“సాధారణంగా మనం ఎంతోమంది తో మాట్లాడుతూ ఎన్నో విషయాలు తెలుసుకుంటాం కానీ కొందరు చెప్పే మాటలు మనకు ఆనందం తోపాటు ఆదర్శభావాల్ని ఆలోచనలను రేకెత్తిస్తాయి.అదే మనం తెలుసుకోవాలి” శివా మాష్టారు పాఠం చెప్పేముందు ఇలా కొన్ని మాటలు చెప్పి ఆలోచించమని పిల్లలకు చెప్తారు.అప్పుడు ఆసక్తికరంగా ఆయనపాఠంసజావుగా సాగుతుంది.బెల్లు ఐనా ఇంకా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు.” కులం అంటే ఏంటి?” ” అదే సర్! క్యాస్ట్!” పొలోమని అరిచారు.
“అసలు అర్థం నివాసం అని.వృత్తులు ఎవరి శక్తి సామర్థ్యాలను బట్టి వారు చేసేవారు.అలా సంఘంలో ఒకరిపై ఒకరు ఆధారపడి సహజీవనం గడిపేవారు.ఒకసారి శ్రీరామానుజులవారు స్నానం ముగించుకుని తిరిగి వస్తూ ధనుర్దాసు అనే శిష్యుడు భుజంపై చేయి వేసి నడిచారు.ఒక చుప్పనాతి శిష్యుడు అడిగేశాడు “వాడు తక్కువ కులంవాడుకదా? మీ మడికి భంగం కలగదా?”అని.
దానికి ఆయన ఇలా జవాబిచ్చారు” పిచ్చివాడా! చదువు డబ్బు గొప్ప వంశం కులంలో పుట్టాను అనేవి అహంకారం మదమాత్సర్యాలకి మూలం.వినయవిధేయతలున్నవాడే మానవత్వంతో సాయపడే వాడే దేవుని దృష్టిలో అసలుసిసలు భక్తుడు.శుచిశుభ్రత ముఖ్యం.” అన్నారట శ్రీ రామానుజులు . అంతెందుకు? మనమిసైల్ మాన్ అబ్దుల్ కలాం ని
బడిలో అయ్యర్ అయ్యవార్లు తమ ఇంటికి పిలిచి వంటింట్లో తమతోపాటు భోజనానికి కూచోబెట్టేవారు.మడి తో ఉన్న మాష్టారు భార్య
మామి కూడా కన్నకొడుకు లా బాల కలాం కి అన్నం కొసరి కొసరి వడ్డిస్తూ వినిపించేది.మీరు కూడా మధ్యాహ్నం లంచ్ అందుకే పక్కపక్కనే కూచుని తినాలి.మీరు తెచ్చినవి ఇతరులతో పంచపకుంటూ,వారివి మీరు పుచ్చుకోవడం లోనే ప్రేమ ఆప్యాయతలు బంధాలు పెరుగు తాయి.” అని శివా మాస్టారు చెప్పారు. అది వింటున్న బడి ఛైర్మన్ మనవడు రాము అన్నాడు”
సార్! ఇవాల్టినుంచి నేను కూడా అందరితో కలిసి తింటాను.ఆగట్టుమీద కూచోను.మానౌకరు దగ్గర కూర్చుని తినిపిస్తాడు.మా అమ్మ మాట ప్రకారం.”
“సెభాష్ రాము! మీనౌకరుకి చెప్తానులే లంచ్ బాక్స్ ఆయాకిచ్చి
వెళ్లిపొమ్మని.నీవుకూడా మీక్లాసుపిల్లలతో కల్సికూచుని తిను.అందరూ తమ ఇంట్లోంచి రకరకాల వెరైటీవంటకాలు తెస్తారు. అవి పక్కవారితో పంచుకొని తింటారు.వంకాయని రకరకాలుగా వండవచ్చు.కొందరుఅల్లంపచ్చిమిర్చి కొబ్బరివేసి గుత్తికూర చేస్తారు, కొందరు ఉల్లిగడ్డ వేసి ముద్దగా కూర చేసుకుంటారు, కొందరు వేపుడు గా చేసుకుని తింటారు. మరికొందరు వంకాయ పులుసు వండుతారు, కొందరు చట్నీ లా చేసుకుని తింటారు. వాటిలాగానే మనుషుల స్వభావాలుకూడా. చూడండి …. మన రాము ఎంత బాగా సరేనన్నాడో చూడండి.” శివాసార్ మాటల్తో పిల్లలంతా పొలోమని అరిచారు” హాయ్! రేపట్నించి రాముకూడా మనతోకల్సి చెట్టుకింద కూచునే తింటాడు.వాడి లంచ్ బాక్స్ లోని వెరైటీలు మనం కూడా రుచి చూడొచ్చు” .చప్పట్లతో రాముని పిల్లల అభినందించారు🌷
బాలసాహిత్యం
అనగా అనగా ఒక ఊరు, ఆ ఊరి చివర్లో ఒక చిన్న ఇల్లు. ఆ ఇంట్లో నెల్ అనే మేక తన కూతురు నెల్లితో ఉంటుండేది.
ప్రతిరోజు నెల్ క్యాబేజీ కొనడానికని దుకాణానికి వెళుతూ ఉండేది. ఆమె బయటికి పోయినప్పుడు నెల్లీ తో ” నువ్వు నేను వచ్చి తలుపు కొడితే తప్ప ఎవ్వరికీ తలుపు తీయవద్దు నెల్లీ” అని చెప్పేది.
నెల్లి తలుపు బోల్ట్ పెట్టేసి తల్లి తిరిగి వచ్చేవరకు ఎదురుచూస్తూ ఉండేది.
ఒకరోజు తోడేలు వచ్చి ” తలుపు తెరువు నా ముద్దుల మేకపిల్ల నేను నీ తల్లి నెల్ ను” అన్నది.కాని, నెల్లికి ఆ గొంతు కొద్దిగా వేరుగా అనిపించి తలుపు తెరవలేదు.
మర్నాడు కూడా తోడేలు అలాగే మళ్ళీ వచ్చింది. ఈసారి కీచు గొంతుతో దాదాపు మేక గొంతు లాగానే మాట్లాడుతూ
” పాపా! తలుపు తెరువు .ఇది నేనే! నేను ఇంటికి క్యాబేజీ తెచ్చాను.” అన్నది. నెల్లీ బోల్ట్ తీసి తలుపు తెరిచింది. వెంటనే ఒక నల్ల తోడేలు పంజా తలుపు నెట్టి లోపలికి రాబోయింది.
” నువ్వు నా తల్లివి కాదు”అని అరిచి నెల్లీ తలుపును గట్టిగా మూసేసింది. అలా అప్పుడైతే ప్రమాదం తప్పించుకుంది.
