Home వ్యాసాలు తిరుమల తిరుపతి లోని 108 ముఖ్య తీర్థాలు : ముక్తి మార్గాలు

తిరుమల తిరుపతి లోని 108 ముఖ్య తీర్థాలు : ముక్తి మార్గాలు


భారత దేశం లోని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్నో పుణ్య క్షేత్రాలు ఉన్నాయి. దేనికది విశేషమైన చరిత్ర ను చెబుతున్నాయి. ఈస్ట్రెన్ ఘాట్స్ గా పేరున్న శేషాచలం కొండలు పచ్చని అడవులతో , పక్షి జాతుల తో జంతుసంతతితో అలరారుతున్నాయి. వీటినే తిరుమల గిరులు అంటారు.
తిరుమలగిరుల్లో 1008 తీర్థాలు ప్రధానమైనవి. ఈ తీర్థాల విశిష్టత ను తెలుసుకుందాం…
వీటిలో 108 జ్ఞానప్రదాతలుగా తెలియచేయబడినాయి.
తిరుమల తీర్థాలలో స్నానమాచరిస్తే వారికి ముక్తి కలుగు తుందని చెప్తారు. ఒక్కొక్క తీర్థానికి పేరు పెట్టబడింది.వాటిలో కొన్ని తీర్థాలను గురించి……

కుమార తీర్థం
కుమారస్వామి తారకాసురుడిని సంహరించడం వల్ల బ్రహ్మ హత్యా పాతకం చుట్టుకుంది. కుమారస్వామి బ్రహ్మ హత్యా దోష నివారణకు తగిన పరిహారం చెప్పమని మహేశ్వరుడిని ప్రార్ధించాడు. అప్పుడు శంకరుడు “నువ్వు భూలోకంలోని వేంకటాచల క్షేత్రానికి వెళ్ళు. ఆ ప్రదేశంలో ఉన్న పరమపవిత్రమైన తీర్థంలో నువ్వు ప్రతి రోజూ స్నానం చేసి ఆ పర్వతంపైన వెలసిన శ్రీవేంకటేశ్వర స్వామిని గురించి తపస్సు చేయి. ఆ స్వామి నీ దోషాన్ని తొలగిస్తాడు. అని చెప్పి కుమారస్వామిని భూలోకానికి పంపాడు.
జనకుడు ఆదేశించిన ప్రకారంగా చేసి తన దోషాన్ని నివృత్తి చేసుకున్నాడు కుమార స్వామి. తపస్సుకు ముందు ప్రతిరోజూ కుమారస్వామి ఆ తీర్థంలో స్నానమాచరించడం వల్ల ఆ తీర్థానికి కుమార తీర్థంగా పేరు వచ్చిందని తెలు స్తోంది. ఈ తీర్థంలో స్నానం చేసిన వారు నవయవ్వన వంతులుగా ఉంటారని పురాణ కథ ద్వారా తెలుస్తోంది.

పూర్వం ఒక పండు ముదుసలి ఈ తీర్థంలో స్నానం చేసి బయటకు రాగానే యువకుడిగా మారిపోయాడట. స్వామి వారి ఆలయానికి సుమారుగా ఏడు కిలో మీటర్ల దూరంలో వాయవ్య దిశలో ఈ తీర్థం ఉంది. మాఘ పూర్ణిమ, మఖ నక్షత్రంనాడు మధ్యాహ్న సమ యంలో ఈ తీర్థంలో స్నానం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు లభిస్తాయి.

