దర్భశయనం శ్రీనివాసాచార్యులు గారు ఈ కవితను 6.1. 2012 వ తేదీన రంచించారు . 27.2.2012 ఆంధ్రప్రభ దినపత్రిక లో మొదటిసారి అచ్చయింది. శ్రీనివాసాచార్యులు గారు ఈ కవితను , వారు రామప్పను స్వయంగా దర్శించినప్పుడు అక్కడ వీరికి రామప్పను గురించిన విశేషాల్ని గోరెంట్ల విజయ్ కుమార్ అనే గైడ్ కు అంకితం చేసానని చెప్పారు . వరంగల్ జిల్లా లోని అద్భుత శిల్పసౌందర్యం , శిల్పి నైపుణ్యం రామప్ప విశేషాలను ప్రపంచానికి తమ ‘ఉలికళ’ కవితద్వారా తెలియజేయాలని ఎన్నో వేదికలపైన చదివాను అని అన్నారు . మయూఖ లో మీకోసం.
ఇంద్రధనుస్సు
రామప్ప శిల్పబంధం ఎన్నో విషయాలు చెప్పిన కొండపల్లి శేషగిరిరావుగారు ప్రపంచం మెచ్చిన ప్రఖ్యాత చిత్రకారులు . ఆయన కుంచె దించిన రంగుల్లో ఒదిగిన ప్రకృతి అందాలు గాని, ప్రబంధ నాయికానాయకులుగాని మనను ముగ్ధులను చేసినవే. ఆయన గీసిన రేఖాచిత్రాలలో దాగిన భారతీయ శిల్పసంపద మన చూపులను కట్టిపడేసేవే.
1940 దశకంలో కొండపల్లివారు విద్యార్థిగా ఉన్నప్పుడే కాకతీయ శిల్ప సంపద వైభవాన్ని , ప్రత్యేకంగా రామప్ప శిల్పకళను రేఖాచిత్రాలుగా చిత్రించి సభ్యసమాజానికందించారు. మారుమూల అడవి ప్రాంతం . జనసమ్మర్ధమైన స్థలకాదు. అంతగొప్ప దేవాలయం అక్కడ ఉన్నదని ఆనాడు ఎవరికీ ఎక్కువ తెలియదు. ఫోటో కెమెరాలు ఇంకా తెలంగాణ లో అడుగుపెట్టని ఆ కాలంలో హైదరాబాద్ లో ఉన్న ఆనాటి సాహితీవేత్తలకూ, సాధారణ ప్రజలకు కొండపల్లి శేషగిరిరావు గారి చిత్రలే రామప్ప శిల్ప సౌందర్యం పరిచయం చేసాయి. వారి రేఖాచిత్రాలు మచ్చుకు కొన్ని మయూఖ పాఠకులకు – మన తెలంగాణ ప్రతికలోని కొండపల్లి శేషగిరిరావు రామప్ప గురించిన వ్యాసం ప్రచురితమైంది.




పాటల పల్లకీలో ఊరేగించిన సముద్రాల రాఘవాచార్యులు
సముద్రాలగా పేరు తెచ్చుకున్న రాఘవాచార్యులుగారు సినీ గీత రచయితే కాకుండ, సిని మాటలకు, కథ, సంభాషణలు మాత్రమే కాదు వినాయక చవితి, బబ్రువాహన సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. 1958వ సంవత్సరంలో విడుదలైన “భూకైలాస్” సినిమాలో పాటలన్నీ సముద్రాల వారే వ్రాశారు. ఇందులో ఒక పాట.
“జయ జయ మహాదేవా, శంభో సదాశివా, ఆశ్రిత మందారా, శృతి శిఖర సంచారా” తో మొదలయ్యే ఈ పాట ఘంటసాలగారి భక్తి గీతాలలో ఎన్నదగినది, మిన్నయైనది.
శృతులనబడే వేదాల శిఖరమందు ఉండేవి ఉపనిషత్తులు. జీవాత్మను పరమాత్మను సన్నిధికి సమీపంగా (ఉప), నియమబద్ధంగా (ని), ఉంచునది (షత్). కనుక ఆ ఉపనిషత్తులలో సంచరించే వాడా అనే అర్థంలో వాడిన ‘శృతి శిఖర సంచారా’ వాక్యాన్ని మన కందించిన సముద్రాల వారి పాండిత్య వైభవానికి నమో వాక్కాలు.
నీలకంధరాదేవా, దీనబాంధవారావా, నన్ను గావరా ||నీలకంధరా||
సత్యసుందరాస్వామి, నిత్య నిర్మలాపాహి,
అన్యదైవమూ కొలువా, నీదు పాదమూ విడువా,
దర్శనమ్మునీరా, మంగళాంగా గంగాధరా ||నీలకంధరా||
ఈ పాట పల్లవి ‘నీలకంధరా’ నుండి ‘గంగాధరా’ వరకు ‘తిలంగ్’ రాగాన్ని ఉపయోగించారు.
‘దేహియన వరములిడు దానగుణ సీమా, పాహియన్నను ముక్తినిడు పరంధామా’, నీమమున నీ దివ్య నామ సంస్మరణా, ఏ మరకసేయుదును భవతాపహరణా, నీ దయా మయ దృష్టి దురితమ్ములారా, వరసుధా వృష్టి నా వాంఛలీడేరా, కరుణించు పరమేశ దరహాస భాసా, హరహర మహాదేవ కైలాసవాసా’
ఇంతవరకు శుద్ధసావేరి రాగాన్ని ఉపయోగించారు.

“ చరణం నుండి పాట పూర్తి అయ్యేవరకు హృదయమున్న ప్రతి మనిషి, స్పందనకు లోను కావలసిందే. లేకుంటే
దానిని పాషాణంగా అనుకోవాలి.
“అన్య దైవమూ కొలువా’ చరణం ద్వారా రావణ బ్రహ్మ వ్యక్తిత్వాన్ని సముద్రాలవారు ఆవిష్కరించారు.
‘ఫాల లోచన నాదు మొరవిని జాలిని పూనవయా,
నాగభూషణ నన్నుగావక జాగును సేయకయా,
కన్నుల విందుగ భక్తవత్సల కావగ రావయ్యా ||కన్నుల||
ప్రేమీ మీర నీదు భక్తుని మాటను నిల్పవయా ||ప్రేమ||
శంకరా శివశంకరా, అభయంకరా, విజయంకరా
ఈ చరణంలో సముద్రాలవారు ‘నాద నామక క్రియ’ రాగాన్ని ఉపయోగించారు.
నందమూరి తారాకరామారావు, రావణబ్రహ్మగా అభినయించిన ఈ పాటలో నాగభూషణం (పరమశివునిగా), బి.సరోజాదేవి (పార్వతీదేవిగా) కనిపిస్తారు.
సుదర్శనం, గోవర్ధనం, సంగీతం కూర్చిన ఈ పాటను పాటల పోటీలలో పాడే ఏ గాయకుడైనా ప్రత్యేకంగా ప్రశంసించబడతాడు.
సముద్రాలవారు పండిత కుటుంబం నుండి వచ్చినవారు. వారికి విషయ పరిజ్ఞానం, గ్రంథపఠనా బలం, భాషా పటిమ మెండుగా వున్నాయి.
ఈ పాటలో సముద్రాలవారు విశేషణాలు బాగా వాడారు.
భూ కైలాస్ సినిమా ఎ.వి.యం సంస్థ నిర్మించినది. దర్శకుడు కె.శంకర్. 1958 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం తమిళ, కన్నడ భాషల్లో కూడా నిర్మాణం జరిగి, 3 భాషల్లోనూ విజయవంతమైనది.
రావణబ్రహ్మ తన తల్లి అయిన కైకసి కోరిక మేరకు పరమశివుని ఆత్మలింగం తేవడానికి తపస్సు చేస్తాడు. మహావిష్ణువు మాయ ప్రభావంతో ఆత్మలింగానికి బదులు పార్వతీదేవిని ఇవ్వమని శివుని కోరతాడు రావణుడు. తిరిగి రెండవసారి తపస్సు చేయగా పరమశివుడు తన ఆత్మలింగాన్ని ఇస్తు ఎట్టి పరిస్థితుల్లోనూ లింగాన్ని నేలపై పెట్టవద్దని చెప్తాడు. నారద మహర్షి సలహామేరకు గణేషుడు బాల బ్రాహ్మణుని రూపంలో రాగా, రావణుడు, సంధ్యావందనం చేయడానికి, ఆత్మలింగాన్ని గణేషునికి ఇచ్చి తాను వచ్చేవరకు, లింగాన్ని పట్టుకోవాలని కోరతాడు. తాను 3 సార్లు పిలుస్తానని, ఆలోగా రాకపోతే నేలపై పెట్టేస్తానని గణేషుడు షరతు విధిస్తాడు. రావణుడు సంధ్యావందనం చేస్తున్న సమయంలో గణేషుడు 3 సార్లు పిలువగా రానందున ఆత్మలింగాన్ని గణేషుడు నేలపై పెడతాడు. రావణుడు వచ్చి లింగాన్ని తీయడానికి ప్రయత్నించగా, భూమిలో నుండి లింగం రాలేదు. ఆ ప్రదేశమే గోకర్ణ క్షేత్రం (భూకైలాస్)గా ప్రసిద్ధి చెందినది.
సముద్రాల సీనియర్ వి మరికొన్ని పాటలు
జగదభి రాముడు శ్రీరాముడే, రఘుకుల సోముడు ఆ రాముడే పాట లవకుశ (1963)
జననీ శివకామినీ నర్తనశాల (1963)
రాజశేఖరా నీపై మోజు తీరలేదురా అనార్కలి (1955) చిత్రం
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా పాట లవకుశ (1963)
సీతారాముల కల్యాణం చూతము రారండీ పాట సీతారామ కళ్యాణం (1961) సినిమా
జయహే కృష్ణావతారా పాట శ్రీకృష్ణావతారం (1967) చిత్రం
పిలువకురా అలుగకురా నలుగురిలో నను ఓ – పి. సుశీల బృందం – రచన: సముద్రాల సీనియర్
కరణా చూడవయా వరముజూపవయా మురళీ మోహనా వినీల మేఘశ్యామా – ఘంటసాల బృందం
పలుకరాదటే చిలుకా సముఖములో రాయభారమెందులకే – ఘంటసాల
ఓ తారకా నవ్వులేలా నను గని అందాలు చిందెడి – ఘంటసాల, పి.భానుమతి
ఓ చిగురాకులలో చిలకమ్మా … చిన్నమాట వినరావమ్మా
ఇది మంచి సమయము రారా తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక మహిళ ఇతరులకు పాడిన తొలి నేపథ్యగీతం. ఈ పాటను అలనాటి నటి, గాయని అయిన బెజవాడ రాజరత్నం భక్త పోతన (1942) చిత్రంలో రాజనర్తకి భోగిని పాత్రధారిణి అయిన సామ్రాజ్యం అనే నటీమణికి పాడారు. ఈ పాటను అలనాటి ప్రముఖ రచయిత సముద్రాల రాఘవాచార్య రచించారు.
సముద్రాల జూనియర్
సముద్రాల సీనియర్ కుమారుడే సముద్రాల వెంకట రామానుజాచార్యులు, తన తండ్రికి ఇష్టం లేకపోయినా, ఇతరుల ఆకాంక్షమేరకు సినీరంగంలోకి అడుగుపెట్టి, మాటలు, పాటలు వ్రాశాడు.