నెల్ ఇంటికి రాగానే ఆ చిన్న పాప నెల్లి జరిగిందంతా తల్లితో చెప్పింది.
‘ కొద్దిగా ఆగు పాడు బుద్ధి ముసలి తోడేలా’ అని తల్లి మనసులో అనుకున్నది తల్లి నెల్.
మర్నాడు ఆమె ఇంటి దగ్గరే ఉండి, ఎదురు చూస్తూ ఉన్నది.
ఒక మధురమైన గొంతు ” లోనికి రానివ్వండి” అని అన్నది.
ఎప్పుడైతే మేక పిల్ల తలుపు కొద్దిగా తెరిచిందో తోడేలు తన పిండి పడిన రెండు పంజాలు పాపను మోసం చేద్దామని లోపలికి చాపింది కానీ అది లోపలికి పోయే ప్రయత్నం చేయకముందే తల్లిమేక ఒక దుడ్డు కర్ర చేతిలో పట్టుకొని ఎట్లా కొట్టిందంటే…..
మేక పిల్లను తినేసి తన ఆకలి తీర్చుకుందామనుకున్న సంగతే తోడేలు మరిచిపోయింది, పరుగులెత్తింది.
సుందరవనం అనే అడవిలో ఒక బుజ్జి కుందేలు ఆహారం కొరకై బయలుదేరింది. అది పెద్దపులి గాండ్రింపు విని భయంతో పరుగెత్తి పొరపాటున ఒక పెద్ద గోతిలో పడింది. ఆ పెద్దపులి అక్కడికి రానే లేదు. అది ఎటో వెళ్లి పోయింది. అయినా ఆ బుజ్జి కుందేలు ప్రాణభయంతో ” కాపాడండి! కాపాడండి!” అని గట్టిగా అరచింది. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక జిత్తులమారి నక్క దానిని చూసి కూడా చూడనట్టు నటించి దానిని ఎవరు కాపాడుతారో అని అక్కడనే వేచి ఉంది.
అప్పుడే ఆ కుందేలు పిల్ల అరపులు విని అక్కడికి పరుగున వచ్చిన ఏనుగు అది చూసి ఆ బుజ్జి కుందేలును తన తొండంతో లాగి ఆ గోతి నుండి కాపాడింది. తర్వాత అది ఆ నక్కతో ” ఓ నక్కా! ఈ పిల్ల కుందేలు ఆపదలో ఉంటే నీవు కాపాడకుండా ఎటో చూస్తున్నావు. ఇది నీకు తగునా! అది కాపాడమని అంటే వినరానట్టు ఉంటావా !”అని అంది. అప్పుడు నక్క ఏమి మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది.
కొన్ని రోజులకు ఒక బుజ్జి నక్క కూడా దూరంగా ఒక చిరుతపులి అరపు విని భయంతో పరుగెత్తి ఇదే చోటకు వచ్చి అదే గోతిలో పొరపాటున పడింది. అది కూడా తనను కాపాడమని గట్టిగా అరిచింది. దూరం నుండి ఇది చూసిన ఒక పెద్ద కుందేలు పరుగున వచ్చి ఆ బుజ్జి నక్కను ఒక కర్రను అందించి దాని సాయంతో కాపాడింది . వెంటనే దాని తల్లి పెద్దనక్క పరుగున అక్కడికి వచ్చింది. అప్పుడే అక్కడికి వచ్చిన ఇదివరకటి ఏనుగు ఇది చూసి ” ఓ కుందేలా! నీవు ఈ బుజ్జి నక్క ప్రాణాలు కాపాడి దానికి చాలా మేలు చేశావు. ఈ నక్కనే గతంలో నీ బిడ్డను కాపాడలేదు. అయినా అది మనసులో పెట్టుకోకుండా ఒక తల్లి మనసును అర్థం చేసుకున్నావు. అపకారికి ఉపకారమంటే ఇదే “అని అంది. అప్పుడు కుందేలు ” ఓ గజమా! ఆపదలో ఉన్న ఎవరినైనా కాపాడడం మన ధర్మం. అందులో అది చిన్న పిల్ల. పొరపాటున ఆ గోతిలో పడింది. మరేదైనా క్రూర మృగం చూస్తే దీని ప్రాణాలు దక్కవు. అందువల్లనే నేను దానిని కాపాడాను. అది సాయం చేయలేదని నేను కాపాడకుంటే ఒకవేళ దాని ప్రాణం పోతే తిరిగి వస్తుందా! అందుకే ఈ చిన్న మేలు చేశాను” అని అంది.
అప్పుడు నక్క తాను గతంలో కుందేలు బిడ్డకు చేసిన అపకారం గురించి చెప్పి కన్నీళ్లు కార్చింది. తన బిడ్డను బ్రతికించినందుకు ఆ కుందేలుకు తన ధన్యవాదాలు తెలిపింది. ఆ కుందేలు ఆ నక్క కన్నీళ్లను తుడిచింది. తర్వాత ఆ నక్క పశ్చాత్తాపపడి మరోసారి ఎటువంటి తప్పు చేయలేదు. అంతేకాదు. ఆ కుందేలుతో అది చాలా స్నేహపూర్వకంగా మెలగింది. అందుకే అపకారికి ఉపకారం చేస్తే స్నేహం పెంపొందుతుంది.
(ఆర్మీ లో సైనికుడిగా పని చేస్తూ దేశానికి సేవ చేస్తున్న ఒక తండ్రి కూతురు కథ ఇది.సైనికుడికి ప్రియా అనే ముద్దుల కూతురు ఉంది.దూరంగా ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారు తల్లి కూతుర్లు. స్కూల్ కి వెళ్ళినపుడు తనకి కూడా మిగతా పిల్లల లాగా వాళ్ళ నాన్న స్కూల్ లో దింపాలని , అందరిలా వాళ్ళ నాన్న భుజం పైన ఎక్కి ఈ ప్రపంచాన్ని చుట్టేయాలని ఉండేది.కానీ నాకు ఆ అదృష్టం లేదు అని ప్రియా బాధపడుతూ వాళ్ళ నాన్న ప్రేమ గురించి ఇలా వర్ణించింది.)
తండ్రి అంటే కూతురిని కంటికి రెప్పలా కాపాడే వాడు,ఎల్లపుడు తనకి ప్రేమని పంచివాడు,కష్టం వచ్చినపుడు నేనున్నా అంటూ దైర్యం ఇచ్చేవాడు,నేను ఏడ్చినప్పుడు నన్ను నవ్వించడానికి జోక్స్ చేసేవాడు.మా నాన్న నాకు దూరంగా ఉన్న ఎపుడూ నా చుట్టే నీడలా ఉన్నట్టు ఉంటుంది.మా నాన్న ఆర్మీ లో ఉండడం నా జీవితం లో చాల గర్వాంగా అనిపిస్తుంది.నేను మా అమ్మ ఇద్దరం కలిసి నాన్న ఎప్పుడు మాతో కలిసి ఉండే రోజులు రావాలని కోరుకుంటాము.మా నాన్న పుట్టిన రోజు అంటే నాకు చాల ఇష్టం.