తుంబుర తీర్థం
తుంబురుడు తన వీణను వాయిస్తూంటే ఆ వీణను చూసిన నారదుడు నీ వద్ద ఆ కొత్త వీణ ఎక్కడిది అని అడిగాడు. ఒక మహారాజును తాను కీర్తించగా ఆ రాజు ఈ వీణను తనకు బహుమతిగా ప్రసాదించాడని చెప్పాడు తుంబురుడు. దైవాన్ని స్తుతించవలసిన నోటితో మానవుని కీర్తించడమేమిటని ఆగ్రహించిన నారదుడు నువ్వు చేసిన ఈ పనికి దైవత్వాన్ని కోల్పోయి భూలోకం లోనే ఉందువుగాక అని తుంబురుని శపించాడు. నారదుని శాపఫలితంగా తుంబురుడు తిరుమలేశుని కొండ మీద ఘోణ తీర్థంలో భూమి మీద పడతాడు. ఘోణ తీర్ధంలో స్నానమాచరించి ఆ పర్వతం మీదే ఉండి, శ్రీవేంకటేశ్వరుని గురించి తపస్సు చేస్తాడు. అతని భక్తికి, దీక్షకు, ఏకాగ్రతకు మెచ్చిన ఆ స్వామి తన దేవేరితో సహా అతనికి దర్శన మిచ్చాడు. నారదుని శాపం నుంచి తుంబురునికి విముక్తి కలిగించాడు. తాను ఆ ప్రాంతాన తపమాచరించడం వల్ల ఆ తీర్ధం తన పేరు మీద తుంబురు తీర్ధంగా ప్రసిద్ధి చెందాలని తుంబురుడు స్వామిని కోరాడు. అప్పటి నుంచి స్వామి అంగీకారంతో ఘోణ తీర్ధం తుంబురు తీర్ధంగా పిలువబడుతూ ప్రాముఖ్యతను పొందింది. ఫాల్గుణ మాసం, ఉత్తర ఫల్గునీ నక్షత్రం పౌర్ణమి నాడు మధ్యాహ్న సమయంలో తుంబురు తీర్థంలో స్నానం చేసినట్లయితే వారి పాపాలన్నీ పటాపంచలవుతాయి. వారి కోరికలు నెరవేరుతాయి. ఈ తీర్థం శ్రీవేంకటేశ్వరస్వామి కోవెలకు సుమారుగా 14 కిలో మీటర్ల దూరంలో ఉంది.

ఆకాశగంగ తీర్ధం
ఈ తీర్థ ప్రాముఖ్యతను స్కాంధపురాణం తెలిపింది. అంజనాదేవి ఈ తీర్థంలో స్నానమాచరించి ఇక్కడ తపస్సు చేసి వాయుదేవుడు ప్రసాదించిన ఫలాన్ని తిన్న తర్వాత గర్భంధరించి, ఆంజనేయునికి జన్మనిచ్చిం దని పురాణం ద్వారా వివరిం చబడింది. ఈ కొండ మీద అంజనాదేవి తపస్సు చేయడంవల్ల ఆంజనేయునికి జన్మనివ్వడం వల్ల దీన్ని అంజనాద్రిగా పిలుస్తారు. ఆకాశగంగ తీర్థం గురించి ఒక కథ ఉంది. పూర్వం శ్రీశైలపూర్ణుడు పాపవినాశన తీర్థం నుండి స్వామివారికి అభిషేక జలాన్ని తెచ్చేవాడు. స్వామివారిపై అతనికున్న భక్తిశ్రద్ధలను గుర్తించిన తిరుమలేశుడు ధనుస్సు, బాణాలతో ఒక కిరాతకుని రూపం ధరించి శ్రీశైల పూర్ణుడు ప్రతిరోజూలాగానే పాపవినాశనం నుంచి పవిత్ర తీర్థజలం తెస్తూంటే అతనికి అడ్డు నిలిచి తనకు అమిత దాహంగా ఉందనీ, ఆ నీటితో తన దాహాన్ని తీర్చమనీ ప్రాధేయ పూర్వకంగా అడిగాడు. శ్రీశైలపూర్ణుడు ‘ఆ జలాన్ని పాపవినాశనం నుంచి స్వామి వారి అభిషేకా నికి తీసుకువెళ్తున్నాని, అది మానవుల కోసం కాదనీ, అతనికి నీరు ఇవ్వలేని తన నిస్సహాయతను తెలిపి ముందుకు అడుగులు వేశాడు. వెనుకనే వస్తున్న కిరాతకుని రూపంలో ఉన్న శ్రీనివాసుడు బాణం చేసి మట్టికుండకు రంధ్రం చేసీ, ఆ కుండలోని ఉదకాన్ని తాగేవాడు. ఆ ఘటం బరువు తగ్గడం గమనించిన శ్రీశైలపూర్ణుడు కుండకు రంధ్రం ఉండటం గమనించారు. “భగవంతునికి సమర్పించవలసిన జలాన్ని నువ్వు తాగేసి అపచారం వేశావు” అని బాధ పడుతున్న శ్రీశైలపూర్ణుడితో “దాహాన్ని తట్టుకోలేక ఆ పని చేశాను. అయినా నువ్వు విచారించవలసిన పని లేదు. ఇక్కడకు దగ్గరలోనే ఒక తీర్థం ఉంది. అందులోని జలాన్ని తీసువెళ్ళి స్వామివారి అభిషేకానికి సమర్పించవచ్చు” అన్నాడు. కిరాతకుడు.

