అది వేసవి కాలం, ఎండలు మండుతున్నవి. ఏ.సీ. గదుల్లో ఉన్నవారిక బయటికి వెళ్లాలంటే భయం. మా ఇంట్లో ఏ.సి ఉన్నా దాన్ని వాడం. చిన్నప్పటి నుంచి శీతోష్ణాలను సహించే శక్తి భగవంతుడు నాకే కాదు, నా అర్ధాంగి ప్రమీలకు ఇచ్చాడు.
మా ఇద్దరిదీ ఇకే మనస్తత్వం. చిన్న కుమారుని పెద్ద కూతురికి పుట్టు వెంట్రుకలు తీయిద్దామని తిరుపతికి బయలుదేరాం. రిజర్వేషన్ సౌకర్యం ఉండడం వల్ల రైళ్లో చక్కగా ప్రయాణం చేసి తిరుపతి చేరుకున్నాం. మాది ఎనిమిది మంది గ్రూప్. నేనూ, మా ప్రమీల, మా చిన్నక్క, చిన్న కుమారుడు ప్రణవ్, వాడి భార్య అఖిల, అమ్మాయి శ్రీవిష్ఠ, మా పెద్ద కుమారుడు క్రాంతి, ప్రణవ్ బావమరిది సుమన్.
అందరం దిగువ తిరుపతికి చేరుకున్న తర్వాత తిరుమలకు మా ప్రణవ్, అతని భార్య, బావమరిది క్రాంతి కుమార్ అందరూ కాలినడకన బయల్దేరారు. నేనూ ప్రమీల, మా అక్కగారు ముగ్గురం బస్సులో కొండ పైకి చేరుకున్నాం. కాలినడకన రావడం వల్ల వారికి దర్శనం సులభంగా లభించింది. కాని మా ముగ్గురం మూడువందల టికెట్ లైన్లో నిలబడ్డాం. లైన్ పెద్దగా ఉంది. లోపల కంపార్ట్ మెంట్లలోనూ జనం నిండుగా ఉన్నట్లు ఎవరో చెప్పగా విన్నాను. టికెట్టు తీసుకున్నా, తీసుకోకున్నా దైవ దర్శనం మర్నాడే జరుగుతుందని ఊహించాను ఆ స్థితిలో.
దైవదర్శనం కోసం వచ్చినప్పుడు అంతా దైవమే చూసుకోవాలి కదా! అందుకే దైవం మీద భారం వేసి కంపార్ట్ మెంట్ల వైపు నా భార్యతో, అక్కతో వెళ్లాను. గేటు దగ్గరున్న అతడు మమ్మల్ని చూసి ”మా మనుమరాలు, వాళ్ల తల్లిదండ్రులు కాలినడకన వచ్చి, దైవదర్శనానికి వచ్చారు. మమ్మల్ని లోపలికి పంపవా పుణ్యముంటది” అని ప్రమీల వినయంగా గేటు దగ్గరున్నవాణ్ణి అడిగింది. అంతే అతడేమనుకున్నాడో ఏమో మమ్మల్ని లోపలికి పంపించాడు. మేం బ్రతుకుజీవుడా అని లోపల పడ్డాం కాని, అప్పటికే జనం ఆ కంపార్ట్ మెంటులో నిండుగా ఉంది. నిలబడడానికి కూడా స్థలం లేదు. కూర్చోవడం దేవుడెరుగు. నాకు ఎక్కువగా నిలబడడం చేతగాదు. ప్రమీల, అక్కగారు ఇద్దరూ కష్టంగా నిలబడ్డారు.
ఆ కంపార్టుమెంటులో ఉన్నవాళ్ల చేతుల్లో టికెట్లున్నాయి. కొందరు బయటికి వెళ్లి రావడానికి పాసులు కూడా తీసుకున్నారు. మా దగ్గరవేం లేవు. మేం నేరుగా 10వ కంపార్టుమెంటులో ప్రవేవించాం. మమ్మల్ని ఎవరూ ఏమీ అడగలేదు. ప్రవేశించనైతే ప్రవేశించాం గాని, నిలబడడానికి చోటు లేదు. కంపార్టుమెంటు నుంచి కంపార్టుమెంటులోకి మారేటప్పుడప్పుడు గేటు ఇట్లా తీసారో లేదో జనం ఒకరి మీద ఒకరు పడిపోయారు. కొందరు ఊపిరాడక నిశ్చేష్టులయ్యారు. నాలో ఆందోళన పెరుగుతుంది. కూర్చోలేం. నిలబడలేం. ప్రక్కకు కదలలేం. ముందుకు నడవలేం. బయటకు కూడా వెళ్లే అవకాశం లేదు. ‘ఏమిట్రా ఈ దైవ దర్శనం? కాకుండే బాగుండేది” అనుకున్నాను నా మనస్సులో.
