Home కథలు పరిష్కారం

పరిష్కారం

తెలుగు భాష చైతన్య సభ జరుగుతున్నది.. హాల్ అంతా కిక్కిరిసి ఉన్నది. ఇసుక వేస్తే రాలనంత జనం. పక్కనే ఉన్న కిటికీలో నుండి ఆ సభలో మాట్లాడే వారి మాటలు వినాలని, వారిని చూడాలని కిటికీ పట్టుకొని పదేళ్ళ అమ్మాయి సరోజ వేలాడుతున్నది. అక్కడి చౌకీదారు ఆ అమ్మాయిని వెళ్లిపొమ్మని కోపంతో కేకలు వేస్తున్నాడు…. ఆ అమ్మాయి పొట్టిగా ఉండడం వల్ల లోపల జరిగేది కనపడక చౌకీదార్ మాట వినిపించుకోకుండా అలాగే వేలాడుతూ ఉన్నది.
ఇదంతా వేదికపైన కూర్చున్న ప్రముఖ రచయిత్రి రంగనాయకమ్మ చూస్తున్నది.. చివరకు ఆ చౌకీదార్ కు సైగ చేసి, ఆ అమ్మాయిని లోపలికి పంపమని చెప్పింది.. చౌకీదారు ఆ అమ్మాయిని తీసుకొని వచ్చి, ఒక కుర్చీలో కూర్చొమ్మన్నాడు. అట్లాగే కూర్చున్నది.
సభ ముగియగానే తాను బస చేసిన గదికి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళింది.
ఆ అమ్మాయి చేతిలో చెమటతో తడిసి, నలిగిపోయి ఉండ చుట్టుకున్న పేపరు ఒకటి కనపడుతున్నది… “ఏమిటమ్మా? నీ చేతిలో” అని అడిగింది. “ఏం లేదు! ఏం లేదు!….‌ ” అని మొహమాట పడుతూ తన చేతిని పరికిణి చాటుకు దాచుకుంది.
ఇలా ఇవ్వు చూస్తానని అనునయంగా అడిగింది.
ఆ వుండ చుట్టిన కాగితం ఆమె చేతిలో పెట్టింది. తీసి చూస్తే అది ఒక కవిత! ఆశ్చర్యంగా అమ్మాయి వైపు చూసింది. ఇది నువ్వే రాసావా? అని అడిగింది… భయం భయంగా ఆ అమ్మాయి తల ఊపింది ఔనన్నట్టుగా….
ఆ కవితను తీసుకొని చదివి రచయిత్రి స్థాణువైపోయింది, అప్పుడు సరోజ మీకు ఈ కవితను చూపెట్టాలనుకున్నాను.. కానీ లోపలికి రానివ్వడం లేదని అందుకే బయటే ఉండవలసి వచ్చింనదని చెప్పింది.
“నీ పేరేమిటి? మీ అమ్మ పేరు ఏమిటి? ఎక్కడుంటారు? మీరు” అని అడిగింది రంగనాయకమ్మ.
నా పేరు సరోజ. మా అమ్మ పేరు శకుంతల. ఇప్పుడు లేదు చనిపోయింది. నేను మా మేనమామ ఇంట్లో ఉంటున్నాను.
