Home వ్యాసాలు సంధి అంటే

సంధి అంటే

ఉదాహరణకు..
రాముడు+ అతడు
రాముడ్ + ఉ+ అతడు = ఇక్కడ ‘ఉ’మరియు ‘అ’ల మధ్య సంధి జరిగి, ఆ రెండింటి స్థానంలో ‘అ’ వచ్చి చేరి, రాముడ్ + అ+తడు = రాముడతడు అని అవుతుంది.

ఈ సంధులు అచ్చుల మధ్య జరిగితే అచ్చంధులని, హల్లుల మధ్య జరిగితే హల్సంధులని చెబుతారు. ఇవి తెలుగు సంధులు, సంస్కృత సంధులని బేధాలు ఉన్నాయి. ఈ సంధి కార్యాలు మూడు రకాలుగా జరుగుతాయి.
1. ఏకాదేశ సంధులు
2.ఆదేశ సంధులు
3. ఆగమ సంధులు.
1. ఏకాదేశ సంధులు:- ఈ సందులలో పూర్వ స్వరానికి, పరస్పరానికి సంధి జరిగినప్పుడు పరస్పరం వచ్చి చేరడం గానీ, లేదా వేరొక స్వరంగానే వచ్చి చేరుతాయి. తెలుగు సంధులలో అంతే పరస్వరమే వచ్చి చేరుతుంది.
ఉదా-:ఉత్వసంధి, ఇత్వసంధి, అత్వసంధి, ఆమ్రేడిత సంధి.
1. ఏకాదేశ సంధులు:- ఈ సందులలో పూర్వ స్వరానికి, పరస్పరానికి సంధి జరిగినప్పుడు పరస్పరం వచ్చి చేరడం గానీ, లేదా వేరొక స్వరంగానే వచ్చి చేరుతాయి. తెలుగు సంధులలో అంతే పరస్వరమే వచ్చి చేరుతుంది.
ఉదా-:ఉత్వసంధి, ఇత్వసంధి, అత్వసంధి, ఆమ్రేడిత సంధి.

సంస్కృత సంధులలో అయితే పూర్వ పర స్వరాలకు సంబంధం లేకుండా వేరొక స్వరం వచ్చి చేరుతుంది.
ఉదా:- సవర్ణదీర్ఘ సంధి ,గుణ సంధి, వృద్ధి సంధి.

2. ఆదేశ సంధులు:- ఆదేశం అనగా ఒక అక్షరాన్ని కొట్టివేసి, దాని స్థానంలో కొత్త అక్షరం వచ్చి చేరడం. అందేకే వ్యాకర్తలు “శత్రువదాదేశః” అని నిర్వచనం చెప్పారు. అంటే శత్రువులాగా రా నీ కొట్టివేసి దాని స్థానంలో మరొక అక్షరం వచ్చి చేరడం.
ఉదా:– వాడు + కొట్టెను = వాడుగొట్టెను.
ఇక్కడ ‘కొ’ స్థానంలో ‘గొ’ వచ్చి చేరింది.
ఉదా:– సరళవాదేశ సంధి ; గసడదవాదేశ సంధి; పుంప్వాదేశ సంధి; యణాదేశ సంధి.

3. ఆగమ సంధులు:– ఆగమం అనగా కొత్తగా ఒక అక్షరం రావడం.. అంటే ఉన్న అక్షరాలన్నీ ఉండగా, వాటి మధ్య కొత్తగా ఒక అక్షరం వచ్చి చేరుతుంది. అందుకే వ్యాకర్తలు ‘మిత్రవధాగమః’ అన్నారు. అంటే మిత్రుని వలే కొత్తగా ఒక అక్షరం చేరుతుంది అని ఫలితార్థం.
ఉదా:- మా + అమ్మ
మా +య్+అమ్మ = మాయమ్మ.
ఇక్కడ ‘య్’ మిత్రునిగా వచ్చి చేరింది.
ఉదా:– యడాగమ సంధి; రుగాగమ సంధి; టుగాగమసంధి, నుగాగమసంధి, దుగాగమ సంధి, అనునాసిక సంధి ; జస్త్వసంధి, శ్చుత్వసంధి;
మొదలగునవి.
