చీరలూ వాటి ప్రశస్తి ని వివరిస్తూ రంగరాజు పద్మజ గారు రచించిన ‘ సరిగంచు చీర’ కథ ను చదివి ఆనందించండి. కాకతీయుల పరిపాలన కాలం నుండి ఆడవాళ్ళు కట్టుకున్న చీరల విషయాలు కథాత్మకంగా తీసుకొచ్చారు. ఆనాటి కవయిత్రులైన గంగాదేవి, కుప్పాంబ వంటి స్త్రీ మూర్తుల నుండి మన కాలం మహా నటి సావిత్రి గారి వరకు వాళ్ళంతా ముచ్చట్లు పెట్టుకున్నట్టు కథ ని అల్లారు ! చదవండి…
– సం. పా.
ఆ ప్రాంగణమంతా చక్కగా కళ్ళాపి చల్లి ముగ్గులు పెట్టినారు. ఆ ముగ్గులలో రంగులు నింపారు. ఆ ముగ్గులు సిరిసంపదకు ఆహ్వానం పలికినట్టు అతిధులను ఆహ్వానిస్తున్నట్టుగా… ముగ్గులలో స్త్రీల అద్భుతకళకు అద్దం పట్టినట్టుగా ఉన్నాయి. దానికి తోడు పచ్చని మామిడాకు తోరణాలు సంప్రదాయ సిద్ధంగా కట్టబడి అక్కడి కార్యక్రమం సంబరంగా జరగబోతున్నట్టుగా అవగతం అవుతున్నది.
ఓరుగల్లు కోటలో ఎప్పుడూ… ఏవేవో.. కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. అందులో భాగంగానే… ఈ రోజు అన్ని రాష్ట్రాలలో తయారైన వస్త్రాలతో వస్త్ర ప్రదర్శనం ఏర్పాటు చేసి ప్రముఖులను ఆహ్వానించారు.
మధురవిజయ రచయిత్రి గంగాదేవి వివిధ రంగాలలోని ప్రముఖులైన మహిళా మణులను ఆహ్వానించగా… కుప్పాంబిక, కామసాని, మొల్ల, మధురవాణి, మదన మంజరి, మహానటి సావిత్రి , ఒద్దిరాజు కమలాదేవి మొదలైన వారంతా వచ్చారు.
ఆ సభలో రచయిత్రులు, కవయిత్రులు, గాయనీమణులు, చిత్రకారిణిలు, సామాజిక వేత్తలు అందరూ వేదికకు ఎదురుగా కూర్చున్నారు. ఆహ్వానించబడిన వారంతా వచ్చారని నిర్ధారణ చేసుకొని గంగాదేవి ఆసనం నుండి లేచి అందర్నీ ఉద్దేశించి “మాట్లాడుతూ మహిళలమని, అబలలమని మనమేమీ వెనుకకు పోనక్కరలేదు. మనమందరం చక్కని రచనలు చేద్దాం! ” అని ఇంకా ఏదో చెప్పబోతుంటే… సభలో గుసగుసలు హోరులా వినపడడంతో… తన కంఠాన్ని కాస్త పెద్దదిగా చేసి, “ఏమిటీ? మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? నేను చెప్పే విషయం వినడమే లేదే?” అనగానే అందరూ ఒక్కసారిగా… మీరు కట్టుకున్న చీర చాలా అందంగా.. అద్భుతంగా ఉంది! మీరు ధరించిన హార భూషణాలు, పద్మరాగాలు గుచ్చిన మొలనూలు, పచ్చల కడియాలు, మొరవంక కడియం, గోమేధికాల అందెలు,బన్నసరాలు , చిరుత చౌకము, పుష్యరాగాల ఉంగరాలు, రవ్వల దుద్దులు, మీ చీరకు ఎంతగానో నప్పి మా కండ్లు మీమీదనుండి మరలడమే లేదు. ఎక్కడ ఈ చీరను తయారు చేయించారు? అని ముసిముసి నవ్వులు నవ్వుతూ… అడగడంతో సరే ముందు నా చీరగురించి మాట్లాడుకున్నాకే మిగతా కార్యక్రమాలు జరపనిచ్చేటట్టున్నారు! ఔనా? అని నవ్వుతూ ఇలా చెప్పడం మొదలు పెట్టింది.
