ఉగ్రవాదం ఓ ఉప్పెన
కవితలు
ఆర్టిపీషియల్ గాలికి అలవాటుపడ్డ దేహాలు
గ్లోబల్ వార్మింగ్ వేడికి
కలుగులోని ఎలుకల్లా
బయటపడతాయి.
‘గో గ్రీన్’ అని
బోదురు కప్పలా అరిచి
సొల్యూషన్ ఏదో దొరికిందనిపించి
పొల్యూషన్ లెవెల్స్ పెంచుకుంటూ
వచ్చిన కార్లలో
తిరిగి బతుకు బావిలోకి వెళ్లిపోయాయి.
*
వైఫైతో వల్లెవాటు వేసుకున్న విశ్వైక జీవాలు
తలుపులు లేని గదికి
తాళం వేసి
ఒంటరిగా గడుపుతాయి.
ఇంటర్నెట్ ఇంటరప్షన్తో
మరో ప్రపంచం ఉన్నదని తెలుసుకొని
భయకంపితులౌతాయి.
తెలియని ఏకాకితనపు కరతాళ ధ్వనులకు
తాళలేక
ఫ్రీక్అవుట్ అవుతాయి.
*
నిలబడ్డ నేలా తల మీది ఆకాశం నీది కానప్పుడే
స్వేచ్ఛ అంటే ఏమిటో తెలుస్తుంది
పీలుస్తున్న గాలీ పలుకుతున్న పదమూ
నీ స్వంతం కానప్పుడే స్వతంత్ర్యం విలువ తెలుస్తుంది
ఏడు దశాబ్దాల క్రితం ఎర్ర కోట మీదే కాదు
ఎన్నో కోట్ల హృదయ మైదానాల్లో ఈ జెండా ఎగిరినపుడు
ఎన్ని దేహాలు రోమాంచితమైనాయో …ఎన్ని రక్త నాళాలు ఉప్పొంగినాయో ….
ఎన్ని యుద్ధాలు ఎన్ని త్యాగాలు ఎన్ని సమర్పణలు ఎన్ని బలిదానాలు ఈ దేశం చూసిందో –
చిన్న మూటల్తో వర్తకానికి వచ్చి మూటలకు మూటలు రత్న రాసులు దోపిడి చేసినవారు
గొంతులు నొక్కి శ్రమను దోచి రాజ్యాలు గెలిచి హక్కులు కబళించి ఆధిపత్యం చెలాయించిన వారు
మూటా ముల్లె సర్దుకుని పోవడానికి ఎన్ని ప్రాణ త్యాగాలు జరిగాయో …ఎలా మరుస్తాం ?
రాజ్య వారసుడు పోయినా ప్రజా స్వేచ్ఛ కోసం ‘ ప్రాణమిస్తా , ఝాన్సీ నివ్వను ‘ అన్న ప్రధమ స్వాతంత్ర్య పోరాట జ్వాలనీ ,
గుండె అక్కడ కాదురా ఇక్కడ కాల్చమంటూ శత్రువు కెదురు నిల్చిన మన్నెం వీరుడినీ ,
‘ఇంక్విలాబ్ జిందాబాద్ ‘ అన్న భగత్ సింహాన్నీ , ‘ స్వాతంత్ర్యం జన్మహక్కు ‘అన్న బాల గంగాధరుణ్ణీ
‘వందే మాతరం ‘ అంటూ నినదించిన వంగ భూమి పుత్రుడు బంకిం చంద్రుడినీ ..
‘రుధిరమివ్వండి. స్వరాజ్యమిస్తా ‘ నన్న ఆజాద్ ఫవుజ్ సుభాష్ బోస్ నీ ఎలా మర్చిపోతాం ?
‘నా దేశ ప్రజలు నిండా బట్టలు కట్టేదాకా నేనూ చొక్కా తొడగనన్న’ ఒక బక్క పలుచని దేహం
ఆచ్ఛాదన లేని ఛాతీ విరుచుకుని ఎముకలు కొరికే చలిలో రౌండ్ టేబుల్ సమావేశానికి
సత్యాహింసలను ఊతకర్రలుగా మార్చి ‘డూ ఆర్ డై ‘ అంటూ నడిచి వెళ్లడం ఎలా మరుస్తాం ?
ఉప్పు పిడికిలిని ఉక్కు పిడికిలిగా మార్చిన శాంతి మాంత్రికుడు
భరత భూమికి స్వేచ్చనూ ప్రపంచానికి అహింసనూ బహుమతిగా ఇచ్చిన బోసి నవ్వుల తాతనూ
‘ఆరాం హరామ్ హై ‘ అంటూ జాతి నిర్మాణానికి నడుం కట్టిన చాచానూ గుర్తు పెట్టుకోకుంటామా ?
