్రీన్ మీద “ యమధర్మ రాజు” మీద తీసిన
సినిమా క్లిప్పింగ్ లు వస్తున్నాయి. చూస్తూ నాకు యమదొంగ అంటే ఇష్టం అన్నాడు భర్త, నాకు యమగోల అంటే ఇష్టము …ఏ సినిమా లో నైనా యమధర్మరాజు పాత్ర చాలా నచ్చుతుంది. పాత సినిమాలలోని. సత్యనారాయణ అయినా , ఈ మథ్య నటించిన మోహన్ బాబు యమహా గా అదరగొట్టే డైలాగులని అవే చెప్పుకుంటూ నిద్రలోకి ఒరిగినారు.
తెల్లవారు ఝామున సావిత్రికి మెలుకువ వచ్చింది.ఎదురుగా యమపాశం పట్టుకుని యమధర్మరాజు నిలబడి సావిత్రీ !!! నీకు భూలోకంలో నివసించే సమయము అయిపోయింది రా!! యమలోకం వెళ్ళాలి… అని పిలుస్తున్నాడు. సావిత్రి అనుకుంటున్నది కదా! … కల వచ్చిందని… పడుకునేముందు యమధర్మరాజు సినిమాల గురించి మాట్లాడుకున్నాము ..తను నేను.
ఓహ్! కలనా అని పైకే అన్నది సావిత్రి.కాదు కాదు నువ్వు కల కన లేదు… నిజంగానే నీకుమరణించే రోజు వచ్చింది అన్నాడు యముడు.
“అయ్యో ! అలానా ? అయినా నువ్వు చాలా స్ట్రిక్ట్ కదా ! సరే వస్తాను !! కాని నేను నాభర్తను పిల్లలను చాలా ప్రేమిస్తాను. గమ్మత్తుగా అనుకోకుండా … వాళ్ళిద్దరి పుట్టిన రోజు ఒకేరోజ వస్తాయి.
నాకు కొంచెము సేపు టైమ్ ఇవ్వు… ఈ ఒక్కరోజు నేను వాళ్ళకిష్టమైనవి చేసి సంతోష పెట్టి వస్తాను “అని బతిమిలాడింది. అంటే సరే నేను ఇలా ఎవరికీû టైమ్ ఇవ్వను.వారి మరణమా
సన్నమవగానే …పాశం వేసి , ప్రాణాలు తీస్తాను…ఇలా మాట్లాడుతూ సమయము గడపను. కానీ నీకు చిన్నప్పటి నుండి నన్ను ప్రతి నిమిషము”యమహా! యమహా “ అని తలుచు కుంటావు కాబట్టి… అందునా మానవ లోకంలో నన్ను స్తోత్రము చేసే వాళ్ళే లేరు. అందరూభయపడి మనసు లో కూడా యమ అనరు అటువంటిది అలా ప్రతి పని లో నన్ను మనస్పూర్తిగా తలుచుకుంటూంటావు …. కాబట్టి నేను ముందున్న డ్రాయింగ్ రూంలో కూర్చుంటాను త్వరగా పని ముగించుకొని రా…అన్నాడు యముడు.
ఇక నడుము కు కొంగు చెక్కుకుంది… ఏ పని తో మొదలు పెట్టాలా అను కుంటూ.. గబగబబాయిలర్ లో నీళ్ళు పోసి, చెక్క పేళ్ళతో అంటించి, నీళ్ళు వెచ్చ పడగానే… భర్తకు, కొడుకుకు తలంటుపోయాలి అనుకుంటూ .. వంటింట్లోకి వెళ్ళి చిక్కటి కాఫీ చేసి ఒక కొత్త గ్లాసు లో పోసి ముందు రూంలో వున్న యముడికిచ్చింది అహా ! సావిత్రీ నాకు ఇలా ద్రవ పదార్ధాలు తాగే అలవాటు లేదంటే …కాదు ఒక్క గుక్క తాగండి” యమహా “ గా ఉంటుందని చప్పున నాలుక కరుచుకుంది.