బ్రుతుకు తెరువు సినిమాలోని ‘అందామె ఆనందం’ పాట సముద్రాల జూనియర్ కలం నుండి జాలు వారినదే.
తండ్రి, కొడుకు ఇద్దరు కూడా సినీరంగంలో ఉండడంతో, తండ్రిని సీనియర్, కొడుకుకు జూనియర్ గా టైటిల్స్ లో వ్రాసేవారు.
బ్రతుకు తెరువు సినిమా వచ్చింది. తనకు బతుకు తెరువునిచ్చింది అని సముద్రాల (జూనియర్) చెప్పేవారు.
‘అందమె ఆనందం’ వ్రాశానని తన తండ్రి రాఘవాచార్యులగారితో చెప్పబోతే , కీట్స్ ‘A thing of beauty is joy for ever’ను తెలుగు భాషలోకి తిప్పివ్రాశావా ఏమిటి? అని ఆయన సణిగారట.
అందమె ఆనందం, అందమె ఆనందం
ఆనందమె జీవిత మకరందం
కేవలం బాహ్య సౌందర్యమే కాకుండ, ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువులోను మన అందాన్ని ఆస్వాదించవచ్చని, ఆ ఆస్వాదనే మనకు ఆనందం కలిగిస్తుందని, మన జీవితంలో తేనెను కురిపిస్తందని సముద్రాల (జూనియర్)గారి భావన.
పడమట సంధ్యారాగం, కుడి ఎడమల కుసుమపరాగం
ఒడిలో చెలి మోహనరాగం, జీవితమే మధురాను రాగం
సాయంకాలవేళ సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో కిరణాలు అరుణవర్ణంతో ప్రకాశిస్తుంటాయి. ఆ సాయంకాలవేళ ఆ అందాన్ని ఆస్వాదించడం ఒక అదృష్టంగా భావిస్తారు సముద్రాల. ఆ కిరణాలు పూలమొక్కలపై పడి, ఆ మొక్కలకున్న పూలపుప్పొడిని ద్విగుణీకృతం చేస్తే, మన మనస్సు మధురానురాగంలోకి వెళుతుంది. తన ఇష్టమైన ప్రేయసి తన ఒడిలో పడుకొని మోహనరాగాన్ని ఆలపిస్తే, ఇంకేం కావాలి మానవ జీవితానికి.
పడిలేచే కడలి తరంగం, ఒడిలో జడిసిన సారంగం
సుడిగాలిలో ఎగిరే పతంగం, జీవితమే ఒక నాటక రంగం
సముద్రం ఒడ్డుకు కూర్చొని, అలలు ఒడ్డుకు చేరే సమయంలో ఆ సవ్వడిని ఆస్వాదించునపుడు మన జీవితం పులకిస్తుంది. జింక భయపడి, రక్షణకొరకు మనలను చేరినపుడు దానిని మనం మన ఒడిలో పెట్టుకొని, దాని శరీరాన్ని, నిమురుతంటే ఆ కోమలత్వంతో మన మనస్సుకు కూడా హాయి అనిపిస్తుంది. గాలిపటం (పతంగం) ఆకాశంలో ఎగరవేస్తుంటే, సుడిగాలి వచ్చినపుడు అది గింగిరీలు కొడుతూ, కొద్దిసేపు క్రిందికి వచ్చి, మళ్ళీ పైకి ఎగురుతున్నప్పుడు, మన జీవితం కూడ పతంగంలాగే ఉన్నత స్థితికి, నీచస్థితికి అనగా ఒడిదుడుకలకు లోనై, ఒక నాటక రంగంలా వుంటుందని రచయిత భావన. నాటక రంగంలో కొంతసేపు శోకరసం,కొంతసేపు శాంతరసం ప్రదర్శించబడతాయో, పతంగం లాగే మన జీవితాలు కూడ అనుభవాలకు లోనవుతాయని రామానుజాచార్యుల వారి భావన.
జూనియర్ గారు వ్రాసిన మరికొన్ని పాటల పల్లవులు
- పాండురంగ మహత్మ్యం సినిమాలో “జయకృష్ణా ముకుందా మురారి”
- శాంతినివాసం సినిమాలో “తుషార శీతల సరోవరాన”
- మంచి మనసుకు మంచి రోజులు సినిమాలో “ధరణికి గిరిభారమా”
- కులదైవం సినిమాలో “పయనించే ఓ చిలుకా”
- బొబ్బిలి యుద్ధం సినిమాలో “శ్రీకర కరుణాలవాల”
పాటలు జూనియర్ గా ప్రతిభకు తార్కాణాలు. వారు లేకున్నా వారి పాటలు మన తెలుగు నేలలో “ఊగేములే తులతూగేములే ఇక తొలిప్రేమ భోగాలా” అంటూ అందరినీ ఊసులాడుతున్నాయి.

పదకిరణ కలనం – 3 ఆధారములు
**********
అడ్డం
***
01. కార్మిక కర్షకుల పనివేళ. (4)
05. అబ్దము అప్పులను ఇస్తుంది. (4)
08. సూర్యుడు చంద్రుడు గాలి. (2)
09. కాకి దాణా. (2)
10. రక్షించు. (2)
11. కూర్కు. (2)
12. తాపత్రయం లో సామ్యం. (2)
14. పర్వతంలో నవ్వులో సోకుసొమ్ము. (2)
16. తిన్నట్లు చేసి రుచి చూసి, (2)
18. నాగరికం నేర్పేది. (4)
20. విశ్వ రచయితల సంఘం. అరసం సరసం కాదు. (3)
22. మానవతి తెలిపే సంఖ్య. (3)
24. బెల్లంతో దుడ్డుకర్ర. (3)
27. యావత్తును కోల్పోయిన తరగతి. పగ. (2)
28. నెమలిపురి మాచిపత్రి. (2)
30. ఆనందంతో అంగీకారం. (4)
31. గట్టి మట్టి. (2)
34. ఆ గంటలో పాపం! పిల్లల అల్లరి. (2)
35. స్వ కానిది మూడింట ఒక వాక్కు. (2)
36. ఒకచోట నిలువని శంపా శ్రీ. (3)
38. శరీరంతో సాగిన అంగీకారం. (4)
40. శైవరసం. (2)
41. నిగ్గు తేలితే నిలిచేది. (2)
43. పైకప్పు అంచు పొడి (2)
44. సిరి చీమ. (2)
45. శ్రుతిపతి కావచ్చు. (2)
46. కడుపూద, పగ. (4)
48. నూటనొకటి. (4)
నిలువు
**
01. పదహారింట ఒక ఉపచారం. (4)
02. సవ్వడి. (2)
03. దీవి దొర, మయుని దశమగ్రహం. (5)
05. ధర్మరాజు మేనత్త కావచ్చు. ఒకనాటి సత్యభామ. (3)
06. ముందరి ఋషి. (2)
07. వెన్నెలదొర నవ్వు రావణాయుధం. (4)
13. అనారోగ్యం కారణాలు. (4)
15. గుహ. (2)
17. సన్నగిల్లిన చిన్న. (2)
19. మాయలఫకీరు ప్రేయసి. (2)
21. వసుంధర నాలుక పాతాళం. (2)
23. హిరణ్యకుడు కొరికింది దక్షిణము కుడి దిక్కు. (3)
25. డాబు విజృంభణం. (3)
27. గుఱ్ఱము నడకలో తొక్కేది ఇదీ కదండీ. (2)
30. కొండ చెట్టు. (2)
31. లేదని చెప్పు వెక్కిరించు. (5)
32. ఆలకించాలని పెట్టుకునేది. (2)
33. ఒకటి ముఖ్యం. (2)
34. ఆ నదితో కొత్తపోకడ. (4)
35. పంటి పెక్కు. (2)
36. వెండి నెమలికన్ను. (2)
37. మొదలుకొని. (4)
39. కొబ్బరి వక్కల పొడి కావాలనుకొను. (2)
40. ఏకవింశతి నరకాలలో ఒకటి. (3)
42. జోడు దంపతులు. (2)
43. కొంచెం భిన్నహారభిన్నం. (2)
ఏకాక్షరులు
***
04. 26 తో నడుము.
26. 29 తో పొగడ్త.
29. 47 తో నమస్కారం.
47. 33 నిలువుతో మోసం.
శ్రీ పెరంబుదూరు రాఘవాచార్యులు గారు సుప్రసిద్ధ సాహిత్యవేత్తలయిన డా|| ఎస్. లక్ష్మణ మూర్తి
డా|| శ్రీ రంగాచార్య సోదరులయొక్క తండ్రిగారు.

ధన్యం మాన్యం వదాన్యం విఫలిత రిపురాజన్య మూర్థన్య జన్యం
మాద్య ద్విత్సుత్సముద్య ద్విమల తనురుచి వ్యాప్తరో ధంతరాళం
దౌష్ట్యేష్టాభీష్ట నష్టం గణితరణ రమత్సింహ నా దానుమోదం
వందే యాదక్షమాభ్పతటక పటు భుజారంహ లక్ష్మీనృసింహమ్
తాత్పర్యము : ధన్యుడు, మన్నింప దగినాడు, ఆహ్లాదకరముగా మాట్లాడువాడు, దానశీలి, తమ ప్రయత్నములన్నీ విఫలములై, విపరీతములైన ఫలితములు కలిగినవేళ శ్రతు (రాక్షస) రాజ్రశేష్ఠులతో జయశీలియై యుద్ధమొనర్చినవాడు; మదించిన శ్రతువుల (దానవుల) వలన ఉత్పన్నములైన ఆపదలను తన పరాక్రముచేత అణచుటవలన కలిగిన విజయముచేత తన ప్రకాశిస్తున్న తన నిర్మలమైన శరీర కాంతిచేత వ్యాపించిన భూమ్యంతరిక్షముల మధ్య భాగము కలవాడు; దుష్టతనమునందే తమకు కల ఇష్టములన సూరలు, మునులు మొదలైనవారికి హాని కలిగించటమే తమ లక్ష్యము (అభీష్టము)గా పెట్టుకున్న దానవులకు నష్టం కలిగించినవాడు, తనను స్తుతించే భక్త జనులకు తన రణరణ ధ్వని పూర్వకమైన సింహనాదములచే తన సంతోషమును, సమ్మతిని తెలుపుచున్నవాడు అయిన యాదాద్రిపై నెలకొని తన భుజబలమును ప్రదర్శిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని నమస్కరిస్తున్నాను.
విశేషాలు : శ్రీ లక్ష్మీ నరసింహమూర్తి ధన్యుడు. ధనం అంటే పుణ్యం. అది కలిగినవాడు ఆర్తత్రాణ పరాయణమనే పుణ్య కార్యమునే తన ప్రవృత్తిగా పెట్టుకున్నవాడు. సర్వ లోకాలచేత మన్నింప (పూజింప)బడేవాడు, మాన్యుడు. ఆపన్నులకు – భక్తజనులకు – వారి సమస్తములైన కోర్కెలను తీర్చే వదాన్యుడు – దానశీలి! శ్రీ లక్ష్మీదేవి తన భార్యగా కల శ్రీ మన్నారాయణ మూర్తికి భక్త జనుల కోసం ఇవ్వలేని దంటూ ఏముంటుంది?
