నేనెప్పుడూ
అందరికంటే
ముందుంటాను
ఎందుకో తెలుసా ?
అప్పుడే
నాకు తెలుస్తుంది
నా వెనకాల
ఎంతమంది
ఉన్నారన్న సంగతి.
శ్రీ మహా విష్ణువు కాలమునుండి కూడా పరిపాలన, పదవులు, పదవుల కేటాయింపులు రాజ్యము, రాజధానులు పురాణాలు చదువుతే గోచరిస్తాయి- శ్రీ మహా విష్ణువు కాని పరమేశ్వరుడు కాని బ్రహ్మ దేవుడు కాని నేటి మన కాలపు పరిపాలనా విధానాన్నే పోలి అధికారాలు కలిగి ఉంటారు-
విష్ణువు వైకుంఠములో ఉంటు నేటి మన దేశ ప్రధానిగాను, శివుడు కైలాసములో ఉంటు రాష్ట్ర పతిగాను ఇక బ్రహ్మ దేవుడు సత్య లోకములో ఉంటు దేశములోని అతున్నత న్యాయ మూర్తిగాను కొలువులు నిర్వర్తిస్తున్నట్టులు ద్యోతక మైతున్నది అట్లనే అష్ట దిక్పాలకులు వాళ్ళ రాష్ట్రములు రాజధానులు.
దిక్పాలకుడు — దిశ — రాజధాని
ఇంద్రుడు — తూర్పు — అమరావతి
అగ్ని — ఆగ్నేయం — తోజోవతి పట్టణం
యముడు — దక్షిణం — సంయమని పట్టణం
నైరుతి — నైరుతి — కృష్ణాంగన పట్టణం
వరుణుడు — పశ్చిమ — శ్రద్ధావతి పట్టణం
వాయువు — వాయువ్యం — గంధవతి పట్టణం
కుబేరుడు — ఉత్తరం — అలక పట్టణం
ఈశానుడు — ఈశాన్యం — యశోవతి (కైలాసం)
మానవులకే కాదు దేవతలు కూడా స్త్రీ లోరునటుటకు ఉదంతముగ తారా చంద్రుల వ్యవహారము చెప్పవచ్చును.దేవతల గురువైన బృహస్పతి స్త్రీ లోలుడై స్వంత భార్యయైన తారను నిర్లక్ష్యము చేయుటవలన ఆమె పరిస్థితి గమనించిన చంద్రుడు ఆమెను వశపర్చుకొని శృంగారము జరుపుటచే బుధుడు జన్మించాడని అంటరు.(బుధుడు శాపవశమున నపుంసకుడుగా పుడుతాడు తరువాత మహా శక్తివంతుడు, జ్ఞానసంపన్నుడై జ్ఞానశక్తీ దేవిని పెళ్ళాడుతాడు)
దేవేంద్రుడు గూడా రసోన్మాదముతో మునుల భార్యలమీద మనసుపడ్డవాడై వేకువ ఝామున మునులు స్నానాదికాలకై కోడి కూత ఆధారముగా తెల్లవారు సమయమనెంచి బయలు దేరుట గమనించి తానే కోడికన్న ముందుగా స్వరవంచన చేసి మునులు బయలుదేరగానే మునిపత్నుల అనుభవించ పూనుకున్నట్టు పురాణాలలో చెబుతారు.
ఇక కులాల విషయానికొస్తె కృతయుగమునుండి కులాలు ఉన్నట్టు పురాణాల ద్వారా తెలుస్తున్నది ఉదాహరణకు-త్రేతా యుగములో రాముడు సీతను అగ్ని పరీక్షకు పెట్టడానికి కారణం ఒక రజకుడు చేసిన ఆరోపణ.
ద్వాపరలో శ్రీ కృష్ణుడు గొల్ల వారింట్ల పెరుగడము-అట్లనే విదురుడు శూద్ర స్త్రీ గర్భమున జనించడము -కలియుగమైతే సరేసరి.
హరిశ్చంద్రుని పరీక్షించినవాడు. త్రిశంకు స్వర్గాన్ని నిర్మించినవాడు, సృష్టికి ప్రతిసృష్టి చేసిన మహా తపోశక్తి సంపన్నుడు; శకుంతలకు తండ్రి.గాయత్రి మంత్ర సృష్తి కర్త శ్రీ రామునికి గురువు అయిన విశ్వామిత్రుడంతటివాడేకరువు కాలమున ఒక చండాలుడు ఎండబెట్టుకున్న కుక్క మాంసాన్నే దొంగిలించి తిన్నాడని పురాణాలు చెబుతాయి-
ఇక అగస్త్యమహాముని రాక్షసుని మాంసము తిని జీర్ణించుకున్నాడని కూడా పురాణ కథనం అదెట్లంటె ఇలలుడు-వాతాపి అనే ఇద్దరు రాక్షస సోదరులు మానవ రూపము దాల్చి దారిన పోయే వారిని ఆతిథ్యానికని పిలిచి ఇలలుడు తన తమ్ముడగు వాతాపిని మేకగా మార్చి ఆ మేక మాంసము అతిథులకు పెట్టి వాళ్ళు తిన్న తరువాత వాతాపీ అని ఇలలుడు పిలువగానే అతిథుల కడుపు చీల్చుకుంటు బయటికొచ్చేవాడు-అప్పుడు ఇద్దరన్నదమ్ములు ఆ అథితుల చంపి తినేవారు- ఇదే తీరు ఒక నాడు అగస్త్య మహామునిని కూడా ఆహ్వానించి తమ్ముడగు వాతాపిని మేకగ మార్చి ఆ మాంసముతో విందు భోజనము పెట్టి ఎప్పటిలాగే వాతాపీ అని పిలుస్తాడు ఇలలుడు అది గ్రహించి వాక్శుద్ధి గల అగస్త్యుడు జీర్ణం అంటాడు వాతాపి అగస్త్యుని కడుపులో జీర్ణమైపోతాడు-
2.
అందుకే పిల్లలకు మందు పోసినా ఉగ్గు పెట్టినా జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అను అని అంటుంటారు –
పురాణాలలో అన్నీ సాధ్యమే మచ్చుకు సూర్యుని వాహనము ఏడు గుర్రాల రథము-అందులో విచిత్ర మేమిటంటె ఆ రథానికి చక్రము ఒకటే -పగ్గాలు ఏడు బుసలుకొట్టే పాములు-రథ సారథి అనూరుడు అంటె తొడలు లేనివాడు-అకాశములో ఏ ఆలంబన లేని నిరంతర అనంతకాల పయనము-
భారత వంశీయులైన కౌరవ పాండవుల యుద్ధమును గురించి తెల్పు 100000 లక్ష శ్లోకముల మహా కావ్యము కౌరవ పాండవుల యుద్ధమును గురించియేకాక ధర్మార్థ,కామ మోక్షములను గురించియు తెల్పుచున్నది-హైందవులచే భగవదవతారముగ భాగింపబడు శ్రీ కృష్ణుడు ఈ కాలమునకు చెందిన వాడుగా భావింపబడుచున్నాడు- మహాభారత యుద్ధ సమయమందు శ్రీ కృష్ణుడు భారత వీరుడైన అర్జునునకు బోధించిన నీతి ధర్మము “భగవద్గీత” యను నామముతో మహా భారతములో అంతర్భాగముగా నున్నది-అందుచే మహా భారతము పుణ్యకావ్యముగ ఎంచబడుచున్నది- మహా భారతము వేదవ్యాసునిచే రచించబడినది -కాలక్రమమున ఎన్నొ విషయములందు చేర్చబడినవి- మహా భారతమును “పంచా వేదము “అని కూడ పిలుచుచున్నారు-
ఇప్పటి కాలములో ప్రభుత్వాలు వ్యవసాయ దారులకు గాని రక్షక భటులకు గాని యుధ సమయములో చని పోయిన సైనిక కుటుంబము నకుగాని రాయితీ,పరిహారము మున్నగు వసతులు ఆ నాడే అనగా ధర్మరాజు పరిపాలనా కాలములో కూడా కలిగించెడి వారు- ధర్మ రాజును నారదుడు అడిగినట్టి ప్రశ్నల ఆధారంగా మనకు తెలియుచున్నది-
నారదుడు ధర్మ రాజుకు రైతులకు చేయవలసిన సహాయము గురించి చెబుతూ
ధరణీ నాథ భవద్భుజ
పరిపాలిత యైన వసుధ బరిపూర్ణములై
కరమొప్పుచున్నె చెరువులు
ధరణికవగ్రహ భయంబు దనుకక యుండన్-
హీనులకు కర్షకులకు ను
భూనుత ధాన్యంబు బీజములు వణిజులకున్
మానుగ శతైకవృద్ధి న
నూనముగా ఋణములిత్తె యుత్తమ బుద్ధిన్
నారదుడు ధర్మరాజును అడింగిండేమిటంటెరైతులకు కరువు అనేది లేకుండా చెరువుల్లో నీళ్ళు నిండి ఉండి బాగుగా కనిపిస్తున్నాయా పేదలైన బలహీనులైన కర్షకులకు ధాన్యాని ఇస్తున్నావా,వారికి విత్తనాలు ఇస్తున్నావా ,చిన్న వ్యాపారులకు ఋణాలు ఇస్తున్నావా అంతే కాదు శతైక వృద్ధితో అంటె నూటికి ఒక రూపాయి వడ్డీకి ఇస్తున్నావా దానితోనే సరియైన అభివృద్ధి అని చెబుతాడు.
రైతు సంక్షేమ పథకాలే కాకుండ నారదుడు పరిపాలనా సంబంధమైన విధానాలు కూడా చెబుతాడు –
తమ తమ కనియెడు తరి జీ
తము గానక నవయు భటుల దౌర్గత్య విషా
దములేని వానికవ
శ్యము నెగ్గొనరించు నతడు శకృండైనన్-
పరిపాలనలో ప్రభుత్వం కోసం పనిచేసే భటులకు సరైన సమయములో తగిన రీతిని జీతాలు ఇవ్వక పోతె అలాంటి వారు పరిపాలకులకు తప్పనిసరిగా నష్టం చేకూరుస్తారు- కాబట్టి చనిపోయిన వారినే కాదు బతికి ఉండి పాలనలో సేవ చేసే భటులకు మంచి జీత భత్యాలు ఇవ్వాలి ఇంకా చెబుతూ
చోర భయ వర్జితముగా
ధారుణీ బాలింతె యధిక ధన లోభమునన్
జోరులలక్షింపరుగా
వారలచో ధనము గొని భవితభ్యవరుల్
దొంగల భయము లేకుండా పాలిస్తున్నావా నీ దగ్గర పని చేసే సేవకులు అధిక ధన లోభము (లంచాలకు లొంగి)చోరులను కాపాడి వెనుకేసుకొని వచ్చే అవకాశం ఉంది ఇవన్ని అడుగుతు ఉద్యోగులను నియమించే విషయంలో
హెచ్చరిక చేస్తాడు-
ఉపధాశుద్ధులబాప
వ్యపగత బుద్ధుల వినీతవర్తుల సములన్
సుపరీక్ష వినియోగించితె
నిపుణుల నర్థార్జనాది నృపకార్యములన్-
ఉత్తమ మధ్యమాధమ నియోగ్యత
బుద్ధి నెరింగిన వారిన
యుత్తమ మధ్యమాధమ నియోగములన్
నియమించితె నరెన్
ద్రోత్తమ భృత్యకోటికి సమానముగా
దగు జీతంబులా
యత్తమ సేసి యిత్తె దయ నయ్యయి
కాలము దప్పకుండగన్-
పన్నులు,డబ్బులు వసూలు చేసే సమయములో నీతితో వర్తించే వారిని ఉత్తమ,మధ్యమ,అథమ స్థానాలలో వారి ప్రావీణ్యము బట్టి నియమిస్తున్నావా లేదా అని అడుగుతాడు-
దీన్ని బట్టి మనకు తెలిసేదేమిటంటే భారత కాలములో కూడా లంచగొండులు,దొంగలు,మోసగాండ్లు ,సమర్థులు,అసమర్థులు,లోభులు,రాజ ద్రోహులు మొదలైన వారు ఉన్నారని ద్యోతకముచున్నది .
