Home వ్యాసాలు పక్షుల విశేషాలు

‘చిట్టి చిలకమ్మా! అమ్మ కొట్టిందా’ అనీ, ‘బుర్రుపిట్ట బుర్రుపిట్ట తుర్రుమన్నది’ అనీ, ‘కాకీ కాకీ కడవల కాకి’ అనీ మనం చిన్నతనంలో పాటలు పాడుకుంటూ పెరిగాం. నెమలీకలు పుస్తకాల్లో పెట్టుకొని మేతపెట్టడం, తూనీగ రెక్కలకు దారాలు కట్టి ఆడడం బాల్యపు తీపి గురుతులు. తన పిల్లలను తినేస్తున్న పాము పని బట్టడానికి రాణిగారి గొలుసుతెచ్చి పాము పుట్టలో పడేసిన కాకి కథ, గాలి వానకు పిచ్చుక కట్టుకున్న పిడకలిల్లు పడిపోయిందని చెప్పే కథ, వేటగాళ్ళ ఉచ్చులో ఎన్నో పక్షులకు సంబంధించిన కథలు చదువుకుంటూ పెరిగాం. ‘పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్లు’, ‘ఎంగిలి చేత్తో కాకిని విసరడు’ వంటి సామెతలూ మన జీవితంలో భాగమే. ఇంటి ముందు వసారాలో పిచ్చుకల కోసం వరి కంకులు కట్టడం, ఇంటి చూరులో పిచ్చుకలు, పావురాలు పిల్లల కోసం గూళ్ళు కట్టుకుంటే వాటిని జాగ్రత్తగా చూడటం వంటివి మనకు పక్షులపై ఉన్న ప్రేమను తెలుపుతుంది. మన జీవితాలతో ఇంతగా మమేకమైన పక్షులు ఆధునిక ప్రపంచంలో అనేకానేక కారణాల వల్ల మనల్ని వీడి మాయమై పోతున్నాయి. పక్షుల గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం.
పక్షుల వర్గీకరణను మొదటగా ‘ఫ్రాన్సిస్ విల్లగ్టీ’ మరియు ‘జాన్ రే’ అనే శాస్త్రవేత్తలు చేపట్టారు. 1676వ సంవత్సరంలో ఈ శాస్త్రవేత్తలు ‘ఆర్వితోలాగే’ అనే పుస్తకంలో పక్షుల గురించి వివరించారు. ఈ తర్వాత వచ్చిన ‘కారల్ లిన్నేయస్’ అనే శాస్త్రవేత్త 1758వ సంవత్సరంలో పక్షుల వర్గీకరణను ఆధునీకరించాడు. ఈ పక్షులు సరీసృపాల వారసులు. సరీసృపాలకు పక్షులకు చాలా దగ్గరి పోలికలుంటాయి. శిలాజాల చరిత్రను గమనిస్తే అతిపెద్ద సరీసృపాలైన డైనోసార్లు ఆహారం దొరకక విలుప్తమైపోయాయి. పాకే జీవులైన సరీసృపాల నుంచి రెక్కలున్న పక్షులు ఏర్పడ్డాయని తెలుస్తోంది. క్రస్టేషియన్ యుగంలో మొట్టమొదటగా పక్షులు అవతరించాయని తెలుస్తున్నది. క్రస్టేషియస్ యుగమంటే దాదాపు వంద మిలియన్ల సంవత్సరాలకు పూర్వమన్న మాట.
పక్షులు ‘ఏవ్స్’ విభాగానికి చెందినవి. రెక్కలు ఉండడం, ఆకాశంలో ఎగరగలగడం ప్రధాన లక్షణాలు. ఇవి నాలుగు గదుల గుండెను కలిగి ఉంటాయి. పళ్ళులేని ముక్కులున్న దవడలు గలిగిన జంతువులు ఇంకా ఇవి ఎండోదెర్మిక్ వర్టిబ్రేట్స్. వీటికి చాలా తేలికైన శరీరం, బలమైన అస్థిపంజరం ఉంటాయి. ఇవి గట్టి పెంకు గలిగిన గుడ్లను పెడతాయి. జీర్ణవ్యవస్థ, శ్వాస వ్యవస్థ కూడా వీటిలో ఎగరడానికి అనుకూలంగా పరిణామం చెంది