అన్నవరం దేవేందర్ తెలంగాణ పల్లె సోయగం అరుగు కవిత్వం.
భరోసా కవిత.
ప్రముఖ కవి,రిటైర్డ్ సూపరింటెండెంట్,మండల ప్రజా పరిషత్ కార్యాలయం,ముస్తాబాద్,జిల్లా సిరిసిల్ల, అన్నవరం దేవేందర్ కలం నుండి జాలువారిన ఇంటి దీపం కవితా సంపుటిలోని అరుగు కవిత పై విశ్లేషణా వ్యాసం.తెలంగాణ మాండలికంలో రాసిన అరుగు కవితను ఆసక్తితో చదివాను.నాకు నచ్చింది. నాలో ఆలోచనలు రేకెత్తించింది.తెలంగాణ పల్లెల్లో ప్రతి ఇంటి ముందట అరుగు ఉంటుంది.కవి దేవేందర్ అరుగు పై వ్రాసిన కవిత ఆద్యంతం మనోహరం.అరుగు కవిత చరణాల్లోకి వెళ్ళి దృష్టిని సారించండి.అలౌకిక అనుభూతిని సొంతం చేసుకోండి. “ఇల్లు వాకిలి ఇంటి చుట్టూరా పడారి “గోడకు ఆనుకునే అటు ఇటూ అరుగులు “ఆడ కూకోని పెట్టుకున్న ముచ్చట్ల మురిపాలు “ఇప్పటికీ చెవుల్ల వినిపిస్తున్న జ్ఞాపకాలు” మొదటి నాలుగు కవితా చరణాలు ఎంతో హృద్యంగా ఉన్నాయి.తెలంగాణలో పాడిపంటలతో పొంగి పొర్లే పల్లెలు ఎక్కడ చూసినా చెట్టు చేమలతో ఎంతో అద్భుతంగా ఉండేవి.ఈనాడు ఆ పల్లెలు తన సహజ సౌందర్యాన్ని కోల్పోతున్నాయి.పల్లెలో వర్షాలు లేక పంటలు పండక కరువు విలయతాండవం చేస్తున్నది.
ఈనాడు పల్లె జనం పల్లెను విడిచి పట్నాలకు వలస వెళుతున్నారు. ఆరుగాలం కష్టించే అన్నదాత ఇవ్వాళ ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు.పల్లెల్లో ఎక్కడ చూసినా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేది.ఆ పల్లెల్లో నివసించే జనాలు అందరూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని అరుగుల మీద కూర్చుండి వాళ్ళ కష్ట సుఖాలు కలబోసుకునే వారు. పల్లెలో జనాలు ఆపదలో ఉన్నవారిని ఆదుకునే వారు.పల్లెలో ఎంతో మంచి అనుకూలమైన వాతావరణం ఉండేది.ఇప్పుడు పల్లెల్లో కూడా పట్టణమునకు చెందిన ఘర్షణ వాతావరణం ఏర్పడింది.పల్లెలోని అరుగులు,ఇండ్లు ప్రేమాభిమానాలకు నెలవుగా ఉండేవి.పల్లెలో జనాలు ఆ పాత ఇండ్లను,ఇంటి గుమ్మం ముందు ఉన్న పాత అరుగులను కాపాడుకోడం లేదు.పల్లెలో అరుగులపై కూర్చుండి జనాలు ఆడినారు, పాడినారు,పడుకున్నారు.ఆనాటి పల్లె ప్రజలు ఇప్పుడు ఎవ్వరు లేరు.కాలం వారిని తన వెంట తీసుకుపోయింది.పల్లెలోని కొందరు ఉపాధి పేరిట పల్లెను విడిచి పట్టణాలకు వలస వెళ్ళినారు. ఇప్పటికీ పల్లెను నమ్ముకుని జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు.పల్లె అరుగుల మీద కూర్చుండి ఇప్పటికీ కొందరు తమ కష్ట సుఖాలను ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు.పల్లెలో జనాలు అరుగుల మీద కూర్చుండి మాట్లాడుకోవడం,ఇప్పటికీ అదొక వేడుకగా కొనసాగుతుంది. “వాకిట్లోనే శాద బాయి దాని పొన్న జాలారి “పక్కన్నే పెరిగిన బంతి చెట్ల వరుస “పొద్దుగాల రోజూ కాల్రెక్కలు కడుక్కుంటాంటే “కంటికి ఇంపుగ కనిపించే బంతిపూల సొగసు”. తెలంగాణలో పల్లె ఎలా ఉంటుంది.