అది ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో అబ్దుల్ సత్తార్, బీబీఅమినా అనే దంపతులు ఉండేవారు. వాళ్ళిద్దరిది మంచి జోడి అని ఊరు ఊరంతా ప్రశంసించేవారు. ఎందుకంటే అతను, ఆమె ఇద్దరూ అందమైన వారు. ఇద్దరూ భారీ మనుషులే. అయినప్పటికీ బీబీ ఆమినా ఇంకా అందంగా ఉండేది. పెద్ద తలకాయ, తలలో దట్టమైన నల్లని పొడగాటి వెంట్రుకలు, వెడల్పాటి నుదురు, రెండు కలిసి ఉన్న నల్లని కనుబొమ్మలు, గుండ్రటి నల్లని కళ్ళు, కళ్ళల్లో పెట్టుకున్న కాటుక వల్ల ఆమె ముఖం ఇంకా కళకళలాడుతూ, వెలిగిపోతూఉండేది. ఆమె ప్రశాంతమైన ముఖవర్చస్సును చూడగానే ఎవరికైనా చెయ్యెత్తి సలాం చేయాలనిపిస్తుంది.
అంతకు తగ్గట్టుగా ఆమె ఎంతో సంస్కారవంతురాలు. మంచి తెలివితేటలు గలది. మర్యాద, అణకువ, వివేకత, నైతికత అన్ని ఆమెలో ఉట్టిపడుతూ ఉండేవి. గ్రామంలో అందరూ వాళ్ళిద్దర్నీ ఎంతో గౌరవంగా చూసేవారు. వాళ్ల అదృష్టమేమో గాని ముగ్గురు అమ్మాయిలే వారి సంతానం, మగ పిల్లలు కలగలేదు.
తన భర్తకు ఒక ఎకరం పొలం ఉన్నప్పటికీ బీబీ ఆమినాకు తండ్రి తరఫున ఆస్తి నుండి అల్లాహ్ నిర్దేశించిన వాటా ప్రకారం ఒక ఎకరం పొలం వచ్చింది. ఆ విధంగా వారికి జీవితం సాఫీగా సాగుతోంది.
గౌరవ మర్యాదలగల ఇల్లు కాబట్టి ఎవరు కూడా వారి ముగ్గురు అమ్మాయిలను మరో విధంగా చూసేవారు కాదు. అలా ముగ్గురు అమ్మాయిలు ఎదుగుతూ చదువుతూ మానమర్యాదలతో ఉంటున్నారు.
ముగ్గురు అమ్మాయిలు మంచి అందమైన వారు. కాలేజీ చదువులు పూర్తి చేశారు. హైదరాబాదుకు చెందిన దగ్గరి బంధువులలోని మంచి సంబంధాలను చూసి ఒకరి తరువాత మరొకరికి (నికాహ్) వివాహం చేసి వేశారు.
చూస్తుండగానే కాలం కొవ్వొత్తిలా కరిగిపోతూనే ఉంది. అమ్మాయిల వివాహమైన నాలుగైదు సంవత్సరాలకు భర్త అబ్దుల్ సత్తార్ మామూలు జ్వరంతో కొద్ది రోజుల్లోనే పరలోక యజమానిని కలుసుకోవడానికి వెళ్ళిపోయారు.