వెంటనే రంగనాయకమ్మకు కవితలోని సారాంశం అర్థమై ఈ అమ్మాయి జీవిత చరిత్రే ఆ కవిత అనుకున్నది. చాలా బాధ కలిగింది. పైకి కనపడనీయకుండా “సరోజా! నీవు చక్కగా చదువుకోవాలి… నీలో మంచి రచయిత్రి అయ్యే లక్షణాలు కనబడుతున్నాయి” అంటుండగా రంగనాయకమ్మకు తన బాల్యం ఒక్కసారి కంటి ముందు కదలాడింది… తనకు తల్లీ తండ్రీ ఉన్నా సమిష్టి కుటుంబంతో మారుమూల పల్లెటూర్లో ఉండడం…. అక్కడ పాఠశాలలో ఐదవ తరగతి వరకే ఉండడంతో చదువు ముందుకు సాగలేదు. పక్కనే ఉన్న బస్తీలో ఎవరింట్లో అయినా ఉంచి చదివించడానికి అమ్మకు ఇష్టం లేకపోయేది. ఆడపిల్ల ఎవరింట్లోనో ఉండడం ఎందుకని చదువు మాన్పించింది.. తన తర్వాత ఇద్దరు చెల్లెళ్లు ఉండడంతో చిన్నప్పుడే వివాహం చేసి అత్తగారి ఇంటికి పంపించింది… భర్త సహకారంతో ఇంట్లోనే చదువుతూ ప్రైవేటుగా పరీక్షలు రాసి FA వరకు చదివి, ఇలా రచయిత్రిని కాగలిగాను అనుకుంది మనసులో … కాలంలో మార్పు వచ్చినా, ఎంతో ఆధునికతను అనుకరించినా ఆడవారి జీవితాలు అక్కడక్కడా ఇలాగే ఉన్నాయి… అని నిట్టూర్చింది.
సరోజ మేనమామ భార్య చిత్రహింసలు పెడుతుంది, 24 గంటలు పని చెబుతుంది. బడికి పోయి నప్పుడు మాత్రమే సరోజకు విశ్రాంతి. మాస్టార్లు ఇచ్చిన హోంవర్క్ అక్కడే స్కూల్లో రాస్తేనే తప్ప ఇంట్లో వీలు చిక్కదు. మామ మాత్రం చాలా మంచివాడు… అత్త సరోజను బాధ పెడుతున్న సంగతి అతనికి తెలియదు.. సరోజచెప్పదు. కొద్దిరోజుల తర్వాత సరోజకు తన భార్య అన్నం కూడా సరిగా పెట్టడం లేదని తెలిసింది చాలా బాధపడ్డాడు. మా అక్క దేవత… ఆమెమీది ప్రేమతో సరోజను తీసుకోని వచ్చాను ఇప్పుడెలా? అని అనుకుంటాడు.
సరోజకున్న అదృష్టమల్లా ఆమె తెలుగు మాస్టారు. ఆయన ఎంతో మంచి వారు.. చదువు చెప్పడం మాత్రమే కాకుండా… స్కూలు సావనీరులో కవితలు రాయమని, వ్యాసరచన పోటీలో పాల్గొనాలని, ముగ్గుల పోటీలో పాల్గొనమని ప్రోత్సహించేవారు… సరోజ స్వతహాగా తెలివైనది కాబట్టి మండలం ,జిల్లా స్థాయిలో ఎన్నో బహుమతులు పొందింది. సరోజ తల్లి లేని పిల్లని చాలా ప్రేమగా చూసేవాడు. ఒక్క సరోజనే కాదు మిగతా పిల్లల చేత కూడా పద్యాలు శ్రావ్యంగా చదివించడం, నాటకాలు వేయించడం, ఏకపాత్రాభినయం చేయించడం మొదలైనవి ఎన్నో నేర్పేవారు. అలా భాష మీద ఎంతో పట్టు వచ్చింది సరోజకు. మాస్టారు ఉద్దేశం కూడా అదే… అంత చిన్న వయసులోనే చిన్నచిన్న కథలు, కవితలు రాసేది. అదే విషయం రంగనాయకమ్మతో చెప్పింది.
ఆ మాస్టారి చిరునామా ఇవ్వమని, ఏదైనా అవకాశం వచ్చినప్పుడు చెబుతానన్నది చిరునామా తీసుకుని , కవితను చాలా జాగ్రత్తగా దాచి పెట్టు అనగానే మా అత్త ఎక్కడికి పంపడానికి ఒప్పుకోదు. చింపి పారేస్తుంది.. నీ బతుకుకు కవితలు ఒకటే తక్కువయినవని హేళనగా తిడుతుందని చెప్పింది సరోజ.