పల్లె రూపు రేఖల గురించి మనకు పరిచయం చేస్తున్న వాక్యాలు ఇవి. తెలంగాణ మట్టిలో పూసిన మాణిక్యాల వలె మనకు అరుగులు కనిపిస్తున్నాయి.తెలంగాణలో పల్లెల్లో ప్రతి ఇంటి వాకిట్లో చేద బావి ఒకటి ఉంటుంది.చేద బావి పక్కనే జాలారి ఉంటుంది.చేద బావి లేని వాళ్లు పక్కింట్లో నీళ్లు తోడుకొని పోతుంటారు. తెలంగాణ పల్లె జనాల్లో నెలకొన్న ఆప్యాయతలు, అనుబంధాలు మనసును అబ్బురపరుస్తాయి.ఒక ఆనంద లోకంలోకి మనల్ని తీసుకువెళ్తాయి.పల్లె పల్లె ఆంతా ఒక వసుధైక కుటుంబంలా కలిసిమెలిసి ఉంటారు.తెలంగాణ పల్లె ఎక్కడ కని విని ఎరుగని చిత్రమైన దృశ్య కావ్యంలా అగుపిస్తుంది.అలనాటి రామ రాజ్యం రోజులను గుర్తుకు తెస్తుంది.జాలారిలో నీళ్లు నిలవకుండా చూస్తారు.జాలారిని ఆనుకొని ప్రతి ఇంట్లో బంతి చెట్ల వరుస ఉంటుంది.పొద్దుగాల రోజు కాల్రెక్కలు కడుక్కుంటుంటే కంటికి ఇంపుగా కనిపించే బంతిపూల సొగసు మధుర మనోహరంగా ఉంటుంది.చూడడానికి బంతిపూలు ఎంతో అందంగా ఉంటాయి.బంతిపూలు రెండు రకాలు. రిక్క బంతిపూలు మరియు ముద్దబంతి పూలు. మనకు ఘంటసాల పాడిన సినిమా పాట ముద్దబంతి పూలు మూగ కళ్ళ ఊసులు ఎనక జన్మ బాసలు ఎందరికి తెలుసులే ఈ పాట ఎన్నిసార్లు విన్నా మన హృదయం పరవశించి పోతుంది.మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది.అందుకే వాటిని అపాత మధురాలు అంటారు.ఆ బంతి పూలు స్త్రీలు తమ సిగలో అలంకరించుకుంటారు.మరియు కొందరు మాల అల్లి తమ కులదేవతకు సమర్పించుకుంటారు.పల్లెలో ప్రతి ఇంటిలోనూ తోటలో చేనులు చెలకల్లోనూ పొలాల గట్ల మీదనూ బంతి చెట్లు పెంచుతారు.బంతిపూల సొగసు పరిమళాలు కమనీయంగా రమణీయంగా ఉంటాయి.పల్లెలో ప్రతి ఇంటి ముందు పందిరి వేస్తారు.దానిమీద ఈత కమ్మలు,తాటి కమ్మలు మరియు వరిగడ్డితో కప్పుతారు.పల్లెలో పందిరి కింద మంచం వేసి ఉంటుంది.పల్లె జనాలు పందిట్లోనే కూర్చుండి ముచ్చట్లు పెడతారు.వారు అలసి పోయినప్పుడు మంచంలో సేద తీరి అక్కడే పందిరి కింద నిద్రపోతారు. “పెద్దర్వాజ ముందల పరుచుకున్న పందిరి. “గుంజల మీంచి పచ్చగా పారిన అన్వే తీగ. “చిన్నపిందె రోజింత రోజింత పెరిగిన అన్యే కాయ. “అమ్మ తెంపకపోయి పొయ్యి మీద గోలిస్తాంటే. “ఇల్లంతా కమ్మ కమ్మని వాసన నోర్లల్ల ఊరిల్లు”. పెద్దర్వాజల ముంగల తెలంగాణలో ప్రతి ఇంటి ముందు పరుచుకున్న పందిరి ఉంటుంది.పందిరికి వర్షాకాలం రాగానే అనియపు విత్తనాలు నాటుతారు.పల్లెలో అనియపు తీగే పెరిగి పెద్దయి పందిరి నిండా పరుచుకుంటుంది.అనియపు చెట్టు లెక్క లేనన్ని కాయలు కాస్తుంది.సొర కాయలను ఆ ఇంటి వారు తినడమే కాకుండా తమ ఇరుగు పొరుగు వారికి పంచుతారు.