Home ఇంట‌ర్వ్యూలు ఎంతగా చదివితే అంత భాషా సౌందర్యాన్ని సృష్టించుకోగలం – వి.ఆర్ విద్యార్థి

ఎంతగా చదివితే అంత భాషా సౌందర్యాన్ని సృష్టించుకోగలం – వి.ఆర్ విద్యార్థి

by Aruna Dhulipala

కాళోజీ పురస్కార గ్రహీత, భారతదేశ పూర్వ సైనికులు, ప్రసిద్ధ కవి వి.ఆర్ విద్యార్థి గారితో మయూఖ ముఖాముఖి        -ధూళిపాళ అరుణ

**********************************************

      యుద్ధతంత్రాలలో ఆరితేరిన సైనికునిగా భారతదేశ సైన్యంలో భాగస్వామ్యం వహించి, వృత్తికి ఏమాత్రం సంబంధంలేని అరుదైన సాహితీ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ నిత్య విద్యార్థిగా పేరును సార్థకం చేసుకుంటున్న వి.ఆర్. విద్యార్థి గారి జీవితాన్ని వారి స్వీయకథనం నుండే తెలుసుకుందాం.

నమస్కారం సార్🙏🏼దేశ ఆర్మీలో సేవలందించి, సాహిత్యంలో  ప్రత్యేకముద్ర వేసుకున్న మీ గురించి తెలియజేసే అవకాశం రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా మీ బాల్యం నుండి మొదలుపెడదాం.

జ:   వరంగల్లుకు దగ్గర్లో ‘గవిచెర్ల’ అనే పురాతన గ్రామం ఒకటి ఉంది. అది గణపతిదేవ చక్రవర్తి కాలంలో కూడా ఉండింది. ప్రతాపరుద్రుని చరిత్రలో కూడా ఈ గ్రామ ప్రస్తావన ఉంటుంది. ఆ గ్రామంలో 1945 అక్టోబర్ 8వ తేదీన జన్మించాను. మా నాన్న వేలూరి నర్సయ్య, మా అమ్మ వేలూరి కమలమ్మ. మాది రైతు కుటుంబం. నా చిన్నప్పుడు చాలా పేదరికాన్ని అనుభవించాను. మా కుటుంబంలో నేనే పెద్దవాడిని. నాకు ముగ్గురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు. నాకు అక్క లాంటి బలిజోళ్ల నాగేంద్ర నన్ను మొదట బడికి తీసుకెళ్లింది. చెక్కపలకతో నా చదువు ప్రారంభమైంది. నాకు అక్షరాలు నేర్పిన గురువు సాతాని నారాయణ సారు. మా నాన్నకు, మా చిన్నాన్నకు కూడా ఆయనే చదువు చెప్పడం విచిత్రం. నేను గవిచెర్ల లోనూ, సంగెం లోనూ చదువుకున్నాను. సంగెంలో 11 వ తరగతి అయిన తర్వాత వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో సైన్స్ గ్రూప్ తీసుకొని పి.యు.సి లో చేరాను. 

జ:  మీరు నమ్మరేమో! కానీ ఒక విషయం చెప్తాను. నా చిన్నతనంలో మా నాన్న భుజం మీద కూర్చొని ‘కొమ్మాళ్’ తీర్థానికి  వెళ్తుంటే ఏపుగా పెరిగిన ఆముదం చెట్లు వింతగా అనిపించాయి. తుమ్మ చెట్లమీద లంబడి పిట్టల అరుపులు గమ్మత్తుగా ఉండేవి. ఎందుకో బాల్యంలో అందరిలాగా కాకుండా దిక్కులు చూస్తూ ఉండేవాడిని. ఊరికే దిక్కులు చూస్తావని పెద్దవాళ్లు కోప్పడేవారు. చిన్నప్పుడు నేను అల్యూమినియం గిన్నెలో గట్కను తాగుతుంటే ఆ గిన్నెలో నల్లటి ఆకాశం, తెల్లటిమబ్బులు ఉన్నట్టు అనిపించి ఆనందపడ్డాను. అదే అనుభూతి అరవై ఏళ్ల తర్వాత “తప్పిపోయిన ఆకాశం” అనే కవితగా రూపొందింది. ఒకసారి క్లాస్ లో టీచరు పాఠం చెప్తూ “కవులు అంటే ఎవరు?” అని ఒక ప్రశ్న అడిగాడు. నేను చాలా ఉత్సాహంతో “నాకు తెలుసు సార్. మా పొలం కౌలుకు ఇచ్చినం” అని అన్నాను. అప్పుడాయన అదికాదు. “కవులు అంటే కవిత్వం రాసేవాళ్లు” అన్నాడు. ఆ మాటతో నేను వారం రోజులు మనిషిని కాలేదు. “అసలు ఎట్లా రాస్తారు? రాయాలని వాళ్లకు ఎట్లా తెలుస్తుంది?” ఇలాంటి ఆలోచనలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. మా మేనత్త భర్త డిఫెన్స్ లో ఉండేవాడు. ఆయన వచ్చినప్పుడల్లా అక్కడి అనుభవాలు చెప్పేవాడు. అప్పుడు నా వయస్సు 12 ఏండ్లు. ఆయన చెప్పిన విషయాలు నన్ను ప్రభావితం చేశాయి. “సైనికుడా! ఓ సైనికుడా! /హిమాలయపు కొండల్లో/ కొంకర్లు బోయే చలిలో/ బార్డర్లు కాపలా కాస్తుంటావు………” ఇట్లా కవిత రాశాను. హైస్కూల్ నుండే కవిత్వం, కథలు రాసేవాడిని. స్కూల్లో టీచర్లు నేను బాగా రాస్తానని ప్రతీ నివేదిక నాతోనే రాయించేవారు. స్కూల్ నుండి ఎక్కడికైనా టూర్ కి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశాల విశేషాలను రాయమని టీచర్లు, తోటి విద్యార్థులు ప్రోత్సహించేవారు. టీచర్లతో డిబేట్ లో కూడా పాల్గొనేవాడిని. నాకు అస్ట్రానమీ చాలా ఇష్టమైన సబ్జెక్టు. పబ్లిక్ పరీక్షలు జరుగుతున్న రోజుల్లో తెల్లవారి లెక్కల పరీక్ష ఉంటే ఆ రాత్రి ఆకాశం వంక చూస్తూ ” మేఘాల మధ్య చంద్రుడు నవ్వె…” అంటూ కవిత రాశాను (నవ్వుతూ).

