Home ఇంట‌ర్వ్యూలు రచయిత సమాజ బహిరంతరాలను శోధించాలి – లింగంపల్లి రామచంద్ర

రచయిత సమాజ బహిరంతరాలను శోధించాలి – లింగంపల్లి రామచంద్ర

by Aruna Dhulipala

                                       *****************************************

“నా మాట పతనమవుతున్న జాతికి వెలుగు బాట, నా పాట మత్తులో తూగుతున్న వాళ్ళకి సంస్కరణ దీపిక” అంటూ తమ రచనా ధ్యేయాన్ని వివరించిన ప్రముఖ కవి, విమర్శకులు డా. లింగంపల్లి రామచంద్ర గారి జీవితవిశేషాలను, అనుభవాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం.

నమస్కారం సార్🙏🏼 

జ:   నమస్కారం అమ్మా! జనగామ జిల్లా, రఘునాథపల్లి మండలంలో ప్రాచీన జనపదమైన ‘వెల్ది’ మా స్వగ్రామం. ఆదికవి ఆశ్రమస్థలి, పాండవ తాత్కాలిక విశ్రాంతి స్థలి. బౌద్ధాచార్య నాగార్జునుడు జన్మించింది ఇక్కడే. మాది సామాన్య రైతు కుటుంబం. మా తల్లిదండ్రులు చదువుకున్నవారు కారు. మా తండ్రి రత్నయ్య పరమ ధార్మికుడు. సంస్కార శ్రీమంతుడు. ఆయనకు రామాయణ, భారత విరాటపర్వం అంటే చాలా ఇష్టం. మా అమ్మ శ్రీలక్ష్మి.  సనాతనాచారాల పట్ల అమెకెంతో విశ్వాసం ఉండేది. మా గ్రామంలోని వివిధ కుటుంబాలలో నిర్వహింపబడే శుభకార్యాలన్నీ ఆమె నేతృత్వంలోనే సాగేవి. 
         నేను జనవరి 1, 1945లో జన్మించాను. నా ప్రాథమిక విద్య ‘వెల్ది’ లోనే సాగింది. మాధ్యమిక విద్య మా ఊరు సమీప గ్రామం, గురువర్యులు ఆచార్య పేర్వారం జగన్నాథం గారి స్వస్థలమైన ఖిలా షాపురంలో మాధ్యమిక విద్య చదువుకున్నాను. హైస్కూలు విద్య 9వతరగతి నుండి 12వ తరగతి వరకు హన్మకొండ మల్టీపర్పస్ హైస్కూలులో చదివాను. వరంగల్ లోని  ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీలో తెలుగు నా ఐచ్ఛిక అంశం. ఆచార్య చలమచర్ల రంగాచార్యులు గారు, ఆచార్య అమరేశం రాజేశ్వరశర్మ గారు, ఆచార్య మడుపు కులశేఖర రావు గారు, ఆచార్య కోవెల సుప్రసన్నా చార్యులు గారు, ఆచార్య మాదిరాజు రంగారావు గారు, ఆచార్య పేర్వారం జగన్నాథం గారు, ఆచార్య వేణు ముద్దల నరసింహారెడ్డి (వేనరెడ్డి) గారలు నాకు గురువులు.  వారి బోధనలన్నీ సాహిత్య పాఠాలే. ఆ సమయంలోనే గురువర్యుల సలహాననుసరించి ‘భారతి’ పట్ల అభిరుచి పెంచుకోవడం జరిగింది. మా కళాశాలకు చేరువలో ఉన్న నక్కలగుట్ట వీధిలోనే కాళోజీ గారి స్వగృహం ఉండేది. అక్కడ ప్రతినెలా మిత్రమండలి కార్యక్రమాలు జరుగుతుండేవి. తెలుగునాట ప్రసిద్ధులైన కవిపండితులు వచ్చేవారు. వారందరి ప్రసంగాల వల్ల బాగా ప్రభావితుడనయ్యాను. కళాశాలలో నిర్వహింపబడే సాహిత్య కార్యక్రమాలలో ప్రథమ బహుమతులు నన్నే చేరేవి. ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించిన తరువాత కాకతీయ విశ్వవిద్యాలయం నుండి ఎక్స్ టర్నల్ లో ఎమ్.ఏ (తెలుగు) చదివాను. అక్కడే “శ్రీ రంగరాజు కేశవరావు – సాహిత్య పరిశీలన” అనే అంశాన్ని పరిశోధించి 1992 లో డాక్టరేట్ పట్టా పొందాను.

