

– గురిజాల రామశేషయ్య రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ (తెలుగు)ఈ శీర్షిక క్రింద పరిచయం చేయబోతున్న తెలంగాణ ప్రబంధాలు:
1. చిత్ర భారతము- చరిగొండ ధర్మన్న
2. తపతీ సంవరణోపాఖ్యానము- అద్దంకి గంగాధరుడు
3. షట్చక్రవర్తి చరిత్ర – కామినేని మల్లారెడ్డి
4. యయాతి చరిత్రము – పొన్నిగంటి తెలగన్న
5. ముకుంద విలాసము – కాణాదం పెద్దన సోమయాజి
ఇవి ఈ శీర్షిక క్రింద పరిచయం చేయబోతున్న తెలంగాణ పంచ కావ్యాలు అనదగిన ఐదు ప్రబంధాలు
పరిచయ కర్తలు:
1. డా॥ సంగనభట్ల నరసయ్య, రిటైర్డ్ ప్రిన్సిపాల్.
2. డా॥బ్రాహ్మణపల్లి జయరాములు, రిటైర్డ్ ప్రిన్సిపాల్.
3. డా॥ మృదుల నందవరం, అసిస్టెంట్ ప్రొఫెసర్ (తెలుగు)
4. డా॥ సి.హెచ్ . లక్ష్మణ చక్రవర్తి, అసిస్టెంట్ ప్రొఫెసర్ (తెలుగు)
5. డా॥ గండ్ర లక్ష్మణరావు, రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్.
ఈ రచయితల వ్యాసాలు తెలంగాణ ప్రబంధ మాలిక శీర్షిక లో వరుసగా ధారావాహికంగా వస్తాయి
ప్రవేశిక
భారతీయ భాషలలో తెలుగు ప్రాచీన భాషగా గుర్తింపు పొందిన ప్రసిద్ధమైన భాష. అనేకానేక విషయబాహుళ్యము వలన విస్తృతమైన సాహిత్య సంపదగలిగిన మధురమైన భాష. స్వరములు అంటే అచ్చులు .ఇవి నాద మాధుర్యానికి పుట్టినిండ్లు .అ,ఇ,ఉ కారాది స్వరాలతో ఆదిమధ్యాంతము సర్వవిధముల అలరారు మెలపులు గల పదాలతో కూడిన తెలుగు భాష పలుకు తీపికి తేనె పెర. మృదువైన పలుకుబడి పదములతో నవనీత సదృశ ‘రుచి’ర . ఈ కారణాలవల్లనే స్వభాషాభిమానానికి పరాకోటి ప్రాధాన్యతను పాటించే తమిళభాషా కవులలో సుప్రసిద్ధులైన సుబ్రహ్మణ్య భారతి వంటి ప్రామాణికులైన మాన్య సాహిత్యవేత్తలు సైతము “సుందర తెలుగు” అని వక్కాణించినారు. అంతకు’ముందెన్నడో “ఆంధ్రత్వమాంధ్రభాషా చ బహుజన్మ తపః ఫలమ”ని తెలుగును వేనోళ్ళ పొగిడిన అప్పయ్య దీక్షితులకు తెలుగు వారందరు కూడా కృతజ్ఞతాబద్ధులే! సుమారు రెండు వందల సంవత్సరాల కాలం భారతదేశంలో తిష్ఠ వేసిన బ్రిటీష్ , తదితర భాషా పండితులు మన తెలుగు భాషను “ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ “ అని ముచ్చటపడి మెచ్చుకున్నారు. ఇక్కడొక విషయం చింతనీయం -అంతకు ముందు వాళ్ళకు ఇటాలియన్ తెలిసి దానితో మన తెలుగును పోల్చుకొని మెచ్చుకున్నారు . కాని , వాళ్ళు రావడానికి వేల సంవత్సరాలకు ముందే మాధుర్యాన్ని పండించుకొటున్న తెలుగు భాషను ఇటాలియన్ తో పోల్చుకొని ఇటాలియన్ గురించి ” తెలుగు ఆఫ్ ద వెస్ట్”అని మార్చుకొనదగినంత మధురాతి మధుర మృదు మాధ్వీక రసనిష్యంద తుందిలమైన మన తెలుగు నిజంగా ప్రపంచ భాషలలోనే మధురమైన భాష.
ఇక దక్షిణ భారతదేశంలో అక్షీణ యశస్సును పండించుకొని, స్వయంగా కవియై , ఆముక్తమాల్యాది కావ్యరచయితయై, స్వర్ణయుగ కర్తగా పేరుపొందిన శ్రీకృష్ణదేవరాయలు కర్ణాటాది భాషాప్రాంతాలకు ఏలికయై ఉండి కూడా ‘“దేశభాషలందు తెలుగు లెస్స “అని ప్రశంసించటం సర్వజన సువిదితమే! అంతకుముందే శ్రీనాథ మహాకవి ఈ అభిప్రాయాన్నే ప్రకటించిన తీరు కూడా గమనార్హం.
మధ్యయుగాల వైభవమును ప్రతిబింబించిన 16 వ శతాబ్దపు ‘ ప్రబంధ పద్యము ’ పద్యరచనకు పరాకాష్ఠ స్థితి (climax) . ప్రబంధ పద్యం అంటే ప్రబంధం లోని పద్యం. ఇతిహాస,పురాణ , నాటకాది వివిధ ప్రక్రియలకు చెందిన గ్రంథాలన్నీ ప్రబంధ శబ్ద వాచ్యాలే అయినా కావ్యాలకే ప్రబంధము మారు పేరుగా, మరోపేరుగా ధ్రువపడింది. రూఢి అయింది .
వాస్తవానికి “సర్గబంధో మహాకావ్యమ్” అంటూ దండి అనే సంస్కృత లాక్షణికుడు చెప్పిన లక్షణాలే తెలుగు లాక్షణికులైన విన్నకోట పెద్దనాదులు కావ్య ప్రబంధ లక్షణాలుగా స్వీకరించారు.
క్రీ.శ. 16వశతాబ్ధమునందలి కావ్యములను ముఖ్యంగా మనుచరిత్రము ను పురస్కరించుకొని ప్రత్యేకంగా రూఢమైన “ప్రబంధ లక్షణముల”ను ప్రకటించినవారు 20 వ శతాబ్దపు తెలుగు విమర్శకులే కాని ప్రాచీన లాక్షణికులుకారు. ( తెలుగు అకాడమీ పత్రిక ‘తెలుగు’ మే 1995 సంచికలోని ప్రొఫెసర్ జి.వి.సుబ్రహ్మణ్యం గారి ప్రత్యేక వ్యాసం చూడండి.
పైన పేర్కొన్న కేంద్రసాహిత్య అకాడమీ విమర్శ పురస్కార స్వీకర్త గారి మాటలను అనుసరించి పర్యాలోచిస్తే ౼ కేవలం 16 వ శతాబ్దంలో క్రీ.శ. 1522 తదనంతరం శ్రీకృష్ణదేవరాయల కోరికపై అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్ర ను మాత్రమే దృష్టిలో ఉంచుకొని “……మనుచరిత్రమే ప్రబంధ లతకు పూచిన తొలి పువ్వు“ అని తీర్మానించిన మాట వాస్తవమని ఆంధ్రసాహిత్య అభిజ్ఞ పండితవర్గము గుర్తించగలదు. ఈ విధంగా ప్రబంధ లక్షణాలివి అని , తమకు నచ్చిన కావ్యగతాంశాలను కొన్నిటిని ప్రామాణీకరించుకొని , అష్టాదశ వర్ణనలు ప్రధానంగా ఉండే స్వతంత్ర కథోచిత మనోహర పద్యగద్యాలున్న కావ్యాన్నే “ప్రబంధమ”ని నిర్వచించినారు. కాని, మనుచరిత్ర కంటే సుమారు దశాబ్దం పైబడిన కాలం ముందటిదైన , 16 వ శతాబ్దపు ప్రారంభాన ఓరుగల్లు ను పాలించిన చిత్తాపుఖానుని మంత్రియైన పెద్దనామాత్యునికి అంకితమైన చరిగొండ ధర్మన్న కవియొక్క ‘చిత్ర భారతం ‘ ను గుర్తించదలచరైరి.
కాలక్రమానుగుణంగా “చిత్రభారతము” (చరిగొండ ధర్మన్న) క్రీ.శ. 1503-12 మధ్యకాలములోనిది. “మనుచరిత్రము” క్రీ.శ.1522లో భువన’విజయము లో కొలువుండి శ్రీకృష్ణదేవరాయలు అల్లసాని పెద్దనను అడిగి వ్రాయించుకున్న ప్రబంధము. ఈ విధంగా కాల సన్నివేశాలను పోల్చిచూసినట్లైతే “చిత్రభారతము”తొలి తెలుగు ప్రబంధమగుట వాస్తవము.న్యాయము. ఈ ప్రామాణిక , చారిత్రక శాసనాధారాలుగల విషయాలను 2013 లో తెలుగు విశ్వవిద్యాలయంలో విజిటింగ్ ప్రొఫెసర్ గా పనిచేసిన డా॥సంగనభట్ల నరసయ్య గారు : ఉపకులపతి డా॥ ఎల్లూరి శివారెడ్డిగారి కోరికమేరకు పరిష్కరించి, విపులమైన పీఠికను చేర్చి వెలువరింప’చేసినారు.
ప్రస్తుతము 2014 నుండి తెలుగు భాషకు చెందిన రాష్ట్రాలు రెండు . ఒకటి తెలంగాణ , రెండు ఆంధ్రప్రదేశ్. తెలంగాణ ఆవిర్భవించిన తరువాత 2017 డిసెంబరు నెలలో రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన నిర్వహించుటకు సంకల్పించిరి. అంతకు కొద్ది నెలల ముందుగా డా॥నందిని సిధారెడ్డిగారు తొలి అధ్యక్షులుగా “తెలంగాణ సాహిత్య అకాడమీ” ప్రారంభించబడినది. ఈ క్రమంలో ప్రపంచ తెలుగుమహాసభలు డా౹౹నందిని సిధారెడ్డి గారి అధ్వర్యంలోనే మూడు రోజులు వివిధ ప్రసిద్ధ సాహితీవేత్తల పేరిట ఏర్పాటు చేయబడిన వేదికలపై నిర్వహింపబడినవి. అందులో భాగంగ “తెలంగాణ ప్రబంధాలు” శీర్షికన గతంలో ప్రచుర పఠన పాఠన పరంగా విస్తృత ప్రచారం లోకి రాని ప్రబంధములకు చెందిన ప్రత్యేక, విశిష్ట లక్షణములను గురించి నాకు : గురిజాల రామశేషయ్య కు ప్రసంగించుటకు అవకాశము లభించినది. ప్రముఖులైన తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ పండితుల సమక్షంలో తెలంగాణ ప్రక్రియా ప్రాదుర్భావ వికాస విశేషాంశములు పునర్మూల్యాంకన గణనం లోనికి రావలెనని నివేదింపబడినది . ఆ క్రమంలోనే నేను తదుపరి సంవత్సరములలో తెలంగాణ సాహితీ వేత్తలను సంప్రదించి ఒక్కొక్కరికి ఒక్కో ప్రబంధం చొప్పున అప్పగించి కవిపరిచయము–స్థల కాలాది’విశేష–కథాసంగ్రహ–ప్రబంధ నిర్మాణ విశేషాదిక పద్య’శిల్ప వైభవ విశేషములను వివరిస్తూ విషయవిస్తృతి గల వ్యాసములను వ్రాసి ఇవ్వవలసినదిగా కోరితిని .
కోరినవెంటనే సమ్మతించి ఆయా ప్రబంధములను కూలంకషముగా అధ్యయనము చేసి తత్ ప్రబంధ సంబంధిత చర్చనీయాంశాలకు చెందిన వివిధ సాహిత్య చరిత్రాది గ్రంథములను సంప్రదించి రచించి విద్వన్మిత్రులు వ్యాసములను పంపినారు . అయితే ఇంతలోనే వచ్చిపడిన కరోనా గండ సమయములో ప్రచురణ -ఆవిష్కరణాదులకు చెందిన సమయసందర్భ అవకాశాలు కుంటు పడుటచే ఏదైన పత్రిక ద్వారా మొదటి విడతగా ఈ ఐదు వ్యాసాలను వెలువరించ దలిచితిని. ఇంతలో దైవికముగా అమెరికాలో తమ పిల్లల దగ్గర ఉన్న ప్రసిద్ధ తెలంగాణ స్త్రీవాద రచయిత్రి,కవయిత్రి, ఒద్దిరాజు సోదరులపై విశేష శ్రమకోర్చి పరిశోధన చేసిన విద్వాంసురాలు డా॥ కొండపల్లి నీహారిణి ఒక రోజు ఫోన్ ద్వారా సంభాషిస్తూ , తాను ఒక ద్వైమాసిక అంతర్జాల పత్రికను ప్లవ ఉగాది నుండి ప్రథమ సంచికను వసంత సంచికగా ప్రకటించ’దలచినానని చెప్తూ , మీరు ఏదైనా ఒక ప్రత్యేక అంశానికి చెందిన తెలంగాణ సాహిత్య శీర్షికను నిర్వహింపవలెనని కోరినారు. వెదుకబోయిన రత్నము చేతికి దొరికినట్లు భావించి : వెంటనే నేను సేకరించిన తెలంగాణ ప్రబంధాలకు చెందిన విషయ విస్తృతిగల వ్యాసములను తమ ‘ మయూఖ ’ అంతర్జాల పత్రికలో ధారావాహికముగా ప్రచురించుకొన’వచ్చునని చెప్పినాను. అందుకు సంపాదకులు డాక్టర్ నీహారిణిగారు అంగీకారము తెలిపినారు .
తెలంగాణ ప్రబంధాలు శీర్షికతో తొలివిడతగా _తెలంగాణ పంచకావ్యాలు_ అనదగిన తెలంగాణ సాహిత్య వికాసరూపాలనదగిన ఐదు ప్రబంధాల పరిచయమాలికను సహృదయులకు అందించగలుగుతున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను.
ఈ పరిచయ మాలికను తమ మయూఖ తెలంగాణ సాహిత్య ద్వైమాసిక అంతర్జాల పత్రిక లో ప్రచురించుకొనుటకు అంగీకరించిన మయూఖ సంపాదకులకు తదితర నిర్వాహక కుటుంబ సభ్యులకు : హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జయంతి తే సుకృతినో రససిద్ధాః కవీశ్వరాః
గురిజాల రామశేషయ్య రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ తెలుగు హైదరాబాద్ +91 70326 79471
సిహెచ్. లక్ష్మణచక్రవర్తి: పరిచయం
డా|| సిహెచ్. లక్ష్మణచక్రవర్తి గారు తెలంగాణ విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని సాహిత్య విమర్శక వ్యాస రచయితలలో వీరికి కాలక్రమానుశీలన ప్రక్రియా విమర్శకులుగా మంచి స్థానమున్నది. ఇందుకు వీరు తెలంగాణ నుండి తెలుగు సాహిత్య రంగంలో మహావిమర్శకులుగా లబ్ధప్రతిష్ఠులైన కోవెల సంపత్కుమార, కోవెల సుప్రసన్న గారల విమర్శన మార్గదర్శనంలో చేసిన కృషి ఎంతో దోహదకారి యైనదని చెప్పవచ్చును.
లక్ష్మణ చక్రవర్తి గారు తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఉద్యోగంలో ప్రవేశించే కంటే ముందు హైదరాబాదు దోమలగూడలోని సుప్రసిద్ధమైన ఏ.వి.కళాశాలలో 14 సంవత్సరాల కాలం డిగ్రీ, పి.జి. తరగతులకు తెలుగు సాహిత్య పాఠాలు బోధించినారు. ఆ కాలంలో వీరు ఎంతో శ్రమకోర్చి “ఆధునిక సాహిత్య విమర్శరీతులు” (2005) గ్రంథానికి సంపాదకత్వం వహించారు. ఈ గ్రంథం విశ్వవిద్యాలయ స్థాయి విమర్శ గ్రంథాలలో మంచి సంప్రదింపు గ్రంథంగా పేరుపొందింది. ఇదే వరుసలో “ఆధునిక సాహిత్య విమర్శకులు – ప్రస్థానాలు, గ్రంథానికి (2008) కూడా సంపాదకులుగా వ్యవహరించారు. ఈ గమనంలో ప్రత్యేకంగా సంపాదకవర్గంలోని సభ్యులుగా చెప్పుకోదగిన కృషి చేశారు. “తెలుగు సాహిత్య విమర్శ దర్శనం” (2016) విజ్ఞాన సర్వస్వ గ్రంథం తెలుగు విశ్వవిద్యాలయం వారి ప్రచురణగా వెలువడింది.
ఇక వ్యక్తిగతంగా లక్ష్మణరేఖ (2009), కవిత్వానుసంధానం (2012), ప్రతిబింబం (2014), నవ్య సంప్రదాయ సాహిత్యం (2012) వీరి ప్రత్యేక విమర్శ వ్యాసాల సంపుటాలు. తన గురువులు కోవెల సంపత్కుమారాచార్య (2016) గురించి మంచి మోనోగ్రాఫ్ ను రచించారు. ఉన్నత విద్యలో భాగంగా ఎం.ఫిల్ పట్టా కొరకు “పరమ యోగి విలాసం” (2008) పై పిహెచ్.డి. పట్టా కోసం “ప్రాచీన తెలుగు సంకలనాలు” (2018) పై పరిశోధన చేసినారు.
తెలంగాణలోని ప్రసిద్ధ వైష్ణవ కుటుంబానికి చెందిన లక్ష్మణ చక్రవర్తి చిన్నతనంలోనే సంప్రదాయ విద్యలైన ద్రావిడ ఆగమాలను మద్రాలో చదువుకున్నారు. తన తండ్రిగారి వద్ద పాంచరాత్రాగమం అభ్యసించారు. తమిళంలో విశేష ప్రవేశం ఉన్న డా॥ లక్ష్మణ చక్రవర్తి గారు కేంద్ర సాహిత్య అకాడమీ వారి కోరికపై కావలికోట పేరుతో తమిళ నవల కావల్ కోట్టెను తెలుగులోనికి అనువదించారు.
తెలుగు విశ్వవిద్యాలయం వారి సాహిత్య విమర్శ పురస్కారం (2010), కొలకలూరి భాగీరథమ్మ పంచ సాహిత్య విమర్శ పురస్కారం, వరంగల్ “సహృదయ” సాహిత్య విమర్శ పురస్కారం స్వీకరించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా 2019 ఏప్రిల్ లో మహర్షి బాదరాయణ వ్యాస సమ్మాన్ (2016)లో అందుకున్నారు.
శీర్షికను అనుసరించి నిర్దిష్ట క్రమంలో సోపపత్తిక అంశాలతో సాహిత్య వ్యాసాన్ని రూపొందించటంలో లక్ష్మణ చక్రవర్తి శ్రద్ధ మెచ్చుకోదగ్గది. వీరి వ్యాస సారాంశ క్రోడీకరణం ఎన్నదగింది.
తెలంగాణ ప్రబంధాలు : పరిచయ మాలికలో భాగంగా నేను సంకల్పించిన తెలంగాణ కావ్యాలు అనదగిన ఐదు ప్రబంధాలలో “యయాతి చరిత్రము” అచ్చ తెలుగు ప్రబంధాలలో తెలుగు సాహిత్య చరిత్రలో తొలి అచ్చతెలుగు కావ్యము. తెలుగు భాష నన్నయ కాలం నుండి సంస్కృతంతో జతపడి నడుస్తూ మహాకవిత్వ శిల్పాన్ని కైవసం చేసుకున్నా అచ్చ తెలుగుగా అచ్చతెలుగు పలుకుబడి బాసగా తన ఉనికిని ఏమాత్రము కోల్పోలేదు. ప్రొథికి సంస్కృతం-పలుకు నుడికారమునకు తెలుగుదనం తెలుగు భాషకు మెప్పుకొప్పుల నయగారం.
“ప్రబంధం” తెలుగు సాహిత్య ప్రక్రియలలో సుప్రతిష్ఠమైన ఒక ప్రత్యేక ప్రక్రియ. కవితా రామణీయకమునకు వర్ణన, సౌందర్యమునకు పేరెన్నిక పొందిన రమణీయ కమనీయ పద్య శిల్ప రచన తెలుగు ప్రబంధము.
అచ్చతెలుగు భాషలో సైతం వర్ణనా వైదగ్యము పాత్ర చిత్రణ, రస సమున్మీలనాదులెట్లు సమగ్రముగా పరిపోషించబడినవో “యయాతి చరిత్రము”న పొన్నిగంటి తెలగన్న నిరూపించినారు. కనుకనే అచ్చతెలుగు కావ్య ప్రబంధ ప్రక్రియ తదనంతర కాలములో బలముగా నిలదొక్కుకున్నది.
కూచిమంచి తిమ్మకవి వంటి ప్రసిద్ధ కవులు అందిపుచ్చుకున్న ప్రక్రియకు ఆద్యుడైన పొన్నిగంటి తెలుగన్న ధన్యుడు.
నేను కోరిన వెంటనే వ్యాసాన్ని రచించి అందించిన డా|| సిహెచ్. లక్ష్మణ చక్రవర్తి గారి సహృదయతకు ముగ్ధుణ్ణయ్యాను. తొలి ప్రబంధమేది చర్చను “పాలపిట్ట – జూన్”లో సుదీర్ఘవ్యాసంగా ప్రచురించిన లక్ష్మణ చక్రవర్తి విమర్శన పద్ధతి సమకాలీన పండితుల ఆదరాన్ని పొందిన విషయం సాహిత్యవేత్తలకు విదితమే. డా|| లక్ష్మణ చక్రవర్తికి కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.
– గురిజాల రామశేషయ్య
అసోసియేట్ ప్రొఫెసర్ (తెలుగు)
అచ్చ తెలుగు ప్రబంధంయయాతి చరిత్ర
తెలుగు సాహిత్యంలో ప్రాచీన వాఙ్మయం అంతా పరిణామ దృష్టిని ప్రయోగాత్మక దృష్టిని కలిగి ఉంది. ఇది ప్రాచీన సాహిత్యాన్ని గమనించినప్పుడు తెలుస్తుంది . తెలంగాణలో ఈ దృష్టి ఎక్కువ ఉన్నట్లు ఇక్కడ వచ్చిన కావ్య ప్రబంధాలు నిరూపించాయి. ఆ క్రమంలో ప్రబంధ వాఙ్మయంలో అచ్చతెలుగు ప్రయోగాన్ని చేసి తన ప్రత్యేకతను చాటుకున్నాడు పొన్నగంటి తెలగన. అటువంటి యయాతి చరిత్రను పరిచయం చేయడం ఈ వ్యాస లక్ష్యం.
కవి విశేషాలు.
పొన్నగంటి తెలగన్న యయాతి చరిత్ర లో అక్బర్ బాద్షా, మల్కీబ్రాహీం శ్రీరంగ రాయలను పేర్కొన్నాడు. వీళ్లంతా క్రీ.శ. 1550 మొదలు క్రీ.శ. 1605 మధ్య పరిపాలనను చేసినవారు అందువల్ల యయాతి చరిత్ర ప్రబంధం 1574- 1581 మధ్య రచించినట్లు సాహిత్య చరిత్రకారులు నిర్ణయించారు. పొన్నగంటి తెలగన మిగతా కవుల కంటే ఎక్కువగా అవతారికలో కృతిపతి వంశ వర్ణన చేశాడు కానీ తన కుల, గోత్రాల విషయాలను చెప్పుకోలేదు. ఆశ్వాసాంత గద్యలో మాత్రం ‘ శ్రీ మదనగోపాల మంత్ర వర ప్రసాద లబ్ధ సారస్వత సుకవి జనహిత వచోవైభవ భావనా మాత్య తనూభవ సౌజన్య వినయ ధుర్య పొనికంటి వంశ్య తెలగనార్య ప్రణీతంబైన ‘ అని చెప్పుకున్న వాక్యాలను బట్టి బ్రాహ్మణులలో నియోగి వర్గానికి అందులోనూ ఆర్వేల నియోగులకు సంబంధించిన వాడని, వైష్ణవ మతానుయాయి అని పరిశోధకులు భావిస్తున్నారు.
క్రీ.శ. 1574- 81లో మధ్య యయాతి చరిత్ర రచించిన తెలగన జీవించిన కాలాన్ని ఇదమిత్థంగా సాహిత్య చరిత్రకారులు స్పష్టం చేయలేదు. కానీ క్రీ.శ. 1550- 1600 మధ్య జీవించాడని వివరించారు. ఆయన ఎంతకాలం కచ్చితంగా జీవించి ఉన్నాడన్న అంశం స్పష్టంగా నిర్ణయించినట్లు కనిపించదు. పరిశోధకులు వైష్ణవ మత అనుయాయిగా ఆయనను చెప్పటానికి మరింగంటి అప్పన్న తో తెలగనకు ఉన్న సంబంధం కారణంగా భావించవచ్చు.
ఇబ్రహీం కులీ కుతుబ్ షా 1550 – 1580 కు మంత్రిగా ఉన్న అమీనుఖాను పొట్లచెరువు( నేటి పటాన్ చెరువు) రాజధానిగా అనేక మంచి పనులు చేసాడు. కృతిపతి అయిన అమీనుఖాను వంశం కుతుబ్ షాహీ వంశస్థులను మూడు తరాల నుండి కొలుస్తున్నది. ఆయన పొట్లచెరువును రాజధానిగా చేసుకుని పరిపాలించాడు పటాన్ చెరువు సమీపంలో అమీన్ పుర అన్న ప్రాంతం ఉంది. అమీనుఖానుకు అంకితం ఇవ్వడం వల్ల తెలగన ఈ ప్రాంతపు వాడేనని రూఢి అవుతున్నది. యయాతి చరిత్ర లో ‘కూర్మిబ్రోవసత్యచింతామణి పొట్ల చెరువునందు’(1-16 ) అని పేర్కొనడం కూడా కారణమే.
తెలుగు సాహిత్యంలో 15వ శతాబ్దంలోని తెలుగు కవులురచనారీతిలో కొత్త పద్ధతిని అనుసరించారు. తెలంగాణేతర ప్రాంత కవులను పక్కకు పెడితే కొంచెం ప్రయోగ దృష్టి ఈ ప్రాంతంలోనూ ఉన్నదని భావించేందుకు యయాతి చరిత్ర వంటి రచనలు ఉదాహరణలుగా నిలుస్తాయి. “ఇబ్రహీం కులీ కుతుబ్ షా విజయనగరంలో తలదాచుకున్నప్పుడు తెలుగు రాజుల ఆదరాన్ని, తెలుగు వారి వంటకాలను చవిచూసిన వాడు. తెలుగు కవితా గాన మాధుర్యాన్ని గ్రోలిన వాడు. అంకితాల సంప్రదాయాన్ని తెలుసుకున్నవాడు. సంస్కృత పదబంధాల మిశ్రాంధ్రం కొంత కటువుగా తోచి తేటతెనుగున కవిత చెప్తే ఎలా ఉంటుందో వినాలని ఉవ్విళ్ళూరినవాడు” అని ఆరుద్ర అభిప్రాయపడ్డారు. అందుకే అచ్చ తెలుగు కావ్యాలు రచనకు ప్రోత్సాహం ఇచ్చి ఉంటాడు తెలుగుదేశపు సుల్తాన్ ఇబ్రహీం కుతుబ్‌షా ప్రోత్సహించారు. అయితే ఇది భాషా చైతన్య దృష్టితో జరిగిందా లేక ప్రయోగ చైతన్యంతో జరిగిందా అన్నది పరిశీలనాంశమే.
ఛంద: పరంగా ద్విపద కావ్యం, భాషాపరంగా అచ్చతెలుగు కావ్యం కావ్య ప్రక్రియ భేదం కిందికి వస్తాయి. భాష పరంగా తెలుగు సాహిత్యంలో తెలగనకు ముందే పోతన వంటి వారు సంస్కృతము తెలుగు రెండూ ఇష్టమైన వారికి అనుకూలంగా రచన చేస్తున్నారు. భాష పరంగా అటు తద్భవము ఇటు దేశ్యము మధ్య నలుగుతూ మిశ్రాంధ్ర భాషలలో కావ్యాలను రచిస్తున్నారు. పద్యం అభివ్యక్తిలో ప్రౌఢతను పొందింది. అయితే భాషాభిమాన దృష్టితో కాక ప్రయోగ దృష్టితోనే అచ్చ తెలుగు కావ్యాలు వెలువడ్డాయని చెప్పవచ్చు. కేవల కల్పనాకథలు కృత్రిమ రత్నాలని పురాణ కథలను పుట్టురత్నాలని, పుట్టు రత్నాలను కల్పనతో సానబెట్టినవి జాతి రత్నాలని కథా వస్తువు విషయంలో రామరాజభూషణుడు చెప్పిన మాట. కళాపూర్ణోదయం, రాఘవపాండవీయం, ప్రభావతీ ప్రద్యుమ్నము, చరిగొండ ధర్మన్న చిత్ర భారతం, నూతన కవి సూరన ధనాభిరామము వంటివన్నీ ప్రయోగదృష్టితో వెలువడ్డాయి. రాజుల పోషణలో మిగతా కవుల కంటే భిన్నంగా వ్రాయాలన్న పట్టుదల ప్రయోగ బాహుళ్యానికి కారణం అయింది. అచ్చ తెలుగులో అటువంటి ప్రయోగం చేయాలనుకోవటం లో స్వీయ ప్రతిభా పాండిత్య ప్రదర్శన కీర్తి కాంక్ష కారణాలుగా అచ్చ తెలుగు కావ్యాల పై పరిశోధన చేసిన కె.వి. సుందరా చార్యులు భావిస్తున్నారు. అయితే మరింగంటి అప్పన ప్రోత్సాహం కూడా అచ్చతెలుగు కావ్యం ప్రయోగానికి కారణం అయింది.
మున్నెవ్వరు నొడువని యీ
తెన్నిడి కడుమీఱి యచ్చతెనుగుంగబ్బం
బెన్నిక మీఱగ జెప్పిన
నిన్నుం బొగడంగ గలదె నెలతాల్పయినన్ (1- 11).
అచ్చతెనుంగుబద్దె మొక్కటైనను గబ్బములోననుండినన్
హెచ్చనియాడుచుండురదియెన్నుచునేర్పున బొత్తమెల్ల ని
ట్లచ్చతెనుంగునన్నుడువనందుల చందమెఱుంగు వారునిన్
మెచ్చరొ యబ్బురంబనరొ మేలనరో కొనియాడరో నినున్ (1- 12). ఒక అచ్చతెలుగు పద్యం కావ్యం లో ఉన్నా మెచ్చుకుంటారు. గొప్ప అంటూ ఉంటారు సాహిత్య సౌందర్యం తెలిసిన వారు ఆశ్చర్య పడతారని మరింగంటి అప్పన చెప్పటం ఈ కావ్య ప్రక్రియ గౌరవాన్ని చెప్పటంతోబాటు, ప్రక్రియ ప్రయోగాని కారణమయ్యింది.
ఇక్కడ అచ్చతెనుంగుబద్దె మొక్కటైనను గబ్బములోననుండినన్ హెచ్చనియాడుచుండడం అన్నది
జాగ్రత్తగా గమనించవలసిన వాక్యం. సంస్కృతం ప్రౌఢ నిర్మిత పద్యంతో, శ్లేష, ద్వర్థి ప్రబంధాలలో అక్కడక్కడ దేశ్య పదాలు కనిపించడాన్ని సహృదయులు ఆదరిస్తున్నారని తెలుస్తుంది. ఈ ఆదరణకు తగిన ఉదాహరణలు స్పష్టంగా ఏమీ దొరకవు. కానీ ప్రౌఢ కావ్యాలలో అచ్చతెలుగు పద ప్రయోగాలు పద్యాలు కనిపిస్తాయి.
అచ్చతెలుగు ప్రబంధాన్ని రచించడానికి నాటి కవుల ప్రయోగ దృష్టి, ప్రత్యేకత నిలుపుకోవాలన్న కోరిక కారణాలుగా కనిపిస్తే యయాతి చరిత్ర నే ఎన్నుకొవడానికి గల కారణాలు ఏమిటి అని ఆలోచించవలసిన అవసరం ఉన్నది. శ్రీనాథుడు నలదమయంతుల కథ ను శృంగారనైషధం గా, పిల్లలమర్రి పినవీరన శకుంతల కథను శృంగార శాకుంతలంగా అప్పటికే రచించి వాటికి కావ్య ప్రబంధ రూపాలను ఆ కథలకు కల్పించారు. తపతి సంవరణుల కథను అద్దంకి గంగాధరుడు అందించాడు శకుంతల, దమయంతి, తపతి కథలలో ఒక ఇల్లాలికథే ఉంది. శకుంతల దమయంతులు తన పాతివ్రత్య ధర్మం ద్వారా తమ వివాహం చేసుకున్న భర్తలను పొందారు. సంవరణుడు తపస్సు చేసి సూర్యపుత్రిక తపతిని పొందాడు. యయాతి చరిత్రను కావ్యంగానో, ప్రబంధంగానో మలచిన రచన యయాతి చరిత్ర పూర్వం ఒక్కటి కూడా కనిపించదు (ఎక్కడైనా ఉన్నా అది సాహిత్య చరిత్రలో ప్రసిద్ధంగా లేదు). తెలుగు ప్రబంధాలన్నీ గృహస్థాశ్రమ ధర్మాన్ని ప్రధానంగా చర్చించేవి. ప్రతిపాదించేవి. ఒక వ్యక్తి ఇద్దరు ముగ్గురితో సంబంధం కలిగి ఉన్నా, వివాహం చేసుకుని ఉన్నా ఇద్దరి పరస్పర అనురాగం వలన కలిగిన సంతానం వల్లనే వారు (అంటే ఆయా పాత్రలు) చతుర్విధ పురుషార్ధాలు పొందినట్లు గమనించవచ్చు. యయాతి కథలో ఈ సూత్రం ఇమిడి ఉంది. బహుశా తాను ప్రబంధంగా మలచదలచిన ఈ అంశం ఈ కథలో పొన్నగంటి తెలగన గుర్తించి దీనిని ఎన్నుకున్నాడని భావించవచ్చు.
గార్హస్థ్య ధర్మం సతీ పతుల. అద్వైత ప్రణయ సిద్ధికి ఫలరూపం కావాలి. కానీ అహంకారాల అనంత సంఘర్షణలకు రణరంగం కారాదు. ఒకరి లో ఒకరు కరిగి జాలువారుతున్నట్టు ఉండాలి కానీ ఒకరికై ఒకరు జాగరణ చేస్తున్నట్లు ఉండకూడదు. దేవయాని గార్హస్థ్య ధర్మం ఉండకూడని విధంగా ఉంది. అందువల్ల కొడుకులు పుట్టినా ధర్మం క్రమంగా కొడిగట్టడం మొదలయ్యింది. యయాతికి ఆత్మ తృప్తి లేదు. సంసారం వల్ల ఏ అమృతత్వాన్ని కోరుకున్నాడో అది అతనికి లభించలేదు. అతని గార్హస్థ్య ధర్మంలో దేవయాని బడబాగ్నిలా ప్రజ్వలించింది. క్రమంగా వృద్ధి చెందుతున్న మానసిక గార్హస్థ్య ధర్మం యయాతి లో పునరుజ్జీవింప చేసిన శక్తి శర్మిష్ఠ . (ఆంధ్ర మహాభారతం అమృతత్వ సాధనం 141.)
బహుభార్యత్వం ఉన్న నాటి రాజులను దృష్టిలో పెట్టుకొని సమాజం, వ్యవస్థా ధర్మాలు అంగీకరిస్తున్నా గార్హస్థ్య ధర్మ ప్రాధాన్యాన్ని చెప్పడానికి నల దమయంతులు, శకుంతలా దుష్యంతుల కథలు అనుకూలమైనవే అయినా అవి అప్పటికే వ్రాయబడినవి. అప్పటికి రాయబడని ఉపాఖ్యానాన్ని ఎన్నుకోవాలన్న లక్ష్యంతో యయాతి చరిత్రను అచ్చతెలుగు ప్రబంధంగా మలచడానికి పొన్నగంటి తెలగన ప్రయత్నం చేశాడనిపిస్తుంది. మహాభారతంలోని యయాతి కథకు ధార్మికత ధర్మం ప్రధానమైన అంశాలు. తెలగన ఎన్నుకున్న కథకు శృంగార రసాత్మకమైన కల్పన ప్రధానం. అందుకే దేవయాని శర్మిష్ఠలు యయాతిని పెండ్లి చేసుకునేంత వరకే కథను చెప్పి ముగించాడు. శర్మిష్ఠ కు సంతానం కలగటం తో కావ్యాన్ని మంగళాంతంగా ముగించాడు. నాటి కాలంలోని శృంగారరస ప్రాధాన్యం ఈ ముగింపుకు కారణమని చెప్పవచ్చు అదిగాక తనకంటే ముందు రచించబడిన ప్రబంధాలు ఇటువంటి నిర్ణయానికి కారణమై ఉంటాయి.
కథా సంగ్రహం.
ప్రథమాశ్వాసం లో ప్రతిష్ఠానపురం వర్ణన , యయాతి వంశావతరణ, రాజ్యపాలన, ఆటవికులరాక మహారాజు వేటకు వెడలి అరణ్యానికి చేరడం అన్నవి ప్రధానాంశాలు. కృతిపతి వంశ వర్ణనలు పక్కనపెడితే ఇందులో యయాతి వేటకై బయలుదేరి అడవి దగ్గరి పల్లెలో విడిది చేస్తాడు.
ద్వితీయాశ్వాసం లో వేటలో లేడిని వెంబడిస్తూ మంచుమల ప్రాంతంలోని జాబాలి ఆశ్రమానికి ప్రవేశించడం, జాబాలి యయాతికి రామాయణ కథను శ్రీరాముడు జననం వరకు చెబుతాడు. ఈ కథ ఇక్కడ చెప్పడానికి కారణం యయాతిని అట్లా ఒంటరిగా రాకూడదనడానికి చెప్పడం కొర కనిపిస్తుంది. రామజననం ఆ మధ్యలో రావణుడు స్వర్గంపై దండెత్తడం వర్ణించాడు. రావణుడు తన పురాల పై దండయాత్ర చేయడం వలన దేవతలు విష్ణువును దర్శించడానికి వెళ్ళడం ఈ ఆశ్వాసంలో వర్ణించాడు.
తృతీయాశ్వాసంలో శ్రీరాముడు విశ్వామిత్రుడి వెంట వెళ్ళినది మొదలుకొని రావణుడిని చంపి అయోధ్యకు వచ్చి పట్టాభిషేకం చేసుకునేంత వరకు చెప్పాడు. యయాతి జాబాలి దగ్గర సెలవు తీసుకుని దప్పికతో ఒక బావి దగ్గరికి వెళ్లి బావిలో పడి ఉన్న దేవయానిని చూసి ఆమెను పైకి తీసుకుని వస్తాడు. బావిలో ఎలా పడ్డావని దేవయానిని అడుగుతాడు. దేవయానిని వెతుకుతూ అక్కడికి వచ్చిన ఘూర్ణిక యయాతి కి శర్మిష్ఠ కథ చెబుతుంది. అక్కడ చెలులంతా జల క్రీడలు ఆడుతుండగా పారు నీటిలో బట్టలు నగలు కలిసిపోతాయి. శర్మిష్ట అది గుర్తించలేక దేవయాని చీర కట్టుకుంటుంది. వారి మధ్య జరిగిన ఘర్షణలో దేవయానిపై కోపం తెచ్చుకొని ఆమెను బావిలోకి తోసి వెళ్ళిపోతుంది శర్మిష్ఠ. అప్పుడే అక్కడికి వచ్చిన శుక్రుడు తన బిడ్డ దేవయానిని ఓదార్చి శాంతించమని చెబుతాడు. ఇంతలో వృషపర్వుడు వచ్చి శుక్రుడిని బతిమాలి శర్మిష్ఠ ను దేవయాని కోరికమేరకు దాసిగా ఇస్తాడు. ఇక్కడ వృషపర్వుడికి శుక్రుడు కచుని కథను చెబుతాడు. ఈ ఆశ్వాసంలో తెలగన ఘూర్ణికతో శర్మిష్ఠ కథను, శుక్రుడితో కచుని కథను చెప్పించడం ప్రబంధ ఇతివృత్తంలో పఠనాసక్తిని పెంచింది.