తెలుగు సంధులు- సంస్కృత సంధులు ఏవో చూద్దాం!!
తెలుగు సంధులు:–
ఉత్వ సంధి;
ఇత్వసంధి;
అత్వ సంధి;
యడాగమసంధి;
ఆమ్రేడిత సంధి;
ద్విరుక్త టకారాదేశ సంధి; సరళాదేశ సంధి ;
గసడవాదేశ సంధి;
నుగాగమ సంధి; టుగాగమసంధి;
నుగాగమ సంధి;
టుగాగమ సంధి; పుంప్వాదేశసంధి;
పడ్వాదుల సంధి ; ప్రాతాదులసంధి;
దుగాగమ సంధి;
త్రికసంధి మొదలైనవి.

సంస్కృత సంధులు:– సవర్ణధీర్ఘ సంధి;
గుణసంధి;
యణాదేశ సంధి;
వృద్ధి సంధి;
అనునాసిక సంధి;
జస్త్వసంధి;
శ్చుత్వ సంధి మొదలైనవి.
చిన్నయ సూరి సంధి నిర్వచనం ఇలా సూత్రీకరించారు. “పూర్వ పరస్వరంబులకు పరస్వరంబేకాదేశంబగుట సంధి యనంబడు” ఈ సంధి సూత్రం కేవలం అచ్చు సంధులకు మాత్రమే వర్తిస్తుంది. హల్లులకు వర్తించదు. ఈ సంధి నిర్వచనం ఒకటవ సూత్రం నుండి 11వ సూత్రం వరకు వర్తిస్తుంది. మిగిలిన వాటికి ఆగమాలుగానో ఆదేశాలుగానో సంధులు జరుగుతాయి. పైన చెప్పిన 11 సూత్రాలకు మాత్రమే ఏకాదేశం జరుగుతుంది.
ఇక్కడ మనం ఆదేశం, ఏకాదేశం, ఆగమం గురించి కొద్దిగా తెలుసుకుందాం.
ఆదేశమనగా శత్రువు లాగా ఒక అక్షరమొచ్చి ముందు అక్షరాన్ని తొలగించి దాని స్థానంలో మరొక అక్షరం చేరడం.
కూర+కాయ::: కూరగాయలు
మా+ అమ్మ :::::మాయమ్మ
ఏకాదేశం అనగా పూర్వస్వరానికి పరస్వరానికి కలిపి ఒకే అక్షరం రావడం.
సీత+ అమ్మ…. సీతమ్మ
ఆగమం అనగా మిత్రునిలాగా కొత్తగా అక్షరం వచ్చి చేరడం..
పేద+ ఆలు:::: పేదరాలు
పేద+ర్+ఆలు..
ఇక్కడ రెండు పదాలు మధ్య ర్ కొత్తగా చేరింది.
చిన్నయసూరి చెప్పిన మొదటి సూత్రం చూద్దాం!
“ఉత్తునకచ్చు పరమగునపుడు సంధియగు”
చిన్నయసూరి సూత్రీకరణ అత్వసంధితో కాకుండా ఉత్వసంధితో ప్రారంభించారు. అత్వసంధి బహుళ సంధి , ఉత్వ సంధి నిత్య సంధి. విద్యార్థులకు మొదటే బహుళం గురించి చెప్పి , వారిని తికమక పెట్టడం కంటే నిత్య సంధిని పరిచయం చేయడం విద్యార్థులకు వ్యాకరణం సులభంగా నేర్పించవచ్చని చిన్నయ సూరి అభిప్రాయం. ఎంత మంచి ఆలోచన.
తన బాలవ్యాకరణంలో ఉత్త్, అత్త్ ,ఇత్త్ అని తపరకరణం(హ్రస్వ ఉకార, అకార ,ఇకార ఉకారములు) చేయడం వల్ల ఎంతో ఉపయోగంగా ఉంది. ఉత్తు అంటే హ్రస్వమైన ఉత్వం అని అర్థం. ఉకారం అంటే ఉ మరియు ఊ అని అర్థం.
హ్రస్వమైన ఉత్వమునకు అచ్చు పరమైతే సంధి నిత్యంగా జరుగుతుంది.