గురుజాడ అప్పారావు గారు రచించిన కన్యాశుల్కం తెలుగుజీవనాన్నీ, వాతావరణాన్నీ,మనుషుల శ్వాసనిశ్వాసాల్నీ, ఆంతరిక వ్యధల్నీ, భ్రష్టు పట్టిన మానవస్వభావాల్నీ ఆవిష్కరించే మొదటి సాంఘిక నాటకం.
అందులో ఒక పాత్రధారి అంటాడు అన్నీ వేదాలలో ఉన్నాయష అని-ఈ అనంత కాల గమనం లోనేటికి రూపుమార్చుకొని పునరావృతమయితున్న జీవన విధానాలు–అదే చర్విత చర్వణం.
ఆధారములు
************
ఏకాక్షరులు
*********
18. నిలువు 4 తో పూలమ్మేవాడు, హంతకుడు.
21. నిలువు 38 తో వర్తకుడు.
22. అడ్డం 23 తో వలె.
26. లేత లేదు లెగు.
అడ్డం
*****
01. మహానసం (4)
04. కానుకలు (4)
07. బుజ్జగింపు (3)
10. ప్రేక్షకుడు (2)
13. రథం తీసుకురారు (2)
14. అంభోధిలో అప్పు (3)
15. ‘వచ్చి యిద్ధర గల్గు …. సరిత్తీర్థ’ లో ప్రవరుని కడలి (3)
16. చీకటిలో తిమింగిలం మింగేది (2)
19. పొట్టు ఊడ్వను (2)
20. పాతకాలపు వంటకు వాడేది, దూసేరు తీగతో అల్లేది (2)
23. యతి వేగం (2)
24. కలుగమి (2)
28. గోదావరి పవిత్రజలం (2)
30. వడికి దారం తీసే తకిలీ (3)
31. నివాసం (3)
32. గుండెనిండా ప్రేమ (2)
34. వినేవారిని విసిగించే సంభాషణ, సొల్లు కబుర్లు, గోడు (2)
36. పాండవులు లెక్కకు (3)
39. గబ్బిలం కవిగారి పచ్చపిట్ట (4)
40. అడ్డం 16తో సూర్యుడు (4)
నిలువు
******
02. గుఱ్ఱం (2)
03. ‘ ….. పాపం తలా పిడికెడు’ (2)
04. కూతురు కొండనాలుక (2)
05. శ్వాస ధైర్యం బురద (2)
06. లోహితాస్యు మాత (4)
08. ప్రేమ వరుస (2)
09. రైతుల తొలిదుక్కి పండుగ (4)
11. తొలియేడు శ్రీశ్రీ గారి పద్యరచనలను వరుసగా ప్రచురించిన పత్రిక (3)
12. తరువాత (3)
17. ఎటునుండైనా మెరిసే అందం (3)
19. వెట్టిచాకిరి (3)
24. పాము (4)
25. చిన్న పెట్టె (3)
27. పరమౌషధం (3)
29. గోవులు, పశువులు మేసే కంచె (4)
33. చెట్టు (2)
35. యుద్ధం (2)
36. సంవత్సరం సంఖ్య (2)
37. చిరుతిండిలో సవ్వడి (2)
38. అనుబంధవాక్యం, మామూలే (2)
పదకిరణకలనం (April edition) విజేత!
మేధస్సును పదును పెడుతూ, మనసును ఉత్సాహపరిచే ఒకానొక సాహిత్య చిక్కుప్రశ్నల సరదా ! మీదే విజయం కావచ్చు !ఇదిగో-మయూఖ పదకిరణకలనం (puzzle) పరిష్కర్త నెల్లుట్ల ఉమానరసింహారావు కు అభినందనలు .
తెలంగాణ ప్రజావళికి ప్రాతఃస్మరణీయుడు మహాకవి దాశరథి కృష్ణమాచార్య. తక్కువ శీర్షికలతో తన కవిత్వంలో ఎంతటి కవిత్వ సాంద్రతను దట్టించినాడో కవితావిశారదులంతా గమనించినవారే ! “జయపత్రముల”వంటి ప్రశంసావాక్యములందించినవారే!!
సార్థకమైన బిరుదులను ప్రదానం చేసినవారే !!!
మహాకావ్య స్థాయి అభివ్యక్తీకరణ శిల్పరచనను ప్రకటించే కవులు ప్రపంచంలో అరుదుగా జన్మిస్తారు.ఎదుగుతారు.జాతికీర్తిని నిలబెడతారు.సమకాలీన దుష్టతనూ ౼ దౌర్జన్యాన్నీ చీల్చిచెండాడుతారు. తమ కనుల ముందే తమ ప్రధాన శుభసంకల్పం ఫలిస్తే ఆకాశమెత్తు తన జాతి ప్రగతి ఎదగాలని పొంగిపోతారు. *_మహాకవి దాశరథి ప్రధాన శుభసంకల్పం : నిజాం నిరంకుశపాలన నుండి తెలంగాణ విముక్తం కావటమే_* అన్న సత్యశివసుందర’సూక్తిని ఎవరూ ఏవిధంగానూ ఆక్షేపించలేరు. తదనంతర పరిణామాలు తనదృష్టి కోణంలోనికి అందనంత ప్రతారణనూ అప్పటి పరిస్థితుల దృష్ట్యా అందరిలాగే గమనించలేని సజ్జనకవి దాశరథి. *కాలం తనకు కావలసినంత’కాలం తన మనుషులను తానే ఎన్నుకుంటుంది( _రాశే_ )* అనే వాక్యం సమర్థనీయం అనుకుంటే కాలం తెలంగాణ విముక్తి కోసం కవి’దాశరథిని కూడా తానే ఎన్నుకుంది అంటాను నేను. సమకాలీన ప్రముఖులు దాశరథిని _యుగకవి_ అని కీర్తించటం ఇందువల్లనే ! ఆత్మవిశ్వాసం ఆత్మబలం లేకుండా ఆత్మగౌరవం అనే మాట వ్యర్థం. దాశరథి తెలంగాణ జాతి ఆత్మగౌరవ ప్రజారథి.సారథి.ప్రతినిధి. కవితావాక్య”శర”ధి.తన కనులముందే తన మనోరథం ఈడేరి ఆనందించిన కవిని తదనంతర కాలంలో పట్టించుకోవలసినంతగా పట్టించుకోకున్నా ఆత్మగౌరవంతో
*అరుగుచున్నాడు. దాశరథి అమరపురికి* … అన్నట్లు జీవితాన్ని తృప్తిగా _బాగానే బతికాను_ అన్నట్లుగా నిష్క్రమించిన *మహాపురుషుడు దాశరథి* . నిలువెల్లా స్పందించి
*నా తెలంగాణ కోటిరత్నాల వీణ* అనే నినాద’నిక్వాణస్వరాన్ని నిరంతర ప్రేరక విజయశంఖం గా విడిచి వెళ్లిన మహాదార్శనికుడు.
ఇటీవలి కాలఃలో సొంత’ఊపిరిని గెలుచుకొని మరింతగా పెంచుకుని సువర్ణప్రగతి(బంగారు తెలంగాణ) పథంలో పురోగమిస్తూన్న
ఆధునిక తెలంగాణకు *నా తెలంగాణ కోటి రత్నాలవీణ* నిజమైన జీవనోజ్జీవన శంఖధ్వానం.
మహాకవి దాశరథి జయంతి 22,జులై సందర్భంగా ఆ మహాకవికి ఇది నా అక్షరనీరాజనం.
Poets are the unacknowledged legislators of the world ౼ P.B.Shelly
౼ గురిజాల రామశేషయ్య
ఆధునిక తెలంగాణ సుస్పష్టమైన హద్దులతో ఏర్పడిన రెండు తెలుగు రాష్ట్రాలలో ఒకటి. తెలుగు భాష ప్రాచీన హోదాను పొందిన భారతీయ భాషలలో ఒకటి. మాధుర్యమునకు పేరు పొందిన భాషలలో తెలుగు మొదటిది. సాహిత్యపరంగా తెలుగు పద్యం విశిష్టమైన భావ వాహిక. మందార మకరంద మాధుర్యమునకు పోతన భాగవత తెలుగు పద్యం దృష్టాంత సాక్ష్యం. అటువంటి పోతనను ఉద్దేశించి “ఎందుకాతడుగ పుట్టకైతిని హరీ!” అని తన “భూమిక’’ కావ్యంలో పలువరించి ‘కల’వరించి ఆ కల ‘వరించి’ తన కవన గళ సహపది కాగా మాన్యుడైన మహాకవి సింగిరెడ్డి నారాయణరెడ్డి. ‘సినారె’ సంక్షిప్త నామంతో సుప్రసిద్ధుడైనాడు.
‘సినారె’ అగణ్యమాన్యతామకుటాలు రెండు. ఒకటి, భారతీయ జ్ఞానపీఠ పురస్కార స్వీకృతి, రెండు, ‘రాజ్యసభ’ సభ్యత్వం.
పల్లె నుండి ఢిల్లీవరకు ఎదిగిన తెలంగాణ కవులలో ఒకరు ‘సినారె’. మూడుతరాల యువకవులను ప్రభావితం చేసిన మహాకవి తాతయ్య ‘సినారె’. ఎందరికో శబ్దభిక్ష పెట్టిన ధన్యుడు. ఎందరికో ‘లయ’ను పరిచయం చేసిన సం‘గీత’జ్ఞుడు. ఖండాంతరాలలోని తెలుగు డెందాలను తన పలుకుబడితో పులకరింపజేసిన సుమధుర కవి ‘సినారె’.
విశ్వవిద్యాలయ ఆచార్యునిగా, ఉపకులపతిగా రాణించిన ‘సినారె’ నిజంగా కవి కులపతి. కవి కవిత్వం వరకే పరిమితుడుకాడని నిరూపించిన అధికార భాషా సంఘాధ్యక్షుడు. నిత్య శోభిత సాహిత్య సభాధ్యక్షుడు, ముఖ్యాతిథి. తిథిరీత్యా నిత్యకవన రచనా పిపాసి. కవితాభ్యాసి. కవితా ‘కళాప్రపూర్ణుడు’. కవి పద్మ భూషణుడ. రణం మరణంపైనే అని సగర్వంగా ప్రకటన చేసిన కవి యశస్వి ‘సినారె’.
తన పేర తెలంగాణ రాజధానిలో సారస్వత నిలయం ఏర్పడే అంతగా ఘనత పొందిన మాన్య కవీంద్రుడు ‘సినారె’.
మధ్య తరగతి మందహాసాన్ని తన పరిధిలో వివేచించి ఉన్నతి గతి మీది చిరకాంక్షతో ‘విశ్వంభర’ మానవుని వరకు తరగెత్తిన కావ్య సమీక్షణం ‘సినారె’ స్వీయ నిర్ణయ కావ్యకళా పథం కావ్యకళా.
