Home కథలు నువ్వొక్కడివే ఉంటావు

నువ్వొక్కడివే ఉంటావు

హైదరాబాదులో చదువంటే ఎంతో కష్టం. అద్దె ఇంట్లో ఉండి స్వయంగా వంట చేసుకోవాలి. నేనైతే పది రూపాయలు సంపాదించుకోవాలి. నా అవసరాలు తీర్చుకోవాలి. అద్దె ఇంట్లోను ఒకరిద్దరు మిత్రులతో కలిసుంటే నావంతు అద్దె కూడా తగ్గుతుంది.

ఏదేమైన సిటీలో డిగ్రీ పూర్తి అయ్యేవరుకు ఒక ఇరవై ఇండ్లైనా మార్చి ఉంటాను. ఇంటివారికి కోపం వచ్చినా, మనకు కోపం వచ్చినా ఇల్లు మారవలసిందే కదా!

బొగ్గులకుంట, హనుమాన్‌ టేక్డీ, నారాయణగూడా, గౌలిగూడా, హుస్సేన్‌ ఆలం, గౌపురం, షాలిబండా మొదలైన ప్రాంతాల్లో నీ విద్యార్థి థలో అద్దెకుండడం జరిగింది. వివాహం తర్వాత లాల్‌ దర్వాజలో కొంతకాలం ఉండి 1977లో వారాశిగూడాకు రావడం జరిగింది. అక్కడుండగానే బౌద్ధ నగర్‌ లో ఎనభై గజాల్లో చిన్న ఇల్లు నిర్మించుకొని అందులో ఇరవై ఐదేండ్లున్నాను.

ఇస్లామియా బాయిస్‌ హైస్కూలులో ఆరేండ్ల అధ్యాపక వృత్తికి ఫుల్‌ స్టాప్‌ పెట్టి ప్రగతి మహా విద్యాలయంలో లెక్చరర్‌ గా చేశాను. అక్కడ ఎనిమిదేండ్లు పనిచేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ప్రవేశించాను.

ప్రగతి మహావిద్యాలయం నుండి నిష్క్రమించినప్పుడు వచ్చిన పి.ఎఫ్‌. డబ్బుతో బోడుప్పల్‌ లో ఒక ప్లాటు తీసుకున్నాను.

పిల్లలు పెద్ద వాళ్లయ్యారు. కనుక ఇల్లు సరిపోక బోడుప్పల్‌ ప్లాట్‌ లో ఇల్లు కొత్తగా నిర్మించు కోవాలన్న కోరిక కల్గింది. తదనుగుణంగా లోన్‌ తీసుకొని ప్రమీల పేరుతో ఉన్న ప్లాటులో ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేశాను. ఐతే నా ఇద్దరు పిల్లలకు బోడుప్పల్‌ పల్లెటూరుగా కనిపించింది. అందుకే వాళ్ళు నాతో ”ఫ్యూచర్‌ లో అమ్మా, నీవు మాత్రమే ఇక్కడ ఉండవలసి వస్తుంది” అని పదే పదే చెప్పడం నాకు గుర్తుంది.

ఎట్లాగైతేనేమి ఇల్లు కట్టుకొని కొత్తగా నివసించడం మొదలుపెట్టిన తర్వాత పల్లె రూపంలో ఉన్న బోడుప్పల్‌ పట్నమైంది. ఎన్నో పెద్ద పెద్ద బిల్డింగులు, షాపింగ్‌ మాల్స్‌, సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌, స్కూళ్లు, కాలేజీలు వచ్చాయి. 2004 నాటికి 2022 నాటికీ కాలనీల రూపురేఖలే మారిపోయాయి.

నేను ఏది చేసినా ప్రమీలతో ఆలోచించి మాత్రమే చేస్తాను. బోడుప్పల్‌ లో ఇల్లు ఆమె పేరు మీదనే కట్టాను. విచిత్రమేమిటంటే మా ఉదయనగర్‌ కాలనీలో ఎవరి ఇంట్లోను బోర్లున్నా పని చేయవు. కాని ప్రమీలచే కొబ్బరికాయ కొట్టించిన పుణ్యవిశేషం కావచ్చు, మా ఇంట్లో ఇప్పటికీ దేవుని అనుగ్రహం వల్ల బోర్లో నీళ్లున్నాయి.

వారాశిగూడా నుండి బోడుప్పల్‌ కు వచ్చి అప్పటికి పదకొండు సంవత్సరాలవుతుంది. ఈ కాలంలో మగ పిల్లల పెళ్లిళ్లు చేశాం కట్నాలు ఏమీ తీసుకోకుండానే. ప్రమీలకు కట్నాలు తీసుకోవడమంటే ఇష్టం ఉండేది కాదు. పిల్లల కోరిక మేరకు ప్రమీల, నేను ఇద్దరమే బోడుప్పల్‌ ఇంట్లో మిగిలాం. కొత్తింట్లో మీరిద్దరే ఉంటారన్న పిల్లల మాట నిజమైంది.

తోడుగా ప్రమీల ఉందనే ధైర్యంతో, విశ్వవిద్యాలయానికి దూరంగా ఉన్నా క్రమం తప్పకుండా డ్యూటీ చేశాను. వేళకు ఇంటికి రావడం, భోజనం చేయడం విద్యార్థులు వస్తే మాట్లాడడం, బంధు మిత్రులకు ఆతిథ్యమివ్వడం – ఇవన్నీ సజావుగానే జరిగేవి.

మేం ఇద్దరం ఉల్లాసంగానే ఉండేవాళ్లం. ప్రమీల అనారోగ్యం అనే మాట ఎఱుగదు. ఆమెను ఎన్నడూ పిల్లలు పుట్టినప్పుడు తప్ప హాస్పిటల్స్‌ కు తీసుకొని పోలేదు. ఆమెనే ఇంటిపనులన్నీ చూసుకునేది. కాని అప్పుడప్పుడు నేనేమైనా అంటే బాధపడేది. ”నేను పోయిన తర్వాత నువ్వొక్కడవే ఈ ఇంట్లో ఉండవలసి వస్తుంది” అని హెచ్చరించేది. కని ఎన్నడూ ఆమె నాకంటే ముందుగా ఈలోకాన్ని విడుస్తుందని భావించలేదు.

ఇద్దరే ఉంటారని పిల్లలనడం, నువ్వొక్కడవే ఉంటావని ప్రమీల అనడం పదేపదే గుర్తుకు వస్తాయి. కాని కళ్ల నీళ్లు పెట్టుకోవడం తప్ప ఇప్పుడు నేనేమి చేయగలను?

——————–

You may also like

Leave a Comment