కవి దేవేందర్ తన కవితలో చిన్న పిందె పెరిగి పెద్దది కాగానే అమ్మ తెంపుకపోయి పొయ్యి మీద గోలిస్తాంటే ఇల్లంతా కమ్మ కమ్మని వాసన నోర్లల్ల ఊరిల్లు ఊరుతాయని అంటున్నాడు.అమ్మ చేతి వంట ఎంతో అద్భుతంగా ఉంటుందనేది జగమంతా ఎరిగిన సత్యం.ప్రతి పల్లెలో అమ్మ ఎప్పుడు ఇలానే కమ్మ కమ్మగా వండి పెడుతుంది.తెలంగాణలో ప్రతి అమ్మ కుటుంబం కొరకు ఆరుగాలం కష్టపడుతుంది.అమ్మ తన భర్తతో,పిల్లలతో, బంధువులతో మరియు ఇరుగు పొరుగు వారితో ఎంతో సఖ్యతగా మెలుగుతూ కుటుంబాన్ని గుట్టుచప్పుడు కాకుండా గుంభనంగా ఎంతో నేర్పుగా అలవోకగా కొనసాగిస్తుంది.పల్లెలో కోడి కూతతోనే ఆ తల్లి నిద్ర లేస్తుంది.అమ్మ ఇల్లును మరియు వాకిలిని శుభ్రంగా ఊడ్చుతుంది.అమ్మ వాకిలిని పెండ నీళ్లతో కల్లాపి (సాన్పు) చల్లుతుంది. అమ్మ వాకిట్లో సుద్ద మట్టితో ముగ్గులు వేస్తుంది. రంగవల్లులతో వాకిలిని తీర్చిదిద్దుతుంది.అమ్మ ఇల్లు మొత్తం ఎర్రమట్టి కల్పిన పిడుసతో అలుకుతుంది. అమ్మ పశువుల పేడ తీసి వేసి పశువుల కొట్టం శుభ్రం చేస్తుంది.అమ్మ పశువులకు కుడితి నీళ్లు పెడుతుంది.అమ్మ పాలిచ్చే బర్ల పాలు పిండుతుంది. తర్వాత మగ వాళ్ళు పశువులను తోలుకొని వ్యవసాయ పనులకు తరలిపోతారు.అమ్మ తర్వాత పొయ్యి గద్దెలు పుట్ట మట్టి పిడుసతో అలుకుతుంది. తర్వాత పొయ్యి ముట్టించి పాలు వేడి చేస్తుంది. “పదారి గోడకు పొడుగుతా “ఎర్రలుకు మీద సున్నం తీనెలు ,”కడపలకు పుధిచ్చిన పసుపు పండుగ శోభ “ఎర్ర కుంకుమ,పసుపు,తెల్లబొట్ల సింగారం “గల్మల్ల నిలబడంగనే కండ్లకు ఇంపైన మురిపం.” మన తెలంగాణలో ప్రతి పల్లెలోని ఇల్లు ఇలానే ఉంటుంది.పడారి గోడకు పొడుగుతా ఎర్ర మట్టితో అలుకుతారు మరియు సున్నంతో బొట్లు పెడతారు. పల్లెలో దర్వాజా మరియు కడపలకు పసుపుతో అలంకరించి ఎర్ర కుంకుమ పసుపు తెల్లబొట్లతో సింగారం చేస్తారు.ప్రతి ఇంట ఇలానే అలంకరణ చేసి శుభ్రంగా ఉంచుతారు. “పెరట్లో సన్న సన్నగా ఎగబాకుతున్న మల్లె తీగ”. ప్రతి ఇంటిలో మల్లె చెట్టు ఉంటుంది.మల్లె పూల పరిమళం ఎంతో కమ్మగా ఉంటుంది.మల్లె పూలను ఆడవాళ్లు తమ సిగలో అలంకరించుకుంటారు. “గోడ అవతల నుంచి చల్లగాలి విసురుతున్న యాపలు” వేప చెట్టు గాలి ఎంతో అద్భుతంగా ఉంటుంది.వేప చెట్టు గాలి గురించి చెప్ప తరం కాదు.వేప చెట్టును మహాలక్ష్మి స్వరూపంగా భావించి పూజిస్తారు.వేప ఆకులతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.వేపాకును ఇళ్లల్లో టేకు దూలాలు అమర్చి టేకు పరోటా చెక్కలను కొట్టిన తర్వాత దానిమీద వేపాకు పరిచి తర్వాత గూన పెంకలు కప్పుతారు.పల్లెలో నివసించే జనాలు గూన పెంకలతో ఇల్లు కట్టుకునే వారు. పల్లెలో గూన పెంకల ఇల్లు కూడా చాలా చల్లగా ఉంటుంది.కాలం మారింది.ఇప్పుడు గూన పెంకల ఇండ్లు కట్టడం లేదు.