చూస్తుండగానే మా నాన్న పుట్టిన రోజు రానే వచ్చింది. ఎవరో తలుపు కొడుతున్నారని వెళ్లి చుస్తే ఒక్కసారిగా నేను నివ్వెరపోయాను, వచ్చింది ఎవరో కాదు మా నాన్న.నేను పరిగెత్తుకుంటూ వెళ్లి నాన్నని బిగ్గరగా హత్తుకొని ముద్దులతో ముంచెత్తాను. “ఎన్ని రోజులైంది నాన్న నిన్ను చూసి నాకు చాల సంతోషంగా ఉంది ఐ లవ్ యు నాన్న ” అని చెప్పి , “అమ్మ నాన్న వచ్చాడు ” అని గట్టిగ అరిచి పుట్టిన రోజు కోసం నేను తయారు చేసిన గ్రీటింగ్ కార్డు ఇస్తుండగా ఎదో శబ్దం విన్పించింది.కళ్ళు తెరిచి చుస్తే నేను ఎంతో ఇష్టంగా మా నాన్న కోసం కొన్న బొమ్మ , గ్రీటింగ్ కార్డు కింద పడి ఉన్నాయి.ఇదేంటి అని చూసేసరికి నాన్న రాలేదు . ఇదంతా నేను కన్న కలలో జరిగింది అని అర్ధం అయింది. నాన్న వచ్చారని సంతోష పడిన నా మనసు ఒక్కసారిగా ముక్కలైంది,ఏడ్చాను,చాల బాధపడ్డాను.అందరి పిల్లల లాగ నాకు మా నాన్న పుట్టిన రోజు చేయాలనీ ఉంది కానీ నాకు అదృష్టం లేదు అనుకున్నాను.
మా నాన్న గుర్తుకు వచ్చినపుడల్లా రాలేదు కాబట్టి నేను మా నాన్న గుర్తొచ్చినపుడు అయన ఫోటో తీసుకోని చూసుకుంటూ సంతోషపడతాను.నాకు బాధనిపించింది కానీ, మా నాన్న దేశానికి సేవ చేస్తున్నాడు కాబట్టి ఒకవైపు గర్వాంగానే ఉంది.ఐ లవ్ యు నాన్న.
(తండ్రి తో కలిసి తండ్రి ప్రేమను ప్రతి రోజు పొందాలని ఆరాటపడ్తున్న ఈ చిన్నారి కోరిక తీరుతుందా అందరి లాగా ప్రియా కూడా వాళ్ళ నాన్న బుజం పైన ఎక్కి పరపంచాన్ని చుట్టేస్తుందా చూడాలి..)
**_
సుందర వనం అనే అడవిలో ఒక కోతి వర్షంలో తడుస్తూ దారిలో నిలబడింది . ప్రక్కనే చెట్టుపై ఉన్న కాకి దానిని చెట్టు కిందకు రమ్మని ప్రేమతో పిలిచింది. కానీ కోతి ఆ మాటలు వినిపించుకోలేదు. ఆ కాకి తిరిగి దానిని రమ్మని పిలిచింది. అప్పుడు ఆ కోతి కోపంతో కాకి వైపు వచ్చి ఆ చెట్టును ఎక్కి దాని గూడును లాగి క్రింద పడవేసింది. అదృష్ట వశాత్తు అందులో దాని పిల్లలు లేవు. ఆ కోతి కోపానికి కాకి ఆశ్చర్య పోయింది.
అది గమనించిన ఒక పావురం “ఓ కాకీ! అటువంటి మూర్ఖురాలైన కోతిని నీవు రమ్మనడం, దానికి ఉపకారం చేయాలని అనుకోవడం పెద్ద తప్పు. నీవు మంచి చెప్పినా అది వినే స్థితిలో లేదు” అని అంది. ఈ మాటలను విన్న కోతి కోపంతో ఆ పావురంపై దాడికి వచ్చింది. ఆ పావురం వెంటనే ఆకాశంలోకి ఎగిరింది.
అది చూసిన కాకి ” ఓ కోతీ! నీ ప్రతాపం నీకన్నా చిన్నగా ఉన్న మా పక్షులపైన కాదు . నీకు బలం ఉంటే అదిగో ఆ కనబడుతున్న ఆ పెద్ద జంతువు ఆ గాడిదపైన నీ ప్రతాపం చూపించు” అని అంది. వెంటనే కోతి ” నాకేం భయమా ! దాని సంగతి కూడా నేను తేలుస్తాను. దాని వెనుక కాలును లాగుతాను. చూడు” అని ఆ గాడిద వైపు వెళ్ళింది.
అది అక్కడికి వెళ్లి గాడిద వెనుకవైపు వెళ్లి ఆ గాడిద కాలును లాగింది. ఆ గాడిదకు కోపం వచ్చి ఆ కోతిని తన వెనుక కాళ్లతో బలంగా ఒక్క తన్ను తన్నింది. దాని బలానికి ఆ కోతి కళ్లు బైర్లు కమ్మి గాలిలో గిరగిరా మూడు తిరుగుళ్లు తిరిగి క్రింద పడింది. ఆ కోతికి నడుం విరిగినంత పని అయింది.
వెంటనే తేరుకున్న కోతి ” అమ్మో! ఈ గాడిద జోలికి మనం వెళ్లకూడదు. దీనికి చాలా బలం ఉంది. ఇదే కాదు. మరొకసారి ఎవరి జోలికి పోకూడదు. నాకు తగిన శాస్తి జరిగింది ” అని అనుకొని ఇంటి దారి పట్టింది. అప్పుడు ఆ పావురం, కాకులు దానికి బుద్ది వచ్చినందుకు సంతోషించి ఆ గాడిదతో ” మిత్రమా! ఆ పొగరుబోతు కోతికి తగిన గుణపాఠం చెప్పావు. అది మరొకసారి ఎవ్వరి జోలికి పోకుండా చేశావు. నీకు మా ధన్యవాదాలు” అని అన్నాయి.
అప్పుడు ఆ గాడిద” నా జోలికి వస్తే నేను ఊరుకుంటానా! అది మీతో దురుసుగా ప్రవర్తించడాన్ని నేను ఇక్కడి నుండి కళ్లారా చూశాను. పాపం! మీరు చిన్న ప్రాణులు. అందుకే దానికి తగిన గుణపాఠం చెప్పాను” అని అంది. అందుకే పొగరు ఉన్న వారికి ఎప్పటికైనా భంగపాటు తప్పదు.