రాముడు+ అతడు… రాముడతడు
సోముడు+ ఇతడు… సోముడితడు
వారు+ ఎవరు ….. వారెవరు… మొదలైనవి.
వ్యాకరణ ప్రియులు ఈ సంధిని ఉకారసంధి అని గాక ఉత్వసంధి అని చెప్పాలని సూచించారు. ఎందుకంటే?
ఉకార సంధి అని చెప్పడం వలన ఉ, ఊ లు రెండు వస్తాయి. కానీ ఉత్వసంధి అని చెప్పడం వలన కేవలం హ్రస్వమైన ఉత్వం మాత్రమే ఉంటుంది. కనుక ఉత్వసంధి అని చెప్పడం సబబుగా ఉంది.
ఉత్వసంధి నిత్యసంధి అయినప్పటికీ కొన్నిచోట్ల వికల్పరూపం కూడా కనిపిస్తుంది. అందుకే రెండో సూత్రం ఇలా సూత్రీకరించారు.
“ప్రథమేతర విభక్తి, శత్రర్థక చువర్ణంబులందున్న యుకారమునకు సంధి వైకల్పికముగా నగు”
సూత్రమును ఒకసారి పరికిద్దాం!
విభక్తులు తెలుగులో ఏడున్నాయి. అవి ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్టి, సప్తమీ. వీటిలో ప్రథమా విభక్తి గాక మిగిలిన విభక్తుల్లో ఉకారం చివరనున్న విభక్తులు
నన్నున్… ద్వితీయా విభక్తి
కొరకున్…. చతుర్థీ విభక్తి
నాకున్….‌‌ షష్టీ విభక్తి
అందున్…. సప్తమీ విభక్తి .
అందున్ సామ్యం చేత ఇందున్, ఎందున్ కూడా గ్రహించాలి.
ఇవేకాక శత్రర్థక చువర్ణం అంటే వర్తమాన కాలంలోని అసమాపక కాలమును సూచించు చువర్ణమని అర్థము.
వచ్చుచున్, చూచుచున్ ఇలాంటివి శత్రర్థక చువర్ణకాలు. పైన సూచించిన విభక్తి ప్రత్యయాలకు గానీ, శత్రర్థకాలుకు గానీ వైకల్పికముగా సంధి జరుగుతుంది.
నన్నున్+ అడిగె… సంధి జరిగితే మొదట నన్నున్ లో ఉన్న ద్రుతం లోపించి
నన్ను+ అడిగె…‌ ఇక్కడ సంధి జరిగి నన్నడిగె అవుతుంది. సంధి జరగని పక్షంలో ద్రుతం వచ్చి
నన్నున్+ అడిగె.‌..‌నన్నునడిగె అనే రూపం ఏర్పడుతుంది. ఇలా ఈ సూత్రం ద్వారా రెండు రూపాలు సిద్ధిస్తాయి. మిగిలిన ఉదాహరణలు చూద్దాం!
నాకొరకున్+ ఇచ్చె … నాకొరకిచ్చె.. నాకొరకునిచ్చె
నాకున్+ ఆదరువు… నాకాదరువు… నాకునాదరువు
నాయందున్+ ఆశ… నాయందాశ.. నాయందునాశ
ఇందున్+ ఉన్నాడు… ఇందున్నాడు… ఇందునున్నాడు…
ఎందున్+ ఉంటివి.. ఎందుంటివి.. ఎందునుంటివి
వచ్చుచున్+ ఉండెను… వచ్చుచుండెను.. వచ్చుచునుండెను
చూచుచున్+ ఏగెను… చూచుచేగెను… చూచుచునేగెను…
తరువాత యడాగమ సంధిని చూద్దాం!
తెలుగులో అచ్సంధులలో ఎక్కడైనా సంధి జరగకుంటే యడాగం వస్తుంది. దీర్ఘాచ్చులు మీద సంధి జరగదు. అత్వ, ఇత్వ సంధుల మీద కొన్ని చోట్ల సంధి జరగదు. అలాంటి సందర్భాల్లో యడాగమం వస్తుంది. అందుకే చిన్నయసూరి యడాగమం సంధిని ఈ విధంగా సూత్రీకరించారు.