వసంత ఋతువు చెలుల వన విహారంతో ప్రారంభమైన చతుర్ధాశ్వాసం లో యయాతి శర్మిష్ఠను చూడటం దేవయానిని పెళ్లి చేసుకోవటం ప్రధానమైన అంశాలు. వన విహారం చేస్తూ వచ్చి శర్మిష్ఠను చూసిన యయాతి ఆమె సౌందర్యానికి ముగ్ధుడవుతాడు. దేవయానిని వివాహమాడతాడు వివాహ వర్ణన విపులంగా చేసి ఈ ఆశ్వాసాల ముగించాడు తెలగన.
చెలికత్తెలు దేవయానిని సింగారించడంతో ప్రారంభమయ్యే పంచమాశ్వాసంలో యయాతి దేవయానుల సంభోగ శృంగారం, దేవయానికి సంతానం కలగడం వర్ణించాడు. ప్రమదవనంలో యయాతి శర్మిష్ఠను చూసి అక్కడ ఆమెను గాంధర్వ వివాహం చేసుకుని అంతఃపురానికి తీసుకుని వస్తాడు. ఆమెకు ద్రుహ్యుడు, అనువు పూరుడు అనే ముగ్గురు, దేవయానికి యదువు తుర్వసుడు అనే ఇద్దరు సంతానంగా కలుగుతారు. వారిని పొంది దేశ పాలన చేస్తున్నాడని ప్రబంధాన్ని ముగించాడు తెలగన.
మహాకావ్యం సర్గ బంధ లక్షణాలు తెలుగు ప్రబంధాలకు అన్వయించే ప్రయత్నం కొందరు చేసినా ‘ ప్రబంధ లక్షణాలు సంస్కృత గ్రంథాలతో అన్వయించేవి కావు. ఆంధ్ర విమర్శకులు రూపొందించినవే’ (అనుశీలన ప్రబంధ ప్రస్థానంలో వక్రోక్తి జీవితం వ్యాసం పుట 173.) అంటూ తెలుగు ప్రబంధ లక్షణాలు 10 వరకు ఉన్నట్లు తెలుగు విమర్శకులు గుర్తించారని జి.వి. సుబ్రహ్మణ్యం అభిప్రాయపడ్డారు.
యయాతి చరిత్ర లో వర్ణనలు దేశీయతను ప్రౌఢతను రెండిటినీ సంతరించుకున్నాయి. పురాణ వర్ణనలో అట్ట, వప్ర, తోరణ, ప్రసాద, ధ్వజ, పరిఖ, వేశ్యలను వర్ణించాడు. పుర, ఋతు ప్రయాణ, శైల, సాగర, ఆశ్రమ, మంత్ర, రణ, విజయ, వనవిహార, వారికేళి. కన్యాంగ సౌందర్య, చంద్ర సూర్యోదయాలు, పరిణయ, సురత, దౌహృద, సుతజన, వేట, ప్రకృతి వర్ణనలను తెలగన చేశాడు.
ప్రఖ్యాత, ఉత్పాద్య, మిశ్రమాలుగా ఇతివృత్తాన్ని ఆలంకారికులు విభజించారు. ప్రఖ్యాత కథను ఎన్నుకుని అందంగా తీర్చిదిద్దిన ఈ యయాతి కథ వస్త్వైక్యంతో కూడింది. యయాతి కథను పూర్తిగా కాక శర్మిష్ఠకు కలిగిన పుత్రోదయంతో ముగించాడు తెలగన. అలా మంగళాతంగా ముగించాడు. కథ పురవర్ణన తో ప్రారంభించి వేట వర్ణనలతో నడచి యయాతి జాబాలి ఆశ్రమానికి చేరుతాడు. తర్వాత దేవయానిని కాపాడటం, తర్వాత వృషపర్వుడి కూతురు శర్మిష్ఠ, శుక్రుడి కూతురు దేవయాని కథలు తెలుసుకోవటం, శర్మిష్ఠను ఇష్టపడటం, దేవయానితో వివాహం సంతానం కలగడం, శర్మిష్ఠతో వివాహం సంతానం కలగడం వంటి అంశాలను ఒక వరుసలో చెప్పడంవలన వస్త్వైక్యం, ఏకవాక్యత పాటించినట్లు గుర్తించవచ్చు. అందులోనూ ప్రబంధ కథను కథలకు పరమార్థం అయినా గృహస్థాశ్రమ ధర్మాన్ని కేంద్రీకరించికొని వస్తువును ఏకవాక్యతతో నిర్వహించాడు. యయాతి, దేవయాని, శర్మిష్ఠ పాత్రలను కథానుగుణంగా చిత్రించాడు.
అపూర్వ పాత్ర చిత్రణ అనలేము కానీ పాత్ర స్వభావం చిత్రించడంలో సమకాలీనత కనిపిస్తుంది. పాత్రలను కథాసూత్రానికనుగుణంగా పాత్రల స్వభావాన్ని చిత్రించాడు తెలగన.
శృంగారరస ప్రాధాన్యం ప్రబంధాలలో ఉండే ఒక ప్రధాన లక్షణం . శృంగారరసాభాసమూ, శృంగార రస ప్రాధాన్యంతో కూడినదే. యయాతి కథను శృంగార రస ప్రాధాన్యంతోనే నిర్వహించాడు. యయాతి దేవయానుల మధ్య శృంగారంతో పాటు శృంగారాభాసమూ కనిపిస్తుంది.
ప్రబంధాలలోని కథలు సాధారణంగా ఇతిహాస పురాణాల నుండి గ్రహించేవిగా ఉంటాయి. పురాణాలు ప్రబంధాలు కథలకు బ్లూప్రింట్ వంటివి వాటిని స్వతంత్ర రచనలు నిర్వహించినట్లు నిర్వహించాలి. యయాతి చరిత్రలో వర్ణనలలో కథానిర్వహణ పాత్రల చిత్రణ దేశీయతలను పాటించి స్వతంత్ర రచనగా నిర్వహించాడు.
నాటకీయతను పాటించడం ప్రబంధాలలో కనిపించే మరో లక్షణం. పంచ సంధులను పాటిస్తూ రసానునుగుణంగా కథను నిర్వహించడంలో, కొన్ని సన్నివేశాలను రంగాలుగా నిర్వహించడంలో పాత్రల ఆంగిక వాచిక సాత్త్విక అభినయాలలో ముఖ్యంగా పంచమాశ్వాసంలో నాటకీయతను పాటిస్తూ యయాతి చరిత్ర రచన కొనసాగింది. మూడవ ఆశ్వాసంలో యయాతి దేవయానిని కాపాడడం కచ దేవయాని కథలు, శర్మిష్ఠ కథ తెలియడం గర్భసంధి గా కనిపిస్తుంది.
జాతి వార్తా చమత్కారాలు ప్రబంధ కవులు తమ కంటే ముందున్న ఉద్యోగం నుంచి తెచ్చుకున్న గుణమని జి.వి. సుబ్రహ్మణ్యం అభిప్రాయపడ్డారు. జాతి వార్తా చమత్కారం అంటే తాము జీవిస్తున్న కాలంనాటి వాస్తవికతను స్వీకరించడం తమ నేటివిటీని చిత్రించటం. వాస్తవ ప్రతిబింబము జాతి అయితే వార్త దాని వివరణ. అది చమత్కృతితో వ్యక్తీకరించటం జాతి వార్తా చమత్కారం. ఈ. లక్షణం యయాతి చరిత్ర లోని వర్ణనలలో వివాహ ఆచారాలలో అడుగడుగునా కనిపిస్తుంది ఇందులోని కోట వర్ణన గోల్కొండ కోటను స్పురింప చేస్తే , అమీనుపురము గోల్కొండకు, ప్రతిష్ఠాన పురానికి రూపాంతరముగా కనిపిస్తుంది. అమీనుఖాన్ పాలన యయాతి పాలన వర్ణనలలో చూడవచ్చు. వివాహ ఆచరణలో ఈ జాతి వార్తా చమత్కారాన్ని స్పష్టంగా యయాతి చరిత్ర లో గమనించవచ్చు.
ప్రతీకాత్మకత ప్రబంధాలలో మరో లక్షణంగా తెలుగు విమర్శకులు భావించారు. యయాతి మూలభారత కథలో రెండు యవ్వనాలను అనుభవించిన వాడు. దేవయానం పితృయానం రెండింటిలోనూ సంచరించిన వాడు. తెలగన యయాతి లో ఒక యవ్వనాన్ని అది కూడా పరస్పర అనురాగ రూపమైన ధర్మబద్ధ శృంగారాన్ని వర్ణించాడు. ప్రతీకాత్మకంగా ధర్మబద్ధంగా గృహస్థాశ్రమ ధర్మాన్ని ప్రతిపాదించాడు. దేవయాని అహంకారానికి శర్మిష్ట గార్హస్థ్య ధర్మానికి ప్రతీకగా ఈ ప్రబంధంలో కనిపిస్తుంది.
ఆలంకారిక మైన శైలి ప్రబంధ పద్యానికి వన్నె తెచ్చిందని చాలామంది అభిప్రాయం. రాయప్రోలు సుబ్బారావు ప్రబంధ పద్యాన్ని మొగ్గలు నవ్వి పువ్వులగు పోల్కి అని అభివర్ణించాడు. సంస్కృత సమాస భూయిష్టమైనదే ఆలంకారిక శైలికి అనుకూలము అన్న భావనను దూరం చేసింది యయాతి చరిత్ర.
సీ. బలుమించు తలచించు నలిమించు సిరిబొల్చు , మేచాయ విరుల సంపెంగల జేయ
నెలతీరు బలుమారు లలిగేరు నెమ్మోము, చెలగి తమ్ములనుదమ్ములను జేయ
జగడాల బగడాలనగుడాలు గలమోవి, చెందమ్మి రేకుల జివుడుసేయు
గరముచీకటి గప్పు కప్పు వేనలియొప్పు, తేటుల కొకవింత నీటుసేయ
గీ. నలువజగముల గలిగిన పొలుపుగరచి, యొంచి వెన్నెల కరువులో నించి యలివ
గా దలంచగ బోలు నీకలికి నవుర యనగనటవచ్చునద్ధేవయానిగని 4-53,
సీ. నలచివైచిన జాలనలరు కప్రపుదావి, పొలుపొందు నెమ్మేన బుగులు కొనగ
వేనలి దుఱిమిన విరిసరంబుల సొంపు, లలమి తేటుల నెల్ల నామతింప
దెలివి కట్టాణి ముత్తెముల పేరుల రంగు, కలిమి పాలిండ్ల వెన్నెలలు గాయ
వలపుల చిఱునవ్వు కలయబూజాలుగా, ముద్దుజెక్కుల మీద మొలకలెత్త
గీ. మోముదామరయింపైన మురువుతోడ, జెలువమగు తియ్యదేనియ చేతనమరు
మరునియాఱవ తూపునాబరగు నట్టి, దేవయాని, గనుంగొని ఠీవి మెఱసి 5-3. ఆలంకారిక శైలికి మంచి ఉదాహరణలు.
కుంతకుని వక్రోక్తి సిద్ధాంతం ప్రబంధ ప్రస్థానంలో ప్రధానమైనదిగా భావిస్తారు విమర్శకులు. పొన్నగంటి తెలగన వ్యక్తీకరణలో అచ్చతెలుగు నిలుపుకున్నాడు. వైదగ్ధ్య భంగీ ఫణితిని భాషాపరంగా ముందు ఎన్నుకున్నాడు. తెలగన ప్రబంధ వక్రతను. యయాతి చరిత్ర లో అనుసరించాడు. ఒక రసంలో ఉన్న ఉపాఖ్యానాన్ని దాన్ని మరో రసం లోకి మార్చి నిర్వహించటం ప్రబంధ వక్రతలోని ఒక అంశం. ఇందులో ఏడు రకాలైన భేదాలను వక్రోక్తికారుడైన కుంతకుడు ప్రతిపాదించాడు. ఒక కావ్యంలో ఎన్నో సన్నివేశాలను కవి రూపొందించవచ్చు కానీ వాటిలో దానికి ప్రాణ భూతంగా చిత్రించి మొత్తం కావ్యానికి అది ప్రాణప్రదంగా ఉండేట్లు చేయటం ప్రకరణ వక్రత. కచ దేవయాని వృత్తాంతం తెలగన యయాతి చరిత్రలో తరువాత వస్తుంది. ఇది ప్రబంధ పఠనాసక్తిని పెంచటానికి అనుసరించిన వ్యూహం. దేవయానికి వివాహం చేస్తే కట్టు తప్పిన తనం మొండితనం తొలగిపోతాయని చెప్పే సందర్భంలో ఈ కథను చెప్పాడు. ఇది తెలగన నిర్వహించిన యయాతి కథకు ఆయువు పట్టు. ఇది ప్రకరణ వక్రత. యయాతి కథను శృంగార రసాత్మకంగా నిర్వహించడం లోనూ ప్రబంధ వక్రత కనిపిస్తుంది. ప్రబంధ లక్షణాలుగా భావింపబడుతున్నవాటితో సమన్వితమైన అంశాలు యయాతిచరిత్రలో స్పష్టంగా కనిపిస్తాయి.
అచ్చ తెలుగు పద ప్రయోగ వైచిత్రి.
వివిధ రకాల వైచిత్రులలో భాషాపరమైన వైచిత్రి కూడా ఒకటి. నియమ కవిత్వం పేరుతో ఇందులో రసాస్వాదనకు తగిన వైచిత్రి ఉండదనే ఉద్దేశంతో ఈ చిత్ర గర్భ బంధ అచ్చ తెలుగు కావ్యాలకు తగినంత ఆదరణ లభించలేదు.
తెనుగునకు మారు పేళ్ళిడి
పెంచిన వినకూడదనుచు బిరుదులు బేళ్ళున్
మును వేల్పు భాస వెంబడి
నునిచెద గాదనకు డయ్య యుల్లము లందున్ ( 1-14) అన్న పద్యం అచ్చతెలుగు ప్రయోగంలో ప్రబంధ నిర్మాణం చేస్తున్న కవికి ఉండవలసిన జాగరూకతను తెలుపుతుంది. అంతేకాకుండా తత్సమ కావ్యాన్ని అచ్చతెలుగు ప్రబంధంగా అనురణిస్తున్నప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు చెబుతుంది. ఇది ఒకరకంగా అనువాద సూత్రం, నియమం కూడా. కావ్యం రసాత్మకం గా నిర్వహించవలసినది అందువల్ల ఎక్కువ మంది కవులు ప్రఖ్యాత వస్తువునే ఎన్నుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే తెలిసిన పాత్ర పాఠకుడిని కొంతవరకు కావ్యోన్ముఖుడిని చేస్తుంది. కావ్య గర్భం లోకి ప్రవేశించడానికి అనుకూలమైన స్థితిని నిర్మిస్తుంది. విభావం ఏర్పడి ఉంటుంది. అందువల్ల పాత్రలను అచ్చ తెలుగులోకి మార్చి పేర్కొనడం అనుకూలమైనది కాదని భావించి ఈ నియమాన్ని ఏర్పరచుకున్నాడు. కథలో వచ్చే పాత్రలకు మాత్రమే ఈ నియమం పెట్టుకోవటం ఇక్కడ జాగ్రత్తగా గుర్తించవలసిన విషయం. అందుకు తగిన భాష, జాతీయాలు, సామెతలు, నానుడులు ప్రయోగాల ద్వారా నిర్మించుకున్నాడు.
కావ్యంలో పురాణ ఇతిహాస పాత్రలకు( యయాతి కథకు ప్రత్యక్ష సంబంధం లేనివి) ప్రయోగించిన పేర్లు అచ్చ తెలుగు భాషకు పదజాలానికి చేర్పు వంటిది. శబ్దరత్నాకర కర్త బహుజనపల్లి సీతారామాచార్యులు ఈయనను నాలుగో స్థానంలో కూర్చోబెట్టినా ఇతని రచన ఎన్నో తెలుగు పదాలు నిఘంటువులకు ఆకరంగా నిలిచింది.
లక్ష్మీదేవి – కలిమి పొలతి, పైడినెలత, తమ్మిపూవింటనెలకొన్నదంట.
కృష్ణుడు – కఱిదేవర, కణివేల్పు
బ్రహ్మ – నాలుగుమొగములతడు
పంచముఖ – ఏనుమోముల మోట
తారాధిపతి – చుక్కలరాయుడు
సహస్రాక్షుడు – వేయికన్నుల వేల్పు
విష్ణువు – నుడుగుల చెలిమామ, కలిమితొయ్యలి గేస్తు
రాక్షసగురు – తొలి వేల్పుటయగారు
అగ్నిదేవుని భార్య – సెగఱేనిచాన
యముని భార్య – జముగేస్తురాలు
వరుణుని భార్య – నీటిరాయనిచిల్క
వాయువు భార్య- తెమ్మెర కొమ్మ
కుబేరుని భార్య – ముక్కంటి చెలిలేమ
చంద్రుడు – తొగలరేడు
ఆదిశేషుడు – చిలువల గమికాడు వంటివి యయాతిచరిత్రలో ఎన్నో కనిపిస్తాయి. ఇందులో కొన్ని పూర్వపు కవులలో కనిపిస్తే, కొన్ని పొన్నగంటి తెలగన ప్రయోగాల ద్వారానే వెలుగులోకి వచ్చాయి.
కొడుకులకోట (తల్లి), రక్తసంబంధం నెత్తురు పొత్తు (రక్తసంబంధం), అద్దమరేయి (అర్ధరాత్రి) బయటికెత్తిన దివ్వె (మనసును బయటపెట్టిన దీపం అనడం) వంటి అచ్చతెలుగు పదబంధాలు తెలగన ప్రయోగ వైచిత్రికి ఉదాహరణగా నిలుస్తుంది.
సి.హెచ్.లక్ష్మణ చక్రవర్తి.
అన్నమయ్య తర్వాత ఆతని కుటుంబీకులు పెద తిరుమలాచార్యులు వంటి వాగ్గేయకారులు తమ రచనల ద్వారా ఈ సంప్రదాయాన్ని ముందుకు నడిపించారు. ఈ కాలంలోనే సాహిత్య రంగంలో ప్రబంధాల పంట విరివిగా పండింది. అది క్షేత్రయ్యకు అనుకూలించింది. అందుకే క్షేత్రయ్య కవితలో రకరకాల శబ్దాలంకారాలు కన్పిస్తాయి. పదంలో సన్నివేశ చిత్రీకరణ కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. ఈ ప్రత్యేకత నాటి రసిక జనుల మన్ననలను అందుకొంది.
అన్నమయ్యలో మొగ్గ రూపంలో ఉన్న అభినయ విద్య క్షేత్రయ్యలో సహస్ర దళ పద్మమై వికసించింది. వివిధ కోణాలలో, వివిధ దృక్పథాలలో, వివిధ తీరుల చతుర్విధ అభినయాలకు క్షేత్రయ్య పదాలు అనుకూలంగా ఉంటాయి. నాట్య శాస్త్రాన్ని పూర్తిగా అధ్యయనం చేయని వారు క్షేత్రయ్య పదాల అభినయాన్ని అధ్యయనం చేస్తే చాలు. అన్ని రకాల అభినయాలు పట్టు పడతాయి. క్షేత్రయ్య ప్రతి పదం నృత్య గాన అభినయాలకు నిఘంటువు వంటిది. ఒక్కొక్క పదం ఒక్కొక్క అభినయ వైచిత్రి కల్గి ఉంటుంది. నిజానికి ఈ పదాలను అన్నింటిని గుదిగుచ్చే ఏక సూత్రత లేకపోయినా అంతర్గతమైన కృష్ణ తత్త్వం వలన ఇదొక రస భరిత కావ్యం అనవచ్చును.
అభినయ కళలో శివ తత్త్వం, విష్ణు తత్త్వం అని రెండు రకాలుగా ప్రదర్శిస్తారు. ఈ రెండు తత్వాలను ఒకే పదంలో మిళితం చేసి రచించాడు క్షేత్రయ్య. చూడండి ఈ ఉదాహరణ.
‘చక్కని దయ గలదా యిది నీ జాగా చెవంది లింగా
ఇక్కడికి వచ్చినదేమో హెచ్చు కంచి వరదా!
ఇందున్నావాని యీడ వచ్చితి చెవంది లింగా
అందుకేల యెవరిల్లిదీ యవురా కంచి వరదా!
ఎవ్వడో యీ పడకింటిలో నవ్వేది చెవంది లింగా
మువ్వ గోపాలుడు గాక మరెవ్వరు కంచి వరదా!‘
ఇద్దరు దైవతాలని సంభోదిస్తూ చివరన ఆ ఇద్దరినీ మువ్వ గోపాలునితో సమన్వయించాడు. నృత్యం చేసే నర్తకికి అభినయానికి అపారమైన అవకాశం ఉంటుంది ఇటువంటి రచనలలో.
పలుకు పలుకులో తేనె లొలుకే విధంగా రచనలు చేసిన క్షేత్రయ్య పుట్టుక, బాల్యం చాలా వివాదాస్పదమైన విషయం. ‘శూరుల జన్మంబు, సురుల జన్మంబు నేరుల జన్మంబు నెరుగ నగునే’ అన్నట్లు అతని జన్మ చర్చనీయమే. శ్రీ విస్సా అప్పారావు గారి విశేష పరిశోధన వలన క్షేత్రయ్య జన్మ స్థలం కృష్ణా జిల్లాలోని కూచిపూడి దగ్గర గల మువ్వ గ్రామం అని, 16/17 శతాబ్ది మధ్యకాలంలో జీవించాడని తెలుస్తున్నది. పుట్టుక, బాల్యం మాత్రమే కాకుండా ఈతని పేరు కూడా వివాదాస్పదమే. పలు క్షేత్రాలు తిరిగిన కారణంగా ఈతనికి క్షేత్రయ్య అనే పేరు వచ్చిందని, అసలు పేరు వరదయ్య అనే వాదం కూడా లేకపోలేదు.
మువ్వ పురీ నిలయా, మువ్వ పురీ విభుడైన, మువ్వ పురీ సామి వంటి అనేక పదాలలో క్షేత్రయ్య మువ్వ ను గ్రామవాచిగానే ఉపయోగించాడు. ఈ గ్రామం లోనే శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయమున్నది. ఈ స్వామినే క్షేత్రయ్య మువ్వ గోపాలుడని సంభోదించాడు. పైగా మువ్వ కు కూతవేటు దూరంలో నాట్యానికి నెలవైన కూచిపూడి గ్రామం ఉంది. ఆ నాట్యం చిన్నప్పుడు చూస్తూ పెరిగే అవకాశం ఇతనికి ఉంది కూడా. కాబట్టి నాయికానాయక భేదాలన్నీ అతి సూక్ష్మమైనవి కూడా ఈతని రచనలలో కన్పిస్తాయి. నేటికీ కూడా కూచిపూడి వారు క్షేత్రయ్య పదాభినయంలో నిపుణులు.
నిజానికి క్షేత్రయ్య పదాలు అత్యంత శృంగార భరితమైనవి. ముందు చెప్పుకున్నట్లు అది క్షీణ ప్రబంధ యుగం. ఆ కాలంలో ఎవరు రచనలు చేసినా అది శృంగార మయంగానే ఉండేది. తంజావూరు పాలకుడైన రఘునాథ రాయల ఆస్థానంలో అష్ట దిగ్గజాల వంటి మహిళా కవయిత్రులు ఉండేవారు. వారు రాసినవన్నీ ఈ కోవకు చెందినవే. అటువంటి కాలంలో ఇంకో రసానికి తావు ఉంటుందా.
తాను ఒక మహా కావ్యం రాయక పోయినా తొలి రచన మాత్రం శ్రీకారంతో మొదలు చేశాడు క్షేత్రయ్య. ఈ తొలి రచనలో అందులోని పదాల పొందిక, భావ లాలిత్యం చూడండి.
‘శ్రీ సుతు బారికి నెనోపలేక నిను వేడితే కోపాలా – మువ్వ గోపాలా
ఏ పొద్దు దానింటిలోనే కాపై యుండిన నీ సరస సల్లాపాలా – మువ్వ గోపాలా
చూపుల నన్యుల దేరి చూడని నాతో చేరి కలాపాలా – మువ్వ గోపాలా ..”
ఈ రచనలో గల పద ప్రయోగం గాని, నడక గాని, తాళం గాని తర్వాతి పదాలలో కన్పించవు. దాదాపుగా ప్రతి పాదంలో మువ్వ గోపాలా అంటూ యమక యుక్త ప్రయోగాలున్నాయి.
దీని తర్వాత రాసిన పదాల నడక గాని, పద ప్రయోగాలు గాని స్వభావ రీత్యా పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఈ పదాలన్నీ దాదాపుగా త్రిపుట తాళం లేదా మిశ్ర చాపులో కన్పిస్తాయి. నిజానికి ఈ తాళాలు నృత్యానికి అనుగుణమైనవి. పైగా ఈ పదాలు అతి విలంబితమైన నడక కలవి.
చిన్నప్పుడు అల్లరి చిల్లరిగా తిరుగుతున్న ఈతనిని కృష్ణా తీరంలో జరిగే భజనలు, ఆలయ ప్రాంగణాల్లో అన్నమయ్య పదాలు, సిద్ధేంద్రుల వారి కలాపాలు, నారాయణ తీర్థుల వారి తరంగాలు చేస్తున్న కూచిపూడి నర్తకులు చాలా ఆకర్షించారు. బహుశః వీటి ప్రభావం క్షేత్రయ్యలో చిన్ననాడే బీజప్రాయంగా పడింది. క్రమంగా అది బలపడి, ఒక రూపు సంతరించుకొని యౌవన దశలో సంపూర్ణ వాగ్గేయకారత్వానికి దారి చూపింది. అనేక ప్రదేశాలు తిరిగిన కారణంగా ఈతనికి క్షేత్రయ్య అన్న పేరు స్థిరపడింది. తల్లిదండ్రులు పెట్టిన పేరు వరదయ్య అని శ్రీ విస్సా అప్పారావు గారి పరిశోధన చెబుతున్నది. దివ్య క్షేత్రాలు దర్శించిన వాడు, క్షేత్రజ్ఞానం కలవాడు క్షేత్రజ్ఞుడు అని పిలువ బడు తాడని వేటూరి ఆనంద మూర్తి గారి అభిప్రాయం.
17 వ శతాబ్దపు సాహిత్య రచనలో అవసరానికి మించిన శృంగారం కన్పిస్తుంది. ఇది కేవలం మన తెలుగు సాహిత్యంలో మాత్రమే కాదు. భారతదేశమంతటా ఇదే పరిస్థితి. ఇవే లక్షణాలు క్షేత్రయ్యలోనూ కన్పిస్తాయి. ఆ నాడు రచన చేసిన స్త్రీ పురుషులందరు మితి మీరిన శృంగారాన్ని వర్ణించారు. ఆది నాటి యుగ లక్షణమనుకుంటే క్షేత్రయ్యలో గొప్ప భక్త కవిగా, వాగ్గేయకారుడుగా దర్శనమిస్తాడు. ఇతను భారత శాస్త్ర నిధి. అభినయ విద్యా విశారదుడు. తేట తెలుగు భాష సౌందర్యాన్ని, మాధుర్యాన్ని ఆసాంతం తెలుసుకొని పలికినవాడు. తనకు తెలిసిన భాషా సౌందర్యాన్ని తనదైన భావ సౌందర్యంతో మేళవించి కమ్మని పదాలను ఆలపించాడు. తనదైన ఒక ప్రత్యేక బాణీ ద్వారా పద కవితా చరిత్రలోనే తనకంటూ ఒక విశేష స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. వివిధ కోణాలలో, వివిధ దృక్పథాలలో, వివిధ రీతుల చతుర్విధ అభినయాలని ప్రదర్శించడం కేవలం ఒక్క క్షేత్రయ్య పదాలలో మాత్రమే సాధ్యపడుతుందని స్వానుభవం ద్వారా చెప్పారు శ్రీ నటరాజ రామకృష్ణ గారు.
‘ఆంగికం కావలసిన వారికి ఆంగికం, గానం వినదలచిన వారికి గాన మాధుర్యం, భావ యుక్తంగా పాట వినాలన్న వారికి ఆ తృప్తి, భాష యొక్క, ఆ నాద ధ్వని యొక్క ప్రభావం తరచి తరచి వినాలన్న వారికి సంతృప్తి, పద్యంలోని నాయికా సంపూర్ణ స్వరూపం చూడ గోరిన వారిని ఆ నిరూపణం, సంచార విన్యాసాలు తిలకించ గోరిన వారికి ఆ అనుభూతి, శృంగార రసం లోతులు ఎరుగ దలచిన రసజ్ఞులకు ఆ ఆనందం..’ అంటూ క్షేత్రయ్య సంపూర్ణ స్వరూపాన్ని మన కళ్ళెదుట సాక్షాత్కరింప చేశారు రామకృష్ణ గారు.
క్షేత్రయ్య పదాలను కొన్నింటిని తీసుకొని వచ్చే వ్యాసంలో విశ్లేషణ చేసి, అందులోని విశేషాలను తెలుసుకుందాం.
దైవదత్తమైన ప్రతిభ విషయంలో స్త్రీ పురుషులిద్దరూ సమానమే. అన్నిరంగాల్లో లాగా ఆధ్యాత్మిక రంగంలోను ప్రసిద్ధి గల మహిళా మణులెందరో భారతీయ సమాజంలో కనిపిస్తారు.
వేదమంత్రార్థం తెలిసిన వారిని ద్రష్టలని పిలుస్తారు. అట్టివారిలో ఆత్రేయి, లోపాముద్ర, ఇంద్రాణి, పౌలోమి మొదలైనవారి సరసన నిలబడ గల్గిన విదుషీమణి గార్గి, గార్గి అద్భుతమైన చరిత్ర బృహదారణ్యకోపనిషత్తులో చోటు చేసుకున్నది.
గార్గి వాచక్ను మహర్షి కూతురు. తండ్రి పెంపకంలో ఆమె గొప్ప వక్తగా పేరుగాంచింది. విశిష్టమైన వ్యక్తిగా రాణించింది. ఆశ్రమ వాతావరణంలో పెరడగం వల్ల ఆమెలో ఆధ్యాత్మికానురక్తి ద్విగుణీకృతమైంది. తోటి బ్రహ్మచారిణులతో సంభాషించడం వల్ల వాదపటిమను సంతరించుకున్నది. గార్గి వాదబలానికి తలలూపని వారు లేరు. ఆమె సంవాదశైలికి మునిపల్లెలే కాదు, ఆనాటి రాజస్థానాలు కూడా మురిసిపోయాయి.
జనక చక్రవర్తి ఒకసారి ‘దక్షిణ’మనే పేరుగల మహాయాగాన్ని తలపెట్టినాడు. ఆ యాగానికి దేశంలోని నలుమూలల నుంచి వేదపండితులు వచ్చారు. యాగం ఫలవంతమైంది. కాని ఆ మహా చక్రవర్తికి ఇంకా తృప్తి కలగలేదు. వచ్చిన పండితులలో బ్రహ్మవేత్తలెవరో తెలుసుకోవాలనుకున్నాడు. తానే నిర్ణయిస్తే అది రాజుగారి పక్షపాత దృష్టికి నిదర్శనమవుతుంది. అందుకే ఆయన ఒక ఆలోచన చేశాడు.
తన కొలువు కూటానికి సమీపంలో ఒక వెయ్యి ఆవుల్ని తెప్పించి ఉంచాడు. ఆ గోవుల కొమ్ములకు పదేసి బంగారు నాణాల చొప్పున అలంకరింపబడడం చూపరులకు అద్భుతంగా తోచింది.
జనకుడు సభనొక్కసారి తేరిపార జూశాడు. ఆ సభలో ఆసీనులైనవారు సామాన్యులు కారు. వారిలో అశ్వలుడు, ఆర్తభాగుడు, భుజ్యుడు, ఉశస్త చాక్రాయణుడు, కహోలుడు, విదగ్గుడు, శాకుల్యుడు అందరిని మించి యాజ్ఞవల్క్యుడున్నాడు, విదుషీమణుల్లో గార్గి ఉంది.
రాజు సభాంగణంలో తమ విద్వత్తులో ప్రకాశిస్తున్న పండితులనుద్దేశించి “ఓ పండితులారా! మీరంతా బ్రహ్మజ్ఞులుగా కనిపిస్తున్నారు. ఐతే మీ అందరిలో ఎవరు గొప్పవారో తేల్చే శక్తి నాకు లేదు. కాని మీలో ఎవరు బ్రహ్మవేత్తలో వారికి వెయ్యి గోవులను బహుమానంగా ఇస్తాను. వారీ గోవులను ఏ ఇబ్బంది లేకుండా తమ ఆశ్రమానికి తోలుకొని పోవచ్చు”నని ప్రకటన చేశాడు.
ప్రకటన విననైతే విన్నారుగాని ఆ పండితులెవ్వరూ తాము బ్రహ్మవేత్తలమని చెప్పడానికి ముందుకు రాలేకపోయారు. ఒకరి ముఖం మరొకరు చూసుకుంటున్నారు. అప్పుడు ఆ సభలో వున్న యాజ్ఞవల్క్యుడు తన శిష్యుడైన సామశ్రవుణ్ణి పిలిచి, ఆ వెయ్యి గోవులను తన ఆశ్రమానికి తోలుకొని వెళ్ళవలసిందిగా ఆజ్ఞాపించాడు. అప్పటిదాకా చప్పుడు చేయని పండితులు క్రోధావేశానికి లోనై యాజ్ఞవల్కుణ్ణి తిట్టసాగారు. ఆయన తమకంటె గొప్పవాడా? అని ప్రశ్నించసాగారు.
సభలోని కలకలాన్ని గ్రహించిన జనకుని పురోహితుడు అశ్వలుడనేవాడు సభాసదులనుద్దేశించి శాంతంగా ఉండవలసిందిగా కోరుతూ, యాజ్ఞవల్క్యునితో “మీరు అందరికంటె మించిన పండితులైతే మీకివే వందనాలు! మాకూ గోవుల్ని తోలుకొని పోవాలని ఉంది. కాని మీరాపని మమ్మల్ని కాదని చేశారు. ఐతే మేమడిగే ప్రశ్నలకు సమాధానలు చెప్పినట్లైతే అందుకు మేమేమీ నిరోధించం” అంటూ తాను కొన్ని ప్రశ్నలను సంధించినాడు. యాజ్ఞవల్క్యుడు వాటికి తగిన సమాధానాలిచ్చాడు. ఆ తర్వాత వరుసగా అశ్వలుడు, ఆర్తభాగుడు, భుజ్యుడు, ఉశస్త చాక్రాయణుడు, కహోలుడు మొదలైన వారు ప్రశ్నలు సంధించారు. కాని యాజ్ఞవల్క్యుడు ధీరోదాత్తంగా వారి ప్రశ్నలనే బాణాలను ఎదుర్కొని ఏమాత్రం గాయపడక సమాధానాలిచ్చాడు. అంతేకాదు, “నేను బ్రహ్మవేత్తను. వెయ్యి గోవులను నా ఆశ్రమానికి తోలుకొని పోవడానికి అనుమతి ఇవ్వండి” అని రాజునుద్దేశించి పలికినాడు. రాజు మౌనంగా ఉన్నాడు కాని, అతని పురోహితుడు అశ్వలుడు అడ్డుపడ్డాడు. అంతకుముందే వాదంలో అశ్వలుడు కూడా ఓడిపోయి ఖంగుతిన్నాడు.
పురుష పుంగవులెవ్వరూ యాజ్ఞవల్యుణ్ణి వాదంలో ఓడించలేకపోయారు. ఇక నారీజనంలో విదుషీమణులెవరైనా ఉంటే తప్పక యాజ్ఞవల్యుణ్ణి గెలిచేవారనే మాటలు వినిపించాయి. క్రమంగా అలా మాట్లాడుతున్న వారి చూపులు ఒక విద్వన్మణి మీద వాలాయి. ఆమె ఎవరో కాదు, గార్గి! తపస్సే స్త్రీరూపం దాల్చినట్లుంది. విద్వత్తే ఆకారం పొందినట్లుంది. సాక్షాత్తు వేదమాత ప్రత్యక్షమైనట్లు గోచరిస్తుంది.
మిన్నకుండడం విద్వాంసుల పని కాదని తెలిసిన గార్గి జనక మహారాజుతో, యాజ్ఞవల్క్యుణ్ణి ప్రశ్నించడానికి అనుమతి కోరింది. అలా కోరడంలోనే ఆమె విద్వత్తుతో పాటు ఎంతటి వినయశీలం కలిగిందో తేటతెల్లమవుతుంది.
‘ఇంత గొప్ప పండితులం మేమే యాజ్ఞవల్యున్ని గెలవలేకపోయాం. ఒక స్త్రీ ప్రశ్నలు అడగడమా?’ అని కొందరు పండితులు గుసగుసలుపోయారు. కాని ధర్మప్రభువైన జనకుడు “ఇది విద్వత్సభ. ప్రతిభ, పాండిత్యం ఒకరి సొత్తు కాదు. అవి ఎవరిలోనైనా ఉండవచ్చు. కనుక యాజ్ఞవల్యున్ని ప్రశ్నించడానికి గార్గిని అనుమతిస్తున్నాను” అని పలుకగానే సమస్త నారీలోకంతో పాటుగా గార్గి తన అంతరంగంలో ఎంతో సంతోషపడింది.
మహర్షిని చూసి “ఓ యాజ్ఞవల్క్యా! కాశీవాసియో, విదేహనగరవాసియో, ఎవరైనా ఒక వీరుడు వాడిగల బాణాలతో శత్రువులను ఎదిరించినట్లే నేను మిమ్మల్ని రెండు ప్రశ్నలతో గెలవాలనుకుంటున్నాను” అనగా ఆ మహర్షి అందుకు సరే అన్నాడు.
గార్గి అడిగిన మొదటి ప్రశ్న : “దివికి పైనా, భూమికి క్రిందా, మధ్యనున్న అంతరిక్షంలో ఉన్న దానిపేరేమిటి?”
యాజ్ఞవల్క్యుని సమాధానం : “దివికి పైన, భూమికి క్రింద అంతరిక్ష్యంలోను అంతటా ఉన్నది ఆకాశమే”.
గార్గి రెండవ ప్రశ్న : “ఈ ఆకాశం దేనిలో ఓతప్రోతమై (వ్యాపించి) ఉన్నది?”
యాజ్ఞవల్క్యుని సమాధానం : “ఈ ఆకాశం అక్షర పరబ్రహ్మలో వ్యాపించి ఉన్నది. నాశం లేనిది అక్షరబ్రహ్మం. దానివల్లనే సృష్టి స్థితిలయలు వరుసగా జరుగుతున్నాయి. మూడు కాలాలు, మూడు లోకాలు ఆ అక్షరబ్రహ్మ ఆజ్ఞకు లోబడి నడుచుకుంటాయి. ఐదే అక్షరబ్రహ్మం కనిపించదు. కాని అన్నింటినీ చూస్తుంది. అన్నింటిని వింటుంది” అని సృష్టిరహస్యాన్ని విప్పి చెప్పిన యాజ్ఞవల్క్యుని మాటలకు హర్షించిన గార్గి, అతనిని బ్రహ్మవిదులలో శ్రేష్ఠుడని స్వయంగా ప్రకటించింది, సభ అంతా పులకించి పోయింది.
భారతదేశ చరిత్రలో ఒక మహిళ తన అపారమైన వాదపటిమతో ఒక పురుషుణ్ణి బ్రహ్మవేత్తగా నిరూపించిన ఘట్టం సువర్ణాక్షరాలతో లిఖింపదగింది, నారీలోకానికి గర్వకారణమైంది.
