యోగాసనం, ప్రాణాయామం, మంత్రం, ధ్యానంతో కూడుకొని చేసే సంపూర్ణ సాధనే సూర్య నమస్కారాలు. ఇది 12 రకాల భంగిమలతో కూడి ఉంటుంది. ఏ ఆసనాలు అయినా బ్రహ్మముహూర్త సమయంలో చేస్తే మంచి ఫలితం వస్తుంది.
సూర్యనమస్కారాలు బ్రహ్మముహూర్త సమయం లేదా సూర్యోదయ వేళలో సూర్యునికి అభిముఖంగా ఒక్కో భంగిమకు ఒక్కో మంత్రం జపిస్తూ చేయాలి.
1. ప్రణమాసనము :
చేయు విధానం : తివాచీపై సమస్థితిలో నిల్చొని కనురెప్పలు మూయాలి. రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్రను ఛాతిపై ఉంచాలి. ఈ స్థితిలో బొటనవేళ్ళు మాత్రమే ఛాతీని తాకాలి. మిగిలిన వేళ్ళను బొటన వేళ్ళతో కలిపి ఉంచి, కొద్దిసేపు ఉచ్ఛ్వాస నిశ్వాసలను చేయాలి.
ఈ ఆసనాన్ని సూర్య మంత్రంతో జపించదలుచుకున్నవారు ”ఓం మిత్రాయ నమః” అని జపించాలి.
ప్రయోజనాలు : – ఏకాగ్రత, ప్రశాంతత, మానసిక స్థిరత్వం కలుగుతుంది.
– వెన్నెముక నిటారుగా ఉంటుంది.
2. హస్త ఉత్తానాసనము :
చేయు విధానం : శ్వాస లోపలికి పీలుస్తూ, రెండు చేతులు పైకి చాచి, మోకాళ్ళు వంచకుండా చేతులను చూస్తూ, నడుము నుండి పైభాగం వెనుకకు వంచాలి.
ఈ ఆసనాన్ని మంత్రంతో జపించదలుచుకున్నవారు ”ఓం రవయే నమః” అని జపించాలి.
ప్రయోజనాలు : – జీర్ణక్రియ, ఉదర కండరాల పనితీరు మెరుగవుతుంది.
– అధిక బరువు, కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
3. పాదహస్తాసనము :
చేయు విధానం : శ్వాస విడుస్తూ ముందుకు వంగి రెండు చేతులను పాదాల పక్కగా ఉంచాలి. చేతులు, పాదాల జతలో ఉంటాయి కాబట్టి దీనికి పాదహస్తాసనము అని పేరు.
ఈ స్థితిలో తలను క్రింది వంచే ఉంచాలి. లేదంటే మెడ పట్టే అవకాశం ఉంది. మోకాళ్ళు వంచరాదు.
ఈ ఆసనాన్ని మంత్రంతో జపించదలుచుకున్నవారు ”ఓం సూర్యాయ నమః” అని జపించాలి.
గమనిక : అధికంగా రక్తపోటు ఉన్నవారు, నడుమునొప్పి మరియు మెడనొప్పి ఉన్నవారు ఈ ఆసనం వేయరాదు.
ప్రయోజనాలు : – జీర్ణక్రియ బాగా పనిచేస్తుంది.
– వెన్నెముక శక్తివంతం అవుతుంది.
– మలబద్ధకం, పొట్ట తగ్గుతుంది.
– స్త్రీలకు కలిగే పొత్తికడుపు సమస్యలు తగ్గుతాయి.
4. అశ్వ సంచలనాసనము :
చేయు విధానం : ఎడమ మోకాలును వంచుతూ పాదాన్ని నేలపై ఉంచి, కుడికాలును బాగా వెనుకకు చాచి వేళ్ళపై పాదాన్ని ఉంచాలి. రెండు చేతుల్ని పైకెత్తి నడుము నుండి పైభాగమంతా వెనుకకు వంచాలి. ఈ స్థితిలో శ్వాసను పీల్చి లోపలే ఆపాలి.