ప్రమీలకు చాలా ఇబ్బంది కల్గింది. చాలాసేపు నిలబడడం వల్ల కదలలేకపోయింది. నిజానికి ఆ జనం కదలనిస్తే కదా! గేటు తెరిచి తెరవకముందే వెనుకున్నవాళ్లు ముందున్న వాళ్లను నెట్టేస్తూ గేటు దాకా రావడానికి ప్రయత్నిస్తున్నారు. నేనెట్లాగో కదిలినా ప్రమీలకు, మా అక్కకకూ కదలలేని పరిస్థితి ఏర్పడింది. ఇంతలో ఒక విచిత్రం జరిగింది.
ఆశ్చర్యంగా ఇద్దరు యువకులు మా దగ్గరకు వచ్చి ”సార్ మీరేమి భయపడకండి. మేడం గారికి మేం రక్షణగా ఉంటాం. మీకు దర్శనం సులభంగా జరుగుతుంది” అని మాట్లాడేసరికి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లైంది.
”సార్ మీరు ఆచార్యులు గదా! మిమ్మల్ని టీవీలో చూశాం. అందుకే మిమ్మల్ని గుర్తు పట్టాం. మీరే వచ్చారా? ఇంకా ఎవరైనా ఉన్నారా?” అని అడిగారు ఆ యువకులు. మా పిల్లలు బహుశా ఇప్పటికే స్వామి దర్శనం చేసుకొని ఉంటారు. మేం ఇలా రావలసి వచ్చింది” అని వాళ్ల డౌట్ క్లియర్ చేశాను. నిజంగా వారిద్దరూ ప్రమీలకు అక్కకూ బాడీ గార్డ్స్ లాగా ఉండి దైవదర్శనం చేయించారు.
నాకాశ్చర్యం కల్గింది. వారు మమ్మల్ని మా పిల్లలు లోపల ఉండగానే మాతో కలిపారు. మేం మా పిల్లలతో కలిసిన మరుక్షణంలో వాళ్లు మాయమయ్యారు. వారికోసం అక్కడా ఇక్కడా ఎంత చూసినా కనిపించలేదు. ఇదొక అద్భుత సంఘటనగా నా స్మృతిలో నిలిచిపోయింది.
నా ప్రమీల గురించి గొప్పగా చెప్పవలసిన పనిలేదు గాని, ఇక్కడ కొన్ని మాటలు చెప్పక తప్పదు. మూడువందల రూపాయల టికెట్ తీసుకోకుండానే కంపార్టుమెంటులో ప్రవేశించడానికి ఆమే కారణమైంది. అట్లే ఆమె రక్షణకు ఇద్దరు యువకులు రావడం విశేషం. వారు మమ్మల్ని మా పిల్లలతో కలిపి మాయం కావడం చిత్రమనిపించింది.
ప్రమీల కొంచెం బొద్దుగా ఉన్నా, ఆమె దేహకాంతి ఎరుపు. ముఖం గుండ్రంగా ఉండి, కుంకుమ తిలకం దానికి మరింత అందాన్ని కల్గించేది. ఆమె చీరకట్టు, స్ఫురద్రూపం ఎవరినైనా ఆకర్షిస్తుంది. సాధుస్వభావుల్ని చేస్తుంది. మొదటినుంచి ఆమెతో నేనెక్కడికి వెళ్లినా నాకు గంటలో అయ్యే పని క్షణంలో అయ్యేది. ఆమెను చూసినవారు, నన్నదృష్టవంతునిగా వర్ణించేవారు. నా నలభై ఏండ్ల కాపురంలో నా సహధర్మచారిణిగా ప్రమీల మంచి మార్కులు సంపాదించింది. ఒక్క తిరుపతే కాదు, దేశంలోనూ, విదేశంలోనూ ఎక్కడికి వెళ్లినా ఆమె సహధర్మచారిత్వం ఆమెకు శ్రీరామరక్షగా ఉండిందని చెప్పక తప్పదు.