నా భర్త కంపరాయల వారు దండయాత్ర చేసి అందులో విజయం పొందడతో ఆ దండయాత్ర విశేషాలతో మధుర విజయం అనే కావ్యం రాసాను. వారికి ఆ గ్రంథం ఎంతగానో నచ్చి విదేశాల నుండి ఈ పట్టు చీర తెప్పించి బహుమతిగా ఇచ్చారని చెప్పింది.
హాలుడు తన భార్య మలయవతి సంస్కృత పండితురాలు కాబట్టి, ఆమెను సంతోషపెట్టేందుకు ఇటీవల పండిత గోష్టులు జరిపించి, కవయిత్రులను సన్మానించాడు. అక్కడికి వచ్చిన వారంతా గొప్ప గొప్ప చీరలు కట్టుకొని వచ్చారు. వారి అందచందాలు ఆ బట్టలలో చెప్పనలవికానంత అందంగా ఉన్నాయి. అదొక దేవతల యాత్రనా? లేక ఏదైనా పండగనా అన్నట్టున్నది అని గంగాదేవి చెప్పగానే చీర మనదేశ సాంప్రదాయం కదా? విదేశాలలో చీరలు కడతారా? అని సదస్యులెవరో అడిగారు.
మలయవతి సింహళ రాజ కుమార్తె ఐనా అక్కడ కూడా భారతీయుల కట్టూ- బొట్టూ పాటించేవారున్నారు. అక్కడ పేరు పొందిన పట్టువస్త్రాలెన్నో రకాలుగా ఉన్నాయి. మీరనుకుంటున్నట్టు ! మన చీరకట్టులోనే భారతీయ సంప్రదాయం ఉట్టిపడడమే కాకుండా… ఎన్నోరకాల చీరలు అందుబాటులో ఈనాడే కాదు ఆనాడూ ఉన్నట్టు విన్నాము కదా!
రామాయణంలో సీతారాములు వనవాసానికి బయలుదేరమని కైకేయి నార వస్త్రాలు ఇచ్చిందని చదివాంకదా? ఈనాడు ఆ నార చీరలను కాస్త ఆధునీకరించి జూట్ చీరలని తయారు చేస్తున్నారు.
అలానే మరో సన్నివేశంలో సీతమ్మ అరణ్యవాసం బయలుదేరే ముందు అనసూయకు నమస్కరించి ఆశీస్సులందుకోవడానికి వెళ్ళినప్పుడు ఆమె ఎప్పుడూ మాయని- ముడతలు పడని చీర , వాడని పూలదండ ఇస్తుంది… ఇచ్చి నీకు వన సంచారంలో పనికివస్తుందని అంటుంది… అంటే ఇప్పుడు రింకిల్ ఫ్రీ బట్ట (Rinkel free) (nano ) నానో చీరలు అనుకోవచ్చు ……
అలాగే పురాణాలలో పతీవ్రతామ తల్లులను భగవంతుడు పరీక్ష పెట్టడం మనం చదివే ఉంటాము. అలాంటి ఒక సంఘటన త్రిమూర్తులు అనసూయను పరీక్షించడానికి నగ్నంగా భోజనం వడ్డించమని అడుగుతారనీ ఆమె అలాగేనని, వారిని పసిపాపలను చేసి వడ్డించిందని కథ చదివినప్పుడు … ఆ కథను నాదగ్గర ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకునే విద్యార్థులకు ఎలా చెప్పాలని మా అక్కయ్య మల్ల్యేల దయామతీ దేవిగారిని అడిగాను. త్రిమూర్తులను పసివారిగా చేసినా కూడా ఆమె వివస్త్రగా ఎలా మారగలిగిందని అడిగాను. మా అక్కయ్య ఏమన్నారంటే
మార్కండేయ మహా ముని సంతతికి చెందిన వారు కమలా పుష్పాల నారతో లేదా దారంతో పట్టు వస్త్రం నేసేవారట. అది వంటి రంగులో కలసిపోయి, చూపరులకు చీర కనిపించకుండా ఉండేదట! అటువంటి చీరనే కట్టి ఉండవచ్చు అన్నది. ఆమె చీరకట్టినా కనపడని చీరలుండేవి ఆనాడని అన్నారు. ఆ మాట మాకోడలు విని సినిమా తారలుకూడా శరీరరంగులో ఉన్న చర్మానికి అతుక్కొని పోయే బట్టలుంటాయని, ఆయా సన్నివేశాలలో కట్టుకుంటారని వివరించింది. అంటే వస్త్రాల పరంగా మన వారు సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందారో కదా ఆనాడే?
