ఉక్కిరిబిక్కిరి ఆలోచనలు
సంబంధం లేని గజిబిజి వలగా
మనసును చిందరవందర చేస్తూ…..
మొదలెక్కడో? కొన ఏమిటో..?
వాటన్నింటిని అప్పగించా
కలానికి కళ్ళుగా….
భావాలన్నీ రూపాలుగా
చిత్రవిన్యాస చేతనలుగా
హరివిల్లు రంగుల పొదలై
అక్షరాలుగా సాగుతూ
ముడులన్నీ విడిపోతూ
ఒదుగుతున్నాయి పేజీలపై..
మట్టిని తాకుతూనో
గాలిని వేలితో చుడుతూనో
మబ్బులో చినుకులా కరుగుతూనో
పక్షములు కట్టుకొని
ఆకాశనావలో తిరుగుతూనో
ముత్యపు చిప్పలా
కడలి లోతులు చూస్తూనో
ప్రవహిస్తుంటా అక్షరంగా..
అంతేనా……..
ప్రశ్నించే తత్వానికి
ఎలుగెత్తే గళానికి
పోరాటానికి, ఆరాటానికి మధ్య
జీవించే వర్తమానంలో
సిరాగా వర్షిస్తుంటా…
చరితకు మిగిలే గురుతుగా..