ఎందరో రాక్షసులు, దానవ రాజులు ఘోర తపస్సులు చేసి, బ్రహ్మను మెప్పించి, ఎన్నో అసాధ్యములైన వరాలను పొందారు. లోకాలన్నింటినీ గడగడలాడించారు. కాని చివరికి వారు సంపాదించిన వరబలం విపరీత ఫలితాలను ఇచ్చింది. వారి ప్రయత్నాలు నిష్ఫలాలైనాయి. అటువంటి దానవ రాజాధిరాజుల్ని కూడా ఎన్నో అవతారాలెత్తి శ్రీహరి యుద్ధం చేసి సంహరించాడు. “ధర్మో రక్షతి రక్షితః” అన్న వేదాను వచనానికి ఇంతకంటే ఇంకేం ప్రమాణం కావాలి?
(మాద్యత్ +ద్విట్ + సుత్ + సముద్యత్ =)వర బలంవలన మదించిన శత్రు (దాన)వులచేత దేవతలకు, మునులకు, మానవులకు ఎన్నో ఆపదలు కలుగుతుంటాయి. వారిని నివారించటం కోసం వివిధ అవతారాలెత్తి, దుర్మార్గులను తన (సముద్యత్ =) పరాక్రమంచేత నిర్మూలించినవాడు విష్ణుమూర్తి! అటువంటి శ్రీహరి యొక్క నిర్మలమైన (విమల + తను + రుచి + వ్యాప్త + రోధస్ + అంతరాళం రోధస్ + అంతరాళం ఉంది. ఇక్కడ “రోదంతరాళం” అన్నది ముద్రణా దోషం (అచ్చు తప్పు) కావచ్చు)=) శరీరకాంతులు భూమ్యాంతరిక్షాల మధ్య భాగమందంతటా వ్యాపించి ఉన్నదట! కీర్తిని తెల్లగా ఉందని వర్ణించటం కవి సమయం. శ్రీహరి దుష్టసంహారం కోసం ఎత్తిన నృసింహావతారం యొక్క దివ్యశరీరకాంతులు దశదిశలా, సర్వలోకాలలో వ్యాపించినవని కవి దర్శించాడు.
(దౌష్ట్య + ఇష్టా + అభీష్ట + నష్టం = ) దానవులు ధర్మేతరాలైన దుష్ట కార్యాలు చేయటంలో ఇష్టం కలిగి ఉంటారు. అడేవాళ్ల అభీష్టం కూడా. అటువంటివాళ్ళ అభీష్టానికి (లక్ష్యానికి) నష్టం కలిగించేవాడు శ్రీహరి. (గణి + తరణ + రణత్ + సింహనాద + అనుమోదం =) గణించట అంటే భగవంతుణ్ణి స్తుతించటం అని అర్థం. ‘గణి’ అంటే స్తుతించేవాడు, భక్తుడు అని అర్థం! భక్తుల్ని వారికి కలిగిన ఆపదల నుండి తరింపజేయటం, రక్షించటం శ్రీహరి అపారకరుణకు ఉదాహరణ. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భక్తులను ఆపదలనుండి ఉద్ధరించిన తరువాత సింహనాదం చేశాడట! ఆ శబ్దం భక్త జనులు చేస్తున్న స్త్రోత్రపాఠాలకు తన అనుమోదం (సమ్మతి) తెలిపినట్లుగా ఉందట!
యాదాద్రిపై నెలకొని తన పటుతరమైన భుజబలాన్ని చూపిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని నమస్కరిస్తున్నాను అని కవి వినమ్రుడై పలుకుచున్నాడు!
పె (ప)ంట కుప్ప
కొందరికి
అది చీదరించుకునే
పెంటకుప్ప
కాని –
అందరికీ
అది ఆకలిదప్పులు తీర్చే
ప్రాణప్రదమైన
పంట కుప్ప!
ఒకటే…
శ్మశానంలో
కాకుల అరుపులు….
వేదికలపై
నాయకుల వాగ్ధానాలు…
కాకపోతే
అవి ఎంగిలి మెతుకుల కోసం
ఇవి తిన్నది
అరగటం కోసం!
స్వాతంత్య్రం
అర్థరాత్రి
స్వాతంత్య్రం
వచ్చిందన్నమాట నిజం!
నా దేశానిక్కాదు
ఈ దేశాన్ని
దిగమింగే
దేశ దిమ్మరులకు!
వ్యత్యాసం
ఒక్క
(రా) బంధువుకన్న
వందమంది
శ్రతువులు మిన్న!
వందమంది
(రా) బంధువులకన్న
ఒక్క
స్నేహితుడు మిన్న!
– కొరుప్రోలు హరనాథ్
ఫ్రీలాన్సర్ పోయెట్ కాలమిస్ట్
+91-9703542598
ఒకానొక సందర్భంలో కవి యాత్ర పేరుతో ఒక కార్యక్రమాన్ని మొదలు పెడితే ఎలా ఉంటుంది అనే ఆలోచన తట్టింది ఆలోచనకి అప్పుడే బలమైన బీజాలు పడ్డాయి అనుకున్న దాన్ని ఆచరణలో పెట్టాలి అనుకునే హైదరాబాద్లోని తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యాలయంలోకి వెళ్లానుఅప్పటికే ఎంతో బిజీగా ఉన్న అకాడమీ చైర్మన్ నందిని సిద్ధారెడ్డి గారు ప్రేమపూర్వకంగా నన్ను ఆహ్వానించి కవితకు ఇస్తానని హామీ ఇచ్చారు తేదీ ఖరారు చేయనున్నారు చివరికి వారు ఇచ్చిన తేదీనే మార్చి 24 2019 ఖరారైంది డాక్టర్ నరసింహ రెడ్డి తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి తమ సమ్మతిని తెలిపినప్పటికీ ఎలక్షన్ డ్యూటీ ఉన్నందున రాలేకపోయారు నేటి నిజం సంపాదకులు యాత్ర ప్రారంభ సభకు విశిష్ట అతిథిగా హాజరు కావాల్సి ఉండగా వారి స్వల్ప అనారోగ్య కారణంగా రాలేకపోయారు అయితే కవి యాత్రకు ముందు ఒక వాట్సప్ సమూహం ఏర్పాటు చేశాను కవి యాత్ర అనే శీర్షిక పై ఈ వాట్సప్ సమూహంలో చాలా చర్చ జరిగింది కవి యాత్ర అనడంకంటే కవుల యాత్ర అ అంటేనే సరైనదని కవిమిత్రుడు తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు ఎంతో చర్చ మొదలైంది. కవి యాత్ర అంటే కవి చేసే యాత్ర ఇది ఏక వచనం కవుల యాత్ర అంటే కవులు చేసే యాత్ర ఇది బహు వచనం కవి యాత్ర షష్టి తత్పురుష సమాసము. కవుల యాత్ర ఇది కూడా షష్టి తత్పురుష సమాసము అవుతుంది ఇక్కడ సమాసము మారలేదు . అయితే కవి యాత్రలో ధ్వనించిన శబ్ద సౌందర్యం దానిలో ఉన్న శక్తివంతమైన ప్రకంప
నలు కవుల యాత్రలో ధ్వనించదు అందుకే కవి యాత్ర అనడమే సరైనది కొన్ని పదాల్లో ఏకవచనం బహువచనం నిక్షిప్తమై ఉంటుంది బహువచనం లేక ఏక వచనం ఉంటుంది. అందుకే కవి యాత్ర ఆనడమే మంచిదని అంతిమంగా నిర్ణయించడమైనది. అప్పుడే ఎలక్షన్ కోడ్ రావడం వల్ల అవి యాత్రకి కొంత ఇబ్బందిగా మారింది పోలీస్ పర్మిషన్ కావాల్సి వచ్చింది అందుకు డాక్టర్ కృష్ణంరాజు కవి నేత్ర వైద్య నిపుణులు ముందుకొచ్చి కవి యాత్రకు పోలీస్ పర్మిషన్ తీసుకున్నారు. కవి యాత్రకు ముందు కూడా ప్రతులు కరపత్రాలు ఆవిష్కరించడం, ప్రెస్ మీట్ పెట్టడం వల్ల కవి యాత్ర గురించి ప్రజల్లో బాగా ప్రచారం జరిగింది. ఈ కవి యాత్రలో కవి బి. వెంకట్ గారు వ్యాఖ్యాతగా వ్యవహరించి ముందు నడిచారు యువకవి ,శిల్పి పోలీస్ భీమేష్ తనవంతుగా శ్రమించాడు ఏళ్ల తరబడి నా ఆలోచనలు రగిలి రగిలి కవిత్వమై అక్షరాలు అక్షరాలుగా ప్రవహించి నప్పటికీ కవిత్వమొక తీరని దాహం ఒక దశాబ్ద కాలంగా నిశ్శబ్దంగా రగులుకున్న కొలిమి నిత్య చైతన్యమై ప్రభవించాలను కొన్నది అదే సంకల్పం కవియత్రగా ఈ తెలంగాణా మట్టిపై అంకురించింది. ఎంతకాలమని ఈ నాలుగు గోడల మధ్య కవిత్వం వినిపిస్తాం ప్రజల వద్దకే వెళ్ళాలనిపించింది అందుకే బస్సు కే స్పీకర్లు కట్టాం దాదాపు 50 మంది కవులం నిర్మల్ నుండి బాసరకు బయలుదేరాంతెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి గారిని కలిసి ఆహ్వానించగా అనే వారు ఎంతో ప్రేమపూర్వకంగా స్పందించడం వల్ల మా మొట్టమొదటి విజయం ప్రారంభమైంది. నా ఆలోచనల్ని కందుకూరి శ్రీరాములు గారితో పంచుకోగా అనే కవి యాత్రను జై కొట్టి నన్ను ఎంతో ప్రోత్సహించడంతో నా రెండో విజయాన్ని సాధించాను నేను తీసుకున్న నిర్ణయం ఎంతో విశిష్టమైనదని విలక్షణమైనది అని సుప్రసిద్ధ కథా రచయిత కాలువ మల్లయ్య చింతపట్ల సుదర్శన్ లాంటి ఎంతోమందిసాహితీవేత్తలు నేను చేపట్టిన కవియాత్ర ప్రక్రియకు ప్రోత్సహించడం నాలో నూతన ఉత్తేజాన్ని నింపింది, తేదీ 24 .03 .2019 న మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ శ్రీ నందిని సిద్ధారెడ్డి గారు ఆకుపచ్చ జెండా ఊపి ప్రారంభించారు కళలకు పుట్టినిల్లు నిర్మల్ నుండి మొట్టమొదటి యాత్రకు శ్రీకారం చుట్టడంతో శ్లాఘనీయం నిర్మల్ మినీ ట్యాంక్ బండ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం నారాయణ ధర్మసాగర్ చెరువు అక్కడే టెంట్ వేసి ప్రారంభ సభను ఏర్పాటు చేశాను నందిని సిద్ధారెడ్డిగారితో పాటుగా కందుకూరి శ్రీరాములు , శ్రీమతి చీదెళ్ళ లక్ష్మి అతిథిగా విచ్చేసి సభను విజయవంతం చేశారుసమాజాన్ని చైతన్య పరిచే అనేక యాత్ర అంటూ కవి యాత్ర లక్ష్యాన్ని ప్రాముఖ్యతను గురించి ఎంతో స్పూర్తివంతమైన ఉపన్యాసం సభికుల్లో ఉత్సాహాన్ని నింపింది రెండు బస్సులకు ముందు భాగంలో పచ్చని అరటి కొమ్మలు కవి యాత్ర బ్యానర్ కట్టుకొని ఆ బస్సులకు స్పీకర్లు కట్టాం ఆ ప్రాంగణమంతా ఆహ్లాదకరంగా మారింది రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు నందిని