అనువాద రచయిత – ఒద్దిరాజు మురళీధర్ రావు గారు
మూల రచయిత – సుధా మూర్తి
పుస్తకం-గ్రాండ్ మాస్ బ్యాగ్ ఆఫ్ స్టోరీస్
సిద్ధార్థ అనే ఒక యువకుడు మంచి నడవడి గల వ్యాపారి. మంచి వ్యాపారం కోసం వేరే ఊరు వెళ్ళాడు. అతడు ఆ గ్రామస్తులను ఎంతో ఇష్టపడి తను అక్కడే స్థిరపడాలని నిశ్చయించుకున్నాడు. తను కూడబెట్టుకున్న డబ్బంతా పెట్టి అక్కడనే ఒక ఇల్లు కొందామనుకున్నాడు. ఇల్లు వెతకడానికి వెళ్ళినప్పుడు అతనికి ఉదయ్ అనే యువకుడు కలిశాడు.
ఉదయ్ అప్పుడు ఒక బీదవాడు. అతనిది ఒకప్పుడు ధనిక కుటుంబం. కాని ఇప్పుడు అంతంతమాత్రంగానే ఉన్నారు. ఉదయ్ తన కుటుంబ పాతబంగ్లా అమ్మేసి తన కుటుంబ అప్పులు తీర్చాలని అనుకుంటున్నాడు.
ఉదయ్ చూపిన ఇల్లు సిద్ధార్థకు నచ్చి వెంటనే కొనేశాడు. శిథిలంగా ఉన్న ఆ ఇంటిని రిపేరు చేయడం మొదలు పెట్టించాడు. అతను పాత ఫ్లోరింగ్‌ను తవ్విస్తున్నపుడు ఒక సీల్డు పెట్టె భూమిలో పాతిపెట్టబడినది కనిపించింది. దాన్ని తెరిచినప్పుడు అతను ఆశ్చర్యపోయాడు, దాని నిండా కదులుతున్న వృశ్చికములను (తేళ్లను) చూశాడు. భయపడి వెంటనే ఆ పెట్టెను దూరంగా విసిరేశాడు.
సాయంత్రం అతను తేళ్ళపెట్టె గురించి తెలుసుకుందామని ఆ ఊళ్లో ఒక పండితుని వద్దకు వెళ్ళాడు. ఆ పండితుడు కొంతసేపు విచారించి బహుశ ఉదయ్ పూర్వీకులు ఎవరో తమ కుటుంబంలో ఎవరికైన అవసరం ఏర్పడినపుడు ఆ ధనం ఉపయోగపడుతుందనే భావంతో ఆ పెట్టెను పాతిపెట్టి ఉండవచ్చు అన్నాడు. చాలా సంవత్సరాల తర్వాత ఆ పెట్టె గురించి మరిచిపోయి ఉండవచ్చు.
సిద్ధార్థకు ఏమి తోచలేదు. కాని పెట్టెలో డబ్బుగాక తేళ్ళు ఉండటమేమి?
అప్పుడు ఆ వృద్ధుడు నవ్వాడు. “ఆ పెట్టె ఎంతోకాలం నుండి కాపాడబడి ఉంది. దాన్ని కుటుంబీకులు తప్ప ఇతరులకు తేళ్ళతో నిండిన పెట్టె కనబడుతుంది. కేవలం ఆ కుటుంబీకుల్లో ఎవరైనా చూస్తే వారికి పెట్టెలో డబ్బు కనిపిస్తుంది. ఇది ఒక మంత్రబలం కావచ్చు” అన్నాడు ఆ పండితుడు.
సిద్దార్థ ఇది విని బాధపడ్డాడు. ఉదయ్ తన పూర్వీకుల ఇంటిని చివరి సారిగా చూసి ఊరు వదిలిపెట్టి పోతున్నప్పుడు కన్నీరు ఉబికిరావడం సిద్ధార్థకు జ్ఞాపకం ఉంది. ఒకవేళ అతనికి దాచబడిన ధనం తెలిసిఉంటే అతనికి ఇల్లు అమ్మే అవసరం ఉండకపోయేది. సిద్ధార్థ ఇల్లు చేరాక, అతను పెట్టెను ఎవరైన ఉదయ్క సంబంధీకులు వచ్చి అడిగేవరకు భద్రంగా దాచిపెట్టాలని అనుకున్నాడు. పెట్టెకు సంబంధించిన నిజమైన ఉదయ్ కుటుంబ వారసులను గుర్తించేందుకు, పెట్టెనుండి నాల్గు తేళ్ళను తీసుకొని పోయి, అతను కొత్తగా తెరిచిన షాపుముందు నాల్గు మూలల్లో నాల్గు తేళ్ళను వేలాడదీసాడు.