అప్పుడు గంగాదేవి ద్రౌపదిని చూసి ఆ మారు పమిట ఎందుకు వేసుకున్నావు అని అడిగితే ద్రౌపది ” నా వస్త్రాలను పుట్టింటివారు ప్రత్యేక లక్షణాలతో నేసేయించేవారు. దాదాపు 10 గజాల చీరైనా తేలికగానూ, పిడికిటిలో అమరేటట్టుగా ఉండేది.
ఇప్పుడు సిరిసిల్ల చేనేత కార్మికులు అగ్గిపెట్టెలో పట్టే చీరను నేస్తారు చూడూ అలాగే ఉండేది నా చీర. నా వక్షస్థలం ఘనంగా ఉండడం చేత పమిట జారకుండి పొత్తి చీర నడుముకు కట్టే దాన్ని. దీన్నే మారు పైట అనేవారు. నేను ఎక్కువగా చీనీ చీనాంబరములే ధరించేదానిని. చీరకు తగినట్లుగా సింధూర తిలకం పెట్టుకోని, పాపిటలో సింధూరం ధరించి, బంగారు రవిక తొడిగే దానిని.
నా వలె సత్యభామ కూడ నరకాసురవధ సమయంలో చీరను మగవారి యుద్ధ వస్త్రాలవలె జంగాళం అంటే నిడుపాటి లేదా పొడగాటి చీర కుచ్చెళ్ళుపోసి కట్టుకునేది. ఈమె ఎక్కువ జాళువాలు ధరించేది. కృష్ణుడు తన దగ్గరకు వచ్చేరోజు కుసుమ రవిక అంటే పూలతో అల్లిన రవికను ధరించేది. శకుంతల కూడా ఈ విధంగానే పూల రవికెలు ధరించేది. సత్యభామ జడ చాలా ప్రశస్తమైనది.
అలంకారం చేసేవారు ఎక్కువ శ్రద్ధతో ఆమె జడను అల్లేవారు. వారంలో రోజుకొక్క తీరున మొగిలిరేకుల జడ, మల్లె-మొల్లల జడ, ముత్యాల జడ, జడకు ముత్యాల కుచ్చులు, జడకుప్పెలు, నాగరం, ఇంకా చాలా రకాలుగా సొమ్ములు పెట్టి జడలు వేసేవారు !
ఇంతలో మధురవాణి లేచి ఈ విధంగానే రాణీ రుద్రమ కూడా యాదవరాజు కుట్ర నుండి బయట పడేందుకు తాను కట్టిన చీరనే గుఱ్ఱపు స్వారీకి అనుగుణంగా మార్చింది. ఇలా బహుళార్ధ సాధకంగా చీరలను తయారు చేయడంలో భారతీయ నేత పనివారు దిట్టలు. ఈమె చాలా కాలం మగవేషంలో ఉండడం వల్ల మగవారు ధరించేటటు వంటి సొమ్ములే ధరించేది.