గార్గి, యాజ్ఞవల్క్యుడు పరస్పరం అభినందించుకున్నారు. జనక మహారాజు ఎంతగానో సంతోషించాడు. గార్గిని అందరి హర్షధ్వానాల మధ్య సన్మానించినాడు. ఆ తర్వాతనే జనకుడు యాజ్ఞవల్యుణ్ణి గురువుగా చేసికొని అతనివల్ల బ్రహ్మోపదేశం పొంది మోక్షార్హత సంపాదించినాడు.
– ఆచార్య మసన చెన్నప్ప.
23.10.2021
తెలుగు సాహిత్యంలో ప్రాచీన యుగం నుండి ఆధునిక యుగం వరకూ ఎన్నెన్నో ప్రక్రియలు పుట్టుకొచ్చాయి. ద్విపదలు, శతకాలు, రగడలు, ఉదాహరణలు, యక్షగానాలు, పదకవితలు, నవల, కథానిక, నాటకం, నాటిక, ఏకాంకిక – వంటి ప్రక్రియలు సాహిత్యంలో నిలదొక్కుకుని వాటి సత్తాను నిరూపించుకున్నాయి.
ఉదాహరణ ప్రక్రియ కూడా 12వ శతాబ్దంలో ఆవిర్భవించి, ఆధునిక యుగం వరకూ కూడా గౌరవింపబడుతున్నది.
పుట్టుక, స్వరూపం : ‘హృ’ ధాతువుకు ‘ఉత్’ అను ఉపసర్గ చేరగా ఉదాహరణం ఏర్పడింది. దీనికి దృష్టాంతం, నిదర్శనం – నైఘంటికార్థాలు. మార్గ కవిత్వానికి సంకేతంగా నిలిచే వృత్త పద్యాలతోనూ, దేశి కవిత్వానికి సంకేతంగా నిలిచే కళికోత్కళితలతోనూ ఉదాహరణ ప్రక్రియ రూపుదిద్దుకుంది. అంటే, ఉదాహరణ ప్రక్రియ – మార్గ, దేశి కవిత్వాలను కలిపిన అద్భుత సాహిత్య ప్రక్రియగా గుర్తింపు పొందింది.
ఉదాహరణ ప్రక్రియలో – తెలుగులోని విభక్తి ప్రత్యయాలకు ఆశ్రయం లభించింది. సర్వ విభక్తులనూ క్రమంగా ఉదాహరించడం ఈ ఒక్క ప్రక్రియలోనే జరుగుతుంది. సృష్టిలోని జీవాత్మ, పరమాత్మల సంగమం లాగా, భాషలోని ప్రకృతి ప్రత్యయాల సంగమం అనివార్యంగా జరిగే సాహితీ ప్రక్రియగా ఉదాహరణ ప్రక్రియ సార్థక్యం చెందింది.
వృత్త పద్యాలతో పాటు, కళికోత్కళితలు కూడా చోటు చేసుకోవడం వల్ల – ఈ ఉదాహరణ ప్రక్రియ సంగీత, సాహిత్యాలను మేళవింపు చేసుకున్న ప్రక్రియలకు ఉదాహరణ ప్రాయంగా నిలిచింది.
సంస్కృత ప్రమేయం లేకుండా తెలుగులో ఆవిర్భవించిన స్వతంత్ర ప్రక్రియగా ఉదాహరణం ప్రత్యేకతను సంతరించుకుంది. తెలుగులో తెలియవచ్చినంతగా, మరే భాషల్లో దీనికి సంబంధించిన సమాచారం తెలియకపోవడం వల్ల తెలుగు సాహిత్యానికే పరిమితమైన వినూత్న రచనా ప్రక్రియగా కూడా ‘ఉదాహరణం’ రూపుదిద్దుకుంది.
నేపథ్యం : ప్రాక్తన మానవుడు ప్రకృతిని ప్రేమించాడు. నిరంతర అన్వేషణాసక్తి – ప్రాక్తన మానవుణ్ణి మిగతా జంతు సముదాయం నుండి వేరు చేసింది. ప్రకృతిని క్రమంగా తాను సాధించిన విజయాలకు మూలంగా భావించాడు. ప్రకృతిలో దైవత్వాన్ని చూసాడు. ఆరాధించడం, పూజించడం అలవాటు చేసుకున్నాడు. రకరకాల స్తోత్ర పాఠాలతో స్తుతించాడు. ఈ స్తోత్ర పాఠాలు మనకు ఋగ్వేదంలో ‘కుంతాప సూక్తములు’ అనే పేరుతో కనిపిస్తాయి. ఈ కుంతాప సూక్తములకే ‘నారాశంసులు’ అని కూడా పేరు.
వేద వాఙ్మయం లోని ‘కుంతాప సూక్తములు’, కాలక్రమంలో లౌకిక వాఙ్మయం లోకి ప్రవేశించాయి.
హరివంశ, విష్ణు పురాణాలలో పృథు చక్రవర్తిని స్తుతించిన సందర్భాలున్నాయి. పృథు చక్రవర్తి యజ్ఞయాగాదులు నిర్వహించే క్రమంలో సూతమాగధులు జన్మించినట్లు పురాణాలు చెపుతున్నాయి. సూత మాగధులు పుట్టిన సందర్భాన్ని పురస్కరించుకొని ఋషులు స్తోత్ర పాఠాలు నిర్వహించారు. ఈ స్తోత్ర పాఠాల పరంపర క్రమంగా లౌకిక సాహిత్యంలోనూ నిలదొక్కుకుంది. ప్రభువుల లోకోత్తర చరిత్రను ప్రచారం చేయడానికి ఈ స్తోత్ర పాఠాలు చదువడం క్రమంగా ఒక అలవాటుగా రూపుదిద్దుకుంది. ఈ స్తోత్ర పాఠాలు భారతాది మహా గ్రంథాలలో కూడా స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఆయా దేవతలను, మానవులను స్తుతించే సందర్భాలలో ఈ స్తోత్ర పాఠాలు కావ్యాలలో ప్రవేశించాయి. అంతేకాదు, ఈ స్తోత్ర పాఠాలు ప్రత్యేక కావ్యాలుగా అవతరించాయి. అట్లా, అవతరించిన స్తుతి ప్రధానమైన కావ్యమే ఈ ఉదాహరణం అని చెప్పవచ్చు.
కాళిదాసు తన రఘువంశంలో మొదటిసారిగా ఉదాహరణ శబ్దాన్ని ప్రయోగించాడు. రఘు వంశంలోని నాల్గవ సర్గలో ఈ కింది శ్లోకం ఉంది.
“శరైరుత్సవ సంకేతాన్యకృత్వా విరతోత్సవాన్
జయోదాహరణం బాహ్వోర్గాపయా మాస కిన్నరాన్”
రఘువంశ మహారాజు శరత్కాల ఉత్సవ సంకేతాఖ్య గణాలను ఉత్సవ రహితులుగా నిర్వీర్యం చేశాడు అనగా వారిపైన విజయాన్ని సాధించాడు. ఈ విజయానికి సూచకంగా కిన్నెరులు ఉదాహరణాన్ని గానం చేశారట! కిన్నెరులు గానం చేసిన ఈ ఉదాహరణమే లౌకిక సాహిత్యంలోనూ, సంస్కృత సాహిత్యంలోనూ ప్రవేశించి ఉంటుందని పల్వురు భావిస్తున్నారు. రఘువంశంలోని జయోదహరణాన్ని మల్లినాథసూరి ఇట్లా వ్యాఖ్యానించాడు.
“కిన్నెరాన్బాహ్వోః స్వభుజయోర్జయోదాహరణం
జయాఖ్యాపకం క్షుద్ర ప్రబంధ విశేషంగా పయామాస”
మల్లినాథసూరి వ్యాఖ్యను పురస్కరించుకొని ఉదాహరణం అనగా ఒక కావ్య విశేషమనీ, గానానుకూలమైనదనీ తెలుస్తుంది. మల్లినాథసూరి తెలుగులో ఉదాహరణ స్వరూపం తెలిసినవాడు కాబట్టి ‘జయోదాహరణమ్’ అనే పదాన్ని చూడగానే ‘జయోదాహరణమ్ జయాఖ్యాపకమ్ -క్షుద్ర ప్రబంధ విశేషమ్ గాపయామాస’ అని అనగలిగాడు.
కాళిదాసు విక్రమోర్వశీయం నాటకంలో కూడా ‘ఉదాహరణమ్’ అనే పదాన్ని ప్రయోగించాడు.
తుల్యానురాగ పిశునం లలితార్థ బంధం
పత్రే నివేశిత ముదాహరణం ప్రియాయాః
ఈ శ్లోకానికి వ్యాఖ్యానం రాసిన రంగనాథుడు ఉదాహరణ శబ్దానికి ‘ఉక్తి’ అను అర్థాన్ని చెప్పాడు. రంగనాథుని దృష్టిలో ‘ఉదాహరణం’ అనేది కావ్యం కాదు. ‘ జయోక్తి’ గానే ఉదాహరణ శబ్దాన్ని వ్యాఖ్యానించాడు. అంటే, సంస్కృత వాజ్మయంలో అప్పటికీ ఉదాహరణ ప్రక్రియ లేదు కాబట్టి అట్లా వ్యాఖ్యానించాడని చెప్పుకోవలసి ఉంటుంది. దీనిని బట్టి తెలుగులో ఉదాహరణ ప్రక్రియ స్వతంత్ర ప్రక్రియ అని తెలుస్తుంది. తెలుగు కంటె ముందు సంస్కృతంలో ఉదాహరణ ప్రక్రియ లేదని కూడా తెలుస్తుంది. అనగా తెలుగులో వెలువడిన స్వతంత్ర ప్రక్రియగా ఉదాహరణ ప్రక్రియ పేరు దక్కించుకుంది.
ఉదాహరణం లక్షణాలు :
ఈ రగడలు 9 రకాలుగా చెప్పినా అందులో ముఖ్యమైనవి నాలుగు మాత్రమే. అవి. 1. హయప్రచార రగడ, 2. మధురగతి రగడ, 3. ద్విరదగతి రగడ, 4. హరిణగతి రగడ.
హయప్రచార రగడలో మూడు మాత్రల గణాలు, మధురగతి రగడలో నాలుగు మాత్రల గణాలు. ద్విరదగతి రగడలో ఐదు మాత్రల గణాలు, హరిణగతి రగడలో ఏడు మాత్రల గణాలుంటాయి. ఈ నాల్గింటిలోనూ ప్రతి పాదంలో నాలుగు గణాలే ఉంటాయి. ఈ నాలుగు గణాలను రెట్టింపు చేస్తే వరుసగా 1.తురగ వల్గనం, 2.హరిగతి, 3.జయభద్రం, 4. వృషభగతి – రగడలు ఏర్పడుతాయి. తురగవల్గన రగడను రెట్టింపు చేస్తే విజయమంగళ రగడ ఏర్పడుతుంది.
ఉదాహరణ వాఙ్మయ వికాసం
తెలుగులో ఉదాహరణ ప్రక్రియ పాల్కురికి సోమనాథుడు రచించిన బసవోదాహరణంతో ప్రారంభమైంది. అయితే, నన్నయ మహాభారతంలోని ఆదిపర్వంలో ఉదంకోపాఖ్యాన సందర్భంగా ప్రథమా విభక్త్యంత పద్యాలు కనిపిస్తాయి. ఈ విభక్త్యంత పద్యాలే, తెలుగులో విభక్తులతో కూడిన పద్యాలు రాయడానికి అనగా ఉదాహరణ కావ్యాలు ఆవిర్భవించడానికి మూలకారణమయ్యాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.
“దేవ మనుష్య లోకములఁద్రిమ్మరుచున్ విపుల ప్రతాప సం
భావిత శక్తి శౌర్యులు నపార విషోత్కట కోప విస్ఫుర
త్పావక తాపి తాఖిల విపక్షులునైన మహానుభావులై
రావత కోటి ఘోర ఫణిరాజులు మాకుఁ బ్రసన్నులయ్యెడున్”
– ఇట్లాగే ‘మాకు ప్రసన్నుడయ్యెడున్’ – అను పాదాంతంతో మరి మూడు పద్యాలున్నాయి.
12వ శతాబ్దంలో, వీర శైవమతాన్ని తెలుగు దేశంలో విస్తృతంగా ప్రచారం చేసిన శివకవులలో పాల్కురికి సోమనాథుడు ప్రథముడు. ఆయన లేఖిని నుండి బసవోదాహరణం రావడం, ఒక రకంగా శైవ మత ప్రచారానికి ఇది ఉపయోగపడి వుంటుందని భావించడంలో తప్పులేదు. వీరశైవ మత స్థాపకుడైన బసవేశ్వరుణ్ణి కలియుగ రుద్రుణిగా సాక్షాత్కరింపజేస్తూ ఈ కింది పద్యం చెప్పాడు.
“వసిగొని యెవ్వడేని బసవాయను నీ సుకృతాక్షర త్రయం
బెసగ పఠించెనేని గిరిజేశుని కాతని వక్ష గహ్వరం
బసదృశ్య గేహమన్న యవి యార్యుల వాక్యములట్ల కావునన్
బసవన (బుణ్యమూర్తిఁ దలపంగదె చిత్తమ పాయ కెప్పుడున్”
బసవా! అను సుకృతాక్షర త్రయాన్ని పఠించినంత మాత్రంచేత పరమేశ్వరుడు ఆ భక్తుని ముఖ గహ్వరంలో నివసిస్తాడని చెప్పడంతో బసవేశ్వరునికి పరమేశ్వరత్వాన్ని – ఆపాదించింది ఈ పద్యం.
భాషాపరంగా బసవోదాహరణాన్ని పరిశీలిస్తే చతుర్థి విభక్తి ప్రత్యయంలో ఇపుడున్న కొఱకు, కై- ప్రత్యయాలు కాకుండా, ‘కునై’ రూపం కనబడుతుంది. ఉదాహరణకు ఈ కింది కళికను గమనిద్దాం!
వెండియును నిర్మల ప-విత్ర గోత్రునకు నై
పండిత స్తవనీయ – పాత్ర గాత్రునకు నై
దురిత భంజన కళా – ధుర్య చరితునకు నై
సరవి నిష్ట వ్రతా – శ్చర్య భరితునకు నై
సవిశేష విమలగుణ – జాలలోలునకు నై
శివయోగ సంధాన – శీల పాలునకు నై
……………………………………….
…………………………………………
ఇట్లా సాగిపోతుంది కళిక.
భాషా చరిత్ర పరిణామ క్రమంలో విభక్తి ప్రత్యయాలు ఎట్లా రూపాంతరం చెందాయో తెలుసు కోడానికి, ఉదాహరణ వాజ్మయ ప్రక్రియ చక్కగా పనికి వస్తుందని ఈ ఉదాహరణ ఋజువు చేస్తుంది.
క్రీ.శ. 1320 ప్రాంతంలో రావిపాటి త్రిపురాంతకుడు త్రిపురాంతకోదాహరణాన్ని రచించాడు. శ్రీశైలానికి తూర్పు వాకిలిలో కొలువుదీరిన దేవుడు త్రిపురాంతక దేవుడు. ఆయన మీద రాసిన కావ్యమే త్రిపురాంతకోదాహరణం. త్రిపురాంతకోదాహరణంలో కన్నప్ప, సేనమరాజు, నంబి, భల్లహుడు, చిఱుతొండడు వంటి శివభక్తులు ప్రస్తుతింపబడినారు. ఈ కావ్యంలో శివుని ఉతృష్టతను చాటి చెప్పే అర్ధనారీశ్వరత్వం, గంగాధారణం, దక్షాధ్వర ధ్వంసం, కపాల భిక్షాటనం, త్రిపురాసుర సంహరణం మొ|| పౌరాణిక విషయాలు ప్రస్తావించబడినాయి. వీరశైవం కాకుండా శివాద్వైత మార్గమే ఈ ఉదాహరణ కావ్యంలో ప్రతిపాదించబడింది.
మానవల్లి రామకృష్ణ కవి త్రిపురాంతకోదాహరణాన్ని వెలుగులోకి తీసుకువచ్చాడు. ఈ సందర్భంగా – “దీని శబ్దార్థ మాధుర్యానికి మెచ్చి, ఈ కృతి రత్నం చిన్నదైనప్పటికీ – దీనిని పండితులు కంఠాలంకారంగా స్వీకరిస్తారని” భావించి పరిష్కరించినట్లు వ్యాఖ్యానించాడు.
15వ శతాబ్దంలో సంపూర్ణమైన ఉదాహరణ కావ్యాలు లభించలేదు గాని, ఉదాహరణ కావ్య భేదమైన ‘విద్దళి’ లభించినట్లు నిడుదవోలు వేంకటరావు తెలియబరిచాడు. ఈ కావ్యంలో వృత్త పద్యాలతో పాటు కంద, గీత దేశీయ ఛందస్సులు మిళితమై ఉన్నాయని తెలిపాడు.
16వ శతాబ్దంలో తాళ్ళపాక పెద్ద తిరుమలాచార్యుడు వేంకటేశ్వరోదాహరణాన్ని రచించాడు. ఆయనకు సమకాలీన కాలంలో చిత్రకవి పెద్దన హనుమదోదాహరణం రచించాడు. పెద్ద తిరుమలాచార్యుడు వేంకటేశ్వరోదాహరణంలో సార్వవిభక్తిక పద్యం తర్వాత షష్యంతాలతో కూడిన అంకితాంక పద్యాన్ని రచించాడు. ఇది ఒక విలక్షణత్వంగా నిలిచిందని చెప్పాలి.
ఉత్తర ప్రబంధ యుగంలో ప్రసిద్ధ లాక్షణికుడైన అప్పకవి ఉదాహరణానికి లక్షణాలు చెప్పాడు. దానికి లక్ష్యభూతంగా శ్రీ కృష్ణోదాహరణాన్ని రచించాడు. శ్రీకృష్ణుని లీలావిలాసాలు, శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ ప్రధానేతి వృత్తంగా ఈ కావ్య రచన సాగింది.
దక్షిణాంధ్ర యుగంలో బాలకవి అనంతయ్య రాసిన శేషార్యోదాహరణం ఒక్కటే పరిపూర్ణంగా లభించిన ఉదాహరణ కావ్యం. అంకితాంక పద్యం కందంలో ఉండడం దీని ప్రత్యేకత. కందంలో అంకితాంక పద్యం రాసిన తొలి ఉదాహరణంగా ఈ కావ్యానికి గుర్తింపు లభించింది. అయితే ఈ యుగంలో మరికొన్ని ఉదాహరణ కావ్యాలు లభించాయి. కాని అవి అసంపూర్ణ గ్రంథాలే. ఏనుగు లక్షణ కవి రాసిన విశ్వేశ్వరోదాహరణం, నుదురుపాటి సాంబశివమూర్తి రాసిన రఘునాథీయోదాహరణం – అసంపూర్ణంగా లభించిన ఉదాహరణ కావ్యాలే. మచ్చ వేంకటకవి ముఖలింగేశ్వరోదాహరణం కూడా పరిపూర్ణంగా దొరుకలేదు.
పాల్కురికి సోమనాథుని కాలంలో మొదలైన ఉదాహరణ కావ్య ప్రక్రియ ఆయా కాలాలలో తన అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగింది.
ఆధునిక యుగంలో కూడా ఉదాహరణ కావ్యాలు పుంఖానుపుంఖంగా వెలువడుతున్నాయి. ప్రాచీనకాలంలో వెలువడిన ఉదాహరణల కంటె, ఆధునిక యుగంలో వెలువడుతున్న ఉదాహరణలే అధికం.
ఆధునిక యుగం – వైవిధ్యభరితం
ఆధునిక యుగంలో వెలువడుతున్న ఉదాహరణ కావ్యాలను పరిశీలిస్తే – మనకు వైవిధ్యం అధికంగా గోచరిస్తుంది. సామాజిక శ్రేయస్సు కోసం పాటుపడిన వ్యక్తుల జీవితాలను ఇతివృత్తంగా తీసుకుని అనేక ఉదాహరణలు వచ్చాయి. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన వీరుల త్యాగాలను ప్రశంసిస్తూ ఉదాహరణ కావ్యాలు వచ్చాయి. ప్రాంతీయ వైవిధ్యాలను తొలగించి విశాల భావాలను ప్రచారం చేయడమే పనిగా ఉదాహరణలు వెలువడ్డాయి. ఇట్లా, వ్యక్తుల పరంగా, సమాజపరంగా, దేశపరంగా వివిధ ఉదాహరణ కావ్యాలు పుట్టుకొచ్చాయి.
ఆధునిక యుగంలో మానవుడు యాంత్రిక జీవితానికి అలవాటు పడినాడు. సాహిత్యానికి అధిక సమయాన్ని వెచ్చించే పరిస్థితి లేదు. చాలా తక్కువ సమయంలో పూర్తయ్యే కావ్యాలవైపు పాఠకులు మొగ్గు చూపుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని, చాలా తక్కువ పద్యాలలో పూర్తయ్యే కావ్యాల మీద ఆసక్తి పెరుగుతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఉదాహరణ కావ్యాల మీద ఆసక్తి కనబరచే పరిస్థితులు అధికంగా ఏర్పడుతున్నాయి.
ఆధునిక యుగంలో వెలువడిన ఉదాహరణ కావ్యాలు
– ఇంకా నా దృష్టికి రాని మరిన్ని ఉదాహరణ కావ్యాలు కూడా వెలువడినాయి. వాటిని కూడా సేకరించి రికార్డు చేయాల్సిన అవసరం ఉంది.
ఉదాహరణ కావ్య భేదాలు :
ఉదాహరణ కావ్యాలకు లక్షణాలు చెప్పిన లాక్షణికులు ఉదాహరణ కావ్యభేదాలను కూడా సూచించారు.
విన్నకోట పెద్దన కావ్యాలంకార చూడామణిలో సద్దలి, పద్దలి, విద్దలి, కల్యాణి, ఉత్ఫుల్లకం – అను ఐదు రకాల భేదాలను సూచించాడు.
సద్దలి : సంబోధనా విభక్తి పద్యాల్ని వదలిపెట్టి సప్త విభక్తుల్లో పద్యాలు చెపితే అది సద్దలి.
పద్దలి : సప్త విభక్తుల్లో పద్యాలూ, సంబోధనా విభక్తి పద్యాలు చెపితే అది పద్దలి.
విద్దలి : సంబోధనా విభక్తిని విడిచి విషమ విభక్తుల్లో పద్యాలు చెపితే అది విద్దలి.
కల్యాణి : కేవలం కళికలతో రచించిన కృతికి ‘కల్యాణి’ అని పేరు.
ఉత్ఫుల్లకం : కేవలం ఉత్కళికలతో రచించిన కృతికి ఉత్ఫుల్లకం అని పేరు.
– ఇన్ని భేదాలు చెపుతూనే విన్నకోట పెద్దన ‘ధరనుదాహరణాది భేదములు పెక్కు’ అని కూడా అభిప్రాయపడినాడు. దీంట్లో ఆరుద్ర కొత్త సద్దలి, సంపత్కుమార ఉత్ఫుల్లకం – వంటి ఉదాహరణ కావ్య భేదాలను రచించారు.
మొత్తం మీద ఉదాహరణ కావ్యప్రక్రియ – భిన్న ఇతివృత్తాలతో – అనగా ఆధ్యాత్మిక, వ్యక్తిగత, సామాజిక, భౌగోళిక, ప్రాంతీయ, దేశీయ గత వైవిధ్యభరిత ఇతివృత్తాలతో – తన అస్తిత్వాన్ని చాటుకుంటూ సాహిత్యంలో తన స్థానాన్ని భద్రపరుచుకుంది.
డా|| దాశరథుల నర్సయ్య
విశ్రాంత తెలుగు అధ్యాపకులు
ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల
గజ్వేల్, సిద్దిపేట జిల్లా
9390919100
“ఆరోగ్యానికి అసలైన ఔషధం ఆసనము.”
శరీరానికి ఆసనము, మనసుకు ధ్యానం ఈ రెండింటి మేళవింపు ప్రాణాయామం. ఇది చేయటమే అసలైన యోగం.
అందుకే పెద్దలన్నారు “సర్వరోగాల నివారణకు సంజీవని యోగా.’’
నేటి మానవుడు అభివృద్ధి పేరుతో అవని నుండి ఆకసం దాకా సునాయాసంగా ప్రయాణం చేయగలుగుతున్నాడు గానీ ఆరోగ్యం విషయంలో మాత్రం అవని నుండి పాతాళం వైపుకు ప్రయాణిస్తున్నాడు.
దీనికి కారణం మానసిక వత్తిడి, ఆహారపు అలవాట్లు, ఆర్థికంగా అపరిమితంగా ఎదగాలనుకోవటం, వ్యామోహం, అసంతృప్తి ఇవన్నీ అనారోగ్యానికి కారణం అవుతున్నాయి.
మరి ఒకసారి కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి పొందలేమా?
మానవుడు సాధించలేనిది ఏముంది – కొంచెం శ్రద్ధ వహిస్తే తిరిగి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది.
దాదాపు 80 శాతం రుగ్మతలు మానసికపరమైనవే. ఆహారపు అలవాట్లు, ఆసన మరియు ధ్యానం ద్వారా తిరిగి ఆరోగ్యాన్ని పొందవచ్చు. శరీరాన్ని, మనసును ఏకతాటిపై నడిపించే యోగాను ప్రతిరోజూ క్రమం తప్పకుండా చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.
మనం, మన పెద్దవారిని గమనించినట్లయితే వారు అందరూ ఎటువంటి రుగ్మతలు లేకుండా హాయిగా జీవిస్తున్నారు. వారి కన్నా ముందుతరంవారు నిండు నూరేళ్ళు ఆనందంగా జీవించారు. కానీ ఈనాడు మనకు అన్ని రుగ్మతలే. డాక్టరుని సంప్రదించకుండా, మందు బిళ్ళ వేసుకోకుండా జీవితం గడవటం లేదంటే అతిశయోక్తి కాదు. దీనికి కారణం ఏమిటి?
కారణం ఎక్కడో వెతకాల్సిన అవసరఁ లేదు. మనమే దీనికి కారణం. మన పెద్దవారు రోజంతా శ్రమించినా, సాధారణ భోజనం చేసేవారు. మనం శారీరక శ్రమను మరచిపోయాము. రుచల పేరుతో అవసరానికి మించి అనవసర పదార్తాలను భుజిస్తున్నాము. దీనితో కొత్త కొత్త రుగ్మతలు వస్తున్నాయి.
ముప్ఫై సంవత్సరాలు దాటక ముందే బి.పి, షుగర్, థైరాయిడ్, నడుము నొప్పి, కడుపు ఉబ్బరం, అధిక బరువు ఇలా అనేక రకాల రుగ్మతలు మనల్ని వేధిస్తున్నాయి. ఇంకా కొంతమందికి పుట్టినప్పటి నుండే రుగ్మతలు.
ఇలా ఎంతకాలం? ఇకనైనా మేల్కొందాం. యోగావలన కలిగే ఫలితాలను తెలుసుకొని ఆచరించి, ముందు తరాలవారికి ఆర్థిక నిధిని కాకుండా ఆరోగ్య నిధులను అందిద్దాము.
యోగా ప్రతిరోజూ చేయటం వలన శరీరంలోని మలినాలు తొలిగిపోయి శుద్ధి జరుగుతుంది.
రోజూ ఆసనాలు వేయటం ద్వారా ఎముకలు దృఢంగా, శక్తివంతంగా తయారవుతాయి.
రోగ నిరోధక శక్తి పెరగటంవలన శరీరం వ్యాధులతో సమర్థవంతంగా పోరాడి ఆరోగ్యవంతులుగా చేస్తుంది.
ఇప్పుడు మనం చేసే పనులు ఎక్కువగా శరీరానికి, మనసుకు సంబంధం లేనివే. జిహ్వ చాపల్యం చంపుకోలేక, అనారోగ్యానికి గురిచేసే అనేక ఆహారపదార్థాలు తింటున్నాము. అంతేకాకుండా వత్తిడిగా ఉన్నా, ఖాళీగా ఉన్నా ఎక్కువగా ఆహారం తింటాము. యోగా చేయటం ద్వారా వత్తిడి దూరమవటమే కాకుండా ఎంత అవసరమో అంతే తింటాము.
క్రమం తప్పకుండా యోగా చేసేవారికి రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడటంతో బిపి తగ్గుతుంది. కండరాలను బలోపేతం చేయటం వలన గుండె పని తీరు బావుంటుంది. ఇన్సులిన్ ఉత్పత్తి మెరుగు అవటంతో చక్కెర వ్యాధి అదుపులో ఉంటుంది.
ప్రాణాయామాల ద్వారా శ్వాస్రకియ మెరుగుపడి, ఊపిరితిత్తుల పని తీరు బాగుంటుంది.
శారీరకంగా, మానసికంగా దృఢంగా అవటంతో వృద్ధాప్య ఛాయలు కనిపించవు. బరువు తగ్గుతారు. కంటి సమస్యలు దూరమవుతాయి. కొవ్వు నిల్వలు తగ్గుతాయి. అజీర్తి, తలనొప్పి, మైగ్రేన్, సైనస్, ఎలర్జీలు, సయాటికా, వెరికోసిలం వెయిన్స్, కీళ్ళనొప్పులు, నడుము నొప్పి, మహిళలలో ఋతు సంబంధ సమస్యలు…. ఇలా ఎన్నో సమస్యలు యోగా ద్వారా పరిష్కరించబడతాయి.
ఏకా్రగత, జ్ఞాపకశక్తి, గ్రహణశక్తితోపాటు ఆత్మవిశ్వాసం, స్వీయ క్రమశిక్షణ అలవడతాయి. భావోద్వేగాలు అదుపులో ఉండటం వలన సమస్యలను సానుకూలంగా, ధైర్యంగా ఎదుర్కోగలరు.
మరి ఇంతటి దివ్య ఔషధాన్ని మనందరం బ్రహ్మ ముహూర్త సమయంలో ప్రతిరోజూ స్వీకరిద్దాము. నిండు నూరేళ్ళు ఆనందంగా, హాయిగా జీవిద్దాం.
బండి ఉష, అరవిందయోగ ట్రస్ట్, ఖమ్మం
భారత దేశసామాజిక వ్యవస్థలో వివిధ మతాలు, విభిన్న కులాల వారు జీవిస్తున్నారు. బ్రహ్మణ, క్షత్రియ, వైశ్యం, శూద్ర అనే నాలుగు వర్ణాలతో పాటు, పంచమ వర్ణం అనే మరొక వర్ణం అదనంగా స్పష్టించబడిరది. వీటిల్లో ఉపకులాలున్నాయి. కులాల్లోని అంతరాల వల్ల అస్పృశ్యత విచ్చలవిడిగా కొనసాగుతుంది. పంచములకు సమాజంలో అనేక పేర్లు ఉన్నాయి. అంత్య, అంత్యజ, ఛండాల, శ్వపచ, మాల, మాదిగ, ఛమార్, మోచీ, మాంగ్, మహర్ ఇలా ఎన్నో పేర్లతో పిలుస్తూ సభ్య సమాజం సాంఫీుక జీవితం నుండి వెలి వేసారు.
అస్పృశ్యులుగాను, పంచములుగాను పిలువబడుతున్న వీరందరు ఊరికి వెలుపల వెలివాడలు నిర్మించుకొన్నారు. వీరి ఉనికి, నీడలు సవర్ణ సమాజంపై పడకుండా కట్టుదిట్టం చేశారు. మరణించిన జంతువులు వాటి తోళ్ళు, కలేబరాలూ, కుక్కలు, గాడిదలు వీరి స్థిర, చరాస్తులు, అంత్యజులు శుచి శుభ్రంగా ఉండకూడదు. మంచి దుస్తులు ధరించకూడదు శవాల మీది ప్రేత వస్త్రాలే వీరికి దుస్తులు. పగిలినమట్టి పాత్రలు ఉపయోగించాలి. భోజనంలో కాని ఇతర పరిస్థితులలో
నెయ్యి వాడకూడదు. అస్పృశ్యులు ఆభరణాలుగా ఇనుప నగలే ధరించాలి. దేశ దిమ్మరులై సంచార జీవితం గడపాలి. శవాలకు కాపలాకాస్తూ కాటి కాపరులై ఉండాలి. ఊరి పోలిమేరల్లో ఉండి గ్రామాన్ని రక్షిస్తుండాలి. సొంత ఆస్తి వుండకూడదు.
బహిష్కరణకు గురైన పంచమ జాతిలో పుట్టినవారే గుర్రం జాషువా కుల దొంతరల సమాజంలో పుట్టకతోనే అస్పృశ్యుడుగా ముద్రపడిరది. మహాకవి గుర్రం జాషువా 1895 సం॥ సెప్టెంబర్ 28వ తేదిన గుంటూరు జిల్లా వినుగొండలో జన్మించారు. తల్లిదండ్రులు లింగమ్మ వీరయ్యలు. ఈ దపంతులు కులాంతర వివాహం చేసుకున్న క్రైస్తవ, యాదవ కులస్థులు కాబట్టి యాదవులు వీరిని కులం నుండి వెలివేసారు. మనది పితృసామ్యం వ్యవస్థ కావున తండ్రి కులమే వారి సంతానానికి కూడ వర్తిస్తుంది. కాబట్టి జాషువా కులం అస్పృశ్యుడిగా చెప్పబడిరది. జాషువా బాల్యం నుండి కటిక దారిద్య్రాన్ని అనుభవించాడు. కులం, పేదరికం రెండు తన గురువులని చెప్పుకున్నారు. పేదరికం ఆయనకు వినయాన్ని నేర్పితే, కులం ఆయనని బానిసని చేయక ప్రతిఘటించే శక్తినిచ్చింది. కుల సమాజం పోవాలని కలం మోధుడై సమాజం మీద దండెత్తాడు జాషువా. ఇవన్నీ జాషువా సాహితి వ్యక్తిత్వాన్ని ఒకరకంగా పటిష్టపరిస్తే ఇంత కంటే విశాలమైన భూమిక మరొకటి జాషువా కవిత్వానికి బలం చేకూర్చింది.
19వ శతాబ్ధం నాటికి భారతీయ సామాజిక వ్యవస్థ కుల, మత సంఘర్షణలతో, అస్పృశ్యతా దురాచారంతో, హేతురహితమైన ఆచారాలు భ్రష్టుపట్టిపోయిన సంప్రదాయాలు బలంగా మర్రి ఊడల్లా వ్యాపించాయి. అ నారోగ్యకరమైన వ్యవస్థను రూపుమాపాలని, సమాజాన్ని ఆవరించిన చీకట్లను పారదోలాలని కొందరు మేథావులు సంస్కరణ ఉద్యమాలు నడిపారు. ఈ ఉద్యమాలు సమాజంలో నెలకొన్న అనేక దుష్ట సంప్రదాయాలను రూపు మాపేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేసాయి. వలస పాలనను అంతమొందించాలని జాతీయోద్యమం పుంజుకుంది. జాతీయోద్యమం, సంఘ సంస్కరణ ఉద్యమ ఆశయాలను లక్ష్యాలను చేపట్టింది. ఆదే సమయంలో రాజకీయోద్యమం, సంస్కరణ ఉద్యమాలు కొనసాగుతున్నాయి. కాని జాతీయోద్యమ ఉదృతికి తట్టుకోలేక పోయాయి. జాతీయోద్యమ లక్ష్యం ప్రధానంగా స్వాతంత్య్ర సంపాదన అందుకోసం సమాజంలో గుణాత్మకమైన మార్పులు రావాలని కొందరు మేథావులు భావించారు. ఆస్తిక, నాస్తిక ఉద్యమాలు చరిత్రలో నిలిచి పోయెలా తగిన పాత్ర పోషించాయి. మన దేశంలో మహాత్మాగాంధీ నాయకత్వాన, జాతీయోద్యమం బలంగా సాగుతుంది. మహరాష్ట్రంలో డా॥ బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వంలో పంచముల కులనిర్ములనోద్యమం చేపట్టారు. అంబేద్కర్ ఉద్యమాలకు స్పందించిన కవులు వారి వారి మార్గాన్ని ఎంచుకుని కృసి చేయసాగారు. జాషువా పై ఈ ఉద్యమాల ప్రభావం బలంగా పడిరది. జాషువా వ్యక్తిగత జీవితం సాహిత్య జీవితం రెండు ఘర్షణ నుండి పుట్టినవే. ఈ రెండు ఒకదానికొకటి పేన వేసుకపోయి మహకవి జాషువా రూపంలో కన్పిస్తాయి.
జాషువా బాల్యంలో ఆటస్థలంలో పంచముడిగా సవర్ణుల చేత అవమానింపబడ్డాడు, పాఠశాలలో చదువుకునే రోజులలో గురువులకు కూడా అస్పృశ్యత భేదభావం ఉండేది అంటు ఓ పద్యంలో ఇలా ‘‘మా గురువు గారికి కోపము వచ్చు వేళ / పెంపల రెడునంట రాని తన మడమువచ్చే’’ అని జాషువా చెప్పుకున్నారు. గ్రామంలో నాటక ప్రదర్శనకు వెళ్ళిన బాల జాషువాకు అక్కడ అస్పృశ్యత ఎదురైంది. జాషువా కవిగా కళ్ళు తెరిచే నాటికి ప్రతి పల్లె, పట్టణాలలో ఊరు వాడలలో ఆశుకవితా ధారల్లో పండితులు పామరులు మునిగితేలుతున్నారు. కొప్పరపు కవులు, తిరుపతి వేంకటకవులు ఆశుకవితతో అవధానాలు చేస్తూ గ్రామగ్రామాల్లో విస్తృతంగా పర్యంటించారు. ఇలాంటి సాహిత్య వాతావరణం జాషువాలో ‘కవి’ అంశ మొగ్గ తొడిగి సాహిత్య ప్రస్థానం మొదలైంది.
జాషువా హిందూ ధర్మశాస్త్రాలు, ఇతిహసాలు చదువుతుంటే హిందువుల్లో సంచలనం బయలు దేరింది. ఆశ్యర్యాన్ని ఆగ్రహాన్ని ప్రదర్శించారు. కవిత్వం చెప్పడం మొదలు పెట్టగానే ` ‘‘ప్రధివీ సురులు దక్కనితర జాతులు కైతలల్లరాదు నేరం’’ అ ని సవర్ణులు జాషువాని నిలదీసారు.
జాషువా వ్యక్తిగా, కవిగా, కుల రక్కసి చేతిలో అనేకమైన అవమానాలు, అవహేళన పలుమారులు చవిచూసారు. అవమానించిన కవులను వ్యక్తులను ‘గవ్వకు సాటిరాని పలుగాకులుగా’ గణించాడు. వీరు అడ్డగిస్తే తనను వరించిన శారద లేచిపోవునా! అని ఘంటమూనెదన్ రవ్వలు రాల్చెదన్ గరగరల్ పచరించెద నాంధ్ర వాణికిన్’’ అని ఆత్మ విశ్వాస ప్రకటన చేసాడు. ఈ సామాజిక సాహిత్య నేపథ్యం నుండి చీకటి వెలుగుల నుండి జాషువా కవిత్వాన్ని దర్శించవచ్చు. జాతీయోద్యమాల వల్ల, కులనిర్మూలనా పోరాటాల వల్ల, సంస్కరణల వల్ల, క్రైస్తవ మతం వల్లనైతేనేమి విద్య నేర్చుకునే హక్కును, ఆలయ ప్రవేశాన్ని పొందగలిగారు పంచములు.
