Home కథలు వివేక వాసంతం **

వివేక వాసంతం **

by V. Kameshwari

ఆరోజు ఉదయం ఐదు గంటల సమయం. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అప్పుడే నిద్ర లేచిన వాసంతి అరచేతులు చూసుకొని మంగళ సూత్రాలు కళ్ళకు అద్దుకొని హాలు లోకి రాబోయింది. అప్పుడే తన గదిలోంచి రాబోయిన అత్తగారు కనిపించింది . వాసంతి కి ఎక్కడ లేని కోపం వచ్చి ” ఏమిటి అత్తయ్య గారు… ప్రొద్దుటే ఎవరికీ ఎదురుపడకూడదని తెలియదా.ఈరోజు ఏమి దాపరించబోతుందో ఏమో ” అని అనుకుంటూ వంటింట్లోకి దారితీసింది. అప్పటికే అత్తగారు పాలు కాచి డికాషన్ తీసి రెడీగా పెట్టారు. కోడలు లేవగానే కాఫీ కి ఇబ్బంది ఉండొద్దని! వాసంతి తయారయి ఆఫీసుకు వెళ్లబోతుంటే గడప కొ ట్టుకొని పడబోయి , ఆపుకుంది. లోపలికి వచ్చి సోఫాలో కూర్చుని మంచినీళ్లు ఇమ్మని అడిగి ” ఇవాళ ఉదయం లేవగానే మీ ముఖ దర్శనం అయింది కదా, మొదలయ్యాయి అశుభాలు. మీకు ఆ మాత్రం ఇం గి త జ్ఞానం లేదా ” అంటూ అరచింది. “రోజు నీవు లేచేటప్పటికి పొద్దుపోతుందని, ఆఫీసుకు లేట్ అవుతుందని ఏదో సహాయం చేద్దామని అలా వచ్చానమ్మా, క్షమించమ్మా ” అంది దీనంగా అత్తగారు. ఇది రోజు జరిగే తతంగమే కదా అని వాసంతి విసుక్కుంటూ ఆఫీసు కు బయలుదేరి వెళ్ళింది.

“ఏమిటో కొడుకుకేమో వేరే ఊర్లో ఉద్యోగం, నా బ్రతుకు ఇలా ఉంది” అని మనసులో బాధపడ్డారు. చాలా మంది అత్తగార్ల లాగానే ఈ అత్తగారు కూడా!కాలంఎప్పుడూ ఒకలా ఉండదు. ఒకరోజు వాసంతి తల్లి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. తల్లి ఎందుకో ఏడుస్తోంది. వాసంతి కంగారుగా ” అమ్మ ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అందరూ బాగున్నారా? విషయం చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది? ” గట్టిగా కోపంగా అరిచింది. దానికి ఆవిడ ” వసు ఏమని చెప్పను! మీ అక్క వనజ ఆత్మహత్యకు పాల్పడిందట ఉరి వేసుకుని. ఇప్పుడే కబురు తెలిసింది. నేను మీ నాన్న తట్టుకోలేకపోతున్నాం. నువ్వు వస్తే ఒకసారి మనం కలిసి అక్కడికి వెళ్దాం. దాని పిల్లలు ఎలా ఉన్నారో అని మీ నాన్న తెగ ఇది అయిపోతున్నారు అంది. దానికి వాసంతి ” అక్క ఎందుకు అంత అగత్యానికి పాలు పడింది. అసలే బావ లేరు. పిల్లల ముఖమైనా చూసి ఉండాలి కదా” అని అంది. దానికి వాసంతి తల్లి ” ఏమి చెప్పనమ్మా మీ బావ పోయిన తర్వాత అక్కడ మీ అక్క అగచాట్లు చెప్పలేము. కూర్చుంటే తప్పునుంచుంటే తప్పు.దాని అత్తగారట,”నీ దురదృష్టం వల్లే నా కొడుకు పోయాడు, ఈ పాడు ముఖాన్ని చూడలేక మేము చస్తున్నాం. తెల్లారి నీ మొహం చూడకపోతే మాకు గడవటం లేదు. మా మనుమలను చూచి నిన్ను భరిస్తున్నాను కానీ నీ మొహం చూసి కాదు” అంటూ నిత్యం దానిని సూటి పోటి మాటలతో దెప్పి పొడిచేది. దానికి విసిగి వేసారి ప్రాణాలు తీసుకోవడానికి ఒడిగట్టింది.” అని చెప్పి బాధపడింది.
తల్లి మాటలు విన్న వాసంతి లో వివేకం ఒక్కసారి మేల్కొది. తను అత్తగారిని చూసే పద్ధతి కి పశ్చాత్తాపం కూడా కలిగింది. చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన అత్తగారు ఇప్పటి వరకు ఇలాంటి సంఘటనలను ఎదుర్కొంటూనే ఉంది . పిదపకాలపు మనిషి కనక ఎంతో ఓరిమి తో ఉంది. అక్క విద్యావంతురాలు . కానీ ఆవేశపరురాలు. ఆత్మాభిమానం ఉండాలే కాని మితిమీరకూడదు అక్క లాగా. అంత దాకా ఎందుకు! నేను ఒక ఆడదాన్నే కదా! విద్యావంతురాలని కూడా. ఎందుకు నాలో ఈ ఆలోచన రాహిత్యం ఏర్పడింది?”” ఆడదే ఆడదానికి శత్రువు” అన్న మాటను ఖండిస్తాను ఈ రోజు నుండి. ఆడదానికి ఆడదే ఆసరా అని చాటి చెబుతాను. చేసి చూపెడతాను ” అని అనుకుంది వాసంతి.
అత్తగారి గదిలోకి వెళ్లి ఆమెకు క్షమాపణలు చెప్పి, “ఇప్పటిదాకా జరిగినదానికి చింతిస్తున్నాను. నన్ను మీ కూతురుగా భావించండి ” అని అం ది.జరిగినదంతా అత్తగారికి వివరించి నేను ఇప్పుడు అమ్మ గారి ఇంటికి వెళ్తున్నా నని, మీరు టైం కి ముందు లేసుకొని జాగ్రత్తగా ఉండండి, పనిమనిషి తో కూడా చెప్పి ఉంచుతాను, మీ అబ్బాయికి కూడా ఫోన్ చేసి చెప్తాను” అంటూ ఆటో ఎక్కింది. తల నిండా అక్క ఆలోచనలే ” వీలైతే అక్క పిల్లల్ని తెచ్చుకుంటే బావుంటుందేమో ” అనే చిరు ఆశ కూడ మొలకెత్తింది.

You may also like

Leave a Comment