“సరే ఈ కవిత నా దగ్గరే ఉండనివ్వు! నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు! ” అని పంపించింది ఇలా కొంత కాలం గడిచిపోయింది.
సరోజ స్వతహాగా అందంగా ఉంటుంది కాబట్టి, పక్క పట్టణంలోని ధనవంతుడు వరకట్నం లేకుండానే సరోజను తన కొడుకుకు ఇచ్చి పెళ్లి చేశాడు.
సరోజకు కాస్త అత్త వారిల్లు బావుంది. ఎవరూ తనను అంక్షలు పెట్టే వారు లేరు. ముఖ్యంగా మరిది, ఆడపడుచు చాలా స్నేహంగా ఉంటూ మంచి పుస్తకాలు వాళ్లు చదివి, సరోజకి చదవమని ఇచ్చేవాళ్ళు.
పుస్తకాలు చదువుతూనే తానూ మెల్లిగా చిన్న చిన్న కథలు రాయడం మొదలు పెట్టింది. ఒక పత్రికకు కథల పోటీకి పంపించింది.
ఆ పత్రిక సంపాదకులు పోటీ కథలు నిర్ణయించడానికి న్యాయనిర్ణేతగా ప్రసిద్ధ రచయిత్రి రంగనాయకమ్మ గారికి బాధ్యత అప్పగిస్తారు. ఆమె ఆ కథలు చదువుతూ చదువుతూ… సరోజ రాసిన కథ తన కంట పడుతుంది. ఎంతో ఆసక్తికరంగా సాగిన ఆ కథ తానే కాదు ఏ జడ్జి అయినా తప్పక ప్రథమ బహుమతికి సిఫారస్ చేస్తారని, తను కూడా ఆ కథకి ప్రథమ బహుమతని ప్రకటించింది.
చాలాసంవత్సరాల క్రితం కలిసిన సరోజ పేరు మరిచిపోతుంది రంగనాయకమ్మ. అందునా ముదిమి వయసులో అది సహజం కూడా!
భాషాచైతన్య సంఘం వారు ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి, బహుమతులు పొందిన రచయిత(త్రు)లకు ఆహ్వానాలు పంపించి, పురస్కారాలు అందచేయాలని నిశ్చయించుకుంది. కానీ మంచి మంచి కథలు రాసి పంపిస్తున్న ఆ రచయిత్రి తన పూర్తి చిరునామా కానీ, అసలు పేరు కానీ ఎక్కడా రాయకుండా, కేవలం కలం పేరుతో రచనలు పంపిస్తున్నది. ఆమెను ఎలా ఆహ్వానించడమా? అని ఎంతో మధన పడతారు. ఆమెను ఎలా గుర్తు పట్టడం? కనీసం ఒక ఫోటో కూడా కథతోపాటు పంపించదు…
అలా అని ఆమెను వదిలేయకూడదు… ఆమెను సత్కరించి, ప్రోత్సహిస్తే మరిన్ని మంచి రచనలు వస్తాయని రంగనాయకమ్మ అనడంతో… పేరున్న రచయిత్రి, పెద్దావిడ ఆమె మాటనుతోసి వేయలేక పోస్టు మాస్టర్ ద్వారా ఆమె చిరునామా కొనుక్కొని వెళ్ళి “అమ్మా! మీరు ఇంత సహజంగా ప్రేరణాత్మక కథలు రాస్తున్నారు.. మీకు ఆ ప్రేరణ కలిగించింది ఎవరు?” అని అడుగుతారు.