“సంధి లేనిచోట స్వరంబు కంటె పరంబైన స్వరంబునకు యడాగమగు”
మా+ అమ్మ…. మాయమ్మ
మీ+ ఇల్లు..‌‌ మీ ఇల్లు
మా+ ఊరు…మాయూరు
ఈ ఉదాహరణలో పూరస్వరంలో దీర్ఘం ఉంది కాబట్టి సంధి జరగలేదు.
తర్వాత అత్వ సంధిని చూద్దాం చిన్నయసూరి ఆత్వసంధిని ఇలా సూత్రీకరించారు.
” అత్తునకు సంధి బహుళము”.
బహుళమనగా అనేక రకములని అర్థం. కానీ వ్యాకరణ పరిభాషలో బహుళము నాలుగు రకాలు. 1. ప్రవృత్తి (నిత్యము)
2. అప్రవృత్తి (అనిత్యము)
3. విభాష (వైకల్పికము)
4. అన్యత్వం
వీటి వివరణ చూద్దాం!
సంస్కృతంలో బహుళం గురించి ఇలా సూత్రీకరించారు.
క్వచిత్ ప్రవృత్తిః క్వచిదప్రవృత్తిః
క్వచిత్ విభాషా క్వచిదన్యదేవ
విధేర్విధానం బహుధా సమీక్ష
చతుర్విధం బహుళకం వదన్తి
1. ప్రవృత్తి :- విధించిన వ్యాకరణ కార్యం తప్పక జరగడాన్ని ప్రవత్తి లేదా నిత్యము అంటారు.
సీత+ అమ్మ…. సీతమ్మ
రామ +అయ్య రామయ్య
2) అప్రవృత్తి:- విధించిన వ్యాకరణ కార్యం జరగకుంటే అప్రవృత్తి లేదా అనిత్యం అంటారు.
అమ్మ+ ఇచ్చెను…. అమ్మయిచ్చెను
దూత+ ఇతడు…. దూతయితడు
3) విభాష :- విధించిన వ్యాకరణ కార్యం ఒకసారి జరిగి మరొకసారి జరగకుంటే దాన్ని వైకల్పికం లేదా విభాష అంటారు.
మేన+ అల్లుడు… మేనల్లుడు, మేనయల్లుడు
పుట్టిన+ ఇల్లు… పుట్టినిల్లు, పుట్టినయిల్లు
4) అన్యత్వం:- విధించిన వ్యాకరణకార్యం ఒక విధంగా జరగవలసి ఉండగా మరొక విధంగా జరగడానికి అన్యత్వం అంటారు.
ఒక+ఒక.. ఒకానొక
పై ఉదాహరణలో ఒక+ ఒక ఆమ్రేడిత సంధి జరిగి ఒకొక్క కావలసి ఉండగా అలా జరగక కకారమునకు దీర్ఘం వచ్చి దాని పైన ద్రుతము వచ్చి ఒకానొక అయినది. అలాగే
తామర+ ఆకు…. తామరపాకు
బొమ్మ+ ఇల్లు… బొమ్మరిల్లు.. మొదలైనవి.
బహుళగ్రహణము చేత స్త్రీవాచక, తత్సమ, సంబోధనాంతములకు సంధిలేదని చిన్నయసూరి సూత్రీకించారు. ఆ సూచన ప్రకారం
అమ్మ+ ఇచ్చెను… అమ్మయిచ్చెను
దూత+ ఇతడు… దూతయితడు
చెలువుడ+ ఇందము… చెలువుడయిందము
స్త్రీ వాచక శబ్దాలు అంటే స్త్రీలను గురించి తెలిపే అమ్మ, అక్క,అవ్వ, మొదలైనవి. తత్సమ శబ్దాలు అంటే సంస్కృత పదాలు మీద తెలుగు పదాలు చేరడం వలన ఏర్పడిన పదాలు. సంబోధనాంతం అంటే ఎవరిని సంభోధన చేస్తామో ఆ పదం. ఇలాంటి పదాల మీద సంధి జరగదని తెలుసుకోవాలి.

ఇత్వసంధిలోని భేదాలు తెలుసుకుందాం!
” ఏమ్యాదుల యిత్తునకు సంధి వైకల్పికముగా నగు”.