పాత గూన ఇండ్లు సరైన మరమ్మతులు లేక కూలిపోతున్నాయి.పల్లెల్లో కుటుంబాలు పెరిగి పాత ఇండ్లను విడిచి రోడ్డుకు దగ్గరగా వెళ్లి స్లాబ్ బిల్డింగులు కట్టుతున్నారు.పాత పల్లెలు బీడు పడుతున్నాయి.పల్లెలో జనాలు రోడ్డు దిక్కు వచ్చి షాపులు సెట్టర్లతో ఇల్లు కట్టి ఉంటున్నారు.పల్లె వాతావరణం కనుమరుగు అవుతున్నాయి. కొన్నాళ్లకు గూన పెంకుల ఇండ్లు ఉండవు. “ఆ కళల వాకిట్లో గడెంచ పరుచుకొని ఒరుగుతే” “కాకులు కోయిలలు వూరవిష్కల పలకరింపులు” “దూరంగా గోడ సూరుకు ఉరుకుతున్న ఉడతల జోడి”. “ఊళ్లే మా ఇల్లు వాకిళ్ళ కమనీయ దృశ్య కావ్యం”. పల్లెలో జనాలు చెట్ల కింద ఒరిగితే కాకులు కోయిలల కుహు కుహు రావాలు,ఊరవిష్కల కితకితలు,ప్రతి ఇంట్లో జామ చెట్టు,ఆ జామ చెట్టు మీద ఉడతల జోడి కనబడుతుంది. ఉడతలు, రామచిలుకలు జామ పండ్లు తింటాయి. “ఊళ్లే మా ఇల్లు వాకిళ్ళ కమనీయ దృశ్య కావ్యం”. తెలంగాణలో ప్రతి పల్లెల్లో ఇల్లు ఎలా ఉంటుందో అరుగు అనే కవిత ద్వారా కవి దేవేందర్ చాలా చక్కగా గ్రామీణ వాతావరణాన్ని తెలియపరిచారు. పల్లెలో పుట్టి పెరిగిన దేవేందర్ పల్లెలోని మట్టి పరిమళాన్ని పల్లె సోయగాన్ని ఎంతో ఆకలింపు చేసుకొని ఇలాంటి వాస్తవిక కవితను రాశాడని తోస్తోంది.తెలంగాణ పల్లెల్లో పుట్టిన దేవేందర్ తెలంగాణ పల్లె సంస్కారాన్ని పుణికి పుచ్చుకొని తెలంగాణ పల్లె ఎలా ఉంటుందో అరుగు కవిత ద్వారా మనకు అందించారు.ఇప్పటికీ మన తెలంగాణ గ్రామాల్లో అరుగులు ఉన్నాయి.సబ్బండ వర్ణాల ప్రజలు తమ ముచ్చట్లు మురిపాలతో అరుగు మీద తేలిపోతుంటారు.అరుగు కవిత చదివితే మాభూమి సినిమా చూసినట్టుగా ఉంది. గ్రామీణ వాతావరణం మన కళ్ళకు కదలాడుతుంది. మా భూమి సినిమా తీసింది మన తెలంగాణకు చెందిన పల్లె బిడ్డ బి.నర్సింగరావు.తెలంగాణ పల్లె ముఖచిత్రంలో ఇప్పటికీ అరుగు నిలిచి ఉంది.పల్లె వర్తమానంలో కూడా అరుగు ఉంది.పల్లె భవిష్యత్తులో కూడా అరుగు ఉంటుంది.పల్లె వాకిట్ల చేద బావి దాని పొంటి జాలారి,పడారి గోడ పక్కనే పూల చెట్లు,పూబంతులు ముద్దబంతులతో కూడిన ఎన్నెన్నో పూల తోటలు కనిపిస్తాయి.పల్లెలో ఆ పూల వనాలు మన మనసుకు ఉల్లాసం కలిగిస్తాయి. పల్లెలో పండగలప్పుడు ప్రతి ఇంటి దర్వాజలకు బంతిపూల మాలలు కట్టి అలంకరిస్తారు.ప్రతి ఇంటికి మామిడి తోరణాలు కడతారు.దేవుని గదిలో బంతి పూల మాలలతో తమ ఇష్ట దైవాన్ని కొలుస్తారు. పల్లెల్లో ఎటు చూసినా పచ్చదనంతో చెట్టు చేమలతో ప్రకృతికి పర్యాయ పదంలా కళకళలాడుతుంటుంది. తెలంగాణలో పల్లెల్లో ప్రతి ఇంట అరుగు శోభించాలని మనమంతా కోరుకుందాం.పల్లె వాతావరణం తలపించేలా అరుగు కవితను రాసిన కవి దేవేందర్ ను అభినందిస్తున్నాను.కవి దేవేందర్ మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.