ప్రాథమికోపాధ్యాయునిగా జీవితం ప్రారంభించి, నాటి మూకీ చిత్రాలకు వ్యాఖ్యాతగా పనిచేశారు. ఊరూరా తిరిగి, వీరేశలింగం, చిలకమర్తల వారి ఆశీర్వాదాలు పొంది, కావ్యజగత్తులో స్థిరపడ్డారు. తిరుపతి వేంకటకవుల ప్రోత్సాహంతో ముందుకుసాగి, ఉభయ భాషాప్రవీణులై తెలుగు పండితునిగా, ద్వితీయ ప్రపంచ సంగ్రామ సమయంలో యుద్ధప్రచారకునిగా, స్వాతంత్య్రానంతరం 1956 నుండి 1960 వరకు ఆకాశవాణి మద్రాస్ కేంద్రంలో తెలుగు ప్రోడ్యూసర్‌గా ఉద్యోగాలు నిర్వహించారు.
ఆరుబయటి ప్రక్కపరుచుకొని, ఒక ప్రక్క వేడిగాడ్పులు, మరోపక్క పిండిఆరబోసినట్లున్న వెన్నెలను అనుభవిస్తూ ‘‘నా జీవితం కూడా ఇలాగే వెన్నెల వడగాడ్పు మిళితమై సాగిపోతుంది, వడగాడ్పు నా జీవితమైతే, వెన్నెల నా కవిత్వం’’ అని తన ఆత్మకథలో వ్రాసుకున్నారు. కవిగా నిలదొక్కుకోవడానికి పడిన శ్రమ నిలుపుకున్న వ్యక్తిత్వమే జాషువాను గొప్ప కవిగా ప్రకాశింపచేసింది.
జాషువా తెలుగు సాహిత్యంలోని వివిధ సాహితీ ప్రక్రియలని చేపట్టి రచనలు చేశారు. సోదరునితో కలిసి నేత్రావధానం చేసారు. పారాణిక నాటకాలు రాసారు. నవలా ప్రక్రియలో కూడా జాషువాకు ప్రవేశం ఉంది. జీవిక కోసం పారాణిక, సాంఘిక నాటకాలనేకం రాశారు. ‘బొబ్బిలి యుద్దం’ వంటి సినిమాలకు ఆశువుపద్యాలల్లి ఇచ్చారు. గేయాలు రాశారు, జానపద కళారూపాలకు గేయాలు సమకూర్చారు జాషువా ఎన్ని ప్రక్రియలు చేపట్టినా తెలుగు సాహితీలోకం ఆయనను ఆధునిక పద్యకవిగా గుర్తించి గౌరవించింది.
జాషువా ప్రధానంగా వస్తు కవి. అయిన శిల్ప వ్యతిరేకి మాత్రం కాదు. సంప్రదాయ చంధస్సు స్వీకరించి, సమకాలీన సంఘటనతో నవ్యమైన వస్తువును జోడిరచి కవిత్వం చెప్పారు. వీరు వర్తమానాన్ని నిశితంగా పరిశీలిస్తూ భూత, భవిష్యత్తు కాలానికి తొంగి చూడగలిగిన ఋషితుల్యుడు. జాషువా ప్రాచీన కవుల సంస్కృత కవుల కవిత్వాన్ని పుక్కిట పట్టారు అతని కవిత్వంలో కవిత్రయం వారి కవితారీతులు, శ్రీనాథకవి సీస పద్యధార, ప్రబంధ కవుల వర్ణనతో పాటు కాళిదాసు వచోవైభవం చూడవచ్చును, కథావస్తువు, పాత్రల చిత్రణ, చంధోలంకారాది నియమాలు, రసపోషణ, ఉక్తిచిత్రి, భాషాపదప్రయోగం లాంటివన్ని కావ్య శిల్పానికి అంగాంగాలుగా చెప్పుకోవచ్చు. అనతంతమైన ఆర్థ్రత, అపారమైన భావుకతతో మానవీయ కవిగా దర్వనమిస్తారు. ప్రకృతి అందాలను, సూక్ష్మ రహస్యాలను సున్నితంగా కవిత్వ రూపంలో సమాజానికి అందించడం జాషువా కవితా ప్రతిభకు నిదర్శనం.
సీయపద్య రచనకు జాషువా పెట్టింది పేరు. శ్రీనాథుని త రువాత సీసపద్యాన్ని జాషువానే మధురంగా రాయగలిగాడని విమర్శకులు సైతం పొగిడినారు. కవితా శిల్పం, నైపుణ్యం, వైభవం సీసపద్య రచనలో ఆటవెలది జోడిరచి చెప్పడంలో జాషువా ప్రతిభా సంపత్తి వెల్లడవుతుంది.
‘‘ముడిచె నిచ్చట కుంతికొడుకు ద్రౌపదికొప్పు / పగవాని రుధిరంబు పరిమళింప / మెఱసె నిచ్చోట నాదరుషా కురారంబు / నిఖిల భారతము కన్నీరు నింప / వెలిసె నిచ్చోట పచ్చల బర్హిపీరంబు / షాజాను రాజు నాస్థాన వాటి / పెండ్లాడె నిచ్చోట పృధ్విరాజోక రోజు / జయ చంద్రు సుతను దోస్సారగరియ’’ ఇలా సీస పద్యంలో ఆటవెలదినిగాని, తేటగీతిని గాని వాడుకున్న వాటిలో అందంగా, సొగసుగా నృత్యం చేయించగల శక్తి సంపన్నుడు. జాషువా వృత్తాలలో మత్తేభం, శార్థూలం, ఉత్పలమాల, చంపకమాల, జాతుల్లో ఆటవెలది, తేటగీతి, కందం, సీసం లాంటివి ఆయన మధురమైన కవితలకు వాహికలుగా నిలిచాయి.
జాషువా గబ్బిలాన్ని చీకటితో పోల్చి చెప్పడం కోసం ఉపమాలంకారం తీసుకున్నాడు. ‘మక్కు మొగమున్న చీకటి ముద్దవోలె / విహరణముసేయ సాగె గజ్జల మొకండు’ అంటు చెప్పారు. అర్థాంతరన్యాసాలంకారానికి గాను ‘‘గిరుల మగవాని చెలిమి వ్యక్తీకరింప, మస్తమునదాల్పు మొకచిన్ని మంచుతున్క, విసపు మేతరికది సిఫారసుగనుండు, వ్యర్తములుగావు పెద్దలపరిచయములు’’ అంటు పూరించారు. ఔషధంబు లేని యస్పృశ్యత జాఢ్య / మంద భాగ్యు నన్ను మఱచిపోవు’’ అనే పద్యపాదములు రూపకాలంకారానికి చక్కని ఉదాహరణంగా నిలిచింది. ప్రకృతిని చూసి పులకించే కవిహృదయం జాషువాది. అందుకే గరికపోచలో కూడా కవిత్వాన్ని చూడగల్గిన సున్నిత హృదయంగలవారు.
‘‘తేటయైన తీపినీట దిక్కులదాక / విస్తరించి రుచుల గుస్తరించి / చిల్కసంద్రముంపు సీయుచుగన్నట్టు’’ అనే ఈ పద్యంలో తీయదనాన్ని దాచుకున్న నీటిసరస్సు స్వచ్ఛమైన తెలుగు భాషలా ఉంటుందని చెప్పడంతో జాషువాకు తెలుగు భాషపైనున్న అభిమానం తెలుస్తుంది. జాషువా సాహిత్యంలో సంస్కృతం, ఆంగ్లభాషా పదాలతో పాటు హిందుస్తానీ, ఉర్దూ, పారశీక, హిందీ మిశ్రమపదాలు అనేకం వీరి కవిత్వంలో కల్సిపోయాయి. తెలుగు పలుకుబడులు, నుడికారాలు, జాతీయాలు జాషువా కవిత్వంలో పలుమార్లు కన్పిస్తాయి. కవిత్వానికి తెలుగుపలుకుబడులతో గుడికట్టారు జాషువా అంటారు డా॥ సి.నారాయణ రెడ్డి గారు. 30కి పైగా రచనలు చేసి, సాహితీ జగత్తులో తనదైన ముద్రవేసుకున్న మహోన్నతమైన కవి జాషువా.
జాషువా పాండితీవైదుష్యానికి వేయికి పైగా సన్మానాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవి శతావధాని చైళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి గారు జాషువాకు గండె పెండారం తొడిగి సత్కరించారు. కనకాభిషేకం చేసి పగటి దివిటీలు పట్టి పల్లకిలో ఊరేగించారు. జాషువాను వర్ణ వివక్షతతో క్షోభపెట్టిన సమాజమే ఆయన పాండిత్యానికి ప్రతిభావ్యుతృత్తులకు తలలు వంచి కవికోకిల, కవిశారద, కవిదిగ్గజ, మధుర శ్రీనాథ, నవయుగకవి చక్రవర్తి, విశ్వకవి, కవిసామ్రాట్ బిరుదుతో పాటు, కేంద్ర సాహిత్య అకాడమీ ‘‘క్రీస్తు చరిత్ర’’ కావ్యానికి అవార్డు బహుకరించింది, ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం శాసన మండలి సభ్యునిగా నియమించింది, ఆంధ్ర విశ్వవిద్యాలయం ‘‘కళాప్రపూర్ణ’’ బిరుదాంకితున్ని చేసింది. రాష్ట్రపతి ‘‘పద్మభూషణ్’’ ఇచ్చి సంత్కరించారు. జాషువా 1971 జులై 24వ తేదిన కీర్తి శేషులైనారు.
రచన:
వనపర్తి పద్మావతి,
హన్మకొండ,
సెల్ : 9949290567.
బోణి అంటే స్త్రీ. పూబోణి రూపం మనం సాహిత్యంలో చూస్తాము. బోణి + అమ్మ = బోణెమ్మ. జన వ్యవహారంలో బొడ్డెమ్మ అయింది.
బొడ్డెమ్మ- కన్నెపిల్లల పండుగ
బతుకమ్మపండుగకన్నా ముందు బొడ్డెమ్మ పండుగ వస్తుంది. తొమ్మిది రోజులపాటు కన్నెపిల్లలు మాత్రమే చేసే పండుగ ఇది. తొమ్మిది రోజులు బొడ్డెమ్మ పండుగ. తొమ్మిదవ రోజు ‘సద్దుల బతుకమ్మ’. బొడ్డెమ్మ అంటే చిన్న అమ్మాయి అని అర్థం.
పుట్టమన్నుతో ఒక పీట మీద అయిదు అంతస్థులుగా చతుర ప్రాకారంగా చేసి ఒక దానిపై ఒకటి త్రిభుజాకారంగా పేరుస్తారు. తంగెడు, బంతి వంటి పూలతో అలంకరించి శిఖరాన బియ్యంతో నిండిన కలశాన్ని ఉంచి, దానిపైన కొత్త రవికె బట్ట నుంచి దానిపై తమలపాకు, పసుపు ముద్ద ఉంచి ఆ ముద్దను గౌరమ్మగా భావించి పసుపు, కుంకుమలతో పూజిస్తారు. బొడ్డెమ్మ పండుగ అంటే కన్నెపిల్లల ఆట, పాట మాత్రమే కాదు, ఆడపిల్లల్ని పూజించే పండుగ గౌరవించే పండుగ. తెలంగాణ ప్రాంతమంతా ఆడపిల్లని ఆడపిల్ల అంటారు. ఆడపిల్ల పుట్టందింటే లక్ష్మీదేవి పుట్టింది అంటారు.
సిబ్బి పిండి పూలను అందంగా సాయంత్రానికి అందంగా వేసి పూలముగ్గులలో బొడ్డెమ్మను పెట్టి చుట్టూ తిరుగుతూ లయాత్మకంగా చప్పట్లు కొడుతూ బొడ్డెమ్మ బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోల్…. నీ బిడ్డ పేరేమికోల్… నీ బిడ్డ నీలగేరుకోల్…. నిచ్చెమల్లె చెట్టేసి కోల్…. నిచ్చమల్ల చెట్టుకు కోల్…. రోజు నీళ్ళు పోసి కోల్…. అనే పాటతోపాటు, బొడ్డెమ్మకు సంబంధించిన ఎన్నో పాటలను పాడుకొని మంచి భర్త రావాలని కోరుకుంటారు.
ఆ విధంగా ఎనిమిది రోజులు బొడ్డెమ్మను కొలిచి ఆఖరి రోజున అందుబాటులో ఉన్న బావిలోగానీ, చెరువులో గానీ జారవిడుస్తారు. తొమ్మదవ రోజున బొడ్డెమ్మపై కలశంలో నిండిన బియ్యాన్ని పరమాన్నంగా వండి ఆరగిస్తారు.
బతుకమ్మ పండుగ తెలంగాణ స్త్రీలకు పూల పండుగ. ఆటపాటల పండుగ. ఊరి పరిసరాల్లోనూ ఇంటి పెరడులోనూ పూలను సేకరించి బతుకమ్మను పేర్చడం సంప్రదాయం. బతుకమ్మ పండుగ నాటికి విరబూసిన తంగేడు పూలతో ముఖ్యంగా బతుకమ్మను రూపొందించడం ఆచారం.
ప్రకృతి వివిధ వర్ణశోభితమై అలరిస్తూ ఉంటుంది. శరత్కాలం వర్షాలు తగ్గి ప్రకృతి వినూత్న శోభ సంతరించుకునే కాలం శరత్ ఋతువు. శరదృతువులో చామంతి, బంతి, తంగేడు, గునుగుపూలు విరగబూస్తాయి. మగువలు ఈ పూలను సేకరించి అందమైన రూపమిచ్చి ‘బతుకమ్మ’ అని అమ్మవారిని కీర్తిస్తూ పాడే పాటలు తెలంగాణా అంత ప్రతిధ్వనిస్తాయి.
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబింపజేసే బతుకమ్మ పండుగను భాద్రపద బహుళ అమావాస్య నుండి ఆశ్వయుజ శుద్ధ అష్టమి వరకు అత్యంత వైభవంగా స్త్రీలు, జానపద సంగీత, నృత్య సమ్మేళనం జరుపుకుంటారు.
ఇలా ఎనిమిది రోజులు ఆడాకా తొమ్మిదవ రోజు అంటే అష్టమి నాడు జరుపుకునే పండుగను “సద్దుల బతుకమ్మ” అంటారు. కంది, పెసర, వేరుసెనగలు పప్పులన్నీ పొడులుచేసి అన్నంతో సద్దులు చేస్తారు.
బ్రతుకు + అమ్మ = బతుకమ్మ అంటే బతికించే అమ్మ లేదా బ్రతికిన అమ్మ బ్రతుకమ్మ అయ్యిందని భావిస్తారు. ఈ బ్రతుకమ్మ క్రమక్రమంగా రూపాంతరం చెందుతూ ‘బతుకు అమ్మ’గా మారింది. రంగు రంగుల, రకరకాల పూలతో తయారుచేసే ఈ బతుకమ్మలు లక్ష్మీదేవి, పార్వతీదేవి అంశంగానూ, ప్రకృతికి ప్రతిరూపంగాను భావిస్తారు.
బతుకమ్మను గురించి పలు కథలు ప్రచారంలో ఉన్నాయి. వరంగల్ రాజధానిగా రాజ్యమేలిన కాకతీయుల కాలంలో ఎంతో వైభవంగా బతుకమ్మ పండుగ జరిగేదని తెలుస్తోంది.
చారిత్రక ఆధారంగా 19వ శతాబ్దం పూర్వార్థం లోను, 20వ శతాబ్ధం ఉత్తరార్థంలోనూ తెలంగాణ ప్రాంతంలో ప్రకృతి బీభత్సం జరిగి అంటువ్యాధులు సోకి లక్షలాది మంది చనిపోతుండగా ఉన్న తమ సంతానం మరణించకుండా ఉండాలని కోరుతూ బతుకు అమ్మ, బతుకమ్మ దేవిని ప్రార్థించగా ఆమె కరుణచే బతికినారని అందుకే బతుకమ్మగా పూజించడం సంప్రదాయంగా వచ్చిందని పెద్దలు చెబుతారు.
చోళ దేశపు రాజైన ధర్మాంగతుడికి అనేకమంది కుమారులున్నారు. వారు శ్రతువుల చేతిలో హతులవడంతో తన భార్యతో అడవులకు వెళ్ళిపోయిన శ్రీ లక్ష్మీదేవిని గురించి తపస్సు చేయగా లక్ష్మీదేవి ప్రత్యక్షమై ఏం వరం కావాలని అడుగగా అమ్మా అని పిలిచే సంతాన భాగ్యం కలిగించమనగా తథాస్తు అంది. తనకు కూతురు పుట్టగా బతుకమ్మ అని పేరు పెట్టినట్లుగా భట్టు నరసింహ కవి శ్రీ లక్ష్మీదేవి చందమామ సృష్టి బతుకమ్మాయె చందమామ అంటూ బతుకమ్మ పుట్టుక గురించి వ్రాసిన తొలిపాటగా తెలుస్తోంది.
దసరా దరహాసం
దసరా పండుగను జరుపుకున్నాం. విజయదశమి పండుగను మనం అనాదిగా జరుపుకుంటున్నాం. ఆశ్వయుజ శుద్ధ పాఢ్యమి నుండి దశమి వరకు తొమ్మిది రోజులు శ్రీ దేవి నవరాత్రులు శరన్నవరాత్రులుగా భావించి ఆరాధనలు జరుపుతారు. ఆశ్వయుజ మాసంలో శరదృతువు ప్రారంభమవుతుంది. శరతంకాలపు వెన్నెల స్వచ్ఛమైన శ్వేతవర్ణంలా శరదృతువులో వచ్చే పండుగ కాబట్టి ‘శరన్నవరాత్రులు’గా పరిగణిస్తారు.
భారతీయ సంస్కృతిలో జరుపుకునే పండుగలన్నింటికీ ఒక పరమార్థం ఉంటుంది. హిందువులందరూ సమైక్యంగా అత్యంత వైభవంగా జరుపుకునే పర్వదినాలలో ‘విజయదశమి’, ‘దసరా’ ప్రాముఖ్యత సంతరించుకుంది.
అమ్మవారి ఆలయాల్లో తొమ్మది రోజులపాటు దేవి నవరాత్రులను నిర్వహిస్తూ ప్రతిరోజూ దుర్గాదేవిని వివిధ రూపాలలో శోభాయమానంగా అలంకరించి పూజలు జరుపుకోవడం ‘విజయదశమి’ పర్వదినం విశేషం. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ పాఢ్యమి నుండి శుద్ధ దశమి వరకు దేవీ నవరాత్రుల పేరిట ‘దసరా’ పండుగ జరుపుకోవడం మనకు అనాదిగా వస్తున్న సాంప్రదాయం.
శరన్నవరాత్రుల గురించి వ్యాసభగవానుడు
“శృణురాజస్పవక్ష్మామి నవరాత్రి నవతం శుభమ్ శరత్కాలే విశేషరో కర్తవ్యమే విది పూర్వకమ్” అని వివరించాడు. సర్వప్రాణులకు వసంత ఋతువు, శరదృతువు క్లిష్టమైన కాలాలు, ఇవి జనులందరికీ యన కోరలంటారు. జనులకు దోషాలు కలిగించేవి. జనులకు నాశనం కలిగించేవి. వాటి వలన మనుషులు తమ పరుదులు దాటి చిత్ర ప్రకోపించి ఘోరమైన మనస్సుతో ప్రశాంతతను పొందడానికి, శరత్ కాలంలో శరన్నవరాత్రులు నిర్వహించాలని పురాణాలు చెబుతున్నాయి.
సంస్కృతంలో రోజుని ‘అహోరాత్రం’ అంటారు. ‘అహోరాత్రం’ పదంలో తొలి అక్షరం ‘అ’నీ, చివరి అక్షరం ‘త్ర’నీ తొలగిస్తే ‘హోరా’ అయింది. హోరా అంటే అహోరాత్రం అనే అర్థం. అలాంటి హోరాలు దశ కలిపితే అది ‘దశహోరా’ అయింది.
ఈ ‘దశహోరా’ కాలక్రమంలో ‘దసరా’ అయింది. ‘దసరా’ అంటే దశరాత్రుల పండుగ. ‘విజయ’ అంటే జగన్మాత. ఈ శరన్నవ రాత్రులలో ఆమె ఆరాధన వలన సకల ఐశ్వర్యాలు కల్గుతాయి. ఆమె కరుణ పొందడానికి శరన్నవ రాత్రులు అనువైన కాలం.
‘నవం నూతనం రాత్రం జ్ఞానం యస్మాత్తం నవ రాత్రః అని పండితుల వాక్కు. రాత్రి అనే పదానికి జ్ఞానమనే అర్థాన్ని సూచిస్తున్నాయి. నవరాత్రులంటే తొమ్మిది రాత్రులు. రాత్రిని తిథిగా స్వీకరించాలి. ‘నవాహోవై సంవత్సర ప్రతిమా’ అనే వాక్యం వలన నవరాత్ర కర్మ సంవత్సర కాలానికి ప్రతిరూపమని తెలుస్తోంది. ఆశ్వయుజ శుక్ల పాడ్యమినాడు నవరాత్ర ఆరాధనలు మొదలవుతాయి. ఈ నవరాత్రులలో నవదుర్గల ఆరాధన వల్ల సమస్త పాపాలు, బాధలు తొలగిపోయి సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని మన పురాణాల ద్వారా విదితమవుతుంది.
ఈ నవరాత్రుల పూజ వలన ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థ ఫలాలు ప్రాప్తిస్తాయి. భక్తుల రోగ, శోక, సంతాన, భయాలను ఈ దుర్గాదేవి నశింప చేస్తుంది. ఈ నవరాత్రులలో నవదుర్గా రూపాల్లోని మహాలక్ష్మి, మహా సరస్వతీ, మహాకాళికలను ఆరాధించడం వల్ల మహాలక్ష్మి అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తే, మహాసరస్వతిగా విద్యాబుద్ధులను అనుగ్రహిస్తుంది. మహాకాళిగా దుర్గగా పూజించడంవల్ల శతృభయం తొలగి విజయం సిద్ధిస్తుంది.
‘ప్రథమా శైలపుత్రీ, ద్వీతీయా బ్రహ్మచారిణీ, తృతీయ చంద్రమంటేతి కుష్మాండేతి చతుర్థకే, పంచమా స్కందమాతేతి, షష్టాకాత్యాయనీ తచ సప్తమా కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమీ నవమాసిద్ధి దాత్రీతి నవదుర్గాః ప్రకీర్తతాః”
అని మార్కండేయ పురాణం పేర్కొన్నది. సకల దేవతా శక్తులకు మూలధారిణి, సకల మంత్ర అధిదేవత, ఓంకార స్వరూపిణి, సృష్టిలోని పలు ప్రాణులకు మాతృమూర్తియైన శక్తికి ప్రతిరూపంగా దుర్గాదేవిని ఆరాధించడం అనాదిగా మన ఆచారం.
ఈ ప్రపంచమంతటా ఒక శక్తి నిక్షిప్తమై వుండి, చైతన్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఈ శక్తే పరమాత్మ. పరమాత్మే అశక్తి. శివశక్తి నిరాకార అయిన ఆదిపరాశక్తి అవసరార్థం అనేక రూపాలు ధరించి, సత్త్వ రజోస్తమోగుణాలను ఆశ్రయిస్తుంది. ఇచ్ఛాశక్తి, జ్ఞానాశక్తి, క్రియాశక్తి అనే త్రిగుణ శక్తులుంటాయి. సృష్టి చేయాలనే సంకల్పం ఇచ్ఛాశక్తి వలన ఏర్పడుతుంది. దానికి సంబంధించిన కార్యకలాపమంతా జ్ఞానశక్తి వలన ఏర్పడుతుంది. సంకల్పం కార్యరూపం ధరిస్తే అది క్రియాశక్తి రూపం అవుతుంది. ఈ త్రిశక్తుల ద్వారా ఆదిపరాశక్తి విశ్వసృష్టి చేస్తుంది. ఆదిశక్తి తన మాయా ప్రభావంతో అనేక అద్భుత కార్యాలు చేస్తుంది.
అనంతమైన ఈ విశ్వాన్ని పోషించి, లయం చేస్తుంది. శక్తియే దేవి అని పాశాయేశ ధనుర్బాణాల ధరించిన మహా విద్యయని, దుర్గాదేవియై నిఖిల జగత్తును రక్షించే మహాశక్తిగా వెలసినది. కనుక ఈ నవరాత్రులలో దివ్యతేజస్సుతో ప్రభవించే దుర్గాదేవిని అర్చిస్తే సమస్త రోగాలు తొలగి ఆయురారోగ్యాలు కలిగి, బ్రహ్మత్వసిద్ధి, భుక్తి, ముక్తిపదమవుతుంది. దుర్గాదేవి పూజ వలన అన్నింటా విజయాల్ని ప్రసాదిస్తుంది. అందుకే అమ్మకు ప్రణామాలర్పించి, ఆశ్సీస్సులు పొంది విజయదశమి రోజున నూతన కార్యక్రమాలను పారంభిస్తే విజయం కలుగుతుందని, శుభాలు చేకూరుతాయని విశ్వాసం. విజయదశమి పండుగా చారి్రతాత్మకమైన ప్రాశస్త్యాన్ని, విశిష్టతను సంతరించుకున్నది.
“యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితా! నమస్తస్యై నమస్తస్యై, నమస్తస్యై నమో నమః’ అని సమస్త ప్రాణికోటిలోనూ శక్తి రూపంలో ఉండే దేవికి నమస్కరించింది మార్కండేయ పురాణం. శివుడు సైతం శక్తి సంపన్నుడైనప్పుడే ఆయనకు పరమేశ్వరత్వం సిద్ధిస్తుంది. శక్తి లేకుంటే ఏ ప్రాణి కదలలేదు. దుష్టరాక్షసులను సంహరించడానికి ఆ రాశక్తి పది రూపాల్లో అవతరిస్తూ ఉంటుంది. జగన్మాతను దుర్గభవాని, రుద్రాణి వంటి అనేక నామాలతో భక్తులు కీర్తిస్తుంటారు.
ప్రాచీన కాలంలో ఆర్యులకు అపరాజితాదేవి ప్రధానమైన దేవతగా ఉండేది. ‘అపరాజిత’ అంటే ‘పరాజయం’ పొందినది. వైదిక కాలంలోని ఈ అపరాజితాదేవి క్రమేణా క్ష్రతియుల జయాధిష్టాన దేవత అయింది. క్షత్రియులు దశమినాడు అపరాజితను పూజించటం ఆచారమైంది. నవమినాడుగానీ, దశమినాడుగానీ ఈ అపరాజితను పూజిస్తే విజయం తథ్యమని పురాణ ప్రవచనం.
ఈ రూపాలకే ’నవదుర్గలు’ అని పేరు. దుర్గాదేవి తొలి స్వరూపంలో శైలపుత్రిగా, మలి రోజు బ్రహ్మచారిణి స్వరూపంగా, తృతీయ స్వరూపంగా చంద్ర ఘంటాదేవి, చతుర్థ స్వరూపంగా కుష్మాండాదేవిగా, పంచమ రూపం స్కందమాత, షష్టి స్వరూపం కాత్యాయనిదేవి, సప్తమ రూపం కాళరాత్రీ, అష్టమ రూపంగా మహాగౌరి, దుర్గాదేవి నవమ స్వరూపంలో ప్రసిద్ధి చెందింది.
‘’ఏతస్యా దసరం కించిత్ వ్రతం నాన్తి ధరాతలే
నవరాత్రాభిరం వైశ్య పావనం సుఖదం తథా
ఆనందం మోక్షదం చైవ సుఖ సంతాన వర్థనమ్
శ్రతునాశకరం కామం నవరాత్ర వ్రతం సదా”
అంటూ నవరాత్ర మహిమను పురాణాలు కొనియాడాయి.
అంతా శక్తి మయం, స్త్రీ శక్తిమయం, ఆదిపరాశక్తి పార్వతి అంశతో కరువుకాటకాలను తొలగించి, లక్ష్మీదేవి సిరిసంపదలను చేకూర్చి, దుర్గాదేవి కోరిన కోర్కెలను నెరవేరుస్తుంది. పరాశక్తి త్రిమూర్తులను పోలియున్న సత్వ రజస్తమో గుణములను ప్రతిరూపంగా నిలుస్తుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో, గౌరవంతో కొలవాలి.
ఆశ్వయుజం అంటే న + శ= ఆశ్వ అవుతుంది. శ్వ = అంటే రేపటికి, న = ఉండదని, రేపటికి ఉండదని, అంటే నిత్యం మార్పు చెందే ప్రకృతి అని అశ్వపదానికి అర్థం. ఆశ్వ +యుజం అంటే అశ్వేన యుజ్యతే. ఇది ఆశ్వయుజం అవుతుంది. ప్రకృతిలో కూడినది అని దానికి అర్థం. ప్రకృతిలో కూడి ఉండేది పరమాత్మ.
“ప్రాతర్యా నాణా ప్రథమాయజధమ్
నోరన సామయంతి దేవాయా అజుష్టమ్”
అని ఋగ్వేదంలో ఉన్నది. అంటే సూర్యోదయానికి ముందు తూర్పున ఏ నక్షత్రం ఉదయిస్తే ఆ నక్షత్రానికి సంబంధించిన దేవతను పూజించాలి లేదా సూర్యాస్తమయ సమయంలో తూర్పున ఉదయించే నక్షత్ర దేవతనైనా పూజించాలి. ఖగోళ శాస్త్రరీత్యా పరిశీలించినప్పుడు ఈ శరన్నవరాత్రులలో కన్యారాశి నక్షత్రాలు కనిపిస్తాయి. కన్యరాశి స్త్రీ ఆకృతి. ఆ స్త్రీ రూపమే మనం ఆరాధించే దుర్గామాత. కన్యరాశి తర్వాత కనిపించేది సింహ నక్షత్రం. ఆ ఆకృతే దుర్గాదేవి వాహనం. కనుక సింహాసనం అధిష్టించి భక్తులకు సర్వసిద్ధులనూ ప్రసాదిస్తుంది.
“అశ్వినస్య సితే పక్షే దశమ్యాం తారకోదయే
సకాలో విజయోనామ సర్వకామర్థ సాధకః”
ఆశ్వయుజ దశమి సాయంకాలం నక్షత్రోదయ వేళను విజయకాలం అంటారు. ఆ సమయం సర్వకామ్యార్థ సాధకం అనీ, సాయంకాలం నాటి, నక్షత్రాలు అప్పుడే పొడగట్టే కాలం విజయకాలమని, సకల కార్యసిద్ధి కలిగిస్తుందనీ చింతామి కారుడు ప్రవచించాడు.
చిదగ్ని కుండ సంభూతమైన దేవి తత్త్వములేనిది ప్రపంచంలో ఏదీ లేదు. సమస్త ప్రపంచం శ్రీ దేవి మయం. శ్రీ దేవి మూల ప్రకృతి స్వరూపిణియై సర్వ చరాచర జగత్తులో వ్యాపించి అగోచరంగా ఉంటు, సకల భూతకోటికి సర్వవిధాల ఉపయోగపడుతుంది. దేవి నవరాత్రులలో శక్తి ప్రదాతయైన దుర్గాపూజ ప్రదానం.
ఈ నవరాత్రులలో ఒక్కొక్కనాడు శక్తిని పూజించడం వలన, నవ శక్తులతో, నవదుర్గులతో కూడియుండటం వలన నవరాత్రులయ్యాయని శివుడు పార్వతిదేవితో చెప్పినట్లు శక్తి సంగమ తంత్రం ద్వారా తెలుస్తోంది.
‘శ్రీ’ అంటే ‘ప్రకృతి’, దేవి అంటే ‘ప్రకాశించునది’ అర్థం. కనుక శ్రీదేవి అనగా ప్రకృతిలోని ప్రతి పదార్థంలోనూ గల ‘చిత్’ శక్తి అని అర్థం. చిత్ శక్తి పూజయే శ్రీ దేవి పూజ. సర్వం శక్తిమయం, భక్తే శక్తి మయం. ఆ ఆదిపరాశక్తిని భక్తిభావనలతో నిర్మల హృదయులై ఈ నవరాత్రులలో ఆమె నారాధిస్తే, సర్వ శక్తులనిచ్చి సదా కాపాడుతుంది.
శమీ వృక్షం మహిమాన్వితమైనది కాబట్టి, దసరా నాడు “శమీ శమయతే పాపం / శమీ శ్రతు వినాశినీ/ అర్జునస్య ధనుర్ధారీ! రామస్వ ప్రియదర్శినీ” అనే శ్లోకాన్ని తెల్లని కాగితాలపై వ్రాసి పఠిస్తూ శమీ వృక్షానికి ప్రదక్షిణలు చేసి, కొమ్మలపై వేసి నమస్కరించి, శమీ పత్రాల్ని తీసికొని ‘బంగారం’గా భావించి, శమీ పత్రాల్ని పెద్దలకు ఇచ్చి పాదాభివందనం చేసి దీవెనలు పొందుతారు.
అశ్వయుజ శుద్ధ దశమి నాడు శమీపూజ జరిగిందని నాటి నుండి నేటివరకు విజయాలకు ప్రతీకగా విజయదశమినాడు శమీ వృక్షాన్ని పూజించడం సంప్రదాయంగా వస్తోంది.
నవ దుర్గల ఆరాధనవల్ల సమస్త పాపాలు, బాధలు తొలగి, దీర్ఘ రోగాల నుంచి విముక్తి కలిగి, సకల సౌఖ్యాలు, సౌభాగ్యాలు సిద్ధిస్తాయని, ఈతిబాధలకు గురికాకుండా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయని, ఆ దుర్గాదేవి ఇహపర సుఖాలను అనుగ్రహించి మానవులకు రక్షగా నిలచి కాపాడుతుందనే పరమార్థతత్త్వం నవరాత్రుల వల్ల అవగతమవుతుంది. సర్వ సిద్ధిశ్చాత్ నవదుర్గా ప్రకీర్తితా! అనే పెద్దల మాటలను గుర్తు చేసుకుంటూ నవరాత్రి విశేషాలను తెలుసుకుందాం.
శమీ శమయతే….
శమీ వృక్షం గొప్ప ఔషధీ వృక్షం. శమీ పాప నాశనీ, అంటే పాపాలతో కూడిన వ్యాధుల్ని నాశనం చేసే గుణం కలది అని అర్థం. అందుకే శమీ వృక్షాన్ని పూజించడంవల్ల పాపాలు శమిస్తాయని, వ్యాధుల నాశనంతోపాటు విజయం కలుగుతుందనే విశ్వాసంతో మన భారతీయ సంప్రదాయంలో (జమ్మి) శమీ పూజ విశిష్టతను సంతరించుకొన్నది. శమీ వృక్షం నూరు సంవత్సరాల జీవితాన్నిస్తుందని, మానవుని మనస్సుపై శమీ ప్రభావం ఉంటుందని ఆధర్వణ వేదంలో, శమీ, సమ్మోహన వశ్య ప్రభావం కలదని దత్తాత్రేయ తంత్రంలో తెల్పబడింది. శమీ వృక్షం రసంతో సర్వలోహాలు భస్మమౌతాయని రస తంత్రాల్లో వివరించబడిన శమీ వ్రతాలు తుమ్మ ఆకులను పోలి దళసరిగా ఉంటాయి. కఫ పైత్యాన్ని, శ్వాస, అతిసారం, కుష్టు, తదితర వ్యాధులను నయం చేసే ప్రభావం కలది.
అందుకే ఆశ్వయుజ శుక్లపక్ష దశమి శ్రవణ నక్షత్రంలో మహిమాన్వితమైన శమీ వృక్షాన్ని పూజించి, ప్రదక్షిణలు చేసి “శమీ శమయతే పాపం! శమీ శతృవినాశనం అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శనం అనే శ్లోకాన్ని చెప్పుకొని శమీ పత్రాల్ని ‘బంగారం’గా భావించి పెద్దలకు ఇచ్చి ఆశీస్సులు పొందడం ఆచారంగా వస్తోంది.
“శివ శ్శక్త్యాయుక్తః యది భవతి శక్తిః ప్రభావితం….” ఆ శివుడు శక్తితోనే లోకములను శాసిఁచగల్గుతున్నాడని, అందుకే విజదశమి నాడు ఆయుధ పూజ కూడా విశిష్టంగా చేస్తారు.
సృష్టిలో సర్వమూ శక్తి రూపమే. శరణార్థులందరినీ రక్షించగల శక్తి కలిగిన తల్లి ఆ దుర్గామాతే. “ఐం హ్రీం, క్లీం, చాముండాయైనమః” అనే సవర్ణ మంత్రం లిఖించబడిన తామ్రరేకు యంత్రంపై నారికేళంతో కలశాన్ని స్థాపించి దుర్గాదేవిని మంత్ర పూర్వకంగా ఆవాహన చేసి తొమ్మది రోజులు ఉదయం సాయంత్రం దుర్గా సహస్రనామ, త్రిశతి, సప్తశతి, పఠిస్తూ పూజా విధి నిర్వహించాలి.
తొలి రోజు రక్షశక్తిగా దుర్గ, మలినాడు మంత్రశక్తి మంగళ గౌరిగా, తృతీయమున అన్నపూర్ణాదేవి ప్రాణశక్తిగా, చతుర్థమున కళాశక్తి లలితా త్రిపురసుందరీదేవిగా, మహాలక్ష్మి పంచమిన ఐశ్వర్యశక్తిగా, షష్ఠిన విద్యాశక్తిగా గాయత్రి, సప్తమిన జ్ఞానశక్తిగా సరస్వతీదేవిగా, అష్టమిన ధార్మకి శక్తిగా దుర్గా, సంహారశక్తిగా నవమిన మహిషాసురమర్ధనీ, దశమిరోజున విజయశక్తిగా శ్రీ రాజరాజేశ్వరిదేవిగా మహాదర్శనమిస్తుంది.
సాత్విక, రాజస,తామస అని మూడు విధాలుగా పూజాదికాలు ప్రాచీన సంప్రదాయం, సరస్వతి ఆరాధన సాత్విక అనుష్ఠానానికి మూలం. మహాకాళి ఆరాధన తామసికం, రాజసానికి మహాలక్ష్మీ, ఈ నవరాత్రులలో శ్రీ రాజరాజేశ్వరిదేవిని ఆరాధిస్తే సకల దేవతలను పూజించిన పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రవచనం.
నవావరణ యంత్రంపై శ్రీ దేవిని ప్రతిష్ఠించి, సప్తమి, అష్టమి, నవమి తిథులలో పూజ ఆచరిస్తారు. దశమినాటితో పూజ సమాప్తి అవుతుంది. ఆ తిథికే “విజయదశమి” అని పేరు.
ఈ నవరాత్రులలో రాత్రిపూజకే అధిక ప్రాధాన్యత. రాత్రివేళ అమ్మను ఆరాధిస్తే సర్వ పాపాలు ప్రక్షాళనమవుతాయని శాస్త్రోక్తి. ఈ నవరా్రతి వ్రతాన్ని తొమ్మది రోజులపాటు చేసుకోలేని వారు ఏడు రాత్రులు లేదా, ఐదు, మూడు, లేదా ఒక్కరాత్రి ఆచరించవచ్చను.
“త్రిరాత్రం వాపి కర్తవ్యం సప్తమ్యాది యధాక్రమః”
మూడు రాత్రులంటే సప్తమి నుండి, పంచ రాత్రులంటే పంచమి నుండి ఏడు రాత్రులంటే తృతీయ నుండి, ఏకరాత్రి అంటే అష్టమి లేక నవమి నాడు జరుపుకొనవచ్చును.
ఈ నవరాత్రి పూజలు ఆచరించిన తొమ్మది రోజులూ ఒక పూట భోజనంతోగానీ, తొమ్మది రోజులూ ఒక పూట భోజనంతోగానీ, తొమ్మది రోజులు పూర్తి ఉపవాసంతోగాని పూజలు నిర్వహించవచ్చును.
సర్వారిష్ట నివారణకారిణి కావడం చేత తొలి మూడు రోజులు దర్గాపూజ ఆచరించి, అష్టైశ్యర్యప్రదాయిని అయిన లక్ష్మీదేవిని ఆవిష్కరించుకొని సద్గుణ భావసంపదను పొందాలి. దుర్గాపూజ ద్వార అరిషడ్వర్గాలను అంతరింపజేసుకొని, తర్వాత మూడురోజులు లక్ష్మీపూజ ద్వారా సుగుణ సంపదను పొంది, చివరి మూడు రోజుల్లో సరస్వతీ పూజ ద్వారా జ్ఞానం లభిస్తుంది. ఈ జ్ఞానమే ఆధ్యాత్మిక జ్ఞానం. ఆత్మజ్ఞానం, దుర్గా, లక్ష్మి, సరస్వతి ముగ్గురు కూడ ఒక్క జగజ్జనని స్వరూపాలే అని గ్రహించాలి.