ఉదాహరణకు పులిగోరు గొలుసు, సింహ తలాటాలు, ముత్యాలసరాలు, పగడపు ఉంగరాలు, పెట్టుకుని, ఈమె నుదుట ఆమె గురువు , మంత్రి శివదేవయ్య మంత్రించి ఇచ్చిన పసుపు సున్నంతో నూరిన పోకరంగు బొట్టు అర్ధచంద్రాకారంలో పెట్టుకొంటుంది. మెడ కిందు భాగం విబూది రేకలు తెల్లగా మెరుస్తూ ఉండేవి! రుద్రమదేవికి చీనీ చీనాంబరాలు విదేశాల నుండి వస్తాయి. పట్టు కంచుకాలు తొడుగుతుంది. దర్బారుకు వచ్చినప్పుడు జలతారు మారు పమిట వేసుకుంటుంది, నగర పర్యటన చేసేటప్పుడు తోలుతో తయారు చేసిన ప్రత్యేక దుస్తులు ధరిస్తుంది.
మన భారత దేశంలో ఐదవ శతాబ్దంనుండే నూలును అల్లి దానికి రంగులద్దింది ఎప్పుడో కాదు సింధులోయ నాగరికత నుండే ఉంది. కాకపోతే అప్పుడు బట్ట తయారు చేసే విధానం వేరుగా ఉండేది. అల్లే సూదులు ఎముకలతో తయారు చేసుకునేవారు. నూలు వడికేందుకు చెక్కతో ఒక పరికరం ఉండేది. ఆ కాలంలోనే నూలువస్త్ర తయారి ఎంతో పేరు పొందింది ఇప్పటికీ కొన్ని పద్ధతులు ఆ కాలంలోనివే వాడుతున్నారు. ఎందుకంటే ఎక్కువ వేడి గల ప్రదేశాలలోని ప్రజలకు వేసవికాలంలో పత్తితో నేసిన బట్టలు సౌకర్యంగా ఉండడమే కారణం. చేనేత కళాకారులు ఎక్కువగా గుహలలోని రాతి శిల్పాలు, చిత్రాలలో దేవతలు, నాట్యకత్తెలు కట్టిన చక్కని చీరలను చూసి, తమదైన శైలి జోడించి బట్ట తయారు చేసేవారు.
పూర్వం రాజుల కాలంలోనూ వస్త్ర భాండారాలు ఉండేవి. నేను ముందే చెప్పిట్టు వారు ఇతర ప్రాంతాల నుండి తయారైన వస్త్రాలను కూడా తెప్పించేవారు. అవి రకరకాల రంగులతో అందంగా ఉండేవి.
త్రిలింగ దేశమనే ఈ ప్రాంతం అటు ఉత్తర భారతదేశం ఇటు దక్షిణ భారతదేశనికి మధ్యలో ఉండడంవల్ల ముఖ్యంగా ఎందరో రాజులు ఇతర ప్రాంతాల నుండి వచ్చి ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకొని, ఏలడం వల్ల వస్త్రధారణలో ఉత్తర దక్షిణ ప్రాంతాల సంప్రదాయ కట్టు బొట్టు ఇక్కడ ఈ రాజధాని నగరంలో ఎప్పటికప్పుడు మారుతూనే ఉంది… నాగరికతకు చిహ్నంగా వస్త్రధారణ ఎన్నో కొత్త ప్రయోగాలు చేసిందనే చెప్పాలి!
అంతేకాకుండా ఈ ప్రాంతం పత్తి పంటకు అనువుగా ఉండి, అధిక దిగుబడి ఇవ్వడంతో నాణ్యమైన నూలు లభ్యమవ్వడంతో, అందమైన బట్టలు తయారు చేయడానికి ప్రసిద్ధి చెందిందీ ప్రాంతం!
మచిలీ బందర్ లో దొరికే మసూల అనే సన్నటి బట్ట దీన్నే ఇంగ్లీషులో మస్లీన్ అంటారు. ఇలా చెబుతూ ఉండగానే….