ఉన్నాయి. ముందున్న రెండు కాళ్ళూ రెక్కలుగా పరిణామం చెందటం వలన, రెక్కలకున్న ఈకల్లో గాలి గదులుండటం వలన ఇవి ఎగర గలుగుతున్నాయి. సరీసృపాల నుంచి పక్షులు ఏర్పడ్డాయని అనుకున్నాం కదా! ఇవి అంతా ఒక్క రోజులోనో ఒక్క సంవత్సరంలోనో జరగదు కదా! పరిసరాలు, పరిస్థితులను బట్టి కొన్ని అంగాలను కోల్పోవటం, కొత్తగా కొన్నింటిని ఏర్పాటు చేసుకోవటం జరుగుతుంది. సరీసృపాలకు, పక్షులకు మధ్య వారధిలా ‘ఆర్కియాప్టెరిక్స్’ అనే జంతువు ఉండేది. దీనికి సరీసృపాల లక్షణాలు, పక్షుల లక్షణాలు రెండూ ఉంటాయి. ఇది పూర్తిగా ఆకాశంలో ఎగరలేదు. పళ్ళున్న దవడలు, పొడవైన ఎముకలున్న తోకలు కలిగి ఉంటాయి. ఇది సరీసృపాల లక్షణం.
పక్షులు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించి ఉన్నాయి. సుమారు ఎనిమిది వేల జాతులన్నాయని తెలుస్తున్నది. వీటిలో 5 సెం.మీ పొడవున్న అతి చిన్న హమ్మింగ్ బర్డ్ నుంచి 9 ఫీట్ల పొడుగున్న అతి పెద్ద ఆస్ట్రిచ్ వరకు అన్ని రకాల పక్షులున్నాయి. కొన్ని పక్షులు చాలా తెలివి కలవి. అందులో చిలకలు, కొర్విడ్లు మొదలైనవి తెలివైన వాటికి ఉదాహరణగా నిలుస్తాయి. చాలా జాతుల పక్షులు సంవత్సరానికొకసారి చాలా చాలా దూరాలు వలస పోతుంటాయి. పక్షులు సంఘజీవులు. ఇవి సైగల ద్వారా, అరుపుల ద్వారా, పాటల ద్వారా తోటి పక్షులకు కావలసిన విషయాన్ని చేరవేస్తాయి. పక్షులు ఎంతో శ్రమకోర్చి పుల్లా పుడకా ఏరుకొచ్చి రకరకాల గూళ్ళను అల్లుకుంటాయి. అలా అల్లుకున్న గూళ్ళలో తమ పిల్లలను పెట్టుకుంటాయి. గుడ్లు పొదిగి పిల్లలైన తర్వాత చాలా జాగ్రత్తగా చూసుకుంటాయి పిల్ల పక్షుల్ని తల్లి పక్షులు. పక్షులు మనుష్యులతో కలసి బతుకుతాయి. మానవులకు ఆహారంగా ఉప యోగపడతాయి. వాటిని వేటాడే పిల్లులు, కుక్కల కన్నా పక్షులు మానవుల వల్లే ఎక్కువగా చనిపోతున్నాయి. 17వ శతాబ్దం నుంచి దాదాపు 120 నుండి 130 జాతుల పక్షులు అంతరించిపోయాయి. అంటే మానవుడు అభివృద్ధి బాట పట్టి నాగరికత వైపు అడుగులు వేస్తున్న సమయం నుండీ పక్షులు అంతరించి పోవటం మొదలయిందన్నమాట.
కొన్ని పక్షులు ఆర్థిక ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. కోడి, బాతు వంటి వాటి గుడ్లు, మాంసం మానవులకు ఆహారంగా ఉపయోగపడుతున్నాయి. అంతేకాక పక్షుల ఈకలు కూడా టోపీలు, ఆభరణాల తయారీలో ఉపయోగపడతాయి. చిలకలు, పావురాలు వంటి పక్షులు పెంపుడు జంతువులుగా మానవుడితో సహజీవనం చేస్తాయి. పక్షుల పెంటను పొలాలకు ఎరువుగా ఉపయోగిస్తారు.

You may also like

Leave a Comment