– గురిజాల రామశేషయ్య రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ (తెలుగు)ఈ శీర్షిక క్రింద పరిచయం చేయబోతున్న తెలంగాణ ప్రబంధాలు:
1. చిత్ర భారతము- చరిగొండ ధర్మన్న
2. తపతీ సంవరణోపాఖ్యానము- అద్దంకి గంగాధరుడు
3. షట్చక్రవర్తి చరిత్ర – కామినేని మల్లారెడ్డి
4. యయాతి చరిత్రము – పొన్నిగంటి తెలగన్న
5. ముకుంద విలాసము – కాణాదం పెద్దన సోమయాజి
ఇవి ఈ శీర్షిక క్రింద పరిచయం చేయబోతున్న తెలంగాణ పంచ కావ్యాలు అనదగిన ఐదు ప్రబంధాలు
పరిచయ కర్తలు:
1. డా॥ సంగనభట్ల నరసయ్య, రిటైర్డ్ ప్రిన్సిపాల్.
2. డా॥బ్రాహ్మణపల్లి జయరాములు, రిటైర్డ్ ప్రిన్సిపాల్.
3. డా॥ మృదుల నందవరం, అసిస్టెంట్ ప్రొఫెసర్ (తెలుగు)
4. డా॥ సి.హెచ్ . లక్ష్మణ చక్రవర్తి, అసిస్టెంట్ ప్రొఫెసర్ (తెలుగు)
5. డా॥ గండ్ర లక్ష్మణరావు, రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్.
ఈ రచయితల వ్యాసాలు తెలంగాణ ప్రబంధ మాలిక శీర్షిక లో వరుసగా ధారావాహికంగా వస్తాయి
ప్రవేశిక
భారతీయ భాషలలో తెలుగు ప్రాచీన భాషగా గుర్తింపు పొందిన ప్రసిద్ధమైన భాష. అనేకానేక విషయబాహుళ్యము వలన విస్తృతమైన సాహిత్య సంపదగలిగిన మధురమైన భాష. స్వరములు అంటే అచ్చులు .ఇవి నాద మాధుర్యానికి పుట్టినిండ్లు .అ,ఇ,ఉ కారాది స్వరాలతో ఆదిమధ్యాంతము సర్వవిధముల అలరారు మెలపులు గల పదాలతో కూడిన తెలుగు భాష పలుకు తీపికి తేనె పెర. మృదువైన పలుకుబడి పదములతో నవనీత సదృశ ‘రుచి’ర . ఈ కారణాలవల్లనే స్వభాషాభిమానానికి పరాకోటి ప్రాధాన్యతను పాటించే తమిళభాషా కవులలో సుప్రసిద్ధులైన సుబ్రహ్మణ్య భారతి వంటి ప్రామాణికులైన మాన్య సాహిత్యవేత్తలు సైతము “సుందర తెలుగు” అని వక్కాణించినారు. అంతకు’ముందెన్నడో “ఆంధ్రత్వమాంధ్రభాషా చ బహుజన్మ తపః ఫలమ”ని తెలుగును వేనోళ్ళ పొగిడిన అప్పయ్య దీక్షితులకు తెలుగు వారందరు కూడా కృతజ్ఞతాబద్ధులే! సుమారు రెండు వందల సంవత్సరాల కాలం భారతదేశంలో తిష్ఠ వేసిన బ్రిటీష్ , తదితర భాషా పండితులు మన తెలుగు భాషను “ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ “ అని ముచ్చటపడి మెచ్చుకున్నారు. ఇక్కడొక విషయం చింతనీయం -అంతకు ముందు వాళ్ళకు ఇటాలియన్ తెలిసి దానితో మన తెలుగును పోల్చుకొని మెచ్చుకున్నారు . కాని , వాళ్ళు రావడానికి వేల సంవత్సరాలకు ముందే మాధుర్యాన్ని పండించుకొటున్న తెలుగు భాషను ఇటాలియన్ తో పోల్చుకొని ఇటాలియన్ గురించి ” తెలుగు ఆఫ్ ద వెస్ట్”అని మార్చుకొనదగినంత మధురాతి మధుర మృదు మాధ్వీక రసనిష్యంద తుందిలమైన మన తెలుగు నిజంగా ప్రపంచ భాషలలోనే మధురమైన భాష.
ఇక దక్షిణ భారతదేశంలో అక్షీణ యశస్సును పండించుకొని, స్వయంగా కవియై , ఆముక్తమాల్యాది కావ్యరచయితయై, స్వర్ణయుగ కర్తగా పేరుపొందిన శ్రీకృష్ణదేవరాయలు కర్ణాటాది భాషాప్రాంతాలకు ఏలికయై ఉండి కూడా ‘“దేశభాషలందు తెలుగు లెస్స “అని ప్రశంసించటం సర్వజన సువిదితమే! అంతకుముందే శ్రీనాథ మహాకవి ఈ అభిప్రాయాన్నే ప్రకటించిన తీరు కూడా గమనార్హం.
మధ్యయుగాల వైభవమును ప్రతిబింబించిన 16 వ శతాబ్దపు ‘ ప్రబంధ పద్యము ’ పద్యరచనకు పరాకాష్ఠ స్థితి (climax) . ప్రబంధ పద్యం అంటే ప్రబంధం లోని పద్యం. ఇతిహాస,పురాణ , నాటకాది వివిధ ప్రక్రియలకు చెందిన గ్రంథాలన్నీ ప్రబంధ శబ్ద వాచ్యాలే అయినా కావ్యాలకే ప్రబంధము మారు పేరుగా, మరోపేరుగా ధ్రువపడింది. రూఢి అయింది .
వాస్తవానికి “సర్గబంధో మహాకావ్యమ్” అంటూ దండి అనే సంస్కృత లాక్షణికుడు చెప్పిన లక్షణాలే తెలుగు లాక్షణికులైన విన్నకోట పెద్దనాదులు కావ్య ప్రబంధ లక్షణాలుగా స్వీకరించారు.
క్రీ.శ. 16వశతాబ్ధమునందలి కావ్యములను ముఖ్యంగా మనుచరిత్రము ను పురస్కరించుకొని ప్రత్యేకంగా రూఢమైన “ప్రబంధ లక్షణముల”ను ప్రకటించినవారు 20 వ శతాబ్దపు తెలుగు విమర్శకులే కాని ప్రాచీన లాక్షణికులుకారు. ( తెలుగు అకాడమీ పత్రిక ‘తెలుగు’ మే 1995 సంచికలోని ప్రొఫెసర్ జి.వి.సుబ్రహ్మణ్యం గారి ప్రత్యేక వ్యాసం చూడండి.
పైన పేర్కొన్న కేంద్రసాహిత్య అకాడమీ విమర్శ పురస్కార స్వీకర్త గారి మాటలను అనుసరించి పర్యాలోచిస్తే ౼ కేవలం 16 వ శతాబ్దంలో క్రీ.శ. 1522 తదనంతరం శ్రీకృష్ణదేవరాయల కోరికపై అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్ర ను మాత్రమే దృష్టిలో ఉంచుకొని “……మనుచరిత్రమే ప్రబంధ లతకు పూచిన తొలి పువ్వు“ అని తీర్మానించిన మాట వాస్తవమని ఆంధ్రసాహిత్య అభిజ్ఞ పండితవర్గము గుర్తించగలదు. ఈ విధంగా ప్రబంధ లక్షణాలివి అని , తమకు నచ్చిన కావ్యగతాంశాలను కొన్నిటిని ప్రామాణీకరించుకొని , అష్టాదశ వర్ణనలు ప్రధానంగా ఉండే స్వతంత్ర కథోచిత మనోహర పద్యగద్యాలున్న కావ్యాన్నే “ప్రబంధమ”ని నిర్వచించినారు. కాని, మనుచరిత్ర కంటే సుమారు దశాబ్దం పైబడిన కాలం ముందటిదైన , 16 వ శతాబ్దపు ప్రారంభాన ఓరుగల్లు ను పాలించిన చిత్తాపుఖానుని మంత్రియైన పెద్దనామాత్యునికి అంకితమైన చరిగొండ ధర్మన్న కవియొక్క ‘చిత్ర భారతం ‘ ను గుర్తించదలచరైరి.
కాలక్రమానుగుణంగా “చిత్రభారతము” (చరిగొండ ధర్మన్న) క్రీ.శ. 1503-12 మధ్యకాలములోనిది. “మనుచరిత్రము” క్రీ.శ.1522లో భువన’విజయము లో కొలువుండి శ్రీకృష్ణదేవరాయలు అల్లసాని పెద్దనను అడిగి వ్రాయించుకున్న ప్రబంధము. ఈ విధంగా కాల సన్నివేశాలను పోల్చిచూసినట్లైతే “చిత్రభారతము”తొలి తెలుగు ప్రబంధమగుట వాస్తవము.న్యాయము. ఈ ప్రామాణిక , చారిత్రక శాసనాధారాలుగల విషయాలను 2013 లో తెలుగు విశ్వవిద్యాలయంలో విజిటింగ్ ప్రొఫెసర్ గా పనిచేసిన డా॥సంగనభట్ల నరసయ్య గారు : ఉపకులపతి డా॥ ఎల్లూరి శివారెడ్డిగారి కోరికమేరకు పరిష్కరించి, విపులమైన పీఠికను చేర్చి వెలువరింప’చేసినారు.
ప్రస్తుతము 2014 నుండి తెలుగు భాషకు చెందిన రాష్ట్రాలు రెండు . ఒకటి తెలంగాణ , రెండు ఆంధ్రప్రదేశ్. తెలంగాణ ఆవిర్భవించిన తరువాత 2017 డిసెంబరు నెలలో రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన నిర్వహించుటకు సంకల్పించిరి. అంతకు కొద్ది నెలల ముందుగా డా॥నందిని సిధారెడ్డిగారు తొలి అధ్యక్షులుగా “తెలంగాణ సాహిత్య అకాడమీ” ప్రారంభించబడినది. ఈ క్రమంలో ప్రపంచ తెలుగుమహాసభలు డా౹౹నందిని సిధారెడ్డి గారి అధ్వర్యంలోనే మూడు రోజులు వివిధ ప్రసిద్ధ సాహితీవేత్తల పేరిట ఏర్పాటు చేయబడిన వేదికలపై నిర్వహింపబడినవి. అందులో భాగంగ “తెలంగాణ ప్రబంధాలు” శీర్షికన గతంలో ప్రచుర పఠన పాఠన పరంగా విస్తృత ప్రచారం లోకి రాని ప్రబంధములకు చెందిన ప్రత్యేక, విశిష్ట లక్షణములను గురించి నాకు : గురిజాల రామశేషయ్య కు ప్రసంగించుటకు అవకాశము లభించినది. ప్రముఖులైన తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ పండితుల సమక్షంలో తెలంగాణ ప్రక్రియా ప్రాదుర్భావ వికాస విశేషాంశములు పునర్మూల్యాంకన గణనం లోనికి రావలెనని నివేదింపబడినది . ఆ క్రమంలోనే నేను తదుపరి సంవత్సరములలో తెలంగాణ సాహితీ వేత్తలను సంప్రదించి ఒక్కొక్కరికి ఒక్కో ప్రబంధం చొప్పున అప్పగించి కవిపరిచయము–స్థల కాలాది’విశేష–కథాసంగ్రహ–ప్రబంధ నిర్మాణ విశేషాదిక పద్య’శిల్ప వైభవ విశేషములను వివరిస్తూ విషయవిస్తృతి గల వ్యాసములను వ్రాసి ఇవ్వవలసినదిగా కోరితిని .
కోరినవెంటనే సమ్మతించి ఆయా ప్రబంధములను కూలంకషముగా అధ్యయనము చేసి తత్ ప్రబంధ సంబంధిత చర్చనీయాంశాలకు చెందిన వివిధ సాహిత్య చరిత్రాది గ్రంథములను సంప్రదించి రచించి విద్వన్మిత్రులు వ్యాసములను పంపినారు . అయితే ఇంతలోనే వచ్చిపడిన కరోనా గండ సమయములో ప్రచురణ -ఆవిష్కరణాదులకు చెందిన సమయసందర్భ అవకాశాలు కుంటు పడుటచే ఏదైన పత్రిక ద్వారా మొదటి విడతగా ఈ ఐదు వ్యాసాలను వెలువరించ దలిచితిని. ఇంతలో దైవికముగా అమెరికాలో తమ పిల్లల దగ్గర ఉన్న ప్రసిద్ధ తెలంగాణ స్త్రీవాద రచయిత్రి,కవయిత్రి, ఒద్దిరాజు సోదరులపై విశేష శ్రమకోర్చి పరిశోధన చేసిన విద్వాంసురాలు డా॥ కొండపల్లి నీహారిణి ఒక రోజు ఫోన్ ద్వారా సంభాషిస్తూ , తాను ఒక ద్వైమాసిక అంతర్జాల పత్రికను ప్లవ ఉగాది నుండి ప్రథమ సంచికను వసంత సంచికగా ప్రకటించ’దలచినానని చెప్తూ , మీరు ఏదైనా ఒక ప్రత్యేక అంశానికి చెందిన తెలంగాణ సాహిత్య శీర్షికను నిర్వహింపవలెనని కోరినారు. వెదుకబోయిన రత్నము చేతికి దొరికినట్లు భావించి : వెంటనే నేను సేకరించిన తెలంగాణ ప్రబంధాలకు చెందిన విషయ విస్తృతిగల వ్యాసములను తమ ‘ మయూఖ ’ అంతర్జాల పత్రికలో ధారావాహికముగా ప్రచురించుకొన’వచ్చునని చెప్పినాను. అందుకు సంపాదకులు డాక్టర్ నీహారిణిగారు అంగీకారము తెలిపినారు .
తెలంగాణ ప్రబంధాలు శీర్షికతో తొలివిడతగా _తెలంగాణ పంచకావ్యాలు_ అనదగిన తెలంగాణ సాహిత్య వికాసరూపాలనదగిన ఐదు ప్రబంధాల పరిచయమాలికను సహృదయులకు అందించగలుగుతున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను.
ఈ పరిచయ మాలికను తమ మయూఖ తెలంగాణ సాహిత్య ద్వైమాసిక అంతర్జాల పత్రిక లో ప్రచురించుకొనుటకు అంగీకరించిన మయూఖ సంపాదకులకు తదితర నిర్వాహక కుటుంబ సభ్యులకు : హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జయంతి తే సుకృతినో రససిద్ధాః కవీశ్వరాః
గురిజాల రామశేషయ్య రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ తెలుగు హైదరాబాద్ +91 70326 79471
డా॥ బి. జయరాములు గారి పరిచయం
ఆధునిక తెలుగు సాహిత్యవేత్తలలో, ప్రవచన కర్తలలో సుప్రసిద్ధులైన వారిలో డా|| బి. జయరాములు గారు ఒకరు. హైదరాబాద్ మహానగరం కేంద్రంగా నిర్వహింపబడే ప్రముఖ సాహిత్య సంస్థల విశేష కార్యక్రమాలలో నిర్వహణ రీత్యా తన ప్రతిభా పాటవాలను ప్రకటించుకొని మెప్పు పొందిన అతి కొద్దిమందిలో జయరాములు గారొకరు. వీరు డాక్టర్ మాడుగుల నాగఫణిశర్మ గారి ద్విశత, సహస్ర, బృహత్ ద్విసహస్ర, పంచశత తదితర అవధానాల నిర్వహణలో ప్రముఖ పాత్ర వహించిన సంగతి పృచ్ఛకులుగా పాల్గొన్న వేలమందికే కాక తదితర ప్రేక్షక వర్గ మహాశయులెందరెందరికో తెలిసిన విషయమే. ఆ విధంగా సభా సమన్వయంలో సమర్థుడని పేరు పొందినారు.
ధార – ధారణ అసాధారణంగా కలిగిన మహో అవధానులలో డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ గారు ఒకరని జగద్విదిత విషయమే. తెలుగు ఠీవి మన పీవీ అంతటివారు పృచ్ఛకులుగా పాల్గొన్న ఘనత అవధాని డాక్టర్ మాడుగుల నాగఫణిశర్మ గారి అవధానానికి గొప్ప మెప్పు శాలువా ! అవధాన సభల నిర్వహణలో అవధానిగారు ప్రశాంత మనోజ్ఞా వాతావరణంలో సఫలీకృతం కావటానికి కావలసినంత సమయస్ఫూర్తి, పర్యవేక్షణ దక్షత కలిగినవారు. సాహిత్యాంశాల సమాకలన – సముచిత వర్గీకరణ వ్యుత్పన్నతలు కలిగినా సభాసమయ సాహిత్య వక్తలు ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం అని వేరే చెప్పనక్కర లేదు. డా|| జయరాములు గారు “ఇటువంటి సమన్వయ కర్త”. ఇట్లే డా|| మేడసాని మోహన్, డా|| మలుగు అంజయ్య, డా|| జి.ఎం. రామశర్మ, శ్రీ అష్టకాల నరసింహ రామశర్మ మొదలైన పెద్దల అవధానాలలో సభా సమన్వయంతో పాటు అప్రస్తుత ప్రసంగ పృచ్ఛకులుగా వీరి దోహదం పేర్కొనదగినది.
ఇక ఉద్యోగవృత్తి నిర్వహణ పరంగా అసోసియేట్ ప్రొఫెసర్ గా, ప్రిన్సిపాల్ గా అభ్యుదయ ప్రాచ్య కళాశాలలో 34 సం|| సుదీర్ఘ అనుభవమున్న వారు డా|| జయరాములు గారు.
వీరు సుప్రసిద్ధ విమర్శకులు డా|| జి.వి.సుబ్రహ్మణ్యం గారి పర్యవేక్షణలో “ఆంధ్ర ప్రబంధాలు – శృంగారం – ప్రయోగాలు” అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టాను పొందారు. ‘రస’ చర్చ చాలా లోతైన విషయమని తెలుగు ప్రబంధాలలో ‘శృంగారం’ ప్రధాన రసమని తజ్ఞులకు వేరే చెప్పనక్కర లేదు. వీరి కూలంకష పరిశోధన గురువుల మెప్పును అందుకున్నది.
ఇదే వరుసలో సత్యభామ తదితర పాత్రలకు చెందిన వీరి మరో గ్రంథము : “సాంత్వన కావ్యాలు – శృంగార నాయికలు” చెప్పుకోదగిందే. ఇట్లే పాఠశాల స్థాయి నుండి ఉన్నత విద్యా స్థాయి వరకు పాఠ్యరచన, బోధనా పద్ధతుల గ్రంథాలు రచించినారు. వివిధ పత్రికలలో అసంఖ్యాకంగా వైవిధ్యభరితమైన వ్యాసాలను ప్రచురించినారు.
భక్తి, పూజ, సివిఆర్, హిందూధర్మం, జెమిని, జయ జయ శంకర మొ|| టి.వి. ఛానల్స్ లో దేవాలయాల్లో ఆధ్యాత్మిక ప్రవచనాలు, చర్చలు వీరివి ఎన్నో ఎన్నెన్నో. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక పురస్కారం పొందిన డా|| జయరాములు గారిని ‘విశ్వసాహితి’ తదితర సంస్థల పురస్కారాలెన్నో వరించినవి. హైదరాబాద్ మహా నగరంలో ప్రసిద్ధి పొందిన గొప్ప సాహిత్య, కళారంగ సంస్థలకు కొదువ లేదు. అయితే వృద్ధాప్య కారణంగా ఆయా సంస్థల వ్యవస్థాపక అధ్యక్షులు తగినంత చేవతో ఆ సంస్థలను నిర్వహించలేని స్థితిలో రెండవతరం నిర్వహణ సామర్థ్యశాలిగా డా|| జయరాములు గారు విశ్వసాహితి, యువభారతి సంస్థల అధ్యక్షులుగా, కార్యదర్శిగా వ్యవహరించడం గమనార్హం.
“విశ్వసాహితి” పక్షాన “నాటి పురాణం – నేటి సమాజం” శీర్షికన ప్రసంగాలను చేయించి గ్రంథాలుగా వెలువరించటం తొలి సంపుటం వెలువడడం జరిగింది.
“యువభారతి” పక్షాన “విశ్వనాథ సాహితీ సమాలోచనం” గురువుగారైన జి.వి.సు. గారితో సహ సంపాదక స్థాయిలో వెలువరించినారు. ఈ క్రమంలో “నేను-నా కళా ప్రస్థానం” ఒక గొప్ప ప్రయోగం. నటులు, కవులు, గాయకులు, సంగీత దర్శకులు, జానపద కళాకారులు, సినీ దర్శకులు, నాట్య కళాకారులు, చిత్రకారులు, శిల్పులు మొదలైన సీనియర్ మోస్ట్ అనుభవజ్ఞులతో నేటి యువ కళాకారులకు స్ఫూర్తిదాయకమైన రోల్ మోడల్ విధాన ప్రసంగ పరంపర ఎంతో ప్రయోజనకరమైనది. ఇటువంటిదే మరో అడుగు “సాహిత్య కళా రసవాహిని” కార్యక్రమ పరంపర. ఆనందం – సందేశం జమిలిగా కళ యొక్క ప్రయోజనమని అనుభవంలోనికి తెచ్చే సరళీ స్వరకల్పనం ఈ కార్యక్రమాల లక్ష్యం.
“ఆధునికాంధ్ర కవులు” 51 మందిని గురించిన గ్రంథం వీరి గ్రంథాలలో ఒక ప్రత్యేక గ్రంథం. తమ గ్రామమైన చిత్తలూరులోని నల్లగొండ జిల్లాలోని కాకతీయ చారిత్రక ప్రసిద్ధమైన మిని నిర్మాణ రీతిలో ఉండే “శంభులింగేశ్వరాలయ” దైవము పైన రచించిన శ్రీ శంభులింగేశ్వర శతకం మొదలుగా అనేక కావ్యాల విమర్శన వ్యాసాలూ, పరిశోధన వ్యాసాలూ, అమెరికా పర్యటన సంబంధ విశేషాల గ్రంథాలు వీరివి 15 వరకు ఉంటాయి. పల్లె నుండి మహా నగరం దాకా; అమెరికా TANTEX దాకా వీరికి జరిగిన సన్మానాలు వీరి సాహిత్య సేవకు సహృదయులందించిన ప్రతిస్పందనల కలికితురాయిలే.
తెలంగాణ ప్రబంధాలలో మేటి ప్రబంధముగా ప్రసిద్ధ విమర్శకులచే ప్రశంసలు పొందిన “తపతీ సంవరణోపాఖ్యానం” గురించి సమగ్ర పరిశీలనతో – చర్చా పూర్వక అంశాలతో నిగ్గుదేల్చినట్లు కొన్ని అంశాలను తేల్చివేసి ఉత్తమ ప్రబంధంగా తపతీ సంవరణాన్ని నిర్ధారించిన డా|| బ్రాహ్మణపల్లి జయరాములు గారికి “తెలంగాణ ప్రబంధాలు” పరిచయ మాలిక నిర్వహణకర్తగా అభినందనలు, అభివందనములు తెలుపుకుంటున్నాను. కృత శ్రములకు వందనములు తెలుపుకొనుట కృతజ్ఞతయే.
తెలంగాణ ప్రబంధ వ్యాసపరంపరలో ఇది రెండవ వ్యాసము. సకాలంలో వ్యాసం అందించిన జయరాములు గారికి సాహితీ బంధువుగా ఆప్తవాక్యం పలుకుతూ సహృదయ విద్యాంసులైన పాఠక మహాశయులకు నమోవాకములు సమర్పిస్తూ….
భవదీయుడు
– గురిజాల రామశేషయ్య
తెలుగు సాహిత్యంలో ప్రబంధం ఒక ప్రత్యేక ప్రక్రియ. సంస్కృత లాక్షణిక సంప్రదాయంలో ప్రబంధం అంటే కావ్యమే. కాని 16వ శతాబ్దంలో కవులు రచించిన కావ్యాలకే ప్రబంధాలు అనే రూఢి ఏర్పడింది. ప్రకృష్టమైన బంధం కలది ప్రబంధం. ఆ బంధం శబ్దార్థాలలో పద్యాలలో ప్రధానంగా కనబడుతుంది. వస్త్వలంకారాలలోనూ దాన్ని దర్శింపవచ్చును. అయితే రూఢినిబట్టి ప్రఖ్యాత వస్తుకం, శృంగారరస ప్రధానం, ధీరోదాత్త నాయకం, అష్టాదశ వర్ణన భూయిష్టం, ఆలంకారిక రచనాబంధురం, పంచాశ్వాస పరిమితమైన చంపూ కావ్యాన్నే తెలుగువారు ప్రబంధంగా భావిస్తారు.
ప్రసిద్ధమైన ఏ ఉపాఖ్యానాన్నో గ్రహించి, స్వీయకల్పనలతో పెంచి, అష్టాదశ వర్ణనలతో శృంగార రసబంధురంగా ఆలంకారిక శైలిలో ప్రబంధ రచన చేయడం ప్రబంధ కవి పద్ధతి. వారు ఎన్నుకొనే కథలో ఓ కొత్తదనం, నిర్వహణలో నిండుదనం ఉంటుంది. ఈ లక్షణాలన్నీ మనం అద్దంకి గంగాధర కవి రచించిన “తపతీ సంవరణము” అనే ప్రబంధంలో దర్శించవచ్చు.
కవి – కాలం – స్థలం :
అద్దంకి గంగాధర కవి 16వ శతాబ్ది కవి. ఈయన ఈ ప్రబంధాన్ని 1550-65 మధ్య రచించి ఉంటాడని మల్కిభరాముని పాలనా కాలాన్నిబట్టి నిర్ణయించారు పాటిబండ మాధవశర్మగారు. కాని “ఏలిక ఆసక్తి మేరకు ఆనాటి సాహిత్య లోకపు ‘ఫ్యాషన్’లకు లోబడి వసుచరిత్ర మూసలోనిదా అనిపించేటట్టు ఈ కావ్యాన్ని రచించాడు. అందుకే సాహిత్య చరిత్రకారులూ, విమర్శకులూ కొన్ని కొన్ని అభిప్రాయాలకూ వచ్చారు” అంటూ ఆరుద్రగారు తమ సమగ్రాంధ్ర సాహిత్యం రెండవ సంపుటిలోను, కందుకూరి వీరేశలింగంగారు ఈ ప్రబంధం “వసుచరిత్రమును బోలి వరలుచున్నది” అన్న మాటను కూడా పూండ్ల రామకృష్ణయ్యగారు ఖండిస్తూ “వసుచరిత్రకు వసుచరిత్రమే సాటిగాని మరియొక గ్రంథము మన భాషలో నిప్పటికీ లేదు” అన్న వాక్యాల్ని ఉటంకించారు. అయితే పాటిబండ మాధవశర్మగారు ఈ ప్రబంధ పీఠికలో ఆ అభిప్రాయాలను ఖండించి, “ముందు వచ్చిన చెవులకన్న వెనుక వచ్చిన కొమ్ములు వాడి” అన్నట్లు తపతీ సంవరణమే ముందు పుట్టినను, తరువాత పుట్టిన వసుచరిత్రమునకు ముందు ప్రచారము కలిగినది. వసుచరిత్ర పద్యములు ముందుగా చదివి ఉన్నవారు తపతీ సంవరణ పద్యములు చదివి గంగాధరుడు “రామరాజ భూషణుని” అనుసరించెననుట సహజము’’ అనే వాక్యాలను ఉదాహరించారు. అలా చెబుతూనే ఆరుద్రగారు “…. గంగాధరుడు సత్యమే. ఇతని కావ్యం రస బంధురమే. సుప్తమీన జలాశయంబు చందంబున కనబడే ఈ కావ్యంలో వెతికితే వసుచరిత్రలో లాగా కొన్ని గడుసు పోకడలు కనబడుతాయి” అని మళ్ళీ తరువాత వచ్చిన వసుచరిత్ర పొకడలు “తపతీ సంవరణము”లో కనబడతాయనడం గడుసుదనమే. తర్వాత వచ్చిన ప్రబంధం పోకడలు ముందు దానిలో ఎలా కనబడతాయి? ముందు వచ్చిన (1550-1565) ప్రబంధపు పోకడలే తరువాత వచ్చిన (1580) ప్రబంధంలో కనబడతాయనడం సమంజసం. పాటిబండ వారు చెప్పినట్లు “గంగాధర కవి వసుచరిత్రమును చూడలేదు, అనుకరించను లేదు. రామరాజ భూషణుడే పూర్వకవుల భావములను పెక్కింటిని అనువదించినట్లు గంగాధర కవి భావములను కూడా కొన్నింటిననుకరించెనేమో” అనడం సమంజసం, సత్యం. ఈ తెలంగాణ ప్రబంధమునకు గౌరవ ప్రదం. గర్వకారణం.
గంగాధర కవి తండ్రి వీరయామాత్యుడు. ఇంటి పేరు అద్దంకి. ఆయన గురువు కేదారశ్రీ. ఇంతకుమించిన వివరాలు కవి గురించి లభించడం లేదు. అద్దంకి నెల్లూరు జిల్లాలో ఉండడంవల్ల ఈ కవి పూర్వులు అక్కడ ఉండేవారని పాటిబండవారు ఊహించారు. గంగాధర కవి తాతగారి కాలంలోనో, తండ్రిగారి కాలంలోనో గోలకొండ ప్రాంతానికి వచ్చి ఉంటారని శర్మగారన్న మాటలు సమర్థనీయాలే. దీన్నిబట్టి గంగాధర కవి నూటికి నూరుపాళ్ళు తెలంగాణ ప్రాంతపు కవే. గంగాధర కవి వేదాలు, భాష్యం, మీమాంసాశాస్త్రం బాగా చదువుకున్న పండితుడు. కులీకుతుబ్ షా వంశీయుడైన ఇబ్రహీం (ఇభరాముడు)కు గంగాధర కవి తన తపతీ సంవరణాన్ని అంకితమిచ్చాడు. ఇభరాముడే స్వ యంగా, “….భారతాఖ్యానమందు గలుగు తాపత్య చరితంబు ఘనత నరసి వివిధ శృంగార మహిమల విస్తరించి కబ్బమొనరింపు నా పేర గవివరేణ్య” (1-19) అని అడిగి, ఈ రసవత్పబంధాన్ని అంకితం గొన్నాడు.
ప్రబంధం – సామాజిక నేపథ్యం :
‘పదహారవ శతాబ్దంలో ఆవిర్భవించిన ప్రబంధ సాహిత్యం మాత్రం చాలా ‘విలాసం’గా నింపాదిగా పుట్టింది. రాజుల్లాగా రాజోద్యోగులు కూడా కృతుల్ని రచింపిం చేశారు. అంకితాలు పుచ్చుకున్నారు. అందుచేత ‘కవి’ సమాజం నుండి ప్రేరణ పొందింది చాలా తక్కువ’ అంటారు ప్రసిద్ధ విమర్శకులు హెచ్.ఎస్. బ్రహ్మానందం (ప్రబంధ సాహిత్యాన్ని సృష్టించిన సమాజ స్వరూపం).
ప్రబంధ కవులు ఎలాంటి వాతావరణం ఉండాలని కోరుకున్నారో పెద్దన చాటు పద్యం చెబుతూంది.
“నిరుపహతి స్థలంబు రమణీ ప్రియదూతిక తెచ్చియిచ్చు క
ప్పుర విడెమాత్మ కింపయిన భోజన ముయ్యల మంచ మొప్పు త
ప్పరయు రసజ్ఞులూహ తెలియంగల లేఖక పాఠకోత్తముల్
దొరికినగాక యూరక కృతుల్ రచియింపు మటన్న – శక్యమే?”
సప్త సంతానాలలో నశించనిది ‘కృతి’ కాబట్టి రాజులు తమ పేరు ఆచంద్రార్కం నిలుపుకునేందుకు కవులకు ప్రోత్సాహం ఇచ్చారు. ప్రబంధం ఒక ప్రక్రియగా విశిష్ఠ స్థానం పొంది, తెలుగు సాహిత్య చరిత్రలో చిర, స్థిరస్థాయిని సాధించుకున్నది. ప్రబంధాలు సామాజిక దృష్టితో చూస్తే నాటి పరిస్థితులను కొంత చిత్రించినా, సాహిత్య స్పృహతో వ్రాయడంవల్ల ఆనంద పర్యవసాయులుగా అంటే ఆనందం (సద్యఃపరనిర్వృతి) అనే కావ్య ప్రయోజనాన్ని ప్రధానంగా నెరవేర్చేవిగానే దర్శనమిస్తాయి. అయితే ఆకలిదప్పులు మనిషికి ఎంత సహజాతాలో ఒక విధంగా కళానంద లాభము అటువంటిదే కనుక ఆనంద పర్యవసాయి కళలు నిరంతరకాల ప్రయోజనకరాలేనని చెప్పవచ్చును.
శ్రీ కృష్ణదేవరాయల యుగం (16శ.) తెలుగుసాహిత్య చరిత్రలో స్వర్ణయుగంగా ఖ్యాతి గడించింది. నాటి మహమ్మదీయ ప్రభువుల ప్రభావంతో పాలకులలో, కవులలో రసిక జీవనం అలవాటై శృంగార రసప్రబంధాలు రావడానికి మూలమైంది. మొత్తం మీద ప్రబంధ కాలం నాటి రచనలు తమ స్వతంత్ర ప్రతిపత్తిని నిలుపుకొని ఒక యుగంగా సాహిత్య చరిత్రలో స్థిర చిరకీర్తిని పొందాయి. పాఠకునికి మానసోల్లాసం కలిగించడానికి, కవితాతత్త్వం అందించడానికి, నాటి సామాజిక నేపథ్యం తెల్పడానికి ప్రబంధాలు దోహదం చేస్తాయి.
తపతీ సంవరణము – కథా సంగ్రహం :
సంవరణుడు అనే రాజు హస్తినాపురాన్ని పరిపాలిస్తున్నాడు. ఒకనాడు ఆ రాజు ప్రమదా వనానికి వెళ్ళి ఒక సహకార (మామిడి) వృక్షం కింద కూర్చున్నాడు. ఇంతలో ఒక చిలుక వచ్చి ఆతని చేతి మణికట్టుపై వాలింది. దాని అందానికి మురిసిన రాజు దాన్ని తన సహచరులకు చూపిస్తూండగా అది మానవభాషలో సూర్యుని కూతురైన తపతి సౌందర్యాన్ని వర్ణించి చెప్పింది. ఆ చిలుక, తపతి కోసం తగిన రాకుమారుని వెదుకుతూ దేశాలన్నీ తిరిగి, అలసిపోయి ఈ చెట్టుపై విశ్రాంతి తీసుకుంటున్నానని, ఇంతలో అతిలోక సుందరుడవైన నిన్ను చూశానని, నువ్వే తపతికి తగిన పతివని చెప్పింది.
సంవరణుడు చిలుక పలుకులు విని మోహపరవశుడై దాన్ని, దాని మాటలను ప్రశంసించాడు. కాని, తపతి దేవకన్య కాబట్టి మానవుణ్ణైన తాను ఆమెను పొందలేనన్నాడు. ‘దైవయోగం ఉంటే ఏదైనా సాధ్యమే’ – అని మీరామెను వరిస్తే పూవుకు తావి అబ్బినట్లు ఉంటుందని రాజునుత్సాహపరిచి, వారిద్దరినీ కలపడానికి యత్నిస్తానంది చిలుక. తపతి తల్లిదండ్రులు అంగీకరిస్తారో లేదో నువ్వే ఏదైనా చేయుమని చిలుకను సంవరణుడు వేడుకున్నాడు. సూర్యుడు తపతిని ఆ రాజుకివ్వడానికి అంగీకరిస్తాడని నచ్చచెప్పగా, చిలుకను వెంటనే వెళ్ళి తిరిగి రమ్మని పంపించాడు. చిలుక ‘నీ కోరిక నెరవేరుతుంది’ అని వెళ్ళింది. సంవరణుడు విరహంలో పడి బాధననుభవిస్తుండగా ఆయన పరిచారకులు శిశిరోపచారాలు చేశారు. రాజు తపతి తల్లిదండ్రుల మాట వింటుంది అనే విశ్వాసంతో సూర్యోపాసన ప్రారంభించాడు. సూర్యుడు సంతసించి, తన కూతుర్ని అతనికే ఇవ్వాలనుకున్నాడు.
చిలుక, తపతి ఉన్న చోటుకు వెళ్ళి ఆమె చేతిమీద వాలింది. తపతి, ఇన్నాళ్ళు నువ్వు ఎక్కడికెళ్ళావు?’ అని చిలుకను అడిగింది. చిలుక, ‘నీకోసం వరుణ్ణి వెదుకుతూ, అన్ని దేశాలు తిరిగి, హస్తినాపురంలో బహు సుందరుడైన సంవరణుడనే రాజును చూశానని” అతని సౌందర్యాన్ని వర్ణించింది. తపతి, ‘ఆ మనోహరాకారుడు తనను వరిస్తాడా?’ అని సందేహిస్తుండగా చిలుక, ‘తానామె సౌందర్యాన్ని వర్ణించగానే అతడు మోహ పరవశుడయ్యాడని’ చెప్పింది. తపతి కూడా విరహవేదన పొందింది. చిలుక సంవరణుని దగ్గరకు వెళ్ళి, ‘కార్యం ఫలించింది’ అని చెప్పి తానుండే చోటుకు వెళ్ళిపోయింది. తపతిని వెదుకుతూ చెలికత్తెతోపాటు అందరూ ఆమె చెంతకు వచ్చారు. ఆమె తాపానికి కారణం అడిగారు. ఆమె మౌనాన్ని అర్థం చేసుకున్న ఒక చెలికత్తె అందరినీ దూరంగా పంపించి, ‘నీ మనోహరుడెవడు?’ అని అడిగింది. తపతి జరిగిందంతా పూసగుచ్చినట్లుగా చెప్పింది. ‘దీనికింత బాధెందుకు? అతడు నీవాడయ్యేటట్లుగా చేస్తా’ నంది చెలికత్తె. ఇంతలో సాయంత్రం కావటం, చీకటి వ్యాపించడం, చంద్రుడుదయించడం జరిగింది. తపతి చంద్రతాపాన్ని తట్టుకోలేక చంద్రోపాలంభన చేసింది. బాధించే మన్మథుని తిట్టి బాధపడింది. చెలికత్తెలు ఉపచారాలు చేశారు. సూర్యోదయం కాగానే చెలికత్తెలు ఆమెను కాలక్షేపం కోసం భూలోకానికి తీసుకొని వచ్చారు. అది వసంత ఋతువు. చెలికత్తెలు పూలు కోస్తుండగా తపతి మాత్రం విరహవేదన పడుతుంది. వారు మదన పూజ చేశారు. ఇంతలో వేటకు బయలుదేరిన సంవరణుడు వనమంతా తిరిగాడు. అపుడు ఒక వనమయూరం అక్కడికి రాగా దాన్ని పట్టుకోవడం కోసం రాజు ఒక డేగ (సాళువా)ను పంపించాడు. వాటిని వెన్నంటాడు రాజు. కొంత దూరం వెళ్ళాక అవి కనిపించకుండా పోయాయి. తన గుర్రం అలసిపోవడంతో రాజు, దాన్ని వదలి తాను నడుస్తూ, తపతి, ఆమె చెలికత్తెలున్నచోటికి చేరుకున్నాడు.