సిద్ధారెడ్డి గారు పూలమాలవేసిన అనంతరం కవుల సమక్షంలో లో కవి అతను నందిని సిద్ధారెడ్డి గారు ప్రారంభించారు కవి యాత్ర వర్ధిల్లాలి ఇలాంటి స్లొగన్స్ తో కవులు గొంతు చించుకొని నినదించారు మొట్టమొదట నిర్మల్ ప్రధాన కూడళ్ళలో బస్సును ఆపి రోడ్లపైనే కవులు కవిత్వం చదివారు దిలావర్ పూర్ లో కొంత సేపు రోడ్డుపై ఆగి కవులు కవిత్వం చదివారు అదో వినూత్నమైన ప్రక్రియ బస్సు చైతన్యరథమే బాసర వైపు కదిలింది మాతో పాటుగా బస్సులో బాసరకు నందిని సిద్ధారెడ్డి గారు రావడం కవులలో ఎంతో ఉత్తేజాన్ని నింపింది మార్గ మధ్యలో నర్సాపూర్ జి లో ఊరవతల రామాలయం ఆవరణలో అప్పటికే తెచ్చుకున్న వంటకాలతో చెట్లకింద భోజనం చేసాము అనంతరం డీలర్ పూర్ లో కొంత సేపు రోడ్డుపైన ఆగి కవులు కవిత్వం చదివారు పాటలు పాడారు ఆసిఫాబాద్ ఆదిలాబాద్ నిజామాబాద్ హైదరాబాద్ జిల్లాల ప్రాంతాల నుంచి వచ్చిన కవులతో ఈ కవి ఎంతో చైతన్య రగిలించింది తద్వారా సాహితీ చరిత్రలోనే ఓనూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టిందని ఈ కవి యాత్ర ఎంతో విలక్షణమైనది అని విశిష్టమైనదని నవ్య పదంలో నడుస్తూ ఆలోచనా బీజాలు నాటుతున్నదని ప్రజలు కొనియాడారు నాలుగు గోడల మధ్యకవిసమ్మేళనాలు నిర్వహించే సంప్రదాయం నుంచి నాలుగు రోడ్ల కూడళ్ళలో సామాన్య ప్రజల వద్దకు వెళ్లి కవిత్వం వినిపించే సరికొత్తత ఆలోచనలతో కవి యాత్ర ముందుకు సాగింది. భైంసా కు చేరుకోగానే గానే అక్కడి సాహితీమిత్రులు కవి యాత్రకు స్వాగతం వంటి బ్యానర్లు కట్టి స్వాగతం తెలిపారు, ముధోల్ లో ఊహించ కుండానే కవి యాత్రకు ఘనమైన స్వాగతం లభించింది రవీంద్ర భారతి హై స్కూల్ యాజమాన్యం విద్యార్థులు బ్యాండ్ మేళాలతో ఘనంగా స్వాగతం పలికి అనంతరం కవులను శాలువాలతో సన్మానించారు అనంతరం బాసర అమ్మవారి ముఖద్వారం ఎదుట జనం మధ్యలో కవులు కవితా గానం చేసారు తిరుగు ప్రయాణంలో బైంసా కు చేరుకునేప్పటికి సమయం తొమ్మిది దాటింది బస్టాండ్ ఎదుట కవులు కవితా గానం చేశారు ప్రఖ్యాత హిందీ కవి మధు భావల్కర్ తన కవిత పఠనంతో ప్రజల్లో ఆసక్తిని రేకెత్తించారు, అనంతరం ప్రజలకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము ఇందులో నా శ్రీమతి కె నివేదిత, మరియు చెల్లెలు కమల తమ వంతు కృషి చేశారు.
నాలుగవ విడత కవియాత్రలో ప్రముఖులు
నాలుగవ విడత కవియాత్రలో ముఖ్య అతిథిగా ప్రసిద్ధ కవివర్యులు కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ ఏనుగు నరసింహా రెడ్డి గారు, సినీ గేయ రచయిత, నంది అవార్డు గ్రహీత సాధనాల వెంకట స్వామి నాయుడు గారు, నల్గొండ సిలివేరు సాహితీ కళాపీఠం అధ్యక్షులు సిలివేరు లింగమూర్తి గారు, ఆసిఫాబాదు కవుల సంఘం అధ్యక్షులు గుర్రాల వేంకటేశ్వర్లు గారు ,కార్యదర్శి డా తిరుపతి గారు ,మంచిర్యాల రచయితల సంఘం అధ్యక్షులు బొడ్డు మహేందర్ గారు, ముధోల్ లోని రబీంద్ర ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్ అసంవార్ సాయినాథ్ గారు ,తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి యం సి లింగన్న గారు ,కవులు -కవియాత్ర ఉపాధ్యక్షులు డా. కృష్ణం రాజు గారు, డా. వేణుగోపాల కృష్ణ గారు, జీ ఆర్ కుర్మే గారు, జాదవ్ పుండలీక్ రావు పాటిల్ గారు ,కవియాత్ర వ్యవస్థాపక అధ్యక్షులు కారం శంకర్ గారు ,చైర్మన్ కారం నివేదితగారు , ప్రధాన కార్యదర్శి మరియు వ్యాఖ్యాత బి వెంకట్ గారు ,కుర్మేహరికృష్ణగారు, పాటే మా ప్రాణం సంగీత అకాడమీ డైరెక్టర్ చెనిగారపు నాగరాజు గారు లు నిర్మల్ నుండి నిజామాబాదు వరకు జరిగిన కవియాత్రలో పూర్తిగా పాల్గొని విజయవంతం జేశారు .
కారం ప్రణయ,కారం ప్రణతి,కారం రాజ్ ప్రసేన్ జిత్ లు పాల్గొనడమేగాక కవియాత్రకు చేదోడువాదోడుగా నిలబడి ,పూర్తిగా అంకితమైనారు చిన్నారులకు అభినందనలు.
నాలుగవ విడత కవియాత్ర
( నిర్మల్ నుండి నిజామాబాదు వరకు)
కవియాత్ర 3 వ వార్షికోత్సవము
అంతర్జాతీయ కవితా దినోత్సవము
- 03.2021, ఆదివారము
నాలుగవ విడత కవియాత్ర నాలుగు కూడళ్లకే పరిమితం కాలేదు. ఈ యాత్ర క్రొత్త సమాజం వైపు దూసుకెళ్లింది. ప్రేమను పంచింది .శాంతిని విస్తరించింది .జ్ఞానాన్ని వెదజల్లింది .కారణం ప్రముఖ కవి సద్విమర్శకులు కవియాత్ర వ్యవస్థాపక అధ్యక్షులు కారం శంకర్ గారు తలపెట్టడమే .ప్రముఖ లాయర్ ,కవియాత్ర చైర్మన్ కారం నివేదిత సహృదయం సమాజం పట్ల, కవులపట్ల ,ప్రేమను కురిపించడం ఒక ఉదాహరణం .కవియాత్ర ప్రధాన కార్యదర్శి వ్యాఖ్యాత బి వెంకట్ సదుక్తుల వ్యాఖ్యానంతో కవియాత్ర బస్సు కదలడమే .నాలుగవ విడత కవియాత్ర ప్రారంభసభ కు ముఖ్య అతిథి మాన్యులు తెలంగాణ రాష్ట్ర దేవదాయ, అటవీ ,న్యాయ శాఖా మంత్రివర్యులు అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డిగారు ఆకుపచ్చ జెండా ఊపి, కవియాత్ర బస్సును ప్రారంభించడము అదొక మధుర జ్ఞాపకము .ప్రజల్లో నవ చైతన్యము కలగడము అనేది కవియాత్రకు బలము చేకూర్చిందని చెప్పవచ్చును. మంత్రిగారి మాటల్లోనే చూద్దాం– – ప్రముఖ కవి కారం శంకర్ గారు తలపెట్టిన కవియాత్ర ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొస్తుంది .ప్రజలు చైతన్యమవుతారు. కవియాత్ర ద్వారా సమాజానికి ఉపయోగపడే మంచి కవిత్వం వస్తుంది .కవులు, కవయిత్రులు క్రొత్త చైతన్యమును వారి వారి కవిత్వం ద్వారా నింపుతారు. ప్రజల గుండెల్లో కవియాత్ర కవిత్వం చిరస్థాయిగా నిలుస్తుంది .అని నాలుగవ కవియాత్ర ప్రారంభ సభలో రాష్ట్ర మంత్రివర్యులు అలోల్ల ఇంద్రకరణ్ రెడ్డి గారు మాట్లాడంలో అతిశయోక్తి లేదు.
నాలుగవ విడత కవియాత్రకు ముఖ్య అతిథి
ఏనుగు నరసింహా రెడ్డి గారు,
ప్రసిద్ధకవి ,సాహితీవేత్త, కరీంనగర్ అడిషనల్ కలెక్టర్.
అంతర్జాతీయ స్థాయి లో ప్రసిద్ధి పొందిన ,నిర్మల్ కొయ్యబొమ్మల నెలవైన, నిమ్మనాయుడేలిన, చారిత్రకపరమైన నిర్మల్ ప్రధాన పట్టణం నడిబొడ్డులోగల తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనం సమావేశ హాల్లో కవియాత్ర వ్యవస్థాపక అధ్యక్షులు కారం శంకర్ గారి ఆధ్వర్యంలో జరిగిన నాలుగవ విడత కవియాత్ర ప్రారంభసభకు ప్రముఖ సాహితీవేత్త ,కవి, రచయిత, కరీంనగర్ అదనపు పాలనాధికారి ఏనుగు నరసింహా రెడ్డి గారు మరో ముఖ్య అతిథిగా హాజరై. అమూల్యమైన సందేశమును ఇచ్చారు. కవియాత్ర వల్ల లాభమున్నదా? అనే ప్రశ్నను ఉత్పన్నం జేసి .చక్కని సమాధానాలను ఇచ్చారు. కవియాత్ర తప్పక చేయాలనీ అన్నారు . కారం శంకర్ గారు తలపెట్టిన ఈ యాత్ర ఉపయోగకరమైనది అన్నారు. ఈ కవియాత్రలో కవులు కవిత్వమును క్రొత్తగా ఆవిష్కరించి ,ఆ కవితలను ప్రజలమధ్యలో ఆలపించడం వల్ల ప్రజల్లో నూతన ఉత్సాహం, కవిత్వం వ్రాసే శక్తి, భాషాపరమైన నూతన నానుడులు పుడుతాయని అన్నారు .కవియాత్ర ప్రత్యేకముగా ప్రజలు తిరుగాడే కూడళ్లలో కొనసాగుతూ ప్రజలకు మైకు ద్వారా ప్రేమ శాంతి జ్ఞానం వినిపించడం ద్వారా ,కవిత్వరూపంలో ,పాట రూపంలో వినిపంచడం ద్వారా ప్రజల్లో నవ చైతన్యం కలుగుతుందని అన్నారు. ప్రజలందరికి స్ఫూర్తిగా నిలుస్తూ క్రొత్త కవులు తయారవుతారని అన్నారు. నవ్యకవిత్వం తో కవులు పుట్టుకొస్తారని అన్నారు .ప్రేమ శాంతి జ్ఞానం అను సమాజమును ప్రతిబింబించే పదాలను తీసుకొని కవియాత్ర అనే పేరుతో యాత్రను చేయడం కారం శంకర్ గారు, వారి సతీమణి కారం నివేదిత ధన్యులని అన్నారు. ఈ దంపతులు చేపట్టిన ఈ కవియాత్ర చరిత్రలో శాశ్వతంగా నిలుస్తుందని అన్నారు. కవియాత్రను చేపట్టిన కారం శంకర్ గారు చైర్మన్ నివేదితగారు , వ్యాఖ్యాత, ప్రముఖ కవి బి. వెంకట్ లు అభినందనీయులని అన్నారు.