ఈ భంగిమ దౌడు తీయటానికి సిద్ధమైన గుర్రము వలె ఉంటుంది కావున దీనికి అశ్వ సంచలనాసనము అని పేరు.
ఈ ఆసనాన్ని మంత్రంతో జపించదలుచుకున్నవారు ”ఓం భావనే నమః” అని జపించాలి.
ప్రయోజనాలు : – కండరాలు, నాడీ మండలం శక్తివంతం అవుతుంది.
– పొట్ట తగ్గుతుంది.
– రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.
5. దండాసనము :
చేయు విధానం : శ్వాస విడుస్తూ కటి భాగము పైకెత్తి రెండు చేతులను బాగా చాచి నేలపై ఆన్చాలి. నడుమును ఎత్తరాదు, దించరాదు. వెనుకనుండి చూస్తే ఒక సరళరేఖలా ఉండాలి. కాలి మడమలు నేలపై ఆన్చి ఉంచాలి. ఈ స్థితిలో ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరుగుతాయి.
ఈ ఆసనాన్ని మంత్రంతో జపించదలుచుకున్నవారు ”ఓం ఖగాయ నమః” అని జపించాలి.
ప్రయోజనాలు : – శరీరమంతా నూతన శక్తి వస్తుంది.
– వెన్నెముక, నరాలు ఉత్తేజం చెంది రక్తప్రసరణ బాగా జరుగుతుంది.
6. అష్టాంగ నమస్కారాసనము :
ఎనిమిది అంగాలు నేలకు ఆనటం వలన దీనికి అష్టాంగ నమస్కారాసనము అనే పేరు వచ్చింది.
చేయు విధానం : చేతులు, పాదాలు కదల్చకుండా నడుమును కొంచెం పైకెత్తి, శ్వాసను విడుస్తూ, ఛాతీ, గడ్డంను రెండు చేతుల మధ్యలో నేలపై ఆన్చాలి. ఈ స్థితిలో రెండు కాళ్ళు, రెండు మోకాళ్ళు, రెండు చేతులు, ఛాతీ, గడ్డము నేలపై ఉంటాయి.
ఈ ఆసనాన్ని మంత్రంతో జపించదలుచుకున్నవారు ”ఓం వూష్ణే నమః” అని జపించాలి.
ప్రయోజనాలు : – కాళ్ళు, చేతులు, కండరాలు శక్తివంతం అవుతాయి.
– వెన్నెముక, ఛాతీ భాగానికి ప్రయోజనం చేకూరుతుంది.
– తలలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.
7. భుజంగాసనము :
ఈ భంగిమ పడగ విప్పిన పాములా ఉంటుంది కావున దీనికి భుజంగాసనము అని పేరు.
చేయు విధానం : శ్వాస తీసుకుంటూ అష్టాంగ నమస్కార ఆసనము నుండి భుజంగాసనములోకి రావాలి.
పాదాలను వెనుక జతలో ఉంచి, చేతులను నేలపై ఆన్చి తల, నడుము వీలైనంత పైకెత్తాలి.
ఈ ఆసనాన్ని మంత్రంతో జపించదలుచుకున్నవారు ”ఓం హిరణ్యగర్భాయ నమః” అని జపించాలి.
ప్రయోజనాలు : – పొత్తికడుపు, కాలేయం, మూత్రపిండాలకు చక్కటి వ్యాయామం.
– మలబద్ధకం పోతుంది.
– ఛాతీకి, భుజాలకు ప్రయోజనం చేకూరుతుంది.
8. పర్వతాసనము :
ఈ భంగిమ పర్వతం ఆకారంలో ఉంటుంది కావున దీనికి పర్వతాసనము అని పేరు వచ్చింది.
చేయు విధానం : ఐదవ స్థితి వలనే చేతులు, పాదాలు నేలపై ఉంచి నడుమును పైకెత్తి తలను క్రిందికి దించుతూ శ్వాస విడవాలి.