సంవరణుడు: ఆ దివ్యకాంతలు, వారి మధ్య తపతిని చూసి ఒక చెట్టు మాటున దాగి వారిని చూశాడు. తపతిని చూసి ఆమె చిలుక చెప్పిన సుందరాంగే అయ్యుంటుందని భావించి, కామ పీడితుడై ఆమెను చేరరాగా చెలికత్తెలంతా మాయమయ్యారు. తపతి మాత్రం ‘చిలుక చెప్పిన రాకుమారుడతడే అయ్యుంటాడని భావించి అక్కడే తను యోగమాయచే దాగి ఉంది. సంవరణుడు ఆమెను కానక దుఃఖిస్తూ నేలపైబడి దొర్లాడు. తపతి జాలిపడి తనను దాచుకొన్న తాను అతని దగ్గరకు వచ్చింది. ఎందుకిలా బాధపడుతున్నావని అడిగింది. రాజు ఉన్న విషయం చెప్పి, గాంధర్వ పద్ధతిలో తనను పెళ్ళి చేసుకొమ్మన్నాడు. ఆమె, తాను తండ్రి చాటు పిల్లనని, సూర్యునారాధించుమని చెప్పింది. మూర్ఛిల్లిన సంవరణుడు తేరుకొని, తన సేనలను నగరానికి పంపి, రత్నకూటంలో తాను తపస్సు చేయడం ప్రారంభించాడు.
వశిష్ఠుడు అరుంధతీ సహితుడై వచ్చి, ఎందుకిలా తీవ్ర తపస్సు చేస్తున్నావనగా, రాజు తమ దివ్యదృష్టికి తెలియనిదేమున్నది? అన్నాడు. వశిష్ఠుడు విషయం గ్రహించి, ఇంత మాత్రానికి తపస్సెందుకు నేను తపతిని తీసుకొని వస్తానని సూర్యమండలానికెళ్ళాడు. వచ్చిన పని తెల్పగా సూర్యుడు సంతసించి, ఆ దంపతులకు తన కూతురు తపతిని అప్పగించాడు. ఆ ముని దంపతులు తపతిని తీసుకొని వచ్చి తపతీ సంవరణులకు అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. తానే కన్యాదానం చేశాడు. రాజు తన భార్య తపతితో తన భవనానికి వెళ్ళాడు. ఆమెతో కామ్య భోగాలనుభవిస్తూ మలయ పర్వతంపై విహరిస్తున్నాడు. రాజు పరిపాలనను వదిలేయడంవల్ల రాజ్యంలో అనావృష్టి ఏర్పడి, రాజ్య సంక్షోభం కలిగింది. వశిష్ఠుడు రాజు దగ్గరకు వచ్చి, సదుపదేశం చేసి, పాలన చేయుమన్నాడు. రాజు భార్యతో నగరం చేరి, రాజ్యాన్ని సుభిక్షంగా పాలించాడు. తపతి గర్భం ధరించింది. శుభలగ్నంలో కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు యువకుడు కాగానే అతనికి సంవరణుడు రాజ్య పట్టాభిషేకం చేశాడు.
ఇతివృత్తానుశీలనం – కల్పనా చమత్కృతి :
ప్రఖ్యాతమైన ఇతివృత్తాన్ని గ్రహించి, వర్ణనాదులచే పెంచి, శృంగార రసబంధురంగా, స్వీయ కల్పనా చమత్కృతితో ప్రబంధంగా తీర్చిదిద్దడమే ప్రబంధ కవి రచనా పద్ధతి. మహాభారతం ఆదిపర్వంలోని సప్తమాశ్వాసంలో 68 నుంచి 90వరకున్న కేవలం 23 గద్య పద్యాలలో ఉన్న ఇతివృత్తాన్ని గ్రహించి, గంగాధర కవి సుమారు 500 గద్య పద్యాలున్న ఐదాశ్వాసాల ప్రబంధంగా తీర్చిదిద్దాడు. భారతంలో తపతీ సంవరణం ఒక ఉపాఖ్యానం. దాన్ని స్వతంత్ర ప్రబంధంగా మలిచాడు తెలంగాణ అద్దంకి గంగాధర కవి. అలా మలచడానికి గంగాధర కవి కథలో చేసిన కల్పనలు, పాత్రలను చిత్రించిన విధం, శృంగారాన్ని పోషించిన రీతి, వర్ణనా వైదగ్ధ్యం, కమనీయ కవితా శిల్పం తదితరాలను పరిశీలిద్దాం. వ్యాసపరిధిని బట్టి స్థాలీపులాకన్యాయంగా వీటిని అనుశీలిద్దాం.
ఎ) కథాకల్పనం – సన్నివేశ చిత్రణం : కథా కథనంలో పూర్వాపరాల సమన్వయం కుదరడానికి, కార్యకారణ సంబంధం పొసగడానికి ప్రబంధ కవి కొన్ని సన్నివేశాలను కల్పించాల్సి ఉంటుంది. గంగాధర కవి కథాకల్పనలో – చిలుక రాయబారం, శ్యేన మయూరాల పోరాటం, తపతి చెలికత్తెలు, అనేక వర్ణనలు – అనే నాలుగు అంశాలు మూలకథ కంటే రసపరిపోషక కథన పరంగా అధికంగా ఈ ప్రబంధంలో దర్శనమిస్తాయి.
“వాచావధూ విడంబిని
యా చారు కటీ రథాంగ యా సకల కళా
వైచిత్రిణి గావున నా
కాచర్యత్వము వహించెనయ్య మహీంద్రా! (ఆ2-37ప)
ఆఱంగములతోడు బారంగతంబుగా
నిగమములను సరహస్యముగను జదివి
కావ్యజాలము లలంకార మిశ్రంబుగా
గరతలామలకంబుగా నొనర్చి
భాష్య ఫక్కిక పాఠ పాతంజలి జలంబు
లాలాజలంబుగా లీలగ్రోలి
మీమాంస లేకుండ మీ మాంసయు బఠించి
బ్రహ్మ సాక్షాత్కార భావమంది
పేరు బలమున దత్వ విచారగరిమ
శుక మహాద్విజ ముఖ్యుతో సూడువట్టి
యున్ననాకిక నితరాంధ్రయుక్తియెంత?
హస్తిపదమున నడగవే యడుగులెల్ల!! (2 ఆ – 38 ప)
ఈ పద్యంలోని విద్యా విశేషాలు నాయికకు, ఆమె శిష్యుడైన చిలుకకు మాత్రమే ఉన్నట్లు కాదు, ఇవి పరోక్షంగా గంగాధర కవి పాండిత్య గరిమను తెలిపేవిగా కనపడతాయి. ఇదొక చమత్కార ఇష్టరచన విధానం.
నలోపాఖ్యానంలో హంసరాయబారం ఈ కవికి ప్రేరణ కలిగించి ఉంటుందని పాటిబండ మాధవశర్మగా రన్నారు. నాయికా నాయకుల వినుకలి ప్రేమకు, వారి సమాగమానికి, సంధానకర్తగా వ్యవహరించింది చిలుక. అది మొదట సంవరణుని మణిబంధంపై వాలి, అతడిని సంసిద్ధుడిని చేసి తిరిగి వచ్చి తపతి మణిబంధంపై వాలింది. తపతీ సంవరణుల ‘పాణిగ్రహణా’నికి ఈ విధంగా ప్రతీకాత్మకంగా చిలుక సంధాన కారణమైంది. ఆ చిలుక తపతి సౌందర్యాన్ని వర్ణిస్తూ,
“సారస సంభవుండఖిల సర్గ నిమిత్తము గూర్చియున్న శృం
గార రసంబు నెల్లనిడి కౌతుక మొప్పగ నీతలోదరిం
గా రచియించి….” (2-11) అని చెప్పినట్లుగానే,
ఆమెతో సంవరణుడి సౌందర్యాన్ని వర్ణించి చెబుతూ
“అహహ! ఈ రేడు లోకంబులందుగలుగు
సకల లావణ్య రసమెల్ల సంగ్రహించి
గరిమ నారాజు గావింపఁ గరువు గట్టి
చేసెగాబోలు నేర్పుతో సృష్టికర్త’’ (3-28)
అని చెప్పింది. తపతి శృంగార రసమూర్తియని సంవరణుడు లావణ్య రసస్ఫూర్తియని వారి వారి అందాలను వర్ణించి, ఒకరి రూపం మరొకరి హృదయంలో హత్తుకొనేటట్లుగా చేసింది చిలుక. “స్త్రీ సౌందర్యం పురుషుణ్ణి చురుకుగా స్పందింపజేసే విధమే శృంగార రసమూర్తియని చెప్పినాడు. పురుషుని మెరుగారు లావణ్యమునకు లవణ స్ఫటికములకు తళుకు గుణము ఎక్కువ. పురుషుని తేజో తనము స్త్రీని ఆకర్షించును. కనుక గంగాధర కవి సంవరణుని లావణ్యమూర్తియని పేర్కొని వధూవరుల పరస్పరాకర్షణ సన్నివేశమును బలిపరచినాడు. ఇది ప్రబంధ నిర్మాణ శిల్పమునందలి ఒక ముఖ్య లక్షణము.” చిలుక పాత్ర కల్పనంవల్ల ప్రబంధ కథకు కథనపరమైన ఔచిత్యం శృంగార రసపోషణావకాశం ఏర్పడ్డాయి.
శృంగార రస పోషణం : తపతీ సంవరణములో శృంగారం అంగి, తక్కిన వీరాదులు అంగాలు. “విభవాను భావ వ్యభిచారి సంయోగాద్రస నిష్పత్తి:” – అనే భరతుని రస సూత్రం ప్రకారం ఆయా భావాల పోషణ ఈ ప్రబంధంలో అద్భుతంగా జరిగింది. తపతీ సంవరణులు ఆలంబన విభావాలు. ప్రబంధనామమే ఇది శృంగార ప్రధానమైందని తెలుపుతూంది. నాయికా, నాయకుల వర్ణన, వారి ఆభిజాత్యం, వారి వినుకలి ప్రేమ, వారి విరహం (పూర్వరాగం), వారి కలయిక, నాయకుని తపస్సు, వారి వివాహం అనే విషయాలు క్రమపద్ధతిలో సాగిపోయాయి. ఉద్దీపన విభావంగా చిలుక వర్ణించిన నాయికా నాయకుల సౌందర్యాది గుణాలు, అడవిలో వారు కలుసుకోవడం కనిపిస్తుంది. వారిలో అంకురించిన ప్రేమవల్ల వారి మాటలలో, చేష్టలలో భ్రూ విక్షేపకటాక్షాది అను భావాలు దర్శనమిస్తాయి. అలాగే నిర్వేదాది సంచారి భావాలు నాయికా నాయకుల మాటల్లో విరహబాధలో వ్యక్తమయ్యాయి. చిలుక నాయికను వర్ణించి వెళ్ళగానే నాయకునిలో విరహం ఏర్పడింది. శ్రవణం వల్లగాని, దర్శనంవల్లగాని రాగం ఏర్పడితే దాన్ని పూర్వరాగం అంటారు. నాయిక గుణాలు విని నాయకునిలో పూర్వరాగం ఏర్పడ్డట్లే, నాయిక కూడా చిలుక చెప్పిన సంవరణుని సౌందర్య గుణాలను విని పూర్వరాగానికి లోనయింది. అదే అభిలాష విప్రలంభం. “న వినా విప్రలంభేన శృంగార: పుష్టిమశ్నుతే” అనే ఆలంకారిక వచనం ప్రకారం ఈ విప్రలంభ చిత్రణతో శృంగార రసానికి పుష్టి కలిగింది.
తపతీ సంవరణుల పూర్వరాగంలో దశవిధ మన్మధావస్థలు – అభిలాష, చింత, స్మృతి, గుణకథనం, ఉద్వేగం, సంప్రలాపం, ఉన్మాదం, వ్యాధి, జడత, మృతి (మూర్ఛ) అనే కామావస్థలు – కనబడతాయి. ఈ చిన్న వ్యాసంలో లక్ష్య లక్షణ సమన్వయం కుదరదు. విజ్ఞులు వాటిని నాయికా నాయకుల విరహంలో దర్శంచవచ్చును.
వర్ణనా వైదగ్ధ్యం : తపతీ సంవరణములో గంగాధర కవి ప్రబంధోచిత వర్ణనలు అనేకం చేశాడు. వాటిలో నగర, శైల, ఉద్యానవన, ఋతు, వనవిహార, జలక్రీడ, వేట, సూర్యాస్తమయ, అంధకార, చంద్రోదయ, మలయానిల, సూర్యోదయ, వివాహ వర్ణనలు ఉన్నాయి. ఇవి కాక నాయక వర్ణన, నాయికా వర్ణన, సురత వర్ణన, గర్భవర్ణన, పుత్రోదయ, తపోవర్ణనలు కనిపిస్తాయి.
ఈ ప్రబంధంలోని వర్ణనలలో విశిష్టమైనవి: తపతీ సంవరణుల రూప – గుణవర్ణనలు, వారి విరహ వర్ణనలు, నగర వర్ణన, సంవరణుని సూర్యోపాసన, వారి వివాహ సంభోగ వర్ణనలు, గంగాధర కవి వర్ణనలలోని వైదగ్ధ్యం గ్రహించడానికి కొన్ని ఉదాహరణలిస్తాను.
ఎ. నగర వర్ణన : హస్తినాపురాన్ని ఒక సీస పద్యంలో కవి చక్కగా వర్ణించాడు –
“శ్రీ భా విశేష మిశ్రీభావి భవనంబు
సారస కవిత కాసార సమితి
ప్రాకార వజ్ర దీప్రాకార హర్మ్యంబు
కుంజరంజిత భద్రకుంజరంబు
రమణీయతావాస రమణీయుత విలాసి
కాంచన సౌధాది కాంచనంబు
రాజ హంస కులీన రాజహంస కులంబు
బంధు రమ్య గృహస్థ బంధురంబు
కల్పనానల్ప శోభనా కల్పకంబు
గోపుర ద్వార చుంబిత గోపురంబు
సింధుజన్మాశ్వ దేశీయ సింధుజంబు
గజపురం బొప్పు జితమరుదజపురంబు” (1-46)
హస్తినగరంలోని దుర్గ, పరిఖ, హర్మ్యాదులు, చాతుర్వర్ణ్య ప్రజలు, రథగజ తురగ భటాదులు, విటవేశ్యాపుష్పలావికాదుల వర్ణనలు మనోహరంగా చేశాడు కవి.
బి. నాయక వర్ణన : ఈ ప్రబంధంలోని నాయకుడు సంవరణుడు. ఆయన వీర, కరుణ, దానాదిగుణాలను అనేక పద్యాలతో కవి అద్భుతంగా వర్ణించాడు. ఆ రాజు యొక్క ఐశ్వర్యం, ఆకారం, శౌచం, సహనం దాతృత్వం అనే గుణాలను వర్ణించిన ఈ పద్యం చూడండి.
“సారవిభూతి రెండవ వృషధ్వజు, డాకృతిచే దృతీయబృం
దారక వైద్యు, డిద్ధ శుచితా గుణమందు జతుర్థ పావకుం,
డారయ భూమి మోచుటకు నైదవదిక్పతి, దానరేఖచే
నారవ కల్పవృక్షమన నన్నర పాలుడుమించె గీర్తులన్” (1-72).
సంవరణుడు ధీరోదాత్తుడు, సర్వగుణ సంపన్నుడు. అందుకే శృంగార రసానికి తగిన నాయకుడుగా నిలిచాడు. కవి ఉత్తమ విభావంగా రాజును తీర్చిదిద్దాడు.
సి. నాయిక వర్ణన : తపతిని ఉత్తమ నాయికగా ఈ ప్రబంధంలో చిత్రించి నిరూపించాడు కవి.
“బంగారు మయమైన బ్రహ్మాండ భాండంబు” (2-10)
అనే పద్యం మొదలుకొని అనేక పద్యాలలో తపతి రూప సౌందర్యం, అంగాంగ వర్ణన (2-35) చేసి, ఆమె విద్యా వైభవాన్ని (2-38) చిలుక ద్వారా వర్ణింపచేశాడు కవి. నాయికా సౌందర్యం చిత్రించిన ఈ క్రింది పద్యం చూడండి.
“సారస సంభవుండఖిల సర్గ నిమిత్తము గూర్చియున్న శృం
గార రసంబు నెల్లనిడి కౌతుక మొప్పగ నీ తలోదరిం
గా రచియించి యొండొక సుగంధి సృజింపగలేమి, జుట్టుచే
బారలు నెట్టు బిమ్మటను బశ్చిమ బుద్ధులు గారె బ్రాహ్మణుల్ (2-11).
ఇలా చిలుక వర్ణించిన పద్యాల్లోనే గాక, సంవరణుడు వనంలో తపతిని చూసినపుడు వర్ణించిన అనేక పద్యాల్లో, ఆమె రూప, సౌందర్యాది గుణాలను మనం దర్శించవచ్చును. నాలుగో ఆశ్వాసంలోని 55 పద్యం నుంచి 62వ పద్యం దాకా నాయిక వర్ణన చక్కగా సాగింది.
“మగువ కన్బొమ్మలు మరుడు గానడు గాక
కనిన వర్ణింపడే కమ్మవిల్లు
శుకసాది సతిమోవి చూడడుగాక చూ
చిన చేతబట్టునే చిగురువాలు….” (4-62)
లాంటి పద్యాలు గంగాధర కవి వర్ణనా వైదగ్ధ్యాన్ని వేనోళ్ళ చాటుతున్నాయి.
డి. విరహ వర్ణన : నాయకుని విరహం, నాయికా, విరహం రెండూ అద్భుతంగా చిత్రించాడు గంగాధర కవి. చిలుక తపతిని గురించి చెప్పి వెళ్ళిపోయాక సంవరణుడు విరహంలో పడ్డాడు. ఈ సందర్భంలో అనేక పద్యాలున్నా ఒకటి మాత్రం –
“ఆ యవనీశుడీ కరణి నంగభవానల బాధ్యమానుడై
హాయని వెచ్చనూర్చు, నకటా! యని దైవముదూఱు, బచ్చపు
ల్గాయెడ నడ్డమైన దనయర్మిలి దూత యటంచుఁ గాయొ పం
డోయని కార్యపద్ధతుల నొయ్యన వేడును భ్రాంత చిత్తుడై (2-97)
దీనిలో ఉన్మాదం అనే మన్మధావస్థ ధ్వనిస్తూంది. అలాగే నాయిక విరహ వర్ణనలోంచి ఒక పద్యం చూద్దాం.
“చిక్కని మోము, మేలిమగు చెక్కులు, చొక్కపుహార వల్లిచే
నెక్కొను పేరురంబు, రమణీయ విశాల విలోచనంబులున్
జక్కుగమించు రాసుతుడు నాదుకవుంగిటి కాపురంబున
జిక్కిన నేలనే? మకర చిహ్నము తారుపట్టుగన్” (3-52)
దీనిలో గుణకథనం, సంప్రతాపం అనే మన్మథావస్థలు మనం చూడవచ్చు. ఇలా కావ్య శాస్త్రోచితమైన ఎన్ని వర్ణనలైనా ఉదహరించవచ్చును. ‘వర్ణనా నిపుణః కవిః’ అన్నారు కదా!
పాత్ర చిత్రణం : ప్రబంధ వస్తువు ఏక నాయకాశ్రయమై ఉండాలి. తపతీ సంవరణము ఏకనాయకాశ్రితమే అనడంలో ఎలాంటివి ప్రతిపత్తి లేదు. అలాగే ప్రబంధాలలో అపూర్వ పాత్రలుండడం కూడా ఒక లక్షణమే ఈ ప్రబంధంలోని చిలుక, తపతి – రెండూ అపూర్వ పాత్రలే. వశిష్ఠుడు ఆదర్శపాత్ర, పాత్ర చిత్రణలో కూడా గంగాధర కవి అపూర్వ వైశిష్ట్యాన్ని ప్రదర్శించారు. కొన్ని పాత్రోచిత రేఖాంశాలను పరిశీలిద్దాం.
ఎ) రాయబారి చిలుక : ఈ ప్రబంధంలో, తపతీ సంవరణుల సంధానంలో కీలకపాత్ర పోషించింది చిలుక. ఈ చిలుక నాయికా నాయకుల్లో వలపు కలగడానికి, తద్వారా అనుసంధానానికి పూలబాట నేర్పరచింది. ఈ చిలుక గొప్ప మేధావి. మానవ భాషలో మాట్లాడగలిగిన సమర్థురాలు. మానవులను, దివ్యులను ఒకచోటికి చేర్చగలిగిన, ఒకటి చేయగలిగిన అఘటనాఘటన సమర్థురాలు. మాటల మాంత్రికురాలు. తపతికి జీవిత భాగస్వామిని గురుదక్షిణగా తెచ్చుటకు శ్రమించిన బ్రహ్మచారి. అందుకే తపతిచే స్వయంగా తాను కోరిన “వరదక్షిణ”నే గురుదక్షిణగా ఇమ్మని అడిగించుకొంది.
“గురు దక్షిణ భావంబున
గురు దక్షిణ మున్నెయీయ కోరితి విపుడా
వర దక్షిణ యిమ్మదియే
వరదక్షిణ మాకు మదనావాహ వతంసా” (3-43)
ఇది తెలుగు ప్రబంధాలలో మణిపూస వంటి పద్యము. చిలుకకు చెందినది కనుక చిలుకు కొలికి కలికి మణిపూసయనిన మరింత ఒప్పిదము.
బి. సంవరణుడు : ధీరోదాత్తుడైన నాయకుడు. సకల గుణసంపన్నుడు రాజ్యపాలనాదక్షుడు.
సి) తపతి : దివ్యనాయిక. అయినా మానుషభావంతో మెలిగిన శృంగార నాయిక. సకల విద్యలు నేర్చిన జాణ విదుషి.
డి) వశిష్ఠుడు : పురోహితుడుగా, గురువుగా తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించిన మునీశ్వరుడు.
ఇ) తపతి చెలికత్తెలు : తపతిని భూమ్మీదికి తీసుకొచ్చి, సంవరణుని కలవడానికి వీరు కీలకపాత్ర పోషించారు.
గంగాధరుని కవితా శిల్పం : పద్య రచనా విధానంలో, భావుకతలో గంగాధర కవి గొప్ప ప్రతిభను కనబరిచాడు. “ఆ తపతి దివ్య కన్య. తాను మానవుడు. తననెలా చేరుతుంది” అన్న సంవరణుని సంశయానికి చిలుక చెప్పిన సమాధానం అద్భుతం –
“జలజదళ నేత్ర రెండవ చంద్రరేఖ
ధరణి తలమున రాజశేఖరుడ వీవు
ఇంతకన్నను విధియోగ మేమి కలదు?
కైలాసంలో ఉన్న రాజశేఖరుని ఒక చంద్రరేఖ చేరింది. తపతి రెండో చంద్రరేఖ. భూలోకంలో రాజశేఖరుడవైన నిన్ను ఆమె చేరక తప్పదు. ఇదే దైవయోగం – అని చెప్పడమేగాక మన్మథ, వసంతులు ఇరువురూ తపతిని నీతో కూర్చకుంటే మన్మథుడేమి సంధాన కర్త? ఏమి విలుకాడు?? అతనికి వసంతుడేం స్నేహితుడు? అని ప్రశ్నించింది చిలుక. పద్యంలోని సొగసులను (విరుపులను) చూసి, పాఠకుడు ఓహో! అని మెచ్చుకోవలసిందే.
“వనరుహనేత్ర తోడుత నవశ్యమునిన్నిట గూర్చెనేని న
మ్మనసిజుడే ధనుర్ధరుడు, మాధవుడే చెలికాడు వానికిన్
వనరుహ నేత్ర తోడు నవశ్యమునిన్నిట గూర్పకుండినన్
మనసిజుడే ధనుర్ధరుడు? మాధవుడే చెలికాడు వానికిన్?
పాత్రోచితముగానే కాక సందర్భోచితముగా సంభాషణలను రచించినప్పుడు మాత్రమే కవి ప్రతిభ వెల్లడియగును. ఈ ప్రతిభ పద్య నిర్మాణ వ్యుత్పన్నతతో అనుసంధింపబడుట కవి సమగ్ర రచనా శక్తికి తూనికయని చెప్పక తప్పదు. అద్దంకి గంగాధరుడు ప్రామాణిక ప్రబంధ పద్యరచనా ధురంధరుడు.
సంవరణుడు విరహవేదనను అనభవించినపుడు అతని పరిచారకులు అతనికి శిశిరోపచారాలు చేశారు. శిశిరోపచారానికి పరిచారకులు ఉపయోగించిన ద్రవ్యాలన్నీ తపతి అవయవాలకు ప్రతిబింబాలు కావడంవల్ల రాజుకు కొంత ఉపశాంతి లభించి ఉంటుంది. కవి భావనా చమత్కృతిని దర్శించండి.
వెలదినవ్వుల చాయ వెలది వెన్నెల గాయ
గపురంపు ధూళిమై గప్పెనొకడు
చెలువ కౌగిలి పాటి చెలువైన పన్నీట
నొకడు సర్వాంగంబు లోలలార్చె
బద్మాక్షి ముఖ సామ్యజాలంబుల
నురమున నిండార నునిచెనొకడు
పల్లవాధర హస్త పల్లవంబుల బోలు
పల్లవంబు లొకండు పాన్పుపఱచె
సాత్త్వికోదయ వేళ నా పతికి నొడల
దోడవెడజారు చెమరు బిందువుల వంటి
లలిత మకరంద బిందువుల చిలికె నొక్క
డంగ నా మన్మథునకు బ్రత్యంగకముల
ఇలాంటి అద్భుతమైన పద్యాలెన్నో నాయికా నాయకుల విరహ వర్ణనలో దర్శనమిస్తాయి. “కొమ్మ యల్లాడిన – కొమ్మయలదెయని, తరువనానంతరముల తగిలి తగిలి….” (4-76) లాంటి అనేక పద్యాలను ఇందుకు నిదర్శనముగా చూపించవచ్చును.
భాషా ప్రయోగ నైపుణ్యం : పద్రపయోగంలో, సమాన ఘటనలో, ఆలంకారిక పద ప్రయోగంలో, న్యాయాలు, నానుడులు, లోకోక్తులు, జాతీయాలు ప్రయోగించడంలో గొప్ప కౌశలాన్ని కనబరిచాడు గంగాధర కవి. చిలుక సంవరణునితో తన వృత్తాంతాన్ని చెబుతూ, తపతికి తగిన వరుని అన్వేషిస్తూ తిరిగి తిరిగి అలసిపోయి, ఆకాశంలో దాహంతో ఉండగా “అంధునకు దివ్యదృష్టి గలిగిన విధంబున నయాచితోపనతంబయిన యీ సహకార భూజంబు సంజీవ నౌషధంబైయవతరించినన్” ` (2-45) అనే గద్యంలోని “అంధునకు దివ్యదృష్టి గలిగిన విధంబున” – అనే ఉపమానం భావనారమ్యంబని పాటిబండవారే సెలవిచ్చారు. “ఈయెల మావికతంబున….” (2-47) అనే పద్యంలోని “తోయధిగంభీర మనసు” అనే సమాస ప్రయోగం కూడా కవిభావుకతకు, ప్రయోగ నైపుణ్యానికి ఉదాహరణ.
చిలుకల పలుకులు రసములు
చిలుకును భువినెట్టివారి చెవులకుఁ జవులై
చిలుకల కొలికి ప్రసంగము
చిలుక ప్రశంసించెనేనిఁ జెప్పగనేలా?
అనే పద్యంలోని అర్థాపత్త్యలంకారంతోడి పద ప్రయోగం, ఔచిత్యవంతంగా ఉంది. అసలే చొక్కపు బంగారం…. అదనంగా పరిమళం…అన్నట్లుందీ అలంకార సన్నివేశం. మహా కవిత్వమన్న యిది కదా! అలాగే పోతన లాగా వ్యత్త్యనుప్రాసతో కూడిన పదప్రయోగంలోనూ ఈ కవి మేటి –
“మలయాచల నిలయానిల
వలయాలస గతుల రాలె వనకుసుమంబుల్
వెలిచాగ విలుతుడవ్విభు
చెలువున వెలుగంది వదలు చేదూపులనన్ – (1-89)
పీఠిక ఉపసంహారంలో కొన్ని పదాలు శబ్దారత్నాకరంలో లేవని పాటిబండవారు సెలవిచ్చారు. వీటిలో కొన్ని పదాలు – కోరికె, లండరి, పటారము, వతారుపట్టు – లాంటివి నాటి తెలంగాణ ప్రాంతంలో జనులు వాడేవి అయ్యుంటాయని నా భావన. లండరి – పదం లండు + అరి అని విడదీస్తే మనకు పద స్వరూపం, ప్రత్యయం తెలుస్తాయి. చిన్న పిల్లలను పెద్దవాళ్లను ఆ పిల్లల ప్రవర్తనను గూర్చి చెప్పేటప్పుడు ‘వాడుత్తలండు’ అనే వారు. పనికిమాలినవాడు, గలీజుగాడు అనే అర్థంలో వాడడం, మా బాల్యంలో నల్లగొండ జిల్లాలో నేను విన్నాను. ఆ ‘లండు’ అనే పదం మీద మతుబర్థంలో (జాలరి) లాగా ‘అరి’ ప్రత్యయం చేరి ‘లండరి’ అవుతుంది. “లండరి కుకవులు కొందరు….” (1-9) అనే పద్యంలో లండుతనం కలిగిన, పనికిమాలిన కుకవులు అనే అర్థంలోనే కవి దీన్ని వాడినట్లు కనిపిస్తుంది. అలాగే తక్కిన పదాలు తెలంగాణలో నాడు వినవచ్చేవి ఎన్నో ఉంటాయని నా అభిప్రాయం. బంగారు సలాక (5-46)లోని సలాక – తీగ కూడా తెలంగాణ ప్రాంతపదమే.
పశ్చిమబుద్ధులు గారె బ్రాహ్మణుల్ (2-11), తోక లెగబట్టుదు రేమనవచ్చు…. (2-12), పైనిపటారమెకాక వానికిలోన లొటారమౌట (2-23), దుఃఖ మిహపంచభిస్సహ – (2-25) పులుగడిగిన ముత్తియంబు (2-35), కరతలామలకంబుగా (2-38), బొమ్మ వెట్టెదన్ (2-40), అంధునకు దివ్యదృష్టి కలిగిన విధంబు (2-45), అందని మ్రాని పంటి పయినాసలు చేయుట (2-58), విధియోగము (2-64), ఉష్ణముష్ణేన శీతలమ’ను (2-67), పూవును దావియు గూడిన కైవడి (2-69), గాలిమాట, పలు గాకులు (2-80), కడుపు చల్లన (2-84), ‘నానృతాత్పాతకంపరంబు (2-86), పిలువని పేరంటము (2-91), కాయొపండో (2-97), పవన విరహిత నిభృతదీపంబు (3-10), సుఖము దుఃఖంబు కార్యార్థి చూడడెందు (3-13), దుఃఖితే మనసి సర్వమసహ్యం (3-47), కొంగు బంగారు (3-51), పూసగ్రుచ్చిన రీతి (3-63), నీట గలసె (3-89), బూడిదెలోని హోమమయిపోయె (3-96), కొసరు మాటలు (4-13), గోరుచుట్టుపై రోకటి పోటుకైవడి (4-49), ఆవద్రావినట్లు (4-76), ఉఱ్ఱూతలూగ (4-79), ఆకుమఱుగుపిందె (4-88), లోకలోచనుకనుమూయ గలేక (4-89), గోటనైన పనికిగొడ్డలేల? (5-12), పేద పెన్నిధిగనినక్రియన్ (5-21) – ఇలాంటి సంస్కృతాంధ్ర ప్రయోగాలవల్ల తన పద్య రచనకు వన్నె తెచ్చాడు కవి. పై వాటిలో లోకోక్తులు, న్యాయాలు, నానుడులు, జాతీయాలు, సంస్కృతాంధ్ర సూక్తులు మొదలైనవన్నీ ఉన్నాయి. వాటిని విశ్లేషించి చూపడానికి వ్యాసపరిధి సరిపోదు.
మొత్తంమీద గంగాధర కవి ‘తపతీ సంవరణము’ అనే గ్రంథము ప్రబంధ లక్షణాలతో కూడి ఉందని, కవి కల్పనా చమత్కృతి ఇతివృత్తంలోనూ, వర్ణనలలోనూ కనిపిస్తుందని, సన్నివేశ చిత్రణంలో ఈ కవి అందెవేసిన చేయి అని, విభావాను భావసంచారీ భావయుక్తంగా శృంగార రసాన్ని చక్కగా పోషించాడని, వర్ణనల్లో ఆయన భావుకత చాలా ఉన్నతంగా, ఉత్తమంగా ఉందనీ; పాత్రలను చిత్రించడం, వాటిని ప్రవేశపెట్టడంలో ఔచిత్యం పాటించాడని; గంగాధర కవి కవితాశిల్పం, భాషా ప్రయోగ నైపుణ్యం అత్యంత విశిష్టమైనవని చాలా కొద్ది ఉదాహరణలతో వివరించడం జరిగింది.
ఆరుద్ర, గంగాధర కవి గురించి వ్రాస్తూ, “కృతిపతి ఇభరాముడు సంగీత రసైకలోలుడు (1-99) కనుక అద్దంకి గంగాధరుడు కూడా తన నైపుణ్యం ఇలా వెల్లడిస్తున్నాడు –
“భాస్వరంబైన మదకోకిల స్వరంబు
పంచమంబని పెద్దలు వల్క విందు
మీ మధుర భాషికీ మధ్యమంబౌట
యాశ్చర్య మహిమ యెపుడు (4-6)
గంగాధరుని నాయక విషయంలోనే కాదు, కవిత్వంలో కూడా ‘మధ్యమం’ అనువైన మాటేమో!” అని అనుమానాస్పదంగా తమ సమగ్రాంధ్ర సాహిత్యం రెండవ సంపుటిలో వ్రాశారు. కాని లోతుగా పరిశీలిస్తే, గంగాధర కవి నాయకుడుగాని, గంగాధర కవి కవిత్వంగాని “ఉత్తమం”గానే ఉన్నవని పరిశీలకులు గ్రహిస్తారు. ఆరుద్ర గడుసుగా పరిభాష సంగీత పదమైన “మధ్యమం” అనే దాన్ని ఉపయోగించుకొని చమత్కారంగా చెప్పినా, గంగాధర కవి కవిత్వం “ఉత్తమం” ఆయన స్థానం “ఉన్నతం” అని నా అభిప్రాయం.
అద్దంకి అలంకార ప్రయోగ శిల్పం : తపతీ సంవరణంలో గంగాధర కవి కేవలం అలంకారాల కోసమే అలంకారాలను ప్రయోగించలేదు. సన్నివేశం, సందర్భం, పాత్ర, భావం, రసం మొదలైనవాటిని చక్కగా అభివ్యక్తం చేయడానికి, అలంకారాలను మనోహరంగా ప్రయోగించాడు. అసలు గంగాధర కవే స్వయంగా తన ప్రబంధ నిర్మాణ విధానం గురించి ప్రారంభంలోనే – “…నవరసాలంకార భావానుబంధ బంధురంబుగా నొక్క ప్రబంధంబు నిర్మింప సమకట్టి” నాడు (1-10). అందువల్ల ఆయన ప్రబంధంలో అలంకారాలు రసభావానుబంధ బంధురంగా ఉంటాయని విడిగా చెప్పవలసిన అవసరం లేదు. కొన్ని అలంకారాలను స్థాలీవులక న్యాయంగా పరిశీలిద్దాం-
ప్రథమాశ్వాసంలోని 72వ పద్యం “సారవిభూతి రెండవ వృషధ్వజ….. కల్పవృక్షమున నన్నర పాలుడు మించెగీర్తులన్” ఈ పద్యంలో ఐశ్వర్యంలో రెండో శివునిగా, ఆకారంలో మూడో దేవవైద్యునిగా, శుచిలో నాలుగో అగ్నిగా, భూభారవహనంలో అయిదో దిక్పాలకుడుగా, దాతృత్వంలో ఆరో కల్పవృక్షంగా సంవరణుని ఊహించడంవల్ల అద్భుతమైన ఉత్ర్పేక్షాలంకారం చక్కగా కుదిరింది.
రెండో అశ్వాసంలోని “సారస సంభవుండఖిల….. పశ్చిమ బుద్ధులుగారె బ్రాహ్మణుల్’’ (2-11) అనే పద్యంలో సృష్టిలోని శృంగార రసమంతా తపతి నిర్మాణానికే వాడి తర్వాతి స్త్రీ నిర్మాణానికి ఏమీ లేకపోవడంతో బ్రహ్మచేతులు బార్లా చాపాడు – అనేది విశేష విషయం. దాన్ని లోకంలోని సామాన్య విషయమైన ‘పశ్చిమ బుద్ధులుగారె బ్రాహ్మణుల్’ అనే దానితో చెప్పడంవల్ల అర్థాంతర న్యాసం సహజాతి సహజంగానే అమరింది – అలాగే,
“ఆరంగములతోడ బారంగతంబుగా
నిగమముల్ సరహస్యముగను జదివి….
…………………………………………
…………………………………………
శుక మహాద్విజముఖ్యుతో సూడువట్టి
యున్న నాకిక నితరాంధ్రయుక్తి యెంత?
హస్తిపదమున నడగవే యడుగులెల్ల’ (2-38)
అనే పద్యంలోనూ చక్కటి అర్ధాంతర న్యాసం చక్కగా ఇమిడిపోయింది.
“చికిబికి వెండ్రుకల్ వలెను జిన్న చిగుళ్ళు…. డెన్నగన్” (2-95) అనే పద్యంలో అద్భుతమైన ఉపమానాలతో చూతం భూతంవలె కన్పించిందని చెప్పడంవల్ల ఉపమాలంకారం అత్యంత చమత్కార విచ్ఛిత్తి పూర్వకంగా మనోహరంగా ప్రయోగింపబడింది.
“ఘన వితత స్ఫురత్పదవి గైకొని రాజు తమఃకదంబకం
బనుకుజన వ్రజంబు దెగటార్చి, దిశాచయ సాధుమండలం
బొనర వెలుగజేసె, నదియుక్తమె కాదె నృపాల ధర్మ వ
ర్తునునకు శిష్టదుష్ట పరిరక్షణ శిక్షణ దక్షణ క్రియల్ (3-80)
ఈ పద్యంలోని బహు అలంకార ప్రయోగ శిల్ప ప్రౌఢి గంగాధర కవిని సర్వ ప్రౌఢకవి మూర్ధన్యునిగా నిలబెట్టింది. ఈ ఒక్క పద్యంలోనే శ్లేష, రూపకం, అర్ధాంతరన్యాసం, వృత్త్యనుప్రాస; వృత్త్యనుప్రాస గర్భిత క్రమలంకారం అనే అయిదు అలంకారాలు ప్రయోగించబడి, కవి అలంకార ప్రయోగ శిల్పచాతురిని వేనోళ్ళ చాటుతున్నాయి. పద్యరచనా పరమైన శ్రద్ధయందిది కవి వ్యక్తిత్వమును ప్రకాశింపజేసే సులక్షణ సారమే కదా! విలక్షణ ప్రతిభా చాతుర్యమే కదా!!
శ్లేష : ‘రాజు’ అనే పదానికి చంద్రుడు, పాలకుడు అని అర్థాలు, చీకటిని తొలగించి వెలుగునివ్వడం చంద్రుని ధర్మం. దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించడం రాజు (పాలకుడి) పని. రాజుకున్న రెండు అర్థాలను గ్రహించి చక్కటి శ్లేషాలంకారాన్ని ప్రయోగించాడు కవి.
రూపకం : తమః కదంబకంబను కుజన వ్రజంబు చీకటి సమూహం అనెడి చెడ్డవారు. చీకటి అజ్ఞానానికి చిహ్నం. అజ్ఞానులే చెడ్డవారుగా మారుతారు. తమః కదంబకంపై కుజన వ్రజ లక్షణాన్ని ఆరోపించడం దీనిలో కనిపిస్తుంది. అందుకే (ఆరోపాత్తు రూపకం) ఇది రూపకం.