అందుకే ఒక సందర్భంలో : గర్జించే గళం నాది! నిర్జించే కలం నాది! స్వీయానుభవగర్వ దీప్తిని అక్షరీకరించినాడు.
ప్రతిష్ఠాత్మక కవితా పీఠాధిష్ఠుడైన తాను ‘పీఠిక’ రచనలతో యువ కవుల నుండి మహాకవుల వరకు అందరిలోని ప్రతిభా వ్యుత్పన్నతలను కల కలిచే తన పద సంపుటితో సప్రమానంగా అభినందించినాడు.
తెలుగు సాహిత్యంలో పద్యం గద్యం ద్విపద కీర్తన వచనం గేయం వచన కవిత మినీ కవిత ఇలా ఇలా అలల్లాంటి ఎన్నెన్నో ప్ర్రకియలు తలలెత్తి కవుల తలపైన కీర్తికిరీటాలను సుస్థిరం చేసినాయి. ఈ క్రమంలో 20వ శతాబ్ధం 30వ దశకంలో 29 జులై 1931 రోజున ఆషాఢ పూర్ణిమ (గురుపూర్ణిమ)నాడు జన్మించిన ‘సినారె’ మాత్రాచ్ఛందస్సుల్లో గేయ కావ్యాలను రచించి ఒడుపుగా పద్య గంధిలతను – సమాసకల్పనల పొందికతో అక్షర రమ్యంగా సముచిత రీతిలో ఔచిత్య భాసురంగా గంగాతరంగచారిమతో భారత స్వాతంత్ర్యానంతర కవిస్వాతంత్ర్యానుకూల గేయం దేశచ్ఛందస్సులలోనికి తెలుగు పలుకు ఒరవడికి మడులు తీర్చి కవిత్వపు పంటను పండించే చొరవను పాదు కొల్పినారు. ఇది ‘సినారె’ పైకి చెప్పకుండా అఖిలాంధ్ర సాహిత్య చరిత్రకు చేసిన మేలు. దీనివల్ల అంటే మాత్రాచ్ఛందో కావ్యాలవల్ల పద్య పఠన శక్తి ఒనగూడి ప్రాచీన కావ్యధోరణుల సమవగాహన శక్తిని పొందటానికి అప్పటి యువతరానికి సాధ్యమైంది. అంతేకాక గహనమైన కావ్యశిల్ప సంప్రదాయములను యథాశక్తి గ్రహించి తమ రచనలలో పాటించగలిగే నేర్పు ఇంతో అంతో ఒనగూడింది. ముఖ్యంగా భాషా పరంగా నిర్దుష్ట భాష పట్ల ఆసక్తి పెరిగింది. అంతేనా! ‘సినారె’ రుచి చూపించిన అంత్యప్రాస, అంతఃప్రాస (సినారె మాటే ఇది), అనుప్రాస, యమకాది అలంకారాలను గమనించి ఆనందించటంలోనూ; తమ రచనలలో ప్రయోగించి మెప్పుపొందటంలోనూ కవులను మార్గదర్శనం చేసినట్లయింది. జనరంజకమైన సినీ గీతాలలోనూ ఈ సాంప్రదాయిక సాహిత్యరీతి విధానాలను చవి చూపించినాడు. కలవరించి – కల- వరించి సభంగ శ్లేషాత్మక యమకం. “శివరంజని” సినిమాలోని పాటలో “నా దానివి – నా –దానివి” ఇలాంటిదే! పాలవెలుగై –మణదీ “పాల” వెలుగై ఇలాంటివెన్నెన్నో! తనకంటె ముందు తరంలోని పెద్దల సరసన ఇటు శిష్ట సాహిత్యంలోనూ అటు సినీ సాహిత్యంలోనూ నెగిలిన ప్రతిభాశాలి ‘సినారె’. ఇక తన తర్వాతి తరం చేత అభిమానింపబడిన, సన్మానింపబడిన పెద్ద “సినారె”. తరం మారుతున్నది….. స్వరం మారుతున్నదని గమనించిన దార్శనికుడు. “సరిలేరు. నీకెవ్వరు” అని జేజేలు పొందిన అదృష్టవంతుడు. ఇంతగా సినీ సాహిత్యపరంగా చెప్పటమెందుకంటే “సినారె” కీర్తి కిరీటంలో ఒకటి ఆచార్య పదవి – దాని ఉన్నత ఉప కులపతి పదవి ఒక తురాయి. శిష్ట సాహిత్యంలో భారతీయ జ్ఞానపీఠ పురస్కృతి మరో కలికితురాయి. సినీగీతావళి కీర్తి కలిమితురాయి. శ్రోతలకేమో సరళీ స్వరాల పంట. ఒక వ్యక్తి కవిగా ఇంత ఉన్నత స్థాయి కీర్తి స్థితులను అందుకోవటం జాగ్రత్తగా పరిశీలిస్తే ఎంతటి సంయమన శీలంతో – మరెంతటి కళాసేవా “శ్రమ” కర్తృత్వంతో ఇంకెంతటి ఉల్లాస భరిత స్వరచాలన హృదయంతో ఉజ్జీవిస్తూ రోజు రోజూ కాలాన్ని కర్పూరంగా మండించుకోవాలో కదా! అప్పుడే కదా ఇంతటి మాన్యచరితకు దీప్తి!
ప్రభుత్వ కళాసాహిత్య సేవా సలహాదారుగా పనిచేసిన “సినారె” ఎన్నో ప్రసిద్ధ కళాసాహిత్య సేవా సంస్థలకు వెన్నుదన్నుగా నిలిచినాడు. తెలంగాణ సారస్వత పరిషత్తును చెదరకుండా నిలిపిన వ్యవహారజ్ఞుడు.
సమష్టిపై ‘సినారె’ ఆధునికతలో అడుగులు వేసిన ధీశాలి. ప్రాచీన వైభవ సంస్కృతిని (Heritage) ఆధునిక స్పృహతో సమీక్షించిన సామాజిక కళామేధావి.
“సురభిళ శబ్దమ్మొక్కటి
తరగెత్తిన చాలు – నా
గుండె సందులందు కోట్లి
నందనాలు గుబాళించు”
అని తన శబ్ద ప్రీతిని అభివ్యక్తీకరించుకున్న ‘సినారె’ అస్మదాదులకు “శబ్ద గురువు”.
“అంత కడివెడు పాలపై – ఒ
క్కింత మీగడ పేరినట్లుగ మనకు
మిగులును గతము లోపలి మంచి
అదిమె సంప్రదాయము”
అని సంప్రదాయములోని మంచిని ఆధునికతలోని ప్రయోగ ప్రయోజన శీలతను మేళవించుకని ‘ఒళ్ళంతా లయ’గా అడుగులు వేసి – “చూపంతా ప్రగతిశీలత” నుడుగులు పలికి తెలుగుజాతికి మాన్యకవీంద్రునిగా ఆదర్శనీయుడై తరించిన స్వరధుని “సినారె”! మానవీయ విశ్వంభరుడు “సినారె”.
శ్రీ గురుభ్యోనమః
– గురజాల రామశేషయ్య
ఆత్మవత్ సర్వభూతాని భగవంతుని వాక్యం. తన వలనే తన చుట్టూ ఉన్న ప్రాణి సమూహం ఉన్నది అని దీని అర్థం. భగవంతుడు తన వలెనే మిగిలిన ప్రాణులు అనడంలో నేను అన్ని ప్రాణులలో ఉన్నానని అని చెప్పడం అక్కడి ఉద్దేశం. మరి మానవులు నేను అన్న మాటను తమ వైఖరిని చెప్పే ఉద్దేశంతో వాడుతారు. నేను ఈ మాట అన్నాను, నేను ముందే చెప్పాను, నేను అనుకున్నది ఇదే. నేనే ఈ మొత్తం వ్యవహారాన్ని చక్కబెట్టాను అన్న ఈ మాటల సందర్భం లో ని నేను లక్ష్యం వేరు అని తెలుస్తూనే ఉంది. నేను శ్రీ శ్రీ సామూహిక చైతన్యం అన్న అర్థంలో ఉపయోగించే విమర్శకులు అంటారు . కాల్పనిక అభ్యుదయ విప్లవ యుగాలలోని నేను ఇచ్చిన అర్థం సమాజం సమూహాలను కేంద్రంగా చేసుకున్నట్లయితే వాసిలి వసంతకుమార్ నేను అన్న యౌగిక కావ్యం అంతర్ బహిర్జగత్తుల సంవాదం. అయితే ఇది ఆత్మవిశ్వాస మాధ్యమంగా ఎలా వ్యక్తం అవుతుంది అని పరిశీలించడం ఈ చిరు వ్యాసం లక్ష్యం.
ఆత్మవిశ్వాసము అన్నది భౌతిక స్థైర్యం ద్వారా వచ్చే స్వభావమా? అంతశ్చైతన్యం ద్వారా వ్యక్తమయ్యేస్వరూపమా? అని ముందు ప్రశ్నించుకోవాలి. అతడిలో ఆత్మవిశ్వాసం ఉంది అని మనం గుర్తించేది అతడి భౌతిక స్వరూపం వల్లనే. భౌతిక స్వరూపం అలా ఉండడానికి కారణం మానసిక సంతులన. మనసు ప్రభావం శరీరం మీద ఉంటుంది. శరీరం మనసు స్థితిని వ్యక్తం చేస్తుంది. కాబట్టి ఆత్మవిశ్వాస మాధ్యమ నేను అంతర్భహిర్జగత్తుల సమన్వయం అని ముందుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతకీ తాత్పర్యం ఏమిటి అంటే మనసు స్థితిని శరీరం వ్యక్తం చేస్తుంది. అది ఇతరులకు ఆత్మవిశ్వాసంగా శరీరం ద్వారా మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఆత్మ విశ్వాసం తనకు ( నేను) అంతస్సు నుంచి బాహ్యానికి ప్రయాణించేది కాగా ఇతరుల చూపుకు బాహిర, స్థితినుంచి అంతస్సుకు ప్రయాణించేది. ఇది ఎటునుంచి ఎటు ప్రయాణించినా దాని స్వభావం మాత్రం అంత శ్చేతనకు సంబంధించినదే.
