బతుకమ్మ పండుగ కన్నా ముందు బొడ్డెమ్మల పండుగ వస్తుంది.తొమ్మిదిరోజుల పాటు కన్నెపిల్లలు మాత్రమే చేసేపండుగ ఇది బొడ్డెమ్మ అంటే “చిన్నది” అని అర్థం. అలాగే, ‘బొడ్డు’ అంటే ‘అత్తి చెట్టు’ అనే అర్థం ఉంది. దీన్నే మేడి చెట్టు, ఉదంబర చెట్టు అని కూడా పిలుస్తారు. తెలంగాణ ప్రాంతంలో అడపిల్లల్ని చిన్నప్పుడు బొడ్డెమ్మ అని పిలుస్తుంటారు. మేడిపండ్లని శ్రీమంతం రోజున తప్పనిసరిగా గర్భిణి ఒడిలో నింపుతారు. అందువల్ల, మేడిచెట్టును, మేడిపండును పూజించే క్రమంలో ఈ పదం పుట్టి ఉండవచ్చని కూడా కొందరి అభిప్రాయం. జానపదులకు తెలిసిందల్లా వారి మాటల ప్రకారం బొడ్డు, ‘అమ్మ కలిసి ‘బొడ్డెమ్మ’ అయింది. ‘బొడ్డు’ అంటే ఆధార భూతమైంది. తల్లికి, బిడ్డకి అనుసంధానమైంది. రేపటి బతుకుకు మూలమైంది కన్నెపిల్ల. కన్నెపిల్లనే బొడ్డెమ్మ. అందుకే సల్లుడు బొడ్డెమ్మల ఐదు పూలకుప్పలలో ఐదో పూలకుప్పని ఇంటి కన్నె పిల్లని కూర్చోబెట్టి చల్లుతారు. కన్నెపిల్లకి ముత్తయిదువులంతా పసుపు, కుంకుమ లిస్తారు. బొడ్డెమ్మను చెక్కపీటపై పుట్టమన్నుతో చతురస్రాకారంగా ఐదు దొంతరలు చేసి ఒకదానిపై ఒకటి త్రిభుజాకారంగా పేరుస్తారు. తంగేడు, బంతి వంటి పూలతో అలంకరించి శిఖరాన బియ్యంతో నిండిన కలశాన్ని ఉంచి, దానిపైన కొత్త రవికె బట్టనుంచి దానిపై తమలపాకు, పసుపుముద్ద ఉంచి ఆ ముద్దను గౌరమ్మగా భావించి పసుపు, కుంకుమలతో పూజిస్తారు. చెక్కతో కూడా ఈ బొడ్డెమ్మను చేసి, దానిపై నాలుగు వైపులా నాలుగు మట్టిముద్దలు పెట్టి పూలతో, అలంకరిస్తారు. బొడ్డెమ్మ పండుగ అంటే కన్నెపిల్లల ఆట, పాట మాత్రమేకాదు. ఆడపిల్లల్ని పూజించే పండుగ, గౌరవించే పండుగ. ఆడపిల్ల ప్రాముఖ్యాన్ని జగతికి చాటే పండుగ. తెలంగాణ అడపిల్లని ‘ఆడిపిల్ల’ అంటారు, అడిపిల్ల పుట్టిందంటేనే ప్రాంతమంతా ‘లక్ష్మీదేవి పుట్టింది’ అంటారు, ఎంతో ముద్దు ముచ్చట, కానీ అన్నింటికీ మించి కట్టడి, క్రమశిక్షణ, ఆడపిల్లంటే అణిగి, మణిగి ఉండాలి. నలుగురిలో నవ్వొద్దు, ఎగరడం, దూకడం చేయకూడదు. ఇలా అనే ఆంక్షలు నేర్చిన మన తెలంగాణ సంస్కృతే బొడ్డెమ్మ పండుగ ద్వారా పెద్దల సమక్షంలో నలుగురిలో ఆటపాట నేర్పింది. సిగ్గును పక్కకు పెట్టి నలుగురిలో మెలగడం నేర్పింది. ఎదుటివారితో మాటామంతీ కలుపుకోవడం నేర్చింది. కుటుంబం చక్కబెట్టుకోవడమే కాదు, సమాజ భావన అవసరమనీ చెప్పింది. బొడ్డెమ్మ తయారీ మొదలు చివరి వరకు ఇంటి పెద్ద నాయనమ్మ సమక్షంలోనో, ఆప్రాంతంలో ఎవరైనా పెద్దలు సమక్షంలోనే జరుగుతుంది. పెద్దలు చెప్పిన పాటల్ని అంటూ పిల్లలంతా ఆడతారు, పాడతారు. చప్పట్లు ఎలా కొట్టాలి, చేతులు ఎలా కలపాలి అనేది పెద్దలు నేర్పుతారు. ఎన్నో పాటలు, పిల్లల్ని ఆకర్షింపజేసి బతుకమ్మ ఆటను నేర్పుతాయి. ఈ పండుగరోజుల్లో కన్నెపిల్లలు ప్రతిరోజు ఇంటి నుంచి బియ్యం తీసుకుని వచ్చి కలశంలో పోస్తారు. బొడ్డెమ్మును సాయంత్రం మొదలుకొని చీకటిపడేవరకు పిల్లలు, పిల్లలతోపాటుగా ఆసక్తి ఉన్న పెద్దలు పాటలు పాడుతూ ఆమెను పూజించి, పప్పుబెల్లాలతో కూడిన పలహారాలను పెంచి పెట్టి బొడ్డెమ్మను పూజాగృహంలో దాచిపెడతారు. ఆ విధంగా తొమ్మిది రోజులు వివిధ రకాలైన ప్రసాదాలు చేసి బొడ్డెమ్మను కొలిచి ఆఖరిరోజున దగ్గరలో ఉన్న బావిలో జారవిడుస్తారు. ఈవిధంగా చేయటాన్ని నిద్రపుచ్చుట అంటారు. తొమ్మిదవ రోజున బొడ్డెమ్మపై కలశంతో నిండిన బియ్యాన్ని పరమాన్నంగా వండి బాలికలు, కలిసికట్టుగా ఆరగిస్తారు.
వ్యాసాలు
త్యాగయ్య గారు నవవిధ భక్తి మార్గాలలో రచించిన కీర్తనలు కొన్ని పరిశీలిద్దాం. 1)శ్రవణం ..
పల్లవి - రామకథా సుధారస పానమొక రాజ్యము చేసునే!
ధర్మాద్యఖిల ఫలదమె మనసా -ధైర్యానంద సౌఖ్య నికేతనమే
కర్మబంధ జ్వలన ఆబ్ది నావయే -కలిహరమే త్యాగరాజ వినుతుడగు!!
ఈ కీర్తనలో రామనామ మహిమ చెప్పబడింది.
2)కీర్తనం..
పల్లవి-
రామాభిరామ మనసు రంజిల్ల బల్కరాదా!
బంగారు మేటి పాన్పు పై భామామణి జానకి
శృంగారించుకొని చెలువొంద నినుగని
పొంగుచు మల్లె విరుల పూజించు వేళ శ్రీ హరి
సంగీతము పాడుచును త్యాగరాజు నితో!!
త్యాగయ్య ప్రతి కీర్తనలో రామ కీర్తనం వివరంగా ఉంటుంది. ప్రత్యేకించి ఏదో ఒక కృతిని ఉదహరించడం కొంత కష్టమే.
” ఏలావతార మెత్తు కొంటివి -ఏమి కారణము రాముడై “ అను కీర్తనలో
“యోగులను జూచుటకా భవ రోగులను బ్రోచుటకా శత
రాగ రత్న మాలికను రచించిన త్యాగరాజు నకు వర మోసంగుటకు’
అని తన శత రాగ రత్న మాలిక నంగీకరించి వరమిచ్చుటకై అవతరించి నాడని రామచంద్రుని కీర్తించుట ఎంతో మనోహరమైన భావన.
3 )స్మరణము..
“ శ్రీపతే నీ పద చింతనే జీవనము’
అను కీర్తనమున భగవంతుని స్మరించుటయే తన జీవిత లక్ష్యమని అట్టి చింతనే ఇంద్రాదులు గొప్ప మహిమను పొందారని చెప్పుచు
‘రామ నామ స్మరణము వల్ల నామ రూపమే హృదయము నిండి ప్రేమ పుట్ట జేయగలేదా’
అంటూ స్మరణ విశిష్టతను తెలిపారు.
4 )పాద సేవనం..
‘శ్రీరామ పాదమా! నీ కృప జాలునే చిత్తానికి రావే!
అను కృతిలో పాదాభివందన మొక్కటే అన్ని దురితాలను అపహరించగల సామర్థ్యం ఉందని చెప్పుతూ అహల్య వృత్తాంతాన్ని నిదర్శనంగా పేర్కొని, బ్రహ్మాదుల చేత పూజింపబడే ఆ పాదాలు తన మనస్సులో నిరంతరం స్థిరంగా నిలవాలని ప్రార్థించాడు. సందేహమును దీర్చవయ్య సాకేత నిలయ’అను కృతిలో
‘వర మౌను లెల్ల జరణమ్ములను,స్మరియింప నీడు పద మొసంగెనో
భరతార్చనచే బాదుకలు ,ధర నిన్నొసంగె త్యాగరాజ భాగ్యమా!!
అంటూ శ్రీ రామ చంద్రుని చరణాల కన్నా ,వాటిని సేవించిన పాదుకలు మరింత గొప్పవని భరతుని వృత్తాంతాన్ని నిదర్శనంగా పేర్కొని కీర్తించారు.
‘రఘునాయక !నీ పాద యుగ రాజీవముల నే విడ జాల’ అను కీర్తనలో భవ సాగరమును దాటగోరు వారికి శ్రీ రాముని తప్ప వేరుగతి లేదని తెలిపారు.
‘శ్రీ మానినీ మనోహర ! చిరకాలము మాట యొక టేరా ‘ అను కృతిలో భక్తులు తమ సర్వస్వాన్ని భగవంతుని చరణాల యందు సమర్పించి పాద సేవచే ధన్యులవుతారు అంటూ ప్రశంసించారు.
5 )అర్చన..
. రార సీతా రమణీ మనోహరా’ అను కృతిలో
‘బంగారు వల్వలు నే బాగుగా గట్టెద మరి
శృంగారించి సేవ చేసి కౌగిట జేర్చేద
సారెకు నుదుటను కస్తూరి తిలకము బెట్టేద
సారమైన ముక్తా హారములు నిక దిద్దేద ‘
అంటూ అనేక విధాలుగా పరమ భక్తితో భగవంతుని సేవ చేసి తరింతు నని
పేర్కొన్నారు.
‘తులసీ బిల్వ మల్లికాది జలజముల పూజలు గైకొనవే ‘అనే కృతిలో
‘ఉరమున ముఖమున శిరమున భజమున
గరమున నేత్రమున చరణ యుగమ్మున
గరుణతో నెనరుతో పరమానందముతో ‘అంటూ వివిధములైన పుష్పాలతో శాస్త్రవిధిని పాదాది శిరః పర్యంతము ప్రత్యంగ పూజ చేసే విధానాన్ని వివరించారు. 6 6 )వందనము..
‘వందనము రఘు నందన’అనే కృతిలో పరమ భక్తి భావము మనసులో ఉప్పొంగు చుండగా భగవంతునకు నమస్కరించు పద్ధతి తెలియ చేశారు.
7 )దాస్యము..
‘తవ దాసోహం తవ దాసోహం దాశరథి’ అను కృతిలో త్యాగరాజు దాసత్వమే సరియైన తరణొ పాయమని విశ్వాసంతో పలికారు.
8 )సఖ్యము..
‘సామికి సరి జెప్ప జాల వేల్పుల’అనే కీర్తనలో
‘తన కంటి కెంతో ముద్దు తప్ప దాడిన వద్దు చనువు చేయునొ పొద్దు చల్లని చూపు కద్దు
అన్నీ వేల్పుల లోన అతనికి సరిగాన
తన్ను బ్రోచిన ఘన త్యాగరాజు సఖు డైన’
ఆంటూ శ్రీ రాముని పట్ల తనకు గల స్నేహ భావాన్ని ప్రకటించారు.
9 )ఆత్మ నివేదనము..
‘కాలహరణ మేలరా హరే’ అన్న కృతిలో
‘చుట్టి చుట్టి పక్షు లెల్ల చెట్టు వెదకు రీతి
భువిని పుట్టగానే నీ పదముల బట్టుకొన్ననన్ను బ్రోవ
దినదినమును తిరిగితిరిగి దిక్కు లేక శరణు జొచ్చి
తనువు ధనము నీదే యంటి త్యాగరాజ వినుత రామ’
అంటూ అనన్య గతికత్వముతో శరణు కోరారు త్యాగయ్య ఈ కృతిలో.
‘నన్ను విడిచి కదలకురా’ అనే కృతిలో కూడా మనసు కరిగే విధంగా శరణు వెడుతూ తన సర్వస్వాన్ని రామ చంద్రునికి సమర్పించారు.
ఈ రకంగా ఎన్నో విధాల తమ కవితా శక్తిని ప్రదర్శించి తమ భక్తిని అనేక కృతులలో వర్ణించారు. ప్రాచీన కవులకు ఏ మాత్రం తీసిపోని విధంగా ,భక్తా గ్రేసరులైన నారదాది ఋషుల లాగా తమ భక్తి ప్రపత్తులను వెల్లడి చేసిన ఉత్తమోత్తమ వాగ్గేయ కారులు త్యాగయ్య గారు.
**************************************
తెలుగు వారి విస్తార చరిత్రలో రెడ్డిరాజుల యుగం (1324-1402 ) ఒకమహోజ్జ్వలఘట్టం. గీర్వాణాంధ్ర భాషా సారస్వతాలకు సువర్ణాధ్యాయం. రాజులు, మంత్రులు స్వయంగా రసజ్ఞలైన కవి పండితులు కావడం; కృతికర్తలు. కృతిభర్తలు కావడం ఈ యుగవిశేషం. ప్రోలయవేమారెడ్డి(1324-53), అనపోతారెడ్డి(1353-64) అనవేమారెడ్డి (1364-1386) కుమారగిరి రెడ్డి (1386-1402) లాంటి రెడ్డిరాజులు షట్కాల శివపూజా పరాయణులై, దేవాలయ నిర్మాతలై, దాననిరతులై, ఉదారచింతనాపరులై విలసిల్లారు. ఆనాటి రాజులు మెచ్చిరా- రత్నాంబరాలు, కస్తూరిదానాలు, భూరి దినవెచ్చాలు, హేమపాత్రాన్న పంక్తి భోజనాలు… మెచ్చక పోయిరా- నిగళయుగళ సత్కారాలు, పురవీధి పొగడదండ పరిష్వంగాలు, వెదురు గొడియలతో వియ్యాలు, నగరి వాకిట నుండు నల్లగుండుకు భూజాస్తంభ గౌరవాలు… ఈ యుగ సాహిత్య నాయకుడు శ్రీనాథకవిసార్వభౌముడు. అశేష మనీషిహృదయంగమంగ కావ్య సృజనం చేసిన ధీశాలి. బ్రాహ్మీదత్త వరప్రసాదుడు. ఉరుప్రజ్ఞా విశేషోదయడు. సాహిత్య పదవీ మహారాజ్య భద్రాసనాసీనుడు(1-7). సంస్కృత ప్రాకృత శౌరసేనీ ముఖ్యభాషాపరిజ్ఞానం. మహాభాష్య విద్యా సమభ్యాసబలం, శ్రుతి పురాణాగమ స్మృతి సాంఖ్య సిద్ధాంతకబళన వ్యుత్పత్తి గౌరవం, పూర్వ కవి ముఖ్యవిరచితాపూర్వ కావ్య భావరస సుధా చర్వణ విస్తారంగా గలిగిన వాడు శ్రీనాథకవీంద్రుడు.
శ్రీనాథ కవిసార్వభౌముడు ప్రౌఢనిర్భర వయః పరిపాకాన భీమేశ్వరపురాణాన్ని రచించాడు. మూలం స్కాంద పురాణాంతర్గతమని శ్రీనాథుడే స్వయంగా చెప్పినా అది అవిశ్వసనీయం.
దక్షారామ భీమేశ్వర సంకీర్తనను సభక్తికంగా సాగిస్తూనే స్థానిక కథా విశేషాలను, సాంఘిక సామాజిక స్థితిగతులను తనివితీరా వర్ణించాడు. శ్రీనాథుని సమకాలీన సమాజస్వరూపాన్ని మిగిలిన కృతులకన్నా భీమేశ్వర పురాణమే అత్యధికంగా ప్రతిఫలించిం దన్న అతిశయోక్తి కాదు.
జీవన స్థాయి, భోజనప్రీతి, మర్యాదలు లాంటి భౌతికాంశాలు, విశ్వాసాలు, ఆచారవ్యవహారాలు. అర్చనాది ఆధ్యాత్మికవిశేషాలు, అసూయలు, కోపతాపాలు మొదలైన మానసికాంశాలు భీమేశ్వర పురాణంలో శ్రీనాథుడు ఔచితీమంతంగా నిక్షిప్తం చేశాడు. భీమేశ్వరపురాణం మొదటి సగంలో వున్న బిగి తరువాతి సగంలో చెడింది. సంకీర్తనకే పరిమితమై ఉదాత్త కావ్యనిర్మాణశోభాకరాలైన ఇతరేతరాంశాలను పక్కకు పెట్టాడనిపించింది. పునరుక్తులు పరిహరిస్తే సగానికి సగం కావ్యం తగ్గుతుంది. ప్రాచీనకావ్యాలలో సాంఘికాంశాలను అన్వేషించడం అనేది స్వాగతించదగిన ఉదాత్తయత్నమే. ఒక్కరు కాకుండా ఇద్దరు ముగ్గురు కలిసి చదువుతూ సాగించవలసిన సత్కాలక్షేపం.
మానసికఅంశాలు
బోద్ధారో మత్సరగ్రస్తాః. అసూయాగ్రస్తమైన మనస్సులకు, అపండితులకు కాల నియతి ఉండదు. పండితులకు పండితమ్మన్యులకు; కవులకు కవిబ్రువులకు నిత్యఘర్షణ ఎప్పుడు ఉండేదే. శ్రీనాథుని కాలం దీనికి మినహాయింపు కాదు. ఆంధ్రనైషధాజ్జ భవుని కీర్తి ధాళధళ్యం ముందు ఎందరో కవుల కనులు మూతబడివుండడం సామాన్యాంశం.
బోధ మల్పంబు గర్వమభ్యున్నతంబు,
శాంతి నిప్పచ్చరంబు మచ్చరము ఘనము
కూప మండూకములుఁ బోలెఁ గొంచె మెఱిఁగి,
పండితమ్మన్యులైన వైతండికులకు 1-13
నికటమున నుండి శ్రుతిపుట నిష్ఠురముగ,
నడరి కాకులు బిట్టు పె ద్దఱచినప్పు
డుదధిరాయంచ యూరక యుంటలెన్స,
సైఁపరాకున్న నెందేనిఁ జనుట యొప్పు. 1-14
అని శ్రీనాథుడు విసిగి వేసారిపోయాడు. గౌడడిండిమ భట్టు లాంటి మహావిద్వాంసునితో మొదలుకొని ఏస్థాయి, ఏ అర్హత లేని వాచాలుర దాక ఎదుర్కోవలసి వచ్చి వుంటుంది. తన జయకేతనాన్ని స్థిరంగా ఎగర వేసి ప్రౌఢ నిర్భర వయః పరిపాకంలోకి వచ్చాక కూడా మళ్ళీ మళ్ళీ అవే కాకులు ఊరకే అరుస్తుంటే రాజహంస మౌనంగా ఉండడమే మంచిది. లేక వివాదాలు నుండి తప్పుకోవడమే ఔచిత్యమన్న ధోరణికి రాక తప్పలేదు. మునపటిలా వాదించే ఓపిక కానీ, అవసరం కానీ ఆయనకు లేవు. శ్రీనాథుని లాంటి పండిత కవులు ఒకరిద్దరయితే కూపస్థ మండూకాల్లాంటి పండితమ్మన్యులు ప్రతి కాలంలోను అగణితమే.
తాము నివసించే ప్రాంతం, లేదా తాము విశ్వసించే దైవం అన్నింటి కన్నా గొప్పదని తలపోయడం సర్వ సామాన్యాంశం. దక్షారామం కథాకేంద్రం కనుక గొప్పదని శ్రీనాథుడు చెప్పారు. అన్ని తీర్థాల కన్నా కాశి గొప్పది. ఇది భారతీయులందరి సాధారణ విశ్వాసం. కాశి కన్న దక్షవాటి గొప్పది (2-8). కాశి కేవలం మోక్షదాయిని. కొన్ని నగరాలు భోగదాయినులు. మరికొన్ని మోక్షదాయినులు కాని దక్షారామం భోగమోక్షాలు రెండూ ప్రసాదిస్తుంది.(2-17). భీమేశ్వరుని కన్న పెద్ద వేల్పు, దక్ష వాటి కన్న గొప్ప ప్రాంతం, సప్తగోదావరి కన్న తీర్థరాజం మరొకటి లేదు. (2-18) ఏటేట జాతరలు చేయడం (3-44), జపహోమదాన యజ్ఞము లుపవాస వ్రతాలు మోక్షదాయకాలు (3-12, 3-148) శ్రాద్ధతిల తర్పణాదులు (3-154 ) విధాయకాలుగా తలపోయడం కనిపిస్తుంది.
ఏమి శకునమున చొచ్చితిమో కాశికి (2-95) అని అనడం వల్ల శకునాలను నమ్మడం కూడ ఆ సమాజంలో వుందని తెలుస్తుంది. భారతీయ సమాజంలో ఇది సామాన్యాంశమే. ఏ పని చేసినా శుభముహర్తం చూసుకోవడం కాలశుద్ధి తెలుసుకోవడం అలవాటు. వ్యాసుడు అగస్త్యుడు దక్షారామానికి తిరిగి పోతున్నపుడు నగర ప్రవేశానికి శుభముహూర్తం (3-39) (3-56) చూశారు. ఏ ముహూర్తం సరిగా కుదరని పక్షంలో అభిజిన్ముహూర్తం మధ్యాహ్నం 11.45 నుండి 12.30 వరకు నిస్సంకోచంగా చేయవచ్చు. అది విజయముహూర్తం అన్న విశ్వాసం నాటికీ నేటికీ ప్రబలంగానే ఉంది.
అబద్ధాలాడే వాళ్ళ కళ్ళల్లో, ముఖంలో ఒక విధమైన సూచన కనిపిస్తుంది. దాన్ని పసిగట్టిన వారికి వారు అబద్ధలాడుతున్నారని తెలిసిపోతుంది మరి. చల్లని సౌమ్యదృష్టి, ప్రసాదము, మాధురియు, వివేకం, వెల్లదనం, మౌగ్థ్యం, నిర్మలినత్వం అబద్ధమాడే వాళ్ళల్లో ఉండక సత్యంపలికేవారిలో ఉంటుందని శ్రీనాథుడు రాశాడు. (2-134)
కార్తికీవేళభీమశంకరని నగరఁ
దూఱునెవ్వాడు చిచ్చఱతోరణంబు
వాడు దూఱడు ప్రాణనిర్యాణవేళ
ఘోరయమపట్టణద్వారతోరణంబు 3-25
దక్షారామ భీమేశ్వరునికి కార్తీక పౌర్ణమి నాడు రాత్రి జ్వాలాతోరణం ఏర్పరుస్తారట. దాని గుండా దూరి పోతే భక్తుడు యమలోకంలోకి పోడు. అంటే పుణ్యం వస్తుందని విశ్వాసం. దీన్ని శ్రీనాథుడు కాశీఖండంలో కూడ ప్రస్తావించాడు. తారకాసురుడు రెల్లుగడ్డిలో కుమారస్వామి జన్మించాడని చెప్పి రెల్లుగడ్డి నంతా కాల్పించాడట. ఆ కథకు ప్రతీకగా వచ్చిన ఆచార మిది అని అంటారు.
ఆకలి గొన్న వ్యాసుని, అతని శిష్యులు మూడువందలమందినీ కాశీ అన్నపూర్ణ ఆహ్వానించి చతుశ్శాలా భోజన మందిరంబున వృద్ధానుపూర్వకముగా ఉచితాసనంబుల కూర్చుండ నియమించినదట. (2-127). ఉచితాసనాలనగా తగిన పీటలు. పీటల మీద కూర్చొని, ఆపోసన చేసి, శాంతి మాత్రం చదివాక భోజనం చేయడం ఆచారం. చాల మంది కలిసి భోజనం చేసే అప్పుడు వారి వయస్సుల క్రమంగా కూర్చునే తినడం ఆనాటి సాంఘిక ఆచారం తెలుస్తుంది.
అతిథి అభ్యాగతులకు భక్తి శ్రద్ధా తాత్పర్య విశ్వాస పూర్వకంగా భోజనం పెట్టినపుడే అది ఫలితాన్నిస్తుంది (2-132). – అని ఆ కాలంలోనే కాదు ఈ కాలంలో కూడా భావించడం గమనించవచ్చు.
తిట్లు , సామెతలు, ఎప్పుడూ వుంటాయి. కాని ఛందస్సు కనుగుణంగా కొంత మారవచ్చు. సభ్యత వల్ల రూపాంతరం చెందివుండవచ్చు.
ముండదైవం (3-6). కాశిని ఎడబాసిన వ్యాసుడు తన మనోవ్యథను అగస్త్యున కెరుక పరచు సందర్భంలో మనస్సును తేలిక పరచుకోవడానికి అన్నమాట. ఆకలికి తట్టుకోలేక వ్యాసుడు కాశిని శపించబూనాడు.
మా భూ త్త్రైపూరుషీ విద్యా, మా భూ త్త్రైపూరుషం ధనం,
మా భూ త్త్రైపూరుషీ భక్తిః, కాశ్యాం నివసతాం సదా 2-108
కాశీనగరంలో మూడుతరాలపాటు విద్య, ధనం, భక్తి ఉండొద్దుగాక అని- అంటే మానసిక, భౌతిక, ఆధ్యాత్మిక అభివృద్ధులకు ఇది గొడ్డలిపెట్టేకాక తరువాతి తరాలు కూడదీని ప్రభావానికి లోనవుతాయి. అలా కాశిని శపించ బూనుకున్న వ్యాసుని కాశీ విశ్వేశ్వరుడు తీవ్రంగా దూషిస్తాడు.
ఓరి దురాత్మ! నీవారముష్టింపచా
భాస! యోజనగంధి ప్రథమపుత్ర!
దేవరన్యాయదుర్భావనాపరతంత్ర!
బహుసంహితావృథా పాఠపఠన!
భారతగ్రంథ గుంభన పండితంమన్య!
నీవా మదీయపత్నికి నశేష
కైవల్య కళ్యాణ ఘంటాపథమునకుఁ
గాశికాపురికి ని ష్కారణంబ
శాపమిచ్చెదనని యనాచారసరణి
నడుగు వెట్టినవాడవహంకరించి
పొమ్ము నిర్భాగ్య ! మాయూరి పొలము విడిచి
యెచటికేన్ శిష్యులును నీవు నీక్షణంబ 2-153
ఓ దుష్టుడా! సామాన్య గృహస్థులు ఎలాంటి ఇబ్బంది పడకుండా కేవలం పిడికిట్లో పట్టేడన్ని బియ్యం దాన మివ్వడం సంప్రదాయమైంది. అది గొప్ప. కానీ గతిలేక ముష్టి అడుక్కుంటున్న వాడా అని ఇక్కడ తిట్టు. యోజనగంథి ప్రథమ పుత్ర అనడంలోని ఆంతర్యం సామాజిక సంప్రదాయం తెలియనివాని కర్థం కాదు. సత్యవతికి పెళ్ళి కాకముందే పుట్టిన వాడా అని తిట్టడం. మరి పుట్టిన వాడిది తప్పా పుట్టించిన వారిది తప్పా అని చర్చించడం అప్రస్తతం. పెళ్ళి కాకుండా తల్లి కావడం నిషిద్ధమైన సమాజంలోనే ఇది తిట్టు కాగలదు. లేని చోట కాదు. వ్యాసుడు వరుసకు మరదళ్ళైన, భర్తృహీనలైన అంబిక అంబాలికలకు సంతానాన్ని కంటాడు. ఇది అక్కడ విధి లేని పరిస్థితి కావచ్చు. కాని ఇక్కడ మాత్రం దూషణ. వ్యాసుడు ఏడురోజులు తిండికి ఓర్వలేక నగరాన్ని శపించబూనుకున్నాడు. అలాంటి వ్యాసుని వేద పురాణవిజ్ఞానం అంతా వృథానే కదా. భారతం లాంటి పంచమవేదాన్ని సృష్టించిన పండితుడయ్యు కాశికి శాపం ఇవ్వపూనుకొని పండితమ్మన్యుడయ్యాడు. పండితంమన్యుడు అంటే తననుతాను పండితుడనుకొనేవాడు. నిజానికి కాడని భావం. చదువు కొన్న మూర్ఖుడయ్యాడు. నిర్భాగ్యనీచ చరిత్ర లాంటి వన్ని తిట్లు. కాశినుండి వెళ్ళిపోకపోతే వ్యాసుని రాతిమీద రాకిస్తానన్నాడు శివుడు. రాతిమీద రాకించడం ఆ కాలంలో శిక్షించే ఒక పద్ధతి కావచ్చు. శ్రీనాథుడు వీరశైవుడు కూడ. వైదికుడైన వ్యాసుని తిట్టడానికి అందివచ్చిన సందర్భాన్ని చక్కగా వినియోగించుకున్నాడు.
రాచమర్యాదలు
కృతిస్వీకర్త బెండపూడన్నయ మంత్రి కీర్తి ఏడుసంధ్రాల అవతలి చీకటిని పోగొట్టిందనడం, ఆయన కీర్తి కర్ణాట లాట వంగ కుంతల అవంతి ఘర్జర రాజుల సభాస్థానాల్లోని బుధులు కీర్తిస్తారనడం లాంటి వాటిని అతిశయోక్తులని చిన్న చూపు చూడకుండా సాహిత్య సంప్రదాయమని మిన్నకుండడం సముచితం. అలాంటి మంత్రి గారి పేరోలగంలో ఉద్దండ పండితులు, వ్యాకర్తలు, వేదాంతులు, ఉపనిషత్ తత్వ్తజ్ఞులు, లాక్షణికులు, సంస్కృతాంధ్ర కవులు వీరితో పాటు వేశ్యలు, వీరభటులు ఉండే వారు. ఇది సమకాలీన మర్యాద. కవులను సన్మానించడం, కావ్యం రాయించి అంకితం తీసుకోవడం పాలకుల కర్తవ్యాలలో ఒకటిగా తలపోసేవారు.
బెండపూడన్న మంత్రి కీర్తికారకాలైన సప్తసంతానాలలో “ఒక్క ప్రబంధస్వీకరణం తప్ప అన్నీ నాకు లభించాయి” ఆ ఒక్క వెలితి తీర్చలసిందని శ్రీనాథుని అర్థించి భీమేశ్వరపురాణరచనకు పురికొల్పాడు. ఇది అబద్ధంగానో, కవిత్వమనో భావించాల్సిన పని లేదు. రాచరిక వ్యవస్థలో రాజులు మంత్రులు అందరూ చేసేదే. సప్తసంతానాలంటే ఇవి.
- కూపం – మంచినీళ్ళ బావులు తవ్వించి దాహం తీర్చాలి.
- తటాకం – చెరువులు నిర్మించి పంటలకు దోహదం చేయాలి.
- ఉద్యానవనాలు – తోటలు నిర్మించి ఆహ్లాదకరవాతావరణానికి ఏర్పరచాలి.
- దేవాలయాలు నిర్మించి ఆధ్యాత్మిక చింతనను పెంచాలి.
- పుత్రులను కని వంశాన్ని నిలబెట్టాలి.
- ధర్మబద్ధంగా జీవించాలి..
- కవులను ప్రోత్సహించి కావ్యాలు రచింపచేయాలి.
సప్త సంతానములలోన భిలము గాకుండు నది ధాత్రి కృతియె గాన అని అల్లసాని పెద్దన అన్నాడు.
గుడి కూలును, నుయి పూడును
వడి నీళ్ళను చెరువు తెగును, వనమును ఖిలమౌ
చెడనిది పద్యం బొకటియె
కుడి యెడమల కీర్తిగన్న గువ్వల చెన్నా.
అని గువ్వల చెన్నడు అన్నట్లే మిగిలిన ఆరింటి కన్నా కావ్యాన్ని అంకితం తీసుకోవడం శాశ్వత కీర్తికారకమని ప్రాచీనులు భావించారు. అలానే వ్యవహరించారు. రాజరాజనరేంద్రుడు ఈ రోజు చిరస్మరణీయుడయ్యాడంటే ఆయన పాలనవైభవం వల్ల కాక కేవలం నన్నయ చేత భారతం రాయించడం వల్లనే అన్నది నిర్వివాదాంశం. బెండపూడన్నయ మంత్రి కూడా అంతే. దక్షారామంలో భీమేశ్వరునకు మొగలివాకిటధామం, తూర్పు దిక్కున మరొక మంటపం నిర్మించాడు (1-74). బహుశా ఆ సందర్బంలో ఓ వారం పదిరోజులు ఇదే విషయంపై పురాణ కాలక్షేపం జరిపి వుంటారు. ఆ ప్రేరణతో కనీసం వచ్చే సంవత్సరం వార్షికోత్సవాల (బ్రహ్మోత్సవాల) నాటికి దక్షారామ భీమేశ్వరునీ, సప్తగోదావరి తీర్థాలను కీర్తిస్తూ కావ్యరచన చేయవలసిందని సబహుమానంబుగా కర్పూరతాంబూల జాంబూనద ఆభరణాలతో ఘనంగా సత్కరించి అర్థించి వుంటాడు. భీమేశ్వరపురాణంలో వున్నవి రెండే పాత్రలు. వక్త, శ్రోత. వక్తవ్యాంశం భీమేశ్వరసంకీర్తనం. ఇది కృతికర్త, కృతిభర్తలకు అభీష్టాంశం. కాశికన్నా గొప్పది దక్షవాటి అని అనుకోవడంలో, స్వస్థాన వేషభాషాభివ్యక్తీకరణంలో ఒక నిర్వచనీయమైన ఆనందం దాగుండడం సహజం. వింధ్యగర్వాన్ని అణచడంకోసం ఉత్తరాదినుండి వచ్చి దక్షిణాదిలో స్థిరపడ్డ అగస్త్యమహర్షి నివాసమే దక్షారామంగా చిత్రించాడు. కాశీపట్టణ మెంత గొప్పదైనా, ప్రీతి పాత్రమైనదైనా అగస్త్యుడు ఉత్తరాదికి పోలేని దుస్థితి.
దురదృష్టం వల్ల వ్యాసమహర్షి కాశీనుండి బహిష్కృతుడై కొత్తగా తనకు అంతగా తెలియని దక్షారామానికి రావలసి వచ్చినవాడు.
వ్యాసాగస్త్యు లిరువురికీ కాశీకి విశ్వనాథుని సేవించలేమన్న ఆవేదన సమానధర్మం. అందువల్లనే దక్షారామప్రాశస్త్యాన్ని తెలిపే వక్తగా అగస్త్యుని , విని ఊరడిల్లే శ్రోతగా వ్యాసుని పాత్రలుగా శ్రీనాథుడు మలచడంలోని హేతువు ఈ సమానధర్మమే. నిజానికి ఇక్కడ వ్యాస అగస్త్యులు నిమిత్తమాత్రులే. శ్రీనాథుడే అసలు వక్త. అసలు శ్రోత బెండపూడన్నయమంత్రి. అంతే.
ప్రజానీకం
పద్మనాయకులు, వెలమలు, కమ్మలు, సరిసర్లు, పంటర్లు(1-32) ను మొదటిసారిగా కావ్యంలో నమోదు చేసిన ఘనత శ్రీనాథునిదేనేమో! పరిశీలించాలి. బ్రాహ్మణులు, క్షత్రియులు, చతుర్థకులాలు, పంచజనులు, వైశ్యులు, వేశ్యలు,(3-63) ఇంకా ఏకవింశతి కులాలవారు(3-153) ఆకాలంలో వున్నట్లు తెలుస్తుంది. వర్ణసాంకర్యం లేకుండా చాతుర్వర్ణ్యస్థితి వుందని చెప్పడం గొప్పగా తలపోసేవారు. (1-110) ఆనాటి వారికి బ్రాహ్మణ భక్తి మిక్కుటం. సాధారణంగా వేదపఠనం చేసే విప్రులు పేదలే. బెండపూడి అన్నయ మంత్రి లాంటి ఉన్నతాధికారుల ప్రాపు లభించిన వైదికులు ఉన్నత స్థాయి కెదుగుతారు. తక్కినవారు సాధారణులు గానే మిగిలి పోతారు.
ధరియింప నేర్చిరి దర్భ పెట్టెడు వ్రేళ్ళ
లీల మాణిక్యాంగుళీయకములు
కల్సింపనేర్చిరి గంగమట్టియ మీఁదఁ
గస్తూరికా పుండ్రకములు నొసలు.
సవరింప నేర్చిరి జన్నిదంబుల మ్రోలఁ
దారహారములు ముత్యాల సరులు
చేర్పంగ నేర్చిరి శిఖల నెన్నడుముల
గమ్మని క్రొత్త చెంగల్వ విరులు
ధామముల వెండియును బైఁడి దడఁబడంగ
బ్రాహ్మణోత్తము లగ్రహారములలోన
వేమ భూపాలుడనుజన్ము వీరభద్రు
ధాత్రి యేలింప గౌతమీతటమునందు. 1-41
కాశీఖండంలో సైతం శ్రీనాథుడు ఈ పద్యాన్ని ప్రీతితో వాడుకొన్నాడు. విప్రుడు గాన నేరము వెదక దగదు అనుకోవడం(2-118). కనిపిస్తుంది. ప్రతి నెల ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం సాధారణాచారం. వైకుంఠ ఏకాదశి నాడు మరీ ముఖ్యం. ద్వాదశి నాడు పారణచేసి భోజనం చేయడం విధాయకం. అందువల్ల ద్వాదశి నాడు బ్రాహ్మణులకు సంతర్పణలు చేయడం పుణ్యకార్యంగా తలపోసేవారు, అది ఆ కాలంలో ఆచారంగా మారింది కూడా. ), అశ్వగోమహిషరూప్య సువర్ణ వస్త్రంబులు దానం చేయుట (4-32) పుణ్యమనుకొన్నారు.
భోజన రసికత
ఆనాటి వారి భోజన రసికతను శ్రీనాథుడు తనవితీరా వర్ణించాడు. ఆనాటివారు తిన్నది అరిగించుకోగలగిన వారు. అది తింటే షుగర్ వస్తుంది ఇది తింటే ఇంకేదో వస్తుంది అని నాలుక చంపుకొని జీవించిన వారు కాదు. పంచభక్ష్యపరమాన్నాలను నిండార తిని పరవశించారు. త్రేంచారు. భక్ష్యం, భోజ్యం, లేహ్యం, చోష్యం, పేయం- ఇవి పంచభక్ష్యాలు. దోసెలు, వడలు, సేమ్యాపాయసం, కమ్మగా కాచిన నెయ్యి, శాకం, పాకం, పెసరుపప్పు, తేనె, పానకం, ఉప్పు, తెల్లని పెరుగు, పచ్చకప్పురం, సొజ్జెపిండి, పిండివంటలు, బెల్లం, ద్రాక్షాపానం ఖండశర్కర, అరటి పండ్లు. ఆవుపాలు, వరి అన్నం మొదలగు వాటిని నిశ్శంకతో అంటే ఎలాంటి సంశయం లేకుండా కుక్షుల్ నిండగ ఆరగించారు. అన్నీ అయ్యాక మందార తరుపుష్ప మధుపానగోష్టి (2-28) కొందరికైనా ఉండకపోతే ఎలా?
పప్పును, బిండి వంటలును, బాయసముల్, ఘృతముల్, గుడంబులుం
గుప్పలు గాఁగఁ జుట్టునను గుర్పఁగఁ గూడిన యేరుఁబ్రాల తె
ల్గప్పురభోగి వంటకము గమ్మని తాలిపు సొజ్జ పిండితో
నొప్పులుగా భుజించిరి బుధోత్తము లాఁకటి చిచ్చు పెచ్చునన్. 2-140
ద్రాక్షపానక ఖండశర్కరలతో, రంభాఫలశ్రేణితో
గోక్షీరంబుల తోడ, మండెఁగలతో, గ్రొన్నేతితోఁ , బప్పుతో
నక్షయ్యంబగు నేరుఁబ్రాల కలమాహారంబు నిశ్శంకతం
గుక్షుల్ నిండఁగ నారగించితిమి యక్షుద్రక్షుధాశాంతికిన్. 2-142
మోదకాపూప పాయస ఘృత మధుక్షీర శర్కకాపూపాలతో భోజనం( 4-91) ఇలా భీమేశ్వరపురాణంలో రెండుమూడు చోట్ల ఆహార ప్రస్తావనలు వస్తాయి. ఆకాలంలో అవన్నీ అందరూ తినేవేనని గుర్తించవచ్చు.
దేవదాసి సంప్రదాయం
దక్షారామంలో దేవదాసి సంప్రదాయ ముంది. దేవదాసీలు భగవంతుని కంకితమైన పవిత్రమూర్తులు. భగవంతుని ఎదుట నాట్యం చేసే తరించేవారు. భగవంతునికి చేసే షోడషోపచారపూజల్లో నాట్యం కూడ ఒకటి. విశ్వనాథసత్యనారాయణ వేయిపడగలులో ముఖ్యంగా గిరిక ఘట్టం చదివితే దేవదాసీ సంపంప్రదాయ ఔన్నత్యం తెలిసి వస్తుంది. వారిని పోషించడం పురప్రముఖుల విధి. కాలక్రమంలో వేశ్యల స్థాయికి దిగజారడం వేరే అంశం.
దక్షపురిసాని కూతుల దవిలి నాడు
విశ్వలోక కుటుంబి భీమేశ్వరుడు – 1-110
అనీ పదునాల్గు మహాయుగాల ముదుసలి భీమేశ్వరునికి సానితో పెండ్లి (1-112) అని కూడ చమత్కరించాడు. వికటశృంగారము నొప్పు భీమేశ్వరుడని కూడ(1-80) అన్నారు. ఇలా అనడంలో ఆంతర్యం అక్కడి సంప్రదాయ విశేషమే తప్ప అన్యంకాదు. దక్షారామంలో వెలసిన మాణిక్యాంబ ఒక దేవదాసి అని ఐతిహ్యం.
వస్తసంస్కృతి
ముత్యాల గొడుగు (2-43), రత్న దర్పణం (2-49) పసిడి కమ్ముల పట్టు పచ్చడం, తారహారాలు, కల్హారదామాలు, కట్టాణి ముత్యాల కంఠమాల మాణిక్యఖచిత కేయూరము. వజ్రపుటుంగరం, పగడాల ఒడ్డాణం. (1-115 &116) హేమ మణిభూషణాలు. ముత్యాలపేరు (2-52) . గోమేదికం = మణులు, బంగారం, రత్నాలు ( 3-61) రత్నకంకణాలు. ముత్యాల రంగవల్లలు (3-63) కంకణాలు, అందియలు, మట్టియలు (2-110) ఇవన్నీ భీమేశ్వరుడు ధరించినవి మాత్రమే కాదు సమకాలీన సంపన్న గృహస్థులందరూ దాల్చినవేనని భావించడంలో విప్రతిపత్తి లేదు.
కురంగనాభిసౌరభాలు, సంకుమద పరిమళాలు, కర్పూర వాసము, కాలాగురు కర్దమాలు సర్వులకూ ప్రీతి పాత్రాలే (1- 117) గొజ్జంగి నీటి నెత్తావి, దాన్ని మించిన గంధపుపొడి పొలుపు, దాన్ని మించిన ధమ్మిల్ల మల్లికాహల్ల వకుళవాసంతికా జాతి కేతకీకుంద కుసుమ గంధబులు (1- 117) వ్యాపించేవి. ఒకదాని మించి ఒకటి అని శ్రీనాథుడు వర్ణించడం వల్ల ఏ స్థాయి వారు ఆ స్థాయిలో వాటిని వినియోగించేవారని తలపోయవచ్చు. చెంగల్వ దండలు (2-51), (2-67) ధరించేవారు
చతుశ్శాలా, భవంతులు, జోడరుగులు, అంతర్గేహాలు, బహిర్గేహాలు, సౌధమధ్యంలో వేదికాస్థలం.(2-146). గోపురాలు, మేడలమీద పసిడి కలశాలు మొదలైనవి గృహ వైవిధ్యాలు.
చామరము, తోమరము, ఛత్రము, ధనుస్సు, ఖడ్గాదులు ఆనాటి ఆయుధాలు. (1-31).
శంఖ భేరీ మృదంగ నిస్సాణ పటహ
ఝల్లరీ వేణు వీణాది వాయిద్యాలు
శంఖం, భేరి, మద్దెల, విస్సాణ=చర్మ వాద్యం, పటహ= తప్పెట ఝల్లరి=డక్కి, పెద్దడోలు వేణు-పిల్లనగ్రోవి, వీణ =వీణ భీమేశ్వరుని మ్రోల మోగిస్తారు. దాని వల్ల పాపాలు తొలుగుతాయి. తొలుగుతాయో లేదో కాని ఆనాడు ఈ వాయిద్యాలున్నాయన్న సంగతి స్పష్టం.
ఉపసంహారం
ఇంకా నిశితంగా ఓపిగ్గా పరిశీలిస్తూపోతే మరెన్నో విశేషాలు దొరకగలవు. భీమేశ్వరపురాణం ఒక్కదానికే పరిమితం కాకుండా శ్రీనాథునికృతులన్నింటినీ పరిశీలించాలి. ఆపైన సమకాలిక కవులకృతులను పరిగణనలోకి తీసుకొని సేకరిస్తే ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తాయి. అలా సేకరించినవాటిని తక్కినకాలాల కవుల రచనలతో తులనాత్మకంగా విశ్లేషిస్తే వాటి పరిణామాలు తెలియవస్తాయి. అలాంటి ఉత్తమ ప్రయత్నానికి ఈ సదస్సు దోహదం చేయగలదని విశ్వసిస్తు నిర్వాహకుల ఉత్తమాభిరుచిని, ఉదాత్తసంకల్పాన్నీ మనఃపూర్వకంగా అభినందిస్తు ముగిస్తున్నాను.
తెలుగుజాతిని ఓ కుదుపు కుదిపి పేరుకున్న తరతరాల జడత్వాన్నుంచి వెన్నుతట్టి మేల్కొల్పిన అసాధారణ వ్యక్తి చలం.
20 శతాబ్దిలో తెలుగువారిలో ఒక వివాదాస్పదమైన వ్యక్తిగా ఉన్నత శిఖరాన్ని అధిరోహించిన చలం ఎవరితోనూ పోల్చడానికి వీల్లేని వ్యక్తి అంటే అతిశయోక్తి కాదు.రమణాశ్రమం వెళ్లకముందు చలం ఆలోచనలు,జీవితం ఒక విధంగా ఉన్నాయి.రమణాశ్రమం వెళ్ళాక ఆయన అభిప్రాయాల్లో ఎంతో మార్పు కనిస్తుంది.
వ్యక్తిగతాభిప్రాయాలు,జీవన విధానం,తత్కాలీన సాంఘిక సమస్యలు,ఉద్యమాలు, రచనా వివరాలు, అనుభవాలు,సాహిత్య విమర్శలు,ఆధ్యాత్మిక సాధనలు మొదలైనవెన్నో విషయాలు చలం ఉత్తరాల్లో దర్శనమిస్తాయి.చలం సాంఘిక,వైవాహిక వ్యవస్థలో చిచ్చు రగిల్చి సంప్రదాయగుండెల్లో జ్వాలలురేపిన కాలమది.ఆస్తిక నాస్తికుల విచికిత్సతతో దేవునికోసం దేవుళ్లాడిన కాలం కూడా అదే. చలం ఆలోచనలకు,ఆశయాలకు రూపకల్పనే చలం మిత్రులకు రాసిన ఉత్తరాలు.
” ఉత్తరాలు వ్రాయడం,వ్రాయించుకోవడం ఒక గొప్ప సృజనాత్మక కళ. ఈ కళ తెలుగు రచయితల్లో చలం గారికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు అని సాహసం చేయలేము గానీ,ఈ కళ కళాత్మకంగా తెలిసిన వారిలో చలం గారు ప్రముఖులు అని మాత్రం అనొచ్చు.” అని సంజీవదేవ్ పేర్కొన్నాడు.