కిరాతకుడి మాటలు విన్న అతను ఆ కిరాతకుని వెంట జలం తేవటానికి వెళ్లాడు. అతను శ్రీశైలపూర్ణుడిని ఆకాశతీర్థం వద్దకు తీసుకువెళ్ళాడు. అక్కడ తీర్థం లేకపోయేసరికి అతను ఒక గడ్డిపోచను తీసి బాణంగా చేసి కొండ మీదకు విసిరాడు. అక్కడ నీరు ఉబికి ధారగా క్రిందకు రాసాగింది. “ఇది ఆకాశగంగానదిలోంచి వచ్చే జలం. ఇక ఈ తీర్థాన్ని ఆకాశగంగా తీర్థం అని పిలుస్తారు. దీన్నే శ్రీవేంకటేశ్వర స్వామి అభిషేకానికి ప్రతి రోజూ తీసుకువెళ్ళు. ఇందులోని జలం ఎంతో పవిత్ర మైనదిగా భావించబడుతుంది” అని చెప్పి వెళ్ళిపోయాడా కిరాతకుడు. ఇక్కడ పితృకార్యాలు కూడా చేస్తారు. సూర్యుడు మేషరాశిలో ప్రవేశించినప్పుడు చిత్తా నక్షరంతో కూడిన పౌర్ణమినాడు ఈ తీర్థంలో మరికొన్ని తీర్థాలు వచ్చి చేరుతాయి. కనుక ఆ రోజున ఆకాశగంగ తీర్ధంలో స్నానం చేస్తే ఎంతో పుణ్యఫలం దక్కుతుంది. ఈ ఆకాశగంగ తీర్ధం తిరుమలేశుని ఆలయానికి సుమారుగా అయిదు కిలోమీటర్ల దురంలో ఉంటుంది.

పాండవతీర్థం

ఈ పాండవ తీర్థాన్ని గోగర్భ తీర్థం అని కూడా చెప్తారు. ఇది గోగర్భ డ్యామ్కు కిందగా ఉంటుంది. ఈ ప్రాంతంలోనే పాండవులు నివసించినట్లుగా తెలుస్తోంది. పాండవులు రాజ్యాన్ని వీడి ద్రౌపదితో కలిసి శ్రీకృష్ణుడి సలహా ప్రకారంగా ఈ క్షేత్ర తీర్థం వద్దకు వచ్చి ప్రతిరోజూ తీర్థంలో స్నానం ఆచరిస్తూ శ్రీవేంకటేశ్వరస్వామిని పూజించే వారు. ఇక్కడ వారు ఎంతో జ్ఞానాన్ని సంపాదించారు. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులను ఓడించి రాజ్యాన్ని దక్కించుకున్నారు. పాండవులు నివసించి స్నానమాచ రించిన తీర్థం, స్వామిని వారు కొలిచినందున ఈ తీర్థానికి పాండవ తీర్థం అనే పేరు ఏర్పడింది. ఈ గోగర్భజలం తిరుమలకు చేరుతోంది. వృషభమాసం, శుద్ధ ద్వాదశి ఆదివారంనాడు లేదా బహుళ ద్వాదశి మంగళవారం నాడు ఈ తీర్థపు జలంలో స్నానం చేస్తే పాపాలు తొలగి పోయి పుణ్యం లభిస్తుందని భక్తుల పరిపూర్ణ నమ్మకం. పాండవ తీర్థ సమీపంలో ఒక రాయి రెండు ముక్కలుగా విడిపోయింది. ఒక భాగం తీర్థ సమీపంలోనూ, రెండోది ఆలయంలోని ధ్వజస్తంభ మండపంలో ఉంది. ఈ గుండ్రాయిని దైవంగా భావిస్తూ మొక్కుకుంటే కలహాలు నివారించబడి అపార్థాలు, అశాంతి తొలగిపోతాయి. ఈ తీర్ధం శ్రీవారి ఆలయానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది.