ఈ ఆసనాన్ని మంత్రంతో జపించదలుచుకున్నవారు ”ఓం మరీచాయ నమః” అని జపించాలి.
ప్రయోజనాలు : – కాళ్ళు, చేతులకు ప్రయోజనం
– నరాలు శక్తివంతం అవుతాయి.
9. అశ్వ సంచలనాసనము :
చేయు విధానం : నాలుగవ స్థితిలో చెప్పిన విధానమే కానీ కాలు మార్చాలి. నాలుగవ స్థితిలో కుడికాలును వెనుకకు చాచితే ఇక్కడ ఎడమ కాలును వెనుకకు చాచి, కుడికాలును ముందుంచి శ్వాస పీలుస్తూ నడుము నుండి పై భాగం వెనుకకు వంచాలి. చేతులు వంకర ఉండరాదు.
ఈ ఆసనాన్ని మంత్రంతో జపించదలుచుకున్నవారు ”ఓం ఆదిత్యాయ నమః” అని జపించాలి.
ప్రయోజనాలు : – నాలుగవ స్థితిలో వలనే ప్రయోజనాలు చేకూరుతాయి.
10. పాద హస్తాసనము :
చేయు విధానం : మూడవ స్థితిలో చేసినట్లుగానే అశ్వ సంచలనాసనం నుండి పాద హస్తాసనంలోకి శ్వాస విడుస్తూ రావాలి.
ఈ ఆసనాన్ని మంత్రంతో జపించదలుచుకున్నవారు ”ఓం సవిత్రే నమః” అని జపించాలి.
ప్రయోజనాలు : – మూడవ స్థితి వలనే ప్రయోజనాలు చేకూరుతాయి.
11. హస్త ఉత్తానాసనము :
చేయు విధానం : శ్వాస తీసుకుంటూ రెండు చేతుల్ని పైకెత్తి నడుము నుండి పైభాగం వెనుకకు వంచుతూ రెండు కాళ్ళను వంపు లేకుండా జతలో ఉంచాలి.
ఈ ఆసనాన్ని మంత్రంతో జపించదలుచుకున్నవారు ”ఓం ఆర్కాయ నమః” అని జపించాలి.
ప్రయోజనాలు : – రెండవ స్థితిలో వలనే ప్రయోజనాలు చేకూరుతాయి.
12. ప్రణమాసనము :
చేయు విధానం : శ్వాస తీసుకుంటూ నడుమును యథాస్థితికి తీసుకుని వచ్చి మొదటి స్థితి వలనే నమస్కారముద్ర ఛాతీపై ఉంచాలి.
ఈ ఆసనాన్ని మంత్రంతో జపించదలుచుకున్నవారు ”ఓం భాస్కరాయ నమః” అని జపించాలి.
ప్రయోజనాలు : – మొదటి స్థితిలో ప్రయోజనాలు చేకూరుతాయి.
గమనిక : ఈ 12 భంగిమలు ఒక ఆసనములోనుండి మరో ఆసనములోకి మారాలి. ఒక్కొక్కటి విడివిడిగా వేయరాదు.
మొదటి ఆరు భంగిమలే మరలా తిరిగి చేస్తాము. 5వ, 7వ భంగిమలో కొద్దిపాటి మార్పు ఉంటుంది.
ఒక్కో భంగిమ చేసినపుడు కలిగే ప్రయోజనంతో పాటు మొత్తం చేయటం ద్వారా శరీరంలోని విషపదార్థాలను తొలగించుకోవటమే కాక….
1. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు.
2. మెటబాలిజం పెరుగుతుంది.
3. ఋతు సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయి.
4. నడుము సన్నగా అవుతుంది.
5. వత్తిడి తగ్గి, నిద్ర బాగా పడుతుంది.
6. చర్మం కాంతివంతమవుతుంది.
7. గుండె, ఊపిరితిత్తుల పనితీరు మెరుగవుతుంది.
8. అనహత, విశుద్ధి, స్వాధిష్టాన, మణిపూర, ఆజ్ఞాచక్రాలు శుద్ధి అవుతాయి.