వి.ఆర్ విద్యార్థి గారితో ధూళిపాళ అరుణ

జ:   అసలు కవులు కవిత్వం ఎట్లా రాస్తారో అని నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది. వేలూరి మాణిక్యరావు అని మా తాత. ఆయన పండితకవి. ఆ విషయం నాకు తెలియదు కూడా. నా బాల్యంలో స్కూల్లో జరిగిన సంఘటన మీకు ఇంతకుమునుపు చెప్పాను కదా! అప్పటినుండి బాగా చదవడం అలవాటయింది. శరత్ ను, బుచ్చిబాబును పూర్తిగా చదివాను. శరత్ “చరిత్రహీనులు” నవల చదివి వారం రోజులు మనిషిని కాలేకపోయాను. స్టూడెంట్ గా ఉన్నప్పుడు నేను మంచి వక్తను. డిఫెన్స్ లో ఆ అవకాశం రాలేదు. రాయడం మానలేదు కానీ వక్తగా రాణించలేకపోయాను. బెంగళూరులో లంకా కృష్ణమూర్తి గారని హైకోర్టు రిజిస్ట్రార్ మంచి పద్యకవి. ఆయనతో నాకు మంచి సాన్నిహిత్యం ఉండేది. ఏ కార్యక్రమాలు జరిగినా పిలిచేవారు. వీలుంటే తప్పకుండా పాల్గొనేవాడిని. 1969 లో తెలంగాణ తొలిదశ ఉద్యమసమయంలో రాళ్లపల్లి అనంతకృష్ణ గారి అధ్యక్షతన జరిగిన బెంగళూరు లోని జయనగర్ లో కవిసమ్మేళనం జరిగింది. అందులో పాల్గొన్న పది పన్నెండు మందిలో నేనూ ఒకడిగా ఉన్నాను. ఆ అవకాశం లంకా కృష్ణమూర్తి వల్ల కలిగింది. అందులో శతావధాని సుబ్బన్న గారు కూడా ఉన్నారు. అప్పుడు నేను “తప్పదు మరి” అనే ఉద్యమ కవితను చదివాను. దాని గురించి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మగారు చాలాసేపు మాట్లాడడం ఒక గొప్ప అనుభూతి. వేనరెడ్డి, వరవరరావు, సుప్రసన్న, పేర్వారం జగన్నాథం, అనుముల కృష్ణమూర్తి, అంపశయ్య నవీన్ వీళ్ళందరితో సాహిత్యపరంగా గాఢమైన స్నేహం ఏర్పడింది.

జ:  పేరెన్నిక గల గోలకొండ కవులలో ఒకరైన వేలూరి మాణిక్యరావు గారు మా తాతగారు. ఆయన పండితకవి. అంతే తప్ప వంశంలో సాహిత్య నేపథ్యం ఏమీ లేదు. మా నాన్న మాత్రం నారాయణరావు గారి వద్ద హిందూస్థానీ సంగీతం నేర్చుకున్నాడు. మా ఊళ్ళో కొంతకాలం ఉన్న నారాయణ రావు గారు మా తాతగారికి సంగీతం నేర్పుతుంటే విని, మా నాన్న మామిడితోటలో పాడుతుండగా నారాయణరావు గారు ఆయన గాత్రానికి ముగ్ధులై మా నాన్నకూ నేర్పారు. తండ్రీ కొడుకులు ఒకే సమయంలో నేర్చుకున్నారు. మా నాన్న ఫ్లూట్ కూడా చాలా బాగా వాయించేవారు. ప్రోత్సాహం లేకపోవడంతో ఊరికే పరిమితమయ్యారు. తెలుగు పుస్తకాలు చదివేవారు.

ఒకసారి కాళోజీ మా నాన్నతో పాడించుకొని విన్నారు. సికింద్రాబాద్ లో ఉన్నప్పుడు హిందీ యువ గాయకుడు శర్మ మా నాన్నకు మంచి స్నేహితుడయ్యాడు. ఇద్దరూ కలిసి పాడుకునేవారు. దురదృష్టవశాత్తు మా నాన్న గాత్రాన్ని రికార్డు చేయలేకపోయాం.