యముధర్మరాజు ఒక్క గుక్క వేసి నువ్వన్నట్టు యమహా గా వున్నదన్నాడు. మీరే కాదు స్వామీ! “నా భర్త స్నేహితులు, చుట్టాలు అందరూ అదే మాటంటారు.
సరే సరే వెళుదాం పద ! నాకు ఇవ్వాళ “ టర్కీ “ దేశంలో వరదలు రావాలని వరుణుడిని పంపాను. అక్కడ చాలా మంది ప్రాణాలు తీయాల్సివుంది” అన్నాడు.
సావిత్రి పనిలో పడింది. బ్రేక్ ఫాస్ట్ మంచిగా చేయాలి. రేపటి నుండి నేనుండను కదా!అని వడ అందరికీ ఇష్టమని వడా , చట్నీ, సాంబార్ చేస్తూ ..మధ్య మధ్య భర్తను , పిల్లలను నిద్ర లేపుతున్నది.అటునుండి , ఇటుతిరిగి పండుకుంటున్నారు.సావిత్రి అటు టిఫిన్లు చేస్తూనే కుక్కర్ లో పప్పు , అన్నం పెట్టి , కూరలు కట్ చేసి మరొక్కసారి అందరిని నిద్ర లేపి , ఇంతలో మునిసిపాలిటీ పంపు రావడంతో …బిందెల తో నీళ్ళు పట్టి , ఫిల్టర్ నింపింది.లంచ్ బాక్స్ లు సిధ్ధం చేసి, భర్త షర్ట్ ఇస్త్రీ చేసి , పిల్లల స్కూల్ బ్యాగ్ లు సర్ది, వాటర్ బాటిల్స్ నింపి , బూట్లు పాలిష్ చేసి , సాక్స్ , యూనిఫాం రెడీగా పెట్టి , దువ్వెన రిబ్బన లు పట్టుకొని మళ్ళీ పిల్లల రూం లోకి వచ్చి వాళ్ళను బలవంతంగా బాత్ రూంలోకి ఈడుస్తూ, బ్రష్ మీద పేస్ట్
పెట్టు తుండగానే యముడి పిలుపు “సావిత్రీ ! త్వరగా రా !” అని గంభీరంగా పలికాడు.
“స్వామీ ! మధ్య తరగతి మహిళలకు పొద్దున్నే యమ పని వుంటుంది. పనిలో పక్కనున్న వారితో అంటారు కూడా … చావ తీరుతులేదు … ఈ పని తో అని మీరే చూస్తున్నారు కదా ! అసలే ఈ రోజు కూరగాయల సంత – అక్కడ యమ రష్ గా వుంటుంది.నాకు కూరగాయలు కొని ఆ యమ రష్ నుండి పడేసరికి యమలోక దర్శనమే. అసలే కూరగాయలు యమ గిరాకీ … అంతేనా? కరెంట్ బిల్లు , వాటర్ బిల్లు చెల్లించడానికి ఈ సేవా సెంటర్ కు వెళితే అక్కడా యమ రష్. అక్కడి నుండి స్కూల్ లో పిల్లల ఫీజు పే చేసి పేరంట్స్ మీటింగు లో వాళ్ళడిగే యమ గందరగోళ ప్రశ్నలకు ఓపికగా జవాబు చెప్పాలి. ఎందుకంటే ఆ స్కూల్ కుయమక్రేజీ..వాళ్ళడిగే ప్రశ్నలు యమ ఈజీ అంటారు కొందరు.