పూర్వం ఒక క్రూరమైన మారుతల్లి. ఆమె భర్తపేరు మ్యాలెట్. ఆమెకు ఇద్దరు కూతుర్లు. రోజీ ఆమె స్వంత కూతురు. జానీ ఆమె చనిపోయిన సవతి కూతురు. పొద్దున్నే ఆమె కూతురు రోజీకి కడుపు నిండా రుచికరమైన కోడి కూర, మాంసముతో నింపబడిన పావురము తినడానికి ఇచ్చింది. ఏదో మిగిలింది చాలీ చాలనిది జానీకి ఇస్తుండేది.
రోజీ ఏ చిన్న పని కూడా ముట్టుకోకపోయేది. మొత్తం ఇంటిపని ఉదయం నుండి సాయంత్రం వరకు జానీతో చేయించేది మారుతల్లి. అయినా మెచ్చుకోకపోయేది.
రోజీ ఎప్పుడు మంచి సిల్కు మరియు ఖరీదైన వులన్ దుస్తులు ధరించేది. జానీకి మాత్రం మామూలు కాటన్ దుస్తులు ఉండేవి.
అది జనవరి మాసం. బయట మొత్తం మంచు, విపరీతమైన చలి. చాలా మటుకు అందరు చలికి తాళలేక మంటల దగ్గర కూర్చునేది. ఒకసారి మారుతల్లి బయటికి తొంగి చూసేవరకు చలికి ముక్కు ఎర్రబడింది.
ఎంతో ప్రేమ నటిస్తూ నోట్లో పంచదార ఉన్నట్లు ఓ నా ముద్దుల జానీ అని పిలిచి నాకు మన ఇంట్లో టేబుల్‌పై గాజు వేజులో లిల్లీ పూల సువాసన ఆనందించాలని ఉంది. నీవు వెళ్ళి అడవి లోయలో పూసే లిల్లీ పూలు తీసుకరా అని అంది. అందుకు జానీ అమ్మా ఇది జనవరి మాసం, ఇప్పుడు లిల్లీలు వుండవు కదా. ఆ మాట పట్టించుకోకుండా జానీని డోర్ తీసి బయటికి నెట్టి వెనుక నుండి డోరు ఢబీల్న మూసేసింది. విధిలేక జానీ ఆ చలిలో అడుగుపెడితే జారే మంచుపై, అతి కష్టంగా నడుస్తూ అడవిలోకి చేరింది. ఆ అడవిలో ఆమె పన్నెండు మంది యువకులను చూసింది. వారు వేసవికాల దుస్తుల్లో వున్నారు. ఒకడు మాత్రం మేకతోలు కోటు వేసుకొని ఉన్నాడు. అతనే వారి లీడరు. వాళ్ళు ఈ అమ్మాయిని చూసి ఆశ్చర్యపడి జాలితో ఎక్కడికి వెళ్తున్నావని అడిగారు. ఆమె కథంతా వాళ్ళకు చెప్పింది. అప్పుడు వారిలో ఒకతని జేబు నుండి లిల్లీ పూలు తీసి ఇచ్చాడు. అవి పట్టుకొని ఇల్లు చేరింది. మారుతల్లికి ఈమె తిరిగి వచ్చినందుకు కోపమే కాని లిల్లీలు తెచ్చిందని లోనికి రానిచ్చింది.
మరుసటి రోజు ఎంతో ప్రేమను నటిస్తూ నా ప్రియమైన జానీ, నాకు బాస్కెటు నిండా స్ట్రాబెర్రీసు అడవి నుండి తీసుకురా అంది మారుతల్లి. దాదాపు కన్నీరు పెట్టుకుని జానీ అంది, అమ్మా అవి జనవరిలో అవి పండవు కదా. నోరు ముయ్యి అని గద్దించింది మారుతల్లి. నీవు లిల్లీసు తెచ్చినవు గదా. అదే మాదిరిగ స్ట్రాబెర్రీసు తే అని జానీని బయటికి నెట్టి తలుపు మూసేసింది. పాపం అమ్మాయి మోకాళ్ళ మటుకు మంచులో, చలి గాలిలో మామూలు దుస్తుల్లో అడివికి చేరింది. అక్కడ ఆ పన్నెండు మంది యువకులు కలిశారు. వారితో ఆమె తన మారుతల్లి చెప్పిన విషయం చెప్పింది. ఆ యువకులకు కోపం వచ్చింది. మేకతోలు కోటు వేసుకున్నతను సరే నీకు స్ట్రాబెర్రీసు ఇస్తాను, కాని నీ మారుతల్లి జాగ్రత్త పడాలి. అతను తనవారిలో ఒకతనితో అమ్మాయి బ్యాగ్ నిండా రుచికరమైన స్ట్రాబెర్రీసు నింపమన్నాడు. నింపినాక వాటిపై అతను ఊదాడో, అదేంటో తెలియదు కానీ ఇది నీ మారుతల్లిని బాగు చేస్తుందన్నాడు. జానీ వారికి కృతజ్ఞతలు తెలిపి ఇల్లు చేరింది. ఆమె దారిలో వెచ్చదనం అనుభవించింది. మారుతల్లికి జానీ తిరిగి రావడం ఇష్టంలేక కోపించింది, కానీ స్ట్రాబెర్రీసు బాగా ఇష్టమైనవి. వాటిని తీసుకుని ఆమె, ఆమె కూతురు రోజీ గబగబా ఒక్క పండు మిగలకుండా తినేశారు. జానీకి పాపం ఒక్క పండు కూడా ఇవ్వలేదు. కానీ తల్లి బిడ్డ ఆ రాత్రి వానరాళ్ళు తిన్నట్లు చాలా కడుపునొప్పితో బాధపడ్డారు.