ఎందరు త్యాగ ధనులు , చరిత్ర కెక్కని ఘనులు
కారుణ్యం లేని శత్రువుకు చిక్కి కాలాపానీ కారాగారాల్లో మగ్గారు
తమ రక్తంతో జాతి చరిత్రకు ప్రాణం పోశారు
దేశం స్వేచ్ఛా వాయువుల్ని పీల్చటం కోసం
దేహం నుంచి చెమట చుక్కల్ని రాల్చినంత సునాయాసంగా ప్రాణాల్ని వదిలారు
సమర యోధులారా అమర వీరులారా
మీ సమాధులపై వెలుగుతున్నది ఆ కొవ్వొత్తులే కాదు మా హృదయ దీపాలు కూడా
మీ కోసం రాలుతున్నవి ఆ చెట్ల పూలగుత్తులే కాదు మా కన్నీటి చుక్కలు కూడా
మీ కోసం మా శాల్యూట్ లూ జోహార్లూ , వీరగంధాలూ పూల దోసిళ్ళు కూడా
ఏడు దశాబ్దాల క్రిందటే కాదు , జై జవాన్ జై కిసాన్ ఇప్పుడు కూడా !!
పార్వతి:–
పద పదరా! ఏకదంతా! మనపొదరింటికి!
మంగళంపాడిరి నీకు – మనుషులందరు
మరు సంవత్సరమునకు- మళ్ళి రమ్మని!
విఘ్నేశ్వరుడు:-
ఇంటికి పోనమ్మా! నేనిక్కడే ఉంటానమ్మా!
ఇంటింటికి కుడుములు తింటానమ్మా !!
పార్వతి:-
కుడుములు లేవుర! కుమారా! ఇడుములుపాపుటేరా!
నడు నడు కైలాసానికి! పద పద రా ఏకదంతా!
విఘ్నేశ్వరుడు:–
నన్ను మంచిరి కోనేరులలో…
కోశము తడిసేను- కోరుదు సెలవులు!!
విరిగెను నా దంతము- చదువుట వ్రాయుట ఏలా?
పార్వతి:-
చరవాణి లోనే చక చక చదువుము చంటీ!
చదువులకే వేలుపను పదవి ఊడును తండ్రీ !
ఇల్లిల్లూ తిరుగు-తినుట మానుము నాన్నా !
అద్దంలో నీ ముద్దు మోము చూడరా కన్నా!
నడక అసలే లేక పెరగెను !నీ బొజ్జ!
బడికి పోయి చదవరా తండ్రి!
చదువురాకున్నా!గానీ సన్నగా అయ్యేవు !
విఘ్నేశ్వరుడు:–
నేను సన్నంగా అయితే! కవులకు కష్టం!
వికటకవులు హాస్యం లేక కటకట బడేరు !
ఓ బొజ్జ వెంకయ్య! నీ బంటు నేనయ్య అను
నా స్తుతులు స్తోత్రాలు మార్చి రాయాలమ్మ !!
పలుచబొజ్జ గణపయ్య- పాదాలు పట్టే మని;
నేనూ లేఖకుడినే- లేఖకులంటే నాకు ఇష్టమే అమ్మా!
కష్ట పెట్టను కవులను కనికరముతో…
నన్ను నా రీతి గుండగా నిమ్మమ్మా!
కాలు పెట్టను నేను కైలాస మందు !
కుడుములు తింటూ ఉంటానుఇక్కడే!
కర్మ భూమిన నుందు – కరమొప్పగాను !
స్వప్నాలన్ని సత్యాలే
సత్యాలన్ని స్వప్నాలని
నీ చేతలే నిర్ధారిస్తాయి
జీవించడమంటే ఒకరకంగా స్వప్నించడమే.
గొప్పవిషయాలన్నీ సాధారణమైనవే
సాధారణ విషయాలన్నీ గొప్పవని
నీ కళ్ళే చెబుతాయి
సృష్టిలో ప్రధానమైనది దృష్టే.
ముఖ్య వ్యక్తులందరూ మామూలు వ్యక్తులే
మామూలు వ్యక్తులందరూ ముఖ్యులని నీ మనసే చెబుతుంది
కర్మలన్నీ నిర్మలమైనవే.
కాయమంటే గాయాలే
గాయలుంటేనే కాయమని
అణువణువు బోధిస్తుంది
గాయాల కాయంకదా అనుభవమంటే.
బాధపడే క్షణాలన్ని మరచిపోయేవే
మరచిపోయే క్షణాలన్ని బాధలమయమని
నీ బ్రతుకు నేర్పిస్తుంది
ఈ భూమి పై ఇంద్రజాలం చేసేది కాలం ఒక్కటే.