ఏమి మొదలైన పదాల్లో ఉన్న హ్రస్వమైన ఇకారమునకు అచ్చు పరమైతే సంధి జరగవచ్చు, లేదా జరగకపోవచ్చు.
ఉదా:- ఏమి+ అంటివి
ఈ పదాల మధ్య సంధి జరిగితే ఏమంటివి అవుతుంది. ఈ రెండు పదాల మధ్య సంధి జరగకపోతే వాటి మధ్య యడాగమం వచ్చి ఏమియంటివి అనే రూపం ఏర్పడుతుంది.
అలాగే

మరి +ఏమి::: మరేమి, మరియేమి
హరికిన్ + ఇచ్చె సంధి జరిగితే పూర్వ రూపంలో ఉన్న ద్రుతం లోపిస్తుంది .ఆ తర్వాత ఇత్వం మీద సంధి జరిగి హరికిచ్చె అవుతుంది . ఒకవేళ సంధి జరగపోతే ముందున్న ద్రుతంతో కలిసిపోయి హరికినిచ్చె అని ఏర్పడుతుంది. సూరి ఈ సూత్రం కింద “ఏమి, మఱి , కి- షష్టి, అది, అవి, ఇది,ఇవి, ఏది, ఏవి” అనేవి ఆకృతిక గణాలని ఇచ్చారు. పైన ఇచ్చిన పదాల్లో ఇత్వ సంధి వైకల్పికముగా జరుగుతుందని అర్థం.
తరువాత సంధిని చూద్దాం!
“క్రియాపదములందిత్తునకు సంధి వైకల్పికముగా నగు”.
ఇంతకు మునుపు సూత్రంలో ఎక్కువ భాగం సర్వనామాలు మీదే సంధి జరిగిన విధానం చెప్పబడింది. ఇప్పుడు క్రియా పదాలు మీద సంధి వైకల్పికముగా జరుగుతుందని సూచించారు.
ఉదా- వచ్చిరి+ అపుడు :::
సంధి జరిగితే వచ్చిరపుడవుతుంది. సంధి జరగకపోతే రెండు పదాల మధ్య యడాగమం వచ్చి వచ్చిరియప్పుడు అని అవుతుంది.
ఇలాగే
వచ్చితిమి+ ఇప్పుడు ::: వచ్చితిమిప్పుడు, వచ్చితిమియిప్పుడు అని అవుతుంది.
తర్వాత సూత్రం గురించి తెలుసుకుందాం. “మధ్యమ పురుషక్రియలందిత్తునకు సంధి యగును”.
తెలుగులో పురుషలు మూడు రకాలు. అవి ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రధమ పురుష .
తన గురించి తాను తెలిపేది ఉత్తమ పురుష, ఎదుటివారి గురించి తెలిపేది మధ్యమ పురుష, దూరంగా ఉన్న వారి గురించి తెలిపేది ప్రథమ పురుష.
మధ్యమ పురుష క్రియల మీదున్న ఇత్వానికి అచ్చు పరమైతే సంధి నిత్యంగా జరుగుతుందని సూత్రార్థము.
ఉదాహరణలు పరిశీలిద్దాం.
ఏలితివి+ అప్పుడు ఇక్కడ ఏలుతివి అనేది మధ్యమ పురుష క్రియ. దీని మీదున్న ఇత్తునకు అచ్చు పరమైతే సంధి నిత్యంగా జరిగి ఏలితివపుడు అవుతుంది. ఇలాగే ఏలితి+ ఇప్పుడు… ఏలితిప్పుడు, ఏలితిరి+ ఇప్పుడు ఏలితిరిప్పుడు అనే రూపాలు ఏర్పడుతాయి .
తర్వాత సూత్రం చూద్దాం.
“క్త్వార్థంబైన యిత్తునకు సంధి లేదు”.
క్త్వార్థమంటే భూతకాలిక అసమాపక క్రియ. భూత కాలిక అసమాపక క్రియలు మీద ‘ఇ’ అనే ప్రత్యయం చేరుతుంది.
వండు+ ఇ:::: వండి
చదువు + ఇ:::: చదివి
ఇలా వచ్చిన క్త్వార్థమునకు అచ్చుపరమైతే సంధి జరగనే జరగదని సూత్రార్థం.