అనుభావ కావ్యం తాత్విక కావ్యం యౌగిక కావ్యం అన్న మాటలు పరి భాషలుగా కొంత స్థిరపడటానికి జరుగుతున్న ప్రయత్నం ఇటీవల కనిపిస్తుంది. అనుభావ కావ్యం మార్మిక కవిత తోడిదైతే , తాత్విక కావ్యంలో జీవిత పరమార్థ బోధన, ఉనికి పట్ల అవగాహన సత్య అన్వేషణ అన్నవి ఉంటాయి. మరి యౌగిక కావ్యంలో ఏముంటుంది. కేవలం బాహ్య జగత్తో అంతర్ జగత్తో ఉండదు. యోగ శారీకరంగా చేసే ఒక సాధన దాని పరమార్థం మానసిక సంతులన. స్థిత ప్రజ్ఞత. ఇది దైవికం అని యోగ శాస్త్రం చెప్పదు. ఇది అభ్యాసం సాధ్యం మాత్రమే. అభ్యాసం శారీరక మానసిక అంశాల సమ్మేళనా రూప ప్రక్రియ. ఇది ప్రయత్న సాధ్యమూ, సాధనే తప్ప తాంత్రిక విద్య కాదు. ఈ విషయాన్ని నేను అన్న యౌగిక కావ్యం బోధిస్తుంది . అదిే యౌగిక కావ్యం అన్న సాహిత్య ప్రక్రియకున్న స్వభావం. కావ్య స్వభావమే ఆత్మవిశ్వాస మాధ్యమం అని తెలుస్తుంది. ఈ ఆత్మ విశ్వాసాన్ని మనలో మనం పరీక్షించుకోవాలంటే దానికి అభ్యాసం కావాలి. సాధన కావాలి. దీని వలన జ్ఞాన కర్మేంద్రియాలపై నిగ్రహం, స్వీయ నియంత్రణ అన్నవి మనిషి పొందుతాడు. భోజరాజీయం లోని వశిష్ట అగస్త్య సంవాదానికి సంబంధించిన కథ ఇటువంటి స్వీయ నియంత్రణని చెబుతుంది. దేనిమీద విపరీతమైన యావలేని తనాన్ని చెబుతుంది. స్వీయ నియంత్రణ అభ్యాస సాధ్యమైనది అందుకు యోగ దారి చూపుతుంది. ఆ స్థిరమైన చిత్తం ప్రయత్న సాధ్యమే కానీ అయత్న సిద్ధి కాదు. ఆ సత్యాన్ని బోధించడానికి ఆధునిక చేతనతో వాసిలి వసంతకుమార్ నేను అన్న యౌగిక కావ్యం రచించారు.
నేను కావ్యంలో 7 పథాలున్నాయి. పథం అంటే దారి. దారిని నడక ద్వారానే, ప్రయాణం ద్వారా మాత్రమే కొలవవచ్చు, తెలుసుకోవచ్చు. ఇవి పరిణామ, ప్రమోద , ప్రమాణ, ప్రస్థాన, ప్రయోగ, ప్రవిమల, పరమ పథాలు. ఇవి భౌతిక స్థితి నుంచి ఆత్మిక స్థితికి ప్రయాణించిన యోగి మార్గానికి చిహ్నాలు. పరిణామంలో మనిషి పెరగడం, ప్రమోదంలో చింతనలో ఎదగడం, ప్రమాణంలో సాంస్కృతికంగా వైజ్ఞానికంగా జీవన ప్రమాణాలను ఉన్నతీకరించుకోవడం, ప్రస్థానం ప్రయోగం ప్రవిమలం పరమ పథకాలలో భౌతికం మొదలు ఆత్మిక ఆధ్యాత్మికత తత్వాల దాకా ఎదిగిన, ప్రయాణించిన మానవుడు కనిపిస్తాడు. భౌతికం పరిణామంలో, ప్రకృతిలో ప్రమోదం శాస్త్రంగా ప్రమాణం, ప్రమాణం ద్వారా ప్రస్థానం మొదలై ప్రయోగానికి దారితీసింది. అందులోని ప్రవిమలత్వం మనిషిని పరమ పథానికి చేర్చింది. మనిషి పుట్టి పరిణామంలో ప్రకృతితో మమేకమై తన జీవితానికి ఒక ప్రామాణికతను తెచ్చుకుని తన ప్రస్థానం మొదలుపెట్టి ఈ జీవన ప్రయాణంలో జీవిక కోసం ఎన్నో ప్రయోగాలు చేస్తాడు. ప్రయోగాల నుంచి విమలత్వాన్ని పొంది జీవనంలో ఉత్కృష్ట స్థితిని చేరుకుంటాడు. ఇది భౌతికంగా కనిపిస్తున్న పరిణామం కాగా ఆత్మికంగానూ ఇదే రీతిలో తనను తాను మలచుకుంటాడని నేను ద్వారా ఆత్మవిశ్వాస బోధన చేస్తున్నారు వాసిలి వసంతకుమార్.
నేను అన్న దానిని కొందరు అహం గా చూస్తారు. అహం అన్నది “నేనే” అవుతుంది కానీ నేను కాదు. కాలేదు. నేను ఆత్మవిశ్వాస చిహ్నం మాత్రమే. ఈ యౌగిక కావ్యంలో భౌతికంగా వైజ్ఞానికంగా సాంఘికంగా ఆర్థికంగా ఎదిగిన నేను అహంతో ఎదిగిన రీతికి గుర్తు. భౌతిక స్థితి దీనికి పునాది. దీన్ని జయించాలంటే యోగమార్గం అనుసరించాలి. అది చిత్త వృత్తి నిరోధం, కర్మ కౌశలంతో కూడింది. నైతికంగా, జ్ఞానంగా, సాంస్కృతికంగా, నిస్వార్థంగా ఎదిగిన నేను ఆత్మవిశ్వాస చిహ్నం. ఈ రెండిటికీ ఇదే స్పష్టమైన వ్యత్యాసం. ఈ కావ్యమంతా ఇదే అంశం నేనుగా పరచుకుని ఉంది. అందుకు ఈ కింది కవితా పంక్తులు ఉదాహరణగా నిలుస్తాయి.
కవి చెప్పుకున్నట్లు ఇది మనసు కథనం. – ఇది మనుగడ కథనం ఇది. మనిషి మనుగడ కోసం చేసే ఒక పోరాటం వలన ఆత్మవిశ్వాసం పొందుతాడు ప్రకృతి రూపం, ప్రకృతి లో తన రూపం రెండు భౌతికమే కానీ ఆ రూపం వెనక ఉన్న చేతనం ఆత్మవిశ్వాసాన్ని బోధిస్తుంది.
నాభి నుండి నాడీమండలం వరకు రూపా విష్కరణ
మత్స్యం నుండి మనువు వరకూ ఇహ ఆవిష్కరణ
నేను జీవితపు దారుల్లో బాలుణ్ని
సంయమనం లో వార్థక్యాన్ని
యోగికంగా కౌమారాన్ని అని అనడంలో భౌతిక మానసిక స్థితుల సమతౌల్యతను కవి భావిస్తున్నారు.
పరిణామానికి
తొలి బీజం గా నేను
తొలి ఇజంగా నేను
తొలి నిజంగా నేను అని అనడంలో బీజం పునాది అయితే ఇజం ఆలోచన నిజం ఆత్మవిశ్వాసానికి సంకేతాలు. ఇది బోధించడానికి ఆ మార్గంలోకి ఆహ్వానిస్తున్నది ఈ యోగిక కావ్యం. నేను లో ఈ ఆత్మవిశ్వాసం ఎన్ని రీతులుగా వ్యాపించి ఉందో ఇందులోని 7 పథాలు తెలియజేస్తాయి. ఈ ఏడు పథాలు షట్చక్రాన్ని ఊర్ధ్వలోక సప్తకాన్ని సూచిస్తున్నాయి.
ఆధారం – భూలోకం – పృథ్వి భూత స్థానం
స్వాధిష్ఠానం -భువర్లోకం- జలభూతం స్థానం
మణిపూరకం- సువ ర్లోకం- అగ్ని భూత స్థానం
అనాహతం- మహ ర్లోకం- వాయు భూత స్థానం
విశుద్ధ చక్రం -జన లోకం- ఆకాశభూత స్థానం
ఆజ్ఞా చక్రం -తపో లోకం -జీవాత్మ స్థానం
సహస్రారం- సత్యలోకం- ప్రమాత స్థానం పంచ భూతాలు, జీవేశ్వరుల నాభి నుండి బ్రహ్మ కపాలం వరకు వ్యాపించి ఉండడాన్ని యోగ మార్గం చెబుతుంది. ప్రకృతి అసమత్వం మన ఆత్మ విశ్వాసాన్ని తగ్గించడం ప్రస్తుత కరోనా పరిస్థితులలో చూస్తున్నాం. దానికి విరుగుడు యోగ అని ఒక అభిప్రాయం వినిపిస్తున్నది. శారీరక స్వస్థత మానసిక ధైర్యానికి కారణం అవుతుంది. అది బాహిర ప్రకృతి నుండి అంతర ప్రకృతి లోకి తెచ్చుకునే మార్గాన్ని యోగ బోధిస్తుంది. అది అంతర్బహిర్జగత్తులోని వసంతంగా మన ముందునిలపడం కోసం ఋషులు ప్రయత్నం చేసారు. . దానికి తన లోపలి విశ్వాన్ని బయటి విశ్వాన్ని భూమికగా చేసుకున్న విశ్వర్షి అందించిన ఒక యౌగిక కావ్యం నేను.
-సిహెచ్. లక్ష్మణ చక్రవర్తి
అసిస్టెంట్ ప్రొఫెసర్,
తెలుగు డిపార్ట్మెంట్ తెలంగాణ యూనివర్సిటీ
+91-9849714261
దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రిగారి వాణికి, సాలూరి రాజేశ్వరరావు గారు బాణీ సమకూర్చిన ఈ గీతం భానుమతిగారి గళంలో వినసొంపుగా ఉంటుంది.
మల్లీశ్వరి చిత్రం 70 సంవత్సరాల క్రితం వచ్చిన సినిమా, ఆ సినిమా పాటలు ఇప్పటికి తెలుగువాళ్ళ హృదయాల్లో తాజాగా కదలాడుతున్నాయి. అందులో
మనసున మల్లెల మాలలూగెనే
కన్నుల వెన్నెల డోలాలూగెనే
ఎంత హాయి ఈ రేయి నిండెనో
ఎన్న నాళ్లకి బ్రతుకు పండెనో
నిజానికి నిరీక్షణ ఎంత మధురమైనదో, అంత బాధాకరమైనది కూడా! అంటే నిరీక్షణ ఒక మధురమైన బాధ. నిరీక్షణ నిజంగా ఫలిస్తే మాత్రం ప్రేమికులకు పెద్ద పండుగ.
కొమ్మల గువ్వలు గుసగుస మనినా
రెమ్మల గాలులు ఉసురుసురనినా
అలలు కొలనులో గలగలమనినా
దవ్వుల వేణువు సవ్వడి వినినా
నీవు వచ్చేవని నీ పిలుపే విని
కన్నుల నీరిడి కలయజూచితిని
ప్రకృతిలోని ప్రతిశబ్దం కూడా తన ప్రేమమూర్తి ప్రతి ధ్వనిలాగే వినిపిస్తుంది. తన ప్రేమమూర్తి కొరకు ఎదురు చూడడమంటే తన జీవితం కొరకు, తన ప్రాణం కొరకు ఎదురు చూడడం. ఒకవేళ ఆ ప్రేమమూర్తి రావడానికి ఆలస్యమే కాదు, ఎడబాటు ఏర్పడితే, కళ్లు కన్నీటిమయమే. నిజంగానే అతడొచ్చి ఎదురుగా నిలబడితే, కన్నీటి పొర కమ్మేసిన కళ్ళతో అతనిని గుర్తించడం కష్టమే.
గడియయేని ఇక విడిచి పోకుమా
ఎగసిన హృదయము పగులనీకుమా
ఎన్ని నాళ్ళకీ బ్రతుకు పండెనో
ఎంత హాయి ఈ రేయి నిండెనో
తన అదృష్టం కొద్ది తన నిరీక్షణ ఫలించి తన ప్రేమమూర్తి తన దగ్గర వాలిపోతే ఈ లోకమంతా తన సొంతమైనట్లుగా ఆనందం, చెంతకు చేరిన ప్రేమమూర్తి ఎప్పటికీ తన దగ్గరే వుంటారనే గ్యారంటీ లేదు. ఏదో కారణంతో వారిద్దరు విడిపోయి, చాలాకాలం దూరదూరాలకు విసిరివేయబడితే ఆ ప్రేమ హృదయాలు మళ్ళీ చేరువ కావడానికి ఎంత పోరాటం చేయాలో?
