రెక్కలొచ్చిన పక్షి ఏదో రంగుల లోకాన విహరిస్తోంది
రేకు విప్పని పువ్వు చుట్టూ చంచరీకం పరిభ్రమిస్తోంది
పక్షి ఎరుగదు రంగులలో రాక్షసం దాగుంటుందని
పువ్వు ఎరుగదు పుప్పడిలో ముప్పు పొంచుంటుందని
పరిణతిలేని ప్రాయం పద్మవ్యూహాన చిక్కింది
ఛేదించే శక్తి లేని నిస్సహాయత నిర్దాక్షిణ్యంగా నులిమేసింది
మర్మమెరుగని హరిణమేదో పులినోటికి కబళమయింది
అంకురించిన బీజమేదో భవితకు భారమయింది
మొగ్గ తొడిగిన రూపమేదో మనుగడకు శాపమయింది
ఆవిరైన అమ్మతనం చెత్త కుప్పను ఆశ్రయించింది
మంటగలిసిన మానవత్వం చేతులు కడిగేసుకుంది
పాప మెరుగని పురిటి గొంతుక గుక్కపట్టి ఏడుస్తోంది
వినగలిగిన శక్తి ఉంటే ప్రశ్నల శరపరంపర –
అది తన అస్తిత్వాన్ని ప్రశ్నిస్తోంది హక్కుల కోసం పోరాడుతోంది
బంధాలను నిలదీస్తోంది బాధ్యతలను గుర్తు చేస్తోంది
నడతను హెచ్చరిస్తోంది విలువలను బేరీజు వేస్తోంది
ఈ పాపం వ్యక్తిదా? వ్యవస్థదా? అని సవాలు విసురుతోంది.