      ఇక్కడ గంగాదేవి ఆంజనేయ స్వామి దేవాల యాలు ఉన్నాయి. పాపవినాశన తీర్థంలో స్నానం చేసిన భక్తులు ఆ ఆలయాలను దర్శిస్తారు. పేరుకు తగ్గట్టే ఈ తీర్థం పాపాలను హరిస్తుంది. ఆశ్వయుజ శుక్ల పక్షం, సప్తమి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రంతో కూడిన ఆదివారంనాడు. లేదా ఉత్తరాషాఢ నక్షత్రంతో కూడిన నాడు ఈ తీర్థానికి పర్వదినం. ఆ రోజుల్లో ఇతర తీర్థాలలోని జలం ఈ తీర్థంలోకి చేరుకుంటాయి. అందువల్ల ఆ పర్వదినాల్లో ఈ తీర్థంలో స్నానం చేయడం వల్ల అనారోగ్యాలు, మానసిక అశాంతి, వేదనలు తొలగిపోయి పుణ్యం లభి స్తుంది. ఈ పాపవినాశన తీర్థం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి గుడికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది.

శేష తీర్థం

ఈ తీర్థం లోయలో ఉంది. ఈ తీర్థానికి చేరు కోవడమన్నది సాహసోపేతమైన చర్య. ఈ క్షేత్రం ఆది శేషుని తలపిస్తుంది. పాచికాల్వ గంగమ్మ గుడి నుంచి బయలుదేరి ఆ మార్గానికి రెండు వైపులా కనిపించే లోయ లను పాచిమడుగు, అవ్వాచారి కోనలు, సున్నపురాతి కోనలు, పోలిగాడి శిలను దాటుకుని ఈ శేషతీర్థానికి చేరుకోవలసి ఉంటుంది. తిరుమలేశుని గుడికి రామకృష్ణతీర్థం దగ్గర గా ఉంటుంది.

రామకృష్ణుడనే ఋషి శేషాచలం పర్వతం మీద తపస్సు చేసాడు. ఆయన తను స్నానం చేయటానికి ఒక తీర్థాన్ని ఏర్పరచుకున్నాడు. శ్రీనివాసుడు ఆ మహర్షికి దర్శనమిచ్చి ఆయన నిర్మించిన తీర్థం ఆ ఋషి పేరుతో రామకృష్ణతీర్థంగా పిలువబడుతుందని వరమిచ్చాడు. స్వామి ఆ మహర్షిని కరుణించిన రోజు మకరమాసం, పుష్యమి నక్షత్రంతో కూడిన పౌర్ణమి నాడు ఈ తీర్థానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. ఆ రోజు దేవతలు దిక్పాలకులు వచ్చి ఈ తీర్థంలో స్నానం చేస్తారట. ఈ తీర్థం గురించి స్కాంధపురాణంలో తెలియజేయబడింది. ఆ రోజున ఈ తీర్థంలో స్నానం చేసిన భక్తుల నేరాలు, దోషాలు నివా రింపబడుతాయి. గురువులు, తల్లిదండ్రుల అభిమానాన్ని, అనుగ్రహాన్ని పొందుతారు. శ్రీవారి ఆలయానికి దాదాపుగా ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ తీర్థం.

జాబాలి తీర్థం
తిరుమల నుంచి ఆకాశగంగకు చేరుకునే మార్గంలో ఈ తీర్థం నెలకొని ఉంది. ఈ ప్రదేశంలో జాబాలి మహర్షి తపస్సు చేసిన కారణంగా ఈ తీర్థానికి ఆ పేరు వచ్చింది. హనుమంతుని పుట్టుక ఈ ప్రదేశం లోనే జరిగిందని స్థలపురాణ కథల ద్వారా తెలుస్తోంది. బాల్యంలో ఆంజనేయుడు ఇక్కడే ఉన్నట్లు, సూర్యని చూసి అది పండుగా భ్రమించి మింగబోవడం కూడా అక్కడే జరిగిందని స్థలపురాణం ద్వారా తెలుస్తోంది. రావణుని సంహరించిన రాముడు పత్నీ సమేతంగా అయోధ్యకు వెళ్లేటప్పుడు ఈ ప్రాంతానికే వచ్చినట్లుగా ఓ ప్రత్యేక కథనం. స్థల మహత్యాన్ని తెలుసుకున్న జాబాలి మహర్షి ఇక్కడ తపస్సు చేసినట్లుగానూ, అప్పుడు ఆంజనేయుడు స్వయంభువుగా వెలిశాడని స్థలపురాణం తెలియజేసింది. ఇక్కడ బాలాంజనేయస్వామి ఆలయ ఉంది. చైత్రపౌర్ణమి నాడు హనుమజ్జయంతి పర్వదినాన్ని ఇక్కడ జరుపుతారు. తిరుమలేశుని సన్నిధికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఈ తీర్ధం ఉంది. ఈ తీర్థాన్ని జాపాలి, జాడాలి అన్న పేర్లతో పిలుస్తారు. ఈ తీర్థంలో స్నానం చేస్తే ఆధ్యాత్మిక భక్తి భావనలు పెరుగుతాయి. భగవంతునికి భక్తి మార్గం ద్వారా చేరువై ఆయన అనుగ్రహన్ని పొందుతారని భక్తులు విశ్వాసం. గ్రహబాధలు, గాలి, ధూళి (దెయ్యాలు), భూతాలు) తొలగిపోతాయని చెప్తారు.