అతని గిరాకులందరు షాపులోని వచ్చినపుడు ఏదో వ్యాఖ్యానం చేసేవారు. ‘సిద్ధార్థ గారు, మీకు ఏమైనా పిచ్చి పట్టిందా? మీ షాపు ముందర ఎందుకు ప్రమాదకర తేళ్ళను వేలాడదీశారు? మీరు షాపుకు వచ్చేవారిని భయపెట్టాలనుకున్నారా?” అని అనేవారు.
కాని సిద్ధార్థ ఏమీ అనకుండా కేవలం నవ్వేవాడు. అతని షాపులోని వస్తువులు చాలా మంచివని చుట్టు కొన్ని మైళ్ళవరకు తెలుసని తనకు తెలుసు. జనులు తేళ్ళను లెక్కచేయకుండా తన షాపుకే వస్తారు అనే గట్టి నమ్మకం అతనిది.
క్రమక్రమంగా ఆ షాపు తేళ్ళషాపని అనబడేది. గ్రామస్తులు అతని వెనకాల నవ్వుకునేవారు. కాని సిద్ధార్థ ఏమీ పట్టించుకోకపోయేది.
చాలా సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడు సిద్ధార్థ నడివయసు వాడు, భార్యాపిల్లలతో మరియు చాలినంత ధనంతో తృప్తిగా ఉంటున్నాడు. కాని అతనికి ఒక అసంతృప్తి ఉంది. ఇంతవరకు ఆ తేళ్ళపెట్టె హక్కుదారులు ఎవరు కూడా లేదు అని.
ఒకరోజు ఒక యువకుడు షాపుకు వచ్చి, సార్, నేను మీరు ధనికులని, అవసరమున్నవారిని సహాయపడుతారని తెలిసి వచ్చాను. నేను ఫీజు కట్టలేనందుకు స్కూలుకు పోవడం ఆపేయవలసి వచ్చింది. నేను చదువు పూర్తి చేసుకునేందుకు మీరు దయతో కొంత డబ్బు సహాయపడగలరా?
సిద్ధార్థ రంధిగా తల అడ్డం తిప్పాడు. గ్రామస్తులు నా గురించి అతిగా చెప్పారు అని అన్నాడు. అవును, నేను బాగానే సంపాదిస్తున్నాను. కాని నీకు సహాయ పడేంత కానీ లేక అప్పు ఇచ్చేంత కానీ ధనం లేదు, నేను సంతోషంగా ఇచ్చేందుకు.
ఆ అబ్బాయి అది విని కోపంతో మండిపడ్డాడు. ‘సార్, ఒకవేళ మీరు సహాయ పడదలచుకోకుంటే, దయతో అలానే చెప్పండి నిర్మొహమాటంగా. ఎందుకు అబద్ధం ఆడుతారు? మీకు ఎంత ధనం ఉందంటే దానితో ఏంచేయాలో మీకు తెలియదు. అటువంటప్పుడు మీ షాపుకు ఎదురుగా బంగారు నాణాలు నాల్గు మూలల్లో ఎందుకు వేలాడదీసారు? తప్పకు మీరు నా వంటి బీదవిద్యార్థికి కొన్ని నాణాలు ఇవ్వగలరు’.
సిద్ధార్థ అతన్ని కనురెప్ప వాల్చకుండా తేరిపార ఆశ్చర్యంతో చూశాడు. ఏంటీ? ఏంటి? నువ్వు ఇప్పుడేం అన్నావు? తన కనుగుడ్లు ఉబ్బించి ఉద్రేకంతో అడిగాడు.
‘ఒకవేళ మీరు సహాయపడననుకుంటే’ అని అన్నాను. అబ్బాయి మరల చెప్పాడు. ఆం, అవును, అవును అది విన్నాను. కాని దాని తరువాత ఏమన్నావు, నా షాపు ముందర బంగారు నాణాల గురించి?
