తాటి కొండాల నరసింహారావు గారితో మయూఖ ప్రతినిధి రంగరాజు జరిపిన ముఖాముఖి
సమాజాన్ని రంగస్థలం మీద మలచిన వ్యక్తి…వ్యక్తి కాదు ప్రవాహం…. రంగస్థలం; పుస్తకాల రచన… పత్రికా సంపాదకత్వం… అన్నీ కలిసిన విశిష్ఠమైన బహుముఖీన ప్రజ్ఞాశాలులు…వారెవరో కాదు! గౌరవనీయ శ్రీ తాటికొండాల నరసింహారావు గారు… వారితో ముచ్చటించి ఎన్నెన్నో విషయాలు తెలుసుకుందాం! ఇంకా ఆలస్యం ఎందుకు? సాదరంగా ఆహ్వానిస్తున్నాను.
నాపేరు రంగరాజు పద్మజ. నాకు కూడా నాటక రంగమంటే అంతులేని మక్కువ… బాల్యంలో పాఠశాల వార్షికోత్సవ సందర్భంగానూ, సెల్ఫ్ గవర్నమెంట్ డే సందర్భంగాను నాటకం వేసి, ఆనందించిన నేను ఈరోజు గొప్ప రంగస్థల కళాకారులతో సంభాషించడం ఎంతో సంతోషంగా ఉంది…. పరిచయమే అక్కరలేని బహుముఖ ప్రజ్ఞాశాలులైన తాటికొండాల నర్సింహారావుగారిని మన మయూఖ పత్రిక పక్షాన వారిని పరిచయం చేసుకుందాము….
రంగరాజు పద్మజ:– నమస్కారమండీ !
తాటికొండాల నర్సింహారావుగారు:– నమస్కారమమ్మా!

పద్మజ : వ్యక్తిత్వం… ప్రస్థానంగా మీ జీవిత ప్రయాణం నిర్వచిస్తారా?
నర్సింహారావు:– నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కృష్ణాజిల్లాలో 1943లో జన్మించాను. కొద్ది కాలం అక్కడ ఉన్న తర్వాత, నా చదువు సజావుగా సాగలేదు! ప్రాథమిక విద్యాభ్యాసం మాత్రం మా ఊర్లో నాలుగవ తరగతి వరకు చదివాను. తర్వాత మా మేనత్త గారి ఊరు నెమలి అనే గ్రామంలో తిరువూరు తాలూకాలో ఉంది, అక్కడకు వెళ్లి పంచ కావ్యాలు, అమర కోశం మా మేనత్త మరిదిగారు నాకు నేర్పించారు. సంస్కృతం చదువుకొని ఎంట్రన్స్ పాస్ అయ్యాను. వాళ్లే ఒక ఉత్తరం రాసిచ్చారు హైదరాబాదులోని ఆల్వాల్ లో వేదాంతవర్ధిని కళాశాల సంస్కృత కాలేజీ ఉన్నది. అక్కడికి వెళితే నన్ను కాలేజీలో చేర్చుకున్నారు. అప్పుడు నాకు శ్రీ రవ్వ శ్రీహరి గారు మొదలైన వారు నా సహాధ్యాయులు…
BOL చదివాను. తరువాత మా నాన్న గారు ఏం చేసారంటే సంస్కృతం వద్దురా ! అంటే మళ్ళీ సంస్కృతంలోనే చదువుతున్నావని… కేకలేసి తీసుకొని వెళ్లి SGBT (ఎస్జీబీటీ) లో చేర్పించారు. అక్కడ పరీక్షలు ఏమీ లేవు. విద్యార్థులకు స్టైఫండ్ ఇచ్చేవారు. నెలకు 35 రూపాయలు వాటితోనే నా ఖర్చులు చేసుకునే వాడిని. యాజమాన్యం నా చేత ఒక బాండ్ రాయించుకున్నారు. నేను నాలుగు సంవత్సరాలు ఉపాధ్యాయుడుగా ఉద్యోగం చేస్తాను అని, మధ్యలో ఎక్కడికి వెళ్ళను… అని అలా బాండ్ రాసిస్తేనే నాకు ట్రైనింగ్ ఇచ్చారు. దాని ప్రకారం హై స్కూల్ ప్రైమరీ టీచర్ గా ఉద్యోగంలో చేరాను. జగ్గయ్యపేట ముక్త్యాలరాజా గారి ఆస్థానం లో చేరాను. ఆయన కృష్ణాజిల్లా బోర్డు సెలక్షన్ కమిటీ మెంబర్… తన దగ్గర నన్ను వేయించుకున్నారు. రెండు సంవత్సరాల అక్కడ పని చేశాను.
ఆయనకు నాకు అభిప్రాయ భేదాలు వచ్చాయి. ముక్కు సూటిగా వెళ్లే వ్యక్తిత్వం నాది! ఆయనతో తేడా వచ్చి ఉద్యోగానికి రాజీనామా చేసి బయటకు వచ్చాను. మా నాన్నగారు అదేమిటి అంత పెద్ద రాజా గారి దగ్గర ఉద్యోగం వదిలి రావడం ఏమిటని? కేకలేశారు. ఇప్పుడు నీకు ఉద్యోగం ఎవరిస్తాడని మందలించారు. బాధపడ్డారు.
“నాకు భయపడాల్సిన అవసరం లేదు! నాన్నా! అన్నాను. అప్పుడు మా స్నేహితుడు ఖమ్మంలో జిల్లా పరిషత్తులో పనిచేసేవాడు. ఆయన ఇప్పిస్తానన్నాడు. ఖమ్మం వెళ్ళాను. అక్కడ జలగం కొండలరావు జిల్లా పరిషత్తు చైర్మన్ ఆయన దగ్గరకు పోయాను. నా స్నేహితుడు పరిచయం చేసి ఉద్యోగం కావాలి అన్నాడు… అంటే ఆయన ఏమన్నాడంటే సంస్కృతం చదివావు- ఎస్జి బి టి చదివావు… ఎస్జీబీటీ ఉద్యోగాలు ఇక్కడ లేవు! సంస్కృతం పాఠశాలలు లేవు… నీకు ఉద్యోగం ఎలా ఇవ్వాలి? అని అన్నాడు. మా స్నేహితుడు ఎలాగైనా ఇవ్వండి సార్! అని బతిమిలాడాడు. అక్కడ సూర్యనారాయణ గారని సెక్షన్ హెడ్ ఉండేవారు. ఆయన కాస్త చొరవ చేసుకొని” ఏదో ఒకటి ఇవ్వండి! తాత్కాలికంగా ఆ పని చేస్తాడు. ఎక్వైర్ చేసుకోమని చెప్పండి!” అని అన్నాడు. అప్పుడు ఏం చేశారంటే సబ్జెక్టు కండిషన్ తెలుగు విశారద- తెలుగు డివోఎల్- ఏదేని చదవాలని కండిషన్ పెట్టి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చాడు. నేను జాయిన్ కావడానికి వెళ్ళి రాజేశ్వరపురంలో జాయిన్ అయ్యాను. నాకు తెలియని విషయం ఏమిటంటే ఇక్కడ నైజాం రాష్ట్రంలో ఉద్యోగం చేయాలంటే ముల్కీ సర్టిఫికెట్ కావాలి! ముల్కీ అంటే ఈ ప్రాంతంలో పుట్టినట్టు సర్టిఫికెట్ ఉండాలి. మరి నా దగ్గర లేదు! నెలకాగానే అందరికీ జీతాలు ఇచ్చారు. నాకు ఇవ్వలేదు!