“ఆనందంగా జీవించాలి” అనే వాక్యం
ఎన్ని గ్రంథాల సారమో
ఈ బ్రతుకు ఎన్ని మిలియన్ల పుటల సమూహమో
అంతిమ జీవనపరిణతి వెల్లడయ్యేది ఆఖరు స్మృతినుండే.
రమేశ్ నల్లగొండ
8309452179
అంకెలు మారుతున్నాయి
ఆర్భాటాలు పెరుగుతున్నాయి
అక్షరం విలువ తరిగిపోతున్నది
అమ్మ విలువ కరిగిపోతున్నది
విలువల అంకెలు మారిపోతున్నాయి
అంకెల విలువలు వీగిపోతున్నాయి
మారిన అంకెలు తిరిగి రావని తెలిసిన నా మనసు మలుచుకొమ్మంటున్నది ఆనందమయ
భవిష్యత్తుగా –
అందరికీ ఓ విజ్ఞప్తి !!
ఆశల కిరణాల నిరంతర నిర్విరామ ప్రవహాలనే నువు చూసేది
ఆకాశానికి హద్దులు లేవు
మనసుకి హద్దులు లేవు
కావాలి అనుకునే అన్నీ
సాధించుకునే శక్తి మానవునిది భగవంతుడు ఇచ్చాడనో
నువ్వే తెచ్చుకున్నావనో
సందిగ్ధతల సంగతి అటుంచి
నా మాటలు తూటాలనుకోక వినండి –
కానీ కాలమే దేవుడుఅంటాను నేను
నేనే శక్తిని అంటావు నీవు
కరిగిపోయే కాలం శక్తి
కాలాన్ని సద్వినియోగం చేసుకోవడమే యోగ్యత
సకాల నిర్ణయం
యోగ్యత లక్షణం
కాలం సమస్యా పరిష్కర కర్త
ఇది పెద్దలమాట
ఇదే పెద్ద మూట
కాలమే మనిషిని
నియంత్రించే ఓ శక్తి!
అదే ఈ విశ్వాన్ని నడిపిస్తున్న ఓ అద్భుత శక్తి!
దానిని తెలుసుకున్నావో
ఇక అద్భుతాలు నీవే
అద్భుతానివీ నీవే
శోధించు
సాధించగలవు
సాధించు జీవించగలవు
కాలాన్ని సద్వినియోగం చేసుకో అన్నిట్లో విజయం నీదే
స్వీయ నియంత్రణ నీదైతే
ఓ మనిషీ నీకే సొంతం విజయం
నూతన సంవత్సరాన్ని
నూతనంగా ఆహ్వానిద్దామా !!
— డాక్టర్ లక్కరాజు నిర్మల
రెండు చెవులపై బారజాపుకుని
ముక్కుమీద దర్జాగా కూర్చునే కళ్ళజోడు
నా దృష్టికి ప్రతి సృష్టి.
అలుక్కుపోయిన అక్షరాలను
ఆణిముత్యాల్లా మెరిపిస్తుంది
వాన తెరపిచ్చిన నీలాకాశమంత స్పష్టంగా
ప్రపంచాన్ని చూపిస్తుంది.
ఆలోచిస్తే ఇదొక అద్భుత ఆవిష్కరణే!
నాలుగు దశాబ్దాల ప్రాయంలో
నయనాలకు అనివార్యమైన నెచ్చెలిగా వచ్చి చేరింది
పదాలు, వ్యుత్పత్తుల సంగతేమో గానీ
నాలుగు పదుల వయసులో
మంచు తెరలాంటి మసకచపును ‘చత్వారం’ అంటారు కదా!
పారదర్శకమైన తన గుండెల్లో నుండీ
ఎన్ని క్రోధారుణ దృక్కులు దూసుకెళ్లినా,
తాను గాయపడలేదు.
ఎన్ని ప్రేమామృత శీకరాలు తరలివెళ్ళినా
తాను పులకించలేదు
ఎన్ని ఆవేదనల అశ్రుకిరణాలు ప్రతిఫలించినా
తాను ద్రవించలేదు
ప్రశాంత ఆహ్లాద వీక్షణాలు స్పృశించినా
తాను దరహసించలేదు.
ఈ కళ్ళజోడు
ప్రతి జీవితానుభూతికీ సాక్షిగా ఉన్నా
దేనికీ స్పందించని ‘ఉదాశీన’
ఏ వీక్షణ నేపథ్యాన్నీ నిక్షిప్తం చేసి ఉంచని
నిశ్చల నిర్లిప్త సహచరియైన సులోచన
కానీ, మా నాన్న వదలివెళ్ళిన కళ్ళజోడు
ఆ చల్లని చూపుల్ని
ఇంకా నాపై ప్రసరిస్తూనే ఉంటుంది.