చలం జీవిత పరిణామక్రమం లేఖల్లో స్పష్టంగా గోచరిస్తుంది.దీక్షితులకు రాసిన లేఖలో చలం ఇలా చెప్పుకుంటాడు.” నేను చాలా Sensitive. ముఖ్యంగా స్నేహితుల విషయమై కొన్ని సమయాల్లో వాళ్ళని సరిగా అర్థం చేసుకోను.మిమ్మల్ని ఎప్పుడూ ఘనంగా ఎంచుకున్నాను— నా ఉపయోగం కోసం కాదు.నేను చూసిన వాళ్లలో Generally as one of the Thoroughly nice gurllness persons ( Few they are) కానీ యీ మధ్య మీకు తెలీకుండా నేనేమో,మీరు మీ ఉత్తరాల్లో నన్ను దెప్పుతున్నట్లు కనపడ్డది.నేనేమన్నా చేశానా?” చలంది సున్నితహృదయం.తన మనస్తత్వం తెలిసిన వారితోనే పరిచయాలు పెంచుకుని మనసులోని విషయాలు పంచుకున్నాడు అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది.
చలం దీక్షితులు గారికి వ్రాసిన ఉత్తరాలు చాలా విలువగలవి. “ఈ ఉత్తరాలు చదివితే వేంకట చలం గారి హృదయానికి సమీపముగా పోవచ్చు.దానిలోతు, వైశాల్యము తెలుసుకోవచ్చు.వారి సారస్వత కృషిని,పురిగొల్పిన భావోద్వేగం ఇందు గమనింపవచ్చు.
అరమరిక లేకుండా నిర్భయంగా మనుష్యుల్ని గురించీ సంస్థల్ని గురించీ చర్చించుకునేందుకు ఉత్తరాల్లోనే సావకాశముంది అట్టి చర్చలూ– అభిప్రాయాలూ– ఈ ఉత్తరాల్లో ఉన్నవి.కొన్ని ఘాటుగా కూడా ఉన్నవి.” అన్నాడు దీక్షితులు.
” జీవితమంటే ప్రేమ నాకు,దేవుళ్ళో కానీ,బతుకు తరువాత బతుకులో గానీ,దేశంలో గానీ నాకు విశ్వాసం లేదు.” అని తన అభిప్రాయాన్ని ఖచ్చితంగా చెప్పాడు చలం.