ఇప్పుడు అబ్బాయి సిద్ధార్థకు కోపం వచ్చిందని భయపడి రెండడుగులు వెనక్కు వేసి, మీరు షాపు ఎదురుగా నాల్గుమూలల్లో బంగారు నాణాలు వేళాడ దీసేంత ధనికుడవని అన్నాను. కాని సిద్ధార్థకు, ఇతర జనులకు అవి ప్రాణమున్న తేళ్ళుగానే అక్కడ కనిపిస్తున్నాయి.
సిద్ధార్థ చాలా సంతోషంగా బిగ్గరగా నవ్వాడు. అతను ముందుకెళ్ళి ఆ అబ్బాయిని ఆలింగనం చేసుకున్నాడు. నీవు ఉదయ్ కమలాకర్ వంశీయుడివా? మీ కుటుంబం ఎప్పుడైనా ఈ గ్రామంలో ఉండిందా? అని అతను దాదాపు అబ్బాయి చెవులో అరిచాడు.
ఆ అబ్బాయి భయపడి వెనకడుగు వేశాడు. బహుశ ఈ ధనికుడు కోపిష్టి, ప్రమాదకరుడు అనుకున్నాడు.
ఆఁ ఆఁ ఆఁ అవును, నా పేరు ఉదయ్. మా తాతగారి పేరు నాకు పెట్టారు. అతని కుటుంబం ఇక్కడ చాలాతరాలు ఉండేదని విన్నాను. తర్వాత, వారికి ఇబ్బందులు వచ్చి, మా తాతగారు ఇల్లు అమ్మి వెళ్ళిపోయారు. అతను తన పూర్వీకుల ఆస్తి అమ్మిన బాధతో కోలుకోలేక గుండె బగిలి మరణించాడు.
సిద్ధార్థ తన కండ్లనీరు తుడిచేసుకున్నాడు. ‘ఇక్కడే ఆగు, నా కుమారా’ అని అతను పరుగు పరుగున తన ఇంటికి వెళ్ళి, పాత పెట్టెతో తిరిగి వచ్చి దాన్ని ఆ యువకునికి ఇచ్చాడు. వెళ్ళు, పెట్టె బంగారు, వెండి నాణాలు మరియు ఆభరణాలతో నిండి ఉంది.
అతను, అతి సంతోషంతో ఉన్న సిద్ధార్థ వైపు ఆశ్చర్యంగా చూశాడు. అవును, ఇది నీకు చెందినదని సిద్ధార్థ వివరించాడు. నేను చాలా సంవత్సరాల నుండి దీన్ని జాగ్రత్తగా దాచాను, ఎన్నడైనా ఎవరైనా ఒకరు ఉదయ్ కుటుంబీకుడు దీన్ని అడిగేందుకు రాగలడని నమ్మకంతో. ఇప్పుడు నీ కష్టాలు తీరిపోయాయి. ఇంటికివెళ్ళి నీ పూర్వీకుల ఆస్తిని జాగ్రత్తగా వాడుకొని జీవితంలో హాయిగా ఉండు.
అప్పుడు అతను ఎలా పెట్టె పొందాడో, దాన్నిండా కదులుతున్న తేళ్ళు ఉదయ్ కుటుంబం వారికి తప్ప ఇతరులకు ఎలా కనిపించాయో వివరించాడు కథగా.
ఉదయ్ కథ విని విపరీతమైన ఆశ్చర్యం పొందాడు. అతను సిద్ధార్థకు అతని ధనంలో సగం కృతజ్ఞతతో ఇవ్వబోయాడు. కాని సిద్ధార్థ ఆ మాట ఏమాత్రం వినలేదు. ఇది నీది అని అతను నొక్కిచెప్పాడు. వెళ్ళు, వెళ్ళి నీ జీవితాన్ని ఆనందంగా మలుచుకో.
ఉదయ్ పెట్టెతో వెళ్ళిపోయాడు. తన జీవితాంతం ఆశ్చర్యకరమైన నిజాయితీ గల ముదుసలతను ఎవరైతే తమ ధనాన్ని జాగ్రత్తగా దాచిపెట్టాడో అతడిని జ్ఞాపకం చేసుకున్నాడు.
XXXXXX