ఇంతలో మొల్ల అన్నది కదా! నేను రామాయణం పవిత్రంగా రాయాలని, శుచితో మడితో రాయడానికి వీలుగా యోలగంధపు బొట్టు పెట్టుకొని, పట్టుకంచుకం తొడుగుకొని, ముత్యాల శంఖువులు, గుండ్లపేరులు, హారికంకణాలు వేసుకుని నిద్దెంపు వెలిపట్టు, ఒంటిపొర పట్టు మడుగు కట్టుకుంటాను. ఇవి 6 గజాలు; 9 గజాలలోనూ దొరుకుతాయి. రోజంతా గోచీపోసి, కుచ్చిళ్ళు పోసి కిందకు జారవిడిచి కట్టుకుంటాను. దివ్యాంబరములనే చీరలు ఎక్కువ ఆదరణ పొందే చీరలు. ఇవి అన్ని రంగులలో ఉంటాయి. భగవంతునికి సంబంధించిన కార్యక్రమాలు జరిగే సమయంలో ధరిస్తారని మొల్ల చెప్పడం ముగించగానే…
కుప్పాంబిక అన్నది కదా! మా అంతఃపురానికి సాలెవారు ఎన్నోరకాల చీరలు తెస్తారు. అందులో వెంజావళి పట్టు, భూ తిలకంబు పట్టు, శ్రీవన్నియ పట్టు; మహా చీని పట్టులని రకరకాలుగా ఉండేవి. కొంగు- అంచు బంగారు తీగతో నేసేవారు. మా రాచవారు వారి అభిలాషను తెలిపితే వారికనుగుణంగా నమూనాలు చేసి ఇచ్చేవారు…
మమ్ములను కస్తూరి బొట్టుతో, కాటుక లేదా అంజనంతో చెలికత్తెలు సింగారిస్తారు. మాకు ఈ చీరల మీద తగిన రవికలు కుట్రపు వాడు కుట్టి ఇస్తాడు. కుట్రపువాడు అంటే దర్జీ. చీరకు తగినట్టు బంగారు త్రిసరాలు అంటఘ మూడు అంతస్తులుగా ఉంటుంది, చంద్రహారాలు, నవరత్న మాలలు, మెడకు బిగుతుగా ఉండే పతకాలు, పాపటబొట్టు, సూర్య-చంద్ర బిళ్ళలు, మొరవంక కడియం, విచ్చుటాకుల దుద్దుకమ్మలు, కంకణాలు, కాంచీ నూపుర కంకణాలు, భుజాలకు సందిదండలు ఇలా ఎన్నోరకాల ఆభరణాలను ఆయా పండగలు, పెండ్లిండ్లకు, వేరువేరుగా, రాచరికపు కూటములకు వేరుగా సందర్భాన్ని బట్టి అలంకరించే వాళ్ళు.
మధుర వాణి అన్నది కదా నేను ప్రత్యేకంగా బంగారు నీరు తాపడం చేసిన చీరలు, అంటే చీర నిండా బంగారు జరీ ఉంటుంది. చిత్ర వన్నెల పట్టుచీరలు, కంబళి చీరలు; చెంగావి వన్నె చీరలు; చలువ పావడాలు; దుకూలముల చీరలు కట్టేదాన్ని. ఈ చీరలు కొంగుకు నేతపరంగా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి నేసేవారు. జిగురు బొమ్మంచు చీరలు.
ఈమధ్య తెలంగాణ గవర్నర్ తమిళ సెల్వి గారికి సిరిసిల్ల చేనేత కార్మికుడు చీరలో వారి చిత్రం నేసిన తెచ్చి బహుకరించాడు అలాగ నేయించుకుని కట్టుకునే దాన్ని. చందన లేపనం చేసి,కస్తూరి తిలకం, బంగారు బొట్టు, పెడుతుంది నా సైరంధ్రి.