మరునాడు ఉదయం రోజీ మరియు ఆమె తల్లికి కొంత ఆరోగ్యం బాగయ్యింది. మారుతల్లి జానీని బయటకు పంపేందుకు ఏదో ఉపాయం ఆలోచించసాగింది. ప్రేమ ఒలకపోస్తూ ఓ నా ప్రియమైన జానీ, నువ్వు గోనెసంచీ తీసుకొని అడవికి అవతలివైపు వెళ్ళి అక్కడ పండే మంచి వెరైటీ వోర్ సిస్టర్ పియర్ మేన్స్ ఆపిల్సు సంచీ నిండ తెంపుక రా. జానీ ఈసారి ఏ అడ్డూ చెప్పకుండా ఒక నిట్టూర్పు తీసి బయటికి వెళ్ళింది. మంచులో మూడుసార్లు జారిపడింది. కాళ్ళకు దెబ్బలు తగిలి గాయాలయినాయి. ఎలాగో అడవి చేరింది. అక్కడ ఆ 12 మంది యువకులు కలిశారు. ఈమె చెప్పినట్లు సంచి నిండా ఆపీల్సు పెట్టించాడు మేకతోలు కోటులో ఉన్నతడు. ఓహో ఆమె గార్కి మంచి వెరైటీ ఆపిల్సు కావలసి వచ్చిందా అన్నాడు. సంచిలో పండ్లు నింపిన తరువాత వాటి మీద మూడుసార్లు చల్లని ఆవిరి వచ్చేట్లు ఊదాడు. ఇప్పుడు మారుతల్లి వీటిని అంతగా ఆనందించకపోవచ్చు అన్నాడు అతడు. ఆ బరువైన సంచి జానీకి ఒక ఈకవలె తేలికగా ఉండి ఆమె మంచు మీద మెత్తటి దారి మీద నడిచినట్లు నడిచి ఇల్లు చేరింది. అతను మీ చెల్లెలును వీటిని తినవద్దని చెప్పమన్నారు. ఆమె ఆ విషయం చెప్పినందుకు చెల్లెలు ఆమెను నెట్టివేసి తామే తినేశారు గబగబా. వారికి కడుపులో బాగా నొప్పి లేచింది. ఈ విశ్వాసం లేని అమ్మాయి దయ్యంతో కలిసి మనమీద కుట్ర చేసిందని మారుతల్లి అంది. వారి కడుపులో పేగులకు ఏమీ తెలీదు. కానీ వారు దూదిపింజల లాగ ఇంటి పొగ గొట్టం నుండి బయటపడి ఎంతో దూరం తేలిపోయారు. ఇంటిదారి ఎప్పటికీ దొరకలేదు. ఇంటి వద్ద తండ్రి, కూతురు వివాహమై తన మంచి భర్తతో కలిసి ముగ్గురు ఎప్పటికన్నా ఎక్కువ సంతోషంగా వుండిపోయారు. మారు తల్లికి తగిన శాస్తి జరిగింది.
జిల్లా పరిషత్తులో గుమాస్తాగా పనిచేస్తున్న గంగాధర్ పిల్లలే అరుణ ఆనంద్ లు. పదవ తరగతి చదువుతున్న అరుణ ఎప్పుడూ ఏదో ఒక పని చేసుకుంటూ, చదువుకుంటూ ఉంటుంది. ఆరో తరగతి చదువుతున్న ఆనంద్ కేమో స్నేహితులంటే ప్రాణం. వాళ్ళ పాత ఇంట్లో ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల ఆడుకోవడానికి తన ఈడు పిల్లలు లేక చిన్నబోయి ఉండేవాడు. ఇప్పుడు గంగాధర్ కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇంట్లోకి మారాక అక్కడ తన ఈడు పిల్లలు కొందరు ఉండడంతో ఆనంద్ తన కొత్త మిత్రులతో సంతోషంగా గడపసాగాడు. ముఖ్యంగా ఆనంద్ కి పక్కింటి రియాజ్ కి మంచి స్నేహం కుదిరింది.
ప్రత్యేక తరగతులు ఉన్నందున ఆనంద్ అక్క అరుణ రోజూ బడికి ముందు వెళ్ళిపోతుంటుంది. అందువల్ల ఆనంద్, రియాజ్ ఇద్దరూ కలిసి బడికి వెళ్తున్నారు. పెరట్లో జామచెట్టు కింద చాప వేసుకుని కూర్చుని కలిసి హోమ్ వర్క్ చేసుకుంటున్నారు. పోటీ పడి చదువుకుంటున్నారు. హాయిగా ఆడుకుంటున్నారు. పాలపాకెట్టో, కూరగాయలో ఎవరు తెమ్మన్నా ఇద్దరూ కలిసి వెళ్ళి తెస్తున్నారు. రియాజ్ వాళ్ళ నాన్న ఖాదర్ చెప్పుల షాప్ లో పనిచేస్తాడు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. తల్లిని ఒప్పించి ఆనంద్ తన నోట్సులు కొన్ని రియాజ్ కి ఇచ్చాడు. అప్పుడప్పుడు పెన్సిల్లు, పెన్నులు కూడా ఇస్తుంటాడు.. ఇక తల్లి సుదతి పండ్లూ పలహారం ఏమిచ్చినా రియాజ్ తో పంచుకుని తినడం అలవాటయ్యింది ఆనంద్ కి. రియాజ్ వాళ్ళ అమ్మ జరీనా ఏమి వండినా ఆనంద్ ని పిలిచి మరీ పెడ్తుంటుంది. కొన్ని నెలలు గడిచి ఆనంద్ రియాజ్ ల స్నేహం మరింత బలపడింది. కొత్తవా వాళ్ళెవరైనా ఖాదర్ ఇంట ఈ ఇద్దరు పిల్లలను చూస్తే.. ఖాదర్ కి ఇద్దరు మొగపిల్లలు ఉన్నారేమో అనుకుంటారు. గంగాధర్ ఇంట ఆ పిల్లలిద్దరినీ చూసిన వాళ్లు గంగాధర్ కి ఇద్దరు మొగపిల్లలు ఉన్నారేమో అనుకుంటారు.
“ఆనంద్ కి ఇదివరకు తినడానికి ఏది పెడ్తే.. ఒక్కటి ఇస్తే ఇంక చాలు చాలు అనేవాడు. ఇప్పుడు ఏది ఇచ్చినా ఇంకొకటి కావాలి అంటున్నాడు” అని భర్తకు చెప్పింది సుదతి. “పిల్లవాడు పెద్దవాడు అవుతున్నాడు వాడికి ఆకలి పెరుగుతుంది. వాడు తినగలిగినన్ని ఇవ్వు” అని చెప్పాడు గంగాధర్. ఎవరు ఏమీ పెట్టినా జామ చెట్టు వెనకకు వెళ్ళి పంచుకుని తింటున్న మిత్రులిద్దరినీ చూసి ఆనంద్ కి ఆకలి ఎందుకు పెరిగిందో అర్థమై నవ్వుకున్నది అరుణ.
ఇప్పుడు దసరా పండగ వచ్చింది. గంగాధర్, సుదతి పిల్లలకు కొత్త బట్టలు కొనుక్కోవడానికి వెళ్దాం తయారుకండి అని చెప్పారు. “నాన్నా నాకు రెండు జతల బట్టలు కొనిపెట్టవా?” అని అడిగాడు ఆనంద్. “రెండు నెలల తరువాత నీ పుట్టినరోజు ఉంది కదా. అప్పుడు మళ్ళీ నీకు కొత్త డ్రెస్ కొనాలి. ఇప్పుడు నేను రెండు జతలు కొనలేను” అని చెప్పేశాడు గంగాధర్. “నాన్నా.. నాకు పుట్టినరోజుకు కొత్త బట్టలు కొనకపోయినా పరవాలేదు.. ఇప్పుడు మాత్రం రెండు జతలు కొనండి నాన్నా” అని బతిమిలాడాడు. గంగాధర్ కి బాగా కోపం వచ్చింది. “ఎందుకు ఎంత జిద్దు చేస్తున్నావు ఆనంద్..”అని కోపంగా అరిచాడు.