సరే కుటుంబం బాగుండాలని ప్రార్ధిద్దామని కోవెలకు వెళ్ళి …రాముడిని దర్శనము చేసుకోవాలంటే ఆ క్యూలో జనాలు కాళ్ళు తొక్కి , నెట్టేస్తుంటే యమా ! నీవే గుర్తుకు వస్తావు. అంతేనా రేషన్ షాప్ కు వెళితే అదొక యమలోకం.అక్కడ సరుకులిచ్చే వాడు అచ్చంగా నీ వలె (యముడు) కూర్చొని , తూకంలో మాత్రం నీ ధర్మం , నీ న్యాయం పాటించడు సుమా
అన్నీ తప్పుడు కొలతలే …చెడ్డ కోపం వస్తుంది. ఒక్కొక్కసారి ఎంత విసిగి పోతామంటే రేషన్ డీలర్ ఇచ్చిన కిరోసిన్ వాడి మీద పోసి, అంటించి నీ( యమ ) లోకం పంపాలనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే సరదాగా వెళ్ళే సినిమా హాలులో క్యూ కొట్లాటలు, బజారులో డేరాలు వేసి మహిళా సంఘాల న్యాయపోరాటాల మోతలతో యమ లోకం కనపడుతుంది….”అంటూండగానే…
ఈ రోజు మొత్తము నీ ఇంటిముందు పడిగాపులు పడ్డా …నీవు నా వెంట వచ్చేటట్ట లేవు , అంటే …అయ్యో! యమా ! ఇంకెక్కడ పని తీరింది…ఈ వంట పాత్రలు శుభ్రం చేసి, ఇల్లంత సర్ది , బట్టలుతికి , నేను ఆఫీసుకు పోయే సరికి , లేటయితే అక్కడ మరొక యముడుంటాడు. అదే మా బాస్ !ఇక ఆయన తిట్ల దండకము అందుకుంటే ఇంతకన్నా తానే నయమని… యమధర్మరాజా! నన్ను నీ లోకం తీసుకెళ్ల వయ్యా! అని అనుకుంటాము మా మధ్య తరగతి మహిళలము అని చెప్తూ అటు తిరిగి చూసేసరికి … యముడు స్పృహ తప్పి పడి, పక్కకు ఒరిగి పోయి వున్నాడు. ఎలా యముడిని లేపడం ? అనుకుంటూ – నాకు నా భర్తా , పిల్లలను లేపడమే యమ కష్ఠం … ఇవాళ యమహా గా యముడిని లేపడం… ఒక సమస్య తరువాత ఒకటి
నేను భరించ లేనయ్యా ! యముడా ! నన్ను తీసుకొన పోవయ్యా ! అని నాలుక కరుచుకొని , చూస్తుండగానే కళ్ళు తెరచి, సావిత్రీ ! వస్తావా లేదా ? ఈ మాయదారి దోమలు కుట్టి కుట్టి నేను వెళ్ళే ప్రయత్నము చేయకుండానే… యమ లోకం పంపేటట్టున్నాయి. అనగానే…
“అయ్యో ! యమా ! నిన్ను హాలులో కూర్చుండ బెడిత బాగుండును…ఈ డ్రాయింగ రూంలో యమ దోమలు అవి కుట్టాయంటే …యమ మంట పుడుతుంది”
అనగానే ఆ ఒక్క పని తక్క మరొకటి చేయ వీలులేదు పోదాం పద !అని గట్టిగా అన్నాడు యముడు. సరే స్వామీ మిగిలిన పని చేసి వస్తానని …ఒక్క గెంతు గెంతింది పెరట్లోకి అపర సావిత్రి యముడు తన చేతిలో పాశం చూస్తూ… భూలోకంలో సగటు మధ్య తరగతి మహిళలకు యమ పాశం అక్కరే లేదు …వాళ్ళ బంధనాలే పాశం , ఇలా పొద్దటి నుండి …సాయంత్రం దాకా పని చేసి చేసి …యమ నీరస పడి పోతారు. ఇక పూర్వ జన్మ పాపాలు పరిహారము చేయడానికే నేను యమలోకం తీసుకొని వెళ్ళేది. వాళ్ళు ఆ శిక్ష లేవో ఇక్కడే అనుభవిస్తున్నారు. ఇంకా నేను తీసుకొని పోయేసరికి … వాళ్ళ చిట్టాలు జమా- ఖర్చు సమానమవుతాయి ఎందుకులే ఈ అబల సావిత్రిని కీసుకొని వెళ్లడము అనుకొని …చెప్పా పెట్ట కుండా వెళ్ళిపోయాడు యమాగా “ సమవర్తి “.
*******************
సావిత్రి — యమ ధర్మరాజు ( హాస్య కథ)
previous post