నేను జడకుచ్చులు వేసుకుని, జడకు కుప్పెలు, బంగరు మొగ్గలు, చెవులనుండి కొప్పుకు బంగారు పూచేర్లు, నాసాగ్రం, ముక్కరి, ముత్తెపు సత్తు, బులాకీలు, తాటంకాలు, మకరకుండలాలు, కంఠహారాలు, కాలి అందెలు, పట్టాగొలుసులు, మెట్టెలు, పిల్లెండ్లు మొదలైన సొమ్ములు వేసుకుంటాను అని అంటుండగానే …
మహానటి సావిత్రి చెప్పడం మొదలుపెట్టింది. నేను ప్రత్యేక పూజలు; వ్రతాలు చేసుకొనేటప్పుడు తిలకం పెట్టుకుని కింద తిరుమణి రావిరేక పెట్టుకుంటాను. కాటుక , రకరకాల పౌడర్ లు స్నోలు, సెంటు వాడుతాను. తెల్లనిపట్టు చీరలు, పాల నురుగులాంటి పొన్ను పట్టుచీరలు కట్టేదాన్ని. పట్టురవికలు వేసుకుంటాను. వెండి జరీతో నేసిన గళ్ళ చీరలు కుచ్చులు పోసి, పెద్ద కొంగు నడుముకు చుట్టి,
నా మేకప్ మ్యాన్ నాకు కడితే సినిమాలను చూసిన వారు అలాంటి చీరలే కావాలని అడిగి మరీ కొనేవారు… నా సొమ్ములు నాను పట్టెడ, కంఠహారాలు, నెక్లెస్, నల్లపూసలు, అడ్డకిలు, మణులు, కెంపులతో చేసిన మెడకు దగ్గరకుండె గొలుసులు, సంది దండలు వేసుకునేదాన్ని.
ఇంతలో మదన మంజరి అన్నది కదా! మావంటి సామాన్యులు నూలు వస్త్రాలను నూలు రవికెలను కట్టుకుంటాము. వాటిని మడుగులు అంటాము. కొందరు రవిక తొడుగరు.
ముంజేతులకు పలక కంకణాలు, కాళ్లకు దండ గడియాలు, వంకీల గాజులు, రత్నాలతో చేసిన జంట కడియాలు, జంట తాయెత్తులు, నీలాల గాజులు, పచ్చల కంకణాలు, చామలకడియాలు, మురుగులు, గజ వడ్డాణం, గంటల మొలనూలు, మువ్వల అందెలు, కాళ్ల కడియాలు, గజ్జెలు ధరించేవాళ్ళం!
హోంబట్టు సరిగ రవిక రవ్వల ఒడ్డాణము,రవ్వల బేసరి,రవ్వల అడ్డబాస, రవ్వల పతకము,
రత్నాలతో శిరోభూషణాలు, రాగిడి, చంద్రవంక,తమలపాకు,మొగిలిరేకు,బంగర చామంతి పూవు,చెంపసరులు ఇట్లా కలవారి ఆభరణాలు ఎన్నో!
సామాన్యుల సొమ్ములు రాగికుండలాలు, రాగి కుందులు, దొడ్డ రాగి కంటెలు ,రాగి ఉంగరాలు, రాగి దండలు, వలుద కొక్కెరలు, పోలెలు, సరిపెణ, నేకళంబులు, కీలు గొలుసులు, కీర్తిముఖాలు, కాలి అందెలు, రాగి కటక వంకీలు, రాగి పధకంబులు, రాగి వడ్డాణాలు, కటి సూత్రాలు, తగరపు కడియాలు, కంచు మట్టెలు, వల్దయూరాలు, నల్ల గాజులు, పచ్చగాజులు, పూసలు, సంకుపూసలు, నల్లపూసలు వేసుకుంటారు.
కాటుక, అగరు బొట్టు, తిలకాలను వాడుతారు.