అర్థాంతరన్యాసం : రాజు (చంద్రుడు) చీకటిని లేకుండా చేసి వెలుగునిస్తున్నాడు; రాజు (పాలకుడు) దుష్టులను శిక్షించి శిష్టులను కాపాడుతున్నాడు. ఈ ఇద్దరు చేసే పని విశిష్టమైంది. దీన్ని ‘అదియుక్తమెకాదె’ అంటూ ‘నృపాలధర్మవర్తనునకు శిష్ట దుష్ట పరిరక్షణ శిక్షణ దక్షణ క్రియల్’ అనే సామాన్య వాక్యం ద్వారా చెప్పడం వలన అర్ధాంతరన్యాసం.
వృత్త్యనుప్రాస: “శిష్ట దుష్ట పరిరక్షణ శిక్షణ దక్షణ క్రియల్” ఈ పాదంలో ‘ష్ట’ కార, ‘క్ష’ కార ఆ వృత్తివల్ల మనోహరమైన వృత్త్యనుప్రాసను ప్రయోగించాడు కవివర్యుడు.
వృత్త్యనుప్రాస గర్భిత క్రమాలంకారం : ఈ వృత్త్యనుప్రాస పాదంలో “శిష్టపరిరక్షణ దుష్ట శిక్షణ క్రియల్” అనే పద్ధతితో కాక “శిష్ట దుష్టః పరిరక్షణశిక్షణ” అనే క్రమాన్ని పాటించి, వృత్త్యనుప్రాస గర్భిత క్రమలంకారాన్ని అద్భుతంగా ప్రయోగించాడు అద్దంకి గంగాధరుడు. ఈ కవి అలంకార ప్రయోగ శిల్ప నైపుణ్యానికి ఈ ఒక్క పద్యం చాలు. ఇంకా “అటజనికాంచె…” (4-91) అనే పద్యంలో అంత్యప్రాస, వృత్త్యనుప్రాసలు; “నెమ్మదికుందనేమిటి?….” (5-14) అనే పద్యంలో ఉపమాలంకారం మనోహరంగా నిర్వహించాడు కవి గంగాధరుడు.
ఇంకా అనేక పద్యాల్లో శబ్దార్థాలంకార ప్రయోగాలవల్ల భావస్ఫూర్తి రసదీప్తి కలిగింది. ఇలా ఏ అంశం గ్రహించినా, ఏ కోణం నుంచి చూసినా, ఏ పార్శ్వతలాన్ని పరిశీలించినా ఏ విధంగా తపతీ సంవరణాన్ని అనుశీలిఁచినా గంగాధర కవి ప్రతిభను, ఆయన కవనశక్తిని, కథాకథన రీతిని, ప్రబంధ లక్షణ బద్ధ నిర్మగ్న మనస్కతను, రచనా, వ్యగ్రతను, రసపోషణ విధానాన్ని, అలంకార ప్రయోగ శిల్పాన్ని దర్శించి ఆనందించవచ్చును. కవిని అభినందించవచ్చును. ఎంతటివారైనా గంగాధరుని ‘మధ్యమ’ స్థాయికి చెందిన కవి అంటే మొహమాటం లేకుండా ఖండించి, ఆయన ఉత్తమ ప్రబంధ కవి అని తెలంగాణ ప్రాంతంలోనే కాదు, తెలుగు సాహిత్యంలోనే ఉత్తమ కవుల సరసన నిలవదగిన శక్తియుక్తులు కలవాడని ఘంటాపథంగా చెప్పవచ్చును. తెలంగాణ ప్రబంధ సరస్వతికి జయము జయము.
సుప్రసిద్ధ విమర్శకులు, ప్రవచన కర్తలు
కవిత్వానికి సంబంధించిన నిర్మాణమెలకువలు, లేదా శిల్ప రహస్యాలు, కవిత్వానికి సంబంధించిన అనేక అంశాలను చర్చించుకునే వేదికగా దీన్ని రూపొందించాము. మూడవ అంశం – కవిత్వము – వస్తువు.
కవిత్వం అనగానే వస్తువు, రూపము రెండు అంశాలు మిళితమై ఉండేటటువంటిది కవిత్వం అని అంటాము. కవిత్వానికే గాదు, ఏ వస్తువుకైనా గూడా ఈ రెండు అనివార్యమైనవి. ఈ రెండు రూపాలు ప్రతిదాంట్లో గూడా ఒకటి వస్తువు ఉంటుంది ఒకటి రూపము ఉంటుంది. ప్రతి పదార్థానికి ఈ రెండు అనివార్యంగా ఉంటాయి. మనం ఏ వస్తువునైనా తీసుకున్నా రెండు ప్రధానమైనవి ఒకటి రూపము, రెండవది అది వస్తువు ఉంటాయి. రెండూ ప్రధానమైనవే.
కవిత్వం అనేది కళ గనుక, ఆ కళ అనేది ప్రత్యేకంగా నైపుణ్యంతో, పనితనంతో ప్రత్యేకతతో కూడుకున్నది కనుక, ఈ పనితనమూ, నైపుణ్యమూ దేనికి వస్తుంది? దేనివల్ల వస్తుంది? అని తెలుసుకునేటటువంటి ఒక క్రమంలో మనం ఈ చర్చలన్నీ ప్రారంభించుకోవటం జరిగింది. దాంట్లో శిల్పం సంగతి రెండవ విషయంగా మనం అనుకుంటే దానిని ‘పర్సీవ్ డ్’ లేదా ‘డిస్కవరీ’ అంటాము.
ఏదైతే సృష్టిలో ఉండేటువంటి లేదా జీవితంలో ఉండేటువంటి ఒక అంశాన్ని ఏదైతే తెలుసుకున్నారో ఇతరులకు తెలుపాలని అనుకున్నారో అది వస్తువు. అందుకని సమ్ థింగ్ ఎట్, దిస్ కంటైన్ అన్నారు. ఏదో ఒక విషయాన్ని చేరవేసేది. అందులో ఏంజేస్తుంది అని అంటే, మీకు కలిగిన అనుభవాలను లేదా ఒక పరిచయాన్ని పాఠకులకు, లేదా సహృదయులకు చేరవేసేటువంటి అంశం. దీన్ని ఒక వస్తువు అని ఒక నిర్ణయానికి రావచ్చు. అంటే మనం చెప్పదలచుకున్నటువంటి, లేదా సహృదయానికి చేర్చాలనుకున్నటు వంటి విషయాన్ని వస్తువు అంటాం. దీనికి భారతీయ సాహిత్య ఆలంకారికులు కూడా చాలా విలువ ఇచ్చారు. కవిత్వంలో ఇదే కీలకమనీ చాలాసార్లు అన్నారు. ఎందువల్లనంటే “ఇతివృత్తంతు కావ్యేనశరీరం పరికీర్తితమ్” అని భరతుడు అన్నాడు. ఈ ఇతివృత్తమనేది వస్తువు. ఇది కావ్యానికి శరీరంతో సమానం. కావ్యం అనే దానికి ఒకటి శరీరం, ఒకటి ఆత్మ అనేది ఉన్నాయి అనుకుంటే, ఈ శరీరమనేటువంటిది వస్తువు. ఇతివృత్తము అని అన్నారు. అందుకని కథలోకి వెళ్లడమే కాదు ఒక నవల రాయండి, ఒక కవిత రాయండి, ఏదైనా రాయండి, ఏమైనా చేయండి చేసేప్పుడు దానికి తప్పని సరిగా శరీరమనేది ప్రధానం. ఈ శరీరము ఉంటేనే, అలంకరణ ఉంటుంది. శరీరము లేకపోతే అలంకరణ ఉండదు. దానికి విషయమేదీ ఉండదు, ప్రాతిపదిక ఏమీ ఉండదు. అందుకే మొదట ఉండవలసింది శరీరం. ఆ శరీరాన్ని అలంకరించేటువంటి పద్ధతి వచ్చినప్పుడు అది తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు శరీరం అనేది ఉండాలి. శరీరం కవిత్వంలో, సాహిత్యంలో శరీరం అంటే ఇతివృత్తం. “ఇతివృత్తం” అంటే ఇదీ విషయం అని చెప్పేటువంటిది. వృత్తం అంటే మనం తిరుగదలుచుకున్న ఒక పరిధి. చెప్పదలుచుకున్నటువంటి ఒక పరిధి. పరిధి ఇదీ అని చెప్పేటువంటిది ఇతివృత్తం. ఇది కథ! లేదా ఇది అంశం, ఇది చెప్పదల్చుకున్నటువంటి విషయం, అని చెప్పదలుచుకున్నది ఒక పద్ధతి ఇతివృత్తం. ఈ ఇతివృత్తం అనేది కావ్యానికి శరీరంతో సమానమైనది అని చెప్పడం జరిగింది. అట్లానే “పోయెట్రీ ఈజ్ ఎ జర్నీ ఇన్ టు ది కంటెంట్?” (Poetry is a Journey in to the content.) Rilke అనే ఒక కవి. విమర్శకుడు ఏమన్నాడు అంటే శరీరం అంటే వస్తువు అని. ఈ వస్తువులోకి ప్రయాణించడమే కవిత్వం అన్నారు. అంటే వస్తువులోకి ప్రయాణించడం. అంటే, ప్రయాణించడానికి వస్తువు అనేది ఉండాలి. వస్తువు ఉంటే కథలోకి పోయేది. అందుకని చుట్టూ ఉండేటువంటి వాతావరణంలోంచి, ప్రకృతిలోంచి, లేదా జీవితంలోంచి, లేదా సమాజంలోంచి ఈ వస్తువును ఎంపిక చేసుకొని రాసే అవసరమున్నది. కాబట్టి మనం ఏదైతే దర్శించినామో, విశదీకరించినామో ఏదైతే గ్రహించినామో, ఏదైతే పరిశీలించినామో అదే వస్తువు. అయితే ఏ వస్తువును స్వీకరించినా ఒక ప్రశ్న వస్తుంది. వస్తువును ఎట్లా స్వీకరించాలి అనే ప్రశ్న వస్తుంది.
మన చుట్టూ అనేక వస్తువులుంటాయి. ;ఎవరు ఏ కవి రాసినా కూడా ఎక్కడి నుండి తీసుకుంటాడు? చుట్టూ ఉండే వాతావరణంలో నించి లేదా సమాజంలోంచి ఎంపిక అయితే సృష్టి అంటే ప్రకృతి లేదా, జీవితం లేదా సమాజం, చరిత్ర, సంస్కృతి లేదా మనిషి. ఇది తప్ప కవికి ఎక్కడికి వెళ్లడానికి వీల్లేదు. సృష్టి, ప్రకృతి, మనిషి, సమాజం, ఊడి పడ్తుందా? ఎక్కడో ఆకాశం నుండి రాలిపడదు. చాలామంది అంటుంటారు. నాకు వస్తువు దొరకడం లేదు, ఏ వస్తువు మీద రాయాలి అని. సబ్జెక్ట్ దొరకడం లేదు అని అంటుంటారు. అది సరైనటువంటిది కాదు. సబ్జెక్ట్ ను మనం స్వీకరించాలి, వెతుక్కోవాలి. వెతకాలి అంటే ఎక్కడి నుండి తీసుకోవాలనేముంది? ప్రకృతి నుంచి తీసుకోవచ్చు. రవీంద్రనాథ్ టాగూర్ ఉన్నాడు, కృష్ణశాస్త్రి ఉన్నాడు. వీరంతా కూడా ప్రకృతిలోంచి వస్తువును స్వీకరించారు. శ్రీ శ్రీ ఉన్నాడు. ఆయన సమాజంలోంచి, చరిత్రలోంచి వస్తువును స్వీకరించాడు. ఒక చారిత్రక నేపథ్యం నుంచి కవిత్వం తీసుకొని రాసాడు. అట్లా మనిషినే కేంద్రంగా చేసుకొని నారాయణరెడ్డిగారు రాయడం జరిగింది. ‘విశ్వంభర’ కావ్యంలో రాయడం జరిగింది. సృష్టినుంచి ప్రకృతి నుంచి, సమాజం నుంచి, మనిషి నుంచి వస్తువును తీసుకోవాలి. ఇంతకుమించి, వస్తువు ఇంకోటి ఉండదు. వీటికి సంబంధించిన వాటి నుంచే మన చుట్టూ ఉండే వాతావరణం ఏదైతే ఉంటుందో దానినే వస్తువుగా తీసుకోవాలి. తీసుకునే అవకాశం ఉన్నది. అందులో మనకు ఏది నచ్చితే అది వస్తువుగా స్వీకరించాలి. మనకు ఒక మంచి జర్మనీ సామెత (సెయింగ్) ఒకటి ఉన్నది. మన చుట్టూ ప్రతి వస్తువులో ఒక పాట నిద్రిస్తూ ఉంటుంది. ఆ ప్రతి వస్తువు ఆ పాటను స్వప్నిస్తూ ఉంటుంది. కవి గుర్తించి పాడతాడు. ఆ తదనంతరం లోకం గుర్తిస్తుంది అని ప్రతి వస్తువులో ఒక పాట ఉంటుందని, అది పాటను స్వప్నస్తుందని. కాదేదీ కవితకనర్హం. కవిత్వానికి అనర్హమైనదేదీ లేదు అని గతంలోనూ తెలుసుకున్నాం. ప్రతిదీ కవిత్వానికి అర్హమైనదే అని అన్నారు.
అందుకే ప్రతి వస్తువులో ఒక పాట కలిసి ఉంటుందనీ, ఆ వస్తువు పాట గురించి స్వప్నిస్తూ ఉంటుందని. ఆ వస్తువును కవి గుర్తించాలి. కవి గుర్తించి, తను మొదటగా పాడితే తర్వాత లోకమంతా పాడుతుంది. ఇదీ కవి ఈ గుర్తించి స్వీకరించడమనేది, దాని యొక్క దర్శనం పైన ఆధారపడి ఉన్నది. ఏది దర్శిద్దాం? ఏది చూద్దాం? దేన్ని స్వీకరిస్తాం? అని అన్నప్పుడు మన జీవితంలో ఉండేటువంటి అత్యంత కీలకమైన అంశాలను దృష్టిలో పెట్టుకొని మనం తీసుకోవచ్చు. అయితే, దీన్ని తీసుకోదలచుకున్నప్పుడు వస్తువును ఎంపిక చేసుకోదలుచుకున్నపుడు, మనకు ఏమేమి ఉండాలి? ప్రకృతి నుండి తీసుకోండి, సృష్టి నుండి తీసుకోండి, సమాజం నుండి తీసుకోండి, ఎంపిక చేసుకోవలసిన నాలుగు అంశాలు ఉన్నవి. ఈ నాలుగు అంశాలు కీలకమైనవి. ఒక అంశం మీద పరిచయం లేనటువంటి వస్తువుమీద చాలామంది రాయడానికి ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నం చేసినప్పుడు మనకు పరిచయం లేని వస్తువును ఎంపిక చేసుకుంటే కొంత తేలిపోయే ప్రమాదమున్నది. అందుకే మనకు అత్యంత సమీపమైన, తెలిసిన వస్తువు తీసుకోవాలి. మనకు బాగా తెలిసి ఉన్నవారు తెలిసిన వస్తువును తీసుకున్నప్పుడు మనం అన్ని కోణాలను పరిశీలించి, విశ్లేషణ చేసే అవకాశం ఉంటుంది. కనుక వస్తువు ఎంపికలో మనం జాగ్రత్త తీసుకొనే మనకున్న నేర్పరితనానికి సులువవుతున్నది. మొట్టమొదటిది ఏ పరిచిత వస్తువుకైనా తీసుకోవాలి. పరిచయం లేని వస్తువు జోలికి పోవద్దు. తేలిపోయినట్లు ఉంటుంది. దాంట్లోనే రెండవ లక్షణం, అంశం, రెండవ జాగ్రత్త ఏంటంటే, అది కొత్తగా ఉండాలి. ఇంతకుముందు తీసుకున్నప్పుడు ఆయనే రాసాడు గదా, మళ్ళీ ఈయనేం రాసాడు అని కవిని తక్కువ చేసే ప్రమాదమున్నది. అప్పుడు అలాంటి వస్తువును తీసుకున్నప్పుడు శిల్పంపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. శిల్పంతో నెట్టుకురావాల్సి ఉంటుంది. వస్తువే ముఖ్యం అనుకున్నప్పుడు శిల్పం కంటే ముందు వస్తువే వినూత్నమైనపుడు ఇక శిల్పం సంగతేంటి? అందుకే రెండవ అంశంగా కొత్తది తీసుకోవాలి. మూడోది ఆ అంశం ఆ కాలానికి పరిచయం ఉన్న సమకాలీనమైనదై ఏ కాలంలో జీవిస్తున్నటువంటి వాళ్ళు కాలాన్ని చేరుకుంటారు. అంటే వాళ్ళ అభిరుచులకు దగ్గరగా ఉండాలి. వర్తమానంలో ఏ పాఠకులైతే, ఏ సహృదయులైతే కవిత్వాన్ని చదువుతూ ఉన్నారో వాళ్ళ అభిరుచులకు దగ్గరగా, అనుగుణంగా ఉండాలి మనం ఎంచుకున్నది. అంటే దాని అర్థం ఏంటంటే, సమకాలీనత ఉండాలి. మనం ఎంచుకునే వస్తువుకు మూడవ లక్షణం సమకాలీనత. నాలుగవ లక్షణం మానవీయత. లేదా అర్హత కలిగి ఉండాలి. మానవీయత అంటే మానవులకు ఉన్న భావోద్వేగాలను స్పృశించడం. కనెక్ట్ చేయడం. లేకపోతే అతను మనకు కనెక్ట్ కాడు. మానవుడు అనుభవించిన దానిని మనం కనెక్ట్ చేయడం. ఆయన అనుభవించిన దాంట్లోని అంశాన్ని మనం టచ్ చేయడం. అటువంటి అంశాన్ని మనం స్వీకరించగలిగితే కవిత్వంతో చేరుకోగలిగితే తప్పకుండా మానవుని చేరుకోగలుగుతాడు కవి. అందుకని నాలుగంశాలని ప్రథమంగా చెప్తాం. 1. పరిచయమైనటువంటి వస్తువును ఎంపిక చేసుకోవాలి. 2. కొత్త వస్తువును నవీనమైనది తీసుకోవాలి. 3. సమకాలీనమై ఉండాలి. 4. మానవీయమై ఉండాలి. స్పందనలకు, భావోద్వేగాలకు దగ్గరగా ఉండేది కావాలి. అప్పుడే మానవుడు స్పందించగలుగుతాడు. లేకుంటే స్పందించలేడు. లేదంటే స్పందించే అవకాశం లేదు. కనుక ఈ నాలుగు అంశాలను దృష్టిలో పెట్టుకుని, చుట్టూ ఉండే వాతావరణంలోంచి కవిత వస్తువును తీసుకోవాలి. అప్పుడే అనుకుంటాం మనం. ఎక్కడినుండి తీసుకుంటాం అంటే ప్రకృతి నుంచి. ఎక్కణ్ణించి తీసుకుంటామంటే జీవితంలోంచి, ఎక్కణ్ణించి తీసుకుంటామంటే మనిషి నుంచి, ఎక్కణ్ణించి తీసుకుంటామంటే కాలం నుంచి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకని ఈ వస్తువును ఎన్నుకునేటప్పుడు ముందు ఇంకొక అంశం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. నాలుగంశాలు తెలిసినటువంటివి తీసుకుంటాం. తీసుకునేటప్పుడు ఏం చూసుకోవాలి? అని అన్నప్పుడు, మనం మాట్లాడినప్పుడు దర్శనం గురించి మాట్లాడుకునేటప్పుడు ఎన్ని కోణాల్లోంచి మనం పరిశీలిస్తే దాని యొక్క సారం దాని యొక్క తత్త్వం మనకు బోధపడ్తుందో ఆ కోణాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. పరిశీలించాలి. మొత్తం కోణాన్ని పరిశీలించడం సాధ్యపడదు. కనుక వర్ణింపదలిచిన వస్తువును ఎంపిక చేసుకున్న తర్వాత, దాని యొక్క కోణం ఎక్కడినుండి ఎట్లా చూసే దాని కోణం కనిపిస్తుందో ఏ కోణంలోంచి ఏ పాయింట్ ఆఫ్ వ్యూ, ఏ దగ్గరి నుండి చూస్తే దాని యొక్క సారం తెలుస్తుందో దాన్ని మనం తప్పకుండా దృష్టిలో పెట్టుకోవలసినటువంటిదవి. అందుకని కోణంకూ దృష్టికి ముఖ్యమైనది. వస్తుకోణం, దృష్టికోణం అనేటు వంటివి కూడా చాలా కీలకమైనవి. అందుకని ఆ కోణాన్ని మనం ఎంచుకునేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫోటోగ్రాఫర్ కూడా ఫోటో తీయదలుచుకున్నప్పుడు కొందరేమో ఎదురుగా, ఫ్రంట్ గా నిలబెట్టి తల పైకెత్తు కిందికి పెట్టు అని రకరకాలుగా మనని తీస్తాడు. తర్వాత చూస్తే మనది మనకే చూడబుద్ది కాకుండా తీస్తాడు. ఎందుకంటే ఆయనకు కళాత్మక దృష్టి ఉండాలి. ఈ వ్యక్తిలో ఏ కోణంలోంచి ఫోటో తీస్తే బాగుంటుందో అట్లా తీయాలి. వ్యక్తి యొక్క తత్వం లేకుంటే ఆయన ముఖంలో ఉండే కళ, తేజస్సు కనబడుతుందో అర్థం కానివాడు తీస్తే వృథా. కళాత్మకమైనటువంటి కోణం తెలిసినటువంటి ఫోటోగ్రాఫర్ తీస్తే ఒకరకంగా బాగా ఉంటుంది. అందుకని కళాకారులు – అంటే ఇక్కడ కవి గనుక, ఈ కవి ఏం చేయాలంటే పాయింట్ ఆఫ్ వ్యూ, దృష్టి కోణాన్ని మనం నిర్వహించుకోవాలి. నాలుగు అంశాల్ని దృష్టిలో పెట్టుకుంటూనే, ఈ నాలుగు అంశాలతో పాటు మొదట ఎంపిక చేసుకునేప్పుడు, స్వీకరించేపుడు దాని దృష్టికోణం కూడా చాలా కీలకమైనది అని అర్థం చేసుకోవాలి. అందుకని మనం మొదటి అంశం వస్తువును దర్శిస్తాం, స్వీకరిస్తాం. వస్తువును స్వీకరించేపుడు ఇక్కడ దృష్టికోణం కీలకమైంది. ఎందుకు కీలకమైంది అన్నప్పుడు వస్తువును, రూపాన్ని విడదీయలేము. చాలాసార్లు ఏం జరుగుతుందీ అంటే, వస్తువునూ రూపాన్ని విడదీయలేము కానీ ఒక్కోసారి వస్తువే రూపాన్ని విడదీసే అవసరమొస్తుంది. అవకాశమొస్తుంది. అందుకే వస్తువు ఎంపిక దగ్గరి నుండి జాగ్రత్త వహించాలి. అంటే వస్తువును ఎనుకున్నప్పుడే దాని రూపము నిర్ధారణ అయిపోయే అవకాశముంటుంది. కృష్ణశాస్త్రి గారు “బాక్ టు ద నేచర్” ( Back to the Nature). ఆయన “ఒక కొమ్మలో కొమ్మనై ఆకులో ఆకునై” అనే అంశాన్ని స్వీకరించడంతో అనుకున్నపుడు దానితో కలిసిపోవాలనుకున్నప్పుడు అప్పుడు ఉన్నదాంట్లో ఇక రాసుకుంటా పోయాడు. “ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై.. నునులేత రెమ్మనై” అంటూ అట్లా రాసుకుంటూ పోవడం. కనుక ఈ ఎంపిక చేసుకోవడం అనేది చాలా కీలకం. ప్రకృతి నుంచి రాయాలి అనేటువంటి అంశాన్ని ఎక్కడ మొదలు పెట్టి ఎట్లా ఏ కోణంలోంచి రాయాలి అనేది, ఎట్లా చిత్రించాలి అనేది రెండో అంశంగా చెప్పేది వస్తువు. ఈ అంశాన్ని తీసుకున్నప్పుడు ఈ వస్తువునే తీసుకున్నప్పుడు మానవీయ స్పందనలు ఉండేటువంటి దానిలో ఏదైనా విశేషత ఉండాలి. చెప్పడానికి అనువైనటువంటి ఏదో ఒక విశేషము ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు ‘స్నేహం మీద’ కవిత రాయాలి అని అన్నప్పుడు.. అందరూ ఏం రాస్తారు? “సృష్టిలో తీయనిది స్నేహమే” అని రాస్తారు. అట్లా ప్రాచుర్యంలో ఉండేటువంటి ఆ కోటేషన్ నే చెప్పుకుంటూ రాస్తారు. మధురత్వము అనేది లేకుండా, తీపి లేకుండా స్నేహం ఇంత గొప్పది, అంత గొప్పది అని తప్పించి వేరేదెవరూ రాయరు. కానీ, దానివలన ఏమవుతుంది? ఈ మొత్తం ఒకటే వస్తువు ఉండటం వల్ల అదే వస్తువు ఉండటం వల్ల, రాయడంలో ఏ నైపుణ్యం ప్రకటించకపోవడం వల్ల అది మూసగా నిలిచిపోయే ప్రమాదమున్నది. కొత్తదనం లేకపోవడం వల్ల అంటే మోనాటమీ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. ప్రమాదం ఏర్పడుతుంది. రూపం కూడా పాతది అయిపోతుంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఎప్పుడైన ఒక వస్తువు ద్వారా ఏదైనా ఒక విశేషాన్ని చెప్ప దల్చుకోవాలి. ఒక ప్రత్యేకమైనటువంటి వస్తువును స్వీకరించగలగాలి. దాని ద్వారా మనం ఒక విశేషాన్ని, సందేశాన్ని అనుభవంతో అందించాలి. అప్పుడే ప్రతిదీ, మనం అవతలి వ్యక్తికి ఇవ్వగలం. అదే కీలకం. ఈ వస్తువును, ఎదుటి వ్యక్తి ఆకట్టుకునే వస్తువు అయి ఉండాలి అన్నారు. మనమనుకున్నట్లు మానవీయ స్పందనలో భాగమైనటువంటిది ఉండాలి. మానవ భావోద్వేగాలతో సంబంధం లేనిది ఆకట్టుకోదు కనుక మానవ సంబంధ భావనతో స్పందనలతో, అందులోంచే వస్తువును తీసుకోవాలి. లేనిదే ఆకట్టుకునే అవకాశం లేదు గనుక తప్పకుండా మానవ అనుభవాలను తీసుకొనే రాయాలి. చాలాసార్లు ప్రకృతిని ప్రకృతి, ప్రకృతి లాగా రాయం. ఇవన్నీ మానవునికి అన్వయిస్తూ రాస్తాం. ఇవన్నీ టెక్నిక్స్.
కానీ, ప్రకృతిని కూడా మానవరూపంలోకి, మానవ స్వభావంలోకి ఆరోపించుకొని రాయడం ఏదైతే ఉన్నదో ఇక్కడే ఈ తెలివితేలటన్నీ కూడా ఆధారపడి ఉంటాయి అని తెలుస్తుంది. అందుకని మనం ఈ వస్తువు ఎంపిక దగ్గర ఎంత జాగ్రత్తగా ఉంటే అంత ఆ కవిత్వం అంత బాగా పండేటువంటి అవకాశమున్నది . ఒక్కోసారి మనం రాయడంలో కొంత నైపుణ్యత తగ్గినా కూడా అందులో విశేషత ఉంటే అది ఆకట్టుకుంటుంది. అందుకని చాలాసార్లు కొత్తది స్వీకరించాలంటే ఒప్పుకుంటారో, ఒప్పుకోరో అనే భయం అనేది ఒకటుంటుంది. ఇది మనకే కాదు కాళిదాసు నాటికే కాళిదాసుకే వచ్చిందని ఆయనొక మాటన్నాడు. పాతదే తీసుకోవాలి అని, ఇప్పటివరకు చెప్పినటువంటి అలంకారికుల వల్ల ఆయన వాళ్ళకు సంజాయిషీనివ్వడం, అలంకారికులు ఏమన్నారంటే ప్రఖ్యాత వస్తు విషయం “ప్రఖ్యాత వస్తువిషయం ప్రఖ్యాతోదాత్తనాయకం చైవ – రాజర్షి వంశచరితం తదైవ దివ్యాశ్రయోపేతమ్” భరతుడు అన్నాడు. వస్తువును తీసుకోవాలన్నప్పుడు పాతకాలంలో ఉన్నటువంటి భారతీయ లాక్షణికులు ఏం చెప్పినారంటే విషయం కొత్తది తీసుకోవద్దన్నారు. ప్రఖ్యాతమైన వస్తువును తీసుకోమన్నారు. అందుచేత మనకు ప్రాచీన కాలంలోని ఆ భారతానికో రామాయణానికో, భాగవతానికో సంబంధించిన వస్తువులే మిళితమై ఉంటాయి. అంటే విషయం, వస్తువు ప్రఖ్యాతమైనదై, ఎప్పటికీ ప్రాచుర్యమైనదై ఉండాలి. దాని వలన మనం ఎక్కువ కష్టపడకుండానే సమాజానికి చేరే అవకాశముంటుంది అని చెప్పడం.
ఇక్కడనే రెండవది ఆ వస్తువుతో పాటు అందులో నాయకుడెవరుండాలి అంటే ఉదాత్తుడైన నాయకుడై ఉండి ఉండాలి. ప్రఖ్యాత నాయకుడై ఉండి ఉండాలి అని. అయితే కాళిదాసు వరకు వచ్చేటప్పటికి, ఒక సమస్య ఏర్పడ్డది. ప్రఖ్యాతమైనటువంటి ఇతివృత్తము అని అన్నప్పుడు ఉన్నదాంట్లో నించే తీసుకోవాలి. నాయకుడు బాగా ప్రఖ్యాతుడై ఉండాలి అంటే, అయితే దేవుడు కావాలి లేకపోతే రాజు కావాలి అని. భరతుడు వంటి ఆలంకారికులు చెప్పిన విషయాలను గమనిస్తే, ఆ విషయాల ప్రకారమైతే ఒకనాటికి బాగానే ఉండవచ్చు గాని, తదనంతర కాలానికి లేదు అని. అందువల్ల కాళిదాసు కొత్తదనాన్ని ప్రయోగించదలుచుకున్నప్పుడు, ఆ కాళిదాసులాంటి వాళ్ళే కాదు ఇవ్వాళటి వరకు కూడా కొత్తదనాన్ని మనం తీసుకున్నప్పుడు, కొత్త వస్తువును తీసుకురావాలనుకున్నప్పుడు, ఒక విశేషమైన వస్తువును తీసుకురావాలనుకున్నప్పుడు కొత్తదే స్వీకరించాలి. కొత్తది స్వీకరించినప్పుడు, ఆయనే, కాళిదాసే స్వయంగా చెప్పుకున్నదేమంటే “పురాణమిత్యేవ నసాధుసర్వం, నచాపికావ్యం నవమిత్యవద్యం” కాళిదాసు అన్నాడు. అంటే పురాణమైనదంతా కూడా గొప్పదని చెప్పడానికి వీల్లేదు. ప్రాచీన కాలంలోని దంతా కూడా గొప్పదని చెప్పడానికి వీల్లేదు. పాతదంతా గొప్ప అని చెప్పడానికి వీల్లేదు. పాతది కూడా కొన్నిసార్లు ప్రక్కకు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. వస్తువు ఏదైనా సరే పాతదైపోతే తప్పనిసరిగా అది ఎంతగా మనకు ఇష్టమైన వస్తువు ఏదైనా, ఉదాహరణకు ఒక గులాబి పువ్వున్నది, నిన్న పూసిన పువ్వు, మొన్న పూసిన పువ్వు వాడిపోయింది, ఎండిపోయింది. ఎండిపోయిన తర్వాత రాలిపోతుంది. ఇంకా నాకిష్టమైంది అని ఇంట్లో పెట్టుకుంటామా? రాలిపోయి ఎండిపోయినప్పుడు దాని పరిమళము పోయినప్పుడు దాని రంగు కూడా పోయినప్పుడు, దాని రిక్కలు కూడా రాలిపోతున్నప్పుడు, ఇన్నిబోతున్నప్పుడూ అది నేను అదే పెట్టుకుంటానంటే కాదు. ప్రతిరోజు పుష్పం కొత్తది వస్తుంది. కొత్తగా పుడ్తుంది. అది చాలా శుభ్రంగా ఉంటుంది. చాలా స్వచ్ఛంగా ఉంటుంది. చాలా కొత్తదనంతో ఉంటుంది. చాలా సొగసులతో ఉంటుంది. దాన్ని స్వీకరించాలి. అని చెప్తూ ఆయనేమన్నాడు పురాణమైనదంతా కొత్తగాదు, కొత్తదైనంతమాత్రాన దానిని స్వీకరించడానికి అంతా యోగ్యమైనది కాదు అన్నాడు. ఇది ప్రక్కనబెట్టుకో అన్నాడు.
అందుకనే కాళిదాసు మేఘాన్ని దూతగా తీసుకున్నాడు. శ్రీశ్రీ కొత్తదనం కోసమే ‘నవ కవనం’ అనే కొత్త పేరుతో తమ కవిత్వంలో ఏమేమి కావాలో అవి రాసాడు.
“కదిలేది కదిలించేది మునుముందుకు నడిపించేదీ, పాడేదీ పాడించేదీ పెనునిద్దుర వదిలించేది పరిపూర్ణపు బతుకిచ్చేది కావాలోయ్ నవకవనానికి” రాసేది కొత్త కవిత్వం. ఈ కొత్త కవిత్వానికి ఏం కావాలి అంటే అది పాడాలి పాడించాలి. అది కదలాలి కదిలించాలి. పెనునిద్దుర నొదిలించాలి. ఇంతకుమందు నిద్రబోయే సాహిత్యం వచ్చింది. నిద్రబుచ్చే సాహిత్యం వచ్చింది. ఇది నిద్రను మేల్కొలిపేటువంటి సాహిత్యం. అని చెప్తూ ఆయన కొత్తదనాన్ని స్వీకరించాడు. గురజాడ అప్పారావు గారు అప్పటివరకు ఉన్నటువంటి ఒకరకమైన సాహిత్యం ఉంటే ఆయన కూడా కొత్తదనాన్ని స్వీకరించాడు. తర్వాత తర్వాత అట్లా మనం తప్పనిసరిగ కొత్తదనాన్ని స్వీకరించాలి అనే భావం ఏర్పడింది. ఎంతో కొంత ప్రత్యేకతను ప్రదర్శించకపోతే మనం అక్కడ ఉండడానికి అవకాశం లేదు. అందుకని వస్తువు ఎన్నిక దగ్గర కొత్తదనంతో కూడినటువంటి వస్తువును ఇంతకుముందు ఎవరూ స్వీకరించనటువంటి వస్తువును స్వీకరిస్తే, తీసుకుంటే అది రాణిస్తుంది. రాణించే అవకాశం ఉంటుంది. అయితే వస్తువు కొత్తదా కాదా అనేది ఎట్లా తెలుస్తుంది? అదొక ప్రశ్న మళ్ళీ. ఇది అధ్యయనం ద్వారానే తెలుస్తుంది తప్ప, మళ్ళీ మనం చదవకపోతే తెలియదు. ఎప్పుడో చాలా రోజుల క్రింద, ఏ ముప్పై ఏళ్ళ క్రిందనో పుస్తకంలో దాచుకున్న నెమలీకను “నా జ్ఞాపకం” అని నేను ఏదో రాసాను. అది ముప్పై ఏళ్ళ కింద రాసిందైతే, అది ఆ తర్వాత ఎంత ప్రచారమైందంటే రాసుకున్న నెమలీక, దాచుకున్న నెమలికన్ను అని రాసారు. చాలామంది దాదాపు ఒక ఇరవైమంది రాసుంటారు. ఈ ఇరవై ఒకటో ఆయనకు అది ముప్పై ఏళ్ళ క్రింద రాసిన కవిత అని తెలియదు. తెలియకపోవడం వల్ల ఏమవుతది. అది పాతది అనుకోడు, నేనే రాసిన అనుకుంటాడు. ముప్పై ఏండ్ల క్రింద రాసిందనుకోడు. ఇది ఎవరు పట్టుకుంటారు మళ్ళీ ? దీన్ని ఒక విమర్శకుడు పట్టుకుంటాడు. ఓ ముప్పై ఏళ్ళ క్రింద రాసింది, ఫలానాయన రాసినాయన, తర్వాత ఇంకో ఇరవైమంది వరకు రాసినారని, ఆ తర్వాత ఇరవై ఒకటవ వ్యక్తి కూడా రాసాడు అని అంటాడు. అందువల్ల కొత్తదనం లేదని అంటాడు. అందుకని తప్పనిసరి మనం విస్తృతంగా అధ్యయనం చేయడం ద్వారానే విశేషత్వం ఏంటిది, కొత్తదనం ఏంటిదని, ఇప్పుడు నువ్వు రాసిందేంటిది? రాయాల్సిందేంటిది? అనేది తెలుస్తుంది. బోధపడే అవకాశం ఉంటుంది. కనుక ఇది ఒకటి తప్పనిసరిగా గుర్తుకు పెట్టు కోవాల్సినటువంటిది. ఇంకొక అంశం కూడా ఈ వస్తువు ఎంపిక విషయంలో ఇంకో సమస్య ఉంటది. ఇంకో సమస్యేంటిదీ అనంటే, ఎప్పుడైనా సమకాలీనమైన వస్తువును స్వీకరించాలి అని అనుకుంటే, చుట్టూ ఉండేటువంటి ఒక వాతావరణం ఆ వస్తువును నిర్ణయిస్తూ ఉంటుంది. మన స్వేచ్ఛతో సంబంధం లేకుండా, మన ఇష్టంతో సంబంధం లేకుండా మన చుట్టూ ఒక సమన్వయం, ఒక సమస్య ఉంటుంది. ఒక సాహిత్య వాతావరణం ఉంటుంది. ఈ సాహిత్య వాతావరణం చాలాసార్లు ఇందాక అనుకున్నట్టు, ఒక సబ్జెక్ట్ ఇచ్చి రాయమంటుంది. ఒక టాపిక్ ఇచ్చి రాయమంటుంది. కొన్ని సార్లు ఏం జేస్తది అంటే ఎక్కడో బార్డర్ లో సైనికుడు పోరాడుతుంటాడు. దాని గురించి రాయవలసిన సందర్భం ఏర్పడుతది. ఇటువంటి సమకాలీన విషయాలు రాసేప్పుడు, అది అందరినీ ప్రేరేపించేలాగా, అందరినీ ప్రభావితం చేసేట్లుగా రాయాలి. అట్లనే ఇప్పటి పరిస్థితికి సమన్వయం చేయ దలుచుకుంటే, ఇప్పటి సాహిత్యానికి, కవిత్వానికి సమన్వయం చేయదలుచుకుంటే మనం ‘కరోనా’ కాలంలో ఉన్నాం. ఈ కరోనా కాలంలో ఉన్నప్పుడు, మనతో సంబంధం లేకుండ, మన ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా, చుట్టూ ఉన్న సమాజంలో వాతావరణంలో ఈ కరోనా ఉంటుంది కనుక అందరికీ కరోనా గురించి రాయాలని ఉంటుంది. అందరమూ రాస్తాం. ఈ కరోనా ప్రభావం బాగా ఉన్నదని ఎవరికి వారు అనుకుంటూ ఉంటారు. నేను రాస్తున్నదే బాగున్నది అని అనుకుంటాం. ఎవరికి వాళ్ళు అనుకోవడం తప్పులేదు. కానీ, కరోనా అనే ఒక అంశంమీద, ఒక వస్తువు మీద కవిత్వం రాసేటప్పుడు అనివార్యంగా ఇంతకుముందు కవులు రాసినటువంటి కవితలను చదవడం ద్వారా, అధ్యయనం చేయడం ద్వారా వాళ్ళు వదిలి పెట్టిన అంశాలేవైనా ఉన్నాయా అనేటువంటిది తెలుస్తుంది. వస్తువే గొప్పది అని మనం రాసేప్పుడు దాన్ని వీలైనంతవరకు ఆ కరోనా ఏమిటి? ఆ కరోనా యొక్క స్థితిని, దాని లోతుల్ని మనం పట్టుకున్నప్పుడు అటువంటి వస్తువును చూడాలి. కనుక పైపైన చూడడం ఒక అంశం, దాని లోతుల్ని చూడడం ఒక అంశం. దాని హృదయాన్ని ఆవిష్కరించటం. దాని హృదయం అంటే, దాని కాలం, కరోనా కాలంలో ఉండేటువంటి స్థితియొక్క ఉపద్రవ స్థితిని మనిషి యొక్క ఆర్ధమైనటువంటి స్థితిని చిత్రించాలి అనేది మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ఆర్ధమైనటువంటి వస్తువును కవి పట్టుకోవాలి. ఇదే మన దృష్టి కోణమైతే అనివార్యంగా వచ్చినటువంటిది ఈ కరోనా. అనివార్యంగా వచ్చిన వస్తువు ఎట్లా ప్రభావితం చేస్తుంది అనేది చెప్పడం. అందుకని మనం అనివార్యంగా ఈ భౌతిక పరిస్థితులను, ఈ చుట్టూ ఉన్న పరిస్థితులనూ మనం మభ్య పెట్టడానికి వీలుకాదు. కాబట్టి అలాంటివాటిలోంచి మనం కవిత్వాన్ని వస్తువుగా ఎంపిక చేసుకునే పరిస్థితి, అవసరముంటుంది. అందుకే ఇక్కడ ఎంతో మెలకువగా, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమున్నది. అందుకని ఇవన్నీ మనం ఎట్లా జేసుకుంటాం అనేది మన అనుభవం ద్వారా, మన పరిణతి ద్వారానే తెలుసుకునే అవసరముంటుంది. మొదలు చూడం. అక్కడినుంచే వెళ్తుంటాయి, ప్రక్కనుంచే వెళ్తుంటాయి మనం చూడం. జంధ్యాల పాపయ్య శాస్త్రికి ‘పుష్పవిలాపం’, పువ్వు ఏడుస్తున్న దుఃఖం కనబడి ఉండొచ్చు. వాల్మీకికి మనిషి యొక్క దుఃఖం కనబడి ఉండొచ్చు. శ్రీశ్రీకి బాటసారి యొక్క దుఃఖం కనబడి ఉండొచ్చు. చాలా ఆశ్చర్యంగా ఈ కరోనాతో వలసజీవులు కాలిబాటలో నడుస్తూ ఉన్నారు. వాళ్ళందరికి ఇంకే మార్గాలు లేకుంటే ఏం లేకుండా, పాదాలకు ఏమీ లేకుండా నడి ఎండలో పోతూఉంటే వాళ్ళ కష్టాలెవరూ అందుకోనప్పుడు కవులెవరూ దాన్ని అందుకోనప్పుడు శ్రీ శ్రీ ఎలాగైతే బాటసారిని
“కూలి కోసం, కూటి కోసం, పట్టణంలో బతుకుదామని
తల్లిమాటను చెవిన పెట్టక, వెళ్ళినట్టి బాటసారికి
ఎంత కష్టం ఎంత కష్టం చలివేస్తే, జ్వరం వస్తే..