నిత్యజీవన సుగంధ పరిమళాల
నిరంతరాన్వేషకుడను
నిర్దిష్ట జీవన గమనానువర్తుడను
సరళానుదాత్త కాముకుడను
జీవనగమనంలో…
నిత్యసాహితీ చర్చాంకితడనవుతూ
సమాజశ్రేయస్సుకై ఉద్దీప్తతతో
సమకాలీనతలో …
సమ్యక్ చింతనానుశీలనతో
ప్రవహించే జీవనశైలుడను
నేనొక సామాన్యుడను
మధ్యతరగతి మందహాసాన్ని
నలుగురి మధ్యలో
బతుకునీడుస్తున్న వాడిని
అయినా …
ఆధునిక రుగ్మతలకు ఎవరూ
అతీతులు కాదనిపిస్తుంది
దానికి… వయోభేదాలు
ఆర్ధిక మూలాలను పట్టించుకొనకుండా –
నా గమనంలో … అందరూ సమమే
నాకు జాతి, మతాలు లేవు
ఆలింగనము చేసుకోవడమే
ప్రపంచమును అతులాకుతలం చేస్తూ
వణికించడమే నా ధ్యేయం.
కరోనా … కరోనా … ప్రాణాలపై
ఆశలు వదిలేలా చేయడమే…
నా…కరో.. అన్నా! ఏమీ చేయలేని స్థితి
మూతికి, ముక్కుకు మాస్కే గతి
నాజీవన సౌగంధికత ఆవిరవుతున్నది
X. X X
తుమ్ము, దగ్గు, ఆయాసం
క్షణ క్షణం కుంచించుక పోతున్నాను
జీవనపోరాటంలో సతమతం
ఒకపక్క నిర్మానుష్యం
ఎవరూలేని ఏకాకితనం
ఆత్మీయులంటూ మసలిన
నా సమాజం, బంధువులెక్కడ
ఇన్నాళ్ళ నా పారదర్శకమైన గమనం
ఏమైంది? ఎవరికెవరు?
కనీసం పలకరింపుకు
నోచుకోని బతుకైనది.
ఉభయ సాహిత్యాలకోసం
గుమిగూడే వారెక్కడ!
ఆత్మీయతలను ప్రదర్శించే వారేరి…
ఈ నిండు ఏకాకితనములో
నాకొక మనిషి కావాలి
ఏ అరణ్యములోనో…నిర్జీవనప్రాంతం
వనచరాల మధ్య బతకడమే మేలేమో!
సమాజానికి ఉపయోగపడే అవసరాలు
అన్నీ బంద్ అయినట్టు
నా బంధాలు కూడా రద్దయినవి
వాత్సల్యాలూ, ప్రేమలూ లేవు
పలకరించే గళమేది?
అందుకే నాకిపుడు
స్మశానవైరాగ్యం ఆవహించింది
నన్ను నన్నుగా మన్నించే
నాకొక మనిషి కావాలి.
==##==
డా. టి.శ్రీరంగస్వామి
ఎవరు నీవు ఎవరు
నీ ఊపిరి మేమేనా
ఎవరు నీవు ఎవరు నేను
నువ్వంటే ఈ జనం పడి చస్తారెందుకు,
నువు కనబడితే కళ్లకద్దుకుంటారు,
నువు లేక బతుక లేరు ఈ జనం,
నిను అచ్చోత్తిన వారిదే కులము ?
ఇచ్చి పుచ్చు కునే వారిదే కులము,
ఎవరి నెవరు కులము మతము అడుగబోరు,
కులము మతము పట్టింపు లేదు నీకు,
అమీరు గరీబు అనే భేదమే లేదు నీకు,
ఆకలి అయిన వారి ని
ఆపద లో ఆదుకుంటూ ఉంటావు,
నీ కు నచ్చ కుంటే
ఎందరితోనో ఆడుకుంటూ ఉంటావు,
నీ కోసం ఒకరి నొకరు
పొడుచు కొని చస్తుంటే చూస్తూ ఊరుకుంటావు,
నిజాన్ని అబద్ధముగా
అబద్దాన్ని నిజముగా మారుస్తూ ఉంటావు,
బతుకు తెరువు సాగుటకు
నీ కోసం వాళ్ళు కొందరు ఒళ్ళమ్ముకుంటారు
మగాళ్లు కొందరు మనసు అమ్ముకుంటారు
నీ కోసం దేశాలు రాజ్యాలు
తల కిందులుగ మారిపోతూ ఉంటాయి
చివరకు దేవుడు కూడా నీ కోసం
ఓ..వ్యాపారిగా మారి పోతు ఉంటాడు,
నీవు లేని దెక్కడ
ఈ భువి పైన సర్వాంతరి వై పోయావు,
ప్రతి మనిషికి నీవే ఓ తోడు నీడ వయ్యావు,
మరువ జాల నిన్ను ఓ..భారతీయ
“రూపి” మాయా జాలమా,
ఓ..మాయా జాలమా.
********