చావుకు వచ్చినవాళ్లు నాలుగు ఐదు రోజులలో అందరూ వెళ్లిపోయిన తర్వాత బీబీఆమినా ఒంటరిదైపోయింది. తన జీవితం గురించి దీర్ఘాలోచనలో పడింది. మగసంతానం లేదాయే ఇప్పుడు ఇంత చేసి ఆడపిల్లల వద్ద బతకవలసిన పరిస్థితులు వచ్చాయా? ఒకవేళ అలాంటి పరిస్థితిలేవస్తే ఎవరి వద్ద ఉండాలి? ఎవరు బాగా చూసుకుంటారు అని ఆలోచిస్తుంది. అందరూ బాగానే చూసుకుంటారు కానీ పెద్ద కూతురు పెద్దల్లుడు ఇంకా బాగా చూసుకుంటారని నిర్ణయానికి వచ్చింది. అంతలోనే పెద్ద కూతురు సల్మా ఫోన్ వచ్చింది. బీబీ ఆమినా ఫోన్ ఎత్తింది; అటు నుండి సల్మా: అస్సలాము అలైకుమ్ అమ్మీ జాన్ (మీపై శాంతి కురియు గాక) అనగానే వ అలైకుమ్ అస్సలాం బేటా ( మీపై కూడా శాంతి కురియు గాక) అంటూ మహా సంతోషంతో జవాబు ఇస్తూ సల్మా ముందు నువ్వు చెవి పట్టుకో! ఎందుకమ్మా అంది సల్మా. నిన్ను జ్ఞాపకం చేసుకున్నాను ఒక్క క్షణం కూడా ఆలస్యం కాకుండా నీ ఫోన్ వచ్చింది అందుకే అంటూ బిగ్గరగా నవ్వింది బీబీ ఆమినా. సరేనమ్మా నా మనసులో ఒక మాట ఒకటి చెప్పాలని ఫోన్ చేశాను. ఒక్కదానివే ఊర్లో అంత పెద్ద ఇంట్లో ఉండడం కంటే మా దగ్గరికి వచ్చేయ్ అమ్మిజాన్. నిన్ననే మీ అల్లుడుగారు నేను నీ గురించి మాట్లాడుకున్నాము. అమ్మీజాన్ న్ని ఇక్కడికి పిలుచుకుందామని చెప్పుకున్నాము. ఆయన కూడా సరేనన్నారు. అందువల్ల నువ్వు వెంటనే బయలుదేరి వచ్చేయ్ అమ్మీ అంది సల్మ ప్రేమగా.
సల్మా! నిజానికి నేను ఈ విషయమే ఆలోచిస్తుండగా నీ ఫోన్ వచ్చింది నిజంగా ఇది అల్లాహ్ తరఫునుండి అని నేను అనుకుంటున్నాను అంటూ సరేనమ్మా రెండు మూడు రోజులలో బయలుదేరుతాను అంది తల్లి బీబీ ఆమినా.ఖుదాహాఫీజ్ (అంటే నిన్ను అల్లాహ్ పరం చేశాను అని అర్థం) అంటూ సల్మా ఫోన్ పెట్టేసింది.
బీబీ అమీనా, తమ వీధిలోని లలితమ్మను అనసూయమ్మను సుశీలమ్మను ఫాతిమాబీ లతో పాటు ఊరు వారందరి గడపగడపకు వెళ్లి తను హైదరాబాదు వెళుతున్న విషయం చెప్పింది. అందరూ ఎంతో ఆత్మీయత కనబరుస్తూ ఆమె వెళ్లిపోవడం తమకు వెలితిగా ఉంటుందని అభిప్రాయాన్ని వెలిబుచ్చారు కానీ తప్పదుగా. ఆధునిక పేరుతో గ్రామాల రూపురేఖలే మారిపోయాయి. దుమ్ము ధూళి గలదారులు నున్నటి రోడ్లుగా మారిపోయాయి అదేవిధంగా ఉదయాన్నే సానుపు జల్లి అందంగా ముగ్గులు వేసే వాకిళ్లు కూడా రోడ్ల పుణ్యమా అని రోడ్లుగా మారి పోయాయి. బీబీ ఆమిన ఇంటికి కొద్ది దూరంలోనే బస్ స్టాప్ ఉంది. బీబీ ఆమినాతోపాటు ఊరిలో చాలామంది బస్ స్టాప్ వద్ద ఆమెకు వీడ్కోలు చెప్పడానికి నిలబడి ఉన్నారు. ఆ గుంపును చూసి డ్రైవరు కండక్టరు ఈరోజు ప్రయాణికుల సందడి బాగానే ఉండేటట్టు ఉందిగా అనుకున్నారు. కానీ ఆమినాతోపాటు మరో ఇద్దరు ముగ్గురు ప్రయాణికులు మాత్రమే బస్సు ఎక్కారు అంతమంది బీబీ ఆమె నాకు వీడ్కోలు చెప్పడానికి వచ్చారని విని, సందడిని చూసి డ్రైవర్ కండక్టర్ మతసామరస్యమంటే ఇదే, సౌభ్రాతృత్వం అంటే ఇదే, ప్రేమ అభిమానం అంటే ఇదే అంటూ ఎంతో శ్లాగించారు. వారి మాటలు విన్న జనాలు అవును మా ఊరిలో మతసామరస్యం ఉట్టిపడుతుంటుంది. మేమంతా అన్న తమ్ముళ్ల వలె అక్కచెల్లెళ్ల వలె కలిసి మెలసిఉంటాము అని అన్నారు.