జ:   హైదరాబాద్ విమోచన తర్వాత కొంతకాలం యూనియన్ ఆర్మీ చాలా ఊళ్లల్లో క్యాంపులు పెట్టింది. మా ఊళ్ళో కూడా చాలామంది సైనికులు ఉండేవారు. అప్పుడు నేను చిన్నవాణ్ణి. వాళ్ల రిధమాటిక్ బూట్ల చప్పుడు నన్ను ఆకర్షించేది. పి. యు. సి. లో నా క్లాస్ మేట్ డా. సంగరాజు జయప్రకాష్ రావు. లింగాల రామచంద్రారెడ్డి అని జనసంఘ్ నాయకుడు దేశభక్తుడు. వాళ్ళ తమ్ముడు శేషారెడ్డి కూడా నాకు క్లాస్ మేట్. శేషారెడ్డిని, నన్ను డిఫెన్స్ కు వెళ్లమని ఆయన ప్రోత్సహించాడు. మేమిద్దరం కలిసి హైదరాబాద్ లో

బేగంపేటకు వెళ్లి పరీక్ష రాశాం. వందకు పైగా పరీక్షలో హాజరైన వారిలో నాది రెండవ ర్యాంకు. శేషారెడ్డికి కూడా మంచిర్యాంకు వచ్చింది. మమ్మల్ని బెంగుళూరు ట్రైనింగుకు పంపారు. ఆ తర్వాత నాగాలాండ్ కు (1965లో) యుద్ధకాలంలో పంపారు. 

జ:   జనరల్ గా ఏ సైనికునికైనా ఒక భయం ఉంటుంది. కానీ డ్యూటీ, దేశభక్తి ఈ రెండూ అన్నిటినీ తట్టుకునేలా చేస్తాయి. మాదంతా బ్యాక్ నుండి సపోర్ట్ ఉంటుంది. బాంబింగ్ చేయడానికి వెళ్లే విమానాలకు సపోర్ట్ గా ఉంటాం. Infantry సోల్జర్స్ శత్రువులతో ముఖాముఖి పోరాడతారు. మేము వెనుక నుండైనా బాంబింగ్ ప్రమాదాలుంటాయి. అలాంటివి ఎదుర్కున్నాం. 1965 లో పాకిస్తాన్, ఇండియా మధ్య జరుగుతున్న యుద్ధకాలంలో మమ్మల్ని తూర్పు పాకిస్తాన్ బార్డర్ కు పంపారు. నాలుగున్నర రోజులు ప్రయాణం తరువాత తూర్పు సరిహద్దులోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ గార్డ్రూ మ్ లో పొద్దున్నే రిపోర్ట్ చేశాం. మొదటగా మాకు ఇచ్చింది ఆయుధాలే. యుద్ధ సమయం కాబట్టి ఆకలిదప్పుల ప్రసక్తి ఉండదు. ఆయుధాలు ఎలా ప్రయోగించాలో ట్రైనింగ్ ఇచ్చి కొన్ని గంటల తర్వాత ఆహారాన్ని ఇచ్చారు. మరి కొన్ని నెలల తర్వాత నన్ను ఆయుధాల ట్రైనింగ్ కోసం బరోడాకు పంపారు. 1971 లో నేను షిల్లాంగ్ లో ఉన్నప్పుడు వివాహం జరిగింది. అక్కడినుండి బెంగుళూరుకు ట్రాన్స్ ఫర్ అయింది. నాలుగు నెలలు గడిచిన తర్వాత పాకిస్థాన్ తో యుద్ధం మొదలైంది. నేను పాల్గొనాల్సి వచ్చింది. నా భార్యను పుట్టింటికి పంపి యుద్ధంలో పాల్గొన్నాను. యుద్ధ పరిస్థితులను చూసి నా స్నేహితునికి “ఒకవేళ యుద్ధంలో నాకు ఏదైనా అయితే నా భార్యకు మీరంతా కలిసి మళ్లీ పెళ్లి చేయండి” అని ఉత్తరం రాశాను. ఎయిర్ ఫోర్స్ లో ‘ద బెస్ట్ ట్రేడ్’ అనే దాంట్లో దొరకడం నా అదృష్టం. మిస్సైల్స్ లాంచింగ్, గ్రాండ్ రాడార్, ఎయిర్ క్రాఫ్ట్ లో రాడార్స్ ఇటువంటి అన్ని రకాల ఫీల్డులలో పని చేశాను. అట్లా మిలిటరీలో 15 సంవత్సరాలు పని చేశాను.

జ:    ఇండియా, పాకిస్తాన్ యుద్ధం ముగిసిన కొన్ని నెలల తర్వాత నన్ను ఆయుధాల ట్రైనింగ్ కోసం బరోడాకు పంపారు. బరోడాలో నా జీవితం అతి ప్రాధాన్యత కలిగినది. అప్పుడప్పుడు ఏదో రాయడానికి ప్రయత్నిస్తుండేవాడిని. ట్రైనింగ్ కోసం బరోడాలో రాజభవనంలో వసతి ఏర్పాటు చేశారు. చెబితే మీరు నమ్మరు. ఒకరాత్రి నేను నిద్రలో ఉన్నప్పుడు కలలో ఒక అపరిచిత యువతి వచ్చి నాకు కవిత్వం డిక్టేట్ చేసింది. ఆ కల నా సాహితీ జీవితాన్ని పూర్తిగా మార్చింది. మరునాటి నుండే అసంఖ్యాకంగా కవితలు రాయడం ఆరంభించాను. పోనీ కలలో కనిపించినది సరస్వతీ దేవి అనుకుందామా? అంటే కాదు. ఒక సామాన్య స్త్రీ. ఒక వారం తర్వాత అదే రూపంలో నిరక్షరాస్యురాలైన ఒక కూలీ నెత్తిమీద తట్టతో గుజరాతీ స్త్రీ గా కనిపించింది. ఈమె నాకు కవిత్వం చెప్పడం ఏంటి? నా ఆశ్చర్యానికి అంతులేదు. అప్పటి నుండీ కవిత్వం రాస్తూనే వచ్చాను. అది ఒక సమాధి స్థితిలాంటిది. ఇటువంటి సంఘటన ఒకటి నా బాల్యంలో కూడా జరిగింది. నేను ఏడేళ్ల వయస్సులో ఉన్నప్పుడు సాయంకాలం మా పెసరు చేనులో ఒక్కణ్ణే పెసరుకాయ తెంపుతున్నాను. ముసురుపడుతోంది. మా చేను పక్కనే ఏడడుగుల పైన ఒక పొడుగాటి గడ్డం, మీసాలు, కాళ్ల కిందివరకు జుబ్బా వేసుకున్న వ్యక్తి పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. భయంతో చేనులో దాక్కున్నాను. కాసేపట్లో మాయమయ్యాడు. కొన్నేళ్ల తర్వాత రవీంద్రనాథ ఠాగూర్ గురించి విని ఆయన చిత్రాన్ని చూసినప్పుడు నాకు కనిపించిన వ్యక్తే ఆయన. ఈ విచిత్రం ఏమిటో నాకర్థం కాలేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక్కోసారి నా చుట్టూ ప్రపంచం నాకు వింతగా అనుభూతుల్ని ఇచ్చింది.

      బరోడా నుండి అంబాలాకు పోస్టింగ్ ఇచ్చారు. అక్కడ పంజాబీ కవి రమేష్ తో పరిచయం ఏర్పడింది. పరస్పరం కవితలు చదివి వినిపించుకునేవాళ్లం. అక్కడి నుండి బెంగళూరుకు వెళ్ళాను. అక్కడ హైకోర్టు రిజిస్ట్రారు లంకా కృష్ణమూర్తి గారితో పరిచయం ఏర్పడింది. ఆయన పద్యకవి కూడా. నన్ను బాగా ప్రోత్సహించేవాడు. ఇట్లా సైనికునిగా పనిచేస్తూనే కవిత్వం రాసేవాడిని.

జ:  నాకు 16 ఏళ్ల వయస్సున్నప్పుడు వేలూరు సదాశివరావు గారు, రంగరాజు యాదగిరి గారు ఇద్దరూ మాకు టీచర్లు. వాళ్లిద్దరూ జిడ్డు కృష్ణమూర్తి గారి గురించి మాట్లాడుకుంటుండగా విని ఆశ్చర్యపోయాను. వారి మాటలు నాకు బాగా నచ్చాయి. నాకు కావలసిందేమిటో అర్థమయింది. “This is the path” అనిపించింది. ఎయిర్ ఫోర్స్ కి వచ్చిన తరువాత 1969లో సెలవుల్లో గవిచెర్లకు వచ్చినప్పుడు వేలూరు సదాశివరావు గారి నన్ను మద్రాసుకు తీసుకువెళ్లి, వారం రోజులు బస ఏర్పాటుచేశారు. అదే సమయంలో జిడ్డు కృష్ణమూర్తి గారి ఉపన్యాసాలు వినే అవకాశం కలిగింది. ఒక గ్రూప్ చర్చలో కూడా పాల్గొన్నాను. అయితే 1970 జనవరిలో ఆయనను పర్సనల్ గా ఇంటర్వ్యూ తీసుకునే అవకాశం కలిగింది. అప్పటికే వందలమంది ఆయనను ఇంటర్వ్యూ తీసుకొని ఉంటారు. అదొక గొప్ప అదృష్టం గా భావిస్తాను. ఆ ఇంటర్వ్యూలో మనిషి జీవితానికి సంబంధించిన మౌలిక విషయాలెన్నో ప్రస్తావనకు వచ్చాయి. ఆయన మాటల ప్రభావం నామీద చాలా ఉంది. 

జ:  15 సంవత్సరాలు నేను సైనికునిగా ఉద్యోగం చేశాను. తరువాత కంటిన్యూ అవడానికి ఒప్పుకుంటూ Willing letter ఇవ్వాలి. ‘నేను చేయను’ అని రాసిచ్చాను. జిడ్డు కృష్ణమూర్తి గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు మా సంభాషణ అంతా ఇంగ్లీష్ లోనే జరిగింది. మొదటగా నేను సైనికుడిని అని తెలిసినప్పుడు ఆయన ముఖం గంభీరంగా మారిపోయింది. “Iam also a poet” అని చెప్పగానే ప్రసన్నంగా మారింది. నాకు యుద్ధం, హింస ఇష్టం లేవని, ఆర్థిక పరిస్థితుల వల్ల తప్పడం లేదని చెప్పాను.  అప్పుడాయన “You want be a poet or you want be a soldier? అని ప్రశ్నించారు. పోయెట్ అన్నాను. వెంటనే ఆయన “If you want be a poet come out and beg” అన్నారు. నన్ను తవ్వి తవ్వి ప్రశ్నించారు. బయటకు వచ్చిన తర్వాత చాలాసేపు తేరుకోలేక పోయాను. ఆయన ఉపన్యాసాలు, సంభాషణ నాలో ఎంతో మార్పుకు కారణమయ్యాయి. నేను ఆయనకు అనుచరుడిని కాను. కానీ కచ్చితంగా ఆయన ప్రభావం నా జీవితంలో పెద్ద మార్పు తీసుకొచ్చిందని చెప్పగలను. ఆయన చెప్పే Otherness Bliss అనేది కొందరికైనా అనుభవంలోకి రాక తప్పదు. ‘నేను’ అనేవాడు అంతర్థానమై, అనంతమైన విశ్వమై పోవడం అనేది ఒక అద్భుతభావన. అందువల్లనే ఇక ఉద్యోగం చేయకూడదని నిర్ణయించుకొని రాజీనామా చేశాను.

జ:  ఆ తరువాత బి.యల్. నారాయణ గారి ఒయాసిస్ స్కూల్లో చేరాను. నా భార్యకు కూడా ఆయన ఉద్యోగం ఉద్యోగం ఇచ్చారు. ఎప్పుడూ క్యాంపస్ లో ఉండడం, టైమింగ్స్, ఇవన్నీ నాకు నిర్బంధంగా అనిపించాయి. అదే విషయం నారాయణగారికి చెప్పాను. నా స్వేచ్ఛా భావాలను ఆయన గౌరవించారు. నా స్నేహితుడు నల్లపు మురళీధర్ అనే స్నేహితుని సహకారంతో ఒక ప్రయివేట్ టి.వి. కంపెనీలో చేరాను. చాలా ఇబ్బందులు పడ్డాను. వరవరరావు వంటి మిత్రుల సహకారంతో వరంగల్ ఆర్. ఇ.సి లో ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ లో రెగ్యులర్ పోస్ట్ రావడంతో కుటుంబంతో వరంగల్లుకు వచ్చేశాను. 

జ:  లేదమ్మా! కృష్ణమూర్తి గారు చెప్పే అనేక విషయాలను ఒప్పుకుంటాను. కానీ ఆయనకు అనుయాయిని మాత్రం కాదు. ఆయన మార్గదర్శకత్వంలో నా ఆలోచనా పరిధి విస్తృతంగా పెరిగింది. ఆయన చెప్పే విషయాలన్నీ నేను చిన్నప్పటినుండీ అనుభవించినవి. అందుకే కనెక్ట్ అయ్యాను. ఆయన కూడా తనను అనుసరించమని ఎప్పుడూ చెప్పలేదు. “నేనేదో చెప్తున్నా. మీకు బుర్రలకు ఎక్కితే మీ మార్గంలో నడవండి. నా ఫాలోవర్స్ అని కన్ఫర్మ్ చేసుకోకండి” అని చెప్తారాయన. అసలు నా జీవితంలో తెలుసుకున్నది ఒక్కటే. ఈ ప్రపంచంలో పది, పన్నెండు వేల చరిత్ర రికార్డు అయి ఉంది. మన పూర్వీకులంతా ఆదివాసులే. నేను పరిశీలించినంతవరకు ఈ ప్రపంచంలో ఏ మతమైనా సరే. హింస తప్ప మరే పాపం లేదని నా అభిప్రాయం. ఇతరులను బాధ పెట్టడం అనేదే హింస. నేనెక్కడ ఎప్పుడు చెప్పినా ఇదే చెప్తాను. మిగతా పాపాలన్నీ అవసరార్థం మనం సృష్టించుకున్నవే. జంతువులలో కూడా హింస ఉంటుంది. కానీ మనకు అట్లా కాదు కదా! ఆలోచనా జ్ఞానం ఉంది. మరి హింస చేయడం ఎందుకు? దీని గురించి నేనెప్పుడూ నాలుగు లైన్లు చెప్తూ ఉంటాను. “అనాదిగా దళారులకు/ అటు దేవుడు ఇటు శాస్త్రం / భలే గట్టి కవచాలు/ నమ్మికైన బానిసలు” అంటే హింస చేసే వాళ్ళ పద్ధతి మనవంటి సామాన్య జనాలను కొల్లగొట్టడం.

జ:   నేను ఒక ప్రాంతానికి, దేశానికి, మతానికి పరిమితమైన ఉద్యమకారుడిని కాను. కానీ ఒక ప్రాంతాన్ని వేరొకడు కొల్లగొడుతుంటే, మన మీద అటాక్ జరుగుతుంటే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. తెలంగాణ మలి ఉద్యమంలో నేను పాల్గొన్నాను. అప్పుడు మొట్టమొదట సాహితీ కార్యక్రమం జరిగినప్పుడు మా ఇల్లే మొదటివేదిక. నా భార్య అప్పుడు అమెరికాలో ఉంది. నందిని సిధారెడ్డి, వేణు సంకోజు వంటి వంటి వాళ్లు వచ్చారు. మొట్టమొదటిసారి వరంగల్ లో సాహితీ సభ జరిగింది. కేసీఆర్ వస్తానంటే రావద్దని చెప్పాం. అట్లా ఉద్యమం జరిగినన్ని రోజులు నేనూ పాల్గొన్నాను. కాకపోతే సాహిత్యపరంగా రాయడం, మీటింగులు పెట్టడం చేసేవాణ్ణి. కానీ ఏ తెలంగాణ కొరకు, ఎటువంటి తెలంగాణ కొరకు పోరాడామో వచ్చిన తరువాత అలా లేదు. మనం ఆశించిన తెలంగాణ వేరు. వచ్చిన తెలంగాణ వేరు. ప్రభుత్వం అప్పటిదైనా, ఇప్పటిదైనా అనుకున్న విధంగా అయితే లేదు.

జ:    కేవలం తెలుగు ప్రాంతాల్లోనే కాక నేను తిరిగిన అన్ని ప్రాంతాలలోనూ ఉదాహరణకు బెంగళూరు, మేఘాలయ మొదలైన ప్రాంతాల్లో తోటివారికి నా కవిత్వం వినిపించేవాడిని. ఎక్కడున్నా కవులు ఎక్కడున్నారని వెతికేవాడిని. బరోడాలో ప్రొఫెసర్స్ ని కలిసేవాడిని. కానీ ఒక సైనికునిగా మేము అందరితో కలిసి ఉండలేం. మాకు కొన్ని పరిమితులు ఉంటాయి. వాటికి లోబడి నడచుకునేవాడిని. కాళోజీ బ్రదర్స్, కె. శివారెడ్డి, వరవరరావు, సిధారెడ్డి, గుంటూరు శేషేంద్రశర్మ గారు మొదలైన వాళ్ళతో  కొంతమంది కవులతో ‘దిక్కులు’ అనే వీడియో సంకలనం చేశాను. ఆ సి.డి ని ఫిలడెల్ఫినియాలో అప్పాజోస్యుల సత్యనారాయణ గారు ఆవిష్కరించారు. 2005 లో నా “మంచు మైదానం”, డెట్రాయిడ్ లో మిచిగన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒక మీటింగులో రిలీజ్ చేశారు. “ఖండాంతర” అమెరికాలో ఉన్నప్పుడే రాశాను కానీ ఇండియాలో రిలీజైంది. అట్లాంటాలో వేలూరు వెంకటేశ్వరరావు, పెమ్మరాజు వేణుగోపాల్ రావు, వేల్చేరు నారాయణ రావు, విన్నకోట రవిశంకర్ వీళ్లంతా నాకు బాగా సన్నిహితులు. నా పోయెట్రీ గురించి recitation గా ‘మిల్ వాకీ’ లో డా. జంపాల చౌదరి అధ్యక్షతన డా. మైలవరపు కృష్ణ, మా పెద్దబ్బాయి రెండు మూడు మీటింగులు పెట్టారు. ‘సిన్సినాటి’ లో కొలమియాలో కూడా మీటింగులు జరిగాయి. అమెరికాలో నేను చాలా మందికి పరిచయం. కిరణ్ ప్రభ అనే రచయిత ‘కౌముది’ లో నా కవితలను ఎన్నింటినో ప్రచురించారు.

జ:   కవిత్వానికి ప్రాణం భావమే. అనుభూతి దాని హృదయం. ఒక కవితను చదివినప్పుడు పాఠకుడు ఆ కవితకు కనెక్ట్ కావాలి. నేను చెప్పడమే కాదు పెద్దవాళ్లు చెప్పినదాన్నే నేనూ చెప్తున్నాను. కవి తప్పనిసరిగా మొదట తాత్త్వికుడై ఉండాలి. జీవితాన్ని ఎప్పుడూ ఆలోచిస్తూ, శోధిస్తూ ఉన్నవాడే మంచి కవిత్వం రాయగలడు. అంతే తప్ప నా ఇష్టం వచ్చినట్టు దేన్నైనా రాస్తాను అన్నది ఒక స్థాయి కవిత్వం కాదు. నేను కవిత్వాన్ని ఆల్ జీబ్రాతో పోలుస్తాను. ఒక ఫార్ములా ఆధారంగా దాన్ని ఎంతగా విశ్లేషించగలుగుతామో కవిత్వంలో కూడా ఒక్కోసారి ఏదో ఒక్క లైన్ లోతైన అర్థాన్ని ఇస్తూ మొత్తం భావాన్ని అందిస్తుంది. కవిత్వానికి భాష ముఖ్యం. అప్పుడే అది గొప్పకవిత అని నేను భావిస్తాను. కవిత చదివినప్పుడు పాఠకునికి ఆనందమో, భావోద్వేగమో ఏదో ఒకటి కలగాలి. కవిత్వంలో ధ్వని ఉంటే అది ఉత్తమమైనది. పదాల ఎంపిక, సంక్షిప్తతలు ప్రధానమైనవి. ఇప్పుడొస్తున్న కవిత్వంలో ఈ లక్షణాలలో కొంత లోపం కనిపిస్తుంది.

జ:   నేను దీన్ని సమర్థించను. ఇందాక మీకు చెప్పినట్టు  కవిత్వంలో సంక్షిప్తత ప్రధానం. దాన్నే brevity అంటారు. అంటే ఒక్కమాట ఎంతో అర్థాన్నివ్వాలి.  దానికొరకు అధ్యయనం చేయాలి. నేను పూర్వకవుల సాహిత్యాన్ని అధ్యయనం చేయడం ద్వారానే తెలుసుకున్నాను. పూర్వకవుల సాహిత్యం మనకు మార్గదర్శకం. ప్రాచీన సంస్కృత, తెలుగు కావ్యాలు చదవాలి. దానివలన సరియైన అవగాహన కలుగుతుంది. రాసే విధానమూ తెలుస్తుంది. నిజానికి నేను టెక్నికల్ వైపు వెళ్లడం వల్ల మన కావ్యాలు చదవలేక పోయానని బాధపడుతుంటాను. చదవడం వల్ల మన ఆలోచన విస్తృతమవుతుంది. ప్రాచీనమైన మన భాషా సాహిత్యమే కాదు ఇతర భాషా సాహిత్యాలు కూడా చదవాలి. దానిని బట్టి మన సాహిత్యాన్ని మరింతగా అవగాహన చేసుకోవచ్చు. నేను ఇంగ్లీష్ సాహిత్యాన్ని, హిందీ సాహిత్యాన్ని చదివాను. చైనీస్, జపనీస్, లాటిన్, అమెరికన్ పోయెట్రీ, నేటివ్ అమెరికన్ పోయెట్రీ చదువుకున్నాను. అధ్యయనం చేయడమంటే కాపీ చేయడం కాదు. ఆలోచనా పరిధిని పెంచుకోవడం. దానివల్ల మంచి కవిత్వం రాయొచ్చు. ఒకవేళ ప్రాచీన సాహిత్యం అర్థం కాకపోతే వచ్చిన వాళ్ళతో చెప్పించుకోవాలి.

జ:  నా కవిత్వంలో ప్రత్యేకమైన ప్రాతిపదిక అంటూ లేదు. కాకుంటే ప్రకృతి, తాత్త్వికత, మానవసంబంధాలు ఎక్కువగా చోటుచేసుకుంటాయి. నాకు నచ్చిన ఫిలాసఫీని కవిత్వంలో ఎక్కువగా ప్రెజెంట్ చేయగలననిపించి కవిత్వాన్ని ఎంచుకున్నాను.

జ:   నిరంతర అధ్యయనమే నాకు ఇటువంటి రచనకు ఆధారమైంది. మీరన్నట్టు పదాలు చాలావరకు నేను సృష్టించుకున్నవే. ఎంతగా చదివితే అంత భాషాపరిణతిని, భాషాసౌందర్యాన్ని సృష్టించుకోగలం. మా పెద్దబ్బాయి. నార్త్ పోల్ లో పడే కాంతుల్ని ఒకసారి ఫోటో తీశాడు. అందులో ఆకాశంలో ఒక పువ్వులాంటి నీడ కనిపించింది. దానికి సింబాలిక్ గా నేను “కాలపుష్పం” కవితా సంపుటికి ముఖచిత్రంగా వేసుకున్నాను. ఎప్పుడైనా రాయడం కంటే చదవడం ప్రధానంగా చేసుకుంటే రచనలో కవిత్వపు సొగసులు కనిపిస్తాయి.

జ:  కవి వ్యక్తిగత జీవితం ఒక్కోసారి తన కవిత్వంలో ప్రతిబింబించవచ్చు. కానీ కవి తాను చెప్పినట్లుగా జీవిస్తున్నాడని చెప్పలేం. ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఒకవేళ కవి తన జీవితాన్ని ప్రతిబింబించేటట్లు రచన చేసినా అది అనుభవపూర్వకమైనదే కదా! అది ఏ కొద్దిమందిలోనైనా చైతన్యాన్ని కలిగించవచ్చు. సహజరీతిలో వ్యక్తిగత అనుభవాలను సమాజానికి అన్వయిస్తూ రాసే మంచి రచన వల్ల ఒక్కొక్కరు ఒక్కో రకమైన చైతన్యాన్ని పొందవచ్చు. మంచి కవుల రచనల నుండి, వారి అనుభవాల నుండి, వారి వ్యక్తిత్వం నుండి ఎంతో స్ఫూర్తి కలుగుతుంది.

జ:    వర్తమానంలో కవులు, రచయితలు తమ బాధ్యతను  పూర్వ కవులు, రచయితల కంటే ఎక్కువగానే నిర్వర్తిస్తున్నారని చెప్పగలను. కానీ ఇదే సరిపోతుందని భావించకూడదు. రోజుకు ఎంతోమంది కవులు, రచయితలు కొత్తగా పుట్టుకొస్తున్నారు. తమ కవిత్వం ఎంతవరకు ప్రయోజనకారి కాగలదో కూడా ఆత్మవిమర్శ చేసుకోవలసిన అవసరం ఉంది.

జ:   మా కుటుంబానికి కాళోజీ గారి కుటుంబంతో బంధుత్వం ఉంది. 1964లో నా సీనియర్ సంధ్య రంగారావు “మిత్రమండలి” సమావేశానికి తీసుకువెళ్ళాడు. అక్కడ కాళోజీ సోదరులను కలిశాను. వారికి నేను చిన్నవయసు నుండే తెలుసు. చిన్నప్పుడు వారింటికి తరచూ వెళ్ళేవాడిని. ఆ రోజు నేను రచనలు చేస్తానని వారికి తెలిసింది. 1969 జూలైలో అమెరికా నుండి “అపోలో -II” పంపబడినప్పుడు ఒక కవిత రాసి కాళోజీగారికి పంపగా ముగ్ధులై దానికి “అమాయకం” అని శీర్షిక పెట్టి, నోట్ బుక్ లో రాసుకొని ఎందరికో వినిపించారు. “అపరిచితులు” అనే కవిత భార్యాభర్తలకు సంబంధించిన కవిత. అది చదివి విశాఖపట్నంలో ప్రొఫెసర్ వేణుగోపాల్ గుండెలు బాదుకున్నాడని కాళోజీ గారే స్వయంగా చెప్పి ఆయనను పరిచయం చేయించారు. ఈ సందర్భంగా ఈ కవిత గురించి మరో విషయం చెప్పాలి. ఈ సంఘటన జరిగిన 32 ఏండ్ల తర్వాత అట్లాంటాలో ఒక ప్రొఫెసర్ గారి ఇంట్లో అంపశయ్య నవీన్, నేను ఆతిథ్యం ఉన్నాం. ఆరోజు ఉదయం ఒక వేదిక మీద ఈ కవితను విన్న అతని భార్య మాట్లాడుతూ ఇవాళ ఒక కవిత విన్నాను. ఇప్పటిదాకా జీవితమంతా బాగా ఉందనుకున్నాను అన్నది. అప్పుడాయన నన్ను చూపించి ఈయనే విద్యార్థి గారని ఆ కవిత రాసింది అన్నారు. అంతగా నా కవిత వ్యక్తులను కదిలించడం చాలా సంతోషం వేసింది. కాళోజీ కవిగానే కాక వ్యక్తిగతంగా చాలా గొప్పమనిషి. సహృదయుడు. దీనికి రెండు ఉదాహరణలు చెబుతాను. ఒకసారి నిజాం కాలేజీలో ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు నేను కాళోజీతో ఉన్నాను. డా. అస్గర్ అలీ ఇంజనీర్ అని గొప్ప సంఘ సంస్కర్త చీఫ్ గెస్ట్ గా ఉన్నాడు. సభలో వక్తలంతా ప్రముఖులే. గొప్పగా ప్రసంగించారు. చీఫ్ గెస్ట్ మాట్లాడబోగా బాంబే నుండి అతడిని ఫాలో అవుతున్న ఒక వ్యక్తి అతణ్ణి మా అందరిముందే కత్తితో పొడిచాడు. రక్తం చిందింది. సభలో ఉన్నవారు, వేదికపై ఉన్నవారు ఎవరికివారు తోచిన దిశగా పరుగులు తీస్తూ పారిపోయారు. కార్యకర్తలు ఓ ఇద్దరు ముగ్గురు, నేను, కాళోజీ గారు తప్ప అంతా ఖాళీ అయిపోయింది. “అరేయ్! రాములూ (నా పేరు రాములు రక్తం ఆపు” అన్నాడు కాళోజీ. నేను గట్టిగా రక్తం రాకుండా అదిమిపట్టాను. తరువాత ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయించడం జరిగింది. అప్పుడు కాళోజీ ఒకమాట అన్నారు. “మనం ప్రమాదాన్ని కొని తెచ్చుకోలేదు. ప్రమాదం వచ్చినప్పుడు పారిపోలేదు” ఎంత గొప్పమాట చూడండి! ఇది జీవితానికి అన్వయించుకుంటే చాలు. కాళోజీ రామేశ్వరరావు గారికి ఎం. జి. ఎం ఆసుపత్రిలో ఆపరేషన్ జరిగింది. కాళోజీ గారు చూడడానికి వెళ్లారు. ఆ సమయంలో నేను సెలవు మీద వారం రోజులు ఇక్కడ ఉన్నాను. ఆయనతో పాటు నేనూ ఆసుపత్రికి వెళ్ళాను. అక్కడ సూపరింటెండెంట్ ప్రసాదరావు గారని మంచి పేరున్న వ్యక్తి. ఆయన కాళోజీ గారితో రామేశ్వరావు గారిని ఇంటికి తీసుకుపోవచ్చు గానీ ఇంటి దగ్గర సౌకర్యాలు ఉండవు కాబట్టి ఇక్కడే కొన్ని రోజులు ఉంచితే బాగుంటుంది అన్నారు. అప్పుడు కాళోజీగారు “అన్నగారు బాగయ్యారు. ఆసుపత్రిలో మరో పేషేంటుకు ఇవ్వవలసిన అవకాశాన్ని అవసరం లేకున్నా మనం వాడుకోవద్దు” అందువల్ల డిశ్చార్జ్ చేయండి అన్నారు. అట్లా ఆయన జీవితాన్ని ప్రత్యక్షంగా చూస్తూ పెరిగినవాడిని.

జ:     తమ జీవితాన్ని పరిపూర్ణంగా ప్రజలకు అంకితం చేసిన ప్రపంచమానవుడు కాళోజీ. ఆయన ప్రజాహృదయ వేదికపై స్థిరపడ్డాడు. కాలం నాలుకపై నిలబడతాడు. అంతటి మహనీయుని పేరిట ఏర్పాటు చేయబడిన తెలంగాణ ప్రభుత్వ పురస్కారం అన్ని పురస్కారాలకంటే విలువైనది. అటువంటి పురస్కారాన్ని పొందినందుకు నా జన్మ ధన్యమైందని భావిస్తాను. ఈ పురస్కారాన్ని పొందడం వల్ల కవిగా నా బాధ్యత మరింత పెరిగింది. కాళోజీ గారితో నాకున్న అనుబంధాన్ని, వారి వెంట నేను తిరిగినప్పటి అనుభవాల్ని ఒక గ్రంథంగా రాయాలనుకుంటున్నాను. ఒక దీర్ఘకావ్యం కూడా రాయాల్సి ఉంది. కాలం సహకరిస్తే తప్పక రాస్తాను. కాళోజీ చింతనను ఆశయాలను ముందుతరాలకు అందించడమే నా బాధ్యత. ఇట్టి బాధ్యతను నేను నిర్వర్తించాలి కదా!

జ:  కేవలం కవిత్వం వల్ల సమాజంలో ఏదో పెద్ద మార్పు వస్తుందనే భ్రమలో ఉండొద్దు. మనిషి జీవించే విధానం, ఉద్యమాలు సమాజాన్ని మారుస్తాయి. కవిత్వం అందులో ఒక పార్శ్వం. ముఖ్యంగా మనిషి మనిషిలాగా ఉండాలి. ఉన్నత వ్యక్తిత్వాన్ని అలవరచుకోవాలి. అటువంటివాళ్ళ రచన కూడా ఉన్నతంగా ఉంటుంది. మొదట హృదయసంస్కారం అవసరం. చెప్పినదాన్ని ఆచరించగలగాలి. ఈ తరం వాళ్లు చేయాల్సింది ఎక్కువగా అధ్యయనం. దాని నుండి భాషను, భావాన్ని అర్థం చేసుకోవాలి. ఇతర ప్రముఖ కవుల రచనలను లోతుగా పరిశీలించాలి. మనం రాసిందే గొప్ప అనే భావనను వీడాలి.

 ధన్యవాదాలు సార్!🙏🏼ఇంతటి సుదీర్ఘమైన సమయాన్ని మాకోసం కేటాయించినందుకు మా తరఫున, మా మయూఖ పాఠకుల పక్షాన అనేక నమస్సులు. కృతజ్ఞతలు. మీ ఆశయానికి అనుగుణంగా రాబోయే మీ తదుపరి రచన కోసం ఎదురు చూస్తూ సెలవు

You may also like

Leave a Comment