1951లో విడుదలైన మల్లీశ్వరి ‘‘వాహినీ’’ వారి చిత్రం. బి.ఎన్.రెడ్డి నిర్మాత, దర్శకుడు. ఈ చిత్రం ఇండియాలోనే కాకుండా, రాచరికపు ఆడంబరాలను, ఆచారాలను చిత్రించినప్పటికి, కమ్యూనిష్టు దేశమైన చైనాలోను 100 రోజులకు పైగా నడిచింది.నాగరాజు (ఎన్టిఆర్), మల్లీశ్వరి (భానుమతి) ఇద్దరు బావా మరదళ్లు, వేళా కోళానికి మల్లీశ్వరిని రాయలవారి రాణివాసానికి (మహారాణి తిరుమలుదేవికి ఇష్టసఖిగా) పంపిస్తే బాగుంటుందని నాగరాజు అంటే, రాయలవారు (శ్రీవత్స) తన సైన్యాన్ని పంపించి, మల్లీశ్వరికి తన రాణివాసములో చోటు కల్పిస్తాడు. చిన్న నాటి నుండి అనుబంధాలను పెంచుకున్న బావామరదళ్లు విడిపోయి, బ్రతకజాలకపోతారు. ఆ సమయంలోనే నాగరాజు విజయనగరంలో శిల్పాులు చెక్కుతుంటాడు. తోటలోని దేవాలయం వద్ద నాగరాజు, మల్లీశ్వరి ఇద్దరు రహస్యంగా కలిసికొన్న సందర్భంలో పాడిన యీ పాటను దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారు వ్రాయగా, సాలూరి రాజేశ్వరరావుగారు బాణీ కూర్చారు.
దేవులపల్లి కృష్ణశాస్ర్తిగారు సహజంగా భావ కవి. సరళ లాలిత్య పదాలతో ఆయన తన రచనా వ్యాసంగాన్ని కొనసాగించేవారు. ఆంధ్రాషెల్లీగా ప్రసిద్ధులు. ఆయన సాహిత్యం “ఇక్షురసార్ణవం” వంటిదని శ్రీశ్రీ ప్రశంసించారు.ఈ పాటలో నాయిక తన భావోద్వేగాన్ని, హృదయ స్పందనను అందరికి అర్థమయ్యే విధమైన సరళ పదాలతో పాడుతూ, నటిస్తూ సన్నివేశాన్ని రక్తి కట్టిస్తుంది. 70 సంవత్సరాలైనప్పటికి ఈ పాట ప్రజలలో పాతుకుపోవడానికి కారణం కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారే కారణం.
-ఏలూరు అశోక్ కుమార్ రావు
ప్లాట్ నెం. 203, ద్వారకా గ్రాండ్ రెసిడెన్సీ,
రోడ్ నెం. 8, యాదవ్ నగర్,
అలకాపురి, హైదరాబాద్ – 500102
+91-9440575028
(శ్లోకం సేకరణ: సూక్తి ముక్తావళి – సంకలన కర్త మహీధర జగన్మోహన రావు)
భావం: ఎప్పుడో చిన్నప్పుడు పోసిన నీళ్లను తాగి,ఆ మేలు మరచి పోలేక, కొబ్బరి చెట్టు నీటితో నిండిన బరువైన కాయల్ని తలమీద మోస్తూ జీవితపర్యంతమూ మానవులకు తియ్యటి నీటిని అందిస్తూ ఉంటుంది.ఆహా! సజ్జనులు ఎదుటి వారి నుండి ఎంత చిన్న ఉపకారం అందుకున్నా దానిని మరచి పోకుండా పరులకు తిరిగి ఉపకారం చేయాలనే ఆలోచన కలిగి ఉంటారు.
అన్వయం: ప్రకృతి , మనిషి నుండి ఏ కాస్త సహాయం అందుకున్నా ఋణం తీర్చేసుకుంటుంది. మళ్లీ ఇటువంటి స్వభావం సజ్జనులకే ఉంటుంది.ఈ లక్షణం మానవులందరూ అలవరచు కుంటే మనం ప్రకృతిలో మ మేకమైనట్లేకదా!
మనిషికి ఉండవలసిన లక్షణాలలో ప్రథమమూ,ఉత్తమమూ అయినది -కృతజ్ఞత.ఈ స్వభావమే మనిషిని ఉన్నతమైన స్థానం లో నిలబెట్టుతుంది.తల్లిదండ్రులు, గురువులు, స్నేహితులు,బంధువులు వీరందరి పట్ల కృతజ్ఞత కలిగిఉండాలి.ఎందుకంటే , మనం పుట్టిన దగ్గర నుండి మనం ఎదుగుదలకు వీరు మనకు సహాయం చేసిన వారే.వీరందరినీ మనతో పాటు నిలబెడుతూ , మనకొక స్థాయిని కల్పిస్తున్న ఈ సమాజానికి మన మెప్పుడూ ఋణపడి ఉండాలి.
సమాజ ఋణం తీర్చుకొనేందుకు మనశక్తియుక్తులను … బౌద్ధిక ప్రమాణాలస్థాయిననుసరించి ఏ రంగాలలో మనం వికాసప్రగతిని సాధించినామో ఆ రంగంలోనే ఇతరులకు సహాయసహకారాలు అందించవచ్చును. తరాల అంతరాలను తగినవ విధంగా పూరించటంలో మనవంతు కర్తవ్యాన్ని నిర్వహించటం కృతజ్ఞతా పూర్వకంగా మన పూర్వులనుండి పొందిన స్ఫూర్తిని జాతినిర్మాణపరమైన కృషికి కృతజ్ఞతాసమర్పణమే ఔతుంది. కృతకృత్యుల కృషిని వారి పేరున స్మరించటమే వారి కీర్తిగీతికి మనం సమకూర్చే ఆకర్షణీయ వాద్యసంగీతం.
-డా|| మృదుల నందవరం
తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్,
డిగ్రీ కాలేజీ (విమెన్), బేగంపేట్
+91-9441408393
తెలంగాణా సినిమా అనగానే మనకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణాకు హైదరాబాద్ కు పేరు తెచ్చిన పలు సినిమాలు, ఆ సినిమాల దర్శకులూ గుర్తొస్తారు. వారిలో గౌతం ఘోష్ ‘మా భూమి’, శ్యాం బెనెగల్ ‘అంకూర్’, ‘నిశాంత్’, ‘మండి’, బి.నరసింగ్ రావు’ దాసీ’ , బి ఎస్. నారాయణ ’నిమజ్జనం’, ‘ఊరుమ్మడి బతుకులు’ ఇట్లా అనేకం గుర్తొస్తాయి. వాటిలోని కళాత్మకతతో కూడిన వాస్తవికత మనల్ని అబ్బురపరుస్తుంది. అవి విశేష ప్రశంసల్నీ అవార్డుల్నీ గెలుచుకుని తెలంగాణా ఉనికిని ప్రపంచానికి చాటాయి. అలాంటి ఇంకో ప్రయత్నం చేసి విజయమ సాధించినవాడు సాగర్ సార్హది. ఆయన తీసిన ‘బాజార్’ కళాత్మకంగానూ వ్యాపారాత్మకంగానూ గొప్ప విజయాన్ని అందుకుంది. ఆ దర్శకుడు సాగర్ సర్హది ఈ నెల 22న తన 87సంవత్సరాల వయసులో ముంబైలో మరణించాడు. హైదరాబాద్ లోని పేద ముస్లిం తల్లిదండ్రులు పదహారేళ్ళ వయసున్న తమ కూతుళ్ళని కేవలం డబ్బు కోసం ముసలి అరబ్ షేఖ్ లకు ఇచ్చి పెళ్ళిళ్ళు చేస్తున్నారని ఇది ఒక రకంగా అమ్మాయిల్ని అమ్మేయడమే నని ఒక ఆంగ్ల పత్రికలో వచ్చిన వ్యాసం చూసి సాగర్ సర్హదీ ఆవేదనచెందాడు ప్రభావితుడయ్యాడు. ఆ అంశం పై తాను రూపొందించిన సినిమా ‘బాజార్’. ఆ వార్త చూసిన సాగర్ సర్హది స్వయంగా హైదరాబాద్ కు వచ్చి అనేక మంది రచయితల్నీ, జర్నలిస్టులనీ కలిసి వాస్తవ వివరాలు సేకరించడంతో పాటు అలాంటి ఒక ముస్లిం కుటుంబం వారి పెళ్లిలో కూడా పాల్గొన్నాడు కూడా. అట్లా రిసర్చ్ చేసి రూపొందించిన స్క్రీన్ ప్లే చూసిన సాగర్ మిత్రులు అది వర్క్ అవుట్ కాదు వదిలేయమని చెప్పినా మొండిగా ‘బాజార్’ సినిమాను నిర్మించాడు. నిర్మాణం పూర్తి అయిం తర్వాత విడుదల చేసేందుకు పంపణీదారులెవరు ముందుకు రాలేదు. కానీ ఒక సారి విడుదలయ్యాక 25 వారాలు ఆడి జుబ్లీ చిత్రంగా నిలబడింది. బజార్ సినిమా మొత్తం హైదరాబాద్ సంస్కృతి, ముఖ్యంగా పేద ముస్లిం కుటుంబాల జీవితాలని అత్యంత వాస్తవికంగా ఆవిష్కరిస్తుంది. నటీ నటులు నసీరుద్దీన్ షా, స్మితా పాటిల్, ఫరూఖ్ షేఖ్, సుప్రియా పాథక్ లు ఆయా పాత్రలకు జీవం పోశారు. ఇక ఖయ్యాం సంగీతం బాజార్ సినిమాకు పెద్ద అలంకారంగా చెప్పాలి.
ఇట్లా హైదరాబాద్ నగరాన్ని ఈ నగరపు పెదజీవితాల్ని వారి నడుమవున్న అనుబంధాల్ని ఆవిష్కరించిన దర్శకుడు సాగర్ సర్హది గొప్ప విజయ వంతమయిన స్క్రీన్ ప్లే రచయిత. హిందీ సినిమాల్లో దశాబ్దాల క్రితం ఒక నూతన ఒరవడినే సృష్టించిన ‘కభీ కభీ’, ’సిల్ సిలా’ లాంటి సినిమాలకు ఆయన రచన చేసారు. అలాంటి సినిమాల్లో నటించిన అమితాబ్ బచ్చన్ ఏ స్థాయికి ఎదిగాడో మనకు తెలుసు. తర్వాత నూరీ, చాందిని, కహో నా ప్యార్ హాయ్ లాంటి సినిమాలకు కూడా సాగర్ సర్హదీ రచన చేసారు. తన ప్రతిభతో అద్భుతమయిన విజయాల్ని సాధిస్తున్న కాలంలో కూడా వ్యాపార సినిమారంగంలో అంతగా ఇమడలేక నిశ్శబ్దంగా ఉండిపోయాడు సాగర్.