హెడ్మాస్టర్ గారితో అదేమిటి సార్ నేను పని చేశాను కదా? అన్నాను.
నీకు తెలిసే మాట్లాడుతున్నావో తెలియక మాట్లాడుతున్నావో నాకు తెలియదు. నువ్వు ముల్కీ సర్టిఫికెట్ దాఖలు చేస్తేనే నీకు జీతం వస్తుంది అన్నాడు లేకపోతే రాదు! అన్నాడు. ఎవరు ఇస్తారని అడిగాను.
“సర్పంచ్ ఇప్పిస్తాడు” అన్నాడు. ఇంతలో పరీక్షలు జరిగే సమయం వచ్చింది, తరువాత సెలవులు వచ్చాయి. నన్ను ఉద్యోగం నుండి తొలగించారు. ఇంటికి వెళ్ళిపోయాను. సెలవులు అయిపోయి పాఠశాల తెరవగానే మళ్ళీ వచ్చాను. అప్పుడు ఆయనొక ఉద్యోగం ఇప్పించాడు. ఈ మధ్యన ఏమైందంటే సెలవుల్లో ఊరికే కూర్చోకుండా ఒక ఫిలిం రిప్రెసెంటేటివ్ గా పని చేశాను. అప్పుడు ఫిలిం రీల్స్ తీసుకొని సెంటర్ కి వెళ్ళాలి, ఎక్కడ రిలీజ్ అయితే అక్కడకి… అక్కడ కలెక్షన్ చూసుకొని తీసుకుని ఉదయమే వెళ్లి డిస్ట్రిబ్యూటర్ ఆఫీసుకు పంపించాలి. అలా కొన్ని రోజులు పని చేశాను. కేవీ రెడ్డి గారితో పరిచయమైంది. కేవీ రెడ్డి గారు సినిమా కథా చర్చలు చేసేవారు. నా చేతిరాత బాగుంటుందని నువ్వు ఇక్కడే ఉండవయ్యా! అని నీకు రెప్రెజెంట్ వద్దు! ఏమీ వద్దు! మేము చెబుతున్నట్టు నువ్వు రాసేయమని ఆయన తన దగ్గర పెట్టుకున్నారు. అప్పుడు జగదేక వీరుడు కథ చర్చ జరుగుతున్నది. కొన్ని రోజులు స్టోరీ డిపార్ట్మెంట్ లో ఉన్నాను. అప్పటికే నాకు పెళ్లయింది, ఒక అబ్బాయి పుట్టాడు. నేను అక్కడ- నా భార్య ఇక్కడ! కుదరడం లేదు! ఈ డబ్బులు ఉంటాయో? ఉండవో? సంసారం గడవాలి కదా! ఇది స్థిరమైన ఉద్యోగం కాదని, మానేసి మళ్ళీ ఖమ్మం వచ్చాను.
ఇక వచ్చావు కదా రెగ్యులర్ జాబు నీకు ఇప్పిస్తా అన్నారు సత్యనారాయణ గారు. 1968 లో అంటే నాకు 25వ ఏట ఉద్యోగంలో గ్రేడ్ సెకండ్ తెలుగు పండిట్ గా చేరాను. జీతం 70-100 స్కేలు. తర్వాత దూరవిద్యలో తెలుగు ఎమ్ ఏ (Telugu MA) చేశాను. సంస్కృతంలో MA చేశాను. DOL ఉన్నా కూడా బీఈడీ ( Bed)చేశాను. Med చేయలేదు. అప్పుడు జీవితం అనేది ఒక గాడిన పడింది.
పద్మజ :- రంగస్థలం- సాహిత్యం -క్రీడలు- సంపాదకత్వం… ఈ విభిన్న రంగాలలోకి మిమ్మల్ని నడిపించిన మూల ప్రేరణ ఏమిటి?
నరసింహారావు:– నాటక రంగంలో నా అడుగు హై స్కూల్ లోనే పడింది. అది ఎలా అంటే మా పాఠశాల వార్షికోత్సవం రోజున అప్పటికి నాకు ఇంకా 12 సంవత్సరాలే… మా సోషల్ మాస్టర్ గారు కన్నయ్యశాస్త్రి గారని ఉండేవారు. వారేమన్నారంటే “మన పాఠశాలకు DEO గారు వస్తున్నారు. మనం వార్షికోత్సవానికి ఏదైనా ఒక నాటకం వేయాలి! అని ఒక నాటకం ఎంపిక చేసుకున్నారు. అప్పుడు నాకు జులపాల జుట్టు ఉండేది. రవీంద్రనాథ్ ఠాగూర్ గారి కథ కాబూలీవాల కథను నాటకీకరణ చేశారు. ఆ కాబూలి వాలాలో చిన్నవాడిని కనుక (మినీ యాక్సెంచర్) ఆడపిల్ల వేషం వేయించారు. ఆ నాటకానికి చాలా ప్రశంసలు వచ్చాయి. సార్ నాతో “అరేయ్ నువ్వు వృద్ధిలోకి వస్తావురా! నువ్వు నటన నేర్చుకో” అని అన్నారు మాస్టారు. ఆ తర్వాత ఇంటికి వచ్చాను.