అన్నవరం దేవేందర్ భరోసా కవిత పై విశ్లేషణా వ్యాసం
ప్రముఖ కవి,రిటైర్డ్ సూపరింటెండెంట్,మండలం ప్రజా పరిషత్ కార్యాలయం,ముస్తాబాద్,జిల్లా సిరిసిల్ల,అన్నవరం దేవేందర్ కలం నుండి జాలువారిన ఇంటి దీపం కవితా సంపుటిలోని భరోసా కవిత పై విశ్లేషణా వ్యాసం.తెలంగాణ మాండలికంలో రాసిన భరోసా కవితను ఆసక్తితో చదివాను.నాకు నచ్చింది.నాలో ఆలోచనలు రేకెత్తించింది.భరోసా కవిత ఏమిటి? అని మనకు ఆశ్చర్యం కలిగించవచ్చు.ఇవ్వాళ సమాజంలో మనిషికి భరోసాను ఇచ్చేవారు అరుదుగా కనిపిస్తారు.హామీ ఇవ్వడం,స్థిరముగా చెప్పుట అనేవి భరోసాకు అర్థం.ఎవరి ఆందోళననైనా
తగ్గించడానికి ఉద్దేశించిన సలహా భరోసా.ఎవరైనా బాధలో ఉన్నప్పుడు అతనికి చెప్పు ఓదార్పు మాటలు భరోసా.నేను ఇది చేస్తానని ఖచ్చితంగా చెప్పడం భరోసా.కవి దేవేందర్ భరోసా కవిత చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారిద్దాం.అలౌకిక అనుభూతిని సొంతం చేసుకుందాం.
“ఎవుసం ఎటమటమైతేంది
“ఎట్లనన్నా బతుక రాదా
“సచ్చుడు ముచ్చట ఎందుకు సాయిలు నాయినా !
ఒక నిర్దిష్టమైన పద్ధతిలో మొక్కలను,జంతువులను పోషించి తద్వారా ఆహారాన్ని,మేతను,జనప నార, ఇంధనాన్ని ఉత్పత్తి చేయటాన్ని వ్యవసాయము లేదా కృషి అంటారు.వ్యవసాయం చరిత్ర మానవ చరిత్రలో అతి పెద్ద అంశం. ప్రపంచవ్యాప్త సామాజిక ఆర్థిక ప్రగతిలో వ్యవసాయాభివృద్ధి ఒక కీలకాంశంగా చెప్పవచ్చు.వెనుకటి కాలంలోనే ఎవుసం బాగుండేది.గప్పటి ఎవుసం వేరు.ఇప్పటి ఎవుసం వేరు.అప్పుడు ఇంటిల్లిపాది అందరూ కలిసి ఎవుసం పని చేసే వాళ్లు.ఈనాడు అప్పటి తీరుగా ఇంటిల్లిపాది అందరూ కలిసి ఎవుసం చేయుట లేదు.అప్పుడు అడవి జంతువుల బెడద లేకుండేది. కాలం మారింది.ఇప్పుడు అడవి జంతువుల బెడద ఉంది.కాలం కలిసి రాక వ్యవసాయంలో పంట దిగుబడి రావడం లేదు.కరువు కాటకాల వల్ల పంట దెబ్బతింది.వ్యవసాయంలో పంట రాలేదని ఎందుకు బాధ పడుతున్నావు.కాలం కలిసి రాకనే కదా పంట రాక పాయె.పంట దెబ్బతిందని నువ్వు ఇంత దిగులు ఎందుకు పడుతున్నవు.పంట లేక పోయినా ఎట్లనన్నా బతుక రాదా? అని ప్రశ్నిస్తున్నాడు. చనిపోవడం ముచ్చట ఎందుకు చెపుతున్నావు సాయిలు నాయినా అని అతను ఓదార్చుతున్నాడు. సాయిలు నాయిన ఎవుసం చేసే రైతు అని తోస్తోంది.రెక్కలు ముక్కలు చేసుకుని ఎవుసం చేసినప్పటికి పంట దిగుబడి లేక పోవడం వలననే దిగులు పడిన సాయిలు నాయినను ధైర్యం కలిగిస్తూ ఓదార్చుతున్నాడు.