తదనంతరము కదిలిన కవియాత్ర బస్సులో సామాన్య జనునివలె కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ ఏనుగు నరసింహా రెడ్డిగారు ప్రయాణం చేశారు .మధ్యలో కవియాత్ర ఆగినచోట ఉత్సాహాన్ని నింపే ప్రసంగాలను చేశారు .బాల్కొండ లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు.మాట్లాడారు. అక్కడినుండి ఆర్మూర్, నిజామాబాదు సభల్లో సందేశమిచ్చారు .నిజామాబాద్లో కంఠేశ్వర్ లోని ప్రాచీన శివాలయం ప్రాంగణంలో నిజామాబాదు కవులు స్వాగతం పలికారు .తర్వాత మహా శివున్ని అర్చించారు. తర్వాత గీతాభవన్లో జరిగిన కవియాత్ర జ్ఞానజ్యోతి సభలో సందేశమిచ్చి, కవియాత్రలో పాల్గొనిన ప్రతి కవిని సన్మానించారు .కవియాత్రకు ఒక రోజంతా పూర్తి సమయాన్ని ఇచ్చి ,కవియాత్ర సాహిత్యలోకానికి స్ఫూర్తిని నింపారు.
నిర్మల్ నుండి నిజామాబాదు వరకు కవియాత్ర లో కవితాగానం
కవియాత్రకు విశిష్ఠ అతిథిగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ప్రముఖ కవి డా ఉప్పు కృష్ణం రాజు గారు చక్కని సందేశాన్ని అందించారు తనదైన శైలితో కవిత్వమును రచించి కవితను గానం చేశారు కవియాత్రకు వెన్నుదన్నుగా నిలిచి పోలీసుల అనుమతిని తీసుకున్నారు అంతేగాక కవియాత్రకు సహకారాలను అందించారు ఆయా తెలుగు రాష్ట్రాల నుండి 60 మంది దాక కవయిత్రులు కవులు పాల్గొన్నారు ఆయా కూడళ్లలో కవిత్వమును వినిపించారు. పాటే మా ప్రాణం సంగీత అకాడమీ చెనిగారపు నాగరాజు గారు వారి కళాకారుల బృందంతో పాటలను పాడించారు ప్రముఖ జానపద కళాకారిణి కళ్యాణి రాగయుక్తంగా పాడిన పాటలు అలరించాయి .నాగరాజు పాడిన అమ్మానాన్నల పాట హృదయాలను రంజింపజేసింది .నిర్మల్లోని ప్రారంభమైన కవియాత్ర అమరవీరుల స్తూపం, కలెక్టర్ చౌరస్తా. శివాజీ చౌక్ .చైన్ గేట్, కంచెరోని చెరువు సమీపంలోని ప్రాచీన కట్టడం కోట శ్యాం ఘడ్ లలో కవులు కవితాగానం చేశారు .తర్వాత సోఫీనగర్, కడ్తాల్ ,గంజాల్ ,సొన్, పోచంపాడ్ ,ముప్కాల్ మీదుగా బాల్కొండ చేరింది. కవియాత్ర ఆయా కూడళ్లలో అక్కడి కవులు కవియాత్రకు స్వాగతం చెప్పారు .ఇలా నిజామాబాదువరకు కవియాత్ర వెళ్ళింది.
బాల్కొండలో కవియాత్రకు బ్యాండు మేళాలతో ఘనస్వాగతం
మండలోజు నరసింహ స్వామి , నాగుల రాజేందర్ అను కవులు బ్యాండు మేళాలతో ,పాఠశాల విద్యార్థులతో ఘనస్వాగతమును పలికారు. బాల్కొండ ప్రవేశ ద్వారము నుండి తెలంగాణ తల్లి విగ్రహం వరకు సద్భావన యాత్రగా తీసుకెళ్లారు .తెలంగాణ తల్లికి పూలమాలలను సాహిత్య ముఖ్య అతిథి ఏనుగు నరసింహ రెడ్డి చేతులమీదుగా వేయించారు. కవియాత్ర అధ్యక్షులు కారం శంకర్, చైర్మన్ నివేదిత, వ్యాఖ్యాత బి. వెంకట్, డా యు. కృష్ణంరాజు కవులు, కవయిత్రులు పాల్గొన్నారు. తర్వాత అక్కడి చిన్న దుకాణ కూడలిలో చెట్ల నీడన ప్రముఖ కవులను సన్మానం చేశారు. పాటలు పాడిన కళ్యాణి బృందానికి కవితాగానం చేసిన కవులకు తాను స్వతంత్రంగా రచించిన రుబాయిలు పుస్తక సంకలనాలను బహుమతిగా అందించారు. బాల్కొండ కవితాగానంలో ప్రజలు ఆసక్తిగా కవితలను విన్నారు.
కవియాత్రకు ప్లెక్సీలతో స్వాగతం చెప్పిన ఆర్మూర్ కవులు
బాల్కొండ నుండి బయలు దేరిన కవియాత్రకు అక్కడి కవులు ప్లెక్సీలతో స్వాగతం చెప్పారు .అష్టావధాని డా బోచ్కర్ ఓంప్రకాష్ రామకృష్ణ ,సాయినాథ్, గణపురం రాజేందర్ ,పీరి గంగాధర్ లు స్వాగతం చెప్పారు .శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి గుడిలో కవియాత్ర కవులకు లిల్లీపుట్ స్కూల్ కరస్పాండెంట్ రామకృష్ణ ఆధ్వర్యంలో భోజనాలను ఏర్పాటు చేశారు .తర్వాత జరిగిన సాహిత్య సభలో కవులకు సన్మానం చేశారు. చిన్నారి అభిజ్ఞ చేసిన శాస్త్రీయ నృత్యం సభను అలరించింది .అక్కడి నుండి ఆర్మూర్ కూడళ్లలో కవితాగానమును కవులు చేస్తూనే కవియాత్ర నిజామాబాదు వైపు సాగింది.
నిజామాబాదు కంఠేశ్వర్ లో కవియాత్రకు వేదమంత్రాలతో స్వాగతం
నిజామాబాదులోని భావన సాహితి సంస్థ అధ్యక్షులు పడాల రామారావు గారు సభ్యులు సురేశ్ వివిధ ఇందూరు సాహితిసంస్థలు కలిసి కవియాత్రకు స్వాగతం పలికినవి .అచటి ప్రాచీన శివాలయం లోనికి పూజారుల వేదమంత్రాలతో స్వాగతం పలికారు .శివునికి అర్చనలు చేయించారు .తర్వాత ప్రముఖ కవులకు సాహిత్య ముఖ్య అతిథి ఏనుగు నరసింహారెడ్డి గారికి పరమేశ్వరుని వస్త్రాలను అందించి, తీర్థప్రసాదాలను అందించారు .అచటి ప్రాంగణంలో వివిధ ప్రాంతాలనుండి వచ్చిన కవులు కవితాగానం చేశారు .వేసవి తాపమును నివారించే చల్లని మజ్జిగను కవియాత్ర దంపతులు కారం శంకర్, కారం నివేదితలు అందించారు తర్వాత నిజామాబాదు లోని ప్రధాన కూడళ్లలో కవియాత్ర సాగింది గాంధీ చౌక్ లోని మహాత్మా గాంధీ విగ్రహానికి కవియాత్ర చైర్మన్ కారం నివేదిత, ప్రధాన కార్యదర్శి బి వెంకట్ లు పూలమాలలను వేశారు అక్కడినుండి కవితాగానం చేస్తూ ,కవియాత్ర గీతా భవన్ కు చేరుకుంది .అచటి సాహిత్య సభలో ముఖ్య అతిథులుగా ఏనుగు నరసింహారెడ్డి గారు డా కావేరి ఫౌండేషన్ చైర్మన్ డా అప్పాల చక్రధారి పాల్గొని ,కవియాత్రను కొనియాడారు .కవియాత్ర కొనసాగడం చాలా విభిన్నమైనదని అన్నారు. కవియాత్ర సామాన్యప్రజలను చైతన్యం చేస్తుందని అన్నారు. తర్వాత నిజామాబాదు కవులు కవితాగానం చేశారు .యూత్ అసోషియేషన్ అధ్యక్షులు సాయిబాబా మాట్లాడారు నిర్మల్ నుండి నిజామాబాద్ వరకు బస్సులో ప్రయాణం చేసిన కవితాగానం చేసిన కవయిత్రులకు .కవులకు,నిజామాబాదుకవులకు ముఖ్య అతిథుల చేతులమీదుగా సన్మానం చేశారు . వ్యవస్థాపక అధ్యక్షులు కారం శంకర్ చైర్మన్ కారం నివేదిత లు ఈ కార్యక్రమాన్ని పరిశీలించగా వ్యాఖ్యాత బి వెంకట్ వ్యాఖ్యానం చేశారు. చెన్నూర్ నుండి తీసుకొచ్చిన కవియాత్ర జ్ఞాన జ్యోతిని నిజామాబాదు కవులు పడాల రామారావు సురేశ్ తదితర కవులకు బొడ్డు మహేందర్ .గుర్రం వెంకటేశ్వర్లు,డా తిరుపతి లు అందజేశారు.తర్వాత ధన్యవాద సమర్పణతో, చివరగా కవియాత్ర దంపతులు కారం శంకర్, కారం నివేదిత లు కవులెల్లరకు భోజనాలను పెట్టించారు. త్వరలో హైదరాబాదుకు కవియాత్ర వెళ్ళనుంది. కవియాత్రకు ముగింపులేదు.
గీతాభవన్ లో
పుస్తకాల ప్రదర్శన కవియాత్ర సన్మానం ప్రాంగణంలో నవతెలంగాణ వారు పుస్తక ప్రదర్శనను నిర్వహించారు. నిర్మల్ నుండి నిజామాబాదు వారికీ సాగిన కవియాత్రను లైవ్ చూపించడం కోసం వివిధ చానళ్ళు ప్రోత్సాహమును ఇచ్చాయి. ప్రింట్ మీడియావాళ్లు చక్కని కథనాలను అందించారు. అందరికి కవియాత్ర పక్షాన ధన్యవాదాలు.