కపిల తీర్ధం

పూర్వం భగీరథుడనే చక్రవర్తి శివుని తపమాచ రించి ఆయనను ప్రసన్నుడిని చేసుకున్నాడు. గంగానదిని తెచ్చే ప్రయత్నంలో గంగానది పాతాళలోకానికి భోగవతి’ అన్న పేరుతో చేరుకుంది. ఆ నదీతీరంలోనే కపిల మహర్షి ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు. శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజాభిషేకాలను చిత్తశుద్ధితో భక్తిశ్రద్ధలతో చేస్తుండేవాడు. అయితే ఒక ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే పాతాళ లోకంలోని శివలింగం పెరుగుతూ భూమిని చీల్చుకుని పైకి వచ్చేసింది. ఆ లింగం మరింత పెరగకుండా బ్రహ్మ దేవుడు ధేనువు ఆకారం దాల్చి కాలిగిట్టలతో లింగాన్ని తొక్కి పెట్టినట్లు ఆ లింగం పైభాగాన ధేనువు గిట్టల గుర్తులు స్పష్టమవుతాయి. ఈ కపిలేశ్వర మహాలింగం దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది. భోగవతి గంగ కూడా శివలింగంతోపాటు పైకి ఉబికి వచ్చింది. దాన్నే కపిల తీర్ధంగా చెప్తారు. ఈ తీర్థప్రాంతంలో శ్రీకపిలేశ్వరస్వామి, దేవేరి కామాక్షితో కలిసి భక్తులకు తన దర్శనాన్ని ప్రసా దిస్తారు. ఇక్కడ ఉమాదేవితోనూ, స్కంధునితోనూ కలిసి ఒకే పీఠంలో ఉత్సవమూర్తి ఉండటంవల్ల ఆయనకు సోమాస్కంధమూర్తి అన్న పేరు ఏర్పడింది. ఈ కపిల తీర్థాన్ని గురించి అనేక కథలు ఉన్నాయి. వకుళమాత పద్మావతిదేవిని శ్రీనివాసునికి ఇచ్చి వివాహం చేయాల్సి ఉందిగా ఆమె తండ్రిని కోరాలని వెళ్తూ తన కోరిక నెరవేరాలన్న ధ్యేయంతో ఈ కపిల తీర్ధంలో స్నానం చేసిందట. అగ్నిదేవుడు ఈ ప్రాంతానికి వచ్చి శివలింగా నికి పూజాభిషేకాలు నిర్వర్తించడంతో ఇక్కడి శివలింగానికి ఆగ్నేయలింగం అన్న పేరు ఏర్పడినట్లుగా పురాణకథనం. ఈశ్వరుడు తాను వేంకటాచలంలో ఉంటానని విష్ణువును కోరాడు.