మా పెద్దన్నయ్య గారు రచయిత అప్పారావు గారు ఆయన కూడా ఉపాధ్యాయులే! ఆయన తాను స్వంతంగా ఒక నాటకం రాసి, అందులో సర్పంచ్ పాత్రను నన్ను వేయమని నాకు ఇచ్చారు. ఆ నాటక ఇతివృత్తం ఒక పాఠశాలను ఎలా నడిపించాలని…
ఆ రకంగా నాటక రంగంలో ప్రవేశించడం జరిగింది. ఆ తర్వాత మళ్లీ సంస్కృత కళాశాలలో చేరిన తర్వాత అంతర్ కళాశాల పోటీలు జరిగాయి. ఆ రోజుల్లో ఆంధ్రాభ్యుదయ ఉత్తరాలు జరిగేవి. వేరే వేరే పాఠశాలల నుండి నాటకాలను ఆహ్వానించేవారు. ఉభయ రాష్ట్రాలలో ఉన్న కాలేజీలలోని విద్యార్థులు అందరికీ కూడా ఆయా నాటకాలకు ప్రథమ,ద్వితీయ, తృతీయ, బహుమతులు ఇచ్చేవారు. ఆ విధంగా నేను సంస్కృత కళాశాలలో చదువుతున్నాను కాబట్టి, ఆ కాలేజీ తరపున వచ్చాము. అయితే తెలుగు నాటకం వేయాలని స్వప్న సీమ అనే నాటకం తీసుకుని వేయాలనుకున్నాము. దాంట్లో ప్రత్యేకత ఏమిటంటే మైమ్ (myme ) యాక్షన్ చేయాలి! ఆ పాత్ర పాప్ సింగర్! ఒక హార్మోనియం పట్టుకొని పాట పాడుతుంటాడు కదా? ఆ నాటకం వేసే సమయానికి మాకు ఎక్కడా హార్మోనియం దొరకలేదు! స్టేజి మీదకి వచ్చాను ఏం చేయాలో ?అర్థం కాలేదు! బాగా ఆలోచించాను. ఎలాగో డైలాగులు చెబుతున్నట్టు…
మైమ్ యాక్షన్ చేశాను. అప్పుడు న్యాయనిర్ణేతలుగా వచ్చిన వారు ఎవరంటే భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు కాంగ్రెస్ ప్రెసిడెంట్; అలాగే మల్లీశ్వరి చిత్రదర్శకులు బి.యన్ రెడ్డి గారు. 1957 లో వారిద్దరి చేతుల మీదుగా ఒక అవార్డు తీసుకున్నాను. దాంతో నాలో ఉత్సాహం పెరిగింది. తర్వాత మా కాలేజీలోనే సంస్కృత మాధ్యమంలో ( డైలాగ్లన్నీ సంస్కృతంలోనే ఉంటాయి.) అలా మృచ్ఛకటికము, ముద్రారాక్షసము,అనే వాటిల్లో మంచి పాత్రలు వేసాను.
మా గురువుగారు వేదాల తిరువేంగళాచార్యులు గారు. మాకు అలంకార శాస్త్రం బోధించేవారు. ఆయన నన్ను చాలా ప్రోత్సహించారు. రేడియోలో ప్రోగ్రాం ఇచ్చాను. అప్పుడు కథలు చదవాను. హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారంచేసారు.
BOL అయిపోయాక మధుర దగ్గర మహాదేవపురం అక్కడ ఉద్యోగంలో గ్రేడ్ 2 తెలుగు పండిట్ గా ఉద్యోగంలో చేరాను. పాఠశాలలో ఏ కార్యక్రమాలైనా తెలుగు టీచరే ఆ పని చేయాలి! అంటే సాంస్కృతిక ఉత్సవాలైనా సరే లైబ్రరీ ఇన్చార్జి గాని వాటికి సంబంధించిన పనులన్నీ తెలుగు టీచర్ గా నేనే చేసే వాడిని .సోషల్ మాస్టర్ నాకే అప్ప చెప్పేవారు. అలా పిల్లలతో నాటకాలు వేయించడం, నేను వేయడం, అలా కొడాలి గోపాల్ రావు గారి నాటకాలను, గొల్లపూడి మారుతీ రావు గారి నాటకాలను, ఇలా అన్నిటిని వేసేవాడిని. ఏ పాఠశాలకు వెళ్లిన నేనే పిల్లల చేత నాటకాలు వేయించడం జరిగింది.
ఒక విషయం ఏమిటంటే పందిళ్ళపల్లిలో 1974 నుండి 84 వరకు అక్కడ పనిచేసాను. అక్కడ కూడా నాటకాలు వేయిస్తూ ఉండేవాడిని. ఆ స్కూల్ కు సరైన వస్తు సామాగ్రి లేదు! వాటిని సమకూర్చుకొనేందుకు నేనే ఒక నాటకం రాసి, భారతంలో సీత అని పేరు పెట్టి రాసుకొని, బాగా ప్రాక్టీస్ చేయించి, చుట్టుపక్కల ఊళ్ళల్లో ప్రదర్శింపజేసి, ఆ రోజుల్లోనే 15000/రూ.లు నాటకాల ద్వారా వసూలు చేసే స్కూల్ డొనేట్ చేశాను. అంటే బెనిఫిట్ షో అన్న మాట!
అలా ఊరికి నాకు విడదీయలేని సంబంధం ఏర్పడింది. నాకు వేరే ఊరికి బదిలీ అయినా కూడా ఆ ఊరి వాళ్ళు నన్ను వెళ్ళనీయకుండా ఆ గ్రామంలోనే ఉండమన్నారు. ఆ తర్వాతేమైందంటే? అక్కడి నుండి వెళ్ళక తప్పలేదు!
ఒకాయన నన్ను వాళ్ళ ఊరికి రమ్మన్నారు. ఆయనకు మా ఊళ్ళో బంధువులున్నారు. నాకోసం ఇల్లు వసతులు ఏర్పాటు చేసారు. మా శ్రీమతిని తీసుకొని వెళదామనుకున్నాను కానీ ఇంకొక ఆయన పెద్ద పైరవీ చేసి నన్ను రాఘవపురం అనే ఊరికి రమ్మని పిలిపించుకున్నారు. పాత ఆర్డర్ క్యాన్సిల్ చేసి రాఘవపురానికి ఆర్డర్ ఇచ్చారు. నేను సర్దుకుని పోదాం అనుకున్నంతలో ఇలా జరిగింది. ఇలా ఎందుకు చేసారు? అని అడిగితే నీవు వెళ్లి ఓ ఐదు నెలలు అక్కడ ఉండి చూడు! నువ్వు అక్కడ ఉండలేక పోతే నేను మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయిస్తానన్నాడు. ఎందుకంటే? ఆరోజుల్లో సర్పంచ్ లకు బదిలీ చేయించే ఇన్ ఫ్లుయన్స్ ఉండేది. సర్పంచ్ అడిగితే తబాద్ లా చేసేవారు. అలా బురద రాఘవాపురం వెళ్లాను.
