క్రిందటి సంచికలో విద్య యొక్క ఆవశ్యకతను తెలుసుకున్నాం. ఈ సంచికలో విద్యకు చెందిన మరొక రేఖను చూద్దాం.
శ్లో|| దుర్జనః పరిహర్తవ్యో విద్యయాలంకృతో పిసన్2 పిసన్ !
మణినా భూషితస్సర్పః కి మసౌ న భయంకరః?
అని భర్తృహరి దుర్జన పద్ధతిలో చెబుతాడు.
విద్య ఎంతో గొప్పదైనా అది ఎవరి వద్ద ఉన్నదో, వారినిబట్టి మాత్రమే ఫలితం ఉంటుంది. మంచివారి వద్ద ఉన్న విద్య ఎంత లోకహితము. వారినే మనం ఆశ్రయించాలి. విద్య ఉన్నది కదా అని దుర్మార్గులను మనం చేరదని తెలిపే పై శ్లోక తాత్పర్యానికి ఏనుగు లక్ష్మణకవి సులువైన తెలుగు చేశాడు.
తే. విద్యచే భూషితుండయి వెలయుచున్న
దొడరి వర్జింపనగుజుమీ దుర్జనుండు
చారు మాణిక్య భూషిత శస్తమస్త
కంబయిన పన్నజిి గము భయంకరముగాదె!
పాము తలపై ఎంత విలువైన మాణిక్యం ఉన్నప్పటికీ మనం ఎలా దూరంగా ఉంటామో, దుర్మార్గుని వద్ద ఎంత గొప్ప విద్య ఉన్నప్పటికీ అతని దరికి మనం చేరరాదని భావం.
విలువ కలిగిన మణి ఉన్నది కదా! అని పాము తన సహజ స్వభావాన్ని ఎలా మార్చుకోలేదో, అలాగే దుర్జనుడు ఎన్ని గొప్ప చదువులు చదివినప్పటికీ తన స్వభావాన్ని వదులుకోలేడు. విద్య, మనిషిని చెడు నుండి మంచివైపుకు మరల్చాలి కదా! అనే సందేహం మనకు కలగొచ్చు. కాని, అతడు నేర్చిన విద్యను, అతని దుష్టస్వభావమే బలీయమైనపుడు, విచక్షణ కోల్పోతాడు. పాములాగానే ప్రవర్తిస్తాడు అని గుర్తించాలి.
అతనికే సమాజంలో వ్యక్తులతో మనం తగు జాగ్రత్తలతో మెలగాలని కవులు మనకు బోధిస్తున్నారని గ్రహించాలి.
స్వామి వివేకానందగారి ప్రసంగాలలో లభించిన ఆణిముత్యాలను ఈ సందర్భంగా మనం గుర్తుచేసుకుందాం.
‘ధనం కాదు, కీర్తి ప్రతిష్టలూ కాదు, విద్వత్తు (పాండిత్యం) కాదు. సౌశీల్యం ఒక్కటే కష్టాలనే దుర్భేధ్యమైన అడ్డుగోడలను చీల్చుకని పోగలిగినది. దీనిని జ్ఞప్తిలో ఉంచుకోండి.’
అన్న మాటల్లో విద్య కన్నా విచక్షణ ముఖ్యమని, సౌశీల్యమే గొప్పదని, అది మాత్రమే సమాజంలోని అడ్డుగోడల్ని కూల్రదోయ గలదని ఆయన అభిప్రాయము.
ఆట పాటల్లో, వేషభాషల్లో, సుఖదుఃఖాల్లో అన్ని దైనందిన అలవాట్లలో నీతి తప్పని ధీరులై, జీవించండి. అలాంటి ఆదర్శంతో, జీవితాన్ని నిర్మించుకుంటే ఇతరులు కూడా మిమ్మల్ని అనుసరిస్తారు.’
అన్న మాటల్లో బాహిరమైన వేషధారణే కాదు. అంతరమైన భావజాలం కూడా ఆదర్శపూరితంగా ఉండాలన్నది అర్థమవుతూంది. మనోవాక్కాయ కర్మలయందు ఎవరు పవిత్రులై ఉంటారో వారు మాత్రమే సత్ పురుషులుగా కీర్తింపబడతారని మనం గుర్తించాలి.
ఇటువంటి పెద్దల వాక్యాలు మనల్ని మరింత పరిపూర్ణులుగా తయారుచేస్తాయి. ఎప్పటికప్పుడు మనల్ని మనం తీర్చిదిద్దుకోడానికి ఉపయోగపడతాయి.