అప్పుడు విష్ణుమూర్తి వేంకటాచల పర్వతపు ఆగ్నేయమూలగా ఉండమని ఆదేశించారట. విష్ణుమూర్తి ఆదేశానుసారంగా కపిల తీర్థ సమీపాన శివుడు ఇక్కడ ఉండటం వల్ల ఆ లింగం ఆగ్నేయలింగంగా పేరు పొందింది. అలిపిరికి దిగువన ఉన్నది ఈ కపిల తీర్ధం. ఈ తీర్థం శ్రీవేంకటేశ్వరస్వామి పాదాల నుండి ఉద్భవించి తిరుమల కొండల మీదుగా ప్రవహించి తిరుపతికి చేరు కుంటుంది. అచ్యుత దేవరాయలు ఈ తీర్థం చుట్టూ నాలుగువైపులా నాలుగు సుదర్శన చక్రాల రాళ్ళను నాటి దానికి చక్ర తీర్థమని పేరు పెట్టారని చరిత్రాధారాలతో తెలుస్తోంది. దీన్నే సుదర్శన చక్రత్తాళ్వార్ తీర్ధం అని పిలుస్తున్నారు. శైవులు ఈ తీర్థాన్ని కపిల తీర్ధంగానూ, వైష్ణవులు ఆళ్వార్ తీర్ధంగానూ చెప్తారు. కపిలతీర్థంలో పితృకర్మలు, పిండ ప్రదానాలు, ఇతర దానాలు చేస్తే పితృదేవతలు తరిస్తారు. ఆశీర్వ దిస్తారు. కోనేటికి దక్షిణంవైపుగా శ్రీవేణుగోపాలస్వామి దేవేరులు రుక్మిణి, సత్యభామల సమేతంగా ఆలయంలో భక్తులకు తన దర్శనాన్ని ప్రసాదిస్తాడు. ఇక్కడ శ్రీలక్ష్మీ నారాయణుని ఆలయం కూడా ఉంది. కపిల తీర్ధంలో స్నానం చేస్తే ఏడుకొండలను ఎక్కి స్వామిని సునాయా సంగా అలసట లేకుండా దర్శించుకోగలమని భక్తుల నమ్మకం. ఈ తీర్థంలో స్నానం చేస్తే పాపాలు తొలగి పోయి పుణ్యం లభిస్తుంది. భగవంతుని అనుగ్రహం పొందుతారు. కోరికలు మొక్కులు తీరుతాయి.

శక్రతీర్థం:
కపిల తీర్థానికి పైభాగాన ఉంది శక్రతీర్థం. శక్రుడు అంటే ఇంద్రుడు. ఇంద్రుడు గౌతమి మహర్షి భార్యతో సంగమించిన పాపాన్ని తొలగించు కోవటానికి గాను ఈ తీర్థంలో స్నానమాచరించాడు. శక్రుడు నివసించిన ఈ తీర్థానికి చక్రతీర్థం అన్న పేరు ఏర్పడింది. ఈ తీర్థంలో స్నానం చేస్తే పాపాలు దోషాలు నివారింప బడుతాయని భక్తుల నమ్మకం.

విష్వక్సేన తీర్ధం
శక్రతీర్ధానికి సమీపంలో ఉంది ఈ తీర్థం. వరుణ దేవుని పుత్రుడయిన విష్వక్సేనుడు ఇక్కడ తపస్సు ఆచరించాడు. అతని భక్తికి ప్రసన్నుడై విష్ణుమూర్తి దర్శన మిచ్చాడు. అతనిని తన సేనాధిపతిగా నియమించి విష్వక్సేనునికి శంఖు, చక్రాయుధాలను ప్రసాదించాడు. ఆ తీర్థం వరుణుని కుమారుని పేరు మీద విష్వక్సేన తీర్ధం అన్న పేరు మీద ప్రసిద్ధి చెందింది.

పంచాయుధ తీర్థాలు
విష్ణుమూర్తి ఆయుధాలయిన శంఖం, చక్రం, గద, ఖడ్గం, ధనుస్సు వేరువేరు ప్రాంతాల్లో శ్రీమహా విష్ణువును గురించి తపస్సు చేశాయి. వాటి తపస్సుకు మెచ్చిన శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమై వాటిని అనుగ్ర హించాడు. అవి తపస్సు చేసిన స్థలాలే వాటి పేర్లతో తీర్థాలుగా ఏర్పడ్డాయి. శంఖతీర్థం, చక్రతీర్థం, గదాతీర్థం, నందక తీర్ధం, ధనుస్తీర్థంగా ఆ తీర్థాలు పిలువబడ్డాయి. ఈ పంచాయుధ తీర్థాలలో స్నానం చేసిన భక్తులకు శత్రుభయం ఉండదు. పాపాలు తొలిగిపోతాయి.

అసల తీర్థం
పూర్వం అగ్నిదేవుడు ఉదరంలో నొప్పితో బాధ పడసాగాడు. తన అనారోగ్యాన్ని పోగొట్టుకోటానికి ఈ తీర్థంలో స్నానం చేశాడు. అప్పుడు ఆయన బాధ తొలగి పోయింది. అందువల్ల ఈ తీర్థాన్ని అనల తీర్థమనీ, అగ్ని తీర్థమనీ అంటారు. ఈ తీర్థంలో స్నానం చేసే వారికి ఆరోగ్యం పెంపొందుతుందని చెప్తారు. అనారోగ్యాలు తొలగిపోతాయి.

సనకసనందుల తీర్థం
బ్రహ్మ మానస పుత్రులు సనకసనందులు. వీరిద్దరే కాక ఎందరో మహర్షులు పరమేశ్వరుని గురించి ఈ ప్రాంతంలో తపస్సు చేశారు. ఇక్కడ వారు పరమేశ్వరుని అనుగ్రహం పొందటంతో ఈ తీర్థానికి సనకసనందుల మహర్షుల పేరు వచ్చింది. ఈ తీర్థం పాపవినాశనం డ్యామ్కు ఒక కిలోమీటర్ దూరంలో ఉంది.

బ్రహ్మతీర్థం
అగ్ని తీర్థానికి ఎగువగా ఉంటుంది బ్రహ్మతీర్థం. ఇక్కడ బ్రహ్మదేవుడు నారాయణుని గురించి తపస్సు చేశాడు. శ్రీహరి బ్రహ్మదేవునికి ప్రత్యక్షమై ఆయన కోరిక ప్రకారంగా సృష్టి కార్యానికి ఎటువంటి అడ్డంకులు రాకుండా నిరాటంకంగా కొనసాగేటట్లుగా వరం పొంది నట్లుగా తెలియచేయబడింది. బ్రహ్మదేవుడు తపమాచ రించిన కారణంగా దీనికి బ్రహ్మతీర్ధమనే పేరు కలిగింది. ఈ తీర్థంలో స్నానం చేసిన భక్తులకు బ్రహ్మహత్యాపాతకం, ఇతర దోషాలు తొలగిపోతాయి.

త్రిమూర్తి తీర్థాలు
కపిల తీర్థానికి వాయువ్య దిశలో పెద్ద గూళ్ళల్లాగా మూడు దొన్నెలు ఉంటాయి. వాటి ద్వారా నీరు ప్రవహిస్తూ ఆ జలం కపిలతీర్ధంలో కలుస్తుంది. ఆ మూడు దొన్నెలను త్రిమూర్తులుగా భావిస్తూ వాటిని బ్రహ్మ గుండం, విష్ణుగుండం, మహేశ్వర గుండంగా పిలుస్తారు. మూడు దొన్నెలు ఒకే చోట ఉండడంతో ఈ తీర్థానికి త్రిమూర్తుల తీర్థాలు అనే పేరు ఏర్పడింది. కపిలేశ్వరుని అభిషేకించటానికి మహేశ్వర గుండంలోని నీటిని ఉపయోగిస్తారు.

అస్థి తీర్ధం
పూర్వం కృష్ణ శర్మ అనే బ్రాహ్మణుడు తన తండ్రి అస్థికలను తీసుకుని గర్భవతి అయిన తన పత్ని, కుమారు నితో కాశీ పట్టణానికి బయలుదేరాడు. గంగానదిలో స్నానం చేసి తండ్రి అస్థికలను ఆ పుణ్యనదిలో కలిపి పితృకార్యం నిర్విఘ్నంగా నెరవేర్చాలనుకున్నాడు. అతను తొండమాన్ రాజును దర్శించాడు. “మహారాజా! నా భార్య గర్భవతి. నా కుమారుడు చిన్నవాడు అవడం వల్ల వీరు ప్రయాణించడం దుర్భరమవుతుంది. వీరిని వెంట పెట్టుకుని కాశీకి వెళ్ళలేను. అందువల్ల నా భార్యను, పుత్రుడిని మీ వద్ద ఉంచి నేను కాశీకి వెళ్ళి పితృకార్యాలను నిర్విఘ్నంగా నిర్వహించి వస్తాను అంతవరకూ దయ ఉంచి మీరు వారి పోషణ, రక్షణ బాధ్యతలను స్వీకరించ మని ప్రాధేయపడుతున్నాను” అని వేడుకున్నాడు కృష్ణశర్మ, అందుకు తొండమానుడు అంగీకరించి ఆ బ్రాహ్మణుని ఇల్లాలిని, కొడుకును ఒక గృహంలో ఉంచి వారికి ఆరు నెలలకు సరిపడే పచారీ సామానులను వస్తుసామగ్రిని అమర్చాడు. వారిని బయటకు రావద్దని చెప్పాడు. ఆ రాజు రాచకార్యాలతో నిమగ్నుడై బ్రాహ్మణుని భార్య, పుత్రుని విషయాన్ని విస్మరించేశాడు. కృష్ణశర్మ కాశీకి చేరుకుని తన జనకుని అస్థికలను కాశీలోని గంగానదిలో కలిపి గయకు వెళ్ళి శ్రాద్ధము పెట్టి పితృ కార్యాలను నిర్వర్తించాడు. పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ రెండు సంవత్సరాలకు తిరిగి వచ్చాడు. ఆ బ్రాహ్మణుని చూడగానే తొండమాన్ రాజుకు అతని భార్య, పుత్రుడు గుర్తుకు వచ్చారు. కృష్ణశర్మతో అతని భార్య బిడ్డలు క్షేమంగానే ఉన్నారని చెప్పాడు. కానీ అతని భార్యాబిడ్డలు మరణించి ఆ గృహంలో వారి అస్థికలు మాత్రమే మిగిలాయి. రాజు ఎంతో దుఃఖితుడయ్యాడు. వారు ఆకలిదప్పులతో మర ణించి ఉంటారని, తాను మహాపాపినని ఎంతో వ్యధతో చిత్తక్షోభను అనుభవించాడు. అతని మానసిక బాధను గుర్తించిన శ్రీవేంకటేశ్వరస్వామి “వారి అస్థికలను తీర్ధంలో ముంచమని” ఆదేశించాడు. స్వామి ఆదేశానుసారంగా ఆలయానికి తూర్పు దిశన ఉన్న తీర్థంలో అస్థికలను ముంచాడు. ఆశ్చర్యంగా ఆ అస్థికలు మాయమై కృష్ణశర్మ భార్య, పుత్రుడు సజీవులయ్యారు. అందువల్ల ఆ సరోవరానికి ఆ తీర్ధమనే పేరు వచ్చింది. శారీ కలియుగంలో ఆ తీర్థం కనుమరుగైంది. నేడు ఆ అస్థితీర్థం కనిపించలేదు.

*స్వామి పుష్కరిణీ తీర్ధం
ఈ తీర్థం శేషపర్వతం మీద ఉంటుంది. ఇది స్వామి వారి ఆలయానికి ఈశాన్నిదేశగా ఉంటుంది. స్వామి ఉండే ప్రదేశంలో నెలకొని ఉండడం పట్ల దీనికి స్వామి పుష్కరిణీ తీర్ధం అనే పేరు వచ్చింది. తిరుసులలోని స్వామి పుష్కరిణీ తీర్ధంలో పవిత్రంగా శక్తి భారంతో స్నానం చేస్తే సర్వతీర్థాలలో స్నానం చేసినంత ఫలితం లభిస్తుందని బ్రహ్మ తెలిపినట్లుగా నామన పురాణంలో లిఖించబడింది. శ్రీవేంకటేశ్వర స్వామి తన దేవేరులైన శ్రీదేవి, భూదేవితో కలిసి ఈ పుష్కరిణిలో ఎలకాలాకు తాడని చెప్పబడింది. మార్గశిర శుక్ల పక్షంలో ద్వాదశి తిథినాడు ఉదయం సమయంలో ఇక్కడ పర్వోత్సవం జరుపబడుతుంది. ఈ పుష్కరిణికి ఉత్తర దిశగా వరాహ స్వామి కొలువై ఉంటాడు. ఆ ఆలయపు ముందుభాగాన్ని ‘వరాహ పుష్కరిణి’గా చెప్తారు.

కాయరసాయన తీర్థం
తెల్లని ఆకును ఈ తీర్థంలో వేస్తే అది నీలి రంగులోకి మారిపోతుందని చెప్తారు. ఈ తీర్థంలో స్నానం చేసే వారికి మునులు, యోగులు తమ దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తారని ఆనాటి పెద్దలు విశ్వసించేవారు. ఈ తీర్థం స్వామి దేవాలయానికి సుమారుగా మూడున్నర మైళ్ళు. దూరంలో ఉంటుంది. సనకసనందన తీర్ధం నుంచి అది పాయగా చీలుతుంది. ఇందులో స్నానమాచరిస్తే మానసి శక్తి, దేహారోగ్యం పెరుగుతాయని భక్తుల పరిపూర్ణ నమ్మకం.

You may also like

5 comments

Emmett930 July 28, 2025 - 6:30 am Reply
Harry1160 July 28, 2025 - 2:43 pm Reply
Matthias3943 July 28, 2025 - 11:31 pm Reply
Hugo3845 July 29, 2025 - 2:51 am Reply
Gabriela614 July 29, 2025 - 10:43 am Reply

Leave a Comment