“కలీగం మీద మనుషులందరు
“ఎవుసమే చేస్తండ్రా
“ ఎన్నో తీర్లుగ బతుకుతుండ్రు.
వేదాల ననుసరించి యుగాలు నాలుగు.1) సత్య యుగం 2) త్రేతా యుగం 3) ద్వాపర యుగం 4) కలి యుగం.ప్రస్తుతం నడుస్తున్న యుగం కలియుగం.కలి యుగంలో అన్యాయం,అధర్మం చెలరేగుతుంది. మంచి వాళ్లకు చెడు ఎదురవుతూ ఉంటుంది. కలియుగంలో నివసిస్తున్న మనుషులందరూ వ్యవసాయం వృత్తిగా చేసుకొని బతుకుతున్నారా? అని ప్రశ్నిస్తున్నాడు.ఈ దేశంలో నివసిస్తున్న మనుషులందరు వివిధ రకాల వృత్తులు చేపట్టి పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు.నీ లాగా ఒక్కటే వ్యవసాయం చేసి మనుషులు బతకడం లేదు.కోటి విద్యలు కూటి కొరకే అన్నారు. మనుషులు తమ బతుకు గడపడానికి ఎన్నో పనులను ఎన్నో తీర్లుగా చేస్తున్నారు అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“వో ఫసల్ లుక్సనా అయితది
,”మల్లో పంటకన్నా పచ్చగుండదా
“కాలం కర్మగాలి
“ఎవుసం ఎల్లెల్కల పడచ్చు
“భూమిల నీళ్లు పాతాళం పట్టచ్చు
‘ మొగులుకు కనికరం లేక పోవచ్చు
“ ఆవుసు తీసుకుంటవా ! అన్యాలం చేస్తవా !
ఫసల్ ఉర్దూ పదం.ఫసల్ అనగా పంట.వ్యవసాయం చేస్తున్న రైతుకు వాతావరణం అనుకూలించకపోతే పంటలు పండవు. వర్షాలు లేక కరువు ఏర్పడి ఒక పంట చేతికి రాకపోతే నష్టం వస్తుంది.అంత మాత్రానికే బెంబేలు పడకూడదు.మరుసటి సంవత్సరం వర్షాలు కురిసి పచ్చని పంట చేలతో కళకళలాడుతుంది అనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.
“కాలం కర్మగాలి
“ఎవుసం ఎల్లెల్కల పడచ్చు
గడియారం తెలిపేది కాలం.నిమిషాలు గంటల గురించి తెలిపేది కాలం.ఏదైనా పనిచేయుటకు ఇచ్చు సమయం కాలం.ఆగమన్న ఆగనిది కాలం. భూత వర్తమాన భవిష్యత్తులను కలిపి చెప్పబడేది కాలం.కర్మ అంటే సరియైన అర్థం పనిచేయడం. పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు చేసే ప్రతి పని కర్మయే.నిద్రించడం,శ్వాసించడం,ధ్యానించడం,తపస్సు,మౌనం, భుజించడం,ఉపవసించడం కర్మ. జీవించి ఉన్న ప్రాణి కర్మ చేయకుండా ఉండ లేడు. మనం నివసిస్తున్న వర్తమాన కాలంలో మనుషులు తాము చేస్తున్న కర్మల వల్ల ఫలితం అనుకూలంగా రాక నష్టపోవడం జరుగుతుంది.రైతు చేస్తున్న వ్యవసాయం ప్రకృతి మాత కరుణించకపోవడం వల్ల పంట రాకపోవడం జరుగుతుంది.ప్రకృతి మాత ప్రసాదించిన నీరు పాతాళానికి చేరి మనం చేస్తున్న వ్యవసాయ పంటకు నీరు అందకపోవడం వల్ల పంటలు ఎండి పోవచ్చు.వరుణ దేవుడు కరుణిస్తేనే ఆకాశం నుండి వర్షం కురుస్తుంది.ఆకాశం దయ చూపించకపోవడం వల్ల వర్షం పడక పోవచ్చు.అంత మాత్రాన ఏదో అయిందని ఎందుకు తొందర పడుతున్నావు అని ఓదారుస్తున్నాడు.పంట పండలేదని ప్రాణం తీసుకుంటవా? అన్యాయం చేస్తవా? అని ప్రశ్నిస్తున్నాడు.