నూలులో చందనపురంగు, నీలపురంగు, ఎర్ర రంగువి, కడిమిరంగువి, కరకంచులు , బొమ్మంచులు, ముడుగు బొమ్మంచులు, ముయ్యంచులు ,చిలుక చాళ్ళు, పేటచాళ్ళు, ముదురు రంగు నిండు వన్నెలు, ఉఱుత చారలు ,గంటకి వన్నెలు, పుప్పొడి వన్నెలు, రుద్రాక్ష వన్నెలు, నాగ బంధాలు, పూజా బంధాలు, జలపంజరాలు ఇలా 45 రకాల నూలు చీరలు నేస్తారు… కానీ చీరకు కొంగు- అంచు లేకుండా కట్టేవారు కాదు…
ఒద్దిరాజు కమలమ్మ అన్నది కదా!, సాదా చీరలు, సన్నని బట్టతో 120 నెంబరు కలనేత చీరలు నేయించుకొని రోజూవారీ కట్టుకుంటాను.
బతుకమ్మపండగ రోజు తలంటు స్నానం చేసి, నాగరం , కొప్పుబిళ్ళ, కొప్పుమొగ్గలు బంగారు రాళ్ళ పిన్నులు, చంద్రహారం, కంటె, కాసులపేరు, రవ్వల దిద్దులు, రవ్వల కంఠహారం, సూర్య హారం, చేతులకు గాజులు, పులిసేరు కడియాలు, సింహంమూతి కడియాలు,
కాళ్ళకు పట్టా గొలుసులు, పాంజేబులు, తోడాలు , కడియాలు, మట్టెలు , వేళ్ళకు వంకీ ఉంగరం , గోమేధికం తో చేసిన ఉంగరం ,రూబీ ఉంగరాలు, బొడ్లో వెండి తాళంచెవుల గుత్తితో బతుకమ్మ ఆటకు చెరువుకట్ట కిందకు వెళ్ళి ఆడుకొని వస్తాము. కంచిపట్టు, ఆరణి, ధర్మవరం, బనారసు మొదలైన పట్టుచీరలు వాటికి తగిన రవికలు ఎన్నోతీర్ల కుట్లు, అల్లికలతో మేర వాడు కుట్టేవాడు. దేశ ముఖ్ ,దేశపాండ్యాలైన ఒద్దిరాజు వారింటి కోడలుకదా! ఆ మాత్రం బాబు దర్పం ఉండదా?
మడికి దిండిగల్ పట్టు , నారపట్టు చీరలు మడిచారు పోసి కట్టుకుంటాను. గద్వాల, కోట, వెంకటగిరి, ఉప్పాడ, దారుకోసు, నారాయణ పేట చీరలు, మధుర , మిరియాల చీరలు హుందాగా ఉంటాయి.
రోజవారీ కట్టుకోవడానికి మా ఊరు చీరలకు ప్రసిద్ధి! 9 గజాల చీర మూడు మూరల ఎత్తుతో పిండినాకొద్దీ మెరుస్తూ మెత్తగా కడితే ఒంటికి హాయిగా ఉండేవి. మా చాకలి తమాషాగా ఓ మాటనేది .. ఉతికేటప్పుడు గుండి చెరువులో చీర పరిస్తే చెరువు నిండా నీ చీరనే నిండుతుంది.. “అమ్మా మడతబెట్టి తెస్తే పుస్తకమంత అవుతుంది చీర దొరసానీ! మేం సదువుకోనోళ్ళం! జర గొప్పగా సెప్ప రాదు కానీ ఈ చీరకడితే నువ్వు అందంగా కనిపిస్తావు? అనుకొన్న కానీ చీర చెరువులో వేసి ఉతికినప్పుడనిపించింది…
నువ్వు కట్టుకుంటేనే ఈ చీరకు అందమని… “అనిపించిందమ్మా! అని చాకలి బుంగి అనగానే చాలు! సంబడం! నీకేమో కవిత్వం వస్తున్నది ఇవాళ అని రుసరుసలాడి అప్పాలు ఆమె ఒడి నింపి! పిల్లలకు తీసుకుపో అన్నది.