అరుణాచలం వెళ్ళాక వీరేశలింగంకు రాసిన లేఖలో కూడా ఇలా తెల్పాడు.” ఇదివరకైనా నేనేదో అందరితో కలిసే వాణ్ణనుకున్నారా? ఏ నలుగురు మిత్రులో తప్ప( వాళ్ళు నా అభిప్రాయాలు ఒప్పుకునేవాళ్లే) ఎవరితోనూ నాకెప్పుడూ సంబంధం లేదు.బతికిపోయినాను.అట్లాంటి వాళ్ళు నా కిప్పుడూ వున్నారు.” ఆయనకు పరిమిత సంఖ్యలోనే మిత్రులుండేవారని,ఈయన అభిప్రాయాలనర్థం జేసికొనే వారితోనే సాన్నిహిత్యం పెంచుకునేవారని తెలుస్తుంది.
చలం దీక్షితులకు రాసిన ఉత్తరాల్లో మనసువిప్పి తన కుటుంబ విషయాలు,వైయక్తిక విషయాలను వెల్లడించాడు. ప్రజలు తన జోలికెప్పుడు రారని అంటూ ” లోకాన్ని తన్నేవాణ్ణి చూచి లోకం అవసరమైన దూరానికి తానే జరుగుతుంది”. అంటూ తను స్థాపించిన బడిలో పిల్లల్ని పంపించనందుకు ప్రజల మీద కోపంగా ఉందని తెలిపాడు. తనను హెడ్మాస్టరుగా బెజవాడలో వేశారని,మీతో ఎంతో చెప్పాలని ఉందని తన మనసులోని మాట దాపరికం లేకుండా దీక్షితులకు తెలియచేసే ఉద్దేశ్యం గల చలం ఆనాడు ప్రభుత్వ ఉద్యోగం చేసే చలం ఇలా రాశాడు.” మీ స్నేహితుడు మన ఆఫీసులో నా మీద చాలా విషం పోశాడు. నేను నడవడిలో, డ్రెస్ లో,మాటల్లో ,నడకలో చాలా కేర్ లెస్ గా వుంటానని వెళ్లి స్వయంగా పనిపట్టి చెప్పాడు.అతను నేనడిగినప్పుడు, ఈశ్వరుని ఎదుట తానేమీ యెరుగనన్నాడు.
పొద్దస్తమానం మానవ జంతుసేవ మాట్లాడతాడు మళ్లీ” అని మాలతీబాయికి తప్ప తన మంచితనం ఎవరికీ తెలియదని రాశాడు. ఇలా ఆనాటి సమాజ పరిస్థితి, చలంపై ప్రజల్లో ఉన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. చాటుగా చలం గురించి
నీచమైన అభిప్రాయాలు కలవారని,చలం ఎదుట కనిపిస్తే భయపడి అబద్ధాలాడేవారని,చలం గురించి ప్రజలు రకరకాల వ్యాఖ్యానాలు చేసికొనేవారని దాన్ని బట్టి అప్పట్లో సంఘంలో చలంకు గల విలువ తెలుస్తుంది.ఆనాటి విద్యా విధానానికి తిరగబడి,విద్యావిధానం నచ్చక తన పిల్లలు చదువు మానేసినట్లు చలం దీక్షితులకు రాసిన ఉత్తరంలో తెలిపాడు.తన జీవిత యత్నాన్ని,తన స్ట్రగుల్ ను అర్థం చేసుకో గలిగిన వాళ్ళు లేరని,కొత్తవాళ్ళు స్నేహం చేయడం లేదని,తన జీవన పోరాటంలో,జీవన యత్నంలో చివరికి తనొక్కడే మిగిలి పోతాడని తెలిపాడు.చలంలో తిరుగుబాటు ధోరణి కన్పిస్తుంది.సంఘాన్ని ఎదిరించైనా సరే పోరాటంలో ఒక్కడే మిగిలిపోయి తుదివరకు జీవిత లక్ష్యాన్ని సాధించేవరకు పోరాడుతూనే వుంటానని స్పష్టంగా తెలియచేశాడు. పట్టుదల కలిగిన వాడుగా,ఎవరికి భయపడని వాడుగా తన నిర్ణయం పట్ల శ్రద్ధ కలవాడుగా,ఈశ్వరుని పట్ల విశ్వాసం కలవాడుగా కనిపిస్తాడు.

చలం భవిష్యద్దర్శనం కలవాడుగా కనిపిస్తాడు.తను రచించిన సెక్స్ పుస్తకం పేరు ‘ స్త్రీ’ ని ఒక్క నిమిషం నాకు విశ్రాంతినివ్వక — అగాధ వియోగభారం కిందనో చీల్చి,నలిపి ఊపిరాడక నా జీవితాన్ని పాలించే స్త్రీ లోకానికి నివేదతము చేస్తున్నానని రాస్తూ ” ఇది స్త్రీ లోకానికి నా Farewell ఏమో ,చివరికి నేనూ మారబోతున్నానేమో! ఎవరికి తెలుసు? ” అని దీక్షితులకు రాశాడు.గొప్పవాళ్ళు,
మహాత్ముల మాటలు అనాలోచితంగా,ఆయాచితంగా వెలువడుతాయి. భవిష్యత్తులో ఆ మాటలకర్థం ఎంతో ఉంటుంది.నేను మారబోతున్నానేమో అని చెప్పిన చలం దార్శనికుడు,మహాత్ముడు,ఋషితుల్యుడు,మనీషి, భవిష్యత్తును దర్శించిన కాలజ్ఞానవేత్త అని ఘంటాపథంగా చెప్పవచ్చును.ఆయన మారిన విషయం ఆయన చెప్పినట్లుగానే అరుణాచలం జీవితంలో స్పష్టమవుతుంది.చలం ఆలోచనా వైఖరి,జీవన విధానం దీక్షితులకు రాసిన ఉత్తరాల్లో వ్యక్తమౌతుంది.
తన కాలం మధురంగా గడిపేందుకు ‘ ఒక యూరేషియన్ అమ్మాయి’ ఉన్నట్లు తెలుపుతూ ” జరగడానికి వీలు దివ్య సన్నివేశాలు నా జీవితంలో జరుగుతాయని ఇంకా కలలు కంటున్నాను.” అని చెప్పిన ఆశాజీవి.తన సూక్ష్మ శరీరంలో ఆధ్యాత్మిక జ్ఞానత్వం పొందుతుందేమోనన్న అనుమానం వ్యక్తం చేశాడు దీక్షితులకు రాసిన లేఖలో.చలం ఆలోచనల్లో మధ్యమధ్య మార్పును గమనించవచ్చు.దేవునిపట్ల విశ్వాసం లేదని గట్టిగా చెప్పాడు ఒకసారి.వెంటనే మరోసారి ఈశ్వరునిపట్ల విశ్వాసముంది అంటాడు.ఆస్తినాస్తిక విచికిత్స,ద్వైధీ భావన చలంలో కనిపిస్తుంది.చలంకు స్నేహితురాండ్రు వున్నట్లుగా లేఖల ద్వారా తెలుస్తుంది.

” యూరేషియన్ స్నేహితురాలు” ఒక మోటారు కారు తీసుకొని రమ్మంటుందని తెలిపాడు ఒక లేఖలో. లీల పరిచయం మొదలైనవి లేఖల్లో రాశాడు. దీక్షితులకు రాసిన ఇంకో లేఖలో కిటికీ కింద ఓ అమ్మాయి వెడుతుందని, ఆ అమ్మాయిని తనూ, తనను ఆ అమ్మాయి పరస్పరం ఇష్టపడుతున్నారని,కానీ వారి మధ్య పది గజాల దూరముండేదని తెలిపాడు.
ఆ మాత్రం దూరం కూడా సహించలేని మనస్తత్వం చలందని స్పష్టంగా వ్యక్తమవుతుంది.
తన ఉద్దేశ్యాన్ని ఒక లేఖలో ఇలా తెల్పాడు.” యవ్వనంలో ఉన్న భార్యలకు పిల్లలు లేకపోతే సంతానమివ్వడం,బాల వితంతువులకు కూడా” అనడం వల్ల స్త్రీలపై చలంకున్న వ్యామోహం తెలుస్తుంది.ఇదే సందర్భంలో ఇంకో మాట అంటాడు.అన్ని ఆశయాలను వదులుకొని ” గొప్ప యోగినౌతాను.నా అద్భుతమదిమల కీర్తి దిగంతంగా వ్యాప్తిస్తుంది.స్త్రీ పురుషులు నా పాదాలముందు నమస్కరిస్తారు”.అని గొప్ప యోగి అవుతున్నట్లుగా తను కొన్ని మహిమలు చూపించేవాడుగా తెలియజేశాడు.వ్యతిరేక భావ ధోరణి స్పష్టంగా గోచరిస్తున్నది. ఎన్నో చేయాలనుకుంటున్నట్లు కలలు కన్నాడు.
చలం తన జీవితంపై ఖచ్చితమైన అభిప్రాయాన్ని దీక్షితులకు రాసిన లేఖలో ఇలా తెల్పాడు.” నాకు జీవితమంటే ప్రేమ,కన్నీళ్లలో,నవ్వులతో,నీచత్వంతో,త్యాగాలతో, స్వార్థంతో,ఔదార్యంతో,విషాదంతో,ఆనందంతో ఈ జీవితమే మంచిది.మళ్లీ మళ్లీ అనంతంగా పుడుతో పెళ్లి చేసుకుని సంపాయించి,పిల్లల్ని కని, పాపాలు చేసి,ప్రేమించి,ద్వేషించి,నవ్వి,మూలిగి కాని ఏ మోక్షం అక్కర్లేదంటాను నిశ్చయంగా” అని సూటిగా చెప్పాడు.లోకంలో తనను గృహచ్చేదకుడంటారని తెల్పడం వల్ల సమాజంలో చలంపై ఎటువంటి నీచాభిప్రాయముండేదో తెలుస్తుంది.అందుకనే ఆ కాలంలో చలంకు ఇల్లు అద్దెకు ఇవ్వడానికి భయపడేవారు.

రామజోగారావుకు రాసిన ఉత్తరంలో ” మూడు నెలల నుంచి స్త్రీ స్నేహమయింది కానీ సంపర్కం కాదు.ముందు కూడా తటస్థించదు” అని వాస్తవాన్ని చెప్పాడు.దీక్షితులకు రాసిన ఉత్తరంలో చలం గారికి ఒక తమాషా అనుభవం జరిగిందని రాశాడు. కనిగిరిలో తనకపరిచితురాలైన ఒక హైస్కూల్ అమ్మాయి అర్ధరాత్రి చలం ఇంటికి వచ్చి చలాన్ని లేపి తనను మోహించమని,ప్రేమించమని అర్థించిందట.తాగుతున్నట్లు ( మద్యం)గా కూడా లేఖల్లో తెలియపరిచాడు.చలం ఆలోచనలు స్త్రీ చుట్టే తిరుగుతుండేవి అనడానికి చలం రాసిన ఉత్తరాలే ప్రత్యక్ష సాక్షులుగా నిలిచిపోతాయి.
” స్త్రీ తప్ప నన్ను గట్టిగా కదిలించగలది ఏదీ లేదు” అని కుండబద్ధలు కొట్టినట్లు పచ్చినిజాన్ని నిర్మొహమాటంగా వ్రాస్తూనే దీక్షితులకు రాసిన ఉత్తరంలో ” స్త్రీ కొరకు జీవితాన్ని ధ్వంసం చేసుకున్నవాళ్ళని,అంటే కీర్తి,డబ్బూ కాదు- అంతకన్నా శ్రేష్ఠమయినవి- జీవితం మీద ఆసక్తిని-శక్తిని- బతకడంలో ఆనందాన్ని పోగొట్టుకున్న వాళ్ళని చూస్తే- నేను చాలా వివేకవంతుణ్ణిగా తోస్తాను.” అని లోకంలో తనకంటే కూడా బలహీన మనస్తత్వాలు కలవారున్నారని వారికంటే కూడా తను తెలివిగలవాడుగా చెప్పుకొన్నాడు. ఇక్కడ మనం ఒక విషయం గమనించవచ్చు.స్త్రీ మూర్తి పట్ల ప్రేమను చూపించాడు కానీ దిగజారుడుతనం లేదని తెలుస్తోంది.స్త్రీలే తనను ఆప్యాయతతో చూశారని అనుకోవచ్చు.
తన ఉద్దేశ్యాన్ని ఇంకా ఇలా తెల్పాడు.” నా పిల్లల్ని చదివించాలని, వాళ్ళకి పెళ్లిళ్లు చెయ్యాలని ఏమీ వ్యామోహం లేదు.మా అబ్బాయి రౌడీ అయినా,అమ్మాయిలు వేశ్యలైనా నాకు సంతోషం,నమ్మకం- నేను స్వతంత్రుణ్ణి.నా ఆత్మ నాది.” అని అంటూ స్వేచ్ఛా ప్రియత్వాన్ని చాటాడు. సమాజాన్ని,సంసారాన్ని పట్టించుకోని స్వేచ్ఛాజీవిగా కనిపిస్తాడు చలం.మూఢాచారాన్ని నిరసిస్తూ, దీక్షితులకు రాసిన ఇంకో లేఖలో “ఏమి నమ్మినా నాకు వచ్చే నష్టాలేవీ లేవు.ఆ విధంగానే నాకే విశ్వాసం కుదిరితే అదే నిజమని తోస్తే రేపు సంపూర్ణమైన నిరీశ్వరవాదిని గానీ లేక మూఢాచారవంతుణ్ణి సనాతనుణ్ణి కానీ- కావడానికి నాకేమీ అభ్యంతరం లేదు.
ఏ పల్టీ కొట్టడానికో నేను సిగ్గుపడను.నాకు వాస్తవమని నిశ్చయంగా తోచాలి.మీరు- నా జీవితంలో కొన్ని పల్టీలకు కారణం మీరు” అంటూ తను నమ్మిన సిద్ధాంతంలో చర్చించే వాడుగా( శృంగారి కానీ,ఆధ్యాత్మిక మార్గంలో కానీ) తన మనసుకు నచ్చినపుడే,సత్యమని నిశ్చయంగా తెలిసినప్పుడు ఏ మార్గంలోనైనా వాస్తవానికి దగ్గరగా నడుస్తూ తృప్తిగా చరించే మనస్తత్వం చలందని తెలుస్తుంది.చలం పరిపూర్ణ విశ్వాసానికి పట్టం కట్టాడు.