కవియాత్రలో కవితాగానం చేసిన కవులు
ప్రముఖ కవి ఏనుగు నరసింహ్మా రెడ్డి ,కారం శంకర్ ,బి వెంకట్,డా. అప్పాల చక్రధారి, కారం ప్రణతి ,డా కృష్ణంరాజు,డా వేణుగోపాలకృష్ణ, పత్తి శివప్రసాదు, నేరెళ్ళ హన్మంతు, పొలీస్ భీమేశ్, అంబటి నారాయణ ,జి ఆర్ కుర్మే ,సాధనాల వెంకట స్వామి నాయుడు ,జాదవ్ పుండలీక్ రావు పాటిల్, సిలివేరు లింగమూర్తి ,కుర్మే హరికృష్ణ, అసంవర్ సాయినాథ్ ,గుర్రాల వెంకటేశ్వర్లు ,డా తిరుపతి, సిలివేరు లింగమూర్తి ,డా కోవెల శ్రీనివాసా చార్య ,అరుణ బట్టువార్ ,చంద్రకళ ,చెనిగారపు నాగరాజు ,ధర్మపురి, రాఘవులు, శేషుకుమార్ ,బి విజయలక్ష్మి ,సుమతి, మామిడాల దశరథ్ ,రాజేశ్వర్, పీరి గంగాధర్ ,కిరణ్మయి ,కారం ప్రణయ, ఓంప్రకాశ్ ,పడాల రామారావు,సురేశ్ ,సాయిబాబా, నిజామాబాదు కవులు,తదితరులు .పాల్గొని కవితాగానం చేశారు.
కళాకారులు -కళ్యాణి, సాయికృప ,దీపిక ,కావ్య, సుప్రియలు పాల్గొని అందమైన పాటలను పాడారు.
వేములవాడ=కొన్ని వెంటాడే దృశ్యాలు
——————
నా అరవై రెండేళ్ల జీవనయానంలో వేములవాడది ఒక ప్రధాన భూమిక. అనేక అనుభవాలకు,ఆనందాలకు,కొన్ని అవమానాలకు వేదికయిన ఆ వూరు మా అమ్మను కన్న వూరు,అమ్మమ్మ వూరు,తాతయ్య జోరు, గొప్ప జాతర హోరు.
వేములవాడ లో నేను అమ్మ గారింటి తోనే ఐడెంటి ఫై అయినప్పటికీ మా వారాల వంశం మూలాలు వేములవాడలోనే వున్నాయి.తరతరాలుగా మిఠాయిలోల్లం. అది తర్వాత ఎప్పుడయినా రాస్తాను.
నేను పుట్టింది వేములవాడలోనే అయినా పెరిగింది చదివింది కరీంనగర్. సెలవులకు,పండగలకు,పబ్బాలకు,అమ్మ గారింటికి వచ్చేవాడిని. అమ్మమ్మ సత్తమ్మ, తాతయ్య డాక్టర్ సుబ్రహ్మణ్యం,మామయ్యలూ, అత్తమ్మలూ, అందరిలో ఒక్కడినై కలగలిసి పోయి వేములవాడ వాడినే అయిపోయాను.
నా సుజనాత్మక జీవితంలో నటరాజ కళానికేతన్ ఒక ప్రధాన మూల మలుపు. ఆ మలుపు వేములవాడ ఫిలిం సొసైటీ స్థాపించి జాతీయ అంతర్జాతీయ స్థాయి సినిమాల్ని ప్రదర్శించడం దాకా సాగింది.1983 దాకా నా ప్రధాన వేదిక భూమిక ఆ వూరే.
ఆ వేదిక గురించి విస్తృతంగా రాయాల్సివుంది. రాస్తాను ఎప్పటికయినా.
ఇప్పటికి గత అయిదు దశాబ్దాలుగా నన్ను వెంటాడుతున్న కొన్ని images గురించి రాస్తాను.
SOME Haunting images :
1 ) తిప్పాపురం బస్ స్టాండ్ :
చిన్నప్పటి నుండి దశాబ్ద కాలం వీక్షించిన దృశ్య మిది. జనంతో క్రిక్కిరిసి పోయి నిండు గర్భిణీ లా మెల్లిగా స్టాన్డ్ కు చేరుకున్న బస్సు చుట్టూ పొలోమంటూ పూజార్లూ వేద పండితులూ చేరి దేవుని దర్శనానికా అని పలకరిస్తూ పోటీలు పడి తలా ఒకటో రెండో కుటుంబాల్ని వెంట తీసుకెళ్లి. వారికి వసతి దర్శన తదితర బాధ్యతలు చూసే వారు. వేదపండితులు,విజ్ఞులు అయినా వారిని అలాంటి స్థితిలో చూడ్డం తీవ్రంగా కలత పెట్టేది.ఆ ఇమేజ్ ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే వుంది.
2 ) ధర్మ గుండం
అప్పట్లో దేవాలయ ధర్మ గుండానికి చెరువుకి నడుమ కేవలం చిన్న రాతి కట్టడం ఉండేది, ఇంకా కట్టడాలేవీ లేవు. యాత్రికులు దేవునిమీది విశ్వాసం తో గుండం లోకి పైసలు వేసేవాళ్ళు. అప్పుడేన్నని ఒకటో,రెండో, ఐదో పైసల బిళ్ళలు వేసేవాళ్ళు వాటికోసం కొంతమంది నీళ్ళల్లోకి దూకి మునిగి వెతికి కరుచుకుని
మరీ తెచ్చు కునే వాళ్ళు. ఎన్ని సంపాదించే వాళ్ళో కానీ ఆ ఇమేజ్ ఇప్పటికీ నా కళ్ళ ముందు మెదులుతూనే వుంది.
3 ) మిఠాయి దుకాణాలు
గుడి ముందు కాలువ పక్కన కేశన్నగారి ఇంటి వరుసలో పొందికగా వున్న మిఠాయి,గాజుల దుకాణాలు నాకిప్పటికీ గొప్పగా అనిపిస్తాయి. రంగు రంగుల చిలుకలు బత్తీసలు బెండ్లు శక్కరి పుట్నాలు, అందంగా పేర్చిన పేడాలు ఎంత కళాత్మకంగా ఉండేవో. గొప్ప దృశ్యాలవి పిల్లలు మేడలో చిలుకల పేర్లు వేసుకోవడం ఎంత అందంగా ఉండేదో.
4 ) బిచ్చ గాళ్ళు
జాతరలు ఆలయాల ముందు వీళ్ళు సాధారణం. కానీ వేములవాడ వీధుల్లో ముళ్ల కంపల పై పడుకుని కొందరు, ఇంకొందరయితే భూమిలో గోతి తవ్వి అందులో తల పెట్టి మట్టి తో కప్పుకుని పక్కనే ఒక ప్లేటు పెట్టుకుని గంటల తరబడి అట్లా వుండే వాళ్ళు. వాళ్లకు శ్వాస ఎట్లా ఆడేదో ఇప్పటికీ అర్టంకానీ విషయమే.ఆ దృశ్యాలు నన్ను వెంటాడు తూనే వున్నాయి. అప్పుడు కెమెరాల్లేవు ఇమేజెస్ మనసులోనే ఉండి పోయాయి
5 ) తూము
చెరువు కింది తూములోంచి నీళ్లు వదిలి నప్పుడు ఉప్పొంగి కాలువలోకి వచ్చే నీటి దృశ్యం పట్నం లో పెరిగే నాకు అబ్బురంగా కనిపించిన ఇమేజ్ .
6 ) పోచమ్మ
పోచమ్మ బోనాలు వాటికి ముందు మోగే దప్పుల చప్పుడు శివాలూగే భక్తులు ఓహ్ చూడాల్సిందే.మరీ చిన్నప్పుడు భయమేది కానీ ఆ ఇమేజ్ మామూలుది కాదు
7 ) జైన శిల్పాలు
ప్రధాన దేవాలయం నుండి తరలించిన వందలాది శిల్పాల్ని అనాధలుగా భీమన్న గుడి పక్క తోటలో పడేసిన దృశ్యం వెరీ మచ్ హాంటింగ్. కొంచెమయినా చారిత్రిక దృష్టి లేని తనం దుఃఖం కలిగిస్తుంది.వేదనగా ఉంటుంది.
8 ) తాతయ్య దవాఖానా
సుబ్రహ్మణ్యం తాత దవాఖానా రోజంతా పేషంట్ల తో క్రిక్కిరిసి ఉండేది. కషాయం దగ్గు పొట్లాలతో బిజీగా ఉండి సేవ చేసేది. సాయంత్రమయితే చాలు దవాఖానా ముందు ఊడ్చి శుభ్రం చేసి చాపలు వేసేవాళ్ళు. ఆప్పుడు తాతయ్య, ఠాకూర్ సాబ్, సాంబయ్య సారూ ఇంకా అనేక మంది పెద్దలు ఒక్కోసారి ఎం.ఎల్లే రాజేశ్వర్ రావూ కూర్చుని దేశం గురించి రాజకీయాల గురించీ చర్చించే వాళ్ళు. ఆ దృశ్యం ఎంత గొప్పగా ఉండేదో
9 ) దవాఖాన్ల అమ్మమ్మ రాజేశ్వరి అమ్మమ్మ
నా చిన్నప్పటి నుండి మనసులో అట్లా నిలిచి పోయిన స్త్రీ రూపం దావాఖాన్ల అమ్మమ్మ. ఒకింత నిండుగా ముక్కు పుడక, చెవులకు గంఠీలు సహా ఒంటినిండా ఆభరణాలతో కళకళ లాడేది.నోట్లో పాన్ ఎంత అందంగా ఉండేదో. దసరాకు జాతరాకో మా పిల్లలందరికీ ఒక్కో రూపాయి ఇచ్చేది. తను నాకయితే గొప్ప గ్రామ దేవతలా అనిపించేది. చాలా గొప్ప స్త్రీ మాత్రమే కాదు గొప్ప మనిషి కూడా.
ఇట్లా నన్ను హాంట్ చేసిన ఇమేజెస్ ని కొన్నింటిని నా ‘శివ పార్వతులు’ డాక్యుమెంటరీ లో పొందు పరిచాను.
ఆ ఫిలిం Slovenia ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో అవార్డు గెలుచుకుంది.ఇంకా భూటాన్, మెక్సికో లాంటి చోట డాక్యుమెంటరీ ఫెస్టివల్స్ లో పాల్గొంది. ఆ వివరాలు మరో సారి.
ఇవన్నీ నన్ను వెంటాడిన ఇమేజెస్ మాత్రమే. నా ఫిలిం చూడాలనిపిస్తే చెప్పండి లింక్ ఇస్తాను.
