Home కవితలు భూతల్లి పుట్టింది..

భూతల్లి పుట్టింది..

by Chandu Pendyala

డుగులకు ఆదరువైన అమ్మ
అందరిని పిలిచింది
మనిషి పుట్టిండు జంతు జాతి పుట్టింది
చెట్టు చేమ లు వెలసినయి
నదీ జలాలు పారినయి ఆకలి ఆరంభమైంది
వీసమంత మనిషి మనసు
గాసంకోసం తిరిగిండు
బతుకు బాట వెదికింది
పోడు ఎవుసం మొదలైంది భూములు బావురుమనని
భూసారం బుగ్గి కాని
పంటలు పండించె తెలివినబడ్డరు
గొర్రె పిల్లల మందలు
మడిమడికి తిరిగినవి
అర్ధ రాతిరి యాల్ల
కుక్కలు వాటిని కాపాడే
సైనికులయినవి
గొంగడి కొప్పెరలు
మోతుకాకు సుట్టలు
జకుముకి నిప్పులు
కంది పొరక మంటలు
నిదుర కాచినవి
జొన్న కొయ్యకాల్లు
కొర్రాల్లు అయినవి
చిమ్మని చీకట్లో
మిణుగురు పురుగులు
కందీల్లు అయినవి
ముల్లు కర్రలు
విల్లంబులైనవి
పంది కూనల కసువు
భూపసిడి అయ్యింది
కోడిపిల్లల పెంట
కొంగుబంగారమయ్యింది
దొడ్డెడు గొడ్ల పెంట
బండి పొనుక నింపుకొని పొలాలకు జాతర కట్టినవి
పెంట కుప్పలు
చెలకల అలికినవి
ఎద్దు తిరిగిన నేల
ఎగిరి దునికింది
రాగాలు తీస్తూ వంగి
పొలం నాట్లు వేసిన
రైతు కూలీలందరు రోగాలు
లేని పంట పండించినరు
భూమాత కాక తగ్గించినరు
ప్రపంచానికి చల్లదనం
అనే ధనం ఇచ్చిండ్రు
గత చరిత్రను మరచిన
ఆధునిక మానవులు
ధరణి దహించకముందే
విచిత్ర రోగాల
విలయతాండవం
విజృంభించకముందే
మత్తు నుండి మేల్కొనకపోతే
జగత్తులో ఉత్తమ జాతి
అని చెప్పుకునే మానవజాతి
తమకు తాము జప్తు కాక తప్పదు…

You may also like

Leave a Comment