రంగు రంగుల చీరలు ముతక చీరలు సామాన్యులు ధరించేవారు. వారి వారి స్తోమతను బట్టి లేత రంగుల చీరలకు ముదురు రంగులు పూల డిజైన్ అద్దేవారు. కొంగులకు లేత బొమ్మంచు చీరలు కూడా ఉన్నాయి…
వీరి సొమ్ములు ఇలా ఉండేవి. రాగిడి తిరుగుడు పువ్వు, చంద్రవంక, పాపిట బొట్టు, పసిడిపోక, సూసకంకి ,పల్లేరు పువ్వు, నెరతమ్మి రేకు ,అపరంజి కమ్మలు, బనిరెలు, కుప్పె, కుతికంఠ మెడసూలు, గుండ్లపేరు, నాను పట్టెడ, దండ పలుక కడియాలు, పరిగెలు, కడియాలు, గంటల మొలనూలు, గజ్జలు అందెలు (కంచువి) గిల్కుసిరి ( గోల్డ్ ప్లేటెడ్) మట్టెలు, ముక్కుకు ముక్కెర, ముత్తెపు పూస, ముత్తెపు నత్తు, ఈ సొమ్ములు పెట్టుకొని తలలో తంగేడు పూలు, రవికెలేని నునుపైన భుజాలతో అందమంతా తమదే అని ఒకరి భుజాల మిద మరొకరు చెయ్యేసి నాట్యం చేస్తుంటే రెండు కళ్ళూచాలవు!
ఆకాశం ఆ కొసన వాలిన సూర్యుడిని చూసి,చంద్రుడు సన్నని రేక వలె సాగి, మెల్లిగా ఆకాశాన్ని ఆక్రమించుకుంటున్నాడు. మల్లెపూల గుబాళింపులు చల్లగాలితో కలసి గుప్పుమంటూ .. ఉదయం నుండి పనిచేసిన వారికి హాయికలిగిస్తున్నవి. అడవికి పోయిన పశువుల మందలు ఇళ్ళకు చేరుకుంటున్నాయి. ఆ దుమ్ములో క్రమంగా చిరు చీకటి అలముకుంటున్నది. మన కోసం మన వారంతా ఎదురుచూస్తుంటారు. ఈ నాటికి మనం ఇంతటితో చాలించి మరొక రోజు మరిన్ని విషయాలు ముచ్చటించుకుందాం!
ఓ కవితామాలికతో ఈ సభను ముగించుకుందాం..
నేతన్నలకు జోతలు
“నూలు పోగుతో నాగరికతకు
నాందిపలికినారు నవనవోన్మేషంగా!
మేలైన నూలు వడికి నేత నేసిన నేతన్న !
అతడు నేత విరించి!
నేతలందు కొత్త కొత్త రీతులు చిత్రముగ అల్లినారీ విరించులు
నేతలందు ఏర్చి కూర్చి పొందుపరిచి,
పోగు పోగులందు పొసగినారు
విలువలనెల్ల వలువలందు తీర్చి,
మగ్గములపై పరిమళించినట్టి
పనితనముతో పట్టు చీరలందు
చేర్చినారు.
చేడియల మానరక్షణే చేసి,
నలు మూలల ఖ్యాతి చెంది
జగము నిండా- జోతలందుకున్నారు!
నిపుణులైన వారి సాటిలేని కళకు
పొగడగ మాటలేదు! చేతులెత్తి మొక్కేము!!
తరతరాల నేతన్నల స్వేదము
జాతిపేరు నిలుపు నేతన్న హస్తము
సుగుణమణులకు సుందరముగ
వస్త్ర దానమేచేసి,డాసిన చుట్టమాయె!!
—-
—-
కరతాళ ధ్వనులు మ్రోగినాయి!!