Home కథలు తమ్ముని పెళ్లి

తమ్ముని పెళ్లి

ఆనంద్‌ మా ప్రమీలకు పెద్దమ్మ కొడుకు. చిన్నప్పుడు మా ఆవిడ అతణ్ణి ఎత్తుకొని ఆడించేదట. అందుకేనేమో ఆనంద్‌ తన పెళ్లి అయిన తర్వాత కూడా మా ఇంటికి వచ్చేవాడు. మా పెళ్లి సమయంలో అతడు మా వూరికి వచ్చినట్లు జ్ఞాపకం ! ”బావా మీ ఇల్లు నాకు నచ్చలేదు. ఇంట్లో ఫ్యాన్లు లేవు. లైట్లు లేవు. ఇక్కడ నువ్వెట్లా చదువుకున్నావు బావా?” అని ప్రశ్నిస్తే, ”మాది వూరు కదా! పట్నంలోలాగా అవేవీ ఉండవు. ఐనా అన్నీ సజావుగానే జరుగుతాయి” అని సమాధానపరచడం నా వంతయ్యింది.

”అక్కా! ఎట్లుంటవు ఈ వూర్లో?” అని నా ముందరే ప్రమీలనడిగాడు. ఆమె నెమ్మదిగా ”బావ ఉద్యోగం హైదరాబాదులో కదా!” అని సమాధానపరిచింది. తానుండేది పట్నంలోనే కదా అని ఆమె ఆంతర్యం.

ఆనంద్‌ కు ఒక ఉపాధ్యాయురాలి కూతురుతో పెళ్లైంది. ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఏవో పొరపొచ్చాలు వచ్చి భార్య నుండి విడాకులు కూడా తీసుకున్నాడు. ఒంటరిగా ఉన్నాడు. ఒక జడ్జి గారి దగ్గర కారు డ్రైవరుగా పనిచేస్తున్నాడు.

అక్కమీది ప్రేమతో తరుచుగా వారాసిగూడాలోని ఇంటికి వస్తుండేవాడు. ప్రతి సంవత్సరం శబరిమలైకి వెళ్లి ప్రసాదం తెచ్చేవాడు. ఆ సంవత్సరం కూడా వెళ్లి వచ్చాడు.

”బావా! ఒంటరిగా ఉన్నాను. ఆ అయ్యప్ప కూడా కరుణ చూపడంలేదు. నాకు చెన్నప్ప బావే దిక్కు” అని కాళ్ల మీద పడ్డాడు. వాడి ఉద్దేశం అర్థమైంది. వాడికో పిల్లను చూసి పెళ్లి చేయాలని వాని కోరిక.

‘సరే చూద్దాంలే’ అని అప్పటికి తప్పించుకున్నాను.

ఒకరోజు మా ఇంటికి సమీపంలో ఉన్న రామాలయానికి వెళ్లి అప్పుడే వచ్చాను. ఆనంద్‌ ప్రత్యక్షమయ్యాడు. నాకు వెంటనే ఒక ఆలోచన మనస్సులో తళుక్కున మెరిసింది. రామాలయంలో నాకు తెలిసిన వాళ్లే అర్చన చేస్తున్నారు. కొండబత్తిని కుటుంబం అని మంచిపేరే ఉంది. హనుమంత రావుకున్న ఏడుగురు సంతానంలో చివరి ఐదుగురు ఆడపిల్లలే. ఒక అమ్మాయి పెళ్లి అయింది. రెండవ అమ్మాయిని సోలాపూర్‌ ఇస్తే ఏవో తగవులొచ్చి, ఇంటి పట్టుననే ఉంది. బి.ఏ. చదివింది. హెచ్‌.ఎమ్‌.టీ వాచ్‌ కంపెనీలో ఉద్యోగం. ఇంకా ముగ్గురి పెళ్లిళ్లు కావలసి ఉంది. రెండవ అమ్మాయి ఎంతో భారమైంది. హనుమంతరావు మా బస్తీలో పెద్దమనిషి. తరుచుగా మా ఇంటికి వచ్చి ప్రమీలతో మాట్లాడేవాడు. ప్రమీలకు వారి కుటుంబం గురించి బాగా తెలుసు.