నేను ఎక్కడికిపోయినా ప్రయాణ సౌకర్యాలు ఉండకపోయేవి. ఎక్కడికి వెళితే ఆ ఊర్లోనే కాపురం పెట్టాల్సిందే. అలా ఆ ఊరి ప్రజలతో మమేకమైపోయేవాడిని. అక్కడే సాంస్కృతిక కార్యక్రమాలు చేసేవాడిని. అక్కడ ఒక సత్యేంద్ర కుమార్ అనే సినిమా నటుడుండేవాడు. ఆయన తెలంగాణ నుండి మొట్టమొదటి రాష్ట్రపతి అవార్డు అందుకున్న నటుడు. ఊరుమ్మడి బ్రతుకులు అనే సినిమాలో ఆయన నటించారు. ఆయనతో కలిసి నాటకాలు వేసే వాడిని. ఆయన మాతో పాటు ఉండేవారు. నాకు ప్రమోషన్ రాలేదు. అదే గ్రేడ్ 2 తెలుగు పండిట్ గానే చేసాను. నేను మొదలు చేరినప్పుడు నా జీతం- 50 జీతం వచ్చినప్పుడు ఎలా ఉన్నానో? పదివేల జీతం తీసుకున్నప్పుడు కూడా అలానే ఉన్నాను నేను పదవి విరమణ పొందినప్పుడు నా జీతం పదివేల, ఐదువందల రూపాయలు. నేను 26 సంవత్సరాలయింది పదవి విరమణ పొంది… తర్వాత పిల్లలందరూ చదువుతూ ఉంటే వారితో పాటు కలిసి నేను డిగ్రీ చేసాను.
మా అమ్మాయితో పాటు సంస్కృత పరీక్ష రాసాను. మా అబ్బాయితో మరో పరీక్ష రాసాను. నిరంతరం చదవడం పరీక్షలు రాయడమో, నాటకాలు రాయడమో? చేస్తుంటాను. రిటైర్ అయిన తర్వాత బి.ఎడ్ కాలేజీ వారు నన్ను పిలిపించుకున్నారు. తర్వాత డిగ్రీ కాలేజీలో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేసాను. అలా జీవితం ఒక గాడిలో పడిపోయింది.
2001లో పదవి విరమణ పొందాను. అప్పటినుండి రచన వ్యాసంగంలోకి వచ్చాను. ఈ మధ్య ఖమ్మంలో నాటక సమాజం ఏర్పాటు చేసి ఖమ్మం కల్చరల్ అసోసియేషన్ 20 సంవత్సరాలుగా సంస్థ నడుపుతున్నాను. దానికి డైరెక్టర్,ఫౌండర్, నిర్మాతను అన్నీ నేనే. జిల్లాలోని నటీనటులంతా నా అసోసియేషన్లో ఉన్నారు. అలా నాటకాలు రాస్తూ…. వేస్తూ…. ఉన్నాను.
నా సహ ఉపాధ్యాయుడు ప్రసాద్ బాబు అని అతను కూడా ఉపాధ్యాయుడు. మేమిద్దరం కలిసి, నాటకాలు రాయడం మొదలుపెట్టాము. మేము ఇద్దరం కలిసి రాసిన నాటకం ఏదైనా సరే నంది బహుమతి పొందాల్సిందే! దానికి ప్రత్యామ్నాయము అన్నది లేదు. ఆ రకంగా నాలుగైదు నాటకాలు రాసాను. వాటికి నంది బహుమతులు వచ్చాయి. రచయితగా, దర్శకుడిగా, నటుడుగా బహుమతులు అందుకున్నాను. ఒక్క నంది బహుమతే కాకుండా… పెద్దపెద్ద సంస్థలు సన్మానాలు, అవార్డులు, గరుడ అవార్డు, ఆలా లెక్కకు మించి అవార్డులు వచ్చాయి. అలా ఈ రచన వ్యాసంగంలో కౌసల్య సుప్రజా రామా అనే నవల మామూలుగా రామాయణం అందరూ రాముడు పుట్టిన దగ్గర నుండి చదువుతారు. బాలకాండలో దశరధుడు పుత్రకామేష్ఠి యాగం చేస్తే రాముడు పుడతాడు. అక్కడినుండి బాలకాండ ప్రారంభమవుతుంది.. కానీ రాముడు పుట్టకముందు నుండే నేను రాసాను. దశరధుడికి కౌసల్యతో వివాహం ఎలా అయింది ?అసలు కౌసల్య ఎవరు? కైకమ్మ ఎవరు ? సుమిత్ర ఎవరు? ఎలా పెళ్లి చేసుకున్నాడు ఈ ముగ్గురిని? అనే విషయాన్ని తీసుకొని రాసాను. దాన్ని నాటకంగా ప్రదర్శించాము. తిరుపతిలో బుర్రా సుబ్రహ్మణ్యం గారి కుమారులు తెనాలి వీణ అవార్డ్స్ నెలకొల్పి, మా చేత నాటకం వేయించారు.
ఆ తర్వాత మా అబ్బాయి చక్కని కవితలు వంశీకృష్ణ అనే పేరుతో రాస్తాడు. మంచి రచయిత! తెలంగాణ నాటక రంగ చరిత్ర రాసినప్పుడు దీన్ని నేను Mphill కోసం రాద్దామనుకున్నాను. రాయడం కష్టమని అందరూ అన్నారు. అయినా కూడా రాసినాను! తర్వాత తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం ఇచ్చారు.