అంత స్వేచ్ఛను కోరి,సంఘాన్ని ఎదిరించి ఇష్టానుసారం చరించి శృంగారంలో మునిగితేలిన చలం స్త్రీ స్వేచ్ఛను కాంక్షించిన చలం ” పశ్చిమ భౌతిక శాస్త్రమూ, ఠాగూరు గారి బ్రహ్మసమాజపు వేదాంతప్రభావం వల్ల చలంలో మత విజ్ఞానం ఏర్పడి ఆధ్యాత్మికతవైపు దారి తీశాయి.” స్త్రీ కాముకుడు,కథకుడు చలం చచ్చిపోబోతున్నాడు.ఈశ్వర సందేహంలో శృంగార తత్వంలో మునిగి బీరుతాగే, మాంసం తినే,ఆడవాళ్ళని ముద్దు పెట్టుకునే జి.వి.జీవిలో ఆత్మవుందని గుర్తించకలిగింది– మీరు,అవును మీరు” అని దీక్షితులకు రాసిన ఉత్తరంలో వివరించాడు.చలంలో పరివర్తన వచ్చిన విషయం లేఖల్లో స్పష్టమవుతుంది.నిరీశ్వరవాది ఈశ్వర వాదిగా మారాడు.భగవాన్ పై విశ్వాసం కుదిరింది.వాస్తవాన్ని నమ్మేవరకు విశ్వసించని చలం ఆత్మానుభవం వాస్తవమని తాను నమ్మిన వాస్తవ ప్రపంచం నుండి మానసిక మార్పుకులోనై వాస్తవమనే నమ్మిన ఆధ్యాత్మిక మార్గం వైపు పయనించాడు. తనను చీదరించుకున్న ఆంధ్ర దేశాన్ని,ప్రజలను వదలి సత్యాన్వేషణలో అరుణాచలానికి దారితీశాడు. శృంగారంలో ఆనందాన్ని అనుభవించి వైరాగ్యంతో ఆధ్యాత్మిక చింతనతో ఆనందాన్ని అనుభవించడానికి పయనమయ్యాడు.
” సంఘసంస్కార విషయంలో,స్త్రీల బాధల విషయంలో బాధననుభవించి ” నా ఆత్మ ఏ కొంచెం,సాక్షాత్కారమైనా నాకు ఆడపిల్లల అవసరం లేదు అంటాను” అంటూ దీక్షితులకు రాసిన ఉత్తరంలో పేర్కొన్నాడు. స్త్రీ సౌందర్యం కోసం కలలు కనే చలం ఈశ్వర సౌందర్యం కోసం పరితపించడం మొదలు పెట్టాడు.
చలం లేఖల్లో సాహిత్య విషయాలు చోటుచేసుకున్నాయి.
చిత్తశాంతి లేదు.ఎప్పుడూ మానసిక ఒంటరితనం,బాధతోనే ఎక్కువ కాలం గడిపాడు చలం.తను రచన చేయడానికి కారణాన్ని వివరిస్తూ చలం జోగారావుకు రాసిన లేఖలో ” బాధ అనేది ప్రపంచంలో ఉన్నన్నాళ్లు పుట్టడమనేది విషాదం నాలుగు మణుగుల ఆనందం వున్నాసరే రెండు తులాల బాధ దాన్నంతా చెరుపుతుంది.” అని రచనా హేతువును వివరించాడు.చలం బాధాతప్తజీవి.బాధలోంచే కవిత్వముద్భవించిదని తేల్చి చెప్పాడు నిజమే ప్రథమ కావ్యం రామాయణం శోకంతోనే శ్లోకం ఉద్భవించిన వాల్మీకి మహర్షి నోటిద్వారానే వెలువడింది.
పత్రికలలో తననెవరేం తిట్టినా పట్టించుకోలేదని ” నా వైపు కొందరున్నారనే ఇట్లాంటివి సహించరనే తెలిసి వొస్తే కొంత భయపడతారు విమర్శకులు” అని జోగారావుకు రాసిన లేఖలో తెలిపాడు.సినిమా స్టార్ల ఆరాధకులైన పత్రికలవాళ్ళు ( స్వతంత్ర) చలాన్ని వ్రాయమని,అచ్చువేసుకుంటామని బతిమాలి,బలవంతం చేసి వ్రాయించుకుని అచ్చువేయకుండా తనపై ఆవిధంగా కసిని తీర్చుకున్నారని,మోసం చేశారని, ‘ లోకం తీరే అంత- మోసం,దొంగతనం ఉంటేనే గాని మనిషిని ఏ ఫీల్డ్ లోనైనా సరే సక్సెస్ వరించదు” అంటూ జోగారావుకు రాసిన లేఖలో విశదం చేశాడు. లోకంలో అంతా మోసం,దగాయే అని నిక్కచ్చిగా చెప్పాడు.అవును ఇప్పటికైనా పత్రికలవాళ్ళు పేరున్న వాళ్లవి,తెలిసిన వాళ్లవే అచ్చువేస్తారు.బాగా రాసినాసరే వాళ్లకు పరిచయం లేకుంటే,సిఫార్సు లేకుంటే అచ్చు వేసుకోరు ప్రముఖ పత్రికల వాళ్ళు.
బెజవాడ ప్రజలు తనను తరిమేసినట్లుగా, సామాన్లు అన్నిటిని అమ్మేసి,బతికివున్నామనే సంతోషం కూడా లేదని,దేశం ఒదిలితేనే బాగు పడ్తామని జోగారావుకు రాసిన లేఖలో తన మానసికవ్యధను వ్యక్తం చేశాడు.
చలం రచనల్లో వాస్తవికత ఉంటుందని తను నమ్మిన సిద్ధాంతమే రచనలో ప్రతిబింబిస్తుందని చలం దీక్షితులకు రాసిన ఉత్తరం వల్ల తెలుస్తుంది.చలం నిండా ‘సెక్స్’ ఉంటుందని అంటారు.’సెక్స్’ నేరం కింద ఒప్పుకుంటున్నానని కాదు. ఏ విషయంలోనైనా పూర్తిగా మునిగి కాని తార్కిక,మానసిక పర్యవసానాల దాకా తరచిచూచే వాడు త్వరలో సత్యమార్గం అందుకుంటాడని నా నమ్మకం.” సెక్స్ నా ముక్తి మార్గం” అని రాస్తూ దేశంలో ఇంతవరకు లేని కొత్తదనం నాలో ఏమీ లేదని,ఏది ఫీల్ అవుతామో అదే రాస్తామని చెప్తాడు.అయితే తన రచనలో ఫోర్స్ లేదని తానే ఒప్పుకుంటాడు.మంచి సారస్వతం రెండు రకాలని, ఒకటి గోడమీది పటంలాగా మనసుని అందాలతో నింపేదని,రెండవది ఉరిమి ఉరిమి చించి చెండాడి మంచికో చెడ్డకో జీవితాన్ని ఇన్ఫ్లుఎన్స్ చేసేదని చెప్తూ మొదటి రకం సాహిత్యం బళ్ల కొద్ది వస్తుందని,రెండో రకం సారస్వతాన్ని దేశానికి అందించేది నేను ఒక్కణ్ణేనని దీక్షితులకు రాసిన లేఖలో చెప్పుకున్నాడు. అంటే చలం రచనలు జీవితాలపై ప్రభావాన్ని చూపించేవిగా వుంటాయని తెలుస్తుంది.
ఆ విషయం చలమే ఒప్పుకున్నాడు.చలంకు తన రచనల పట్ల అమిత విశ్వాసం,ప్రజలను మార్చగలననే నమ్మకం బలంగా ఉండేదని తెలుస్తుంది. ఉత్తరాలు ఆయన మనసును అద్దం పడుతున్నాయి.
దీక్షితులకు రాసిన ఉత్తరంలో చలం అభిప్రాయం స్పష్టంగా గోచరిస్తుంది.1900వ సంవత్సరం తర్వాత ప్రచురించిన పుస్తకాలలో ఒకటి కూడా కొంతకాలం నిలవదని,” మన సారస్వతంలో, అభిప్రాయాలలో కొత్త కాలువలూ,కళలో కొత్తమార్గాలూ ప్రారంభించిన వాళ్ళు కొద్దిమంది వున్నారు.వాళ్ళల్లో నేనొకణ్ణి”. అని తన టెక్నిక్,ఆలోచనలు పాశ్చాత్య వాతావరణానికి సంబంధించేట్లుగా వుంటాయి కాబట్టే ఈ దేశంలో అట్లాంటి సాహిత్యం అభివృద్ధి చెందిందని ఘంటాపథంగా చెప్పాడు. దీన్నిబట్టి చలం ఎంత ఆత్మవిశ్వాసం గలవాడో తెలుస్తుంది.
రాజకీయంగా,సాంఘికంగా ముందు ఏ దేశం మారబోతుందో దాన్నిబట్టే తన పుస్తకాలకు విలువుంటుందని ” ఈనాడు వాస్తవజీవితంలో,మాటల్లో చాలామంది చూపుతున్న పోకడలనే నేను కళారూపంలో వ్యక్తం చేశాను” కానీ భాష నాకు ఆటంకమని,ఉద్రేకానికి తగ్గ శైలి లేదని చెప్పాడు.
ఆధునిక రచయితలు వారి కావ్యాలపై స్థాలీపులాక న్యాయంగా విమర్శించాడు. దీక్షితుల రచనపై ( వరూధినీ,చెంచురాణి) పై నిష్పాక్షికంగా విమర్శ చేశాడు.” మీ రచనల్లో ఉప్పు కారం తక్కువగా తోస్తుంది. ఈ అభిప్రాయం నా స్వంతం.కానీ మీ సూనృతమూ, మెత్తని హాస్యం చాలా మంది ఎంత ఇష్టపడతారో ఊహించుకోగలను.కొంచెం కట్లు వొదిలించుకుని,ప్రయత్నిస్తుంటేబహు గొప్పవి రాస్తారని నా నమ్మకం.” అని సూచనలతో కూడిన విమర్శ,,తియ్యని చురకలు వేశాడు.
“మునిమాణిక్యం”వి కులాసాగా చదువుకోవడానికే పనికి వస్తాయని,” విశ్వనాథ” కవిత్వం అర్థం కాదని,” కృష్ణశాస్త్రి” తను నిజంగా ఏమి ఎట్లా అనుభవించాడో అదే రాస్తే అద్భుతమైన గీతాలు వ్రాయగలడని అభిప్రాయాన్ని తెలుపుతూనే హృదయం మీద అతనిచ్చే నాజూకు నొక్కులు అని మెచ్చుకుంటాడు.” వేదం” కలంలో శక్తి వున్నా కవిత్వం కోసమే బతుకుతాడని,” నోరి” కవికింద నాకు తెలీదు అనీ,” నాయని” కవిత్వం నచ్చదు.” బసవరాజు అప్పారావు” ఒక గొప్ప కవిత్వపు పంక్తికోసం నూరుడబ్బాల చత్త రాస్తాడనీ,” రాయప్రోలు” శైలి బాగునప్పటికీ కొత్త అభిప్రాయాలు సున్న అని నిర్మొహమాటంగాను,కుండ బద్దలు కొట్టినట్లుగానూ తన అభిప్రాయాన్ని తెలిపాడు.
ఈ విధంగా చలం మిత్రులకు రాసిన లేఖలను పరిశీలించి నట్లయితే చలం హృదయం విప్పి తను అనుభవించిన ప్రతి విషయాన్ని మిత్రులతో దాపరికం లేకుండా వ్యక్తీకరించినట్లు గమనించవచ్చు.సాంఘిక,
వేదాంత,సాహిత్య విషయాలు,ఆరోగ్య విషయాలు,కుటుంబ విషయాలు ఒకటేమిటి ఎన్నో ఎన్నెన్నో విషయాలు చలం లేఖల్లో చోటు చేసుకున్నాయి.చలం అనుభూతులు,అనుభవాలు,
కష్టసుఖాలు మిత్రులతో లేఖలద్వారా పంచుకున్నాడు.చలం ఔద్యోగిక జీవితంలో తటస్థపడిన వ్యక్తుల మనస్తత్వాలు, జీవిత సిద్ధాంతం, జీవన విధానం మొదలగునవి ఎన్నో విషయాలు లేఖల్లో నిక్షిప్తాలు.
రమణాశ్రమ జీవితంలో చలం భావనా దృక్పథం
(ఉత్తరారుణాచలం)
అరుణాచలం వెళ్ళాక చలం మనస్తత్వంలో మార్పు వచ్చినట్లుగా లేఖలవల్ల స్పష్టంగా తెలుస్తుంది.
బంకుపల్లి రామజోగారావుకు, వీరేశలింగంకు రాసిన లేఖల్లో ఇన్నేళ్లు ప్రపంచానికి సృష్టికి సరైన అర్థం కనబడక,ఏమీ తెలీకపోవడం చేతనే,ఎవ్వరు చెప్పినా నమ్మక అరుణాచలానికి రాక జీవితాన్ని వృధా చేసుకున్నాననే బాధను వ్యక్తం చేశాడు.జీవితంలో ఎంత పోగొట్టుకున్నాడో వెనక్కి తిరిగి చూస్తే తన చేసిన తప్పేంటో తెలుసుకుని పశ్చాత్తాపపడ్డాడు.
” ఎక్కడి చలం ఎక్కడి అరుణాచలం దేవుణ్ణికాదు,ఋషిని కాదు,ఓ సమాధిని సేవించుకుని నమ్ముకొనిపడి వున్నాను.” అంటూనే మోక్షం కావాలని లేదు.వస్తుందన్న ఆశలేదు అని చెప్తూనే అంతలోనే అయోమయావస్థలో పడిపోతాడు చలం. పేరుకున్న ఈ సంస్కారాన్ని కాల్చే శక్తి భగవాన్ కి ఉంది.ఎవరు చెప్పినా అర్థం కాదు.ఏదో బాధ చలంను కలచివేసేది.బాధను భగవాన్ కు వదిలేసి బాధపడకుండా ఉండడం నేర్చుకున్నాడు.అప్పటికి భక్తిపై నమ్మకం కుదరలేదు”.అని దీక్షితులుకు రాసిన లేఖలో అంటాడు.
చలం రామజోగారావుకు రాసిన లేఖలో ” పాత జీవితమంతా ఓ కల లాగా అయిపోయింది. ఇట్లా కాలం గడచిపోవడమే ఆశయం.ఇంకా చలం అనే పేరు కూడా మనసులోంచి గుర్తులేకుండా పోవాలని ప్రయత్నం.ఏదో ఎవరో ఆకాశం నించి ఎప్పుడు దిగివస్తారో అన్నట్లు వుంది మనసు.చివరికి అన్ని బాధలూ పడి స్వర్గధామము చేరుకున్నాను.” అనే సంతృప్తిని మానసిక మార్పును వ్యక్తం చేశాడు.
వీరేశలింగంకు రాసిన ఉత్తరంలో చలం తన ఆవేదనను,ఆంధ్రలో తనను ఎంత నీచంగా చూశారో,ఆంధ్ర జనులపై విరక్తి భావం,రమణాశ్రమంలో చలం పొందుతున్న అనుభూతిని కళ్ళకు కట్టినట్లు వివరించాడు. నేను కష్టాల్లో వున్నప్పుడు ఎవరు ఆదుకున్నారు? కుక్కల్లాగు నన్నన్నివిధాలా క్షోభిల్లచేస్తూవుంటే ఎవరు సహాయానికి వొచ్చారు.ఈ ముప్ఫయి ఏళ్ళు డబ్బు తీసుకోకుండా ఇన్నేళ్లు రాసిన నాకు, డబ్బు లేని రోజున ఎవరిచ్చారు ఒక్క రూపాయి? తీరా నేనొచ్చిన తర్వాత అందరూ అడిగేవాళ్లే ఎందుకు వెళ్ళావని? ఎందుకు? నా బాధ ఇంక వుండదని రూఢి గనుక” అంటూ తన మానసిక వేదనను వెళ్లబోసుకున్నాడు.ఆనాడు ఆంధ్రదేశంలో తనపట్ల ప్రజలకున్న అభిప్రాయాన్ని కూడా చెప్పుకున్నాడు.తాను అరుణాచలం రావడానికి కారణం చెప్తూ ” యువతీ యువకులు దొంగ మొహాలు చూసి” వచ్చేశానన్నాడు. చలం మానసిక చిత్రీకరణ ఈ లేఖలో కనిపిస్తుంది బెజవాడ ప్రజలు తనను ఏ విధంగా,ఎంత నీచంగా చూసేవారో వివరించాడు. వీరేశలింగంకు రాసిన లేఖలో ” ఇదివరకు పురుషులు భయపడేవారు,నేను నా పుస్తకాలూ వాళ్ళ ఆడవాళ్ళని వాళ్ళ అధీనంలోంచి యెక్కడ తిరుగుబాటు చేయిస్తానేమోనని. ఇప్పుడు స్త్రీలు భయపడుతున్నారు,( ఇంకా భయపడతారు కూడా ఎక్కువగా ముందు ముందు) తమ పురుషుల్ని ఎక్కడ సన్యాసుల్ని చేస్తానోనని—- నాతో స్నేహమన్నా,మా ఇంటికి రావడమన్నా అంత ఘోరం క్రింద ప్రచారం చేస్తారు బెజవాడ ప్రజలు” అని వాపోయాడు చలం.
అరుణాచలం వచ్చాక చలం మానసికంగా ఎంతో ఎదిగాడు.గత జీవితాన్ని మరచిపోయి తర్వాత జీవితాన్ని,మనసును రమణాశ్రమంలో భగవాన్ కే అర్పించడానికి ప్రయత్నం చేశాడు ఇదే సందర్బంలో చలం మాటలు ” ప్రస్తుతం నా మనసులోకి అట్లాంటివి తీసుకోవడం బాధ సాధనలో వున్నాను ” అన్నాడు.
” నా కోసమే కాదు,నా నుండి ఏదో తెలుసుకోగలమనే వారందరికోసమూ చేస్తున్నాను ఈ తపస్సు ,ఇది కష్టతరమైనమార్గం ,కానీ నన్ను నడిపేది ఈశ్వరుడైన భగవాన్ రమణ ” అంటూ ధైర్యంగా చెప్పుకుని ఎంతో విశాల హృదయాన్ని ప్రకటించి తన మిత్రులకు ఆధ్యాత్మిక సందేశాలను,సత్యాలను,
జ్ఞానాన్ని లేఖలద్వారా పంచి ప్రచారం చేశాడు వేమన వలె చలం భోగిగా వుండి తర్వాత యోగిగా మారాడు.
చలంలో వచ్చిన మార్పు,జీవితంలో రెండు పార్శ్వాలను లేఖల ద్వారా స్పష్టంగా తెలుసుకోవచ్చును.
జీవితంలో శృంగారమే గొప్పదని భావించిన చలం మెల్లమెల్లగా సత్యమేమిటో తెలుసుకొని, అన్ని బాధలూ పడి చివరికి స్వర్గధామం చేరుకొని,హృదయపరిపక్వత చెంది ఇలా అంటాడు రామజోగారావుకు రాసిన లేఖలో. “శృంగారానికి,ఆధ్యాత్మికానికీ చాలా సన్నిహితమని,జీవితంలో ఎన్ని నిరాశలున్నా లొంగిపోక,నిరాశ పడక బలంతో జయించి ముందుకు సాగాలని హితబోధ చేస్తూ ” క్రమంగా మన చేతులకి విధి నిరాకరించిన సౌందర్యం మన హృదయంలో ప్రజ్వలిస్తుంది వొదలకండి అన్వేషణ. శృంగారాన్ని అన్వేషిస్తో ప్రయాణమై, పోయి పోయి చివరికి ఆ శృంగారం కాంతిగా మారిన సంకేతస్థలానికి చేరుకుంటాము.భగవాన్ ఆనందమయం సర్వశక్తి ” అని తాను తెలుసుకున్న నగ్న సత్యాన్ని ఎంతో చక్కగా వక్కాణించాడు.తాను భగవానుని పూర్తిగా విశ్వసించినట్లు తెలిపాడు మండువ జగ్గారావుకి రాసిన లేఖలో ” శృంగారంలో కన్న మరి దేంట్లోనూ ఎక్కువ ఆనందాన్ని అనుభవించలేదు.మనసుని మించిన ఆనందం ఆధ్యాత్మికం, కామి కాక మోక్షగామి కాడు ఒకటి అసహ్యం,రెండోది మూర్ఖం ” అని వ్రాస్తూనే సాధనమంటే జీవితాన్ని ఈశ్వరునికి అర్పణ చేయడమంటాడు.
ఒక సినిమాకు కథ రాయడానికి మద్రాసుకు వెళ్లినా కూడా చలం ఆలోచనలు భగవాన్ చుట్టూనే తిరుగుతుండేవి.దీక్షితులకు రాసిన లేఖలో ‘ అరుణాచలం పోవాలని ఒకటే పీకుతోంది మనసు. భగవాన్ నాకిట్లా శిక్ష వేశాడు. ఇక్కడ ఈ వాతావరణంలో ఎక్కడా వినపడరు. ఆయన నవ్వుతున్నారు నా బాధల్ని చూసి.ఈ సినిమా కోసం బతకడం కన్నా చచ్చిపోవడం నయం.ఎంతెంత మోసాలు!అసహ్యాలు, డబ్బు…..ఇట్లాంటి మురుగునించి తప్పించారు మీరు నన్ను భగవాన్ని నాకు చూపించి”.అనడం వల్ల చలంలో వచ్చిన మార్పు ,స్త్రీ వ్యామోహం నుండి మనసు భగవాన్ వైపుకు మళ్ళి ఆధ్యాత్మిక స్థితికి చేరుకోవడం ,ఇంతకాలం ఎంతో మురుగులో కొట్టుకుపోతున్న చలం తనను రక్షించినందుకు దీక్షితులకు కృతజ్ఞతలు తెలిపాడు.
రమణ మహర్షి దగ్గర చేరడానికి కావాల్సింది మనలో పట్లు పోయి ” బంధువుల్నీ,మర్యాదల్నీ వొదిలేయడానికి ఓ గొప్ప అర్హత ” అని వీరేశలింగం గారికి సలహా ఇస్తాడు.
చలం దీక్షితులను,వీరేశలింగం గారిని రమణ మహర్షి ఆశ్రమానికి రమ్మని పదేపదే కోరుతూ ఎన్నో ఉత్తరాలు రాశాడు.
చలం మండువ జగ్గారావుకు రాసిన లేఖలో నిత్య సత్యాలను, ఆధ్యాత్మిక భావాలను,తన రచనా వైఖరిని ఎంతో చక్కగా వెల్లడించాడు.” ఆధ్యాత్మిక సాధన అంతా ఏకాగ్రతను కుదుర్చడానికే అంటూ” కాలాన్ని,దేశాన్ని బట్టి మారడమేమిటి? మనిషి మనిషికీ మారుతుంది.నీతి మారదు. నీతికి సంబంధించిన పాపపుణ్యాలనే ఆ ఆచారాలు మారతాయి.
ఆ సంగతి అంగీకరించదు సంఘం.అందరికీ ఒకటే నీతిని రుద్దుతుంది.అదే చలం తగాయిదా సంఘంతో.” అని సంఘానికి చలం ఎందుకు వ్యతిరేకమో,చలం భావాలను ప్రజలు ఎందుకు అసహ్యించుకుంటారో వివరిస్తాడు.
చలం ప్రత్యేకత అతను నమ్మినదాన్ని ఆచరించడం,ఇతరుల కోసం త్యాగం చెయ్యడం,కష్టాలలోకి పోవడం కనుక అతనికి ప్రతిష్ట రాలేదు.
ఒక స్త్రీ విషయమో కాదు వీళ్ళ బతుకుల్లోని నీచత్వాన్ని,దొంగతనాన్ని,
బూతుని,మోసాల్ని బైటపెట్టడానికి ప్రజలకి చాలా కసి,ఎన్నడూ అతన్ని క్షమించలేదు.
అందుకే చలం రాతలకి అంత బలం” .అంటూ ఉన్న వాస్తవాన్ని తెలుతుపుతూనే చలాన్ని పట్టిన రొష్టు ఠాగూరుకు పట్టలేదని జగ్గరావుకు రాసిన ఉత్తరంలో పేర్కొంటాడు.
చలం తన కవిత్వంలో గల ప్రత్యేక లక్షణాన్ని ఇంకా ఇలా వివరించాడు జగ్గారావుకు రాసిన ఇంకో లేఖలో.” మన అనుభవానికి మారిన సంగతుల్ని మనం ఒప్పుకోకపోవడం పొరపాటు.ముఖ్యంగా స్త్రీ మనస్తత్వ విషయంలో కానీ,మన అనుభవాల్ని అటుంచి కథలో ఇది అసంభవం అనిపిస్తే చదువరికి, అది రచనలో లోటు.మామూలు తెలుగువాళ్లు అసంభవమనుకునేవి సంభవమనిపించేట్లు రచించడం చలం ప్రత్యేకత” అని తన రచనా వైఖరిని తెల్పాడు.నిజాన్ని నిర్భయంగా చెప్పే చలంను వాస్తవికతవాది అనవచ్చు.
” ఏమైనా ఈశ్వరుడిలో భక్తి విశ్వాసాలు వుంటే ఎటువంటి ఆపదల్లోంచీ బైటికి రాగలడు.” అంటూ భక్తిపట్ల తనకు గల నమ్మకాన్ని వ్యక్తం చేశాడు చలం జగ్గారావుకు రాసిన లేఖలో.ఆ విశ్వాసమనేది హృదయంలోంచి రావాలి .మనం ఏ పని చేసినా సంపూర్ణ ఆత్మ విశ్వాసంతో చేస్తేనే సఫలమవుతుంది అనేది వాస్తవం.
అసలు ఆధ్యాత్మికం అంటే ఏమిటి? సాధనెందుకు చేయాలి? అన్న ప్రశ్నలకు సమాధానాలు వీరేశలింగంకు రాసిన ఉత్తరంలో కనిపిస్తాయి.” అనుభవానికి అతీతమైన అనుభవానికి పోతారు.అదే ఆధ్యాత్మికం ఇంద్రియాల నుంచి తప్పించి దృష్టిని ఏ ఆధారమూలేని ఆనందంలో లయం చేయడానికేగా” సాధన అని అంటారు.మనసు ఏకాగ్రతను ఎలా సాధించాలి అన్న విషయాన్ని అనుభవపూర్వకంగా వివరించాడు.
” ప్రపంచంలో నలిగి,కాగి,దిక్కులేని వాళ్ళకే ఈ ఆధ్యాత్మిక ప్రపంచం” అంటూ చక్కని నిర్వచనాన్ని వీరేశలింగం గారికి రాస్తూ శాంతి,కాంతి ఇచ్చేవాడు ఒక్క ఈశ్వరుడే అని కుండబద్దలు కొట్టినట్లు తను నమ్మిన సత్యాన్ని ధైర్యంగా చెప్పాడు.” ఎవరి కర్మకి వారే కారణం.ఈ కర్మ పరంపర అనే ఎడతెగని వలనుంచి బైటపడడానికి ఈశ్వరుడొక్కడే సాధ్యం.” అని పచ్చి నిజాన్ని చెప్తూ తన అనుభవాన్ని తేల్చి చెప్పాడు. ఎంత శత్రువునైనా ప్రేమ వల్ల జయించవచ్చునన్న ఆత్మవిశ్వాసం కలవాడు చలం.
ఒకప్పుడు భావోద్రేకంతో ఉండడం వల్ల జీవితంలో ఉపద్రవాలు వచ్చాయన్న సత్యాన్ని తెలుసుకుని వీరేశలింగంకు రాసిన ఉత్తరంలో చలం ఇలా వివరించాడు. ” మనకి అందమైన స్త్రీని చూడగానే కలిగే భావోద్రేకం వల్ల మన జీవితాన్ని ఆమె జీవితాన్ని నడపలేము. బాధనే వాంఛాగ్ని మీలో ఇముడ్చుకోగల లోతును సంపాయించండి… ఆ లోతును ఎంత ప్రయత్నించీ సంపాయించుకోలేకే చాలా ఉపద్రవాలు తెచ్చుకున్నాను…అంత కన్న విషాదం నన్ను నమ్మిన వారికి తెచ్చాను.ఇట్లాంటివి మనలో చాలా వరకు సమసిపోతేనేగాని అరుణాచలానికి పిలుచుకోరు ఈశ్వరుడు.” అంటూ అనుభవాన్ని వివరిస్తూ పశ్చాత్తాపాన్ని తెలుపుతూ వీరేశలింగానికి మార్గాన్ని సూచించాడు.అనుభవంలో చేదును చవిచూసి నలుగురికి ఆ చేదు నిజాన్ని తెలిపి సత్యాన్ని ప్రచారం చేశాడు చలం.ముందు మానసికంగా మార్పు రావాలని సలహా ఇచ్చాడు.
జీవన్ముక్తిని కోరి తన ఆశయం జీవించాను,జీవిస్తున్నాను అనే మరుపు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడటమేనంటాడు చలం.
శివంకు రాసిన లేఖలో అరుణాచలం వచ్చాక ఇదివరకు లేని హాయి ఇప్పుడున్నదంటాడు.
” శాంతి,ఆనందం ఇట్లాంటి పదాలకి అర్థం అనుభవిస్తేనే గాని తెలీదు” అంటూ బంకుపల్లి రామజోగారావుకు రాసిన ఉత్తరంలో రాస్తూ సంతోషం,ఉత్సాహం ఏమీ లేకుండా పూర్తిగా అంధకారంలో పడితేనేగాని కాంతి దొరకదంటాడు చలం.
ఎంతో మందికి తన జ్ఞానామృతాన్ని పంచిపెట్టిన చలం ఆధ్యాత్మికతలోను తీవ్రవాదే. ఉన్నతమైన స్వేచ్చకోసం కలలుకని, తపించి,బాధపడి,ఆధ్యాత్మికంలోకి దిగి ఎదిగాక తను నమ్మిన సత్యాన్ని నలుగురికీ లేఖలద్వారా ప్రచారం చేసి అందరూ అసహ్యించుకున్న చలం, ఎవరికి ఏమీ కాని చలం తన జీవితంలోనూ,సాహిత్యం తోనూ అందరికీ తానే అయి ఎంతో గొప్పవాడుగా గోచరిస్తాడు. ఆనాటి సమాజ పరిస్థితుల్లో చలం ఎదుర్కొన్న సమస్యలు,చలం సాధించిన విజయాలు,మానసిక విశ్లేషణ,ఆయన అనుభవాలు ఒకటేమిటి ఎన్నో విషయాలు లేఖల ద్వారా వెల్లడించాడు.చలం మానసిక మార్పుకు అద్దం పడతాయి ఈ లేఖలు.అరమరికలేకుండా చేదు నిజాల్ని అందరికి పంచిపెట్టిన ధీశాలి చలం.
సమకాలికులకు మిత్రులకు రాసిన లేఖల్లో ఈయన ఆలోచనా సరళి,సాహిత్య విమర్శ,సునిశిత పరిశీలన,కష్టసుఖాలు మొదలగునవి తెలుసుకోవచ్చు.ఆవకాయ పచ్చడి మొదలు బుజ్జిగాడి కబుర్లు అన్ని విషయాలు లేఖల్లో చోటు చేసుకున్నాయి.
గురజాడపై చలం అభిప్రాయాన్ని జగ్గారావు తన లేఖల ద్వారా ఇలా తెలియచేశాడు. ” గురజాడ తిరుగుబాటంతా రచనల్లోనే కానీ జీవితంలో ఏమీ కనబడదు.ఆనాడు ఎవరూ చేయని సాహసం చేసి ఇరుకున పెట్టి సంకెళ్ళ నుండి భాషా, భావాల్ని ఒక్క దెబ్బతో ముక్కలు చేశాడంటాడు చలం”.
శరత్ రచనలను గూర్చి చెపుతూ చలం ” శరత్ నాయికా నాయకులకు వెన్నెముక లేదు.వాళ్ళ వొళ్ళంతా మెత్తని హృదయమే. ఎముకలు లేవు విధికి వెన్నవలె లొంగిపోతారు” అని విమర్శించాడు.
శ్రీ శ్రీ కోరింది ఆర్థిక విధానాన్నే గాక సామాజికంగా మార్పు కోరితే చలం హృదయంలో మార్పు కోరాడు అని జగ్గారావుకు రాసిన లేఖలో అంటాడు.శ్రీ శ్రీ” కవిత్వానికి గొప్పతనం పట్టింది.చలం లోకవిరోధిగానే వుండిపోతాడు” అని రాశాడు.
చలం మనసును అర్థం చేసుకోవడానికి లేఖలెంతో పనికివస్తాయి.సాహిత్యంలో చలం లేఖలకు చాలా ప్రాధాన్యముంది.ఆయన జీవన విధానానికి అక్షర సత్యాలైన లేఖలు అందించిన
చలం జీవన పరిణామక్రమం,ఆలోచనా వైవిధ్యం,ఆలోచనావిధానం,
సమకాలీనాధునిక కవులపై దృక్పథం,ఆధ్యాత్మిక భావసంపద ఎన్నో విషయాలు లేఖల్లో నిక్షిప్తాలు.
లేఖలన్నింటిని పరిశీలించినట్లయితే చలం రమణాశ్రమానికి వెళ్లక ముందు,వెళ్లిన తర్వాత రెండు జీవితాలను,రెండు ఆలోచనా రీతుల్లో మార్పులను రెండు కోణాల్లో గమనించవచ్చు.జీవితంలో నన్ను కదిలించే శక్తి ఒక స్త్రీకి తప్ప ఎవ్వరికి లేదన్న చలం తర్వాత జీవితాన్ని,మనసును రమణ భగవాన్ కే అంకితం చేసి సాధన చేయడమే కాక జీవితంలో ఇప్పుడు ఎంతో హాయిని పొందుతున్నానని తాను నమ్మిన నగ్న సత్యాన్ని,సిద్ధాంతాన్ని ఎంతో ఘాటుగా,ఉన్నదున్నట్లు తన మిత్రులకు రాసిన ఉత్తరాలే నిదర్శనం.
సాహిత్యంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన గుడిపాటి వెంకటచలం మే నెల 19 వ తేదీ 1894 వ సంవత్సరంలో మద్రాసులో కొమ్మూరి సాంబశివరావు కొమ్మూరి వెంకట సుబ్బమ్మలకు జన్మించాడు.తాత గుడిపాటి వెంకట రామయ్య తనను దత్తత తీసుకున్నందుకు గాను ఇంటిపేరు గుడిపాటిగా మారింది.చిన్నప్పటి నుండే అభ్యుదయ భావాలు కలిగి స్త్రీలకు స్వేచ్ఛ ఉండాలని ఆశించి స్త్రీ వాదిగా ఎన్నో రచనలు చేసి తెలుగు సాహిత్యంలో తనదంటూ ప్రత్యేక ముద్రను వేసుకున్న చలం మే నెల 4 వ తేదీ 1979వ సంవత్సరం అరుణాచలంలో కన్నుమూశాడు.
చిన్నప్పుడే తండ్రి తన తల్లిని వేధించే తీరును చూసి చలించిన బాల చలం హృదయం మీద తీవ్ర ముద్రపడి స్త్రీ ఔన్నత్యం,స్త్రీ స్వాతంత్య్రం కోసం రచనలు చేసి స్త్రీ పక్షపాతిగా పేరు పొంది జీవితంలో ఎన్నో కష్టనష్టాలను అనుభవించి తాను నమ్మిన సిద్ధాంతం కోసం పరితపించిన ఆదర్శవంతుడు చలం తెలుగు సాహిత్యంలో ఉత్తమోత్తముడు,ఉన్నత మహాకవి.
మనం నివసించే భూమి గురించి , అవసరాలు తీర్చే నీటిని గురించి సామాన్యంగా అందరికీ తెలుసుకోవాలనే ఉత్సాహం ఉంటుంది . ఈ ఉత్సాహాన్ని ద్విగుణీకృతం చేసే ప్రయత్నమే ఇది.
మనకు ఉన్నది తక్కువ “ఉర్వి”. 29% , నీరు 71% ఉన్నది . కొత్త కొత్త పరిశోధనలు చేస్తూ భూగోళ శాస్త్రజ్ఞులు భూమి పల్లంగా ఉందని అంటున్నారు . విషయం ఏది ఎలా ఉన్నా ,మనకు 7 ఖండాలు ఆసియా ,యూరోప్ ,ఆఫ్రికా , అంటార్కిటికా, ఆస్ట్రేలియా నార్త్ అమెరికా మరియూ సౌత్ అమెరికా.
అన్ని ఖండాలు కూడా వేటికవి ఎంతో సుందరమైన ప్రదేశాలు . ప్రతి ఖండానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతను సంతరించుకున్న ఖండం ఆఫ్రికా .”ఆఫ్రికా” అంటే “మదర్ ఆఫ్ ఆల్ కాంటినెంట్స్”అని అర్థం. తూర్పున రెడ్ సి మరియు పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రం ఉత్తరాన మెడిటరేరియన్ సీ. దక్షిణాన హిందూ మహా సాగరం మరియు అట్లాంటిక్ మహాసముద్రాలు కలిసి ఉన్నాయి.
ఆఫ్రికా ఖండం ఎడారులు పర్వతాలు అడవులు గడ్డి భూములు నదులు ప్రాంతాలుగా విభజింపబడింది ఆఫ్రికా పేరు వినగానే గుర్తుకొచ్చే సహారా ఎడారి బహు గొప్పది ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఎడారి ఎడారిలో ఏముంది చూడడానికి అని ఎడారి వంటి జీవితం అనే మాటలను సర్వసాధారణంగా వింటూ ఉంటాం .కానీ బ్యూటిఫుల్ సాండ్ డ్యూన్స్ అంటే” అందమైన ఇసుక తిన్నెలు” అని అర్థం.
అగ్నిపర్వతాలు కొన్ని ప్రాంతాలలో సాల్ట్ వాటర్ లేక్స్ ఫ్రెష్ వాటర్ లేక్స్ చాలా అందంగా ఉంటాయి
ఆఫ్రికా ఖండంలోని 54 దేశాలను ఐక్యరాజ్యసమితి గుర్తించింది.
విస్తీర్ణంలో అల్జీరియా పెద్ద దేశం చిన్న దేశం గాంబియా.
అల్జీరియా క్యాపిటల్ ఆల్జీయర్స్.
అల్జీరియా స్వతంత్ర దేశం కాకమునుపు ఫ్రెంచ్ కంట్రోల్లో ఉండేది.అల్జీరియా 1962 లో స్వతంత్ర దేశం అయింది.
అల్జీరియా_ ఆల్జీయర్స్
ఆఫ్రికాలో అతిపెద్ద దేశమైన అల్జీరియా 1962లో స్వతంత్ర దేశం అయింది అల్జీరియా రాజధాని ఆల్జీయర్స్.
పూర్వం నుండి కూడా నాగరికత నదుల వడ్డులలోనే ఉద్భవించి పరిఢవిల్లింది. అదేవిధంగా అల్జీరియాలో కూడా షలిఫ్ నది ఒడ్డున నాగరికత విలసిల్లింది.
“షలిఫ్” నదికి ఉపనది “సెబ్ గాగ్”. సెబ్ గాగ్ నది “అమోర్” పర్వత శ్రేణుల్లో పుట్టింది.
ఇక ఆఫ్రికా అనగానే ప్రపంచ ప్రఖ్యాతి పొందిన సహారా ఎడారి గుర్తొస్తుంది. అంబరెల్లా లాగా అలరించే అకేషియా చెట్లు చూడముచ్చటగా ఉంటాయి. క్యాట్ వాక్ చేస్తున్నవా అన్నట్లు ఉంటాయి.
ఇక్కడి రాక్ మౌంటైన్స్ చిత్రకారుని చిత్రంలా చాలా చక్కగా ఉంటాయి. అట్లాస్ పర్వతాలు మెడిటెరేనియన్ సముద్రానికి మరియు సహారా ఎడారి మధ్య సహజ సిద్ధంగా ఏర్పడిన సరిహద్దులు.
చాలా క్యూట్ గా ఉండే ఫెన్నెక్ ఫాక్స్ అనే జంతువు ఆఫ్రికా నేషనల్ ఎనిమల్.
మనిషి ఆకాశంలో విహరించేందుకు విమానం తయారీ కి ప్రేరణ కలిగించింది పక్షులు. వివిధ రకాల పక్షులకు ఇది నిలయం. అలా పక్షులు జంతువులు, వృక్షాలు, పర్వతాలతో గల అందమైన ప్రకృతిని ఆస్వాదించే ప్రకృతి ప్రేమికులకు కన్నుల పండుగగా ఉంటుంది.
అన్నాబా మరియు ఓరన్ ఇక్కడ నేచురల్ పోర్ట్ సిటీస్. ఐరోపా నుండి ఎక్కువగా టూరిస్టులు ఇక్కడికి వస్తుంటారు. స్కూబా డైవింగ్, స్నార్కిలింగ్ మొదలైన యాక్టివిటీస్ తో ఈ పోర్ట్స్ అన్ని కళకళలాడుతూ ఉంటాయి. తూర్పున ఉన్న రెడ్ సీ లోని బ్లూ వాటర్ చాలా అందంగా ఉంటాయి. ఈ పట్టణాలు పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ కలయికతో ప్రత్యేకంగా కనిపిస్తాయి.
ఇలా ఆఫ్రికా ఖండం అందమైన ఖండం. ఇటువంటివి మరిన్ని వచ్చే సంచికలో తెలుసుకుందాం