ప్రతి సమస్య నేను, నా తరం ఎదుర్కొన్నవే! అందుకే హృదయం స్పందించి, మాకు ఎలాంటి పరిష్కారాలు కావాలనుకున్నామో? ఆ పరిష్కారాలను సూచిస్తూ… ఆయా సమస్యలను చర్చిస్తూ… కొంత కల్పన చేస్తూ సాగిన రచనలవి. ఆ సమస్యలన్నీ ఎంతోమంది అనుభవంలో నుండి వచ్చినవి. అందుకే మీకు నచ్చాయనుకుంటాను. కవులు రచయితల బాధ్యత ప్రజలకు హితవు చేసే రచనలు చేయాలని, దానితో సమస్యలు ఎదుర్కొనే వాళ్ళు ఊరట చెందాలని, అప్పుడే అర్ధాంతరపు ఆత్మహత్యలు ఆగుతాయని నా నమ్మకం… అందుకే గ్రామీణ ప్రాంతాలలో మహిళలు ఎదుర్కొనే ప్రతి సమస్యను నా రచనల్లో జోడించాను. అన్నది సరోజ!
భాషా చైతన్య సభ్యులు కరతాళ ధ్వనులు చేస్తూ మీకు సన్మానం చేయదలచుకున్నాము. మీరు తప్పక రావాలి! అనగానే… అబ్బో! సన్మానాలు అవి ఏమీ వద్దు… ఏ సభలకు రాలేను అంటుంది సరోజ.
సరే! మీరు సభలకు రాలేకపోయినా మిమ్మల్ని కలవాలని రంగనాయకమ్మ గారు తహతహలాడుతున్నారు. వారు చాలా పెద్దమనిషి అయ్యారు. వారిని గౌరవించి అయినా సరే మీరు ఒకసారి వచ్చి వారిని కలవాలి .. అని అంటారు. అప్పుడు సరోజకు తన చిన్నప్పుడు కలిసిన రంగనాయకమ్మగారు గుర్తుకు వచ్చి, సంతోషంతో సరేనని అంటుంది. ఆహ్వాన పత్రం పంపిస్తారు.
అలా సరోజ ఆహ్వానం అందుకొన్నది.
అదే రోజే రంగనాయకమ్మ గారికి ప్రభుత్వం ప్రతిష్టాకరమైన అవార్డును బహూకరించనుంది. కార్యక్రమము ప్రారంభమైంది. రంగనాయకమ్మ ప్రభుత్వ అధికారులతో ఒక విన్నపం చేసింది. తాను ఎలాగూ ముదుసలినైనాననీ, ఇక ముందు రచనలు చేసి సమాజానికి సేవలు చేయలేనని, నా గుర్తుగా ఈ అవార్డును మంచి సాహిత్యాన్ని సమాజానికి అందిస్తూ ఎందరికో ప్రేరణగా నిలిచిన సరోజకు బహూకరించమని కోరుతుంది. ఎంతో తర్జనభర్జన పడిన తరువాత సరే అంటారు నిర్వాహకులు.
సభ రచయితలతో, రచయిత్రులతో, పాఠకులతో కిక్కిరిసిపోయింది. ఇంత కాలంగా పాఠకులను ఉర్రూతలూగిస్తున్న ఆ రచయిత్రి ఎలా ఉంటుందో చూడాలని కొందరు, ఎలా మాట్లాడుతుందో వినాలని మరికొందరు వచ్చారు.
సభాధ్యక్షుడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. రంగనాయకమ్మ కళ్ళు ఎవరికోసమో వెదుకుతున్నాయి. వక్తలంతా మాట్లాడారు. చివరకు రంగనాయకమ్మ గారు లేచి నిలబడి, తాను చూడాలనుకొన్న వ్యక్తి కనిపించడంతో సంతోషంతో “నా గొంతు పూడుకుపోయింది ఏమి మాట్లాడలేను.. కానీ ఒక కవిత చదువుతాను. మన తెలంగాణ ప్రాంతంలో ఒక యాభై సంవత్సరాల క్రితం ఆడవాళ్ళ పరిస్థితి ఏమిటో? అందునా ముఖ్యంగా తల్లి లేని ఆడపిల్ల చదవాలని అనుకున్నా, చదివే శక్తి ఉన్నా పరిస్థితులు ఎలా సహకరించలేదో అద్దంపట్టేలా ఉన్న ఒక భావకురాలు, కాబోయే రచయిత్రి అంతరంగాన్ని ప్రతిబింబించిన ఈ కవిత మాత్రమే చదువుతాను… అని
మొదలు పెట్టింది.