“రాజస్థాన్ కరువు రైతులే
“మన తాన స్వీట్లు దుకాండ్లు నడుపుతుండ్రు.
రాజస్థాన్ ఎడారి ప్రాంతం.అక్కడ నివసించే కరువు రైతులు వ్యవసాయంలో రాబడి రాక మన తెలంగాణ రాష్ట్రంకు వచ్చి స్వీట్ల దుకాణాలు పెట్టి జీవనం కొనసాగిస్తున్నారు.రాజస్థాన్ వాళ్లు అక్కడ ఎల్లు మాను లేక ఇక్కడి ప్రాంతానికి వచ్చి పొట్ట పోసుకుంటున్నారు.రాజస్థాన్ వాళ్ళని చూడు అని చెబుతున్నాడు.
“నేపాల్ బక్క ఎవుసం చేసేటోల్లే
“సలి కాలం ఉన్ని దుస్తులు అమ్ముతుండ్రు.
నేపాల్ దేశం ప్రజలు అక్కడ వ్యవసాయం చేసి జీవనం సాగించేవారు.కానీ వాళ్ల దేశంలో బతుకు బండి సాగక మన దేశంకు వచ్చి చలి కాలంలో ఉన్ని దుస్తులు అమ్మి జీవనం కొనసాగిస్తున్నారు.పుట్టి పెరిగిన నేపాల్ దేశం విడిచి వచ్చి ఇక్కడ బతుకు గడుపుతుండ్రు అనేది వాస్తవమని చెప్ప వచ్చు.
“నాలుగు గీరెల బండి మీద
“కారీలు అమ్ముకుంట తిరిగేటాయన
“మన పక్కపొన్న మహారాష్ట్ర మనిషి.
పొద్దున లేవగానే మన గడప ముందుకు వచ్చి నాలుగు గీరెల బండి మీద కారీలు,తినే పదార్థాలు అమ్ముకుంటా తిరిగే ఆయన మన పక్క రాష్ట్రమైన మహారాష్ట్రకు చెందిన వాడు.అతను మహారాష్ట్ర ప్రాంతమును విడిచి పెట్టి బతుకు తెరువు కొరకు ఇక్కడికి వచ్చి భార్యా పిల్లలతో జీవనాన్ని కొనసాగిస్తున్నాడు.
“బతుకు తెరువు లేక
“సోలపురం భీవండి సూరత్ పోయినోల్లను
“ఎందరిని సూల్లేదు ఎన్కటి నుంచి.
మన ఊళ్లో బతుకు తెరువు లేక ఎంతో మంది అన్ని కులాల కుల వృత్తులు చేసుకునేటోళ్లకు ఇక్కడ మన ఊరిలో పని దొరకక సోలాపురం,భీవండి,సూరత్ వంటి ప్రాంతంకు వెళ్లి అక్కడనే పని చేసుకుంటూ భార్యా పిల్లలతో జీవనం కొనసాగిస్తున్నారు.మన ఊరుని విడిచి పెట్టి వేరే ప్రాంతంలో బతుకు గడుపుతున్నారు.
“అప్పులు కావచ్చు తిప్పల అవుతుండొచ్చు
“వూరు దాటి పోయన్న బతికి రావాలె
“ఉసూరుమంట పాణం తీసుకుంటె ఎట్లనే
“పోనీ సస్తే మాఫీ అయితయా నాయన.
మనిషన్న వాడికి ఎల్లు మాను లేక అప్పులు అయితయి.మనుషులకు కాకుంటే అప్పులు మానులకు అయితయా.అప్పులతోనే తిప్పలు అయితది.అప్పులు ఇచ్చిన అతడు అప్పు తీర్చమని వెంటపడి వేధిస్తాడు.అప్పులు ఉన్నయని ప్రాణం తీసుకుంటే ఎట్లా అని ప్రశ్నిస్తున్నాడు. అప్పులు తీర్చలేక నీవు చనిపోతే నీవు చేసిన అప్పులు మాఫీ అయితయా నాయనా అని ప్రశ్నిస్తున్నాడు.