నేను రాసిన పుస్తకాలకు అవార్డులు వచ్చాయి. ఖమ్మం కథా సుధ రాసినప్పుడు కూడా తెలంగాణ ఆవిర్భవించిన తరువాత మొదటి పుస్తకం ఇది. తెలంగాణ గొప్పతనం నిండి ఉంది కాబట్టి, ఖమ్మం జిల్లా గురించి రాద్దామనుకున్నవాడిని ఎప్పుడైతే ప్రత్యేక తెలంగాణ వచ్చిందో తెలంగాణ నాటక రంగ చరిత్ర రాసాను. ఖమ్మం జిల్లాలో ఉన్న కథా రచయితలందరి సమగ్ర జీవితం రాశాను. అలాగే ఖమ్మం కవులు ఎందరున్నారో దాశరధి గారు, హరి భట్టు గారి- దగ్గర నుండి (13వ శతాబ్దం నుండి ) ఖమ్మం లో ఉన్న కవులందరి చరిత్ర రాసాను. ఈ రకమైన రచనలు చేయడం, మిగతా జిల్లాల వారికి మార్గదర్శకుడిగా నన్ను తీసుకొని, తెలంగాణ ఫోరం నెలకొల్పారు. దాంతో నాకు సంబంధం లేదు. వాళ్లు జిల్లాల ప్రకారం రాయలేదు! తెలంగాణ మొత్తం తీసుకున్నారు. నేను జిల్లాను యూనిట్ గా తీసుకున్నాను. ఆ తర్వాత వచ్చిన వారందరూ జిల్లాను యూనిట్ గా తీసుకొని, వాళ్ల జిల్లాలో కవులు, వారి రచనల గురించి కథలు, నాటకాలు, కవితలు, వారు రాయడం జరిగింది. అదే ఒరవడిలో అన్ని జిల్లాల చరిత్రను రాయించారు. అందులో ఖమ్మం జిల్లా చరిత్రను, భద్రాద్రి జిల్లా చరిత్రను కూడా నేనే రాశాను. కావూరి పాపయ్య శాస్త్రి గారని ఒక ఆయన ఉండేవారు. ఆయన తాను రాస్తానని పేరు ఇచ్చారు. ఆయన కొంత కాలం రాసి చనిపోయారు. తరువాత నేనే దాన్ని పూర్తి చేశాను. ఇలా ఖమ్మం జిల్లా సంబంధించిన సాహిత్య సర్వస్వం నా దగ్గర ఉంది. ఏదైనా సరే నా దగ్గర అనధికారికంగా 20 మంది విద్యార్థులు ఎంపీహెచ్డీలు చేశారు.

పద్మజ: మీరు పత్ర సమర్పణలు చేసే అవకాశం ఎలా వచ్చింది? ఏ అంశాలతో సమర్పించారు?
నరసింహారావు గారు:– యూనివర్సిటీ వారు సెమినార్ జరిపినప్పుడు నాటక రంగం మీద పత్ర సమర్పణ చేయమని అన్నారు. దాని మీదనే పత్ర సమర్పణ చేసాను. తెలుగు యూనివర్సిటీలోనూ నాటక రంగ అనే అంశం మీద సమర్పించాను.
కాకతీయ విశ్వవిద్యాలయంలో ఖమ్మం జిల్లా నాటకరంగం అనే అంశంతో పత్ర సమర్పణ చేసాను.
నాగార్జున యూనివర్సిటీ నల్లగొండలోనూ పత్ర సమర్పణ చేసాను. ఇలా అన్ని యూనివర్సిటీలలో చేసాను.
ఉమ్మడి జిల్లా పద సాహిత్యం మీద ఒక పత్ర సమర్పణ చేసాను. ఇలా వైవిధ్యమైన అంశాలతో పత్ర సమర్పణలు చేసాను.
పద్మజ:— ధార్మిక ఉపన్యాసాలు చేసారని విన్నాను. అది ఎలా జరిగింది?
నరసింహారావు:— మా దగ్గర రామకృష్ణ మిషన్, గాయత్రి సేవా సమితి ఉంది. వీటిల్లో ప్రతి సంవత్సరం కార్తీకమాసంలోను, పండగలప్పుడు, వసంత నవరాత్రులలో, దుర్గా నవరాత్రులలో, సమావేశాలు ఏర్పాటు చేస్తారు. అప్పుడు ప్రసంగించే అవకాశం వచ్చింది. రామాయణ, భారత, భాగవతాల, మీద బ్రహ్మాండ పురాణాల మీద ఉపన్యాసాలు చేసాను. పరిషత్తుల ద్వారా కూడా ప్రసంగించాను.
పద్మజ:– ఒకేసారి మీరు… మీ అబ్బాయి నంది అవార్డులు తీసుకున్నారు కదా! ఆ సందర్భం ఎలా వచ్చింది?
నరసింహారావు:– 2017 సంవత్సరంలో నేను చాణుక్య-చంద్రగుప్త అనే నాటకం ప్రదర్శించాము. నాకు తృతీయ బహుమతి వచ్చింది. అదే సమయంలో సినిమా గురించి రాసిన పుస్తకానికి ప్రభుత్వం బహుమతి ప్రకటించింది. మా అబ్బాయి మంచి రచయిత అని చెప్పాను కదా! ఆ సంవత్సరమే 25 th ఫ్రేమ్ అని ఒక పుస్తకం రాశాడు. సినిమాకు సంబంధించిన ఆ పుస్తకానికి అబ్బాయికి అవార్డు వచ్చింది. నాటకం ప్రదర్శించినందుకు నాకు నంది అవార్డు వచ్చింది. అలా ఇద్దరం ఒకేసారి అవార్డులు అందుకున్నాము. అది ఒక రికార్డు అని అందరూ ప్రశంసించారు. ఈ రకంగా కల్చరల్ అంటే నాటకాలు మొదట స్పురిస్తాయి. అందుకే నాటక రంగ చరిత్ర రాసిన… అందులోను నాకు దర్శకత్వ శాఖలోనూ నాదైన నైపుణ్యం సంపాదించుకున్నాను. దానికి రుజువే నూరు- నూటా యాభై మంది నటీనటులతో దర్శకత్వం నిర్వహించాను. వాళ్ళందరూ స్వంతంగా నాటక ప్రదర్శనలిస్తున్నారు.
పద్మజ:– బాల్యం-లేదా- యవ్వనంలో అత్యంత ప్రభావం చూపెట్టిన సంఘటన ఏదైనా ఉందా?
నరసింహారావు:— అత్యంత ప్రభావం చూపెట్టిన సంఘటన అయితే మటుకు కచ్చితంగా సంస్కృత కాలేజీలో చదివిన కాలమే! అదొక స్వర్ణ యుగం అని చెప్పవచ్చు. కారణమేమిటంటే సంస్కృతం అందరూ మృత భాష అని చెప్పుకున్నప్పటికీ, నాకు అన్నం పెట్టింది సంస్కృత భాషనే! నేను ఉద్యోగంలో చేరినప్పుడు కూడా నాకు నా సంస్కృతాన్ని చూసిన తర్వాతనే తెలుగు బోధన చేయగలరు అని ఉద్యోగం ఇచ్చారు. కాబట్టి నా ఉద్యోగానికి మూలం అదే కదా! అంతేకాకుండా లోకజ్ఞానం నేర్పేటటువంటిది సంస్కృత భాష అని నా ఉద్దేశ్యం. మామూలు లౌకిక సంబంధమైన పాఠశాలల్లో సిలబస్ కు సంబంధించినవే చెప్తారు. కానీ సంస్కృత గ్రంథాలలో సమాజాన్ని మార్చే శక్తి ఉంది. వాటిల్లో ఇప్పుడున్న రచయితల వలె వర్ణ,వర్గ విచక్షణలు ఉండవు. అప్పుడు భాష అంటే ఎవరికైనా భాషే! అంటే భాషా పరమైన జాతి తప్ప ఇతర భేదభావాలుండకపోయేవి. క్రమశిక్షణ నేర్పడానికి మూలభాష సంస్కృతమే! కుటుంబ సంబంధాలను అంటే కుమారుడిని ఎలా చూడాలి? కూతురును ఎలా చూడాలి? ఇవన్నీ ప్రాచీన గ్రంథాలలో రాసిపెట్టారు. అవార్డుల కోసం మనం రాయకూడదు! నేను జ్ఞాన సముపార్జనకోసమే చదువుకున్నాను. దానితో పాటు కుటుంబాన్ని పోషించుకునే శక్తి కూడా సరస్వతి దేవి నాకు కల్పించింది. ఇది అత్యంత ప్రభావం చూపే సంఘటన. నాటకానికి సంబంధించినదైతే అదే సమయంలోనే బి.ఎన్.రెడ్డి గారి ప్రోత్సాహం అందడంలో నా నాటక జీవితానికి మలుపు తిరిగింది. అది మరో మరచిపోని సంఘటన.
తర్వాత ఇంకొకటి ఏమిటంటే మా శ్రీమతి భ్రమరాంబ! ఆమె నా జీవితంలో ప్రవేశించిన తరువాతనే నాకు ఒక స్థిరత్వం ఏర్పడింది. అంతకు ముందు అటు మద్రాసు ఇటు హైదరాబాదు తిరిగేవాడిని. పొద్దున ఒక ఊరు సాయంత్రానికి మరో ఊరు వెళ్లడం జరిగేది! అలా కాకుండా పిల్లలను ఎలా పెంచాలని ఆమె సలహా సంప్రదింపులతోనే పెంచగలిగాను. ఐదుగురు పిల్లలకు పెళ్లిళ్లు చేసి, వారికి పురుళ్ళు, పుణ్యాలు చేసి, చదువులు ఇవన్నీ ఆమె సహకారంతోనే అని నేను చేయగలిగానని అనుకుంటాను. ఆమెకు అనుకోకుండా క్యాన్సర్ వచ్చి మరణించింది. ఆమె స్మారకంగా ఒక అవార్డు ఇస్తున్నాము. మూడు సంవత్సరాల నుండి మొదటగా ఆచార్య ఎన్ గోపి గారికి, ప్రసేన్ అనే రచయితకు, పోయిన సంవత్సరం శ్రీ ఏనుగు నర్సింహా రెడ్డిగారికి అందజేశాము.
ఇప్పుడు నా సర్కిల్ లో ఎందరో ఉన్నారు కాబట్టి ఆమె పేరు మీద అవార్డు ఇస్తున్నాము.
పద్మజ:– ఈ అవార్డు ఇస్తూ మహిళగా మీ శ్రీమతి గారికి ఒక ఉన్నత స్థానం కల్పించడం మీ హృదయ ఔన్నత్యాన్ని తెలుపుతున్నది. మీకు మరో మారు అబినందనలు. మరి బాలసాహిత్యంలో మీ కృషి ఎలా సాగింది?
నరసింహారావు:— బాలసాహిత్యంలో నేను కొంత వెనుక పడ్డాను అనే చెప్పాలి! ప్రత్యేకంగా రాయకపోయినా కొంత కృషి చేశాను. బాలసాహిత్యం ప్రచురణలు చేయలేదుకానీ, పిల్లలచేత కథలు, కవితలు రాయించాను, నాటకాలు వేయించాను ఇలా రాయాలని…రాసే పద్ధతి వారికి నేర్పించాను. పిల్లలు నాటకాలు రాసినప్పుడు బోధకుడిగా వెళ్లాను.
పద్మజ:– ప్రపంచ మహాసభల్లో మీ కృషి గురించి వివరించండి?
నరసింహారావు:– మహాసభలలో కవి సమ్మేళనానికి ఆహ్వానించారు… అంతేకానీ, నాకు పెద్దగా ప్రత్యేకతలు ఏమి ఇవ్వలేదు. తిరుపతిలో ప్రపంచ మహాసభలు జరిగినప్పుడు నాకు ఒక సెక్షన్ అప్పచెప్పారు. దాన్ని చక్కగా నిర్వహించాను. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత అకాడమీ వారు నన్ను అందులో చేర్చుకున్నారు. నేను ఖమ్మంలో ఉండేవాడిని కాబట్టి నాకు అంతగా ప్రాధాన్యత లేదు. ఖమ్మం నుండి ఇక్కడికి వచ్చి చేయలేం కదా?
పద్మజ:– మాకు ఆశ్చర్యం కలిగించేది ఏమిటంటే? నాటకారంగం- అటు సాహిత్యం… జోడు గుర్రాల వలె నడుపుతున్నారు. మరి క్రీడారంగంలోకి మీ ప్రవేశం ఎలా జరిగింది? దాని వెనుక ప్రేరణ ఏమిటి?
నరసింహారావు:–క్రీడారంగం నాకు చాలా ఇష్టమైనదే! హై స్కూల్లో చదివేటప్పుడు నాకు అంతగా క్రీడల్లో ప్రవేశం లేదు కానీ, నేను ఉద్యోగంలో చేరిన తర్వాత పందిళ్ళ పల్లెలో స్థిరపడినప్పుడు ఒక చదరంగా అసోసియేషన్ ఉంది. మా మిత్రుడు చదరంగం ఆడే వాడు. చదరంగం బోర్డు ముందర పెట్టుకొని చూస్తూ ఉండేవాడు. దీన్ని ఎలా ఆడతారు? అని అడిగాను. “మీరు ఆడతారా సార్” అనడిగాడు. ఆడతానని అన్నాను. ప్రాథమిక సూత్రాల చెప్పాడు. పావుల గురించి తెలిపాడు. వాటి నడకలు వాటిని ఎలా అరికట్టవచ్చు అని, అది విన్నాక నాకు ఈ ఆట నేర్చుకుంటే బాగుంటుంది కదా? అనే ఆలోచన వచ్చింది. అలా నేర్చుకున్నాను.
ఖమ్మం జిల్లా చదరంగ సంఘానికి మార్కండేయుడు అనే అతను అధ్యక్షుడుగా ఉన్నాడు.
కొంతకాలం తర్వాత నేను పోటీలో పాల్గొనే వాడిని. చిన్నచిన్న బహుమతులు వచ్చేవి. అలా ఒక సంవత్సరం జరిగిన తర్వాత ఆ సంఘంలో చీలిక ఏర్పడింది. చీలిక వచ్చినప్పుడు “నరసింహ రావు గారూ! మీరు అధ్యక్షులుగా ఉండండి” అని అన్నారు. నేనేదో చిన్నగా నాటకాలు రాసుకుంటాను. అలాంటిది ఒక సంస్థను నడపడం అంటే కష్టం అన్నాను. వారంతా పట్టు పట్టి అధ్యక్షుడిగా ఉండాల్సిందేనని బలవంత పెట్టారు.