ఓనమాలు దిద్దేటివేళ- పేడ పిడకలే చేయవలసి వచ్చే!
అక్షరాలు గుండ్రంగా రాయమని అనక,
పిడకలు గుండ్రంగా చేయమని మాటలు వినివిని విసుగాయె!
రంగు రంగుల బట్టలు కట్టే వేళ- పాత పరదాలే గౌనులాయె!
బడి ఫీజులడిగితే- బూతు పురాణాలే వినవలసి వచ్చే!
పాఠశాలకు వెళ్ళు వేళ- పేడ కుప్పలు ఎత్తాల్సి వచ్చే
లెక్కలు చేయాలని కూర్చుంటే- లెక్కలేని తిట్లు తినవలసి వచ్చే!
ఒకరి నీడన బతికిన నాకు ఒంటినిండా బట్టలే లేకపాయె!
చిరిగిన జాకెట్ నుండి లేత యవ్వనమే కాన రాబట్టే
బతికే ఛిద్రమైన వేళ- బట్టలొకలెక్కనా?
తీయని మాట వినక- తిట్లు తినడమే బతుకాయె!
బండెడు చాకిరీ చెయ్యలేక చేతులే విరిగిపోయే!
మనసులోని భావాలకు అక్షర రూపమిద్దామంటే,
రక్కసి చూపులే గుచ్చబట్టే!
ఏనాడైనా మనసు పరచే అవకాశమొచ్చేనా?
ఈనాటి కవులోలె సత్కారం అందుకునే భాగ్య ముందా?
ఆ కవిత చదవడం ముగించి గద్గద స్వరంతో “ఈ కాలపు రచయిత్రులు రాసే సత్తా ఉన్నా కూడా సమయం లేదనో, ఇంకా ఏవో సాకులు చెబుతూ రాయడానికి బద్ధకిస్తున్న ఎందరికో కనువిప్పు కలిగే మార్పును తన జీవితంలో తానే సంపాదించుకొని, నిలదొక్కుకొని, సాటి మనుషులకు ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు, వాటిని ఎలా ఎదుర్కోవాలో చూపెట్టిన ప్రత్యక్ష సాక్షి ఈ రచయిత్రి. ఈమెకు వచ్చిన కష్టాలు ఏ ఇతరులకు వచ్చినా వారు ఎప్పుడో ఆత్మహత్యలు చేసుకుని కీర్తిశేషులు అయ్యేవారు… అలా కాకుండా ఒక ప్రేరణగా నిలిచిన ఈ సరోజ ఈ బహుమతికి అర్హురాలు” అన్నది
వేదిక ముందు కూర్చున్న మహిళలందరి కళ్ళల్లోనూ నీరు ఉబికింది… ఒక్కసారిగా తారస్థాయిలో కరతాళ ధ్వనులు మోగాయి…
ఎందుకమ్మా మీకు ప్రభుత్వం ప్రకటించిన అవార్డ్ నాకిస్తున్నారని సరోజ అడిగిన దానికి సమాధానంగా… నేనూ నీవలె చిన్నప్పుడు కథలు రాస్తే ఆదరించేవారు లేక, వయస్సున్నప్పుడు మంచిమంచి ఆలోచనలొచ్చేవి.. అవి ఎంతో ఆదర్శభావాలున్నవైనా ఎవరూ ప్రచురించలేదు. సభలకు సమావేశాలకు ఇంట్లో ఎందరి అనుమతులో కావలసి వచ్చేది. అలా వెళ్ళలేకపోయాను. ఎన్నో రచనలు పక్కనున్న వారికి కూడా చూపించకనే చెత్తబుట్ట పాలయ్యాయి. అవన్నీ ఉంటే ఎన్నో ఉండేవి. కేవలం ప్రోత్సహించేవారులేక, గ్రామాల్లో ఎందరో మనలాంటి వారుంటారు. కనీసం ఏ పత్రికకు పంపాలో తెలియని వారుంటారు. ఆ ఇబ్బందులన్నీ దాటుకుని ఈ స్థాయికి రావడానికి ఇంతకాలం పట్టింది. ఆనాటి పరిస్థితులే వేరు ఇప్పుడు అవకాశాలొచ్చినా ఉపయోగించుకునే వయసుకాదు… ఆరోగ్యం సహకరించదు. నావలె నీవు కాకూడదని నీ సాహిత్య సేవలు ఎందరికో అవసరం అందుకే ఈ అవార్డుకు నీవే అర్హురాలివి…
నీ చిన్నప్పటి మనసులోని ఆరాటం ఆనాడే అర్ధమైంది కానీ నీ చిరునామా లేక నిన్ను సంప్రదించ లేకపోయాను.