వాస్తవానికి సాగర్ సర్హదీ 1933లో అవిభాజ్య భారత దేశంలో అబ్బోతాబాద్ కు దగ్గరలో వున్న బాఫా నగరంలో జన్మించాడు. గంగా సాగర్ తల్వార్ అతని మొదటి పేరు. దేశ విభజన వారి కుటుంబాన్ని అతలాకుతలం చేసింది. స్వంత వూరు నుంచి వలస వెళ్ళాల్సిన స్థితి. ఆరేళ్ళ వయసులోనే తల్లిని కోల్పోయిన సాగర్ తర్వాత తాను దేశ సరిహద్దుకు చెందిన వాడిని అని సూచించేందుకు తన పేరును సాగర్ సర్హదీ గా మార్చుకున్నాడు, తొలుత ఉర్దూ కవిగా తన సృజన జీవితాన్ని ఆరంభించిన సాగర్ ఆనాటి ప్రగతిశీల రచయితలయిన కైఫీ అజ్మీ, సజ్జద్ జహీర్ ల ప్రేరణతో ప్రగతిశీల భావాల పట్ల ఆకర్షితుడయ్యాడు. కాలేజీ రోజుల్లో గుల్జార్ తనకు సీనియర్. ఉర్దూలో ప్రావీణ్యం సాధించి కథలు నాటకాలు రాయడం ఆరంభించాడు. ఒక రోజు తన నాటకం మీర్జా సహేబాన్ ప్రదర్శిస్తూ వుండగా ప్రేక్షకుల్లో వున్న యాష్ చోప్రా తన సినిమాలకు రాయమని అడిగాడు అట్లా రూపొందిందే ‘కభీ కభీ’ అట్లా పెద్ద సినిమాలకు రచన చేసినా సాగర్ మనసంతా వాస్తవిక సినిమా ప్రపంచం వైపే ఉండింది.
అనంతర కాలంలో 1992లో సాగర్ సర్హదీ ‘దీవానా’ సినిమాతో షారుఖ్ ఖాన్ కారీర్ ని, 2000లో ‘కహోనా ప్యార్ హై’ సినిమాతో హ్రితిక్ రోషన్ కారీర్ ని విజయాల బాట పట్టించిన సాగర్ సర్హదీ ఒక పంపిణీ దారుడుచేసిన మోసంతో ఆర్థికంగా నష్టపోయి మౌనంగా ఉండిపోయాడు. ఇవ్వాళ మంచి కథ కథానాలతో కాకుండా కేవలం సాంకేతిక హోరుతో సినిమాలు రావడమే బాధగా వుంది అన్న సాగర్ సర్హదీ చివరంటా కథలూ కవిత్వమూ చదువుతూ కాలం గడిపాడు. తాను అవివాహితుడిగానే జీవితాన్ని ముగించాడు. హైదరాబాద్ జన జీవిత కథను ‘బజార్’ సినిమా గా రూపొందించిన సాగర్ సర్హదీ ని సీరియస్ తెలంగాణా సినిమా అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. తమ హృదయ పూర్వక నివాళి సమర్పించుకుంటున్నారు.
(దర్శకుడు సాగర్ సర్హదీ 22 మార్చ్ 2021 న ముంబైలో మరణించారు)
-వారాల ఆనంద్
కవి, సినీ విమర్షకులు, జాతీయ ఫిల్మ్ సొసైటీల సమాఖ్య కౌన్సిల్ సభ్యులు
8-4-641,
Hanuman Nagar,
KARIMNAGAR -505001 TELANGANA
+91-9440501281
తెలుగు సాహిత్యంలో తనదైన ప్రత్యేక ముద్ర వేసుకొని రచనలు చేస్తూ తెలుగు సాహితీ వనం ఫేస్ బుక్ సమూహాన్ని క్రమీకరిస్తూ సాహితీ పోటీల ద్వారా యువ కవులను ప్రోత్సహిస్తూ తనవంతు సాహిత్య సేవ చేస్తున్నారు శాంతి కృష్ణ. పచ్చని ప్రకృతిని చూసి తన భావాలన్నీ మునివేళ్ల లోని కలం నుండి జారి అక్షర రూపం పొంది మన కళ్ళముందుకు వచ్చి కనువిందు చేస్తున్నాయి. ఆ అక్షర ప్రవాహపు ఝరి నుండి వెలువడిందే శాంతి కృష్ణగారి మొదటి కవితా సంపుటి “చినుకు తాకిన నేల” సున్నితమైన భావాలతో సమాజంలోని విభిన్న పార్శ్వాలను స్పర్శించి తన అక్షరాలతో సంధించిన 70 కవితల సమాహారం చినుకు తాకిన నేల. మొదటి కవిత గురువంటే నాన్నే, చివరి కవిత తెలుగంటే వెలుగు.
నేస్తమా ……/వసివాడిన పువ్వుల్లాంటి/ అనాధ బాలలను ఎపుడైనా చూశారా ……/……/సమాజం ముందు ఖాళీ విస్తరిలా/ జవాబు కోరే ప్రశ్నలుగా/ ఎలా దరినమిస్తారో/…../ కాసింత నీ సాయానికే/చిగురించిన కొమ్మల్లా/ పచ్చదనాన్ని రాసుకొని /పసిడి మొక్కలవుతారు (చినుకు తాకిన నేల )తల్లిదండ్రులు లేక ఆదరణ కరువైన అనాధ చిన్నారులకు వీలైనంత ఆదరువు కమ్మని అదే దేశాన్ని ప్రేమించడం అంటారు కవయిత్రి. ఈ కవిత చదువుతూంటే కవయిత్రి హృదయం ఎంత సున్నితమో తేటతెల్లమైంది. *ఏడబోయిందో నా పల్లె కానరాకుంది /పండువెన్నెల్లో మెరిసేటి ఇసుక తిన్నోలే/ కలనేత చీరలో కులికేటి నాయుడు ఎంకల్లే (నా పల్లె ) పచ్చని ప్రకృతి మధ్య ఆప్యాయతానురాగాలు పంచేటి ఆ నాటి పల్లె ….సంక్రాంతి వేళల్లో రంగుల ముగ్గులతో భోగిమంటలతో సందడిగా ఉండేది. పచ్చదనం మాయమై పంటలు లేక గుండె బరువెక్కిన రైతన్న దీనావస్థ లో నీరసించింది. అంటూ ఆనాటి పల్లె చిత్రాన్ని హృదయం లో ఆవిష్కరించి అది ఎక్కడుంది అని తనను తాను ప్రశ్నించుకుంటుంది. *ఆకలి చేసే పేగుల సంగ్రామంలో /యాచకులమై తిరిగే అనామకులం/ మీరు వేసే ఛీత్కారపు దానాలను ఆశీర్వదిస్తూ తీసుకుంటాం …….(మొగలిరేకులం) అనాధగా మిగిలిన అభాగ్య చిన్నారుల పక్షాన నిలబడి వారి ఆర్తిని తన కవితలో అక్షరీకరించారు.
*చీకటి మరకల్ని /తుడిచే పువ్వొకటి /తూరుపు కొండల్లో /పుష్పించేవేళ/ / గుడ్డి దీపపు వెలుగులో /……/ముడుచుకున్న పసికందులెన్నో (రేపటి పువ్వు )వసివాడని పసిబాలలు దిక్కు లేని వారుగా వీధుల్లో తిరుగుతూ ఆకలి ప్రేగులను చల్లార్చుకునేందుకు ఎన్ని పరుగు లో రేపటి రోజు బాగుంటుందని ఆశతో వారు బతుకీడుస్తున్నారు. అంటూ కవయిత్రి వీధిలోని అనాధ బాలల భవితవ్యాన్ని ప్రశ్నిస్తున్నారు. *……./మంగళకరమై తిరగాల్సిన మా లక్ష్మి/ తాచు పామై బుస కొట్టిన ఏ మగతనానికి/మతి కోల్పోతుందో…../……/…..ఉరికొయ్య కూడా మరణిస్తుందేమో) వాడి దేహాన్ని మోసిన పాపానికి( మృగాడు ) నేటి సమాజంలో స్త్రీల మనుగడ ఎంత కష్టతరంగా ఉందో పసిపిల్లలు మొదలు వయసుతో తారతమ్యం లేకుండా మృగాళ్ళకు ఎలా బలవుతున్నారో హృదయ విదారక మైన పరిస్థితిని ఎండగడుతుంది. ఇంకా, రావణున్నే గొప్పవాడు గా కీర్తిస్తూ…. సీత అనుమతి లేనిదే తాకనైనా తాకలేదు అని అంటుంది. నేటి కొంతమంది పురుషులను మృగాలు అనడానికి అయినా నోరు రావటం లేదని మృగాలు కూడా వాళ్లకు తమ పేరును ఆపాదిస్తే తిరగబడతాయని అంటున్నారు కవయిత్రి . *…….చెక్కుచెదరని ఆత్మవిశ్వాసానికి/ చిరునామా ఆమె …/ చెక్కిన నిలువెత్తు శ్రమజీవి ఆమె /……/ఆరు పదుల వృద్ధ వనిత ఆమె /……./(ఓ అమ్మ) కవితలో రోడ్డు పక్కన తెగిపోయిన చెప్పులు కుట్టి పొట్ట పోసుకునే ఒక దీనస్థితిలో కూర్చుని గిరాకీ కోసం చూస్తున్న ఒక వృద్ద మహిళ స్థితిని తనను ఎవరూ పట్టించుకోక షో రూమ్ వైపు పరుగు తీసే జనాల ఉన్న తనాన్ని తన కవితలో వర్ణించారు. ప్రస్తుతం ఆ స్త్రీ కవయిత్రి కంటికి మేరునగములా కనిపిస్తుందని అబ్బుర పడుతున్నారు . *అక్క పంపే రాఖీలన్నీ / లెక్కకు మించుతున్నాయి/ అవి నీ పక్కన చేరేందుకు/ చుక్కల వుతున్నాయి( రాఖీ)పేగు పంచుకుని పుట్టిన తోడు …ఎన్నో అల్లర్లు రాఖీ పండుగ సంబరాలు ఎన్ని జ్ఞాపకాల దొంతర్లో మిగిల్చి కనిపించకుండా మబ్బుల్లో చందమామ లా మారిపోయి .అక్క పంపే రాఖీల నీ చుక్కలు అయ్యాయని తన వేదనలో తన తమ్ముడిని యాది చేసుకుని మూగగా రోదిస్తోంది. *………/…../నిన్ను మోసే భూమికి/ నిప్పుపెట్టి నిలుచున్నావు/ పరుగెత్తే మేఘానికి /కళ్లెం వేయాలని చూస్తున్నావు( ఆహ్వానం)
ఒక అతీతమైన శక్తి కొత్త ఆవిష్కరణలు ఎన్నో చేస్తూ తన గొప్పతనానికి తానే మురిసి మైమరచిపోతున్నాడు. అభివృద్ధి పేరుతో దాదాపు అదఃపాతాళానికి పోతుంటాడు. సాంప్రదాయ పద్ధతులను విడిచి ఫ్యాషన్ పేరిట నూతన ఆవిష్కరణలు చేస్తుంటారు. ప్లాస్టిక్ కవర్ల వాడకం తో కలుషితం పెరిగిపోతుందని మన పర్యావరణం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుందని జ్ఞానబోధ చేస్తున్నారు కవయిత్రి . *……./ఆ గోడలకుఎప్పుడూ అలవాటే /ఆ నవ్వుల చప్పుడు మోయడం/ ఆ నవ్వు వాళ్ళది కాదు /పసికూనల్లా మారాం చేస్తున్నాయి ….(పగిలిన మనసుల నవ్వులు ) *పసిపాప లూ, పువ్వుల నవ్వులు ఎంత స్వచ్ఛంగా ఉంటాయి …..!చూసేవారికి మనసు హాయిగా సేద తీరుతుంది.అదే పశుత్వానికి గురైన స్త్రీ అదేపనిగా నవ్వుతుంది. ఇదీ నవ్వే కాని ఇందులో స్వచ్ఛత లేదు విరిగిన గుండె ఘోష పెదాలపై పూస్తుంది విచక్షణ కోల్పోయింది అంటున్నారు కవయిత్రి . ……/మబ్బులన్నీ రేయికి/ మేలి ముసుగుతో ముస్తాబు చేస్తుంటే /చుక్కలన్నీ నింగినెక్కి /చిన్ని వెలుగును /చీకటికి అద్దుతున్నాయి( చీకటి రేయి) చుక్కలు ఆకాశంలోకి వెళ్లి వెలుగును చీకటికి అద్దుతాయట ఎంత చక్కటి భావన …! *……./హృదయమా /నువ్వు పదిలమే కదా…..!./ కాసింత మనసు నలత పడితే /నీ వేగం తగ్గించకు/అవధులు దాటిన ఆనంద క్షణాలలో నీ వేగం పెంచకు ….(హృదయమా!) హృదయానికి జాగ్రత్తలు చెప్తున్నారు కవయిత్రి. ఎంత సున్నిత హృదయం తనది అనిపిస్తుంది. *….. /తేనెలూరు కొమ్మకు పూసిన/ తీయనైన పువ్వులా/ మాతృభాష నాతోనే ఎదిగి /నాముందిపుడు ప్రతిబింబమై నిలిచింది /……/నేర్చుకో వేలవేల భాషలు/ కానీ దాచుకో గుండెలో/ నీ తెలుగు భాషపై ప్రేమలు /(తెలుగు సవ్వడి)అన్యభాషలు ఎన్నైనా నేర్చుకోండి మన మాతృభాష ను మాత్రం మరవకండని హితవు చెబుతున్నారు. *నన్ను నేను మరచి పోతుంటా…../ పుస్తకం లో దూరి మమేకమై పోయినప్పుడు/……/ ప్రేమిస్తూ ఉంటా /జారే కన్నీటి చుక్కను /అది స్నేహంగా ఒడిసి పట్టుకున్నప్పుడు (మరో ప్రపంచం) అనే కవితలో పుస్తకం ఎంత మంచి స్నేహితుడు అనుక్షణం మనల్ని కనిపెట్టుకుని ఓదార్పు నిస్తుంది అని చెప్తుంది. * రక్తపాతాలేడున్నాయ్ మా రాయలసీమలో /మీరు సృష్టించిన చిత్రాలలో తప్పా/….. / కన్నీళ్లతో సీమను వదిలి /ఎడారి దేశాలకు గులాము చేయనుపోతున్న/గరీబు నేల మాది (రగిలే హృదయం ) రాయలసీమ అంటేనే రక్తపుటేరులు పారే ప్రాంతమని సినిమాల్లో పాశవికంగా చూపించి జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారని తినడానికి తిండి లేక నిరక్షరాస్యతతో పేదరికం అనుభవిస్తున్న ప్రజలపై కనికరించి వారి జీవితాలను ప్రతిబింబించేలా సమాజానికి తెలియజేయాలని ఆ ప్రాంతపు ప్రజలకు చేయూతనివ్వాలని వేడుకుంటున్నారు కవయిత్రి.