బస్సు కదిలింది. దాదాపు మూడు గంటల తర్వాత జూ పార్క్ వద్దగల తాడ్ బన్ స్టేజిపై ఆగింది. అప్పటికే ఆమె పెద్ద కూతురు సల్మా మనవడు మునవ్వర్, మనవరాలు నజ్మ ఎదురుచూస్తూ ఉన్నారు. ఆమె దిగగానే కూతురు ఆలింగనం చేసుకుంది. అమ్మమ్మగా ఆ ఇద్దరు పిల్లలను ఎంతో ప్రేమతో బీబీ ఆమినా రెండు చేతులతో వారిని అదుముకుంది.
ఇల్లు దగ్గరే అయినా ఆటో మాట్లాడుకుని వెళ్లారు. తల్లి వచ్చిన విషయం మిగతా ఇద్దరు కూతుళ్లకు అల్లుళ్లకు మనవళ్ళకు మనవరాళ్లకు తెలిసిందే గనుక మర్నాడు వాళ్లంతా ఇక్కడికి వచ్చేసారు. అందరూ ఒకరినొకరు సలాములు చేసుకొన్నారు. ఇద్దరు అల్లుళ్ళు కూడా ఎంతో వినయంతో కొద్దిగా ముందుకు వంగి కుడి అరచేతిని తమ వైపు తిప్పుకొని అస్సలాము అలైకుమ్ మామి జాన్ (అత్తగారు) అంటూ సలాం చేశారు. అందరూ పొద్దంతా సంతోషంతో గడిపి సాయంత్రానికి వెళ్లిపోయారు.
బీబీఆమీనా జీవితం సాఫీగానే, సంతోషంగానే గడిచిపోతోంది. తన అత్తవారి ఎకరం పొలం, తన తండ్రి ఆస్తి నుండి సంక్రమించిన ఎకరం పొలం కౌలుకు ఇచ్చింది గనుక వాటి ద్వారా వచ్చే సొమ్ము వల్ల ఆమెకు ఎలాంటి చీకు చింత లేకుండా పోయింది.
కాలం ఆగదు తన పని తాను చేసుకుంటూ పోతుంది.ఆ కాలంలో పుట్టే వారెవరో, గిట్టే వారెవరో ఇంకా సజీవంగా ఉండేవారెవరో అది పట్టించుకోదు.
ఎందుకో బీబీ ఆమినాకు కాస్త నలతగా ఉంది. హాస్పిటల్కు తీసుకు వెళితే డాక్టర్ గారు మందులు రాసి మామూలు జ్వరమే ఆందోళన పడవలసిన అవసరం లేదు, ఈ మందులు వాడండి నయమైపోతుంది అన్నాడు.
ఆ తర్వాత నాలుగైదు రోజులకు మస్జిద్ నుండి ఉదయపు నమాజు అజాఁ ఇస్తుండగా ఆమె ప్రశాంతంగా తన యజమాని అయిన అల్లాహ్ ను కలుసుకోవడానికి పరలోకం వెళ్ళిపోయింది.
హైదరాబాదులోని అల్కాపూర్ లో ఉన్న అబ్దుల్ రహీం వ్యాకులతకు గురవుతున్నాడు, అతని మనసు నిలకడగా ఉండలేక పోతుంది ఎందుకో కాళ్లు చేతులు వణికినట్టుగా అనిపిస్తుంది ఏమిటి విచిత్రం ఎందుకు నాకిలా అవుతుంది అని తనను తానే అబ్దుల్ రహీం ప్రశ్నించుకుంటున్నాడు, పరేషాన్ అవుతున్నాడు.