అని తనచేతుల మీదుగా ఆ అవార్డు, ప్రశంసా పత్రం, శాలువా కప్పిఇచ్చి, కౌగిలించుకున్న రంగనాయకమ్మగారు ఎంతసేపైనా తన భుజం మీద పెట్టిన తలను తీయక పోయేసరికి అనుమానంతో ఆమెను భుజాలు పట్టి, తనవైపు తిప్పుకుని చూసేసరికి ఆమె ముఖం ప్రశాంతంగా, నవ్వుతూనే కళ్ళుమూసికొని చేతులలో ఒరిగిపోయింది…
అవాక్కైన సరోజ గొంతునిండా దుఃఖంతో నిర్వాహకులకు సైగచేసింది.
రంగనాయకమ్మ గారు వస్తూ ఒక ఫైల్ తెచ్చారు. అందులో స్టాంపు పేపర్ పైన ఇలా రాసి ఉంది. తనకు సంతానం లేని కారణంగా తన యావదాస్తిని ఒక ట్రస్ట్ గా మార్చి, ఆ ట్రస్టుకు సరోజను చైర్మన్ గా చేస్తున్నానని, ఈ ట్రస్టు ద్వారా ప్రతి అంతర్జాతీయ తెలుగు భాషా దినోత్సవం రోజు ప్రతిభావంతులైన విద్యార్థులు ఏ సాహిత్య ప్రక్రియలోనైనా వారి రచనలు, తెలుగు భాష విశేష కృషి చేసిన వారికి తన పేరు మీదుగా సత్కారం, ప్రశంసా పత్రంతోపాటు నగదు పురస్కారం అందజేయాలని అలాగే, ట్రస్టును నడిపే ప్రణాళిక కూడా పూర్తిగా రాసిన వివరాలతో కూడిన ఒక కాగితంలో ఆర్థికంగా వెసులుబాటు లేని వారు మంచి పుస్తకాలు రాస్తే ఆ పుస్తకాలను తన ట్రస్టు ద్వారా ముద్రించాలనీ, వాటికి అయ్యే ఖర్చులు ట్రస్ట్ భరించాలని, ఆ పుస్తకాలను ఆవిష్కరణ చేయడం కూడా ట్రస్ట్ బాధ్యతని వీలునామా వలె రాసి ఉంది. ఆ ఫైల్ ను చూసిన ఆ వేదిక మీద ఉన్న తెలుగు భాషాభిమానులందరూ నిజమైన తెలుగు భాషాభిమానమంటే ఇదే కదా అని అనుకున్నారు. ఆమె ఆశీర్వాదం ఇలా లభిస్తుందనుకోని సరోజ ఆమె ఆశయాలను తాను ఆచరించి అమలు చేమచేయడమే నిజమైన నివాళని ధృఢనిశ్చయంతో వెనుతిరిగింది బాధా తప్తహృదయంతో…
అవకాశం రాలేదని కూర్చోకుండా తన పని తాను చేస్తూ పోయిన సరోజ ఆలస్యం అయినా కూడా చివరకు మంచి ఫలితాన్ని , గుర్తింపు పొందగలిగింది!

రంగరాజు పద్మజ!

You may also like

Leave a Comment