“నాన్నా! పాపం రియాజ్ కి సరైన బట్టలు లేవు. బడిలో సివిల్ డ్రెస్ వేసుకునే రోజున మంచి బట్టలు లేక ఆ రోజు బడి మానేస్తున్నాడు. నాకు ఖరీదైన బట్టలు వద్దు. మామూలు ధరలోనే మా ఇద్దరికీ చెరో జత కొనండి నాన్నా.. వాడు చిరిగిపోయిన బట్టలు వేసుకుంటుంటే.. నేను కొత్త బట్టలు వేసుకోలేను నాన్నా!” అని చెప్పాడు. స్నేహితుని పై కొడుకు చూపిస్తున్న ప్రేమకు కరిగిపోయాడు గంగాధర్.
పక్కింటికి వెళ్ళి ఖాదర్ ని జరీనాని ఒప్పించి, అరుణా ఆనంద్ లతో పాటు రియాజ్ ని కూడా తీసుకుని.. బట్టల షాప్ కి బయలుదేరారు గంగాధర్ సుదతి దంపతులు.
***
జిల్లా పరిషత్తులో గుమాస్తాగా పనిచేస్తున్న గంగాధర్ పిల్లలే అరుణ ఆనంద్ లు. పదవ తరగతి చదువుతున్న అరుణ ఎప్పుడూ ఏదో ఒక పని చేసుకుంటూ, చదువుకుంటూ ఉంటుంది. ఆరో తరగతి చదువుతున్న ఆనంద్ కేమో స్నేహితులంటే ప్రాణం. వాళ్ళ పాత ఇంట్లో ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల ఆడుకోవడానికి తన ఈడు పిల్లలు లేక చిన్నబోయి ఉండేవాడు. ఇప్పుడు గంగాధర్ కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇంట్లోకి మారాక అక్కడ తన ఈడు పిల్లలు కొందరు ఉండడంతో ఆనంద్ తన కొత్త మిత్రులతో సంతోషంగా గడపసాగాడు. ముఖ్యంగా ఆనంద్ కి పక్కింటి రియాజ్ కి మంచి స్నేహం కుదిరింది.
ప్రత్యేక తరగతులు ఉన్నందున ఆనంద్ అక్క అరుణ రోజూ బడికి ముందు వెళ్ళిపోతుంటుంది. అందువల్ల ఆనంద్, రియాజ్ ఇద్దరూ కలిసి బడికి వెళ్తున్నారు. పెరట్లో జామచెట్టు కింద చాప వేసుకుని కూర్చుని కలిసి హోమ్ వర్క్ చేసుకుంటున్నారు. పోటీ పడి చదువుకుంటున్నారు. హాయిగా ఆడుకుంటున్నారు. పాలపాకెట్టో, కూరగాయలో ఎవరు తెమ్మన్నా ఇద్దరూ కలిసి వెళ్ళి తెస్తున్నారు. రియాజ్ వాళ్ళ నాన్న ఖాదర్ చెప్పుల షాప్ లో పనిచేస్తాడు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. తల్లిని ఒప్పించి ఆనంద్ తన నోట్సులు కొన్ని రియాజ్ కి ఇచ్చాడు. అప్పుడప్పుడు పెన్సిల్లు, పెన్నులు కూడా ఇస్తుంటాడు.. ఇక తల్లి సుదతి పండ్లూ పలహారం ఏమిచ్చినా రియాజ్ తో పంచుకుని తినడం అలవాటయ్యింది ఆనంద్ కి. రియాజ్ వాళ్ళ అమ్మ జరీనా ఏమి వండినా ఆనంద్ ని పిలిచి మరీ పెడ్తుంటుంది. కొన్ని నెలలు గడిచి ఆనంద్ రియాజ్ ల స్నేహం మరింత బలపడింది. కొత్తవా వాళ్ళెవరైనా ఖాదర్ ఇంట ఈ ఇద్దరు పిల్లలను చూస్తే.. ఖాదర్ కి ఇద్దరు మొగపిల్లలు ఉన్నారేమో అనుకుంటారు. గంగాధర్ ఇంట ఆ పిల్లలిద్దరినీ చూసిన వాళ్లు గంగాధర్ కి ఇద్దరు మొగపిల్లలు ఉన్నారేమో అనుకుంటారు.
“ఆనంద్ కి ఇదివరకు తినడానికి ఏది పెడ్తే.. ఒక్కటి ఇస్తే ఇంక చాలు చాలు అనేవాడు. ఇప్పుడు ఏది ఇచ్చినా ఇంకొకటి కావాలి అంటున్నాడు” అని భర్తకు చెప్పింది సుదతి. “పిల్లవాడు పెద్దవాడు అవుతున్నాడు వాడికి ఆకలి పెరుగుతుంది. వాడు తినగలిగినన్ని ఇవ్వు” అని చెప్పాడు గంగాధర్. ఎవరు ఏమీ పెట్టినా జామ చెట్టు వెనకకు వెళ్ళి పంచుకుని తింటున్న మిత్రులిద్దరినీ చూసి ఆనంద్ కి ఆకలి ఎందుకు పెరిగిందో అర్థమై నవ్వుకున్నది అరుణ.
ఇప్పుడు దసరా పండగ వచ్చింది. గంగాధర్, సుదతి పిల్లలకు కొత్త బట్టలు కొనుక్కోవడానికి వెళ్దాం తయారుకండి అని చెప్పారు. “నాన్నా నాకు రెండు జతల బట్టలు కొనిపెట్టవా?” అని అడిగాడు ఆనంద్. “రెండు నెలల తరువాత నీ పుట్టినరోజు ఉంది కదా. అప్పుడు మళ్ళీ నీకు కొత్త డ్రెస్ కొనాలి. ఇప్పుడు నేను రెండు జతలు కొనలేను” అని చెప్పేశాడు గంగాధర్. “నాన్నా.. నాకు పుట్టినరోజుకు కొత్త బట్టలు కొనకపోయినా పరవాలేదు.. ఇప్పుడు మాత్రం రెండు జతలు కొనండి నాన్నా” అని బతిమిలాడాడు. గంగాధర్ కి బాగా కోపం వచ్చింది. “ఎందుకు ఎంత జిద్దు చేస్తున్నావు ఆనంద్..”అని కోపంగా అరిచాడు.