శ్రావణమాసం అంటేనే పండుగలకు నోములకు వ్రతాలకు అనువైన మాసంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. శ్రావణం శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం. ఈ నక్షత్రం నుంచి ఈ మాసానికి ఆ పేరు వచ్చినట్లుగా పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ నక్షత్రం శ్రీమహావిష్ణువుకు కూడా ప్రీతికరమైనట. ఈ మాసములో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి దేవి వ్రతాన్ని చేసుకుంటారు నిచ్చలమైన భక్తితో మహాలక్ష్మితో పాటు సమంగా శివశక్తిని సైతం ఆరాధిస్తారు
ఈ మాసములోనే మంగళ గౌరీని కూడా ఎంతో భక్తి భావనతో పూజిస్తారు మహిళలు.
శ్రావణ మాసం అమ్మవారికి ఎంతో ఇష్టమైనది. శ్రావణంలో వచ్చే మంగళవారాల్లో కొత్తగా పెళ్ళయిన యువతులు మంగళవారం నాడు "మంగళగౌరీ" వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఐదు సంవత్సరాలు చేయాలి. వరుసగా ఐదు సంవత్సరాలు చేయలేక ఏదైనా ఇబ్బంది. వచ్చినా మరో సంవత్సరం చేయవచ్చు. అయితే ఐదు సంవత్సరాల ఈ వ్రతాన్ని తప్పకుండా పూర్తి చేయాలి... మంగళగౌరీవ్రతం ఎంతో మహిమాన్వితమైంది.
పూర్వం శౌనకాది మహర్షులకు సూతమహర్షి మంగళగౌరీ వ్రతాన్ని, ఆ మహత్యాన్ని తెలియజేసినట్లుగా పురాణాలు వివరించాయి. నారదులవారు మంగళగౌరీ దేవి మహత్యాన్ని సావిత్రీ దేవికి తెలియచేశారు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు మంగళ గౌరీ నోమును గురించి ద్రౌపదికి బోధించాడు. ఇవన్నీ పురాణాల ద్వారా తెలిసిన విషయాలు.
పరాశక్తి అయిన మంగళగౌరీ వ్రతాన్ని ఆచ రించి, ఆమెను భక్తితో పూజించినట్లయితే ఆ దేవి అను గ్రహం ఆ స్త్రీకి లభించి ఆమె సౌభాగ్యం కలకాలం. నిలుస్తుంది. వారికి వైధవ్యం ఉండదు. మంగళగౌరీదేవి. పసుపు, కుంకుమ, గంధం. పరి మళభరితమైన మంగళ ద్రవ్యాలలోనూ, పూలలోనూ కొలువై ఉంటుంది. మంగళ గౌరీని పూజించడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. మంగళగౌరీని పూజించిన కుజుడు మంగళవారానికిఅధిపతి అయ్యాడు. త్రిపురాసురుడు అనే రాక్షసుని సంహరిం చబోయే ముందు ఈశ్వరుడు మంగళగౌరీ దేవిని పూజించి విజయాన్ని పొందాడు. మనువంశపు రాజైన మందుడు గౌరీ దేవి వ్రత ప్రభావం వలన చాలా కాలం భూలోకంలో సిరిసంపదలతో సుఖసంతోషాలతో రాజ్యపాలన చేసాడు. శ్రీకృష్ణుడు ద్రౌపదికి మంగళగౌరీ దేవిని పూజించి వైధవ్యాన్ని తొలగించుకున్న సుశీల కథను తెలియజేశాడు.
పూర్వం మహిష్మతీ నగరాన్ని జయపాల్ రెడ్డి అనే రాజు పాలించేవాడు. ఆ రాజ్కో సంతానం కలగలేదు మహారాణి ఎన్ని మొక్కలు మొక్కిన, ఎన్ని పూజలు చేసినప్పటికీ ఫలితం లభించలేదు. ఆ రాజదంపతులకు సంతానం కలుగలేదు. పరమేశ్వరుడు ఒక సాధువు రూపంలో మహిష్మతీ నగరానికి వచ్చి జయపాలుని అంతఃపురం బయట ద్వారం వద్ద నిలబడి ‘భవతీ భిక్షాం ‘దేహి’ అని శంఖాన్ని పూరించాడు. ఆ మాటలు, శంఖా నాదం విన్న మహారాణి స్వయంగా భిక్ష వెయ్యాలని ద్వారం వద్దకు వచ్చి చూస్తే ఆ సాధువు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ విధంగా ఆ సన్యాసి రావడం, ఆమె లోపల నుంచి వచ్చేలోపు భిక్షను స్వీకరించకుండా వెళ్ళి పోవడం జరిగింది. ఈ విధంగా పలుమార్లు జరగటంతో ఆ విషయాన్ని భర్తకు తెలియజేసింది మహారాణి. అప్పుడు జయపాలుడు “ఆ సన్యాసి మన ద్వారం చేరుకోవటానికి ముందుగానే నువ్వు ఆ ద్వారం వద్ద ఆ మహాత్మునికి భిక్ష వేయటానికి సిద్ధంగా ఉంటే ఆయన ఎదురుచూడవలసిన అవసరం లేకుండా నీ భిక్షను స్వీకరిస్తాడు” అని చెప్పాడు. మరునాడు సన్యాసి రావటానికి ముందుగానే ఆయనకు భిక్ష ఇవ్వటానికి కావలసిన సరంజామాతో మహారాణి ద్వారం ముందు నిలబడింది.
ప్రతి రోజూలాగానే ఆ సన్యాసి శంఖం ఊది “భవతీ భిక్షాందేహి” అన్నాడు. వెంటనే మహారాణి బంగారు పళ్ళెంతో సహా భిక్ష వేయటానికి సిద్ధపడింది. కానీ సన్యాసి ఆమె భిక్షను స్వీకరించకపోగా సంతానం లేని నీ చేతి భిక్షను నేను తీసుకోను” అని వెళ్ళిపోతుండగా “స్వామీ! మాకు సంతానం లేని మాట నిజమే. తమరు దయతో మాకు సంతానం కలిగే మార్గాన్ని ఉపదేశించండి మహాను భావా” అంటూ రెండు చేతులూ జోడించి ప్రార్థించింది. సాధువు రూపంలో ఉన్న ఆ పరమేశ్వరుడు “నీ
భర్త నీలి వర్ణపు వస్త్రాలను ధరించి నీలి రంగు అశ్వాన్నిఅధిరోహించి నగరానికి తూర్పు దిశగా వెళ్ళమని చెప్పు: అక్కడ అశ్వం అలసటతో ఎక్కడ ఆగి పోతుందో అక్కడ తవ్వమని చెప్పు. అప్పుడు అక్కడ ఒక స్వర్ణదేవాలయంలో ఉండే అమ్మవారిని భక్తిశ్రద్ధలతో చిత్తము ద్ధితో శుచిగా పూజిస్తే ఆమె మీరు సంతానాన్ని ప్రసాది స్తుంది” అని చెప్పి ఆ సన్యాసి అక్కడి నుంచి వడివడిగా వెళ్ళిపోయాడు.
రాణి ద్వారా విన్న విషయాలను ఆచరించ. టానికి మహారాజు నీలి వస్త్రాలను ధరించి నీలి అశ్వం మీద అరణ్యానికి చేరుకున్నాడు. ఎక్కడైతే అశ్వం అల సటతో ముందుకు కదలకుండా ఆగిపోయిందో అక్కడ తవ్వించగా స్వర్ణమందిరం కనిపించింది.
ఆ ఆలయంలోని అమ్మవారిని నియమనిష్ఠలతో పూజించాడు జయపాలమహారాజు. ఆమెను ఎంతగానో స్తుతించాడు. అతని భక్తికి ప్రసన్నురాలైన ఆ తల్లి ఆ రాజుకు దర్శనమిచ్చి నీకు సిరిసంపదలను ప్రసాదిస్తానని చెప్పింది.
“తల్లీ నాకు ధనము కావాలన్న ఆశలేదు.. సంతానం లేని నాకు దయతో సంతానం కలిగే భాగ్యాన్ని
ప్రసాదించండి” అని కోరాడు. “నీకు వైధవ్యం కలిగి ఎక్కువ కాలం జీవించేపుత్రిక కావలెనా, అల్పాయుష్కుడై, సన్మార్గుడైన పుత్రుడు కావలెనా కోరుకో’ అని చెప్పింది ఆ అమ్మవారు.
పితృదేవతలను ఉద్దరించేందుకు సజ్జనుడైన పుత్రుడు కావాలని కోరుకున్నాడు జయపాలుడు.
“నీ కోరిక నెరవేరుతుంది. నా పార్శ్వమున
ఉన్న గణపతి నాభియందు అడుగు ఉంచి ఆ కనిపించే చూత వృక్షం నుంచి ఫలాన్ని కోసి, దాన్ని నీ భార్యకుఇవ్వు” అని చెప్పి అమ్మవారు అదృశ్యమైపోయింది. జయపాలుడు అమ్మవారు చెప్పినట్లుగా ఒక్క ఫలాన్ని మాత్రమే కోయకుండా చేతికి అందిన పండ్లన్నీ తెంపేసరికి. గణపతికి ఆగ్రహం కలిగింది. “నీకు జన్మించే పుత్రుడు అల్పాయుష్కుడు. అతను పదహారవ ఏట సర్పకాటుతో “మరణిస్తాడు” అని శపించాడు.
జయపాలుని భార్య ఒక కుమారునికి జన్మ నిచ్చింది. అతనికి పెళ్ళి జరిపిస్తే కుమారుని ఆయుర్దాయం పెరుగుతుందేమో అన్న ఆశతో, ఆ నమ్మకంతో మహారాణి తమ కుమారునికి వివాహం చేద్దామని భర్తతో చెప్పింది. తన పుత్రుడైన శివుడిని మేనమామతో కాశీకి పంపించాడు జయ పాలుడు
ఆ స్వామిని దర్శించిన తర్వాత పుత్రుని కళ్యాణం జరిపిద్దామని భార్యతో చెప్పాడు మహారాజు..
శివుడు, మేనమామ ప్రయాణం చేస్తూ మార్గ మధ్యంలో ప్రతిష్టానపురం చేరుకున్నారు. అక్కడ ఒక సత్రంలో వారు బస చేశారు. సత్రం బయట కొంతమంది. కన్యలు కబుర్లు చెప్పుకుంటూ ఆటలాడుకుంటున్నారు. ఇంతలో ఒక కన్య మరొక కన్యతో గొడవపడింది. ఆ కన్య సుశీలను దుర్భాషలాడుతూ “ముండ రండ” అని నిందించింది.
అప్పుడు సుశీల రోషంతో “మా ఇంట్లో ముండలు, రండలు ఉండరు. నా తల్లి శ్రావణమంగళగౌరీ వ్రతం చేస్తుంది. ఆ మంగళగౌరీదేవి కృప మాకందరకూ కలుగుతుంది” అని చెప్పింది. శివుని మేనమామ ఆ మాటలు విన్నాడు. తన మేనల్లుడు అల్పాయుష్కుడు అన్న సంగతి తెలిసిన ఆయన మనసులో ఒక ఆలోచన ప్రవేశించింది. తన మేనల్లుడితో సుశీల వివాహం జరిపిస్తే మంగళగౌరీ అమ్మవారి దయ వల్ల తన మేనల్లుడు.
పూర్ణాయుష్కుడవుతాడు” అన్న నమ్మకం కలిగింది.
సుశీల తండ్రి శివాలయంలో పూజలో ఉన్నాడని.. తెలుసుకుని ఆలయానికి వెళ్ళి సుశీల తండ్రికి కనిపించ కుండా రహస్యంగా ఆలయం వెనుక దాగి ఉన్నారు. శివుడి మేనమామ
“ఈశ్వరా నా కూతురుకి పెళ్ళి చేయాలను కుంటున్నాను. తగిన వరుడు లభించేలా దీవించు దేవా అని ప్రార్ధించాడు.
“భక్తా శివుని పేరు గల యువకుడు నీ.. కుమార్తెకు వరుడవుతాడు. అతను కాశీ పట్టణానికి వెళ్తూ సత్రంలో బస చేశాడు. నీ కుమార్తెకు అతనితో కళ్యాణం జరిపించు. అంతా మంచే జరుగుతుంది” అని చెప్పారు. శివుని మేనమామ.
ఆ మాటలకు మహదానందం చెందాడు. సుశీల తండ్రి. అతని అన్వేషణలో సత్రంలో ఉన్న శివుడు అతనికి కనిపించాడు. అతనితో తన పుత్రిక వివాహం జరిపించాడు. సుశీల తండ్రి పెళ్ళయిన ఆ దంపతులు ఆ రాత్రి బ్రహ్మ చర్య ప్రతాన్ని పాటించగా మంగళగౌరీ దేవి సుశీలకు స్వప్నంలో దర్శనమిచ్చి “నీ భర్త అల్పాయుష్కుడు ఈ రోజుతో అతని జీవితకాలం ముగిసిపోతుంది. నీ భర్తను కాటు వేయడానికి ఒక సర్పం రాబోతోంది. నీ భర్త మరణించకుండా నీ సౌభాగ్యం నిలవటానికి నేను నీకొక ఉపాయం చెప్తాను. నువ్వు కుండ నిండా పాలు పోసి, ఉంచు. నీ భర్త ప్రాణాలు హరించటానికి వచ్చే కృష్ణసర్వం ఎదురుగా ఆ కుండను ఉంచు. అప్పుడా సర్పం పాలును తాగటానికి కుండలోకి ప్రవేశిస్తుంది. వెంటనే నువ్వు ఒక వస్త్రంతో కుండ మూతను గట్టిగా కట్టేసి, ఉదయం ఆ కుండను నీ తల్లికి వాయనంగా ఇవ్వు నీకు సౌభాగ్యం తొలగిపోదు” అని చెప్పింది.
వెంటనే మెలకువ వచ్చిన సుశీల ఆ అమ్మవారు చెప్పినట్లుగానే ఒక కుండలో పాలను నింపి ఒక నూతన వస్త్రాన్ని తన దగ్గర ఉంచుకుంది. కృష్ణసర్పం వచ్చి పాలను చూసి త్రాగటానికి కుండలోకి వెళ్ళింది. సుశీల వెంటనే నూతన వస్త్రంతో కుండ మూతను గట్టిగా కట్టేసింది. శివుడు నిద్రలేవగానే మేనమామతో కలసి కాశీకి వెళ్లిపోయాడు. చెప్పినట్లుగా తన తల్లికి ఆ ఘటాన్ని వాయనం ఇవ్వగా వస్త్రాన్ని తొలగించి మూతను తీసి చూస్తే సర్పానికి బదులుగా ఒక ముత్యాల హారం కనిపించింది. ఆ మంగళగౌరీకి మనసులోనే నమస్క రించింది సుశీల. తన భర్త తనతో చెప్పకుండా వెళ్ళి పోయినప్పటికీ ఎప్పటికైనా తిరిగి వస్తాడని నమ్మింది. ఈలోగా పరమేశ్వరుడు సుశీల పాతివ్రత్యాన్ని పరీక్షింపకోరి శివుని వేషంతో వారింటికి వస్తే అతను తన భర్త కాడని అతని చెంతకు వెళ్ళనని వ్యతిరేకించింది సుశీల ఆ మాయా శివుడు అంతర్ధానమయ్యాడు. తన భర్త తిరిగి వస్తాడన్న దృఢనమ్మకంతో ఒక సత్రాన్ని కట్టించమని తండ్రిని కోరింది సుశీల.
సత్రంలో వచ్చిన వారందరినీ నిశితంగా పరిశీ లిస్తూ అతిథి సత్కారాలు చేయసాగింది సుశీల. తన తీర్థ యాత్ర పూర్తి చేసుకుని మేనమామతో కలసి ప్రతిష్టానపురం చేరుకున్న శివుడు సత్రంలో బస చేశాడు. శివుడిని గుర్తిం చిన సుశీల అతడే తన పతి అని తల్లితండ్రులకు చెప్పింది. శివుడు ఆమెను తన భార్యగా స్వీకరించాడు. అల్పా యుష్కుడై తన ఆయుష్షు పెరగటానికి కారణమేమిటని సుశీలను ప్రశ్నించాడు శివుడు.
సుశీల చిరునవ్వుతో ఇదంతా ఆ మంగళగౌరీదేవి అనుగ్రహం అని చెప్పింది. ఆ నూతన దంపతులిద్దరూ సుఖసంతోషాలతో సిరిసంపదలతో ప్రేమానురాగాలతో జీవితాన్ని గడిపారు. శ్రీకృష్ణుడు ఈ కథను ద్రౌపదికి చెప్పాడు. అప్పటి నుంచీ స్త్రీలు అందరూ మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించసాగారు.
‘వాజ్ఞ్మయ భూషణ’ -“కావ్యసుధ “
9247313488 : హైదరాబాద్.
2019 లో కీ.సే. సి.నారాయణ రెడ్డి గారి గురించి రాసినది. మరొక్కసారి వారిని స్మరించుకుంటూ……….
ఆధునిక తెలుగు సాహితీ జగత్తులో , నిలువెత్తు రూపం …..సి నా రే. ఆయనకి రోజూ కవిత రాయనిదే తెల్లవారదు, కవితకు కొత్త సొబగులు అద్దనిదే నిద్దర రాదు.