వేములవాడ=కొన్ని వెంటాడే దృశ్యాలు= 2
ఆయిదారు దశాబ్దాల క్రితం సామాజికంగా ఇంత చలనం, సాంకేతిక అభివృద్ధి లేని కాలం లో పిల్లలకు బడులకు ఇచ్చే సెలవులు గొప్ప ఆట విడుపు. ఆ ఆటవిడుపులో అమ్మగారింటికి వెళ్ళడంలో వున్న మజాయే వేరు. అదీ ఆత్మీయంగా చూసే తాతయ్య అమ్మమ్మలు వున్నప్పుడు ఆనందం ఎన్నో రెట్లు పెరిగేది. ఇంతకు మందే చెప్పినట్టు మా అమ్మగారిల్లు వేములవాడ. మావూరు కరీంనగర్. తాతయ్య డాక్టర్ మంగారి సుబ్రహ్మణ్యం, అమ్మమ్మ సత్యమ్మ. ఎక్కడో మహాబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ నుంచి వేములవాడ వచ్చి అక్కడి దేవస్థానంలో మొట్టమొదటి వైద్యాదికారిగా సేవలందించిన తాతయ్య కొల్లాపూర్ లో రాచరిక భూస్వామ్య వ్యవస్థ ముందు తల ఒగ్గ లేక వేములవాడ వచ్చినట్టు విన్నాను
ఆ విషయాలు తాతయ్యను ఎప్పుడు అడిగినా చిరునవ్వు నవ్వేసి ఊరుకునేవాడు. నేను కరీంనగర్లో కార్ఖానాగడ్డ, గంజ్ స్కూళ్ళల్లో చదువుతున్నప్పుడు పరీక్షలవుతున్నప్పుడు తాతయ్యకు ఉత్తరం రాసేవాడిని ఫలానా రోజుతో పరీక్షలయిపొతున్నాయని. సరిగ్గా ఆరోజు పగటీలికల్లా తాతయ్య కరీంనగర్లో మా మిఠాయి దుకాణం ఇంట్లో దిగేవాడు. అనేక మంది పిల్లలతో మున్సిపల్ స్కూలులా వుండే మా ఇంట్లో అందరికీ ఐస్ ఫ్రూట్లు ఇప్పించి నన్ను తీసుకుని వేములవాడ బయలు దేరేవాడు. అట్లా దాదాపు స్కూలు సెలవులన్నీ వేములవాదలోనే గడిచేవి. అక్కడి మిత్రులు దేవాలయ వాతావరణం నా బాల్యం లో భాగం అయిపోయారు.
అమ్మమ్మ తతయ్యలకు తమ కూతుళ్ళ పిల్లలంటే ఎంత అభిమానమంటే వాళ్ళని ఏమయ్యా అనేవాల్లె గాని అరేయ్ ఒరేయ్ అని పిలిచే వాళ్ళు గాదు. అమ్మమ్మయితే ఆడబిడ్డల కొడుకులను అరేయ్ అంటామా అని అందరిముందూ అనేది. అదే మా ప్రసాద్ బావని మాత్రం అరేయి ప్రసాదూ అని పిలిచేది. అదీ అప్పటి పెద్దల అభిమానాలూ ఆదరణలూ.
తాతయ్య వేములవాడ దేవస్థాన మొట్టమొదటి వైద్యాధికారి. దేవాలయ వెనకాల కట్టమీద ఆసుపత్రి నివాసమూ వుండేదని చెప్పేవారు. అక్కడే అనేక ఏళ్ళు గొప్ప సేవా తత్వంతో సేవలందించిన ఆయన ఆజానుబాహువు. ముఖంలో గంభీర్యంతో కూడిన చిరునవ్వుతో అందరి ఆదరణకూ పాత్రుడయ్యేవారు. కరేమ్నగర్ ఎస్.ఆర్.ఆర్. డిగ్రీ కాలేజీ లో 1960 ప్రాంతంలో లైబ్రేరియన్ గా పనిచేసిన శ్రీ శ్రీరంగా రావు గారు ఇటీవల నాతో మాట్లాడుతూ మీ తాతయ్య ఎంత అందగాడనుకున్నావు కట్టమీద నడుస్తుంటే ఎవరికయినా గౌరవంగా పలకరించాలని పంచేది. నేనూ తన దగ్గర నా చిన్నప్పుడు వైద్యం చేయించుకున్నాను అన్నాడు. అంతేకాదు ప్రైవేట్ గా ఆసుపత్రి తెరిచి ఆయన చేసిన సేవ గురించి దావఖాన్ల అమ్మమ్మ గురించి ఎంతో గొప్పగా చెప్పారు. (అవన్నీ మరెప్పుడయినా పంచుకుంటాను)
నాకయితే ఆర్ద్ర రాత్రి ఆపరాత్రి అనకుండా మందుల పెట్టె పట్టుకుని కాన్పులు చేయడానికి ఆపదలో వున్న వాళ్లకు వైద్యం చేయడానికి వెళ్ళిన ఆయనే గుర్తొస్తాడు. అట్లా వేముల వాడలోనే కాదు చుట్టూ పక్కల అనేక గ్రామాల్లోని ఆపన్నులకు ఆయన అందించిన సేవల్ని ఆయా గ్రామాల ప్రజలు దశాబ్దాలపాటు స్మరించుకున్నారు. చిన్నపిల్లలు మొదలు వృద్ధుల దాకా ఆకాలంలో ఆయన చేతి కషాయం, దగ్గు మందు, దగ్గు పొట్లాలు వాడని వాళ్ళు దాదాపు లేరనే చెప్పాలి.
ఆ మహానుభావుడి యాదిలో ఎన్నో ఎన్నెన్నో జ్ఞాపకాలు, అనుభవాలు అనుభూతులు.
వ్యక్తిగతమయినవి కాకుండా వూరి పరంగా సామాజిక పరంగా నన్ను వెంటాడుతున్న మూడు దృశ్యాల్ని ఇప్పుడు మీతో పంచుకుంటాను.
1) తాతయ్య ఉదయాన్నే లేచి బావి వెనకాల చెట్లకు నీళ్ళు పారించి పిల్లల స్నాన పానాదు లతో గడిపి గ్లాసెడు చాయ్, నోట్లో పాన్ బిగించి తన స్టాండర్డ్ డ్రెస్ లాల్చీ పైజామాలు ధరించి ఆసుపత్రికి బయలు దేరేవాడు. అప్పుడప్పుడు నేనూ వెంట వుండే వాడిని. తాను ఇంటి గడప దాటింది మొదలు ఆయనకు కుడిచేయి దించే అవకాశం వుండేది కాదు. తాతయ్యా నమస్తే, తాతా నమస్తే అంటూ బడి పిల్లలూ ఆడుకునే పిల్లలూ ఆయన్ని పలకరిస్తే అందరికీ ప్రతిగా నవ్వుతూ చేయి ఊపుతూ దగ్గరికి వచ్చిన వాళ్లతో చేతులుకలపదం చేసేవాడు. ఇక పెద్ద వాళ్ళయితే ‘దండాలయ్యా’, నమస్తే డాక్టర్ సాబ్, అయ్యా దండం పెడ్తున్నా అనేవాళ్ళు ఇంకొందరు, అందరికీ బదులిస్తూ అందరినీ పలకరిస్తూ తాతయ్య ఆసుపతికి చేరే సరికి ఎంతో సమయం పట్టేది. నిజంగా ఒక మనిషి అంతమంది ఆదరణను ప్రేమని పొందడం అపురూపమం. ఆ దృశ్యం ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే వుంది. మనిషి కనిపిస్తే ముఖం చాటేసి వెళ్ళే ఈ కాలం లో అది అపురూప దృశ్యమే.
2) ఇక రెండవది రాజ రాజేశ్వరుని ‘సేవ’. ప్రతి దసరాపండుగ రోజు సాయంత్రం వేములవాడ దేవస్థానం ఆధ్వర్యంలో రెండు సేవలు (దేవుని పల్లకీలు) బయలుదేరేవి. శివకేశవుల సేవలు అవి. ఆలయంలో బయలుదేరి జమ్మి చెట్టు నిలబెట్టే స్థలానికి చేరి ఇక అక్కడినుంచి వూరు ఊరంతా అన్ని వీధులూ తిరిగి ఆలయానికి వచ్చేవి. ఆ రెండు సేవలూ డాక్టర్ సుబ్రహ్మణ్యం గారి ఇంటి ముందుకు వచ్చి అక్కడ గౌరవంగా నిలబడేవి. అప్పటికే అమ్మమ్మ తో సహా అనేక మంది మహిళలు హారతులు పట్టుకుని నిలబెడేవారు. మేము పిల్లలమంతా సేవల కిందినుంచి అటూ ఇటూ దూరి పరుగులు తీసే వాళ్ళం. అదొక అద్భ్తమయిన దృశ్యం. దేవుని సేవలు ఒక వ్యక్తి ఇంటి మందు నిలబడడం ఒక అపురూపమయిన విషయం. ఆ ఆనవాయితీ తాతయ్య ఉన్నంత కాలం కొనసాగింది.
౩) ఇక మూడవది తాతయ్య అంతిమ యాత్ర. బహుశా నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని వెంటాడే దృశ్యం అది. అనారోగ్యం తో హైదరాబాద్ ఆసుపత్రిలో తన అంతిమ శ్వాస విడిచిన ఆయన అంతిమ యాత్ర వేములవాడలో మొదలయినప్పుడు వేములవాడ వూరు ఊరంతా దుఖమే. రోదించని వాళ్ళు లేరు. అంతిమ యాత్ర ముగిసే వరకు దేవాలయ ప్రధాన ద్వారం మోసేసారు. ఊరంతా బందు. అంతిమ యాత్ర సాగినంత మేరా ఇళ్ళముందు పిల్లా పెద్దా అంతా తమ ఇంట్లో మనిషి పోయినట్టు రోదిస్తున్న దృశ్యం నా కళ్ళల్లో ఇప్పటికీ మెదుల్తూనే వుంది. ఇదికదా ఒక మనిషికి మహానుభావుడికి ప్రజలు ఇచ్చే నివాళి. గౌరవం.
జయహో తాతయ్యా జయహో డాక్టర్ మంగారి సుబ్రహ్మణ్యం జయహో.
కన్నీళ్ళతో ఇక ఏమీ రాయలేను’
అష్టభాషా ప్రావీణ్యులు కవి – రచయిత మన దేశ పూర్వ ప్రధాని పి.వి.నరసింహారావుగారి శతజయంతి సందర్భంగా వారిని తలచుకుందాం.
మాతృభాష తెలుగు, రాష్ట్ర భాష హిందీ ప్రపంచ భాష ఇంగ్లీష్ లతోబాటు కన్నడం, మరాఠీ, ఉర్దూ, అరబ్బీ, పార్సీ, సంస్కృతం భాషలలో ప్రావీణ్యం సాధించారు. ఫ్రెంచ్, స్పానిష్ భాషలూ నేర్చారు.
గొప్ప వక్త. 14 భాషల్లో మాట్లడగలరు. మితభాషి అని పేరు వచ్చినా సభను రంజింప చేసేటప్పుడు తమ సహజగుణాన్ని అధిగమిస్తారు. ఇది ఒక కళ! కళాత్మక హృదయులకే సాధ్యమయ్యే అద్భతకళ పి.వి.గారి సొంతం!