మరోవైపు ఇంటి ముందు టెంట్ వేయబడింది. కుర్చీలు బల్లలు వేయబడ్డాయి. చుట్టాలు పక్కాలు అందరికీ ఫోన్లు చేయబడ్డాయి అలాంటి ఫోను ఒకటి అల్కాపూర్ లోని అబ్దుల్ రహీం గారికి వచ్చింది. వరుసకు మామ అవుతాడు. మాము! అమ్మీకా ఇంత ఖాల్ హో గయా అమ్మ మరణించింది అని అనగానే ఇన్నాలిల్లాహి వ ఇన్న ఇలైహి రాజిఊన్ ప్రతి ప్రాణి మరణం రుచి చూడ వలసిందే అంటూ తన విచారాన్ని వెలిబుచ్చుతూ ఫోన్ పెట్టి వేశాడు. అప్పుడు అతనికి అర్థమైంది తను ఎందుకు ఆందోళన చెందాడో, ఎందుకు శరీరం వణికిందో,మనసు ఎందుకు నిలకడగా ఉండలేకపోయిందో.
ఎందుకంటే బీబీ ఆమినా చాలా కాలం ముందే కొంత డబ్బు అబ్దుల్ రహీం గారికి ఇస్తూ, నేను చనిపోతే నా డబ్బులతోనే నా చావు ఖర్చులు మీరు చెల్లించాలి. మా అల్లుళ్లకు నా చావు ఖర్చు పెట్టకుండా ఆపాలి. అని చెప్పింది. బీబీఆమీనా మరణ వార్త విన్నాక అతని మనసు కుదుటపడింది. మరోవైపు బీబీ అమీనా ఊరిలో ఉన్న అఫ్జల్ గారి స్థితి కూడా అబ్దుల్ రహీం గారి స్థితిగానే అయింది. అదే ఆందోళన చెందడం, అదే శరీరం వణకడం, అదే మనసు నిలకడగా ఉండకపోవడం స్థితిలో మునిగిపోయాడు. ఎందుకిలా జరుగుతుంది? ఏమైంది నాకు? అంటూ తనలో తానే అనుకుంటూ ఉన్నాడు. ఇంతలోనే మొయిన్ అనే యువకుడు అఫ్జల్ గారి వద్దకు వచ్చి బీబీ ఆమినా మరణించిన విషయం చెప్పాడు. అప్పుడు అతనికి అర్థమైంది నా స్థితి ఇలా కావడానికి కారణం ఆమె చావు డబ్బులు నా దగ్గర పెట్టి ఉండడం ఆ డబ్బులు ఆమె చావు ఖర్చులకోసం నేను అందించడం జరగాలి ఎందుకంటే తమ అల్లుళ్లు తను చావు ఖర్చులు భరించకూడదని .అందుకే ఇలా జరిగిందని భావించి అతను వెంటనే బీబీఆమీన పెద్దకూతురు ఇంటికి వచ్చి డబ్బులు సల్మాకు ఇచ్చి వేశాడు. ఈ ఇద్దరు వ్యక్తులకు బీబీ ఆమిన ఆత్మఘోష ఒకే స్థితికి లోను చేసింది. ఆమె ఇద్దరికీ డబ్బులు ఎందుకు ఇచ్చిందంటే ఒకరు కాకపోయినా ఒకరైన తన డబ్బులతో చావు ఖర్చులు చేస్తారని.వాళ్లు ఇద్దరూ చేరుకొని డబ్బులు ఇచ్చిన తర్వాత ఆ ఆత్మ ఘోష శుభాత్మగా మారిపోయింది.
Rasheed
అమ్మా!
ఏమిటి బాబు.
నేను చిన్నప్పటినుండి చూస్తున్నాను. నాన్న మా కోసం ఎంతో కష్టపడు తున్నారు. ఒక పనికి పోతే ఆ పనికి వచ్చే డబ్బులు సరిపోయే పరిస్థితి లేకపోతే ఇంకో పని చేసి ఏరాత్రికో వస్తుంటారు అన్నాడు 20 ఏళ్ల అబ్దుల్ రహీం తన తల్లితో ఎంతో బాధపడుతూ.
అవును బాబు, అప్పో సప్పోచేసి మనందరినీ సాకుతూ ఈ ఇల్లుకూడా కట్టారు. అంటూ ఎంతో సంతృప్తితో సమాధానమిచ్చింది తల్లి సారాబి.
అవును ఇల్లు కట్టడం. మా ముగ్గురికి చదువులు చెప్పిస్తూ ఉన్నారు ఇదంతా ఎలా సాధ్యమైందమ్మ అంటూ ఆశ్చర్యంగా అడుగాడు అబ్దుల్ రహీం.