ఆయన కవి, అధ్యాపకుడు, పరిశోధకుడు. అన్నిటినీమించి మనిషి జీవితాన్ని ఒక ప్రిజమ్ లోంచి కాంతి ప్రసరించినప్పుడు వెలువడే రంగులన్నింటినీ మేళవించి, పద చిత్రణతో , రూపుకట్టించిన మేధావి.
ఆయన మాట్లాడుతుంటే మువ్వల సవ్వడి గొంతులో వినిపిస్తుంది.ఆయన బహుముఖ సాహితీ స్వరూపాన్ని దర్శించడం అంటే , గుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తూ , గుడి గోపురం, గోడల మీద చెక్కిన శిల్పాలను చూడడం వంటిది.
ఆయన రచనల్లో అత్యంత ప్రశస్తమైనది గా భావించబడేది ఆయనకు జ్ఞానపీఠ పురస్కారం తెచ్చిపెట్టిన ” విశ్వంభర ” వచన కావ్యం. మానవుడు ఆ కావ్యానికి నాయకుడు. ప్రకృతి నాయిక.ఆదిమ కాలంనించీ ఆధునిక కాలం వరకూ సాగిన మనిషి జీవన ప్రస్థానం , ఐదు ప్రకరణాలుగా సాగిన సుదీర్ఘ కవిత.” నేను పుట్టక ముందే నెత్తి మీద నీలితెర.కాళ్ళ కింద ధూళి పొర.” అంటూ మొదలయ్యి “ఎంతటి కలవరమో వెదుళ్లకు ప్రతి అంగం నాదంగా పరిణమించాలని……ఎంతటి ఆరాటమో కొండరాళ్లకు ……అఖిలాణువులు మూర్తులుగా మూర్తీభవించాలని…. అనిసాగిపోయే కవితా ప్రవాహం గుక్కతిప్పుకొనివ్వదు.
నారాయణ రెడ్డి గారిని చూసి మాట్లాడిన అదృష్టం నాది.ఆయన సినిమా పాటల సంకలనం ” పగలే వెన్నెల ” ఆయన చేతులమీదుగా కాలేజీలో బహుమతిగా అందుకున్నాను.మూడు వేల పైచిలుకు పాటలు రాసిన ప్రతిభా మూర్తి. జ్ఞానపీఠ బహుమతి పొందిన విశ్వనాథ వారిని మెప్పించటంకోసం ” ఏకవీర ” సినిమాకు మాటలు రాశారు.ఆ సినిమా చూసి హాల్లోంచి బయటికి వస్తూ ఒక సామాన్య ప్రేక్షకుడు అన్నాట్ట ” ఈ సినిమాలో పాటలు అన్నీ అర్థం అయ్యాయి కానీ మాటలు ఒక్క ముక్కా అర్థం కాలేదు ” అని.
అయితే ఆ సినిమాలో ” తోటలో నారాజు ” పాట సినీ ఉద్యానవనంలో రెడ్డిగారిని రారాజుగా నిలిపిన పాట.ఆ పాటలో ఆయనే అన్నట్టు అది రస రమ్య గీతం.అదే సినిమాలో ఆయన తాను కాలేజీ రోజుల్లో రాసిన ” ప్రకృతిలో ప్రణయిని కవితని పాటగా పెట్టారు.బాలూ ఎంత నిదానంగా పాడారు అంటే , పడవలో వెళ్తూ పాట వింటే , పడవ కంటే పాట వెనకబడినట్టు అనిపిస్తుంది.
గులేబకావళి కథ (1962)నించీ మొదలైన ఆయన సినీ గీత రచనా ప్రస్థానం , ఐదు దశాబ్దాలకు పైగా సాగింది.ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ గా ఉంటూ , హైద్రాబాద్ నించీ చెన్నైకి విమానంలో వచ్చేలోపు కొన్ని పాటలు రాసేసే వారుట.చెన్నైలో మేము ఉన్న టీ నగర్ , బస్ స్టాండ్ ఎదురుగా సుధార హోటల్ లో బసచేసేవారుట.
నారాయణ రెడ్డి గారిని సాహితీ మూర్తిగా , మరొక మారు దర్శించాలి అంటే, ఆయన అనేకానేక రచనలు ఆధారంగా ఆయన బహుముఖ సాహితీ రూపాన్ని సందర్శించాలి.కవిగా పద్య రచనతో శ్రీకారం చుట్టి , కర్పూర వసంతరాయలు, నాగార్జున సాగరం, ఋతు చక్రం వంటి పద్య కావ్యాలు రాశారు. వచన కవిగా జలపాతం, అక్షరాల గవాక్షాలు, మధ్యతరగతి మందహాసం, మంటలూ – మానవుడు, ఉదయం నా హృదయం, మార్పు నా తీర్పు, తేజస్సు నా తపస్సు, ఇంటిపేరు చైతన్యం, కవిత నా చిరునామా, కాలం అంచుమీద, నడక నా తల్లి, శిఖరాలూ లోయలూ, మట్టీ మనిషీ ఆకాశం, దూరాలను దూసుకొచ్చి, ఆరోహణ, దృక్పథం, భూగోళమంత మనిషి బొమ్మ, , వ్యక్తిత్వం, గదిలో సముద్రం.
:
👆 ఆయన కావ్యాల పేర్లు ….ఒక క్రమపద్ధతిలో పెర్చితే అది ఒక కవిత అవుతుంది. అందువల్లే భారతీయ జ్ఞానపీఠ కమిటీ, వారి సృజనాత్మక సాహితీ సేవకు మెచ్చి వారి చుట్టూ పట్టు ఉత్తరీయం కప్పినట్టు వారి సమగ్ర సాహిత్యానికి జ్ఞాన పీఠ బహుమతి ప్రకటించింది
సి నా రే ని తిరుగులేని పరిశోధకుడిగా మాత్రమే కాకుండా ఆచార్య స్థానంలో నిలబెట్టిన గ్రంధం “ఆధునిక ఆంధ్ర కవిత్వము, సంప్రదాయములు, ప్రయోగములు.” రిఫరెన్స్ పుస్తకంగా ఆధునిక తెలుగు కవిత్వం మీద దీనిని మించిన పరిశోధనా గ్రంధం వేరొకటి ఇప్పటిదాకా రాలేదు.
సినిమా పాటల రచయితగా ఎన్ని ఉదాహరణలు చెప్పినా , ఆయన పాటలలోని మాటల సొగసు తరగదు. పాటలో ఏముంది నా మాటలో ఏముంది అంటూ ఆయన రాసిన సినిమా పాటలమీద ఆయనే రాసిన లఘు వ్యాఖ్యానాలు , పాటలలోని అందాలను వెతికి పట్టుకునేలా చేస్తాయి.
కృష్ణవేణి సినిమాలో నాయికని నది తో పోలుస్తూ రాసిన “శ్రీగిరి లోయల సాగే జాడల శతకోటి విద్యుల్లతలు వికశింపచేసినావు ” అంటారు, శ్రీశైలం పవర్ ప్రాజెక్ట్ గురించి.
సీతా కళ్యాణం సినిమాలో గంగావతరణం పాట ఆయన పాండితీ ప్రకర్షకు నిదర్శనం. “కదిలింది కదిలింది గంగ, మహోత్తుంగ తరంగ ” అంటూ గంగా నదీ ప్రవాహాన్ని , పదప్రవాహంగా, కవితా ఝరిగా పరుగులెత్తించారు.
నదులు అంటే ఆయనకు బహు మక్కువ, ఆయనకు నలుగురు కుమార్తెలు, గంగ,యమున, సరస్వతి,కృష్ణ ,….వారి పేర్లు.
ఆయనకు, జ్ఞానపీఠ బహుమతి వచ్చాక , శృతి నీవు గతి నీవు, ఈ నా కృతి నీవు భారతీ …… అంటూ రాసుకొచ్చి శరణాగతి నీవు భారతీ అంటారు.ఆ పాట ఆయన జ్ఞానపీఠం పై నిలిచిన సరస్వతీ దేవికి చేసిన గీతార్చన. ఆ పాటలో ప్రతి పదమూ , కవితాత్మ దర్శన ప్రాప్తి కలిగించే కైవల్య పథం.
:
ఒక సినిమా పాట మీద పాఠం రావడం , ఆయనకే చెల్లింది…..” వట పత్ర సాయికి ” పాట రాసిన ఆయన వెళ్లిపోయారు అని బాధ కలిగినా తాత రాసిన జోల పాట పిల్లలరూపంలో సాక్షాత్తూ ఆభగవంతుడు నిత్యం విని ఆనందిస్తూనే ఉంటాడు.
నారాయణరెడ్డి గారు , తెలంగాణాలో , హనుమాజీ పేటలో జన్మించారు.ఉర్దూ మీడియంలో చదువుకున్నారు.పారసీక భాషలో కూడా పట్టు ఉంది. ఆ పాండిత్యం ఆయన చేత తెలుగులో గజల్స్ రాయించింది.గజల్ శ్రీనివాస్ ఆయన గజల్స్ బాగా పాడి ఆయన మానస పుత్రుడిగా పేరుతెచ్చుకున్నాడు.
ఆయన కూడా తన గజల్స్ చాలా బాగా పాడి క్యాసెట్స్ రూపంలో తీసుకొచ్చారు.”అమ్మ ఒక వైపు , దేవతలంతా ఒక వైపు, సరి తూగమంటే, అమ్మవైపు ” అన్న ఆయన గజల్ మాతృవాత్సల్యాన్ని మనసుకి హత్తుకునేలా చేస్తుంది.
ఆయనకు సమకాలికుడైన ఆయన మిత్రుడు దాశరథి తో కలిసి తొలి రోజుల్లో జంట కవిత్వం రాశారు.
పోతన భాగవత పద్యాలకు మందార మకరందాలు పేరిట సరళ వ్యాఖ్య రాశారు. 85 సంవత్సరాలు పైగా జీవించి , పుట్టినప్పటినించీ లెక్క గట్టుకున్నట్టు 85 కి పైగా రచనలు ప్రచురించారు.ఏటేటా వచ్చే ఏ సంస్థ తెచ్చే కవితా సంకలనాల్లో ఐనా ఆయన కవిత ఉండ వలసిందే. అది ఆయనకు జ్ఞానపీఠం వచ్చింది కనుక వేసే పెద్ద పీట కాదు . కాలానుగుణంగా, భావజాలానికి , కవిత్వ వ్యక్తీకరణ విధానానికి పదును పెట్టుకుంటూ, పాళీకీ పదును తగ్గలేదని కొత్త కలాలకి ధీటుగా కవిత్వం రాసే ఆ నిత్య కవితా వసంత భోగ రాయుని గొప్పదనం అది.
నారాయణరెడ్డి మౌలికంగా కవి.కవిత్వం విషయంలో ఆయన నమ్మిన ఆచరించిన, అనుసరించిన రచనా సూత్రం “కవిత్వానికి మూలం భావం…..అదే కవితాత్మ……. ఆ ఆత్మకు రూపాన్నిచ్చేది భాష…… అది దేహం. ” ఈ సూత్రం ఆధారంగానే ఆయన ఏడు దశాబ్దాలు కవిగా మనగలిగాడు.
మనమధ్య, నరుడిగా , నారాయణుడి గా తన విశ్వంభర మహా కావ్యం ద్వారా కవితా విశ్వ విహారం చేశారు. ఆయన తన రచనల ద్వారా చేసిన “సదాలోచనలు అంతరంగాలను సమీక్షించి చూపుతాయి.ఆ సమీక్షలు జీవన నిర్వహణకు పురోదర్శినులవుతాయి ” కళాత్మకత, వైజ్ఞానికత, ఆధ్యాత్మికత , సాధనలోఎన్ని ఎదుదెబ్బలు తగిలినా మనిషి ఎప్పుడూ తిరోగామి కాడు, అనేది ఆయన ప్రగాఢ నమ్మకం.అదే విశ్వంభర కావ్యంలో ఆయన సృష్టించిన కవితా సారాంశం.
కవిత రాయనిదే నిదుర రాని ఆయన శాశ్వత నిధురలోకి వెళ్లి పోయారు, తన రచనల ద్వారా తెలుగు మానవాళిని నిత్య. జాగురూకులై ఉండమని నిర్దేశిస్తూ….ఆ కవితా శిఖరానికి శిరస్సు ఎత్తి నమస్కారం.ఆయన కవితా సంస్కారానికి శిరస్సు వంచి అభివాదం.నివాళి.

ఆసనం వేసే విధానం: రెండు కాళ్ళ మధ్య రెండు అడుగుల దూరం ఉంచి, రెండు చేతులను ముందుకు చాచి, నెమ్మదిగా ఎడమ చేతిని కుడిభుజంపై, కుడిచేతి వ్రేళ్ళు ఎడమవైపు నుంచి ముందుకు వచ్చేలా కుడిచేతితో నడుమును చుట్టి, నడుము నుంచి పై భాగం కుడివైపు నుండి వెనకకు తిప్పాలి. క్రింది భాగం కదలకూడదు. మరలా చేతులను ముందుకు తీసుకొని వచ్చి కుడిచేతిని ఎడమ భుజంపై, ఎడమచేతితో నడుమును చుడుతూ, నడుము నుండి పై భాగం ఎడమవైపు నుండి వెనుకకు తిరగాలి.

ఉపయోగాలు : 1. నడుము దగ్గర కొవ్వు కరిగి సన్నగా అవుతుంది.
2. ఉదర సమస్యలు తగ్గుతాయి.
3. భుజకండరాలు గట్టి పడతాయి.
4. చేతులు బలంగా తయారవుతాయి.
5. పొట్ట తగ్గుతుంది.
6. పక్కటెముకలు బలపడతాయి.

ఉదర కరాసనము : రెండు కాళ్ళ మధ్య రెండు అడుగుల దూరం ఉంచి చేతులను ముందుకు చాచాలి. ఎడమ చేతిని కుడిభుజంపై వేసి, కుడివైపు వెనుకకు తిరుగుతూ కుడిచేతిని వెనకకు చాచి ఉంచాలి. క్రింది భాగం కదలకూడదు.
చేతులను ముందుకు తీసుకొని వచ్చి కుడిచేతిని ఎడమ భుజంపై వేసి, ఎడమవైపు వెనుకకు దిరుగుతూ ఎడమచేతిని చాచాలి.
ప్రయోజనాలు : కటిచ్రకాసనం వలన కలిగే ప్రయోజనాలతోపాటు అదనంగా కలిగే ప్రయోజనం.
వెన్నెముక బలోపేతం అవుతుంది.

తిర్యక్ తాడాసనము : రెండు కాళ్ళ మధ్య రెండు అడుగుల దూరం ఉంచి, చేతివేళ్ళను కలిపి, అరచేతులు పైకి చూస్తున్నట్లు చేతులను తలపైకి బాగా సాగదీయాలి. తరువాత చేతులను ముందుకు చాచుతూ వంగి, కుడివైపు నుండి పైకి లేస్తూ నడుము నుంచి పై భాగం నిటారుగా వెనుకకు తిప్పవలెను.
కొద్దిసేపు అలా ఉన్న తరువాత మరలా ముందుకు వంగి ఎడమవైపు పైకి లేస్తూ నడుము నుంచి పైభాగం నిటారుగా వెనుకకు తిప్పాలి.
ప్రయోజనాలు :
- కాళ్ళు చేతులు దృఢంగా తయారవుతాయి (దృఢంగా).
- భుజాలు గట్టి పడతాయి.
- పొట్ట తగ్గుతుంది.
- వెన్నెముక బలపడుతుంది.
- తొడ భాగంలో, పొట్ట భాగంలో కొవ్వు కరుగుతుంది.
- పక్కటెముకలు బలంగా తయారవుతాయి.

వృక్షాసనము : మొదట సమస్థితిలో నిల్చోవాలి. ఎడమకాలిని మడిచి కుడి తొడకు ఆనించి చేతుల్ని పైకి తీసుకెళ్ళి నమస్కార ముద్రలో ఉంచాలి. మోచేతుల్ని వంచరాదు. ఈ స్థితిలో నాలుగైదు శ్వాసలు తీసుకొని తరువాత మామూలు స్థితికి వచ్చి కుడికాలిని మడిచి ఎడమ తొడకు ఆనించి చేతుల్ని పైకి తీసుకెళ్ళి నమస్కార ముద్రలో ఉంచాలి. చూపు ఒకే బిందువుపై కేంద్రీకరిస్తే ఎక్కువ సేపు ఉండగలుగుతారు.
ప్రయోజనాలు: 1. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతుంది.
2. కీళ్ళనొప్పులు తగ్గుతాయి.
4. కాళ్లు చేతులు బలోపేతం అవుతాయి.
3. పొట్ట తగ్గుతుంది.
5. రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది.

సంతులనాసనము (సంతులనాసనము) : రెండు కాళ్ళను దగ్గరగా ఉంచి రెండు చేతులను శరీరానికి ఇరువైపులా ఉంచాలి. అనగా సమస్థితిలో నిల్చోవాలి. తరువాత ఎడమ కాలిని వెనుకకు మడిచి ఎడమచేతితో పట్టుకొని కుడిచేతిని నిటారుగా పైకి లేపి ఉంచాలి. ఇక్కడ కూడా చూపు ఒకే బిందువుపై కేంద్రీకరించాలి. ఉండగలిగినంతసేపు ఉంచి తరువాత మరో కాలిని మడిచి చేయాలి.
ప్రయోజనాలు : 1. ఏకాగ్రత పెరుగుతుంది, 2. కీళ్ళనొప్పులు తగ్గుతాయి. 3. కాలివేళ్ళకు, చేతివేళ్లకు రక్త్రపసరణ బాగా జరుగుతుంది.4. కండరాలు గట్టిపడతాయి. 5. పొట్ట తగ్గి శరీరం నాజూకుగా అవుతుంది.

నటరాజాసనము : మొదట సమస్థితిలో నిల్చోవాలి. కుడికాలును మోకాలివరకు వెనుకకు మడిచి కుడిచేతితో పట్టుకోవాలి. కాస్త ముందుకు వంగుతూ ఎడమ చేతిని, వెనుకకు మడిచిన కుడికాలిని తలకన్నా కాస్త పైకెత్తాలి. ఉండగలిగినంతసేపు ఉండి తరువాత మరో కాలు మడిచి చేయాలి. ఒకే బిందువుపై దృష్టి పెట్టడం మరచిపోవద్దు.
ప్రయోజనాలు : 1. చేతులు, కాళ్లు ఆరోగ్యంగా తయారవుతాయి. 2. వెన్నెముక సమస్యలు తొలగుతాయి.
3. నడుము సన్నబడుతుంది. 4. మూలశంక తగ్గుతుంది. 5. కీళ్ళనొప్పులు తగ్గుతాయి.
6. ఏకాగ్రత పెరుగుతుంది.
రక్తపోటు తక్కువగా ఉన్నవారు ఈ ఆసనం వేయకూడదు. బ్యాలెన్స్ కోసం గోడ పక్కగా నిల్చోవడం మంచిది.

గరుడాసనము: ఇది గరుడపక్షి ఆకారంలో ఉంటుంది కావున దీనికి ఆ పేరు వచ్చింది. ఇది అందరూ చేయదగిన ఆసనము.
చేయు విధానం : తివాచీపై సమస్థితిలో నిల్చొని ఎడమ తొడను కుడితొడ మీదకు చేర్చి, అదా కాలుని మెలిపెట్టి కుడికాలి చీలమండల వద్ద ఆనించాలి. శ్వాస తీసుకుంటూ ఎడమ చేతిని కుడిచేతితో చుట్టి రెండు అరచేతులను నమస్కార ముద్రలో ఉంచాలి. నాలుగు అయిదు శ్వాసలు తీసుకొని మరలా సమస్థితికి రావాలి. ఈ సారి మరో కాలు, మరో చేతితో చేయాలి. ఈ స్థితిలో వీపు, తల నిటారుగా ఉంచాలి.
ఉపయోగాలు : 1. రక్తనాళాలు బాగా సాగి బల పడతాయి. 2. సర్వయికల్, థైరాయిడ్, కీళ్లనొప్పులు తగ్గుతాయి.
3. నడుము, వెన్నెముకను బలోపేతం చేస్తాయి. 4. వృషణాల వాపును తగ్గిస్తాయి.
- తొడకండరాలు, తుంటి ఎముకలను బలం చేకూరుతుంది.
- ఎక్కువగా కుర్చీలో కూర్చొని పనిచేసేవారికి చాలా ఉపయోగం.

హస్తపాదాంగుష్టాసనము: తివాచీపై రెండు కాళ్ల మధ్య అడుగు దూరం ఉంచి ఎడమచేతిని నడుముపై ఉంచాలి. శ్వాస తీసుకుంటూ కుడికాలిని మోకాలివరకు మడిచి ఎడమకాలి తొడపైకి తీసుకొచ్చిన తరువాత కుడిచేత్తో కుడికాలి బొటన వేలును పట్టుకొని శ్వాసవదులుతూ మోకాలు వంచకుండా కాలును చక్కగా ముందుకు చాచాలి. ఇక్కడ శరీరబరువు మొత్తం ఎడమకాలిపై పడుతుంది. ఈ స్థితిలో నాలుగైదు శ్వాసలు తీసుకొని మరలా యధాస్థితికి వచ్చి ఈసారి ఎడమకాలు, ఎడమచేతితో చేయాలి.
ప్రయోజనాలు
- తొడ కండరాలకు శక్తి చేకూరుతుంది.
- సయాటికా, వెన్నెముక, మోకాళ్ళ, కాళ్ళ నొప్పులు తగ్గుతాయి.
- కాళ్లు, చేతులు, నడుముకు బలం చేకూరుతుంది.
- శరీరము చక్కని ఆకారంలో ఉంటుంది.

త్రికోణాసనము : త్రికోణము అనగా మూడు కోణములు కలిగినదని అర్థము. ఈ ఆసనము త్రిభుజాకారంలో మూడు కోణములను కలిగి ఉండటంవలన త్రికోణాసనం అనే పేరు వచ్చింది.
చేయు విధానం : రెండు కాళ్లను వీలయినంత దూరం జరుపుతూ తివాచీపై నిల్చోవాలి. రెండు చేతులను భూమికి సమాంతరంగా చాచుతూ రెండు అరచేతులను నేలను చూస్తున్నట్లు ఉంచాలి.
శ్వాస విడుస్తూ నెమ్మిదిగా నడుమును కుడిపక్కకు వంచుతూ కుడిచేతిని కుడిపాదం చివరకాని, పక్కనకాని ఉంచాలి. తరువాత తలపైకి తిప్పి ఎడమ అరచేతిని చూడాలి. ఈ స్థితిలో 5,6 శ్వాసలు తీసుకొని తరువాత శ్వాస తీసుకుంటూ పైకి రావాలి. ఇదే విధంగా ఎడమవైపు చేసి సమస్థితికి రావాలి.
ప్రయోజనాలు : 1. కాలికండరాలకు బలం చేకూరుతుంది.

- చీలమండలు శక్తివంతం అవుతాయి.
- వెన్ను నొప్పి తగ్గుతుంది.
- జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.
- పిల్లలు ఎత్తు పెరుగుతారు.
- నడుము పక్కన కొవ్వు తగ్గి ఆకర్షణీయంగా కనబడతారు.
పరివృత త్రికోణాసన్: రెండు కాళ్లను వీలయినంత దూరం జరుపుతూ తివాచీపై నిల్చోవాలి. రెండు చేతులు భూమికి సమాంతరంగా అరచేతులు నేలను చూస్తున్నట్లు ఉంచాలి. శ్వాస విడుస్తూ నడుమును కుడివైపు తిప్పుతూ ఎడమ చేత్తో కుడిపాదం ను పట్టుకోవాలి. తరువాత తలను పైకెత్తి కుడి అరచేతిని చూస్తూ 5,6 శ్వాసలవరకు ఆసన స్థితిలో ఉండి మరలా శ్వాస తీసుకుంటూ సమస్థితికి రావాలి. ఇదేవిధంగా మరోవైపు చేయాలి.

ప్రయోజనాలు : 1. పొట్ట తగ్గుతుంది. 2. మూత్రపిండాలు ఆరోగ్యంగా తయారవుతాయి. 3. చేతులు కాళ్లు బలపడతాయి. 4. గూనితగ్గుతుంది. 5. మెడసన్నగా అవుతుంది. 6. కండరాల నొప్పులు తగ్గుతాయి.
విమానాసనము : విమాన రూపంలో ఆసన స్థితి ఉండటం వలన ఆ పేరు వచ్చింది. తివాచీపై సమస్థితిలో నిల్చొని రెండు చేతులను భుజాలకు సమాంతరంగా ప్రక్కకు చాచాలి. నెమ్మదిగా నడుము దగ్గర నుండి ముందుకు వంగుతూ ఎడమకాలు చక్కగా పైకి లేపాలి. ఈ స్థితి T ఆకారంను పోలి ఉంటుంది. శరీరము యొక్క బరువంతా కుడికాలుపై కేంద్రీకృతం అవుతుంది. నాలుగైదు శ్వాసం అనంతరం నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ సమాంతర స్థితికి వచ్చి ఈసారి కుడికాలును చక్కగా వెనక్కి చాచాలి. ఈ విధంగా రెండువైపులా చేయాలి.
ప్రయోజనాలు : 1. ఏకాగ్రత పెరుగుతుంది., 2. శరీరం తేలికగా ఉంటుంది. 3. కాలిపిక్కలు గట్టి పడతాయి. 4. శరీరము, మనసు నిశ్చలంగా ఉంటుంది.

రాకెట్ ఆసనము : ఈ ఆసనము రాకెట్ రూపంలో ఉంటుంది.
చేయు విధానం: రెండు కాళ్ళను దగ్గరగా ఉంచి, చేతులను పైకి చాచి నమస్కార ముద్రలో ఉంచాలి. నెమ్మదిగా నడుము నుండి ముందుకు వంగుతూ ఎడమకాలిని వెనకకు చాచాలి. చేతులను నమస్కార ముద్రలో చక్కగా చాచి ఉంచాలి. 4,5 శ్వాసల అనంతరం శ్వాసతీసుకుంటూ నిటారుగా పైకి రావాలి.
మరోసారి ముందుకు వంగుతూ ఈసారి కుడికాలిని చక్కగా వెనక్కి చాచాలి. ఈ విధంగా రెండు కాళ్ళతో చేయాలి.
ప్రయోజనాలు : 1. శరీరము, మనసు సమస్థితిలో ఉంటాయి.2. ఏకాగ్రత పెరుగుతుంది.
3. చేతులకు, కాళ్ళకు బలం చేకూరుతుంది. 4. పొట్ట తగ్గుతుంది. 5. కండరాలు గట్టి పడతాయి.
తెలుగులో సాహిత్యాన్ని పరిమళింప జేస్తూ వచ్చిన ‘పాలపిట్ట’ సాహిత్య మాస పత్రిక, గుడిపాటి గారి సంపాదకత్వంలో జనవరి, 2022తో పన్నెండేళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సాహిత్యం మీద అవ్యాజ్యమైన ప్రేమతో సాహిత్య మాసపత్రికను నిరాటంకంగా ఒక పుష్కరకాలాన్ని ప్రయాణింపజేసిన సాహిత్య ప్రేమికుడు గుడిపాటిని అభినందించాల్సిన విషయమే. పెద్ద పెద్ద సంస్థలు, ఆర్ధిక బలం వున్న యాజమాన్యాలు కూడా సాహిత్య సంబంధ పత్రికలను మూసివేసిన సందర్భాలలో, కరోనా మహమ్మారి లాంటి కల్లోల సమయంలో ఒక వ్యక్తి, ఒంటి చేత్తో, ఆర్ధిక వనరులకై సంఘర్షణపడుతూ, పాఠకుల చందాలపై ఆధారపడుతూ, పిడికెడు స్నేహితుల, హితైషుల సహాయం, విరాళాలపై నిలబడుతూ, పాలపిట్ట రెక్కలను విప్పార్చుతూ సాహితీ వినీలాకాశ వైశాల్యాన్ని పెంచుకోగల నిబ్బరాన్ని కలిగిన వాడిగా దర్శనమిచ్చే గుడిపాటిలో కేవలం సంపాదకుడే కాదు, ఒక కవి, ఒక విమర్శకుడు ఒక వ్యాసకర్త , విశ్లేషకుడు కూడా వున్నాడు. ఉమ్మడి నల్లగొండ జిల్లా సూర్యాపేటలో జననం. సాధారణ మధ్య తరగతి కుటుంబం. ఎలాంటి సాహితీవాసనలు లేని కుటుంబ నేపథ్యం ఐనా గుడిపాటిలో బహుముఖీనత కలిగిన వ్యక్తిత్వాన్ని స్వంతం చేసుకున్న దార్శనికుడు కనబడతాడు. జర్నలిజం పై మమకారం, సాహిత్యం పై ఆసక్తి , వార్త ఆదివారం పత్రికకు ఎడిటర్ గా, నవతెలంగాణ దినపత్రికలో అసిస్టెంట్ ఎడిటర్ గా విశేషమైన అనుభవం, జర్నలిజం, సాహిత్యపరమైన అనేక విషయాల్లో అపారమైన పరిజ్ఞానం, అవగాహనతో పాలపిట్టను ఫిబ్రవరి 2010 ప్రారంభ సంచికగా ఆవిష్కరించారు. పత్రిక నడపడం అంత సులువైన పని కాదు. అభిరుచి, ఇష్టం వేరు, సృజనతో ముడిపడిన ఒక non – commercial subject ను నడిపించడంలో ఎదురయ్యే కష్టాలు వేరు. పత్రిక ప్రారంభ మయ్యాక మూడేళ్లపాటు ఆగకుండా ప్రయాణం కొనసాగింది. అనేకమైన విలక్షణ సంచికలనందించింది. సంచిక లోపలి బ్లాక్ అండ్ వైట్ పేజీలు 80 , మల్టీ కలర్ కవర్ పేజీలు నాలుగు మొత్తం 84 పేజీలతో పత్రిక పాలరాతి మెరుపు, నునుపు వంటి మ్యాప్ లితో అచ్చవుతూ ఆకర్షణీయంగా వచ్చింది. వస్తున్నది. మార్చి, 2010 లో మహిళా ప్రత్యేక సంచికగా 120 పేజీలతో వెలువడింది . అలాగే ఏప్రిల్, 2010 లో గోరటి వెంకన్న ప్రత్యేక సంచిక 100 పేజీలతో, మే ,2010 సామల సదాశివ ప్రత్యేక సంచికగా , జూన్, 2010 బండి నారాయణ స్వామి ప్రత్యేక సంచికగా వెలువడినాయి. సాహిత్యంలో తమదైన ప్రత్యేక శైలి , కంఠ స్వరంతో ప్రత్యేక ముద్ర కనబరిచే సాహితీవేత్తల రచనా విశేషణాలతో వచ్చిన సంచికలు ఇవి. వీటికి విభిన్న వర్గాల నుంచి మంచి ఆదరణ వచ్చింది. అలానే జులై, 2010 సంచిక సంగీత శిఖరమైన మంగళంపల్లి బాలమురళీ కృష్ణ మీద వచ్చింది. కాళోజి శత జయంతి సందర్భంగా ప్రముఖ సినీ దర్శకులు బి. నర్సింగరావు గారి గౌరవ సంపాదకత్వంలో సెప్టెంబర్, 2013 లో 120 పేజీలతో కాళోజి ప్రత్యేక సంచిక వెలువడింది . ఇలాంటి విశేష సంచికలు వెలుగులోకి రావడానికి సాహితీ మిత్రుల సహకారం , ప్రోత్సాహం అభినందించదగినది .
2014-15 సంవత్సర కాలం ఆర్ధిక వనరుల కొరత కారణంగా ఈ ఏడాదిలో ఆరు సంచికలు మాత్రమే వచ్చినా, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సందర్భాన్ని పురష్కరించుకొని తెలంగాణ ప్రత్యేక సంచికగా 160 పేజీలతో ఫిబ్రవరి -మార్చి 2014 లో వచ్చింది. తెలంగాణాకు సంబంధిన పలు విషయాలను అందించిన తెలంగాణ ప్రత్యేక సంచికగా కేవలం పాలపిట్ట మాత్రమే వెలుగు చూడటం గమనించాల్సిన విషయం.
కోవిడ్ -19 ప్రభావం కారణంగా మన రాష్ట్రం, దేశమే కాదు యావత్ప్రపంచం అల్లకల్లోలానికి గురైంది. ప్రజల జీవన శైలి మీద తీవ్రమైన ప్రభావం పడింది. వైద్యం, ఫార్మసీ లాంటి సంస్థలు/రంగాలు మినహా అన్ని రంగాలు కుదేలైపోయాయి. కోవిడ్-19 ప్రభావం సాహిత్యరంగం మీద పడి అచ్చులో వచ్చే తెలుగు సాహిత్య పత్రికలన్నీ చాలా వరకు అంతర్థానమయ్యాయి. కొత్త పత్రికలు వెబ్ మ్యాగజైన్లుగా , ‘ఆన్ లైన్ ‘ పత్రికలుగా దర్శనమిచ్చినా మచ్చుకు కొన్ని పత్రికలు అచ్చులో రాసాగాయి, అందులో ‘పాలపిట్ట ‘ సాహిత్య మాస పత్రిక ఒకటి . సిసలైన సృజనకు వేదికగా వుంటూ, ప్రమాణాలు పాటిస్తూ అనేక ఒత్తిళ్ల నడుమ తన ఉనికిని, అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్నది. అందుకు సంపాదకుడిగా గుడిపాటి గారి సంకల్ప బలం పునాది రాయి వంటిది. కరోనా తీవ్రత కారణంగా ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో దాదాపుగా అన్ని కార్యాలయాలతో పాటు ప్రెస్సులు మూతపడటంతో పాలపిట్ట ఫిబ్రవరి, 2020 సంచిక నుండి కొన్ని నెలలు పి డి ఎఫ్ కాపీలు చేసి వందలాది మందికి పంపించడం జరిగింది. ఇందులో చందాదారులతో పాటు వందలాది పాఠకులు వున్నారు. ఫలితంగా ‘పాలపిట్ట’ అందరికి అందుబాటులో వుండి పాఠకుల సంఖ్య పెరగడంతో పాటు అందరి నుండి మంచి స్పందన వచ్చింది. దీనితో పాఠకుల సంఖ్య పెరగడం తదనుగుణంగా చందాదారుల సంఖ్య కూడా పెరగడంతో ప్రతికూల పరిస్థితుల్లోనూ నిలబడాలన్న పట్టుదల పెరగడం గుడిపాటి గారి సంకల్పానికి మరో నిదర్శనం .
మే, 2020 సంచిక లాక్ డౌన్ సమయంలో విల్సన్ రావు కొమ్మవరపు ప్రత్యేక సంచికగా వచ్చింది. ఆ తర్వాత వరసగా సంచికలు వచ్చాయి. కరోనా మహామ్మారి సమయం లాక్ డౌన్ లో కూడా సంచికలు రావడం, పి డి ఎఫ్ రూపంలో పాఠకులందరికి అందుబాటులో ఉండటంచేత, పాత వారితో పాటు కొత్త పాఠకులు, యువ రచయితలూ, రచయిత్రులు, పరిశోధక విద్యార్థులు కూడా పాలపిట్ట సభ్యులుగా చేరడంతో, పాలపిట్ట రెక్కలకు కొత్త ఉత్తేజo, బలo అంది వచ్చాయి. అలా ఎన్నో ఒడిదుడుకులను అధిగమిస్తూ ఈ పన్నెండేళ్ల ప్రయాణంలో మొత్తం 116 సంచికలు వెలుగు చూసాయి. ప్రతి సంచిక, ప్రత్యేక సంచికలు సాహిత్య విషయాలతో పరిపుష్ఠిగా వచ్చాయనటంలో సందేహం లేదు. సంపాదకుల సంకల్పబలం ఎంతగా వున్నా నిజానికి ఆయా కాలాల, సమాజాల అవసరాలు వ్యక్తుల, సంస్థల, పత్రికల ఉనికికి, మనుగడకు తోడ్పడతాయి. తెలుగు సమాజానికి, తెలుగు సాహిత్యం అవసరం ఉన్నందుకే ‘పాలపిట్ట’ ప్రయాణం కొనసాగుతున్నది .
విభిన్న సాహితీ ప్రక్రియలకు, విభిన్న అస్తిత్వాలకు వేదికగా వుంటూ తనదైన ముద్ర వేసుకుంది. కవితలు కథలు, విమర్శ, సమీక్షా వ్యాసాలూ, సీరియళ్లు, ప్రముఖ సాహితీ వేత్తల ఇంటర్వ్యూ లు/ముఖాముఖి సంభాషణలు తెలుగు సాహిత్యానికి వారందించిన ఆదాన ప్రదానాలు ఇలా అనేక అంశాలతో సాధారణ పాఠకులకే కాదు తెలుగు ఉపాధ్యాయులకు, పరిశోధక విద్యార్థులకు (Research Scholars) కూడా ఉపయోగకరంగా ఉంటాయి. అందమైన ముఖచిత్రంతో, సాహిత్య విషయాల పరిపుష్టితో వస్తున్న ‘పాలపిట్ట’ సదా సచేతనంగా, క్రియాశీలంగా, సృజనశీలుర ఆదరణతో, సాహితీ వినీలాకాశంలో ఎగరాలని ఆకాంక్షిస్తూ సంపాదకులు గుడిపాటి గారికి ఈ పుష్కరయానం పూర్తిచేసుకున్న సందర్భంగా అభినందిస్తూ… పాలపిట్ట ప్రయాణం ఆగకుండా సాహితీ వైదగ్ధ్యంతో సంపద్వంతంగా కొనసాగాలని ఆశిస్తూ, శుభాకాంక్షలతో…
భగవంతుడు అన్నిచోట్లా ఉండలేడు కాబట్టి తల్లిని సృష్టించాడు. ముల్లోకములలో తల్లి కంటే శ్రేష్టమైన వారు ఎవ్వరూ లేరు. గాయత్రిని మించిన మంత్రము లేదు, గంగను మించిన తీర్థము లేదు, విష్ణువును మించిన ప్రభువు లేడు, శివుణ్ణి మించిన పూజ్యుడు లేడు. తల్లిని మించిన దైవమూ లేదు.

ధర్మం మూర్తీభవించిన శ్రీరాముణ్ణి తీర్చిదిద్దింది తల్లి కౌసల్యే, లవకుశులు వీరులుగా, శూరులుగా, పరాక్రమశీలురుగా తయారైంది తల్లి సీతమ్మ పర్యవేక్షణలోనే. కాలినడకన ఆసేతు హిమాచలం పర్యటించి, అద్వైత సిద్ధాంతాన్ని బోధించి, దేశ సమైక్యతను, సమగ్రతను కాపాడిన ఆదిశంకరులు కూడ తల్లి ఆర్యమాంబ ఒడిలోనే పెరిగి పెద్దవాడయ్యాడు. భారత జాతికి గర్వకారణమైన వీరుడుగా, శూరుడుగా, పేరు ప్రఖ్యాతుల నందుకొనిన వీర శివాజీ తనతల్లి జిజియాబాయి చేతులలోనే పెరిగి పెద్దవాడయ్యాడు. ఒక సామాన్యమైన బాలునిలో నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, దేశభక్తి భావాలను నాటి పెంచి, పోషించి గాంధీజీని మహాత్మునిగా రూపొందించ గలిగింది ఆయన మాతృమూర్తి పుత్లీభాయి.
ఇలా చెప్పుకుంటూ పోతే… మనదేశానికి భారతదేశమని పేరురావటానికి కారణమైన భరతుని పెంచి పెద్దచేసినది, తల్లి – శకుంతల.
ఆరు సంవత్సరాల బాలుణ్ణి ప్రోత్సహించి, విష్ణు దర్శనం చేయించి ధృవమండలంలో శాశ్వితంగా వెలుగొందే స్థానానికి చేర్చినది, తల్లి – సునీతి.
ఇంద్రుణ్ణి ఓడించి అమృత భాండాన్ని భువికి తెచ్చేంత వీరునిగా గరుత్మంతుణ్ణి పెంచినది, తల్లి – వినతాదేవి.
ప్రహ్లాదుణ్ణి అనన్య విష్ణు భక్తునిగా చేసినది, తల్లి – లీలావతి

హనుమంతుణ్ణి పెంచి పెద్దచేసి అనన్య సామాన్యునిగా చేసినది, తల్లి – అంజనాదేవి.
భీష్ముడిని పెంచి పెద్దచేసి వివేక సంపన్నుడిగా తీర్చిదిద్దినది, తల్లి – గంగాదేవి.
పాండవుల వంటి ధీరులకు జన్మనిచ్చిన తల్లి – కుంతీదేవి.
శాతకర్ణిని, మహోన్నత చక్రవర్తిగా మలిచింది తల్లి – గౌతమీదేవి.
ఇలా, ప్రపంచ చరిత్రను నిశితంగా పరిశీలిస్తే, ఒక వాస్తవం తేటతెల్లమౌతుంది. సింహాసనంపై ఉన్న రాజుకు మించిన శక్తి తల్లులకు ఉంటుంది. ఊయల ఊపే చేతులకు ప్రపంచాన్ని శాసించే శక్తి ఉంది. జాతి గర్వించదగిన వీరులను, శూరులను, మహనీయులను, మహాపురుషులను, ప్రవక్తలను, సంఘసంస్కర్తలు, జ్ఞానులను, యోగులను రూపుదిద్దగల్గిన శిల్పులు మాతృమూర్తులేనని స్పష్టమవుతున్నది.
‘మాతృదేవోభవ’ అని చెప్పి స్త్రీ మూర్తికి మొట్టమొదటి పెద్ద పీటవేసిన వాజ్ఞ్మయం మన సొంతం. యత్రనార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అని నొక్కి వక్కాణించే ధర్మం మనది. ఈ పవిత్ర భారతదేశంలో తల్లిని దైవంగా భావించి, ఆరాధించి, ఆనందించే సంప్రదాయం ఉంది. తల్లి , తండ్రి, గురువు – ఈ ముగ్గురూ జంగమ దేవతలు. అనగా నడిచే దేవుళ్ళు. ‘అరవై సంవత్సరాలు దాటిన వృద్ధుడైనా, తల్లి బ్రతికి ఉన్న వాడైతే పసిబాలుడే. ఐదు సంవత్సరాల బాలుడైనా తల్లి లేనివాడైతే వృద్ధుడే.’ ఇది స్కాందపురాణంలో చెప్పిన మాట.
మాతృ దినోత్సవ నేపథ్యం

అంతర్జాతీయ మాతృ దినోత్సవం… కని, పెంచిన తల్లి గొప్పతనాన్ని గుర్తుతెచ్చుకోవడం కోసం ప్రతి సంవత్సరం మే నెలలోని రెండవ ఆదివారం నాడు జరుపుకుంటారు. ‘మదర్ ఆఫ్ గాడ్స్’ గా పిలువబడుతున్న రియా దేవతకు నివాళి అర్పించే నేపథ్యంలో ఈ ఉత్సవాన్ని మొదటిసారిగా గ్రీస్ దేశంలో నిర్వహించడం జరిగింది. తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా భావిస్తూ, ఆదరించే సంప్రదాయం మన దేశంలో అనాదిగా ఉంది. పాశ్చాత్య దేశాలలో పిల్లలు ఎదగగానే తల్లిదండ్రులను వదిలిపెట్టి స్వతంత్రంగా జీవించడం ప్రారంభిస్తారు. అలాంటి సందర్భంలో అమ్మను రోజూ చూసుకునే పరిస్థితులు లేకపోవడంతో, అమ్మకోసం ఒక్కరోజును కేటాయించాలని’ మాతృ దినోత్సవం’ ను ఏర్పాటుచేయటం జరిగింది.
మన దేశంలోనూ కొలువు కోసం పొరుగు దేశాలకూ, దూర ప్రాంతాలకూ వెళ్ళేవారు ఇటీవల అధికమయ్యారు. ఉద్యోగాలు చేసే మహిళలూ నానాటికీ పెరిగిపోతున్నారు. తమ ఇంట్లో పెద్దవారు లేని మహిళా ఉద్యోగినులు, వారి పిల్లలను డే కేర్ సెంటర్ లలో వదిలి ఆఫీసులకు వెళుతున్నారు. అక్కడ ఆయాలే పిల్లల ఆలనా పాలనా చూస్తున్నారు. పరాయి చేతుల్లో కిరాయి పెంపకాలు ఐనాయి. ఉన్నత చదువులకోసం, ఉద్యోగాలకోసం పిల్లలు తల్లికి దూరంగా పెరుగుతున్నారు… అలా, నేటి తరం పిల్లలకు మాతృత్వపు మమకారం కరువైంది.
మన దేశంలో, ప్రతీ రోజూ మాతృ దినోత్సవమే, ఇందుకు ప్రత్యేకంగా ఒక రోజు అవసరమా! అని ఆశ్చర్యపోయే వారున్నారు. అలాగే, భారతీయ సమాజంలోనూ, తల్లికి దూరంగా ఉంటున్నవారి సంఖ్య క్రమక్రమంగా పెరగటంతో ‘అవసరమే’ అని సమర్థించే వారూ ఉన్నారు. ‘చిన్నప్పుడు మీరు, నన్ను హాస్టల్ లో వేశారు కదా! ఇప్పుడు నేను మిమ్మల్ని హాస్టల్ (వృద్ధాశ్రమం) లో వేస్తాను’ అని సేవ చేయకుండా, తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలలో ఉంచే ప్రబుద్ధులూ ఉన్నారు. అనుబంధాలు వేరు, ఆర్థిక బంధాలు వేరు… అనుబంధాల స్థానాన్ని ఆర్థికబంధాలు ఆక్రమించినప్పుడు సార్థక జీవనానికి స్థానం లోపిస్తుంది.
ఇక ఈ మాతృ దినోత్సవం వెనుక దాగి వున్న అసలు కథ ఏమిటో ఒకసారి చూద్దాం…
ఈస్టర్ కి ముందు నలభైరోజులను ‘లెంట్ రోజులుగా’ పరిగణిస్తారు. 17 వ శతాబ్దంలో ఇంగ్లండులో నలభై రోజులలోని నాలుగవ ఆదివారంనాడు తల్లులకు గౌరవ పూర్వకంగా ‘మదరింగ్ సండే’ పేరిట ఉత్సవాలు జరిపేవారు. 1872 లో అమెరికాలో జూలియావర్డ్ హోవే అనే మహిళ తొలిసారిగా ప్రపంచశాంతి కోసం మాతృ దినోత్సవం నిర్వహించాలని ప్రతిపాదించి, ఇందుకు గాను ఆమె బోస్టన్ లో సమావేశాలను కూడా ఏర్పాటు చేయటం జరిగింది. సివిల్ వార్ గాయాల స్మృతులను చెరిగిపోయేలా చేసేందుకు ‘మదర్స్ ఫ్రెండ్ షిప్’ డే నిర్వహించిన అన్నా మేరీ జెర్విస్ అనే మహిళ 1905 మే 9 న చనిపోయింది. ఆవిడ కూతురైన మిస్జెర్విస్ మాతృ దినోత్సవం నిర్వహించాలని బాగా ప్రచారం చేయడంతోపాటు, తన తల్లి రెండవ వర్థంతి సందర్భంగా మే నెలలోని రెండవ ఆదివారంనాడు ‘మాతృ దినోత్సవం’ ను నిర్వహించింది. అమెరికాలోనే తొలిసారిగా 1910 లో వర్జీనియా రాష్ట్రంలో ఈ దినోత్సవాన్ని జరపగా, జెర్విస్ చేసిన ప్రచారం ఫలితంగా 1911 నాటికి అమెరికాలోని అన్ని రాష్ట్రాలలో ఈ దినోత్సవం జరపడం సంప్రదాయంగా మారింది. 1914 లో నాటి అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ ‘మాతృ దినోత్సవం’ ను అధికారికంగా జరపాలని నిర్ణయించడంతోపాటూ, ఆ రోజును జాతీయ సెలవుదినంగా ప్రకటించాడు. కాలక్రమేణా ప్రపంచమంతా వ్యాపించి ప్రతి సంవత్సరం మే నెల రెండో ఆదివారం మాతృదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.
అమ్మ త్యాగం

తల్లి నవమాసాలూ మోసి సంతానాన్ని కంటుంది. నవమాసాలూ నిండే వరకూ, గర్భస్థ శిశువును మోస్తూ ఉంటుంది. ఆ బరువు… నెత్తిమీద ఉంటే, అలసిపోయినప్పుడు కిందికి దించుకోవచ్చును. కానీ ఇది అలా కాదు, ప్రసవం అయ్యేవరకూ మోయవలసిందే.
తరువాత ప్రసవ వేదన అనుభవించి, తల్లి శిశువుకి జన్మనిస్తుంది. ప్రతీ ప్రసవమూ స్త్రీకి పునర్జన్మ. పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవవేదనను మరిచిపోతుంది. అమృతం ఆయుష్సును పోస్తుందో లేదో తెలీదుగానీ.. ‘అమ్మ’ మాత్రం, తన ఆయుష్సును సైతం బిడ్డకే అందిస్తుంది. శిశువు జన్మించిన పిదప తన రక్తాన్ని పాలుగా మార్చి శిశువును పోషిస్తుంది. తొలి మూడు నెలలూ నిద్రలేని అలసటను, తన బిడ్డ బోసినవ్వుల చూసి మరిచిపోతుంది. మాలమూత్రాలనూ శుభ్రపరుస్తుంది. నిద్ర పుచ్చటం కోసం జోల పాడుతుంది. ప్రథమ గురువుగా మాటలు నేర్పుతుంది. అమ్మ ఆది గురువు. అమ్మ ఒడే మొదటి బడి. “నాస్తి మాతృసమః గురుః అని వేద వ్యాసుడు పలికాడు. అనగా తల్లిని మించిన గురువెవరూ లేరు. తన బిడ్డ బాగుకోసం కోటి దేవతలకు మొక్కుతుంది. తన త్యాగపు పునాదులపైన మన బతుకు సౌధాన్ని నిర్మిస్తుంది మాతృమూర్తి.
ప్రపంచానికి నిన్ను… నీకు ప్రపంచాన్ని… పరిచయం చేస్తుంది అమ్మ. శిశువుకు పుట్టిన క్షణం నుండి, ఆ శిశువుకు తల్లి ఎవరో ఎవరో తెలుసు. కానీ, తండ్రి ఎవరో, తల్లి చెబితేనే తెలుస్తుంది. అందుకేనేమో, తల్లిదండ్రులు ఇరువురూ ఎదురుగా ఉన్నప్పుడు ముందుగా తల్లికి నమస్కరించి, ఆతరువాతే తండ్రికి నమస్కరించాలి అని పెద్దలు చెబుతారు.
అన్నం కలిపి గోరు ముద్ద పెట్టేప్పుడు, తన బిడ్డపై ఉన్న ప్రేమ కూడా కలిపి పెడుతుంది. ఆ బిడ్డ ఎంతో ఇష్టంగా ఆ ముద్దలు తింటుంటే… ఆ బిడ్డ కడుపు నిండుతుందో లేదో కానీ, ఆ తల్లి కడుపు ఆనందంతో నిండిపోతుంది. అదీ.. అమ్మ ప్రేమంటే.
భీమసేనుడు బాగా తినగలవాడు. ఎవరు ఎంత పెట్టినా అతని కడుపు నిండేది కాదు. తల్లి ఐన కుంతీదేవి చేతిముద్ద ఒకటి తింటే చాలు కడుపు నిండిపోయేది. పొట్ట నిమురుకుంటూ… తేన్చుకుంటూ… తృప్తిగా వెళ్ళేవాడు.
తినడానికి రెండు రొట్టెలే ఉన్నాయి. తినేవారు ముగ్గురున్నారు. ఈ సందర్భంలో … ‘నాకు ఆకలిగా లేదు, మీరు తినండి’ అని ఆ రెండు రొట్టెలనూ ఇచ్చి వారి తృ ప్తీ, సంతోషంలోనే… తన తృప్తినీ, ఆనందాన్ని పొందే అమృతమూర్తే అమ్మ. బిడ్డల కడుపు నిండితే, అమ్మకు తేన్పు వస్తుంది.
తల్లి తన పిల్లల చేతిని పట్టుకొని నడిపిస్తుంది. కొంతకాలం తర్వాత, పట్టుకున్న చేతిని వదిలేస్తుందేమో కానీ తన హృదయంలోని ప్రేమను మాత్రం ఎప్పటికీ వదిలివేయదు. తల్లి ప్రేమ వర్ణింప నలవికానిది. ఊహించటానికి వీలులేనిది. అపారమైనది, అవ్యాజమైనది.
రాయి తగిలి పడబోయినప్పుడు, ముల్లు గుచ్చుకున్నపుడు, అనుకోని బాధ కలిగినప్పుడు, ఆపద సమయంలోనూ ‘అమ్మా’ అనే మాటే ముందొస్తుంది. దేవుడిని స్మరించినా ఆ తర్వాతే.
ఈ భూమిపై మనిషిగా మనం చేయగలిగిన అత్యుత్తమమైన విధులలో, పిల్లలను ఉత్తమమైన పౌరులుగా తీర్చిదిద్దడం అతి ముఖ్యమైనది. ఈ పని తల్లులు సమర్ధవంతంగా చేయగలరు… నేటి సామాజిక పరిస్తితులలో అది కొరవడడం వల్లనే అన్ని సమస్యలూ ఉత్పన్నమవుతున్నాయి. పిల్లలను ఎలా తీర్చిదిద్దాలి అంటే…
రాజవత్ పంచవర్షాణి, దశ వర్షాణి దాసవత్,
ప్రాప్తే తు షోడశే వర్షే, పుత్రం మిత్రవదాచరేత్.
రాజవత్ పంచవర్షాణి – అంటే పిల్లల్ని అయిదేళ్లవరకు రాజ మర్యాదలతో పెంచాలి.అంటే వారికీ స్నానం చేయించడం, గోరుముద్దలు తినిపించడం, ఆటలు ఆడించడం, జోలపాడి నిద్ర పుచ్చడం, వారిని కంటికి రెప్పలాగా కాపాడడం, వంటి సమస్త సేవలూ వారికీ చేయవలిసిందే.
దశ వర్షాణి దాసవత్ – అంటే పదేళ్లు వచ్చే వరకు దాసులుగా పెంచాలి. వారికీ పనులు చెప్పడం, పనులు నేర్పడం, ఇంటి పనులు, బయట పనులు వారికి తగ్గట్టుగా అప్పగించాలి. పనుల్లో వారి సహకారం తీసుకోవాలి. చిన్నవాళ్లు కదా, వారికి ఏం వస్తుంది అని అనుకోకండి, ఆ వయస్సులో పిల్లలు చాల బాగా నేర్చుకుంటారు . జీవితంలో అది ఒక ముఖ్యమైన దశ అని గుర్తు పెట్టుకోండి.
ప్రాప్తే తు షోడశే వర్షే, పుత్రం మిత్రవదాచరేత్ – అంటే పదహారేళ్ల వయస్సు వచ్చాక వారిని మీ మిత్రులుగా చూడాలి. ఆ వయస్సులో వారిని మిత్రులుగా చూస్తేనే, వారు ప్రతీ విషయం మీతో పంచుకుంటారు. మీ సలహాలు, సూచనలు పాటిస్తారు. చెడు మార్గంలో వెళ్ళకుండా కాపాడుకోవడానికి ఇది ఒక ఉత్తమ విధానము అని చెప్పాలి . ఇది పుత్రుడు, పుత్రికలు ఇద్దరికీ వర్తిస్తుంది.
లాలయేత్ పంచవర్షాణి, దశ వర్షాణి తాడయేత్,
ప్రాప్తేతు షోడశే వర్షే, పుత్రం మిత్రవదాచరేత్.
పిల్లల్ని, అయిదేళ్లు వచ్చేవరకూ లాలించి, వాత్సల్యం చూపించాలి. ఆ తర్వాత పదేళ్లు, పిల్లలను మంచి మార్గంలో నడిపించే విషయంలో దండించటానికీ వెనకాడకూడదు. పదహారేళ్లు రాగానే సంతానంతో మిత్రుడిలా మెలగాలి.
తల్లిదండ్రుల ప్రాధాన్యత
గణాధిపత్యం:
ఒకనాడు దేవతలు, ఋషులు, పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇమ్మని కోరారు. గజాననుడు తాను జ్యేష్ఠుడను గనుక ఆధిపత్యం తనకు ఇమ్మని కోరాడు. తనకే ఆధిపత్యం ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని వేడుకున్నాడు. అందుకు శివుడు తన కుమారులనుద్దేశించి ‘మీ ఇరువురిలో ఎవరు ముల్లోకములలోని పవిత్ర నదులన్నింటిలో స్నానం చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికే ఈ ఆధిపత్యం లభిస్తుందని చెప్పాడు.
ఆ మాటలు వినీ వినగానే కుమారస్వామి నెమలినెక్కి ఆ పనిమీద రివ్వున బయలుదేరాడు. కూమారస్వామి వాహనం నెమలి, చాలా వేగంగా వెళుతుంది, ఎగరగలదు కూడా. గణపతి వాహనం చిన్న ఎలుక, పైగా ఎగరలేదు. ఐనప్పటికీ గణపతి ఏమాత్రం దిగులు చెందకుండా, తాపీగా నడుచుకుంటూ… తన తల్లిదండ్రుల ముందుకు వెళ్ళి, చేతులు జోడించి నమస్కరించి “జననీజనకులారా! ఈ లోకంలో ఎవరైనా భక్తితో వారి తల్లిదండ్రుల చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేస్తే, వారు ముల్లోకాల్లోని మూడుకోట్ల యాభైలక్షల పుణ్యతీర్ధాల్లో స్నానం చేసిన పుణ్యం పొందుతారని వేదశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. కనుక వేదమూర్తులు, నా తల్లిదండ్రులైన మీ చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నానని చెప్పి, గణపతి మూడు ప్రదక్షిణలు చేయగా, కుమారస్వామి మూడు లోకాల్లో ఏ నదికి వెళ్ళినా, ప్రతీ నదిదగ్గర గణపతి తనకంటే ముందు స్నానం చేసి, వెళ్ళిపోవడం చూశాడు. ఆఖరి స్నానం కూడా పూర్తిచేసి, ఎంతో ఆశ్చర్యంగా కుమారస్వామి కైలాసంలోని తండ్రి దగ్గరికి వెళ్ళేసరికి గణపతి కనిపించాడు. అప్పుడు షణ్ముకుడు ‘నాన్నగారూ! అన్నగారి మహిమ నాకు తెలియలేదు. నాకు అన్నగారే ఒకప్పుడు మయూర వాహనం ఇచ్చారు. బుద్ధిలో అన్నయ్యే నాకంటే అధికం… నా కన్నా అన్నయ్యే అన్ని విధాలా సమర్ధుడు… కనుక గజాననుడినే గణాధిపతిని చేయండి’ అన్నాడు. ఈ ప్రకారం భాద్రపద శుద్ధ చవితినాడు పరమేశ్వరుడు గజాననుడికి గణాధిపత్యం వేడుకని జరిపించాడు.

ఈ వృత్తాంతం ద్వారా గణపతి లోకానికి తల్లిదండ్రుల విలువను చాటి చెప్పారు. ఎన్నో తీర్ధాలు, పుణ్యక్షేత్రాలు దర్శించడం కంటే… తల్లితండ్రులని సేవించిన పిల్లలే ఉన్నతిని పొందుతారని తెలియచెప్పటమే గణాధిపత్యపు పోటీ ముఖ్యఉద్దేశ్యం.
తల్లి పట్ల గౌరవం
మాతృవందనం:
ఆదిశంకరాచార్యులవారు సన్యాసాశ్రమం స్వీకరించి, తన ఆప్తులందరినీ త్యజించి వేళ్ళే ముందు తల్లి ఆర్యమాంబ చాలా బాధ పడింది. “శంకరా, నువ్వు నాకు ఏకైక పుత్రుడువి కదా! నన్ను వదలి వెళ్ళి పోతున్నావు, ఆఖరి క్షణాల్లో నాకంటూ ఎవరున్నారు? నాకు దిక్కెవరు?” అని దీనంగా ప్రశ్నించింది.
“అమ్మా! ఏ సమయమైనా సరే, నీవు తల్చుకుంటే చాలు, నీ ముందు వుంటాను.” అన్నాడు శంకరుడు.
కొంతకాలం గడచిపోయింది… భగవత్పాదులు శంకరాచార్యులవారి తల్లికి అంతిమ ఘడియలు సమీపించాయి. మూసిన కళ్ళు తెరవనేలేదు. “నేను తలచిన వెంటనే వస్తానన్నాడే శంకరుడు” అని మనసులోనే తలుచుకుంటూ వున్నది ఆర్యమాంబ.
తల్లి తలచుకుంటున్నదన్న విషయం ఆదిశంకరులు గ్రహించారు… వెంటనే శ్రీకృష్ణుని ధ్యానించారు… శ్రీకృష్ణుడు ఏం కావాలని అడిగాడు. కురుపితామహుడు భీష్మాచార్యునికి మోక్షమిచ్చినట్లుగా, నా మాతృమూర్తికి మోక్షం ప్రసాదించమని వేడుకున్నారు శంకరాచార్యులవారు.
‘తలుచుకుంటేనే శంకరుడు వస్తానన్నాడే’ అని ఆర్యమాంబ తపిస్తున్నప్పుడు, అక్కడికి ఎవరో వస్తున్న అలికిడయింది. కళ్ళు కూడా తెరవలేని స్థితిలో వున్న ఆర్యమాంబ చటుక్కున లేచి… శంకరా! అంటూ, అక్కడికి వచ్చిన ఒక పసిబాలుని, గట్టిగా హృదయానికి హత్తుకుంది. బాలుని ఒంటి నిండా ఆభరణాలను గమనించిన ఆర్యమాంబ, శంకరుడు సన్యాసి కదా! ఈ ఆభరణాలు ఎలావచ్చాయని అనుకున్నది. బరువెక్కిన కనురెప్పలను మెల్లిగా తెరచి చూసింది ఆర్యమాంబ. అక్కడ తను అనునిత్యమూ పూజించే గురువాయూరు శ్రీకృష్ణుడు సాక్షాత్కరించి నిలిచివుండడం గమనించింది.
గురువాయూరప్పని చూసిన ఆర్యమాంబ మహదానందంతో “అప్పా! నోరు తెరిచి, నీ నామజపం చేసే శక్తి కూడా లేని ఈ దీనురాలిని ఆఖరిక్షణాలలో చూసేందుకు వచ్చావా? కృష్ణా ” అని మెల్లిగా గధ్గదస్వరంతో పలికింది.
శ్రీకృష్ణుడు వెంటనే “నీ పుత్రుని ఆదేశం. రాకుండా వుండగలనా? అమ్మను చూడకుండా వుండగలనా?” అని చిరునవ్వులు చిందిస్తూ అన్నాడు.
అదే సమయానికి శంకరాచార్యులవారు కూడా అక్కడికి వచ్చారు. ఉప్పొంగిన ఆనందంతో, ఆ మాతృమూర్తి శంకరునితో… “నాయనా! నా భాగ్యమేమని చెప్పను? నిన్ను పుత్రునిగా పొంది నేను తరించాను. సాక్షాత్తూ శ్రీకృష్ణ భగవానుడినే నా ముందు నిలబెట్టావుకదా, శంకరా!” అంటూ ఆనందభాష్పాలు కార్చింది.
గోపాలుని నేను నిలబెట్టడమేమిటి? నేను జన్మించినది మొదలు నీవు నా కోసం పడిన శ్రమకు, నాపై కురిపించిన ప్రేమకు బదులుగా నేనేమీ చేయలేకపోయాను. సాక్షాత్తూ భగవంతుడే మానవరూపంలో పుట్టినా… మాతృ ప్రేమకు సాటిగా, ఎంతటి సేవచేసినా… కన్నతల్లి ఋణం అణువంతైనా తీరదు. నేనైనా అంతే. నేను చేయగలిగినదంతా నీ దివ్య చరణాలకు హృదయపూర్వకమైన సాష్టాంగ ప్రణామం ఒక్కటే. అని మాతృదేవత పాదాలపై మోకరిల్లారు ఆదిశంకరాచార్యులవారు.
ఇదంతా నిజంగానే జరిగిందా? లేదా? అనే సందేహాన్ని వదిలి, సందేశాన్ని మాత్రమే చూడాలి. అద్భుతమైన సందేశం ఉన్నప్పుడు, అనవసరమైన సందేహాలను వదిలివేయటం సమంజసమే. ఈ లోకంలో ఉన్న మానవ సంబంధాలన్నింటిలోనూ మాతృ సంబంధం ఎంతో ఘనిష్టమైనది, పవిత్రమైనది, విడదీయరానిది, త్యజింప వీలులేనిది. తల్లికి సంతానం పేగులో పేగు, రక్తంలో రక్తం. అటువంటి తల్లి ప్రతివ్యక్తికీ పూజనీయురాలు, వందనీయురాలు. సన్యాసం పుచ్చుకున్న వ్యక్తికి అందరూ సాష్టాంగ నమస్కారం చేయడం సంప్రదాయం. తండ్రి కూడా సన్యాసాశ్రమం స్వీకరించిన కుమారునికి సాష్టాంగ నమస్కారం చేయవలసిందే. కానీ, సన్యాసి మాత్రం తన తల్లికి నమస్కారం చేయాలి. తల్లితో ఉన్న సంబంధం అటువంటిది. అందుకే…
భూప్రదక్షిణ షట్కేన కాశీయాత్రా యుతేన చ,
సేతుస్నాన శతైర్యశ్చ తత్ఫలం మాతృవందనే.
ఆరుసార్లు భూప్రదక్షిణ చేసిన ఫలమూ, వెయ్యిసార్లు కాశీయాత్ర చేసిన ఫలమూ, వందసార్లు సముద్ర స్నానము చేసిన ఫలమూ … కేవలం, తల్లికి నమస్కరించటం వల్ల లభిస్తుంది.
పదిమంది ఉపాధ్యాయులకంటే ఆచార్యుడు గొప్పవాడు. వందమంది ఆచార్యుల కంటే తండ్రి గొప్పవాడు. ఆ తండ్రి కంటే వేయి రెట్లు గొప్పది జన్మనిచ్చిన తల్లి…
ఆదిశంకరాచార్యులవారు వారియొక్క తల్లిగారికి నమస్కరించటం లోని అంతరార్థమిదే. ప్రపంచానికి, ఈ సత్యాన్ని తెలియజేయటమే. తల్లి ప్రేమను, త్యాగాన్ని తెలియజేస్తూ శంకరాచార్యులవారు రచించిన ‘మాతృ పంచకం’ ప్రసిద్ధమైనది.
తల్లితో సమానమైన వ్యక్తులు
రాజపత్నీ గురోః పత్నీ, భ్రాతృపత్నీ తథైవ చ,
పత్ని మాత స్వమాతా చ, పంచైతాః మాతరః స్మృతాః.
అనగా… రాజు గారి భార్య, గురువు గారి భార్య, సోదరుని/ స్నేహితుని భార్య, భార్య తల్లి అనగా అత్తగారు మరియు తన యొక్క స్వంత తల్లి ఈ ఐదుగురినీ మాతృమూర్తులుగా భావించాలి. అనగా, ఈ ఐదుగురిని పూజ్యభావముతో తన స్వంత తల్లిని ఏ విధముగానైతే గౌరవిస్తారో అదే విధముగా సమ్మానముతోనూ, ఆదరముతోనూ గౌరవించాలి.
‘గురూణాం మాతా గరీయసీ’ అనేది చాణక్యుని నీతి వచనం. తల్లులందరిలోనూ, స్వంత తల్లి అందరికంటెనూ ఎక్కువ గొప్పది మరియు పూజ్యురాలు. ఇది ముమ్మాటికీ నిజం, ఆచరణీయం.
“ప్రపంచంలోని దేశదేశాల్ని చుట్టి, లక్షలాది మందిని కలిసినా అమ్మ వంటి అపురూప వ్యక్తి ఎక్కడా తారసపడలేదు. నేను సంపాదించిందంతా ఆమె చరణాల వద్ద పోసినా ఇంకా బాకీ పడతాను.” అని అమ్మ మీద తనకున్న ప్రేమను చాటుకున్నాడు చార్లీ చాప్లిన్.
“తల్లి పాదాల వద్ద స్వర్గం ఉంటుంది.” అని ఖురాన్ లో చెప్పబడింది.
అమ్మ భాష :
ప్రతివ్యక్తికి ప్రథమ గురువు మాతృమూర్తి. మాటలు నేర్పించడం, నడకలు నేర్పించడం అన్ని తల్లి ద్వారానే నేర్చుకుంటాం. భాష.. కేవలం భావాలు వ్యక్తం చేయడానికి ఉపయోగపడే సాధనమే కాదు, ఒక జాతి ఉనికిని, సంస్కృతిని మొత్తంగా జీవన విధానాన్నే పరిచయం చేస్తుంది.
మనిషి జీవితంలో మొదట నేర్చుకునే భాష మాతృభాష. తల్లి ఒడే బిడ్డకు తొలి బడి. తన తల్లిని ఎవరూ చెప్పకుండానే అమ్మా అని బిడ్డ ఎలా పిలుస్తాడో.. మాతృభాష కూడా అంతే. మాతృభాష సహజంగా అబ్బుతుంది. అప్రయత్నంగా వస్తుంది. అమ్మ మాటే మాతృభాష. అందుకే ప్రతి బిడ్డ అమ్మను కాపాడుకున్నట్టే మాతృభాషను కూడా కాపాడుకోవాలి. మనుగడ కోసం ఇతర భాషలను నేర్చుకోవడంలో తప్పులేదు. అయితే వాటి ప్రభావం మాతృభాషపై పడకుండా చూసుకోవాలి.
మాతృభాష కళ్ల వంటిది, ఆంగ్ల భాష కళ్లజోడు వంటిది.
ఖురాన్ లో తల్లిని గురించి
1. తల్లి పాదాల క్రింద స్వర్గం ఉంది.
2. తండ్రిని, తల్లిని ఆప్యాయంగా, దయతో చూడటం నిజమైన భక్తి.
3. తల్లిద౦డ్రుల స౦తృప్తిలోనే దేవుని స౦తృప్తి ఉ౦ది, వారి కోప౦లోనే ఆయన కోప౦ ఉ౦ది.
4. భగవంతుడు మీకు దీర్ఘాయుష్షు ప్రసాదించాలని మీరు కోరుకుంటే, మీ తల్లిదండ్రులను సంతోషపెట్టండి.
5. తల్లిదండ్రుల పట్ల అవిధేయత చూపడం మహాపాపం.
6. మీరు బిలియనీర్ కావచ్చు, కానీ మీ తల్లి మీకు ఇచ్చిన అనుగ్రహాన్ని, మీరు ఎప్పటికీ తిరిగి చెల్లించలేరు.
7. మీ తల్లి, అల్లాహ్ మీ కోసం తెరిచిన దయగల ద్వారం, దానిని మూయవద్దు.
8. మీ తల్లిదండ్రులపై మీకు కోపం వచ్చినప్పుడు, వారు లేని జీవితాన్ని ఊహించుకోండి.
9. మీ తల్లిపట్ల మీ కర్తవ్యాలను నిర్లక్ష్యం చేయవద్దు.
10. తల్లి ప్రేమ, అనుగ్రహాలు వెలకట్టలేనివి. నిజం ఏమిటంటే, మనం ఏమి చేసినా తల్లులు చూపించిన త్యాగం మరియు కరుణతో ఎప్పటికీ సమానం కాదు.
తల్లుల గురి౦చి క్రైస్తవ ఉల్లేఖనాలు
1. అమ్మా, నేను బతికి ఉన్నంత కాలం నువ్వు నన్ను ప్రేమించావని నాకు తెలుసు, కానీ నా జీవితమంతా నిన్ను ప్రేమించాను.
2. ప్రార్థి౦చే తల్లి తన పిల్లలపై పడే ముద్ర జీవితకాల౦గా ఉ౦టు౦ది. ప్రార్థనకు సమాధానం లభిస్తుంది.
3. మాతృత్వం అనేది దేవుడు కృప, విముక్తి, నవ్వు, కన్నీళ్లు మరియు అన్నిటికంటే ముఖ్యంగా ప్రేమతో కలిసి అల్లిన ఒక మిలియన్ చిన్న క్షణాలు.”
4. రాజద౦డంలో క౦టే తల్లి చేతిలో ఎక్కువ శక్తి ఉ౦టు౦ది.
5. తల్లి హృదయం పిల్లల తరగతి గది.
6. వృద్ధ స్త్రీలను నీ తల్లివలెనే చూడుము, నీ సొ౦త సహోదరీలవలె యౌవనస్థులను చూడుము.
7. మీ త౦డ్రిని, తల్లిని ఘనంగా చూసుకొనుము. మీకు మేలు కలుగునట్లును, భూమిమీద దీర్ఘాయుష్షును అనుభవి౦చునట్లును ఆశీర్వదించబడుతుంది.
8. తల్లి తన బిడ్డను ఓదార్చునట్లు నేను మిమ్మును ఓదార్చుదును.
9. నా కుమారుడా, నీ త౦డ్రి ఆజ్ఞను శిరసావహించు, నీ తల్లి బోధనను విడువకుము.
10. మీలో ప్రతి ఒక్కరూ మీ అమ్మానాన్నలను గౌరవించాలి.
ప్రఖ్యాత మాతృమూర్తులు
మదర్ థెరీసా (సామాజిక సేవకురాలు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత)
హిల్లరీ రోధమ్ క్లింటన్ (మాజీ అమెరికన్ ప్రథమ మహిళ)
ఇందిరా గాంధీ (భారతదేశపు మొదటి మహిళా ప్రధానమంత్రి)
మార్గరెట్ థాచర్ (బ్రిటన్ మొదటి మహిళా ప్రధానమంత్రి)
మేరీ క్యూరీ (నోబెల్ బహుమతి గెలుచుకున్న శాస్త్రవేత్త)
వర్థమాన మహావీరుని తల్లి – త్రిశాల
బుద్ధుని తల్లి – మహామాయ
చంద్రగుప్త మౌర్యుని తల్లి – ముర
శ్రీ కృష్ణదేవరాయల తల్లి – నాగాంబ
అక్బర్ తల్లి – హామీదాభాను భేగం
భారతదేశంలో తొలి మహిళా టీచర్ – సావిత్రి భాయి పూలే
నెహ్రూ తల్లి – స్వరూపరాణి
అమ్మా అనే కమ్మని పిలుపు…
అస్సామీ, బెంగాలీ, హిందీ, మరాఠీ, తమిళం, తెలుగు మొదలైన భాషలలో : మా, ఆయి, అమ్మ, మరియు మాతలను ఉపయోగిస్తారు.
స్పానిష్ లో : మామా, మా మరియు మామి
చైనీస్, పోలిష్, జర్మన్, డచ్, రష్యన్ మరియు స్లోవాక్ లలో : మామా
ఫ్రెంచ్ మరియు పర్షియన్ భాషలలో : మామన్
పంజాబీ భాషలో : మా
ఒడియాలో : బౌ/బావ్ (బూ/బూ)
హీబ్రూ భాషలో : ఎమ్
అనేక దక్షిణాసియా సంస్కృతులలో మరియు మధ్యప్రాచ్యంలో : అమ్మ, ఓమా, అమ్మి అని పిలుస్తారు.
అమ్మ గురించిన కొన్ని ఆంగ్ల పుస్తకాలు
1. మదర్ – మాక్సిం గోర్కీ
2. బికమింగ్ – మిచెల్ ఒబామా
3. ఓన్ ఇట్ – ఓప్రా విన్ ఫ్రే
4. ఫైన్డింగ్ మీ – వయోలా డేవిస్
5. మామ్ & మీ & మామ్ – మయా ఏంజెలూ
6. ద కలర్ వాటర్ – జేమ్స్ మెక్ బ్రైడ్
7. ఆఫ్ విమెన్ బోర్న్ – యాన్డ్రీనీ రిచ్
8. బిలవ్డ్ – టోనీ మొరిసన్
9. ద ఫెమిషెడ్ రోడ్ – బెన్ ఒక్రీ
10. దోస్ బోన్స్ ఆర్ నాట్ మై చైల్డ్ – టోనీ బంబారా
అమ్మ ప్రేమను ఎంతో అందంగా చూపించిన ఆంగ్ల చిత్రాలు:
1. కన్వర్జేషన్స్ విత్ మదర్
2. ద స్టోరీ ఆఫ్ ఏ మదర్
3. డైరీ ఆఫ్ మై మదర్ అండ్ ఫాదర్
5. అల్ ఎబౌట్ మై మదర్
6. ద మదర్ ఆఫ్ టియర్స్
7. డియర్ మదర్
8. లిటిల్ మదర్
9. మదర్
10. మదర్ థెరీసా ఆఫ్ కలకత్తా
అమ్మ ప్రేమను ఎంతో అందంగా చూపించిన తెలుగు చిత్రాలు:
1. అమ్మ రాజీనామా
2. రఘువరన్ బీటెక్
3. మాతృదేవోభవ
4. సింహరాశి
5. కే.జి.ఎఫ్
6. ఛత్రపతి
7. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
8. యమలీల
9. బిచ్చగాడు
10. నాని
అమ్మ ప్రేమను ఎంతో అందంగా చూపించిన హిందీ చిత్రాలు:
1. మథర్ ఇండియా
2. మమతా
3. దీవార్
4. భావన
5. బేటా
6. కరణ్ అర్జున్
7. కభీ కుషీ కభీ గమ్
8. పా
9. కహానీ
10. మామ్
అమ్మ- నాన్న
అమ్మ గీసిన బొమ్మను నేను
నాన్న కన్న కలల రూపం నేను
అమ్మ చెక్కిన శిల్పం నేను
నాన్న మదిలో ఉన్న భావన నేను
అమ్మ చెప్పిన కథను నేను
నాన్న చేసిన ప్రకటన నేను
అమ్మ పాడిన పాటను నేను
నాన్న రాసిన గీతం నేను
అమ్మ చేసిన ప్రతిమ నేను
నాన్న మెచ్చిన ప్రతిభ నేను
అమ్మ నడుస్తున్న బాటను నేను
నాన్న వెళ్లాలనుకున్న గమ్యం నేను
అమ్మలోని ఆత్మవిశ్వాసం నేను
నాన్నలోని ఆత్మ గౌరవం నేను
అమ్మలోని దీక్షను నేను
నాన్నలోని దక్షత నేను
అమ్మ ప్రేమకు ప్రతిబింబం నేను
నాన్నకు ప్రతిరూపం నేను
అమ్మలోని శ్రమను నేను
నాన్నలోని స్వప్నము నేను
అమ్మ చదివిన చదువు నేను
నాన్న పొందిన జ్ఞానం నేను
అమ్మ లోకానికి ఇచ్చిన కానుక నేను
నాన్న లోకానికి చేసిన వాగ్ధానం నేను