*ఎన్ని సొబగులో చీరకట్టు లో /ఎంత జాణతనమో ఆకనికట్టులో /ఎంత మాతృత్వమో ఆచీరకొంగులో /ఎన్ని వర్ణాలో ఆ సౌభాగ్యం లో (ఎన్ని సొబగులి) మన భారతీయ సంస్కృతిలో చీరకట్టు కోవడం సంప్రదాయం అందులోనే గౌరవం దైవత్వం కనిపిస్తాయి .అదంతా ఎంత అద్భుతంగా ఉంటుందో కదా అని అంటున్నారు . *ఒక్కోసారి భరించలేని /వర్తమానపు క్షణాల నుండి/ పరుగులు తీస్తుంది మనసెందుకో /బాల్యపు పరదాలు తీసి /బంగారు లోకం లోకి(మరలి రాని స్వప్నం ) *బాల్యపు స్మృతుల వెంట పరుగులు తీస్తుంటే చిన్నతనంలో కి ఒక్కసారైనా వెళ్లి రావాలని అనిపిస్తోంది. పక్షిలా రెక్కలు కట్టుకొని ఎగరాలని అనిపిస్తుంది. అమ్మా నాన్నలతో గారాలు పోవాలనిపిస్తుంది. కానీ అదంతా తిరిగి రాని గతం అనే సత్యం తెలిశాక ఆనందం ఆవిరైపోతుంది. ఉద్యమానికి పరాకాష్ఠ/ ఊపిరి తీసుకోవడమే నా/……/కన్నీటి సంద్రమవదా నీ కుటుంబం …./…../(నీ విజయం ) ఆర్టీసీ కార్మికులు సమ్మె కాలంలో చేసుకున్న ప్రాణ త్యాగాలను చూసి చలించి …..ప్రాణత్యాగం చేసుకున్నంత మాత్రాన సరిపోదు ధైర్యంగా నిలబడి పోరాటం చేస్తే సాధించిన విజయాన్ని కళ్ళతో చూడొచ్చు అంటూ హితవు చెబుతున్నారు. *ఉగ్రవాద చర్యలకు ఊతమివ్వకుంటే/ ఊరికి వచ్చే జలపాతపు/సవ్వడే కదా శాంతి( ప్రపంచ శాంతి ) నాగరికత సమాజంలో ఈ అనాగరిక చేష్టలు మానాలని ప్రతి ఒక్కరూ సోదరభావంతో మెలగాలని కులమతాల భేదభావాలు మరిచిపోయి శాంతి మంత్రం జపించాలని అందువల్ల ప్రపంచ శాంతి చేకూరుతుందని హితవు చెబుతున్నారు కవయిత్రి. వినీల ఆకాశంలో /ఎగిరే విహంగాలు/ విశ్వకవి రవీంద్రుని/ ఎదలోని భావాలు /(అక్షర సుమాంజలి) విశ్వకవి రవీంద్రుని పై రాసిన కవితలో వారిని అద్భుతంగా ఆవిష్కరించారు. *ఇలా చినుకు తాకిన నేల కవితా సంపుటిలోని ప్రతి కవితా పూల సుగంధాలను వెదజల్లినట్లు అలతి పదాలతో చక్కగా ఆవిష్కరించారు.కవిత్వమే కాక గజల్స్ ,రుబాయీలు, బాలలగేయాలు ,మినీకవితలు ,పుస్తక సమీక్షలు ,కథలు మొదలైనవి శాంతి కృష్ణ గారి రచనలు. ఇప్పటి వరకు ఎన్నో పురస్కారాలు పొందారు.” చినుకు తాకిన నేల” కవితా సంపుటికి “గిడుగు రామ్మూర్తి సాహిత్య పురస్కారం 2021 “అందుకోవడం జరిగింది.నిరంతరం సాహితీ సృజన చెయ్యాలని తపించే శాంతి కృష్ణ గారికి మున్ముందు తననుకున్న ఆశయం సిద్ధించాలని కోరుకుంటూ శుభాకాంక్షలు.
-జయంతి వాసరచెట్ల
ఎంఏ.బిఇడి
వృత్తి: తెలుగు ఉపాధ్యాయిని
ప్రవృత్తి: కవిత్వం, కథలు, పుస్తక సమీక్షలు
పుట్టిన స్థలం: మహబూబ్ నగర్ జిల్లా
నివాసం: హైదరాబాద్
తొలి కవితా సంపుటి: నేల విమానం 2020 లో ముద్రితం
+91-9985525355
లలిత కళలుగా ప్రత్యేకంగా చెప్పబడేవి సంగీతం, నాట్యం, శిల్పం, చిత్రం, కవిత్వం. ఈ ఐదింటిలో ఒకటైన చిత్రలేఖనం మనం లేచింది మొదలు నిద్రపోయే దాకా ప్రతి దాంట్లో దాని ఉనికిని చాటుకుంటూనే ఉంటదీ, ముఖ్యంగా మన భారతీయ సంస్కృతిలో మరీ ముఖ్యంగా మన తెలుగు ఇండ్లల్లో.
చిత్రకళ లేదా చిత్రలేఖనం అనగానే అది పుట్టుకతోనే అబ్బాల్సిన ప్రతిభ, కొందరికి మాత్రమే అది వస్తుందీ అన్నదీ మనందరి అభిప్రాయం. అయితే అది కొంతవరకే నిజం. ఎందుకంటే ప్రతీ వ్యక్తీ పుట్టుకతోనే కొంత చిత్రకారుడు. భావాలకు, ఊహలకు రూపం ఇవ్వడం అలాగే ఉన్నది ఉన్నట్టుగా చిత్రించడం చిత్రలేఖనం లేదా చిత్రకళ. మరి ఇది ప్రతీ ఒక్కరూ ఎంతో కొంత చేస్తూనే వుంటారు. కొన్నిసార్లు మాటలతో వివరించడం వీలుకానపుడు గీసి చూపిస్తుంటాము. ఎప్పుడో రాతి యుగంలో గుహలలో నివసించే రోజుల్లోనే భాషా లిపి లేని నాడే ఆనాటి మానవుడు తన గుహల్లో జంతు, పక్షుల ఆకారాలు, బొమ్మలు, చిత్రాలు, గీసికున్నాడన్నది చరిత్రలో, తవ్వకాలలో బయటపడ్డ నిజం. అంటే భాషకు మునుపే చిత్రలేఖనం ఉందనేగా…
అనాదిగా చిత్ర కళలో పురుషులతో పాటు స్త్రీలూ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చిత్రిస్తున్నారు. పూర్వ కాలం నుంచీ కూడా స్త్రీలు తమకుతెలియకుండానే చిత్రలేఖనం తమ దైనందిన జీవితంలో, తమ దినచర్యలో భాగంగా కలిగి ఉన్నారు. పూర్వపు రోజులలో ఇంట్లో వుండే పోయ్యిని అలికి, దానికి అందమైన ముగ్గును పెట్టీ మంటను అంటించే వారు.
ఇల్లు అలికి ఇడుపులు అలికీ నానబెట్టుకున్న బియ్యం రుబ్బుకుని పిండిని బట్టలో కట్టి ముగ్గులు గీసేవారు. ఇక ధాన్యాలు నిలువచేసే గుమ్ములకు పెండతో అలికి ముగ్గులు కొట్టేవారు బొమ్మలు గీసేవారూ. కొత్త ఇళ్ళకు పూతలు పూస్తే లేదా సున్నాలేస్తే ఇంటి ఇడుపులకు బొమ్మలు వేసేవారూ, కడపల మీదా బొమ్మలు వేసేవారూ. ఇది ఇప్పటికీ ఉందీ. వాకిట్లో సానిపి చల్లి ముగ్గు వెయ్యకుండా దినచర్యనే మొదలవదు ఈ నాటికీ కూడా. ఆ రోజుల్లో అందరి ప్రధాన వృత్తి వ్యవసాయం. రైతుకు, వ్యవసాయ దారునికి ఏరువాక పున్నమి పెద్ద పండుగ. ఏరువాక పున్నమి వచ్చిందంటే ఎద్దుల ప్రదర్శన ఉండేది. వాటి శరీరం పై రకరకాల బొమ్మలు వేసీ వాటిని అలంకరించి ప్రదర్శించే వారు. ఇక పెళ్ళీలలో చిత్రలేఖనం లేకుండా పెళ్ళి తంతు అసంపూర్ణం. పందిరి నాడు గుంజల చుట్టూ చిత్రలేఖనం. ఇక పెళ్ళి పందిట్లో మైలపోలప్పుడు( పెండ్లిపిల్ల లేదా పెండ్లిపిల్లగాడికి నలుగు పెట్టే టప్పుడు), తాళి కట్టే తంతు అప్పుడు వేసే శాశ ముగ్గు (పెళ్ళి పీటల కింద మొదటగా గొంగడి లేదా జంపకన వేసీ దానిమీద బియ్యంతో వేసే ముగ్గు) గీయనిదే పెళ్ళి పీటలు వెయ్యరు. అలాగే పూజలూ, శుభకార్యాల్లో ముగ్గు వెయ్యకుండా ఏదీ ఆరంభం చెయ్యరు. వెనకటి రోజుల నుంచీ కూడా ఆడవారికీ మైదాకుకూ (గోరింటాకు) విడదీయరాని బంధం ఉంది..