ఇదంతా సేవా బ్యాంకు వల్ల సాధ్యమైంది నాన్న, లేకపోతే ఈ ఇల్లు కట్టే వాళ్ళమో కాదో! అంటూ సేవా బ్యాంకు వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ చెప్పింది తల్లి సారాబి.
అవునమ్మా సేవా బ్యాంకు వారికి ఎంతగా కృతజ్ఞతలు చెల్లించినా తక్కువేనమ్మ. వడ్డీ లేకుండా వారు మనకు అప్పు ఇవ్వడం, సమయానుకూలంగా నాన్నగారు కష్టపడి ప్రతి వారం వారం సేవా బ్యాంకు అప్పు తీర్చడం నిజంగా గ్రేట్ అమ్మ. అన్నాడు తన తండ్రి పై గర్వపడుతూ అబ్దుల్ రహీం.
ఇంకా తన మాటను కొనసాగిస్తూ రమేష్ అంకుల్ గారికి కూడా సేవా బ్యాంకులబ్యాంకులో చేర్పించి తను జమానత్ గా ఉండి డబ్బులు ఇప్పించడం వల్ల రమేష్ అంకుల్ గారు కూడా ఇల్లు కట్టుకున్నారు కదమ్మా ! నాన్న కులమతాలు చూడకుండా సహాయం చేయడం సేవా బ్యాంకు వారు కూడా కులమతాలు పట్టించుకోకుండా బీదవారికి సహాయం చేస్తూ వడ్డీ లేని రుణం మంజూరు చేస్తూ సేవా చేస్తున్న బ్యాంకు వారికి నేను కూడా నా తరఫునుండి కృతజ్ఞతలు తెలుపుతున్నమ్మా అన్నాడు సంతృప్తి చెందిన మనసుతో అబ్దుల్ రహీం.
నిజమే నాన్న, మీ ముగ్గురి చదువులకు కూడా ఆయన డబ్బులు సంపాదిస్తూ సమకూరుస్తున్నారు. ఎంతో కష్టపడతారు. ఎంతో నిజాయితీతో, ధర్మసమ్మతంగా సంపాదిస్తారు. సత్యం మాట్లాడుతారు. న్యాయంగా మసులుకుంటారు. ఈ మంచి గుణాల వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయని అంది తల్లి సారాబి నిండు మనసుతో రెండు చేతులు ఎత్తి తన భర్త క్షేమంగా ఉండాలని అల్లాహ్ ను ప్రార్థిస్తూ.
ఒకరోజు అందరూ కలిసి బంధువుల ఇంటికి దావత్ కోసం వెళ్లారు. రాత్రి అక్కడే ఉండిపోవలసి వచ్చింది.
ఉదయం 10 కావస్తుండగా పొరుగువారు ఫోన్ చేసి మీ ఇల్లు బుల్డోజర్ తో కూల్చి వేస్తున్నారు అని ఎంతో బాధతో చెప్పారు.
ఆ వార్త వినగానే నాన్నకు గుండెపోటు వచ్చి అక్కడికక్కడే కూలిపోయి అనంత లోకాలకు వెళ్లిపోయారు. మేము మా బంధువులంతా శోక సముద్రంలో మునిగిపోయాము. అటు ఇల్లు పూర్తిగా కుప్పకూలిపోయింది.
భూమి కొన్న కాగితాలు ఉన్నాయి. ఇల్లు కట్టిన ఖర్చుల వివరాలు రాసిపెట్టి ఉన్నాయి. అయినా కూల్చివేశారు.
సారాబి తన భర్తను తలుచుకుంటూ పిల్లల భవిష్యత్తు ను గురించి ఆలోచిస్తూ కన్నీరు మున్నీరవుతోంది.
ఇటు అబ్దుల్ రహీం తన చదువు గురించి, తన చెల్లెళ్ళ చదువు గురించి, ఇల్లు గురించి ఎంతో బాధపడుతూ, నిరాశ నిస్సృహలకు లోనయి ఇవి మా తెల్లారి నా బతుకులు అనుకుంటూ చదువు మానేసి సంపాదనకై బయలుదేరాడు అబ్దుల్ రహీం.