వచ్చి+ ఇచ్చెను. ఇక్కడ వచ్చి అనేది క్త్వార్థక ఇకారం ఉంది కాబట్టి దాని మీద సంధి జరగదు అలాంటి సమయంలో యడాగం వచ్చి
వచ్చియిచ్చెను అని అవుతుంది. అలాగే
వండి+ ఇచ్చెను::: వండియిచ్చెను
దీనితో ఇత్వ సంధి సూత్రాలు పూర్తి అయ్యాయి.
తర్వాత ద్విరుక్త టకారాదేశ సంధి గురించి తెలుసుకుందాం!
“కుఱు, చిఱు, కడు, నడు, నిడు శబ్దముల ఱ, డలకచ్చు పరమైనపుడు ద్విరుక్తటకారాదేశంబగు”
వివరణ చూద్దాం!
కుఱు, చిఱు అనే పదంలోని “ఱ”కారమునకు కడు, నడు, నిడు అనే పదములోని “డ”కారమునకు అచ్చు పరమైతే ద్విరుక్తటకారం అంటే రెండు టకారాలు(ట్ట్) ఆదేశంగా వస్తుందని సూత్రార్థం.
కుఱు+ ఉసురు
కుఱ్+ ఉ+ ఉసురు
ఈ సూత్ర ప్రకారం ‘ఱ్’ స్థానంలో ట్ట్ వచ్చి చేరి కుట్ట్ +ఉసురు అవుతుంది. తర్వాత ట్ట్ మీద ఉ చేరి ట్టు అవుతుంది. తర్వాత ఉత్తునకచ్చు పరమగునపుడు సంధి యగు అనే సూత్రంతో కుట్టుసురు అవుతుంది.
ఇలాగే
చిఱు+ ఎలుక…. చిట్టెలుక
కడు+ ఎదురు…. కట్టెదురు
నడు+ ఇల్లు… నట్టిల్లు
నిడు+ ఊర్పు… నిట్టూర్పు
తరువాత సంధిని గురించి తెలుసుకుందా!
” అందు, అవగాగమంబులనం దప్ప అపదాది స్వరంబు పరంబగుగనప్పుడు అచ్చునకు సంధి యగు”
అందు,అవక్ అనేవి తప్ప మిగిలిన అపదము
అనగా పదము కానిది పరమైతే సంధి నిత్యంగా జరుగుతుందని సూత్రార్ధం. అందు, అవక్ పరమైనప్పుడు వికల్పంగా సంధి జరుగుతుంది.
వాడు+ ఏ అన్నప్పుడు “ఏ” అనేది అపదం. అనగా ఏ అనేది పదం కాదు. అలాంటప్పుడు ఆ రెండు పదాల మధ్య సంధి నిత్యంగా జరిగి వాడే అవుతుంది.
ఇది+ ఓ…ఇదో
అది+ ఓ …. అదో
ఇలా పదాల్లో సంధి నిత్యంగా జరుగుతుంది.
మూర+ ఎడు ఇక్కడ ఎడు అనే పదానికి అర్థం లేదు, అది అపదం కాబట్టి నిత్యంగా సంధి జరిగి మూరెడు అవుతుంది.
వీసె+ ఎడు..‌‌ వీసెడు
అర్ధ + ఇంచు ఇక్కడ ఇంచు అనేది అపదం కాబట్టి సంధి నిత్యంగా జరుగుతుంది. అర్థించు అవుతుంది. ఇలాగే
నిర్జి+ ఇంచు::: నిర్జించు
అందు, అవుక్ అనేవి పరమైతే ఎలాంటి రూపాలు వస్తాయో చూద్దాం!
రాముల+ అందు…. సంధి జరిగితే రాములందు అవుతుంది. సంధి రాని పక్షంలో రాములయందు అవుతుంది.
ఎనిమిది+ అవ.. ఎనిమిదవ, ఎనిమిదియవ ఇలా రెండు రూపాలు ఏర్పడుతాయి.

ఆమ్రేడితం గురించి చిన్నయసూరి “ద్విరుక్తం యొక్క పరరూపం ఆమ్రేడితము” అని నిర్వచనం చెప్పారు. ద్విరుక్తం అనగా ఒకే పదం రెండుసార్లు రావడమని అర్థం. పరరూపం అనగా సంధి పదంలోని రెండవ పదం. ఒకే పదం రెండుసార్లు వచ్చినప్పుడు రెండవసారి వచ్చిన పదాన్ని ఆమ్రేడితమంటారని సూత్రార్థం.