“పుల్కు పుల్కున సూస్తున్న
“పొలగాండ్ల మొకమన్న సూడు
“ ఇంటామె నెత్తి నోరు కొట్టుక సస్తది
“ఇల్లంతా ఆగం పక్షి అయితది.
ప్రాణానికి ప్రాణంగా ఎంతో ప్రేమగా నీ వంక చూస్తున్న పిల్లల ముఖము ఒకసారి చూడు.ఒక్క సారి నీ పిల్లల మొఖం చూస్తే నీకు బాధగా అనిపించదా?నీతో పెన వేసుకున్న బంధమైన నీ భార్య,ఇంటామె నీవు లేకుంటే నెత్తి నోరు కొట్టుకుని గోడు గోడున ఏడ్చి చనిపోతది.నీవు లేకుండా నీ ఇల్లు,నీ కుటుంబం గూడు లేని పక్షిలా జీవితం అస్తవ్యస్తం అయితది.గూడు లేని పక్షిలా ఏడ్చి చావదా?అప్పులు చేసినోళ్లు అందరూ ప్రాణాలు తీసుకుంటున్నారా? అని ప్రశ్నిస్తున్నాడు.పెద్ద పెద్ద బడా బాబులు దేశాన్ని ముంచి కోట్లకు కోట్లు అప్పులు ఎగ్గొట్టి తిరుగుతున్నారు. కోట్లు అప్పులు చేసి అట్టి అప్పులు ఎగ్గొట్టి సుఖంగా బతుకుతున్నారు.అందులో నీవు చేసిన అప్పు ఏ పాటిది.చాలా చిన్నది.నీవు కష్టం చేసి మళ్లీ ఆ అప్పును తీర్చగలవు అని ఓదారుస్తున్నాడు.
“ఎవుసమే కాదు నాయినా
“ఎన్ని దందలైనా చెయ్యొచ్చు
“ఎద్దూ ఎవుసాన్ని కొన్ని రోజులన్నా
“బందుకు పెట్టు
“బతకనీకి బహు మార్గాలు
“వూరిడువు,ఇల్లిడువు,పల్లె ఇడువు
“కాల్రెక్కలున్నయ్ ఏన్నన్న చేస్క బతుకు
“లోకానికి ఇన్ని రోజులు అన్నం పెట్టినోనివి
“లోకం నీకు ఇప్పుడు అన్నం పెట్టదా !
వ్యవసాయం వృత్తిగా చేయడం కాదు.బతకడానికి ఎన్ని పనులైనా చేయవచ్చు.నీవు చేస్తున్న ఎద్దు ఎవుసాన్ని కొన్ని రోజులు చేయకుండా మాని వేయి అని సలహా ఇస్తున్నాడు.ఈ సమాజంలో బతకాలంటే లెక్కలేనన్ని మార్గాలు ఉన్నాయి.నీవు బతకడం కొరకు ఊరిని విడిచి వెళ్లి పోవచ్చు.నీవు బతకడం కొరకు ఇల్లును విడిచి పెట్టు.నీవు బతకడం కొరకు పల్లెను విడిచి పెట్టు.నీవు ఇప్పుడు పట్నంకు పోయి బతుకు.నీ కాళ్లు రెక్కలు చక్కగా పని చేస్తున్నాయి.ఎక్కడికన్నా పోయి ధైర్యంగా ఏదైనా పని చేసుకుని బతుకు.లోకానికి నీవు ఇన్ని రోజులు అన్నం పెట్టిన అన్నదాతవు.అట్లాంటి అన్నదాత అయిన నీకు లోకం ఇప్పుడు అన్నం పెట్టదా? అని ప్రశ్నిస్తున్నాడు.భరోసా కవిత ద్వారా సాయిలు నాయనకు జీవితం పట్ల ఆశ కలిగేటట్టు చేస్తున్నాడు.సమస్యలు ఉన్నాయని బాధపడ వద్దు. నీవు ఎక్కడైనా కష్టపడి పని చేస్తే నీ సమస్యలు ఇట్టే తొలగిపోతాయి.ఈ కవిత ఎన్నో ఉదాహరణలతో రైతు సాయిలుకు మనో ధైర్యాన్ని,భరోసాను కల్పించేదిగా తోస్తుంది.దేశంలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు భరోసా కవిత ద్వారా పరిష్కారాన్ని చూపిస్తున్న కవి దేవేందర్ ను అభినందిస్తున్నాను.కవి దేవేందర్ మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.