పచ్చని నేలపై పశుత్వం
పెల్లుబికిన వేళ
భూగర్భ ఖనిజాలపై
దృష్టి పడిన వేళ
కన్నూ మిన్నూ కానకుండా,
స్త్రీలు పిల్లలు అని చూడకుండా,
దాడులు అత్యాచారాలు
జరిపిన వేళ
దుకాణాలు,
వాహనాలు,
ఇళ్ళు,కాల్చివేసి,
బూడిద చేసిన వేళ
దిగంబర స్త్రీపై
దాష్టీకం చేస్తున్నాడు క్రూరుడొకడు
బెల్టుతో బాదుతున్నాడు
నిర్దయతో వాడొకడు
నవ్విపోదురుగాక నాకేంటన్నట్టు
నడిబజార్ లో సిగ్గు లేని జనాలు
చోద్యం చూస్తున్నవేళ
కాళ్లొకచోట
చేతులొకచోట
తలొకచోట
మొండెమెుక చోట
తెగిపడిన వేళ
మణిపూర్ మాయలో పడిన వేళ
ప్రపంచంలో జరుగనటువంటి
హింస జరిగిన వేళ
ఈ కిరాతకానికి
హిట్లర్ సైతం సిగ్గుపడేవేళ
రెండు నెలలుగా
సోషల్ మీడియాను
చీకట్లో ఉంచిన వేళ
ఎంతోమంది తల్లుల
అక్కల చెల్లెళ్ళ
కూతుళ్ళ హాహాకారాలకు
ఆకాశం దద్దరిల్లిందేమో
దేవుని వద్ద దేర్ ఉంది
ఆయన వద్ద
అధేంర్ లేదు
దేవుడికి భయపడాలి మరి
అది మణిపూర్ కానీ
మరోటి కానీ
తప్పు చేసారంటే తలవంచాల్సిందే!
పిల్లి కళ్ళు మూసుకొని
పాలు తాగినంత మాత్రాన
ప్రపంచం చూడకుండా ఉంటుందా?
ఓ ప్రపంచమా మేలుకో
ఓభారతీయుడా మేలుకో
శాంతిని
సోదర భావాన్ని
ప్రేమాభిమానాలు
గల వాతావరణాన్ని
ఈ నేల కోరుతున్నది
కంకణం కట్టుకో
కంకణం కట్టుకో
కంకణం కట్టుకో
బతుకుబండి నడకంతా భయాల బాటలోనే
సెలబ్రిటీస్ లలో
అభద్రతా భయం
తల్లిదండ్రులలో
ఓల్డ్ ఏజ్
హౌస్ భయం
ఉద్యోగాలులేక
యువతలో
బతుకు భయం
నిజాయితీపరులకు
లంచం భయం
పేదవాడికి వడ్డీ భయం
ఆటో వాడికి
ఫైనాన్సర్ భయం
తాగుడు వల్ల
భార్యా పిల్లలకు
భయం
ప్రయాణీకుడికి
టిక్కెట్టు ధర
బాదుడు భయం
ఖాళీ జాగా వాడికి
భూ కబ్జాదారుల
భయం
ఓట్ల కోసం
హిందూ ముస్లింల
విభజన భయం
ధర్మ సంసద్ లో
తీవ్రవాద భయం
ప్రభుత్వానికి
ఉచితాల భయం
స్కూల్ ఫీజులవల్ల
పేరెంట్స్ కు భయం
చిన్నారులకు
మొబైల్ ఫోన్ ల
భయం
పార్టీలో
నిజాయితీపరులకు
గెంటివేత భయం
ప్రార్థనాల
యాలలో
నిర్వాహకుల భయం
కరోనా కోర్సుకు చిక్కుతామేమోనని
ప్రపంచ మానవాళికి
భయం
కోవిడ్ షీల్డ్
తీసుకున్నా భయం
Covid 19
తీసుకోకపోయినా
భయం
మారు పేరుతో
వచ్చిన వోవిుక్రోన్తో
భయం
చివరికి దేశ దేశాల ప్రధానరక్షకులకూ
ప్రాణ భయం
మరి సామాన్యుడికి ఇక
ఏది భద్రత సుఖం ?
అందరికీ
ఇక దైవమే అభయం.