హనుమంతరావు 2వ అమ్మాయిని ఆనందుకు ఇప్పిస్తే బాగుంటుందని నా ఆలోచన. ఏమనుకున్నా సరే అనుకొని ప్రమీలకు ఈ విషయం చెప్పాను లోగడ ఒకసారి.

ఆనంద్‌ ఆ సంవత్సరం శబరిమలైకి వెళ్లి మాకోసం ప్రసాదం తెచ్చాడు. నేను ఒకరోజు రామాలయం నుంచి వచ్చి రాగానే ప్రమీల హనుమంతరావు కుటుంబం అక్కడికి వచ్చిందా అని అడిగింది. వచ్చిందని చెప్పాను. వెంటనే ప్రమీల ఆ 2వ అమ్మాయి ఎట్లనిపించింది? అని నన్నడిగింది. ఫరవాలేదన్నాను. ప్రమీల ఒక్కక్షణం కూడా ఆలోచించకుండా ఆనంద్‌ తో ”మీ బావ నీకో అమ్మాయిని చూశాడు- రామాలయంలో. చూస్తే ఇప్పుడే పోయి చూడు” అని పురమాయించింది.

ఆనంద్‌ ఆనందంతో ఎగిరి గంతేశాడు. అక్కా బావలు చెప్పిన తర్వాత ఇంకా ఆగవలసిన పని లేదనుకొని అడ్రస్సు పట్టుకొని రామాలయానికి వెళ్లాడు. ”మా బావగారు పంపించారు నన్ను” అని హనుమంతరావుతో పరిచయమయ్యాడు. హనుమంతరావు తన పరివారాన్ని అతనికి పరిచయం చేశాడు. ఆ 2వ అమ్మాయిని గుర్తించాడు. అక్కడేమీ మాట్లాడకుండా, ప్రసాదం తీసుకొని మా ఇంటికి వచ్చాడు.

హఠాత్తుగా అక్క కాళ్ల మీదపడి ”ఆ అమ్మాయితో నా పెళ్లి నువ్వే చేయాలి. మా అన్న పెళ్లి కూడా నువ్వే చేశావు ఆలేరు నుంచి పిల్లను తెచ్చి” అని ప్రాధేయపడ్డాడు.

ఆనంద్‌ కు ఆరుగురు అన్నలు. పెళ్లి కావాలంటే అన్నలనందరిని ఒప్పించాలి. ఇరువైపుల మాట్లాడి సంబంధం కుదిరించాలి. పెళ్లి చేసుకోవడం సులభం కాని, పెళ్లి చేయడం కష్టం.

పెద్దమ్మ కొడుకైనా ఆనంద్‌ బాధ్యతను ప్రమీల తన భుజానికెత్తుకుంది. పెళ్లి కాని అమ్మాయితో ఆనంద్‌ పెళ్లి చెయ్యాలనే ఆలోచన అన్నలకు లేకపోలేదు. ఐనప్పటికీ ప్రమీల వారినందరినీ ఒప్పించింది. ”ఆనంద్‌ కు భార్యలేదు. హనుమంతరావు కూతురికి భర్తతో తెగదెంపులయ్యాయి. ఇద్దరూ సమానమే. న్యాయం ఇద్దరికీ సమానంగా వర్తిస్తుంది” అని తెలివిగా అందరిని తన వాదానికి అనుకూలంగా మార్చింది.

ఎట్లాగైతేనేమి ప్రమీల ముందుండి ఆనంద్‌ పెళ్లి చేసింది. ఇప్పుడానంద్‌ ఇద్దరు పిల్లల తండ్రి. ఒక బాబు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. అమ్మాయి డిగ్రీ చదువుతుంది. చిత్రమేమిటంటే హనుమంతరావు ముగ్గురు ఆడపిల్లలకు చకచకా పెళ్లిళ్లయిపోయాయి.

ఆనంద్‌ ఎప్పుడైనా కలిస్తే ప్రమీలను గుర్తు తెచ్చుకొని కన్నీళ్లు పెట్టుకుంటాడు. ”బావా! అక్క లేకపోతే నా పెళ్లి అయ్యేది కాదు” అనే మాటలు ఆనంద్‌ హృదయంలోంచి వచ్చినవిగా భావిస్తాను. ప్రమీలను గూర్చి నేను ”ఘటనా ఘటన ధురీణురాలు” అని సంతృప్తి చెందుతుంటాను.

——————-

You may also like

Leave a Comment