1921 జూన్ నెలలో జన్మించారు. జూన్ 28న ఇప్పటికి సరిగ్గా వందేళ్ళు! మనం శతజయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాం. 2004 డిసెంబర్ 9న పరమపదించారు. మనకు ఎన్నో ఆదర్శాలను నేర్పి వెళ్ళారు. రాష్ట్ర రాజకీయాల్లోనూ, దేశ రాజకీయాల్లోనూ గణనీయమైన మార్పులను తీసుకువచ్చిన మేధావి! అపర చాణుక్యుడని పేరుగాంచిన రాజకీయ దురంధరుడు. బుద్ధికి బృహస్పతి! కులబలం, ధనబలం లేకున్నా పల్లె నుండి ఢిల్లీవరకు ప్రతిభావంతమైన వ్యక్తిగా కీర్తి సంపాదించారు. మంత్రిగా, ముఖ్యమంత్రిగా, దేశప్రధానిగా అంచెలంచెలుగా ఎదిగారు. కాంగ్రెస్ పార్టీ వారి తొలి, తుది పార్టీ! భారతదేశ రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థలలో ఎన్నో మంచి మార్పులను తీసుకువచ్చి, ఒకానొక సందర్భంలో దేశం ఆర్థిక వ్యవస్థ దివాళా తీసే స్థాయికి చేరుకున్నప్పుడు గొప్ప సంస్కరణలకు బీజం వేసి పునరుజ్జీవం కల్పించారు.
సహస్రఫణ్ అనే పేరుతో విశ్వనాథసత్యనారాయణగారి వేయి పడగలను హిందీలోకి అనువదించారు. ఈ గ్రంథానికి కేంద్రసాహిత్య అకాడమి బహుమతి వచ్చింది. అబలా జీవితం – అనే పేరుతో పన్ లక్షత్ కోన్ ఘతో అనే మరాఠీ పుస్తకాన్ని హరినారాయణ్ ఆప్టే రచనను అనువదించారు. ఇన్ సైడర్ – రచించారు. వీరి ఆత్మకథా రచన . ఇది ‘లోపలి మనిషి’ పెరుతో తెలుగులోకి అనువదించారు. మాగ్నమ్ ఓపస్ Magnam Opus అనదగిన autobiographical novel స్వీయ చరిత్రాత్మక కాల్పనిక కథన పద్ధతిలో ఉన్నట్లు అర్థం అవుతుంది. Strait Forword narrative తో మొదలైన అద్భుత నవల. పీ.వీ.గారు రాజకీయాల్లో రాకుంటే గొప్ప కవి, రచయిత అయ్యేవారు. జ్ఞానపీఠమూ, ఓ నోబుల్ బహుమతి వచ్చి ఉండేవి.
పి.వీ.గారు ప్రఖ్యాత రచయిత్రి జయప్రభగారి కవిత్వాన్ని తెలుగులోంచి ఇంగ్లీషులోకి అనువదించారు.
ఆనాడు పాములపర్తి సదాశివరావుగారితో కలిసి ‘కాకతీయ’ ప్రతికకు సంపాదకత్వం వహించినా వృద్ధాప్యంలో కంప్యూటర్ నేర్చుకుని ఉపయోగించినా పి.వీ.గారి పట్టుదలకు, నిబద్ధతకు నిదర్శనం.
కాళోజీగారు దగ్గరి మిత్రులు. ఈ మిత్రుల ఆత్మీయత సాహితీలోకానికెరుక.
కవివరేణ్యులు వానమామలై వరదాచార్యులకు గండపిండేరం తొడిగిన పీవీ స్వయంగా కవి పండితుడు.
1940 పి.వి.రచించిన గొల్ల రామవ్వ కథ తెలంగాణ జీవన చిత్రాన్ని చిత్రికపట్టి ఆనాటి స్వాతంత్ర్య పోరాటాలకు వెలుగుదివ్వె అయ్యింది.
నీలిరంగు పట్టుచీర, మానావమానాలు వంటి కథలు పి.వీ.గారి ఆదర్శ భావజాలాన్ని పట్టిస్తాయి.
మంగయ్య అదృష్టం, నవలిక వంటిది ద మినిస్టర్ Secret of the ballot, forgotten suitcase the guest, The reshuffle వంటి కథానికలు రచించారు.
దేశభక్తి పివిగారి ఒడనెల్లా ప్రవహించేది కాబట్టే ఓ గొల్లరామప్పలో దేశమాతను దర్శించుకున్నారు. “అవ్వా నీవు సామాన్యురాలవు కావు సాక్షాత్ భారతమాతవే” అనగలిగారు. స్త్రీ పురుషులెవరికైనా శీలం గొప్ప సంపద అని చెప్పిన ‘నీలిరంగు పట్టుచీర’ కథనూ వ్రాయగలిగారు. ఇది మన దేశ సంస్కృతి! ఒక సందర్భం పి.వి.వంటి కవిని రాజకీయవేత్తను చేసుకుని రాజ్యానికి ఇటువంటి వ్యక్తి కావాలి అనుకున్నది. కాలం ఇందుకు తన శక్తిని ధారబోసింది. ఎట్లయితే పి.వి.గారు తమ శక్తి దేశం కోసం ధారబోసారో అట్లే! అవును. మనసుపెట్టి, మంచి మనసుపెట్టి దీక్షగా పి.వి.గారిని పరిశీలిస్తే ఇవన్నీ బోధపడ్తాయి. ఆయన ప్రత్యక్ష ప్రయత్నాలు లేకున్నా కొన్ని విషయాలలో అవినీతి ఆరోపణలు అంటగట్టి, ఎక్కడ మహాశక్తిగా ఇంకా ఎత్తుకెదుగుతాడోనని కుట్రలు పన్ని అంతటి గొప్ప వ్యక్తి నిస్వార్థ సేవలను సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడానికి కారణం ఎవరు అని నిజాయితీగా చర్చించుకోవాలి ఈ సభ్య సమాజం.
భారతీయ ఫిలాసఫీ అంటే, భారతీయ ఫిలాసఫర్స్ అంటే పీవీగారికి ఇష్టం. ప్రపంచంలోనే ఇంత గొప్ప తత్త్వవేత్తలు లేరు. ప్రపంచంలోనే ఇంత గొప్పసంస్కృతి లేదు.
అది 1972 ఆగష్టు 15. స్వాతంత్ర్య రజతోత్సవ సందర్భం. అర్ధరాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రిగా శాసనసభ భవనంలో కవితాత్మక సందేశాన్ని అందించారు పి.వీ.
“నవరసా ర్థ జీవితాల, నవోన్మేష మానసాల
నవ పల్లవ తరుశాఖల రవళించెడు జనాల
నవవిధ భక్తుల, రక్తుల, నవశక్తుల మేళవించి,
నవ నిర్మిత జాతి సంతరించినాడ విప్లవ తపస్వి’ అంటారు.
విప్లవమంటే ఏమిటి? విప్లవమంటే మార్పు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, అధినేతగా తాముచేయదలుచుకున్న సంస్కరణలకు రూపశిల్పి తానే అయిన వారు కవిరాజు పి.వి. కాని కొందరు కుటిలులు ఉంటారు గదా!
“భువి దానవగ్రహమై పోవ రోదసిని మధించి
మానవతా వాహనకై పూనుకున్న రాజ్యేందిర
జయదుందుభి విని ఉత్తేజనము పొందునా పౌరుడు!
మోదమలరని చెర అరలో మూల్గిన భావకిశోరికి
విహారయ స్వేచ్ఛాంతరిక్ష వీధిని లభ్యమవునా?’’ ఎంతటి నిశ్చలత?
ఎంతటి నిర్భీతత్వం. తమ ఆలోచనలకు రూపమిస్తే ఎందరు వ్యతిరేకిస్తారో తెలుసు పి.విగారికి. అయినా ఎంతటి ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలు. అందుకే అంటారు –
“విహంగమున లాకసంపు కొలతలేల?
చిన్న అలకు ఒడ్డు దూరమున్నదన్న చింత ఏల?
దీపము పెనుగాలికి బీతిల్లనేల?
జీవితాత్మకు ఎన్నడు బ్రహ్మము చేరుదునన్న సందియ మ్మదేల?”
అంటారు. ఎంత గొప్ప పోలికలు? తమ నిర్ణయాలకు ఎందరి వ్యతిరేకత ఉన్నా ప్రజాశ్రేయస్సు దృష్ట్యా దేనికీ భయపడవద్దనుకున్నారు.
నేనొక చైతన్మోర్మిని
నిస్తుల ప్రగతి శకలమును
ఇది నా సంతత కర్మ
మరే హక్కులు లేవు నాకు
ఈ నిద్రాణ నిశీధి మహిత జాగృతి పుంజముగ
వెలుగుటయే నా తపస్సు.
వెలిగించుట నా ప్రతిజ్ఞ”.
ఇంతటి ప్రసంగం గతంలో ఎవరూ చేయలేదు! Creating is the act of turning new and imaginative idias into reality. ప్రపంచమే ఒక సృజన. పి.వి.గారి సృజన ఇది!
కొత్త ఆలోచనలను, ఊహలను ఆచరణలోకి అమలు చేయడం. ప్రధానంగా చెప్పాల్సిందేంటంటే ఒక రాజకీయ వేత్తగా ఇంత గొప్ప కవితను రాసారు పి.వి.గారు. అందుకే అంత గొప్ప ప్రతిజ్ఞను చేసినందుకే, ఆచరించినందుకే ముఖ్యమంత్రి పదవికి ఎంతటి నష్టం వాటిల్లిందో ప్రపంచానికి తెలుసు! అయినా చెదరలేదు, బెదరలేదు. దేశమే పి.వీగారిని ప్రధానిగా ఎంచుకున్నది. సాహిత్యకాశానికి ధృవతార! రాజకీయ జ్ఞానాకాశానికీ ధృవతార!
మా నాన్నగారు పెండ్యాల రాఘవరావు గారు ఆనాటి సాయుధ పోరాట వీరుడు. స్వాతంత్ర్య సమరయోధుడు. ప్రథమ సార్వత్రిక ఎన్నికలలో కమ్యూనిస్ట్ నాయకునిగ రెండు MLA , ఒక MP మొత్తం మూడు స్థానాలలో అత్యధిక మెజారిటీ తో గెలిచిన వారు . MP గా ఢిల్లీ లో వరంగల్ ప్రాంతానికి చెందిన తెలంగాణ కేతనాన్ని ఎగురవేసి,ప్రజాసేవ చేసినవారు . పి వీ గారికి గురుతుల్యులు . ఇక మా మామగారు తెలంగాణ కు చెందిన సుప్రసిద్ధ చిత్రకారులు డా౹౹ కొండపల్లి శేషగిరి రావుగారికి కూడా పివి గారు అత్యంత సన్నిహితులు. పివి గారు ప్రత్యేక శ్రద్ధతో పాల్గొన్న పోతన పంచశతి ఉత్సవాలలో పోతన చిత్రాన్ని చిత్రించినందుకు గాను మరియు తెలంగాణ సారస్వత పరిషత్ స్వర్ణోత్సవాలో దేవులపల్లి రామానుజారారావు గారి పోట్రయిట్ చిత్రించినందుకు గానూ పివిగారు శేషగిరిరావు గారిని ఘనంగా సన్మానించారు. ఇవి మహనీయులు పివి గారికి సంబంధించిన మా జ్ఞాపకాల పూబుట్ట లోని కొన్ని పరిమళాలు .
సముద్రమంత గొప్ప వ్యక్తి పి.వి.గారు. అందులో నుండి దోసెడు నీళ్లను హత్తకున్నట్టు ఈ నాలుగు మాటలు. భావితరాలకు స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని గడించిన స్వచ్ఛమైన భారతీయుడైన పి.విగారు ప్రపంచానికే మార్గదర్శులు. మయూఖ పత్రిక వినమ్రంగా అక్షర నివాళులు అర్పిస్తున్నది.
— మయూఖ సంపాదకురాలు