ఈ రోజుల్లో చేతులపై, పాదాలపై, ఇంకా చెప్పాలంటే ఒంటిపై మెహందీ చిత్రాలుగా కూడా వేసున్నారు. వస్త్రాలపై వేసుకునే లతలు, పూలు, ఆకారాలు, డిజైన్ ల ప్రింట్లు చిత్రకళనే..
పూర్వకాలంలో దూతల ద్వారా, పక్షుల ద్వారా పంపే లేఖలు లేదా గుప్త లేఖలలో సందేశం చిత్రాలు గీసి గుర్తులుగా, చిహ్నాలుగా పంపేవారు. అంటే సందేశాన్ని చిత్రాలుగా లిఖించి పంపే వారు. అందుకేనేమో చిత్రలేఖనం అంటారు. ఆ చిత్రలేఖనమే లేదా చిత్రలిపినే నేటి లిపికి దారి తీసింది. అంటే ప్రపంచంలో అన్ని లిపులకూ చిత్రకళనే ఆద్యమన్నమాట. భాష చిత్రాలకు దారితీస్తే, చిత్రాలు లిపికి, లిపి సాహిత్యానికీ, సాహిత్యం ద్వారా తిరిగి చిత్రాలు జీవం పోసుకున్నాయి. దీనిద్వారా చిత్ర కళకూ సాహిత్యానికీ సంబంధం వేరుపరచ రానిది అని చెప్పొచ్చు. సాహిత్యంలో ఊహించిన, వర్ణించిన, ప్రాంతాలూ, వ్యక్తులనూ కళ్లముందు ప్రత్యక్షం చేస్తుంది చిత్రలేఖనం. పండితులను మాత్రమే ప్రభావితం చేసేది సాహిత్యం అయితే, పండిత పామరులను ప్రభావితం చేస్తుంది చిత్రలేఖనం. సాహిత్యానికి చిత్రలేఖనం ఎంత ఊతమిస్తుందో, చిత్రలేఖనం మీదా సాహిత్యం వస్తోంది.
అలాగే ఆధ్యాత్మికత విషయంలో చిత్రలేఖనం పాత్ర చాలా ఉన్నది. హిందువులు దేవతా రూపాలను ఆరాధిస్తారు, వారు తమ ఇష్ట దైవ రూపాన్ని తమ కళ్లముందు ఉంచుకుని పూజిస్తారు. ఆ దేవతా మూర్తుల చిత్రపటాలన్నీ చిత్రలేఖనాలే కదా… భారత దేశంలో దేవతా మూర్తుల రూపాలను జనాలకి పరిచయం చేసిన ఘనత రాజా రవివర్మకు దక్కుతుంది. ఆయన పురాణాల లోని గాథల ఆధారంగా దేవతా రూపాలను జీవకళ ఉట్టిపడేలా చిత్రించి, అవి అందరికి అందుబాటులో ఉండేలా చేశారు.
ఒకవేళ రవివర్మ అనే చిత్రకారుడే లేకపోయి ఉంటే ఈ రోజు హిందువుల ఇళ్ళల్లో పూజా మందిరాలు, భగవంతుని రూపాలు ఇలా ఉండేవి కావేమో వేరే విధంగా ఉండేవేమో… ఇక్కడ ఆధ్యాత్మికత గురించి మాట్లాడే టప్పుడు ప్రాచీన కాలం నుంచీ కూడా శిల్పకళ ముఖ్య పాత్ర వహిస్తుంది. హిందువుల దేవుళ్ళు శిలావిగ్రహల రూపాల్లో పూజలందుకునే వారు. అయితే శిల్పకళ కూడా చిత్రలేఖనం తోనే మొదలవుతుంది. శిల్పి స్వయంగా చిత్రకారుడై ఉండవలెను, చిత్రలేఖనం తెలిసి ఉండవలెను. చిత్రలేఖనం మొదట మైండ్ లో పూర్తి చిత్రం రూపుదిద్దుకున్నాకనే కన్వాస్ పై మొదలవుతుంది.
చిత్రలేఖనం అభిరుచి గానే కాకుండా ఉపాధిగా కూడా చాలా మందికి ఆధారమై ఉన్నది. డ్రెస్ డిజైనింగ్ ఈ రోజుల్లో చాలా పెద్ద ఉపాధి రంగం. ఓ కొత్త మోడల్ డ్రెస్ డిజైన్ చెయ్యాలంటే ఆ డిజైనర్ ముందుగ బొమ్మ గీసుకోవాల్సిందే.
వివిధ ఉత్పత్తుల అడ్వర్టజ్మెంట్ లో భాగంగా పల్లెల్లో , పట్టణాల్లో ఇంటి గోడలపై , ప్రహరీ గోడలపై బొమ్మలు గీసి ఉత్పత్తి దారులు, చిత్రకారులు సంపాదిస్తున్నారు. ప్రభుత్వం వివిధ రకాలైన సామాజిక అంశాల అవగాహన కోసం చిత్రలేఖనం చాలా మంచి సాధనగా ఉపయోగిస్తుంది. క్రైమ్ విభానికి ఎంతో ఉపయుక్తమైనది చిత్రలేఖనం. సాక్షులు చూసిన ఆనవాళ్లు, గుర్తులు, పోలికలు ఆధారంగా నేరస్తులను గుర్తించడం గానీ , ఇన్వెస్టిగేషన్ ముందుకూ సాగడానికి గానీ సహాయకారిగా ఉంటుంది. నిర్మాణ రంగంలో ముందుగా గీసుకోకుండా ఏ నిర్మాణం నిర్మించబడదు. కొత్త ఇంటిని నిర్మించాలంటే ఇంటి నక్ష గీసుకోవాల్సిందే. ఇంటినిర్మాణంలో నగిషీలు చెక్కేవారు చిత్రలేఖనంతోనే మొదలు పెడతారు. ఇక ఆదునిక కాలంలో నిత్య జీవితంలో వాడే ప్రతీ వస్తువూ దాని డిజైన్ గీసిన తర్వాతనే తాయారు చెయ్యబడుతుంది. అవసరాలు అనుకూలంగా, ఊహలకు అనుగుణంగా మొదట చిత్రం గియ్యబడి. ఆ తర్వాత వివిధ రకాలైన మెటీరియల్స్ తో తయారు చెయ్యబడుతుంది.. ఒక రకంగా చెప్పాలంటే నిత్యావసరాల చాలా వస్తువులు పరికరాలు, సౌకర్యాలు చిత్రకారుని ఊహా శక్తి నుంచి రూపు దిద్దుకున్నవే… ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యురోపినన్ చిత్రకారుడు మోనాలిసా సృష్టి కర్త లియోనార్డో డావిన్సీ వేసిన చిత్రాలు, ఆయన చిత్తుగా వేసుకున్న రేఖా చిత్రాలు చూసినపుడు అందులో గ్లైడర్, సైకిల్ లాంటి చిత్రాలు, యంత్రాల నిర్మాణాల రేఖా చిత్రాలు కనబడతాయి… ఆయన బహుశా ఆ నాడే గాలిలో ఎగిరే ఒక యంత్రాన్ని ఊహించి రూప కల్పన చేసి గీసి ఉంటాడు. దీనిని బట్టీ చిత్రకారుడు కేవలము ఊహా లోకంలోనే కాదూ శాస్త్రీయ దృక్పథం, తార్కికత కూడా కలిగి ఉంటారనీ అర్థం అవుతుందీ… చిత్రకారులు దార్శనికులు.
బోధనా రంగంలో తరగతి గదిలో ఎలాంటి సబ్జెక్ట్ అయినా సరే బొమ్మలతో, మ్యాపింగ్ తో చెబితే సులభంగా అర్థం అవుతుంది, ఎప్పటికీ లేదా ఎక్కువరోజులు గుర్తుంటుంది. ఈ రోజు సాహిత్య విద్యా రంగాలలో కోసం సేవలందించిన ఎంతో మంది చిత్రకారుల సేవలు గుర్తు చేసుకోదగినవి. ఉదాహరణగా చెప్పాలంటే ఆధునిక కాలంలో తొలితరం తెలంగాణా చిత్రకారులలో ఒకరైన కొండపల్లి శేషగిరిరావు గారు అందించిన పోతన ఊహా చిత్రం సాహిత్యానికే కాదూ పిల్లల పాఠ్యపుస్తకాల్లో కూడా చిరస్థాయిగా నిలిచిపోయింది.
ఇన్ని మాట్లాడి చిత్రలేఖనంలో తప్పకుండా ప్రవేశం కలిగి ఉండే చిన్నారుల గురించి మాట్లాడక పోతే అది వెలితిగా ఉంటుంది. పిల్లలకు అత్యంత ఇష్టమైన, అత్యంత ఉల్లాసాన్ని కలిగించే అంశం చిత్రలేఖనం. ప్రతి వ్యక్తీ బాల్యంలో చిత్రలేఖనాన్ని టచ్ చేసే వస్తాడు. పిల్లలకు భాష ప్రాబ్లం ఉంటుంది, రాయడానికి పదాల కొరత ఎంపిక ప్రాబ్లం ఉంటుంది కాబట్టీ వాళ్ళు తమ భావాన్ని వ్యక్తం చెయ్యడానికి, సృజనను వ్యక్తపరచడానికి చిత్రలేఖనాన్నే ఆశ్రయిస్తారు. మనందరమూ బొమ్మలు గియ్యకుండా బాల్యాన్ని పూర్తి చెయ్యలేదు అన్నది అతిశయోక్తి కాదు.
ఇలా మనిషి జీవితంలో నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్ర పోయే వరకూ ప్రతీ అంశంలో చిత్రకళ దాగి ఉంది. అలాగే మనిషి పుట్టింది మొదలు ఏదో ఒక రూపంలో ఏదో ఒక అవసరంగా చిత్రకళతో సంబంధం కలిగి ఉంటాడు. చిన్నప్పుడు ఆటగా మొదలైన చిత్రకళ పెరుగుతూ పోయేకొలది అభిరుచి గానూ, అవగాహనకు గానూ , అవసరం కోసం జీవనయానంలో మనతో పాటే ఉంటుంది.
-రూపాదేవి
PhD scholar (OU),
S.A (హిందీ),
చిత్రకారిణి,
ఉమ్మడి పాలమూరు జిల్లా
+91-7330814596