“నాన్నా! పాపం రియాజ్ కి సరైన బట్టలు లేవు. బడిలో సివిల్ డ్రెస్ వేసుకునే రోజున మంచి బట్టలు లేక ఆ రోజు బడి మానేస్తున్నాడు. నాకు ఖరీదైన బట్టలు వద్దు. మామూలు ధరలోనే మా ఇద్దరికీ చెరో జత కొనండి నాన్నా.. వాడు చిరిగిపోయిన బట్టలు వేసుకుంటుంటే.. నేను కొత్త బట్టలు వేసుకోలేను నాన్నా!” అని చెప్పాడు. స్నేహితుని పై కొడుకు చూపిస్తున్న ప్రేమకు కరిగిపోయాడు గంగాధర్.
పక్కింటికి వెళ్ళి ఖాదర్ ని జరీనాని ఒప్పించి, అరుణా ఆనంద్ లతో పాటు రియాజ్ ని కూడా తీసుకుని.. బట్టల షాప్ కి బయలుదేరారు గంగాధర్ సుదతి దంపతులు.
***
అనగనగా ఒక రాజు. అతని పేరు పగ్నాషియన్. అతనికి బాల్యం నుండి కొట్లాట ఆటలే ఇష్టము. చెక్క గుఱ్ఱం ఎక్కి కఱ్ఱ ఖడ్గం తిప్పుతూ ఊగుతూ సంతోషంగా ఆడుకునేవాడు. అతను పెరిగి పెద్దవాడయ్యాడు. యువరాజు అయ్యాడు. అతను రాజు అయిన వెంటనే మావుడ్ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు.
అతను ప్రతీ యుద్ధంలో పాల్గొనేవాడు. అతనికి ఎప్పుడు యుద్ధకాంక్షే. అతను ఎప్పుడూ స్నేహం వద్దు, యుద్ధం ముద్దు అనుకునేవాడు. అతని యుద్ధాల వలన పక్క రాష్ట్రాల రాజులకు కష్టం, నష్టం జరుగుతుండేది. ఈ తలనొప్పి తగ్గించుకోవడం కోసం పక్క మూడు రాష్ట్రాల రాజులు కలిసి ఒక ఒడంబడిక చేసుకున్నారు, ఇతనికి గుణపాఠం నేర్పాలని. ఇతనిపై సవాలు విసిరారు.
ఇది సామాన్యమైన యుద్ధం కాదని భార్యతో చెప్పాడు. తను ఒక సంవత్సరం వరకు తిరిగి రాకపోతే తను ప్రపంచంలో లేననుకొని లేక జైల్లో బంధించబడినానని అనుకొని నీవు స్వేచ్ఛగా వేరే వివాహం చేసుకో అని చెప్పాడు. అంతవరకు ఒంటరిగా వుండలేవు కాబట్టి నీవు రాత్రిళ్ళు పొద్దుపోయే వరకు మన న్యాయశాఖ పెద్ద గుమాస్తాచేత పుస్తకాలు చదివించుకో. అతను ప్రపంచంలో జీవించి లేననుకోమనే మాట ఆమె మనసుకు బాధను కలిగించింది. అయినా ఒంటరిగా కాలక్షేపం చేయడం కష్టమనుకొని భర్త చెప్పిన పెద్ద గుమాస్తాతో రాత్రిళ్ళు పుస్తకాలు చదివించుకుంటూ వుండమన్న మాట కొంత నయమనుకుంది.
ఆ పెద్దగుమాస్తా కోటలో వున్న పుస్తకాలన్నీ అరడజన్ సార్లు ఇదివరకే చదివేశాడు. అతను చాలా గౌరవంగా రాణీగారికి కొన్ని పుస్తకాలు, మరికొన్ని ఆయన రాసినవి ప్రతిరోజు చాలాసేపు వరకు చదివి వినిపించేవాడు. ఆమెగారు అతనితో సంతోషంగా మాట్లాడుతూ ఆ కథలన్నీ వింటూ ఒక సంవత్సరంపైన ఒక దినం కాలం గడిపింది.
భర్త చెప్పిన కాలం గడిచింది కాబట్టి, గుమాస్తాతో తనను వివాహం చేసుకోమని కోరింది రాణి. దానికి గుమాస్తా నేను ధన్యుడను మహారాణి. కానీ నేను చాలా మామూలు వాడిని. మీరు రాజ వంశీయులు. అదీగాక రాజు ఏదైన జైలులో బంధింపబడి ఉండవచ్చు. నాకు ఇష్టం లేదని చెప్పను కాని, ఇంకొక సంవత్సరం, ఒక దినం వేచి ఉండటం మంచిదన్నాడు. ఆ సమయం కూడా గడిచింది. కానీ రాజు రాలేదు.
రాజు పగ్నాషియస్ యుద్ధంలో చంపబడలేదు. కానీ అతడ్ని గాయపరిచి రెండు సంవత్సరాలు జైలుశిక్ష విధించాడు రాజు లిటిల్ గోర్ము. అతను మూడు ప్రక్క రాష్ట్రాల ప్రతినిధి రాజు. ఆ సమయం గడిచాక రాజు పగ్నాషియస్ ను అతను జైలు నుండి విడిపిస్తూ ఇప్పుడు నీకు యుద్ధకాంక్ష జబ్బు కుదిరందనుకుంటా అన్నాడు. ఇకముందు నీపై జాలి చూపను. యుద్ధభూమిలో పట్టుబడితే నీ తల నరికేయబడుతుంది. ఇప్పుడు నిన్ను వదిలి పెడుతున్నాను. రాజు లిటిల్ గోర్ము, పగ్నాషియస్ గుఱ్ఱాన్ని జుర్మానా కింద తన వద్దనే ఉంచుకున్నాడు. కాబట్టి పగ్నాషియస్ తన ఇంటికి నడిచి పోవలసి వచ్చింది.
అతను నడిచి నడిచి చివరకు తన కోట చేరేవరకు అక్కడ పెండ్లికి జోరుగ తయారీలు అవుతున్నాయి. ఎందుకనగా గుమాస్తా పెట్టిన రెండు సంవత్సరాల ఒక దినం గడువు పూర్తి అయింది. పగ్నాషియస్ అప్పటికి రాలేదు, కాబట్టి గుమాస్తా వివాహానికి ఒప్పుకున్నాడు.