ఇప్పుడు ఆమ్రేడిత సంధిలోని వివిధ సూత్రాలను పరిశీలిద్దాం….
1) అచ్చునకు ఆమ్రేడితం పరమగునప్పుడు సంధి తరచుగానగు.
పూర్వ రూపంలో చివరనున్న అచ్చుకు ఆమ్రేడితం పరమైతే సంధి ఎక్కువ భాగం జరుగుతుంది. సూత్రంలో తరచుగా అని చెప్పడం చేత కొన్నిచోట్ల వైకల్పికముగా కూడా జరుగుతుందని భావం.
ఔర+ ఔర …ఔరౌర
ఆహా +ఆహా… ఆహాహా
ఊరు +ఊరు… ఊరూరు
అక్కడ+ అక్కడ …అక్కడక్కడ మొదలైనవి.
సూత్రంలో తరచుగా అనడం చేత
ఏమి+ ఏమి… అన్నప్పుడు సంధి జరిగితే ఏమేమి అవుతుంది. సంధి జరిగిన పక్షంలో యడాగమం వచ్చి … ఏమియేమి అవుతుంది.
ఏగి+ ఏగి అన్నప్పుడు ఏగి అనేది క్త్వార్థకం కాబట్టి క్త్వార్థక ఇకారం మీద సంధి రాదు కాబట్టి యడాగమం వచ్చి ఏగియేగి అనే రూపం ఏర్పడుతుంది.
రెండవ సూత్రం చూద్దాం.
2)ఆమ్రేడితం పరమగునప్పుడు కడాదుల తొలి అచ్చు మీది వర్ణంబులకెల్ల అదంత ద్విరుక్తటకారంబగు.
సూత్రార్థం చూద్దాం! కడ మొదలైన పదాలకు ఆమ్రేడితం పరమైతే పూర్వ పదంలోని తొలి అక్షరం తప్ప దాని మీద ఉన్న అక్షరాలన్నిటికి కలిపి అదంత ట కారం అంటే ” ట్ట” అనేది ఆదేశంగా వస్తుందని భావం.
కడ +కడ …కట్టకడ
చివర+ చివర …చిట్టచివర
పగలు+ పగలు… పట్టపగలు
బయలు+ బయలు బట్టబయలు మొదలైనవి.
కడాదులని క్రింది వాటిని పిలుస్తారు.
కడ, ఎదురు, కొన, చివర, తుద,తెన్ను, తెరువు పగలు, బయలు మొదలైనవి.
ఇంకా మూడవ సూత్రం చూద్దాం!
3)నిందయందు ఆమ్రేడితంలో ఆద్యక్షములకు హ్రస్వ దీర్ఘములకు గి గీ లగు.
నిందను చెప్పే సందర్భంలో ఆమ్రేడితం అనగా రెండో పదంలో మొదటి అక్షరం హ్రస్వం ఉంటే గి వస్తుంది, దీర్ఘం ఉంటే గీ వస్తుంది అని సూత్రార్థం.
రావణుడు +రావణుడు… రావణుడు గీవణుడు ఇక్కడ రెండవ పదంలోని రావణుడు పదంలోని రా కు బదులుగా గీ వస్తే రావణుడు గీవణుడు అని అవుతుంది.
అలాగే కుంభకర్ణుడు+ కుంభకర్ణుడు… కుంభకర్ణుడు గింభకర్ణుడు
పుస్తకం+ పుస్తకం … పుస్తకం గిస్తకం
పూలు+ పూలు… పూలు గీలు అవుతుంది.

ఇక నాలుగో సూత్రం చూద్దాం
4) ఆమ్రేడితం పరమగునప్పుడు విభక్తి లోపం బహుళముగానగు.
మొదటి పదం చివరనున్న విభక్తి ప్రత్యయానికి ఆమ్రేడితం పరమైతే ఆ విభక్తి ప్రత్యయానికి లోపం బహుళంగా వస్తుంది, అనగా అనేక రకాలుగా రాచ్చునని సూత్రార్థం.
అప్పటికిన్ + అప్పటికిన్
ఇక్కడ కిన్ అనే షష్టి విభక్తి మీద సంధి జరిగితే విభక్తి లోపించి అప్పటప్పటికిన్ అనే రూపం ఏర్పడుతుంది. ఒకవేళ సంధి జరగకపోతే రెండవ పదంలోని మొదటి అచ్చు విభక్తి ప్రత్యయముతో కలిసి అప్పటికనప్పటికిన్ అనే రూపం ఏర్పడుతుంది. అక్కడన్+అక్కడన్ …అక్కడక్కడన్ లేదా అక్కడనక్కడన్ అని అవుతుంది.
మరొక ఉదాహరణ చూద్దాం!
ఊరన్+ ఊరన్ …ఊరూరన్ లేదా ఊరనూరన్ అని వస్తాయి .
సూత్రములో బహుళమని చెప్పడం చేత ఇంచుక , నాడు మొదలైన పదాలు చివరి అక్షరం లోపించి సంధి జరుగుతుంది.
ఇంచుక + ఇంచుక… ఇక్కడ మొదటి పాదంలో చివరి అక్షరం క లోపిస్తే ఇంచించుక అవుతుంది. క లోపించకుంటే ఇంచుకించుక అవుతుంది. అలాగే
నాడు+ నాడు…. నానాడు లేదా నాడు నాడు అనే రూపాలు కూడా ఏర్పడతాయి.
ఇక ఐదవ సూత్రం చూద్దాం
5) ఆమ్రేడితం పరమగునప్పుడు మధ్యమ ము,డుజ్ లకు లోపం విభాషనగు.
డు, ము, వు,లు మొదలైన విభక్తి ప్రత్యయాలు కాగా డుజ్,రు,వు,రు,ను,ముజ్ అనేవి క్రియా ప్రత్యయాలు. ఈ క్రియా ప్రత్యయాలలో మధ్యమ పురుషను చెప్పేటప్పుడు బహువచనములో ము ప్రత్యయము ఏకవచనంలో డు ప్రత్యయము అనేవి విభాషగా లోపిస్తుందని సూత్రార్థము. ఉండుము+ ఉండుము… సంధి జరిగితే ము లోపించి ఉండుండుము అవుతుంది. సంధి జరగకపోతే ఉండుముండుము అనే రూపాలు వస్తాయి.
ఇలాగే కొట్టుడు+ కొట్టుడు… కొట్టుకొట్టుడు
కొట్టుడు కొట్టుడు అనే రూపాలు వస్తాయి.
ఇక ఆరవ సూత్రం చూద్దాం!
ఆమ్రేడితంలో అనేక రకాలుగా కార్యాలు రావడం వలన అన్ని ప్రయోగాలకు సూత్రాలు నిరూపించడం కష్టం కనుక ఒక నిపాత సూత్రంతో వాటికి సాధుత్వం కల్పించాలని చిన్నయ సూరి ఈ సూత్రాన్ని చెప్పాడు. దాన్ని చూద్దాం!
6) అందదుకు ప్రభృతులు యథాప్రయోగముగా గ్రాహ్యములు.
వివరణ చూద్దాం! అందదుకు మొదలైనవి కవి ప్రయోగాలను యథాతథంగా స్వీకరించాలని సూత్రార్ధము.
అదుకు+ అదుకు….అందదుకు
ఇంకులు+ ఇంకులు..ఇఱ్ఱింకులు
ఇగ్గులు+ ఇగ్గులు… ఇల్లిగ్గులు
చెదురు+ చెదరు …చల్లచెదురు, చెల్లాచెదురు
తురుము+తురుము …తుత్తుమురు
తునియలు+ తునియలు… తుత్తునియలు మిట్లు+ మిట్లు, మిరుమెట్లు మొదలైనవి .
పైన ఉన్న ఉదాహరణలు పరిశీలించండి. ఒక్కొక్క ఉదాహరణ ఒక్కొక్కరూపంలో ఉన్నాయి. వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క సూత్రం సృష్టించడం కష్టం కనుక ఇలా సూరి తెలివిగా నిపాతం చేశాడు.

You may also like

Leave a Comment