జ:  మేం నలుగురం అన్నదమ్ములం. అందరమూ ఉపాధ్యాయులమే. మా పెద్దన్న వెంకటప్పయ్యగారు అధ్యాపక వృత్తిని వదిలిపెట్టి రాజకీయాల్లోకి ఆదర్శ నేతగా ప్రఖ్యాతి పొందారు. ఆయనకు భక్తి సాహిత్యం పట్ల చాలా అభిరుచి ఉండేది. అనేక గ్రంథాలు తీసుకొచ్చి భద్రపరిచేవారు. రోజూ భగవద్గీత చదివేవారు. అందులోని విశేషాలను పదుగురికి చెప్తుండేవారు. ఆ కాలంలో వెలువడుతుండే ఆంగ్ల మాసపత్రిక ‘భవానాస్ జర్నల్’ (Bhavana’s) గురించి కూడా చెప్పేవారు. సామాజికాంశాల పట్ల అభిమానం ఉండేది. సభలను ఉర్రూతలూగించగల చాతుర్యం ఆయన సొంతం. ఆయా పనులపై మా ఊరికి వచ్చేవాళ్ళందరికీ మా ఇంట్లోనే భోజన సౌకర్యాలు కల్పించేవారు. అందరితోనూ ఆత్మీయంగా మెలిగేవారు. దీర్ఘకాలం ఏకగ్రీవ సర్పంచ్ గా ప్రజలను ఆనందపరిచారు. రెండో అన్న వెంకట రామనర్సయ్య గారు ఉపాధ్యాయునిగా గొప్ప పేరు తెచ్చుకున్నారు. ఆయనకు కూడా భక్తి సాహిత్యమంటే మక్కువ ఎక్కువ నిరంతరం వాల్మీకి రామాయణం పఠించేవారు. అన్ని సబ్జెక్టులను విశేషంగా బోధించి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఘన సన్మానం పొందారు. మహర్షిగా పేరు వహించారు. మూడో అన్న సత్యనారాయణ గారికి ఆంగ్ల భాషలో మంచి పట్టు ఉండేది. ఆ భాషలో స్వయంగా పాటలు కూర్చి ఆలపించేవారు. విద్యార్థులను బాగా ప్రభావితం చేసి పౌరసన్మానం పొందారు.

జ:    ఖిలా షాపురం మాధ్యమిక పాఠశాలలో చదివేటప్పుడు గుండాల నరసింహారావుగారు అనే అధ్యాపకుడు ఉండేవారు. ఆయన కవి. మంచి నాటక రచయిత. విద్యార్థుల చేత ప్రదర్శింపజేసిన సొంత నాటకాల్లో నాకూ అవకాశం ఇచ్చేవారు. నా చేత ఆయన గేయాలు పాడించేవారు. అవి నన్ను బాగా అలరించేవి. వివిధ పోటీల్లో పాల్గొనేలా నన్ను ప్రోత్సహించి, విజేత అయినందుకు అభినందించేవారు. హన్మకొండ మల్టీపర్పస్ హైస్కూలులో చదివేటప్పుడు ఆచార్య కోవెల సంపత్కుమారాచార్యులు గారు మాకు తెలుగు అధ్యాపకుడు. ఆయన అప్పుడే ‘ఛందో వికాసం’ రాసి తెలుగునాట ఎంతో గౌరవం పొందారు. చేతనావర్త కవులు నలుగురిలో ఒకరు. ఆయన నా పట్ల ప్రత్యేక వాత్సల్యం చూపేవారు. వ్యాసరచనకు నన్ను బాగా ప్రోత్సహించేవారు. వరంగల్ ఆర్ట్స్ కళాశాలలో చదివేటప్పుడు నా గురువుల్లో ఒకరైన ఆచార్య పేర్వారం జగన్నాథం గారు నన్ను తమ హృదయానికి చేరువగా తీసికొని సలహాలనిస్తూ వచన కవిత్వం, సాహిత్య పరిచయాలు రాయిస్తుండేవారు. మరొక గురువు ఆచార్య వేనరెడ్డి గారు డా. సి.నారాయణరెడ్డి గారి సాహిత్య, సౌందర్య మాధుర్యాలను తెలుపుతూ సినారె గారి సాహిత్యం పట్ల గాఢమైన అభిరుచి కలిగించారు. సినారె గారి నాగార్జున సాగరం, దివ్వెల మువ్వలు, జలపాతం కావ్య సంపుటులు కొని అడపాదడపా చదువుతుండేవాడిని. ఒక పర్యాయం మా కళాశాల వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన సినారె గారు ‘కాకతీయ’ పద సంపుటి గురించి చేసిన ప్రసంగం నన్ను ముగ్ధుణ్ణి చేసింది. తొలిసారి అప్పుడే ఆయనను చూశాను. ఈ ప్రేరణే అనంతర కాలంలో ‘సినారె కవితాలోకనం’, ‘సినారె వాక్కుకు వయసు లేదు – తత్వ విశ్లేషణ’ అనే రెండు గ్రంథాలు రాయడానికి దారితీసింది.
          ఆచార్య పేర్వారం జగన్నాథం గారు కాళోజీ గారికి, కుందుర్తి ఆంజనేయులు గారికి, వి. వి. యల్. నరసింహారావుగారికి నన్ను పరిచయం చేశారు. అది నాకు బాగా ఉపయోగపడింది. కాళోజీ గారి గురించి కొన్ని వ్యాసాలు రాశాను. హన్మకొండకు వెళ్లినప్పుడల్లా ఆయనను కలుస్తుండేవాడిని. నా పరిశోధనా గ్రంథం “శ్రీ రంగరాజు కేశవరావు సాహిత్యం- పరిశీలన” గ్రంథాన్ని ఆచార్య పేర్వారం జగన్నాథం గారి షష్ట్యబ్ది సందర్భంగా వారికి అంకితమిచ్చాను. ఈ గ్రంథాన్ని సినారె గారు ఆవిష్కరించారు. 1986లో పేర్వారం వారి పర్యవేక్షణలో జరిగిన ‘అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు’ అనే సదస్సులో నేను వ్యాఖ్యాతగా వ్యవహరించాను. 
       1967లో ఆచార్య కోవెల సంపత్కుమారాచార్య గారు ‘మన పండితులు-కవులు-రచయితలు’ శీర్షికన వరంగల్ కవుల పరిచయాలను రాసి ‘జనధర్మ’ వారపత్రికలో ధారావాహికంగా ప్రచురించారు. ఈ సమాచార సేకరణలో తెలంగాణ ప్రథమ కర్షక కవి గంగుల శాయిరెడ్డి గారిని సంపత్కుమారాచార్య గారు నాకు పరిచయం చేశారు. రెడ్డిగారితో ఏర్పడిన అనుబంధం వల్ల నా సాహితీ జీవితానికి ఎంతో మేలు జరిగింది. 
        ఇక్కడ మరొకరి గురించి చెప్పాలి. నా సాహితీ జీవితానికి తొలి ప్రేరకుడు డా. తిరునగరి గారు. 1972లో నేను ఉద్యోగరీత్యా గుండ్ల గూడెం గ్రామానికి వచ్చినప్పుడు ఆయనతో పరిచయం ఏర్పడింది. ఆయన నా కవితా గురువు అని చెప్పాలి.

జ:   శ్రీ కేశవరావు గారు (1835 – 1905) జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని ఖిలాషాపురం వాస్తవ్యులు. గొప్ప పండితకవి. సంగీత విద్యా ధౌరేయుడు. జమీందారు అయినప్పటికీ సామాన్య ప్రజలతో మైత్రీ బంధుత్వం నెరపినవారు. మధుర గాయకుడు. సంస్కృతం, తెలుగు, అరబ్బీ, పార్శీ, ఉర్దూ భాషల్లో మంచి పండితుడు. గణితం జ్యోతిష శాస్త్రాల్లో విద్వాంసుడు. సంగీతం, ఖగోళం, చిత్రలేఖనం వంటి విద్యల్లో అగణిత వైదుష్యం కలవారు. వీరు పురాణం, కావ్యం, ప్రబంధం, యక్షగానం, శతకం, లఘు కావ్యం, కీర్తనం వంటి ప్రక్రియల్లో రసజ్ఞ జ్ఞేయమైన రచనలు చేశారు. ఈ మహాకవిని తొలుత సురవరం ప్రతాపరెడ్డి గారు తన గోలకొండ కవుల సంచికలో పరిచయం చేశారు. కేశవరాయకవి కృతుల్లో ఇంద్రద్యుమ్నీయం, అధ్యాత్మ రామాయణం, దాశరథి శతకం, లఘుకృతులు, ఆచ్చయినాయి. విక్రమాదిత్యం, హనుమద్విజయం అముద్రితాలు. రామాభ్యుదయం, లీలాపరిణయం, కల్కి పురాణం అలభ్యాలు. పార్శీ కవిత్వంలో నవాబును మెప్పించి, ‘కవిశిరోమణి’ బిరుదు పొందారు. సమాజంలోని అన్నివర్గాల ప్రజలతో సఖ్యంగా ఉండి ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్నాడు. తన సొంత ఇంటిని గ్రంథాలయంగా మార్చి, ఎన్నో విలువైన గ్రంథాలను పొందుపరిచారు. భూమి కొలతలను పద్యంలో చెప్పడం ఆయన ప్రతిభకు నిదర్శనం.  అంతేకాదు ఆయనకున్న నాటక కళాభిమానం ప్రత్యేకమైనది. తాము స్వయంగా రచించిన హనుమద్విజయం యక్షగానాన్ని తమ దర్శకత్వంలో ప్రదర్శించేవారు. వీరి రచనలో అలంకార మాధుర్యం, రసపోషణ, భావుకత, వర్ణనలు అద్భుతంగా ఇమిడి ఆర్ద్రత మిళితమై చవులూరిస్తుంది. రావుగారి పద్య విద్యా నైపుణ్యానికి ‘ఇంద్రద్యుమ్నీయం’ లోని ఒక పద్యం ఉదాహరణగా చెప్తాను.
సీ. వర త్రివిక్రమ పాద వనజ నిర్గళితాభ్ర
           గంగాధునీ తోయ కణములనఁగ
     నభ సరి ద్విహరదున్నత తమో గందేభ
            కర గళచ్చీ కరోత్కరములనఁగఁ
     గృత లాస్యహరశిరః పతిత శీతగభస్తి
             బింబ సుధాబిందు బృంద మనఁగఁ
     గస్తూరికాలిప్త గగన సతీ వపుః 
              కలిత ముక్తాహార గణములనఁగ
తే:  సమయ శబర వరేణ్య సుశ్యామ గాత్ర
      క్లప్త మగు సంకు పూసల దీప్తి యనఁగ
      వెలసి తండోపతండమై వేల్పు త్రోవఁ
      బ్రబిలి చూపట్టె నక్షత్ర పంక్తి యపుడు
ఇంతటి గొప్ప పండితులు కేశవరావు గారు…అందువల్ల ఆయన మీద పరిశోధన చేశాను.

జ:   అవును. నిజానికది తెలంగాణ సాహిత్య అకాడెమీ కోరిక మేరకు రాయడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల స్వీయ ప్రచురణగా ముద్రించడం జరిగింది.

జ:   (నవ్వుతూ) నిజమే కానీ నాటకాల్లో నటించాలన్న అభిలాష ఎక్కువగా ఉండేది. కొన్ని నాటికలు, నాటకాల్లో నటించాను కూడా..అందుకే క్రీడారంగాన్ని పక్కకు పెట్టాను.

జ:   పదేండ్ల బాల్యవయస్సు నుంచే మా గ్రామంలో ప్రదర్శింపబడే వీధి భాగోతాలు, భజనలు చూసేవాడిని. ఆ పాటలూ, సంభాషణలు నన్ను ఆకట్టుకున్నాయి. ఆ బృందాలతో ఊరూరు తిరిగేవాడిని. వేషం కట్టాలనే అభిలాష బాగా ఉండేది కానీ మా పెద్దలు అంగీకరించేవారు కాదు. ఖిలాషాపురం మాధ్యమిక పాఠశాలలో చదువుతున్నప్పుడు జి. నరసింహారావు గారు అనే అధ్యాపకుడు గొప్ప నాటక రచయిత. ఆయన వల్ల నాటకాలు వేసే అవకాశం వచ్చింది. అట్లా నాటకా రంగంలో ప్రవేశించాను. హన్మకొండ హైస్కూల్లో చదువుతున్నప్పుడు నారాయణరావుగారు అనే ఉపాధ్యాయుడు ఉండేవారు. ఆయనకు నాటకాల రాయుడు అని పేరుండేది. ఆయన ప్రదర్శింపజేసే నాటికల్లో నాకు అవకాశం ఇచ్చేవారు. అక్కడ నాటక సంస్థల్లో ప్రదర్శించే నాటకాలు చూస్తుండేవాడిని. ముచెర్ల సత్యనారాయణ, రుక్మారావు, శ్యామ్ సుందర రావు వంటి ప్రముఖ నటులతో పరిచయం ఏర్పడింది. వీరిలో ముచెర్ల సత్యనారాయణ గారు మంత్రి కూడా. నాకు ఏకపాత్రాభినయం చాలా ఇష్టం. దుర్యోధన, తాండ్ర పాపారాయుడు, రాణా ప్రతాప సింహుడు, చాణక్య, పేదవాడు వంటి ఏకపాత్రల్లో నటించాను. ఇవి నాకు విశేష ప్రాచుర్యాన్ని తెచ్చాయి. 
          జనగామ సంస్థలతో అనుబంధం ఏర్పడిన పిదప చిల్లరకొట్టు చిట్టెమ్మ, గాలివాన, పిచ్చివాడు నాటకాల్లో నటించి అందరినీ మెప్పించాను. మా స్వగ్రామంలో కొందరు యువకులం కలిసి తిరుపతి వేంకట కవుల శ్రీకృష్ణ రాయబారం నాటకం ప్రదర్శించాం. నేను దుర్యోధనుడు, భీముడు పాత్రల్లో నటించాను. తొలిదశలోనే ఆ నాటక ప్రదర్శన విజయవంతమైంది. ఆ నాటకాన్ని మరికొన్ని గ్రామాలలో ప్రదర్శించాం కూడా.   సురభి నాటక సమాజం వారు రఘునాథపల్లిలో గుడారాలు వేసుకొని, కొన్ని నెలల దాకా అక్కడే ఉండి నాటకాలు ప్రదర్శిస్తుండేవారు. అవన్నీ చూడడమైంది. అవి మనస్సు మీద బలమైన ముద్రవేశాయి. నటులుగా ప్రసిద్ధులైన ఎ. ఆర్. కృష్ణ, చాట్ల శ్రీరాములుగార్లతో జనగామలో కలిగిన పరిచయం మరువరాని అనుభూతిని మిగిల్చింది. జనగామలోనే ఆచార్య ఆత్రేయ గారు రచించిన కప్పలు, గుమాస్తా నాటకాల ప్రదర్శన సమయంలో ఆయన తోనూ పరిచయం కలిగింది. వాటిలో సీనియర్ నటులు నటించారు. ఆత్రేయ గారి సినిమా పాటల విశేషాలను వివరిస్తూ వ్యాసాలు రాసి ఆయనకు అందజేశాను. హైదరాబాద్ లో వారితో మంచి అనుబంధం ఏర్పడింది. దానికి గుర్తుగా ఆయన సినిమా పాటల గురించి ఒక బృహత్ వ్యాసం రాసి నా ‘సరళరేఖలు’ వ్యాస సంపుటిలో ప్రచురించడం జరిగింది. ఆయన ఆత్మీయతకు అవధులు నిర్మించలేను.

జ:    ఈ భూమిక చిల్లరకొట్టు చిట్టెమ్మ నాటకంలోనిది. జనగామ పట్టణ ఎస్ కె ఆర్ట్స్ సంస్థ పక్షాన ఈ నాటకం 9 చోట్ల ప్రదర్శింపబడి ప్రశంసలు పొందింది. ‘బట్టల బంగారం’ పాత్రలో సంభాషణలు చలాకీగా ఉంటాయి. హాస్యప్రధానంగా ఉంటుంది. హాస్యపూరితమైన భావాలను రమ్యంగా ఆవిష్కరించడంతో నాకు ‘బట్టల బంగారం’ పాత్ర మంచి గౌరవాన్ని, ప్రసిద్ధిని కలిగించింది.

డాక్టర్ లింగంపల్లి రామచంద్రగారితో అరుణ ధూళిపాళ జరిపిన ముఖాముఖి

జ:    నేను హైదరాబాద్ లో ఖైరతాబాద్ లోని న్యూ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల స్టడీ సెంటర్ లో డిగ్రీ తరగతులకు పాఠాలు చెప్పాను. ఇంటర్ విద్యార్థులతో పాటు అంతగా చదువులేని వాళ్ళు కూడా విద్యార్థులుగా ఉండేవారు. అందువల్ల నేను వాడుక భాషను ఉపయోగించే వాడిని. అటు తరువాత ప్రామాణిక భాషను వాడేవాడిని. ప్రత్యేకించి వ్యాకరణాంశాలను చెప్పేటప్పుడు ముందుగా గ్రామ్య భాషను ఉపయోగించి, తర్వాత ప్రామాణిక భాషలో బోధించడం వల్ల అన్నిరకాల విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండేది. చేరా గారు, పి.వి. చలపతి రావు గారు, కె.ఎస్. రమణ గారు నా తరగతి గదిలో కూర్చొని పరిశీలించేవారు. నేను గ్రామప్రాంత అధ్యాపకుడిగానే కాక సాహిత్యం పట్ల కృషి చేస్తున్నవాడిని కాబట్టి నా భూమికను సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది. చర్చలు కూడా సాగేవి. అవి నాకు చాలా తృప్తిని కలిగించాయి. అభ్యాసకులకు ఆహ్లాదంతో పాటు ప్రయోజనం చేకూర్చేవి. 

జ:   ఉంది. ఎందుకంటే వరంగల్ జిల్లా అయినవోలు మల్లికార్జునాలయం చారిత్రక సత్యాల గురించి వాదోపవాదాలు జరిగేవి. అందుకోసం సమాచారాన్ని సేకరిస్తున్నప్పుడు తెలంగాణాలో మల్లికార్జునాలయాలు రాస్తే బాగుంటుంది అనిపించింది. ఈ చారిత్రకాంశాన్ని  కొంతభాగం గ్రంథస్థం చేయడం జరిగింది. డా. పి.వి. పరబ్రహ్మశాస్త్రి, డా. బూదరాజు రాధాకృష్ణ గార్ల సహకారం తీసుకోవడం జరిగింది.

జ:   ఐదు దశాబ్దాల సాహితీ జీవితం ఆయనది. తెలంగాణ రాష్ట్ర అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షులు. తెలంగాణ శతక సాహిత్యం (1975- 2000)అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు. ఎనిమిది గ్రంథాలు వెలువరించారు. సినారె, ద్వానా శాస్త్రి మొదలగు వారి నుండి 15 ఉత్తమ పురస్కారాలు పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం అందుకున్నారు. అనేకమందిని సాహితీ పరులుగా తీర్చిదిద్దారు. 

జ:    ఇప్పటివరకు నా సాహిత్యం 17 గ్రంథాలుగా వెలువడింది. ఆత్మ అక్షరమైన వేళ, ఎప్పుడూ వసంతానివే, అమ్మ పిలుస్తోంది, గదిలో నక్షత్రం, ఆకాశం నా సంతకమే, ఆమనిలో వెన్నెల కోయిలలు, మరో ఉదయాన్ని పిలుస్తా, తూర్పుతీరం (వచన కవితా సంపుటి), శ్రీ రంగరాజు కేశవరావు సాహిత్యం-పరిశీలన (సిద్ధాంత గ్రంథం), సినారె కవితాలోకనం(వ్యాససంపుటి), సరళరేఖలు (సాహిత్య విమర్శ), నడుస్తున్న అక్షరం (పల్లేరు వీరస్వామి జీవిత చరిత్ర), కొమురవెల్లి మల్లన్న క్షేత్ర మాహాత్యం (క్షేత్ర చరిత్ర), సినారె వాక్కుకు వయసు లేదు – తత్వ విశ్లేషణ, వాల్మీకి ఆశ్రమస్థలి వెల్ది, సమీక్షణం (వ్యాస సంపుటి), జనగామ జిల్లా సాహిత్య చరిత్ర ఇవి వెలువడిన గ్రంథాలు. జనగామ తాలూకా సాహితీమూర్తులు, జనగామ పట్టణం వందేండ్ల సాహిత్య సమావేశాలు, జనగామ తెలుగు కవులు-స్వీయ గానాలు ముద్రణలో ఉన్నాయి.

జ:     నేడు వెలువడుతున్న కవిత్వమంతా బాగుందని చెప్పలేం. పదాల పోహళింపుతో వెలువడే కవిత్వమే రాసులు రాసులుగా ఉంది. అటువంటి కవిత్వం బీరువాల్లో బందీ అవుతోంది. కవిత్వం ఎప్పుడైనా సార్వజనీనంగా ఉండాలి. సార్వకాలికమై జ్వలించాలి. ప్రయోగ శీలత తరగలెత్తాలి. అనుభూతి ఉండాలి కానీ అది వస్తు సౌందర్యాన్ని మరుగునపరిచేదిగా ఉండకూడదు. పద పదంలో కొత్తదనం విరబూయాలి. అనుభవ తాత్పర్యసీమల నుంచి ప్రభవించినట్లుగా ఉండాలి. ఆశావహమైన సవ్వడుల స్వరాలను ఒక ప్రవాహంగా నినదింపజేసే విధంగా ఉండాలి. ‘విప్పి చెప్పేది విమర్శ’ అన్నారు సినారె గారు. సాహిత్య విమర్శ సహేతుక విశ్లేషణతో సాగాలి. వస్తు తత్వాన్ని ప్రామాణికమైన కొలమానాలతో విడమరిచి చెప్పేదిగా ఉండాలి. నిష్పాక్షిక దృష్టితో వివేచన సాగాలి. అభిమానాశ్రిత ప్రశంస ఉండకూడదు. వ్యక్తి ప్రశంస కన్నా వ్యక్తిత్వ విశ్లేషణ కలిగిఉండాలి.

జ:    ఎందరు చీదరించుకున్నా పద్యం చెరిగిపోదు. అమృత రూపమై జాలువారుతుంది. పద్యం విద్య అన్నాడు నన్నయ్య గారు. అందుచేత పద్యం అనారతం హరితమధురంగా ప్రవహిస్తూనే ఉంటుంది. ఆగామికాల సాహిత్యానికి పరిపూర్ణతను స్థిరపరుస్తుంది. ఆధునికంగా ఎన్ని ప్రక్రియలు మొలుచుకొచ్చినా, దూకినా పద్యం నవ నవంగా శోభలు కుమ్మరిస్తూనే ఉంటుంది. ఖండకావ్యాలు, కావ్యసంపుటాలు, కావ్య సంకలనాలు పెద్ద ఎత్తున వెలువడుతూ రసజ్ఞ లోకాన్ని పరవశత్వంలో ముంచెత్తుతున్నాయి. పద్య సదస్సులు నిర్వహింపబడుతూనే ఉన్నాయి. ఇంతే చాలదు. ఆధునిక టెక్నిక్ తో పద్యం రాయబడాలి. అభివ్యక్తిలో తళుకు భాసించాలి. శైలిలో ఆర్ద్రతాశ్రితమైన వాదం ఉండాలి. పద్యంలోని ప్రాణ చైతన్యం వస్తువుతో సిద్ధిస్తుంది. కాబట్టి వస్తువు ఎంపికలో రుచిర భావనా తత్వాన్ని కలిగిఉండాలి. ప్రయోగశీలత సహజత్వాన్ని తొడుక్కొని సాగాలి.

జ:    సన్మానాలు, పురస్కారాల వల్ల నేను పొందిన అనుభూతి వర్ణనాతీతం. సాహిత్యమే సర్వస్వంగా జీవిస్తున్న రచయిత ఎన్నడూ అవార్డులకోసం నిరీక్షించడు. ఎలాంటి ‘పట్టు’ పరిశ్రమ కోసం ఆరాటపడడు (నవ్వుతూ). పైరవీలు చేయడు. అవార్డులు రచయితకు ప్రోత్సాహాన్ని ఇస్తాయి. 

జ:   సాహిత్యరంగం బాగా అభివృద్ధి చెందింది. సాహిత్య సంస్థలు అసంఖ్యాకంగా వెలిశాయి. కవితాసంపుటాలు, సంకలనాలు వెలువడ్డాయి. సదస్సులు జరిగాయి. ప్రస్తుతం కూడా జరుగుతూనే ఉన్నాయి. సాహితీ కృషి చేసినవారికి అధిక సంఖ్యలో పురస్కారాలు అందింపబడుతూనే ఉన్నాయి. తెలంగాణ సాహిత్య అకాడమీ ఏర్పడిన తర్వాత అనేక కార్యక్రమాలు ప్రయోజనవంతంగా సాగుతూ సాహిత్య వికాసానికి దోహదపడుతున్నాయి. అందులో జిల్లా సాహిత్య చరిత్రలు వెలువరింప జేయడం బాగుంది. తెలంగాణ సారస్వత పరిషత్తు సైతం విశేషకృషిని అందిస్తున్నది. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సాహిత్య చైతన్యానికి తెలంగాణ సంస్కృతికి అవిరళంగా సేవలు అందిస్తున్నది. మునుపెన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పిదప సాహిత్యం సరికొత్త మూల్యాలతో ప్రవర్ధిల్లుతూ వచ్చిందని చెప్పవచ్చు.

జ:    సాహిత్యం విస్తృతమవుతూ వస్తున్నది. ఎన్ని వాదాలొస్తే అంత మంచిది. అవి అస్తిత్వాన్ని కోల్పోకూడదు. నాకు నచ్చింది మానవతావాదం.

జ:   బాల్యవయస్సులో స్కూల్లో నన్ను అనుకరించడం, ప్రత్యేక కార్యక్రమాల్లో నా వాణిని కొనసాగించడం మొదలు ప్రఖ్యాత సాహితీవేత్తగా ఎదిగిన నా విద్యార్థి డా. పోరెడ్డి రంగయ్య. ఎన్నో గ్రంథాలు వెలువరించాడు. మరెన్నిటికో సంపాదకత్వం వహించాడు. వందలాది సదస్సులకు వ్యాఖ్యాతగా ప్రశంసలు పొందాడు. అనేక బిరుదులు పొందాడు. అందరికీ ఆత్మీయుడిగా నాకు గర్వకారణంగా నిలిచాడు. పోరెడ్డి రంగయ్య మూడో అన్న పోరెడ్డి ఉప్పల్ కూడా నాకు ప్రియ శిష్యుడే. ఇట్లా ఎంతోమంది వారి వారి సామర్థ్యాలను బట్టి మంచి పదవుల్లో ఉన్నారు.

జ:  ఈ తరం వారికి కొరవడింది అధ్యయనం. విస్తృత అధ్యయనం చేయాలి. రచన అనుభూతి ప్రధానంగా సాగాలి. అభివ్యక్తిలో నవ్యత్వం గుబాళించాలి. సృజన శీలత పదునుగా ఉండాలి. వ్యక్తిని, సమాజాన్ని ఉత్తేజపరచాలి.

అనేక ధన్యవాదాలు సార్🙏🏼 మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి, సమగ్రమైన మీ జీవిత విశేషాలను అందించినందుకు మా తరఫున, మా మయూఖ పాఠకుల తరఫున నమస్సులు, కృతజ్ఞతలు

🙏🏼

You may also like

7 comments

KUPIRALA RAMESH March 19, 2026 - 4:37 pm

ఈ ఇంటర్వ్యూ కేవలం మాటల సమాహారం కాదు, జీవితం ఎలా ఉండాలో చెప్పే మార్గదర్శకం. డాక్టర్ లింగంపల్లి రామచంద్ర గారి ప్రతి మాటలో అనుభవం, ప్రతి ఆలోచనలో విలువ, ప్రతి సందేశంలో సమాజానికి ఉపయోగపడే దిశ కనిపిస్తోంది. ఆయన జీవితం, ఆయన సాహిత్యం మనందరికీ ఒక దీపస్తంభం వంటిది. ఇలాంటి మహనీయుడు మా పెదనాన్నగారిగా ఉండటం నా జీవితంలో గొప్ప వరం. ఆ దంపతులకు నా సాష్టాంగ నమస్కారం 🙏

Reply
lotus 365 apk May 8, 2026 - 1:52 am

Downloaded the Lotus 365 apk and it’s way smoother than using the website on my phone. Betting on the go is now a breeze! Get that lotus 365 apk!

Reply
lovejilislot May 8, 2026 - 1:53 am

Lovejilislot is the real deal! Got some wins already. Definitely worth checking out for some slot action! lovejilislot

Reply
philslotsapk May 8, 2026 - 1:53 am

Philslotsapk is where it’s at! Downloaded and playing in minutes. Great selection of slots. Give it a go! philslotsapk

Reply
747 live agent May 19, 2026 - 9:04 pm

Needed some help with my account and the 747 live agent was super helpful. Sorted me out in minutes. A+ service! 747 live agent

Reply
phwingame May 19, 2026 - 9:04 pm

Phwingame looks interesting. Anyone familiar with it? Is it legit? Give me the lowdown before I dive in! phwingame

Reply
s666xtinnude May 19, 2026 - 9:04 pm

Heard about s666xtinnude anyone tried it. Is it safe with payouts? s666xtinnude

Reply

Leave a Comment