చదరంగంలో ఉన్న ఆసక్తితో బాగానే కృషి చేశాను. అది నాకు రెండు విధాల ఉపయోగపడుతుందని పించింది. ఒకటి మేథస్సు అభివృద్ధి చెందుతుంది, మానసిక ఉల్లాసం ఇవ్వడమైతే మరొకటి జీవితాలకు చదరంగాన్ని అన్వయించుకోవచ్చు అని అర్థమైంది. ఎందుకంటే? ఆటగాడు ఎదుటివాడు ఎలాంటి వేస్తాడో తెలుసుకోవాలి! నేను ఊహించినట్టు ఎదుటివాడు ఎత్తు వేస్తాడా? లేక ఊహించనిది వేస్తాడా? నేను వేసిన ఎత్తు ఒకవేళ విఫలమవుతుందనుకున్న పక్షంలో ఏమైనా విరుగుడు ఉన్నాయా? ఏ రకంగా ఎదుటి వాడికి చెక్ పెట్టగలుగుతాను?
పద్యం:-
చదరంగంబున నేనతి చతురుండబంటు చేత కట్టించెద… అనే పద్యం ఉంది.
చతురంగంలో నేను అతి చతురడను… బంటు చేత రాజును కట్టించేద!
అంటే ఒక బంటుకు రాజును కదలకుండా చేసాడంటే ఇంత సైన్యమున్న రాజు బంటు చేత చిక్కడమంటే ఎలా బంధించగలుగుతాడు? ఈ పద్యం
నాకు నచ్చింది. ఒక బంటు చేత రాజును చెక్ పెట్టించే బంటున్నాడంటే మన జీవితంలో మనకు చెక్ పెట్టగలిగే వాడిని మనం చెక్ పెట్టగలగాలి! చదరంగం ఆటలో ఉన్న విశేషం ఏమిటంటే? ఈ ఆటను బాగా ఆడగలిగినవాడు జీవితంలో జయిస్తాడు. ఎందుకంటే నేను ఈ పని చేస్తే అవతలివాడు ఏమనుకుంటాడు? నేను అనుకుంటున్నాట్టు వాడు అనుకుంటున్నాడా? లేదా ఇంకో రకంగా అనుకుంటే నేనేం చేయాలి? నేను చేసే పని అందరికీ నచ్చాలని లేదుగా! కాబట్టి నేను చేసిన పని అవతల వాడికి నచ్చాలంటే నేనేం చేయాలి? లేదా వాడిని అధిగమించాలంటే.. వాడు వేసే ఎత్తలను నాలుగు రకాలుగా ఊహించాలి! అందుకు ఆసక్తితో నేర్చుకొని జిల్లా మొత్తం మీద 30 అసోసియేషన్ సంఘాలను ఏర్పాటు చేశాను. అలా చదరంగ క్రీడను ఎందరితో పరిచయం చేసి, అందులో నిష్ణాతులను చేసాను. కొంత కాలానికి ఇతర పనులు ఎక్కువై దానికి సమయం కేటాయించలేకపోయాను వదిలేసాను.

పద్మజ:— యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు సమాజం కానీ ప్రభుత్వం కానీ ఏం చేయాలంటారు?
నరసింహారావుగారు :— యువతకు ఏ క్రీడల పట్ల ఆసక్తి ఉందో గమనించి, దాన్ని అటు తల్లి తండ్రులు, పాఠశాలలో ఉపాధ్యాయులు టోర్నమెంట్స్ మొదలైన ఖర్చుకు సంబంధించి, ప్రభుత్వం ముఖ్యంగా లోకల్ గవర్నమెంట్ బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే యువతనే ఏదైనా సాధించాలి! యువత ముందుకు రానిది ఎవరు ఏమి చేయలేరు. ఉద్యోగం అవకాశం కల్పించాలి అలాగే వాళ్ళకి చదరంగం పట్ల అవగాహన కల్పించాలి! అందుకు చదరంగం ఆటలాగానే కాదు జీవితంలో ఎలా నడుచుకోవాలో ఆటను అలా మలుచుకోవాలని చెప్పాలి! జీవితమే ఒక చదరంగం అందులో మనం పావులమని ఒక కవి చెప్పారు కదా! అందుకని నాయకులు, తల్లిదండ్రులు అందరూ కలిసి చేయాల్సిందేమిటంటే ప్రోత్సహించాలి! ఏ ఆటలో నైనా ఆటగాడు ఎదుటి జట్టును ఓడించి, తాను గెలవాలి అనుకుంటాడు కదా! అలా వారి వారి అనుభవాన్ని బట్టి తమ పరిధిలో ఉన్న యువకులను జీవితాలు ఎలా తీర్చిదిద్దుతారో అలా క్రీడలలో అలా తీర్చిదిద్దాలి! అలా తోడ్పడుతుంది క్రీడారంగం విజయ పరంపరలో కొనసాగుతున్న క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకొని ఎందరో ఆటలలో ఎదిగారు! ఎదుగుతున్నారు.. ప్రతి ఆటలోను గెలిచి రికార్డు సృష్టించిన వారందరూ యువ క్రీడాకారులకు స్ఫూర్తి దాయకులే కాబట్టి, సమాజం యువకులను పరిశీలిస్తున్నది. యువత జాగ్రత్తగా ఉంటూ తనకిష్టమైన రంగంలో అది కవిగా కానీ, రాజకీయనాయకుడు కానీ, క్రీడాకారులు కానీ ఏదైనా సరే ఎదగడానికి ప్రయత్నించాలి !ఎందరో తనను పరిశీలిస్తున్నారు నేనెన్నుకున్న రంగంలో మాత్రం కృషి చేయడంలో అలసత్వం ఉండకూడదు! అని యువత అనుకోవాలి. అప్పుడే విజయం సాధించవచ్చు లేకపోతే రాదు! అందుకని నేను అనేది ఏమిటంటే అవగాహన కలిగి ఉండాలి.
పద్మజ:– కళాకారుడు సమాజానికి అద్దమా? లేక దారి దీపమా?
నరసింహారావు:–కళాకరుడు సమాజానికి దారి దీపం. అద్దమైతే కాదు! ఎందుకంటే అద్దం అంటే ఎవరో చేసినదే తాను చేసినట్టు, అద్దం చూస్తే ఎవరి ముఖం వారికే కనపడుతుంది. అలా కాదు! దారి చూపెట్టాలి! దారి దీపంగా ఉన్నప్పుడే కళాకారుడు తను ముందుకు నడుస్తూ తెలియని వారికి దారి చూపిస్తూ వారందరినీ గమ్యం చేర్చాలి.
పద్మజ:- మీరు సాధించాలనుకున్నవి ఇంకా కలలేమైనా ఉన్నాయా?
నరసింహారావు:– మనిషనే వాడికి ఆశ ఎప్పుడూ ఉంటుంది. ఆశా జీవులం కదా! ఉన్నాయి. ఆశాయా బద్దతే లోకః కుసుమ సదృశః అన్నాడు కాళిదాసు. ఒక పువ్వుకు తొడిమ ఎలా ఉంటుందో? మనిషికి ఆశ అలాంటిది. తొడిమె లేని పువ్వు ఉండదు కదా! మనిషి జీవితం కూడా అంతే! ఆశాబద్ధయే లోకా ఈ లోకమంతా కూడా ఆశాదీపాలతో నిండి ఉంది. ఆశతోనే మనుషులు జీవిస్తున్నారు. ఉద్యోగం లేనివాడు ఉద్యోగం కావాలనుకుంటాడు…. వంద రూపాయలు ఉన్నవాడు వెయ్యి రూపాయలు కావాలనుకుంటాడు… అందుకే నీతి శాస్త్ర కారుడిలా అన్నాడు కోరికలకు అంతులేదు పువ్వును నిలిపి ఉంచడానికి తొలిమె ఎలా ఉంటుందో అలా ఆశ మనిషిని నిలబెడుతుంది. ఆశ అనేది లేకపోతే జీవితం ఉండదు ఎలా అయితే తొడిమ లేకపోతే పువ్వు రాలిపోయినట్టుగా….
పద్మజ:— భవిష్యత్తులో మీ లక్ష్యాలు ఏమిటి?
నరసింహారావు:– నాకు సంబంధచినంత వరకు నా లక్ష్యం ఒకటే!నా పరిధిలో ఉన్నంతవరకు యువతను జాగృతి చేయడం, సమాజానికి ఒక మార్గదర్శకం నిలబెట్టడం అనేది నా లక్ష్యం….
పద్మజ :— మీ జీవితాన్ని వెనుకకు తిరిగి చూసుకుంటే సంతృప్తిగా ఉందా? లేక ఇంకా ఏదో చేయలేదని వెలితి ఏమైనా మిగిలి ఉందా?
నరసింహారావు:– నాకు చాలా సంతృప్తికరంగా ఉంది. ఎందుకంటే? ఇప్పటి వరకు కావలసినటువంటి అన్ని సౌకర్యాలు లభించాయి. అనుకూలవతి ఐన భార్య, అనుకూలంగా ఉండే బుద్ధిమంతులైన పిల్లలు ఉన్నారు. ప్రేమించే మనుమలు- మనుమరాండ్లు ఉన్నారు. ఇంత మంది సమాజంలోని స్నేహితులు నన్ను గౌరవంగా చూస్తారు. పరిచయస్తులేకాదు.. అపరిచితులు కూడా అపారమైన ప్రేమను పంచుతారు కాబట్టి నాకు ఆశించేది ఏదీ లేదు.
పద్మజ:— మయూఖ పత్రికకు ఈ ముఖాముఖి ద్వారా పాఠకులకు మీ అమూల్యమైన సందేశం ఇవ్వండి.
నరసింహారావు:– ఏ పత్రికైనా సమాజానికి ఉపయోగపడాలి! పడడమే! కావాలి!
పద్మజ:– అంటే ఏ కోణంలో అంటారు?
నరసింహారావు:– పత్రికలోని అంశాలతో మంచి పౌరులుగా తయారు చేయాలి. ప్రలోభాలకు లోను కాకూడద నే హెచ్చరికలుండాలి. సాహితీవేత్తలను పరిచయం చేస్తున్నది చాలా సంతోషం! సాహితీ సేకరణ పత్రిక చేస్తున్నది… అంతటితో సరిపోదు! స్వార్థం లేకుండా ఎవరు ఉండరు గానీ, అతిగా ఉండకూడదు ఒకరు మన దగ్గరకు వచ్చారంటే మనతోని వాడికి అవసరం ఉన్నట్టే… నేను మీతో మాట్లాడుతున్నానంటే అందుకు తగిన మేలు ఏదో నేను కోరుకుంటున్నట్టుగా అనిపిస్తుంది కదా? అలా కాకుండా ఏమి ఆశించకుండా సాగాలి.
సంతోషమండీ నమస్కారం మీ విలువైన సమయాన్ని వెచ్చించి ఇంతవరకు ఎన్నో విషయాలు సమగ్రంగా చెప్పారు అందుకు అనేక ధన్యవాదములు.
“తాటికొండాల నర్సింహా రావుగారూ… మీ మాటల్లో మేము కేవలం జ్ఞాపకాలను మాత్రమే వినలేదు; ఒక యుగపు స్పందనను అనుభవించాము. రంగస్థల వెలుగుల్లో మెరిసిన కళాకారుడిని, సాహిత్య పుటల్లో నిలిచిన రచయితను, క్రీడాస్ఫూర్తిని నాటిన మార్గదర్శిని, సంపాదకత్వంతో విలువలను కాపాడిన సంస్కృతి సేవకుడిని—ఈరోజు ఒకే వేదికపై దర్శించుకున్నాం. మీ ప్రయాణం కేవలం వ్యక్తిగత విజయగాథ కాదు; అది కృషి, కట్టుబాటు, కళాప్రేమలకు ప్రతీక. మీరు నడిచిన దారిలో వెలిగిన దీపాలు ఇంకా ఎన్నో మనసులను వెలిగించాలి.
‘మయూఖ ముఖాముఖి’కి మీరు అందించిన ఈ ఆలోచనల కాంతి మా హృదయాల్లో నిలిచిపోతుంది. మీ సృజనయాత్ర నిరంతరం కొనసాగాలని, మీ ప్రేరణ తరతరాలకు ప్రసరించాలని మనసారా ఆకాంక్షిస్తూ… మీతో ముఖాముఖి చేయాలనుకుంటున్నామని అడిగితే సహృదయతతో మీ ఇంటికి ఆహ్వానించి,చక్కని సంభాషణలతో సమగ్రంగా మీరిచ్చిన సమాచారం మా మయూఖ పాఠకులకెంతో ఉపయోగమండీ! అందుకు గాను గాఢమైన కృతజ్ఞతలతో నమస్కరిస్తున్నాం.”