ఎండ వస్తే ఎంత కష్టం ఎంత కష్టం” అని శ్రీ శ్రీ బాటసారిలో ఏ కవితనైతే రాసాడో ఆ కవితనే టీవీలలో తిరిగి తిరిగి వేయాల్సి వచ్చింది. కారణం ఏంటిది? అంటే అప్పటికి వలస సమస్యను కరోనా సమస్యను పట్టుకుని ఉండవచ్చు గాని, కరోనా వల్ల బాధపడున్న వలస జీవుల యొక్క కష్టాన్ని అందుకోలేని స్థితి ఉంది. వాళ్ళ జీవితానికి ఆసరాగా రానిస్థితి ఉంది. కవులు దాన్ని పట్టుకున్న తర్వాత చాలా కవిత్వం వ్రాశారు. దార్శనికతతో పట్టుకున్నది చాలా కీలకం. అలా పట్టుకున్నవాళ్ళు గొప్ప కవులు అవుతారు. చాలా కవిత్వం వచ్చింది. ‘వలస దుఃఖం’ అనే పుస్తకం వచ్చింది. ఆదిలాబాద్ నుంచి కూడా ఇంకో పుస్తకం వచ్చిందట. ఏదో పేరుతోని అందుకని ఇవన్నీ తరువాత ఇంకా వచ్చి ఉండవచ్చు. కానీ ఇవన్నీ కూడా మనం, కవిగా దార్శనికతతోని ఉండాలి. ముందు పట్టుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యం. అట్లా పట్టుకున్నటివాళ్ళు తప్పనిసరిగా చాలా మంచి కవులు అయ్యేందుకు అవకాశమున్నదనేది చెప్పవచ్చు. కాబట్టి ఒకే వస్తువు కొన్ని కొన్నిసార్లు ఎట్లా మారుతూ ఉంటుందంటే, ఒకే వస్తువు దృష్టికోణాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. ఉదాహరణకు నేను ఎమ్. ఫిల్. లో నా పరిశోధనాంశంగా ‘సూర్యుడు’ అనే టాపికను తీసుకున్నా. నాకిష్టంతోటి తీసుకున్న ‘సూర్యుడు’ అనే వస్తువు ప్రకృతిలో ఉన్న వస్తువు. అది భిన్నకాలాలలో భిన్న రూపాలలో వచ్చింది. వేదకాలంలో వచ్చేసరికి సూర్యుడు ఒక సూర్యభగవంతుడుగా, ఒక దేవుడుగా తీసుకున్నారు. పౌరాణిక దృష్టితో చూసినప్పుడు వైదిక దృష్టితో చూసినప్పుడు సూర్యుణ్ణి ఒక భగవంతునిగా చూడడం, కొనియాడడం జరిగింది. లేదా సృష్టికి ప్రాణం పోసేటువంటి వ్యక్తిగా చూడడం జరిగింది. తదనంతర కాలంలో మధ్యయుగాల వరకు వచ్చేసరికి, రాతి యుగం అంతరించి, మధ్యయుగ కాలంలోకి వచ్చేసరికీ, ప్రబంధ యుగంలోకి వచ్చేసరికి ప్రాచీన కవుల యొక్క దృష్టి శృంగార దృష్టి ఎక్కువ కాబట్టి వాళ్ళ దగ్గరికొచ్చేసరికి అదే సూర్యుడేమయి పోయాడు? అదే సూర్యుడు ప్రియుడైపోయాడు. కమలం ప్రేయసి అయిపోయింది. సూర్యుణ్ణేమన్నారు? కమల బాంధవుడు అన్నారు. కమలమనేటువంటి ప్రేయసి, ప్రియురాలు అయినట్లయితే, ఆ ప్రియురాలిని ప్రభావితం చేసేటువంటి వాడు సూర్యుడు అని. అంటే సూర్యునికి కమలానికి మధ్య హృదయాన్ని, ప్రణయాన్ని చిత్రించడమనేటువంటిది మనకు కావ్యయుగంలో, మనకు ప్రబంధ యుగంలోని కావ్యాల్లో ఎక్కువగా కనబడుతుంది. అంతకుముందు లేదు. భగవంతుడుగా ఉండిన సూర్యుడు అకస్మాత్తుగా ప్రియుడవుతాడు. ఈ ప్రియుడైనటువంటి సూర్యుని నుంచి మరికొంతకాలం ముందుకు వచ్చిన తర్వాత భావకవిత్వం దగ్గరికొచ్చేసరికి, భావకవిత్వంలో ప్రియుడు తక్కువ, ప్రేయసి ఎక్కువ. అంటే స్త్రీని అంతకుముందు ఏదైతే అంగాంగ సౌందర్య వర్ణన చేస్తుండేదో, శృంగార దృష్టితో బాహ్య సౌందర్యాన్నే చూస్తుండేవారో, అదే భావకవిత్వం దగ్గరికొచ్చాక అంతస్సౌందర్యం గురించి చెప్పారు, మొదలుబెట్టారు. అంటే భావకవిత్వం కొచ్చేసరికి ఆత్మసౌందర్యంతో చూసే ప్రేయసిని చాలా ఉదాత్తమైనదిగా చెప్పారు. ఆ ఉదాత్త రూపం దాల్చినపుడు సూర్యుణ్ణి ప్రేయసితో సమానంగా సరోజను “వికసింపజేయు సూర్యుణి ప్రియురాలివి నీవు” అనే అర్థం ఒక కవి వాడాడు. అంటే ఇక్కడ కవి ప్రియుడైతే కమలం ప్రియురాలు. ఆ ముఖ సౌందర్యాన్ని వికసింపజేసేటువంటివి ప్రియునివి నీవు అని సూర్యుని వర్ణించారు. భావ కవుల దృష్టిలో సూర్యుడు ప్రియుడైండు.. మళ్ళీ అభ్యుదయ కవుల దగ్గరికి వచ్చేసరికి సూర్యుడు ఉదయిస్తున్నాడు అంటే, తెల్లవారుతున్నది. ఒక మార్పుకు సంకేతంతో చూడడం జరిగింది. ఒక ప్రబోధానికి, ఒక ప్రగతిశీలతకు ఒక పురోగమనానికి ఒక ఉదయానికి, ఒక సరికొత్త మానసిక పరివర్తనకు చెప్పారు. ఆ తర్వాత తర్వాత వరకు విప్లవ కవిత్వం వచ్చేసరికి “సూర్యుని అరచేతబట్టి రైతు దుక్కిదున్నును” అన్నాడు శివసాగర్. సూర్యుని అరచేతబట్టి అంటే సూర్యుణ్ణి తన చేతిలో పట్టుకొని భూమిని దున్నుతాడని అన్నారు. విప్లవ కవిత్వంలో సూర్యుడు ఒక తిరుగుబాటు పతాకగా, తిరుగుబాటు జెండాగా చెప్పినారు. అదే తదనంతర కాలంలో, ఆశ్చర్యకరమైనటువంటి అంశమిది. దళిత కవిత్వం వచ్చింది. దళిత కవిత్వం వచ్చాక అదే సూర్యుణ్ణి, భగవంతుడు లేడు, ప్రియుడు లేడు, ప్రేయసి లేదు, తిరుగుబాటుదారుడు లేడు, విప్లవకారుడు లేడు అంటే సూర్యుడంటే ఒక రచయితేం చెప్పాడు – “నల్లా సూర్యుడు నల్లనల్లా సూర్యుడు” ఒక నల్లని సంకేతానికి వాడుకున్నారు. దళిత కవిత్వానికి ప్రతీకగా వాళ్ళు వాడడం జరిగింది. అంటే “నల్లటి సూర్యుడు” అని వర్ణించేటప్పుడు ఇందులో మళ్ళీ ఒక్క సూర్యుడే ఇన్ని విధాలుగా మారాడు. అంటే కవి యొక్క దృష్టికోణం మారింది. కాలం మారినప్పుడు భావజాలం మారింది. వస్తువును చూసే కోణం కూడా మారింది. మారుతుంది అని చెప్పవచ్చు. దీనితో మనకు అట్లానే, ప్రాచీనకాలంలో వస్తువును స్వీకరించడానికి నియమాలు పెట్టారు. భరతుడు అన్నదాని ప్రకారం ప్రఖ్యాతమైన వస్తువును తీసుకోవాలి. ప్రఖ్యాతమైన వస్తువు అంటే అనివార్యంగా ఉపనిషత్తుల్లోనో, లేదా పురాణాల్లోనే ఉండేటువంటి వస్తువును మాత్రమే తీసుకోవాలి. అదే పద్ధతిలో ప్రఖ్యాత, ఉదాత్త నాయకుణ్ణి తీసుకోవాలి అన్నారు. ప్రఖ్యాతుడైన, ఉదాత్తుడైన నాయకుణ్ణి మాత్రమే తీసుకోవాలి. అందుచేత నాయకుణ్ణి నాలుగు వర్గాలుగా చెప్పారు. నిర్ణయించారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే పరిణామం ఎట్లా వచ్చింది అని చెప్తున్నాను. నాలుగు రకాల నాయకున్ని నిర్ణయించారు, వివరించారు. దీని గురించే రాయమన్నారు. 1.ధీరోదాత్తుడు, 2. దీరోద్ధతుడు, 2. ధీరలలితుడు, 4. ధీరశాంతుడు. అని నాలుగు భాగాలుచేసి, ఈ ధీరుల గురించే కావ్యం వ్రాయమన్నారు. ఈ ధీర అనేది మాత్రం నాలుగు రీతుల్లో ఉన్నది. ఎవరు ధీరుడు? అంటే అనివార్యంగా దేవుడే అయి ఉండాలి. తర్వాత వచ్చేసి ప్రభువు. ప్రభువంటే రాజు, వీళ్ళ గురించే రాయాలి అనేటువంటి ఒక ఆలంకారికలు చెప్పింది, పరిణతి ఒక రోజున్నది. ఆ ఒకరోజు ఉండేదానిని గురించి తదనంతర కాలంలో ఎప్పుడైతే దృక్పథం మారిందో, దర్శనం మారిందో నాయకుడు కూడా మారాడు. నాయకునికి ఉండవల్సిన లక్షణాలు మారినవి. ఉదాత్తుడైన, ధీరుడైన నాయకుని నుంచి అభ్యుదయ కవిత్వం కాలం నాటికొచ్చేసరికి బాటసారి కూడా నాయకుడయ్యాడు. శ్రీశ్రీ కవిత్వానికి నాయకుడెవరు? బాటసారి. గురజాడ కవిత్వానికి నాయకుడెవరు? నాయిక ఎవరు? ఇంతకుముందు నాయకురాలుకు ఏం నియమాలు పెట్టారు? ఒక కావ్యంలో నాయిక కావడానికి మూడు నియమాలు పెట్టారు. ధీరురాలైన నాయిక, ధీరోదాత్తమైన నాయిక అంటే సగం ధీర, సగం అధీర నాయిక ఉండొచ్చు. అంటే ధైర్యం లేనటువంటి, అధీర అయినటువంటి ఏమాత్రం ధైర్యం లేనటువంటి నాయిక కావచ్చు అని చెప్పారు. వీటి కంటే ఎక్కువ అష్టవిధ శృంగార నాయికలు అని. ఎనిమిది రకాల ప్రణయ నాయకురాళ్ళను చెప్పారు. ఇది ఇక్కడ అవసరం లేదు. అయితే ఈ ప్రణయ నాయికను అందంగానైనా ఉండాలి. ధైర్యంగా వీరురాలైన నాయికగానైనా ఉండాలి. అటువంటి వాళ్ళను పెట్టి రాయాలన్నప్పుడు గురజాడ వరకు వచ్చేసరికి ‘పూర్ణమ్మ’ను నాయకురాలుగా చెప్పారు. కాని పూర్ణమ్మ ధీరురాలు గాదు, శృంగార నాయిక గాదు, ఆమె నాయిక అయ్యింది. ఎందుకు? ఎందుకంటే కాలం మారింది గనుక, ఆధునిక భావాలు, కొత్త భావాలూ వచ్చినవి గనుక, కొత్త చైతన్యం వచ్చింది గనుక, ఆంగ్ల కవిత్వంతో సంపర్క మేర్పడింది కనుక, సామాజిక విషయాన్ని కవిత్వంలోకి తీసుకురావలసిన అవసరం ఏర్పడింది గనుక, సాంఘిక ఆచారమైన బాల్య వివాహాన్ని దృష్టిలో పెట్టుకుని పూర్ణమ్మను నాయికను చేశారు. అందుకని పూర్ణమ్మ నాయిక ఎప్పుడైందీ అంటే మొత్తం నీ భావజాలం అంతా మారింది కాబట్టి నాయిక అయ్యింది. అప్పుడే పూర్ణమ్మ నాయకి అవడానికి వీలైంది. “పుత్తడి బొమ్మ పూర్ణమ్మ, విన్నారమ్మా ఈ కథను” అని “మేలిమి బంగరు మెలతల్లారా, నెలతల్లారా” అని ఆయన రాసి, ఆయన శైలినీ మార్చాడు, వస్తువునూ మార్చాడు. అప్పటికి పూర్ణమ్మ నాయిక కావడానికి వీల్లేదు. మధురవాణి నాయిక కావడానికి వీల్లేదు. అలాంటి పూర్ణమ్మను నాయికగా మార్చే స్థితి గురజాడ కాలంలో వచ్చింది. ఇట్లా మనకు కాలం సాహిత్య సూత్రాన్ని మార్చేస్తుంది. సహించే సూత్రాన్నిస్తుంది. మనస్సు వస్తువు ఎంపికకు మారి అందుకు ముందున్న సూత్రాన్ని మార్చేస్తుంది. అందుకనే వస్తువును ఎంచుకునే కాలమని మనం పెట్టుకున్నాం. సమకాలీనమైన వస్తువును స్వీకరించాలి అని ఎందుకన్నామంటే, అందరినీ ఒకప్పుడు ఆకర్షించవచ్చు గాని, ఇప్పటి మనుషుల అభిరుచులు, అభిప్రాయాలు, ఆలోచనలు మారుతున్నవి కనుక నచ్చకపోవచ్చు. కాబట్టి వాటికి దగ్గరగా ఉండేట్టు రాయాల్సిన అవసరం ఉన్నది అన్నదే ఇక్కడ కీలకమైనది. అక్కడ వస్తువుకు దగ్గరగా ఉన్న ప్రఖ్యాతుడై, ధీరుడై, ఉదాత్తుడై, ధీరురాలై ఉన్నటువంటి వాళ్ళ దగ్గరినుంచి, ఒక సామాన్యుడు గూడా కావ్యనాయకుడయ్యే ఒక పరిణామమంతా కూడా అభ్యుదయ కవిత్వం కాలంనాటికి వచ్చింది. ఎందుకంటే ఒక బాటసారి నాయకుడయ్యాడు. అభ్యుదయ కవిత్వంలో వస్తువును తీసుకున్నట్లయితే ఒక కార్మికుడు నాయకుడు. ఒక కర్షకుడు నాయకుడు. అట్లనే ఒక బాటసారి నాయకుడైనాడు, ఒక నిరుద్యోగి నాయకుడైనాడు. ఒక గుమాస్తా నాయకుడైనాడు, మధ్యతరగతివాడు, కింది మధ్యతరగతివాడు, ‘సినీవాలీ’ అనే పేరుతో ఆరుద్రగారు ఒక కావ్యాన్ని రాసాడు. ఆ సినీవాలి అనే కావ్యం ఒక గుమాస్తా, సూర్యారావు ఒక క్లర్క్ క్లర్క్ గురించి ఒక కథ. అంతకుముందు ఒక క్లర్క్ నాయకుడు కాదు. రానున్న కాలంలో భటుల గురించి రాసేదే తెలియదు మనకు. ఆ కాలం నాటికి ఆ దృష్టి లేదు. తరువాత కాలంనాటికి ఎవరు కష్టపడుతున్నారో వాళ్ళను గురించి రాయడం అనేది కవిత్వంలో వస్తువైంది. అందుకే, “ప్రభువెత్తిన పల్లకి కాదోయ్, అది మోసిన బోయీలెవరోయ్” అన్నాడు శ్రీశ్రీ. అంతకుముందు ప్రభువెక్కినటువంటి పల్లకిలో గూర్చునట్లవంటి ప్రభువు గురించి రాసిండు. కానీ తదనంతరం ఆ ప్రభువు గొప్పదనమేముంది? ఆ ప్రభువు ఉట్టిగ కూర్చున్నాడు. అది, ఆ పల్లకిని మోసినటువంటి వారి గురించి రాయాలిగాని అని, మోసినవాండ్ల గురించి, బోయిల గురించి రాశాడు శ్రీశ్రీ.
ఇక నిన్న యస్.పి. బాలసుబ్రహ్మణం గురించి చదువుతున్నప్పుడు నాకు ఆర్థంగా అనిపించిన అంశమేంటిదీ అంటే, ఆయన శబరిమలైకి వెళ్ళాడు. అందరు కూడా వెళ్లారు కావచ్చు. నడకలో ఆ గుట్ట ఎక్కడానికి ఎక్కలేనివారు డోలాల్లో పోతరు. ఆయనగూడా డోలా ఎక్కి పోయాడు. నడువలేడు కనుక డోలా ఎక్కి పోయాడు. దిగిన తర్వాత ఆయన తనకు ఎక్కడైతే కూర్చోబెట్టి సన్మానం చేస్తారో ఆ కుర్చీలో డోలాలో తీసుకొచ్చిన వాళ్ళను కూర్చోబెట్టి, వాళ్ళ పాదాలకు నమస్కరించాడు. దీన్ని పాతకాలంలోకి వెళ్ళి ఊహించలేము. ఆధునిక కాలంలో మాత్రమే ఊహించగలుగుతాం. ఒక డోలా మోసినటువంటి బోయీలకు, మోసినవాళ్ళకి కాళ్ళు మ్రొక్కడమనేది వచ్చింది. ఉత్తమ సంస్కారం అది. ఆధునిక కాలానికే సాధ్యం. బాలసుబ్రహ్మణ్యం లాంటి గొప్ప వ్యక్తి, గాయకుడు అక్కడ డోలా ఎత్తిన బోయీలకు వాళ్ళ కాళ్ళకు మొక్కాడు. నమస్కారం బెట్టడమనేది ఆయన యొక్క సంస్కారానికి నిదర్శనం అంటే, వస్తువు కాలాన్ని బట్టి మారుతుంది అని చెప్పడం. అందుకని ఈ వస్తువులన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే ఒక బిచ్చగత్తె గురించి, ఒక సాధారణమైన వృత్తి గురించి, తర్వాత కాలంలో రాసారు. అలిశెట్టి ప్రభాకర్ అయితే, వేశ్యల గురించి రాసాడు. అంతకుముందు వేశ్యల గురించి రాయవచ్చు. కాని వాళ్ళ దృష్టికోణం వేరు. స్త్రీని సుఖసాధనంగా, సౌఖ్య సాధనంగా మాత్రమే రాసారు. కాని ఇక్కడ వాళ్ళ బాధని, దుఃఖాన్ని రాసాడు. తదనంతర కాలంలో ఆమె బాధను, ఆమె దుఃఖాన్ని పట్టించుకున్నారు. అట్లాంటి స్థితి తదనంతర కాలంలో ఉంటుంది.
అదే వస్తువును మనం చూసేటువంటి దృష్టికోణం నుండి కూడా ఆ వస్తువును ఎంపిక చేసుకొని, దాన్ని దర్శించినది రాయడం అనేది ఉంటుంది. అట్లా మనం చూసుకుంటూ వచ్చినప్పుడున్నది ఏది? వస్తు స్వీకరణలో మొదటిది, కవి యొక్క దృక్పథం అందులో ఉంటుంది. రెండోది కవి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది. కవి వ్యక్తిత్వం, కవి దృక్పథం, కవి సంస్కారం ఉంటుంది. వీటితో మాత్రమే కొత్త వస్తువును, అవసరమైన వస్తువును తీసుకుంటాడు. ఈ సంస్కారం అనేటువంటిది పరిణత రూపంతో గనుక లేకపోతే వస్తువు కవిత్వ వస్తువుగా సరితూగదు. ఇప్పుడందరు కూడా రాస్తున్నారు. ఈ ప్రపంచీకరణ వచ్చింతర్వాత మనందరికి తెలిసిందే. ప్రపంచీకరణ వచ్చాక మానవ సంబంధాలపైన ఎక్కువ కవిత్వం రాస్తున్నాం. ఇంతకు ముందు కనిపించదిది. వర్తమాన కవిత్వంలో అది కనబడుతుంది. “మాయమై పోతున్నాడమ్మా మనిషన్నవాడు” అని అందెశ్రీ రాస్తాడు, “పల్లె కన్నీరు బెడుతున్నదని” గోరెటి ఎంకన్న రాస్తాడు. అట్లా “ఎట్లున్నవే ఓ పల్లె” అని నేనాల కిశోర్ రాస్తాడు. “ముఖమో, పుస్తకమో కాని చోట మనం కలుసుకుంటున్నాం” అంటాడు నారాయణస్వామి. ఫేస్ బుక్ అనేదానికి ఆయన, ఫేస్ అంటే ముఖము, బుక్ అంటే పుస్తకము అని, ఇవి మనం కలుసుకునేచోట ముఖమూ ఉండదు పుస్తకము లేనిచోట, కానిచోట మనం కలుస్తున్నాం. అంటే ఈ ఫేస్ బుక్అంటారు. కాని ఫేస్ ఉండని, బుక్ ఉండని చోట కలుసుకుంటున్న అట్లాంటి ఒక స్థితిని వర్ణిస్తున్నారు. ఎక్కడైతే కవి ఆలోచన, దృక్కోణం మారుతుందో అక్కడ వస్తువూ మారుతుంది. ఇప్పుడు కవులు నాస్టాల్జియా అనేటువంటిది, ఇటీవల కాలంలో చాలామంది రాస్తున్నారు. మనందరికీ తెలిసిందే.
ముఖ్యంగా ప్రపంచీకరణ వచ్చాక అందరూ మారిపోయారు, ముఖ్యంగా యూజ్ అండ్ త్రో ఫిలాసఫీ వచ్చిన తర్వాత ఉపయోగించుకోవటం, పడేయటం, ఇలాంటివి వచ్చిన తర్వాత, గతంలో సిరంజీని వేన్నీళ్ళలో వేడి చేసి తిరిగి వాడేది, ఇంజక్షన్ చేసేవారు. స్టెరిలైజ్ చేసి వాడేవారు. ఇప్పుడు స్టెరిలైజ్ చేసే అవసరం లేదు. వేడినీళ్ళు అవసరం లేదు. ఇప్పుడు యూజ్ అండ్ త్రో ఇంజక్షన్లు దొరుకుతున్నవి. అవి ఏసేస్తరు పడేస్తారు. ఇవి దొరుకుతున్నవి కనుక కొంటం తీసుకుంటం పడేస్తాం. ఇలాంటి ధోరణి వచ్చింతర్వాత మనకు నాస్టాల్జియా, బాల్యము – జ్ఞాపకాలు రాయటమనేది బాగా ఎక్కువవుతున్నది. దండెం మీద, మంచం మీద, టేబుల్ మీద వీటన్నింటి మీద కవిత్వం రాసేటువంటి పద్ధతి కూడా వచ్చింది. కనుక వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని కవిత్వ వస్తువును ఎంపిక చేసుకోవటంలో ఒక అంశంగా చెప్తే, ఈ వస్తువులకు సంబంధించి మంచి పద్యం ఒకటున్నది. రామరాజ భూషణుడు తన ‘వసుచరిత్ర’లో ఒక పద్యం రాసాడు.
“కేవల కల్పనా కథలు కృత్రిమ రత్నముల్
ఆద్యత్కథల్ వావిరి పుట్టు రత్నముల్
అవారిత సత్కవి కల్పనా విభూషావహ పూర్వ వృత్తములు
సానలు దీరిన జాతిరత్నముల్” -రామరాజు భూషణుడు
ఒక రత్నాన్ని వస్తువుగా తీసుకొని కల్పన చేసేప్పుడు అవి కృత్రిమ రత్నాలు కనుక ఆర్టిఫిషియల్ రత్నాలు అయితే, కేవలం వాటినే వర్ణిస్తే అవి కృత్రిమ ఆర్టిఫిషియల్ కనుక ఈ కృత్రిమ రత్నాలకు తేజం రాదు, కాంతి రాదు, శోభ రాదు, వెలుగు రాదు, సొగసు రాదు. కనుక కృత్రిమరత్నం, ఆర్ట్ ఫిషియల్ ఆర్ట్ ఫిషియలే గనుక. ఇది కల్పనా కథ. ఆయనన్నదాని ప్రకారమే “ఆద్య సత్కథల్…” పురాణాల్లో, ఉపనిషత్ లలో ఉండేటువంటి గొప్ప మంచి కథలు ఈ కథలు ఏవైతే ఉన్నవో అవి అన్నీ “పుట్టు రత్నాలు”. అంటే ముడిరత్నాలు. సానబెట్టనటువంటివి వాటికి కూడా సమస్యలు ఉంటాయి. సానబెట్టినవి కూడా ఉంటాయి, సొగసుగా ఉంటాయి. మరి ఏవి తీసుకోవాలన్నా ఇవి కృత్రిమ రత్నాలైతే ఏమిటి? అవేమో ముడిరత్నాలైతే ఏమిటి? భూమిలోంచి తవ్వి తీసిన రత్నాలైతే ఏంటి? అంటే ఎవరైనా ఇష్టపడేది సానబెట్టినటువంటి జాతిరత్నాలనే తీసుకోవాలి. అవేంటివంటే “తత్కవి కల్పనా… పూర్వరూము” అవి జీవితంలో ఉండాలి, ఆ జీవితంలో ఉండేటువంటి కల్పనను, దానికి జోడించాలి, పూర్వవృత్తమై ఉండాలి. అంటే మానవ వృత్తమై ఉండాలి. దానియొక్క సంబంధాలలో ఉండేటువంటివి, మనిషి జీవితంలో ఉండాలి. పూర్వరూపంతో ఉండాలి. ఇవి కవి యొక్క కల్పనలు. ఇవి రెండూ జోడించినప్పుడు అవి జాతిరత్నాలుగా మారుతాయని వివరించాడు. మరి జాతి రత్నాలుగా భావించేవి, అటువంటి వస్తువును తీసుకుని, సానబట్టిన రత్నాలను తీసుకోవాలి. మనం జాతిరత్నాలు అనేవి ఎటువంటివో జాతిరత్నాల్లాంటివేవో అవి తీసుకోవాలన్నప్పుడు అనేటువంటిది కొంచెం ఈ పద్యాన్ని సరిబెట్టుకుంటే ఇది మనకు సమకాలీనమైన ఈ ముడిరత్నాన్ని మనం సానబెట్టుకోవచ్చు. మనం సానబెట్టుకోవడానికి దానికి కోణాల్ని కూడా తయారు చేసుకోవచ్చు. అంటే దానికి పార్శ్వాలు, దాని మూలాలు చెక్కినప్పుడు చేసే శోభ పెరుగుతుంది. దాని వెలుగు పెరుగుతుంది. కాబట్టి పార్శ్వాలూ, మూలాలు, కోణాలు తయారు చేసుకునేటువంటి పరిస్థితులలో మనం చైతన్యంతో ఉంటాము, అనేటు వంటిది వస్తుంది. అది మన మానసిక చైతన్యాన్ని బట్టి, పరివర్తనను బట్టి మానవ పరిమితిని బట్టి అది వస్తుంది. అందుకని మనం వస్తువు ఎంపికలో ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మనకు ఒక సామెత కూడా ఉన్నది. వెంట్రుకలున్న కొప్పు ఎట్లున్నా బాగుంటుందని. కొప్పు ముడిచినా బాగానే నైపుణ్యంతో చేస్తే బాగానే ఉంటది, జడేసుకున్నా బాగనే ఉంటది. ముందు మనకు సమృద్ధిగా వస్తువు ఉండాలి. ఉంటే ఆ వస్తువును ఎక్కడ చెక్కుకోవాలో తెలుస్తుంది. మనం తర్వాత మన యొక్క శిల్పనైపుణ్యాన్ని బట్టి చెక్కుతం. కాబట్టి ఈ వెంట్రుకల్లాంటి శిల్పం, వస్తువును ఎంపిక చేసుకోవడం అన్నట్టు.
ఇంకొక పోలిక కూడా చెప్పుకుందాం. వస్త్రం (క్లాత్) ఉన్నది. వస్త్రం అనేది మనం వస్తువు అనుకోవచ్చు. నేసినటువంటి వస్త్రం ఏదైతే ఉన్నదో దానిని వస్తువు అనుకుంటే, దాని ద్వారా మనం ధరించేటువంటి అంగీ లేదా షర్ట్ ను నిర్మించడమనేటువంటిది దాని యొక్క రూపం. వస్త్రం ఉంటేగదా మనం షర్టు కుట్టించుకోవటం అనేది, లేదా షర్ట్ ను తయారు చేసుకోవటమనేది జరుగుతుంది. అసలు వస్త్రమనేదే లేకుంటే షర్ట్ రూపం రాదు. కాబట్టి రూపానికి మలచాలనుకున్నప్పుడు వస్త్రమనేది ఉండాల్సిందే. మెరిసేటట్టు చేయాలనుకుంటే వజ్రాన్ని లేదా రత్నాన్ని అని అనుకుంటే ముందు ఆ ముడి సరుకు ఉండాలి .వస్త్రం అనేది ఉంటే దాన్ని షర్ట్ గా మార్చుకోవచ్చు.
ఒక మాట ఉన్నది నీ షర్ట్ గా కుట్టుమన్నాక కూడా మనమింకా దానికి ఏం జేస్తమంటే టెక్నిక్, షర్ట్ అనేటువంటిది దాని ఫామ్ అనుకుంటే, వస్త్రము దాని కంటెంట్, షర్ట్ అనేది దాని యొక్క ఫామ్. దాన్ని టెక్నిక్ లోకి మార్చి దాన్ని ఇంక కొంచెము టెక్నిక్ ను జోడించి డ్రస్ తయారు చేసుకోవడమూ అన్నమాట. డ్రస్ కు ఐరన్ చేసుకోవడమన్నమాట! మనకు ఫామ్ ఒకటి అవసరము. మనకు ఉతికినా, శుభ్రమైన వస్త్రమే కావచ్చు. ‘మనం’ వెంటనే వేసుకుంటామా అనేది, నచ్చకుంటే అలిగైనా సరే దాన్ని వేసుకోము. ఇస్త్రీ చేసేప్పుడు దానికి మరింత శోభ. అందుకని ఐరన్ చేయడమనేది టెక్నిక్ తో సమానం. ఐరన్ చేసి వేసుకుంటాం కదా అట్లా మనం దీనికి రకరకాల స్థాయిల్లో రకరకాల రూపాల్లోకి మార్చుకొని దానికి పదును బెట్టుకొని, సొగసును దెచ్చుకొని దాన్ని అందంగా తయారు చేసుకొని, అందరికీ ఆకర్షణీయంగా, ఎదుటి వ్యక్తిని ఆకర్షించేలా తయారు కావడమనేది ఉంటుంది. ఉంది, అని. అందు కొరకు అన్నింటి యొక్క లక్షణమేంటని అన్నప్పుడు, ఎదుటి వ్యక్తిని ఆకట్టుకోవాలి. ఇది నచ్చటం అనేది. మనం ఎదుటి వ్యక్తికి ఎందుకు నచ్చాలి అనేదాన్ని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. మన చుట్టూ ఉంటారు. అయితే నా ఇష్టం వచ్చినట్టు నేను వేసుకుంటాను అని, నేను మార్చాల్సిన అవసరమే ముందీ అని కూడా అనుకుంటారు. అట్లా అనుకున్నప్పుడు వాళ్ళలో స్వేచ్ఛ వాళ్ళకు ఉంటది గాని, వాళ్ళను చూసి ఎదుటి వ్యక్తికి చేర్చాలి అని అనుకునేందుక్కూడా అవకాశమున్నది. ఎదుటి వ్యక్తి హృదయానికి ఒక విషయాన్ని చేర్చాలి అని అనుకున్నప్పుడు, ఎదుటి వ్యక్తి యొక్క హృదయాన్ని స్పందించాల్సిన అవసరమున్నది. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని మనం వస్తువు ఎన్నిక లోపల ఎన్ని రకాల అంశాలు, పాత్రలు వచ్చాయో చూడాలి. స్త్రీవాదం వచ్చినప్పుడు ఏ రకమైన వస్తువులు ఎన్నుకోవడం జరిగింది, దళితవాదం వచ్చినప్పుడు ఏ వస్తు స్వీకరణ జరిగింది. దర్శనంలో కూడా ఇదే చర్చ వస్తుంది. మనం అంతకుముందు చూసిందానికి తర్వాత చూసేదానికి దృష్టికోణం మారింది కనుక వస్తువు మారినది. అట్లా మనకు ఆ ‘చంద్రుణ్ణి’ అనే అంశాన్ని తీసుకొని, వాల్మీకి అందించాడు. రామాయణంలో వర్ణిస్తూ ఏమన్నాడు అంటే “యాగశాలలో స్వేచ్ఛగా తిరుగుతున్న ఆంబోతులా ఉన్నాడు చంద్రుడు” అని అన్నాడు, వర్ణించాడు. ఈ యాగశాల అని ఎందుకు అన్నాడు అంటే ఆ రోజుల్లో ఈ యాగశాలలు ఉండేవి కాబట్టి అదే వాతావరణం ఉండేది. కాబట్టి అందులో తిరుగుతున్నట్టు అని వ్రాశాడు. ఇదే చంద్రుడు మళ్ళీ కలువుపువ్వును పుష్పింపజేసేటువంటి ప్రియుడిగా మారాడు. చంద్రుడు కలువరేడు, కలువలకు రాజు, కలువలకు ప్రియుడు అయినాడు. ఇదే చంద్రుడు శ్రీశ్రీ దగ్గరికి వచ్చేసరికి “కాళ్ళు తెగిన ఒంటరి ఒంటెలాగున్నాడు చంద్రుడు” అన్నాడు. అదే ప్రపంచీకరణ వచ్చిన తర్వాత చంద్రుణ్ణి ఒక కవి, తైదల అంజయ్య అనే కవి వర్ణించాడు. ఏమని అంటే చంద్రుడు ఒక ‘డాలరు’గా కనబడుతున్నాడు అని. అంటే ప్రపంచీకరణకు ముందు చంద్రుడు డాలరులాగా కనిపించ లేదు. రూపాయి నాణెంగా కనిపిస్తాడు. కానీ ప్రపంచీకరణ తర్వాత డాలరు రూపాయికి ప్రత్యామ్నాయంగా వచ్చినట్టు చూస్తాం. రూపాయి విలువ తగ్గింది గనుక డాలరు విలువ పెరిగింది కనుక, డాలరు అందరినీ ఆకర్షించింది గనుక, కవిని కూడా ఆకర్షించి, చంద్రుడు నాకెట్లా కనబడుతున్నాడంటే డాలరులాగా కనబడుతున్నాడని అన్నాడు. అట్లా ఎప్పటికప్పుడు చంద్రుణ్ణి చూసినటు వంటి దృష్టికోణంలో కూడా మార్పు వచ్చింది. పఠాభి అనే ఒక కవి ‘ఫిడేలు రాగాలు డజన్’ అనే కవితలో “చైనా బజారులో తగిలించబడిన ఒక పుష్పంలాగా ఉంది చంద్రుడు’. చైనాబజారులో తగిలించిన ఒక వస్తువులాగా ఉన్నాడు చంద్రుడు. జీవితంలోంచి ఆ వస్తువు యొక్క దర్శనం మారి పోతుంది. కవి వర్ణించడంలో ఈ ప్రత్యేకతలన్నీ వచ్చేసినవని చెప్పవచ్చు. వస్తువు స్వీకరణలో నాలుగు అంశాలను తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. 1. పరిచయమైన వస్తువై ఉండాలి, 2. సమకాలీన వస్తువై ఉండాలి, 3. మానవ భావోద్వేగాలను ప్రేరేపించేవాటిగా స్పందింపచేసేటువంటిదిగా ఉండాలి అని కవిత్వంలో వస్తువు చాలా కీలకమైనది అని మరోసారి చెప్తూ వస్తు ఎంపిక దగ్గర మన యొక్క ప్రత్యేకత, కవి యొక్క ముద్ర ఉందాలి. కవి యొక్క ప్రత్యేకత ఎంపిక దగ్గరనే కనబడాలి. ఎంపిక దగ్గర తన కవి ముద్ర నిరూపించుకోవాల్సి ఉంటుంది అనీ కవులంతా కూడా గుర్తించాలి. మంచి వస్తువును తీసుకొని మంచి కవిత్వం రాయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.