అప్పుడు ఆ రాణి ఆ గుమాస్తా తను మామూలువాడినన్న మాటను మదిలో ఉంచుకొని, అతడిని రాజవంశంలో చేర్చి, రాజ్య వ్యవహారాలు చూచే అర్హత ఇచ్చింది. ఇప్పుడు అతను ఆమెకు తగిన వాడైనాడు. వారు వారి పెండ్లి వేడుకలకు గొప్ప ఏర్పాటు చేశారు. దానికి దూర దూరాలనుండి రాజులు, ధనికులు, గొప్పవారు అక్కడికి చేరారు. వచ్చిన వారిలో రాజు లిటిల్ గోర్ము రాణి మావుడ్ కు శుభాకాంక్షలు తెలిపాడు, కాని రాజు పగ్నాషియస్ గురించి ఏమీ అడగలేదు. కేవలం ఒక ముసిముసి నవ్వు నవ్వాడు.
విందు భోజనాలు చివరకు వచ్చేవరకు పగ్నాషియస్ కోట వద్దకు చేరాడు. ఆ చింపిరి వెంట్రుకల నెత్తితో, చిరిగిన గుడ్డల్లో ఉన్న తమ రాజును ఖడ్గం మరియు గుఱ్ఱం లేనందున ఎవరూ కూడా గుర్తించలేదు. పగ్నాషియస్ బాధతో కన్నీరు కార్చాడు. తను యుద్ధం వలన రాజ్యాన్ని, ధనాన్ని, చివరకు తన భార్యను కూడా పోగొట్టుకున్నానని అంటూ మూల్గాడు. నా పని అయిపోయిందన్నాడు. నౌకర్ల ఇండ్లలో అతనికి ఒక కోడి కాలును తినేందుకు ఇచ్చారు. అది తిని నోరు మరియు కండ్లు తుడుచుకొని వెళ్ళిపోయాడు ఎక్కడికో. ఎక్కడికి పోయాడో ఎవరికి తెలియదు. కనీసం తన పాత రాజ్యంలో మరెప్పుడూ కనబడలేదు. అతను చివరకు అనుకున్నాడు. స్నేహం ముద్దు, యుద్ధం వద్దు. అది ఆనాటికే కాదు, ఏనాటికైనా అదే సత్యం .అదే క్షేమం. ఇదే అతనిలో కలిగిన పరివర్తన.
సాయి,తేజ బడి నుంచి రాగానే నాన్నమ్మ, తాతయ్య దగ్గరకు పరుగు తీశారు.
నాన్నమ్మా–నానమ్మా ! “ఓ మంచి కథ చెప్పవా”! అంటూ బుద్దిగా కూర్చున్నారు.
“అలాగే చెపుతానురా! శ్రద్ధగా వినాలి మరి” అంటూ చెప్పుకొచ్చింది నాన్నమ్మ. ఓ కాకమ్మ కథను.
ప్రకృతి ఒడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్న పసిబిడ్డ లాంటి చల్లని పల్లె ఆ ఊరు.పచ్చదనానికి పెట్టింది పేరు.
ఊరి పొలిమేరలో ఉంది పురాతన కాలం నాటి శివాలయం.
ఆ ఆలయ ప్రాంగణంలో గున్న మామిడి చెట్టు మీద తన పిల్లలతో కాపురం వుంటుంది ఓ కాకమ్మ.
ఆకసమంతా విహరించి తన పిల్లల కోసం ఆహారం సేకరించి తినిపిస్తుంది.
ఓ రోజు ఆ చెట్టు కిందికి వచ్చింది ఓ నక్క.
ఆత్మీయంగా మిత్రున్ని ఆహ్వానించింది తన రెక్కల రెప రెపతో కాకి.
ఇంకేముంది–తన సహజ స్వభావానికి
పదును పెడుతూ– మిత్రమా ! అంటూ ప్రేమగా పిలిచింది. కుశల ప్రశ్నలు అడిగింది నక్క.
నీ మధుర గానంతో నాకు వినుల విందు చేయమని కోరింది.
“నేనా!” అంటూ సంశయం వ్యక్తం చేసింది కాకి.
నీవే! నీవెవ్వరు? కోకిలమ్మ ఇంటి పంటవు.
పుట్టింటి గళ మాధుర్యం ఎక్కడికి పోతుంది అంటూ ప్రశంసల జల్లు కురి పించింది.
నోటిలోని ముక్కను కాళ్ళ మధ్య పెట్టుకొని రాగాన్ని అందుకుంది కాకి.
నీ గాన మాధుర్యానికి నేను మై మరిచిపోయాను.
ఓసారి నాట్యం కూడా చేయవా ! అంటూ మరో ఎత్తుగడకు సిద్ధ మయ్యింది
ఓ అదెంత భాగ్యం! ఆడుతూ పాడుతాను. పాడుతూ ఆడించగలను అంటూ తన కాళ్లలోని మాంసం ముక్కలు చెట్టు కొమ్మల్లో పెట్టి ఆ రసాలసాల వేదికపై తన గాన కచేరి చేసింది.
నీ గానం, అభినయం అద్భుతం మిత్రమా!
మరి!
నేను వస్తాను! అంటూ మరో ప్రణాళికను రచించడానికి దారి వెతుక్కుంటూ ముందుకు సాగింది నక్క.
నీవు ఎందుకు వచ్చావో! నాకు తెలుసు అనుకుంది మదిలో వాయసం.
మిత్రమా! మిత్రమా– కారణం ఏదైనా- నీవు నా ఇంటి ముందుకొచ్చిన ఆత్మీయ అతిథివి.
అతిథిని గౌరవించడం మన సాంప్రదాయం. అంటూ తన పిల్లల కోసం తెచ్చిన ఆహారంలో ఓ నాలుగు ముక్కలు కిందకు వేసింది.
మిత్రమా! మోసం,ద్వేషం అపజయానికి సోపానాలు.
ఇచ్చిపుచ్చుకునే లక్షణమే స్నేహాన్ని కలకాలం నిలుపు తుంది సుమా!
మనలోని అనైక్యత మరొకరికి బలం కారాదు.
ప్రేమకు, విశ్వాసానికి, నిజాయితీకి, మానవులకు మనమే ఆదర్శం.
ఒకరి కష్టానికి ఒకరం ఆసరాగా నిలబడటం జీవితేచ్చను పెంచు తుంది.
మిత్రమా! నీకు నేనున్నాని ఏనాడు మరువకు–
అంటూ రివ్వున ఆకసాన ఎగిరింది వాయసం.
కృతజ్ఞతా పూర్వకంగా వాయసం ఎగిరిన వైపే చూస్తున్నది జంబూకం.
నాన్నమ్మ ! ఈ కథను తాతయ్య మరోలా చెప్పారు తెలుసా!అన్నారు పిల్లలు. అవును! నాన్న
కాలం మారింది.
ఈ కథను మీరు మరోలా చెప్పే ప్రయత్నం చేయండి. చూద్దాం అంది నానమ్మ.
అలాగే? నాన్నమ్మ.
ఈ “కథ మాత్రం చాలా బాగుంది ! అంటూ పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళారు.