Home సంపాదకీయం ఆ బంధాలలో తీపెంత?

ఆ బంధాలలో తీపెంత?

by Kondapally Neeharini

మార్చ్ మయూఖ పత్రిక సంపాదకీయం

  • డాక్టర్ కొండపల్లి నీహారిణి, ⁠మయూఖ ఎడిటర్

మనిషి యాంత్రిక జీవితంలో కొత్తగా ఆర్టిఫిషల్ సంతోషాలు అలుముకున్న నేపథ్యం సంతృప్తి పరుస్తున్నాయా? మరోపక్క ఉమ్మడి కుటుంబాలు ఎంతవరకు మనుగడ కొనసాగుతున్నాయి? అనే ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయా! ప్రతి జీవితం ఆశల సౌధమే…అయితే అర్భాటాలకు పెద్ద పీటలు ఎవరు వేస్తున్నారు! ఇది ఆలోచించాల్సిన విషయం. అన్నీ కలిసిన ” మిక్సర్ ప్యాకెట్ ” జీవితం అయినప్పటికీ , ఉండాల్సిన రుచి అనే ఆత్మీయతను కోల్పోయిన బంధాలు అనుబంధాలలో పొందుతున్న అనుభూతులెంత? వీటిలోతాత్కాలిక ఆనందానికి ఆ బాటలు ఎవరికి వారు వేసుకున్నవే అనటంలో ఎటువంటి సందేహం లేదు.
   కలసి ఉంటే కలదు సుఖం అన్నారు పెద్దలు.
అమ్మ, నాన్న, భార్య భర్త, కొడుకులు, కూతుర్లు, పిల్లలు , వాళ్ళ కు కలిగే సంతానం తో వచ్చే సంబంధాల పిలులుపు, అత్త మామ , చిన్నమ్మ పెద్దమ్మ అమ్మమ్మ చిన్నాన్న, పెద్ద నాన, తాత వంటి మాటలు ఒక ధైర్యాన్ని , ఒక అనుబంధాన్నీ తెప్పించే మాటలు . వీటి విలువను తర్వాత తరాలకు అందించటానికి పునాదులు ఇప్పుడే వేస్తేనే భవిష్యత్తు ఉంటుంది.
కుటుంబ వ్యవస్థను ప్రతిబింబించే  సంకేతాన్ని తెలియజేయడానికి,  ప్రేమానుబంధాల కుటుంబాలను నిర్మించడం. యాంత్రిక జీవితంలో  అంటే ప్రస్తుతం కుటుంబాలలో ప్రేమ, ఆత్మీయతలు కరువైపోయిన కారణంగా… అనేక కుటుంబాలు విచ్చిన్నమవుతున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే అతి చిన్న విషయాలైన ఒక వ్యక్తి ఒకరికి  చరవాణిలో పంపిన  మెసేజ్ ని చూడకపోతే , లేదంటే చూడటం సమయం ఎక్కువైపోయినా, ఆలస్యమైనా ఒక అభిప్రాయానికి వెంటనే సదరు వ్యక్తిపై సాధారణంగా ఏర్పరచుకుంటున్నారు. చిన్న చిన్న అపార్థాలతో కుటుంబాలు చీలిపోతున్నాయి. సాంకేతిక సౌకర్యాల వల్ల ప్రపంచం అభివృద్ది చెందుతున్న క్రమంలో ఈ మార్పు కుటుంబాలపై ప్రభావం చూపిస్తుంది. అయితే ఈ మార్పును వారు ఎలా స్వీకరిస్తారనేది వారిపైనే ఆధారపడి ఉంటుంది.రోజూ వచ్చే సమస్యలు, అవి తీర్చుకునే అవసరాల వల్ల వాటి మీద వారికున్న అవగాహన పెంచుకోవడం వలన, కుటుంబాలపై అవగాహన మరింత పెరిగే అవకాశం ఉంది.
      ప్రస్తుత కాలంలో కుటుంబ వ్యవస్థ బలహీనపడుతున్న విషయాన్ని గుర్తించి, ఆవశ్యకతను తెలియజేయడం కోసం అందరం కృషి చేయాల్సిన కర్తవ్యం ఉంది. కష్టాలు వచ్చినప్పుడు, సుఖ సంతోషాలు కలిగినప్పుడు కచ్చితంగా కుటుంబంతోనే చెర్చించుకుంటాం. అదే కుటుంబమే లేని రోజు మన బాధలు, మన సంతోషాలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక అన్నీ ఉన్నా, ఏమీ లేని వారిగా మిగిలిపోవాలి.  అంటే ఏకాకి జీవితాన్ని ఏర్పరుచుకొనే పరిస్థితులు రాకుండా ఉండడం కోసం  ప్రయత్నం చేయాలి. అన్ని జీవులలో మనిషి యొక్క గొప్పదనాన్ని తెలియజేస్తూ   కుటుంబం అంటే సంతోషం, బాధ, దుఃఖం, ప్రేమ, అనుబంధాలు, ఆత్మీయతలు ఇలా ఎన్నో ప్రేమానురాగాలు అన్ని కలిసి ఒకే చోట ఉండేదే కుటుంబం.  అన్నీ కలిస్తేనే జీవితమని కొత్త తరానికి అర్థం చేయించాలి.
       ఇప్పుడు ఒక్కో ఇంట్లోనూ ఎంతమంది కలిసి ఉంటున్నారు? పోనీ.. మనం ఉంటున్న ఊరిలో ఎక్కడన్నా  కుటుంబం అని చెప్పుకుంటున్న ఇంట్లో అయినా మొత్తం ఎంతమంది కలసి నివాసం ఉంటున్నారు? మహా అయితే, నలుగురు ఐదుగురు ఉంటున్నారేమో! ఓ పది పన్నెండు మంది కుటుంబసభ్యులు ఎక్కడన్నా ఒక చోట కలిసి ఉన్నట్టు చెప్పగల వాళ్ళ ను మనం కూడా చూసే ఉంటాం. అంతకు మించి కలిసి జీవిస్తున్నవారిని చూసిన గుర్తు మీకుందా?   అంటే ఈ ప్రశ్నకు లేదు అనే సమాధానమే చెప్తాం. ఒకసారి మనం గమనిస్తే ఈ ప్రశ్నను చాలా ఆలోచించాల్సి వస్తుంది. ఒక ఆశ్చర్యకరమైన విషయం వింటే  ఒకే ఇంటిలో 38 మంది కలిసి నివసిస్తున్నారు  అంటే ఎవరైనా  నమ్ముతారా? అదీ కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న పరిస్థితుల్లో కూడా…అవును అటువంటి కుటుంబం ఒకటి ఉంది. ఎక్కడంటే.. ఉత్తర ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌ దగ్గరలో. ఒక కుటుంబంలోని  పురుషులు బయట వ్యాపారాలు..ఉద్యోగాలు చేస్తారు. స్త్రీలంతా ఇంటి బాధ్యతలు చూసుకుంటారు. ఇది నిజంగా ఒక ఆశ్చర్యంగా ఉన్న విషయమని చెప్పవచ్చు.
కలసి ఉంటె కలదు సుఖం అని ఈరోజుల్లో కూడా ఒకే ఇంటిలో కలిసి జీవిస్తున్న ఆ పెద్ద కుటుంబం గురించి కొన్ని విశేషాలు పొందే పదే గుర్తుకు చేసుకోవాలి. సమాజంలో కుటుంబ వ్యవస్థ బలహీనపడుతున్న ఈ నేపథ్యంలో కుటుంబాల విలువలకు ఇవే నిదర్శనం. కుటుంబాలకు సంబంధించిన సమస్యలపై చర్చ చేయడం, బయటపడే మార్గం చూపడం చేయాలి. వీటిపై అవగాహన పెంచడం , కుటుంబాలను ప్రభావితం చేసేందుకు చాలా కోణాలలో పనిచేయడం మనందరి బాధ్యత.
” కుటుంబ వ్యవస్థను కాపాడుకుందాం – దేశాన్ని కాపాడుకుందాం”

You may also like

Leave a Comment