Home సంపాదకీయం యువ తరంగాలు

యువ తరంగాలు

by Kondapally Neeharini

(మే నెల 2023 మయూఖ సంపాదకీయం)

సామాజిక వ్యవస్థ కొత్త పోకడలతో రూపుదిద్దుకుంటున్న కాలంలో వర్తమానానికే అధిక ప్రాధాన్యత ఉంటున్నది. ఈరోజు ఈ క్షణం ఇదే ప్రాథమిక అవసరమైంది. వెనుకబడిన దేశాలను జయించి తమ సామ్రాజ్యాలను స్థాపించుకోవాలనుకున్న ఒకప్పటి చరిత్ర మరపు పొరలలో పడిపోయింది. ఇది మరచిపోకుండా ఉంటేనే ఇప్పుడు ఎక్కడ ఉన్నామో తెలిసేది.
ఆర్థిక సమస్యలు,రాజకీయ చాతుర్యాలు మనిషిని అతలాకుతలం చేసిన పరిస్థితులు అన్నీ బోధించని పాఠాలు అయ్యాయి.

మూఢనమ్మకాలు పూర్తిగా తొలిగిపోలేదు సంపూర్ణ అక్షరాస్యత సాధించలేదు. శాస్త్ర పరిజ్ఞానంలో ముందంజ వేస్తున్నాం అనుకునే వరకే కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి.
సామాజిక నైతిక తాత్విక సత్యాలను గుర్తించకుండానే యువత పరుగులు తీస్తున్నది.ఏ గమ్యం లేకుండా ,ఏ ఆశయాలు లేకుండా.

అయితే సోషల్ మీడియా అనే ఒక మాట ప్రస్తుతం ప్రతి నోట వినిపిస్తున్నది. ఇది ఎంతలా ప్రభావితం చేస్తున్నదంటే మనుషుల మధ్య మకారాలు అనురాగాలు ఆత్మీయతలు వంటి మంచి పదాలు పూర్తిగా కనుమరుగైపోయినాయి.

భారతదేశంలో 22 షెడ్యూల్ భాషలు, హిందీ, ప్రపంచాన్ని ఏలుతున్న భాష ఇంగ్లీష్ లతో కలిపి ఇరువై నాలుగు అధికార హోదా ఉన్నవి. దాదాపు 19 వేల పైచిలుకు భాషలు మన దేశంలో ప్రజలు మాట్లాడే భాషలున్నవి. ఈ అన్ని భాషలు ఉనికిని కోల్పోతూ ఇంగ్లీష్ భాష కే మొగ్గు చూపుతున్నారు.
ఇదే పరిస్థితి దాదాపు ప్రపంచం మొత్తంలోనే ఉంది. వాళ్ల వాళ్ల మాతృభాషను మర్చిపోతున్న వాళ్ళు వాళ్ళ భాషలో వచ్చిన సాహిత్యాన్ని ఏం చదవగలుగుతారు? దినపత్రికలు కూడా చదవడానికి కష్టపడుతున్న దీ యువత.ఎన్నో ఆధునిక సౌకర్యాలతో వచ్చిన యంత్రాల ముందు కూర్చుని సమయాన్ని ఆలోచనలని తెలివిని నిర్వీర్యం చేసుకుంటున్న యువతరమే ఎక్కువ కనిపిస్తున్నది. అలా అని అందరూ అదే దారిలో లేరు. ఇదే సాంకేతిక పరిజ్ఞానం తో యంత్రాల ముందు కూర్చుని వాటిలో నిక్షిప్తమై ఉన్న అద్భుతమైన విజ్ఞాన శాస్త్రాలను అందిపుచ్చుకొని ఉన్నత స్థానంలోకి పయనిస్తున్న వారు ఉన్నారు.

” జర్నలిజం సాహిత్యం కాదు, సాహిత్యం అన్నదానిని ఎవరూ చదవరు” అని ఆస్కార్ వైల్డ్ అన్నాడు. ఇదేనాటి మాట! ఇక ఇప్పుడు పోల్చుకోగలమా అసలు?

కవులు రచయితలు అద్భుతమైన సాహిత్యాన్ని పండిస్తున్నారు. ఈ ఫలితాలు యువతకు చేరుతున్నవా లేదా అనే ప్రశ్నలు ఉదయించి తీరుతాయి!
ప్రకృతి ప్రేమ మనుషుల మీద గౌరవం తగ్గిపోయి విపరీతమైన హింస ను ప్రేరేపించే తీరులో తీస్తున్న ప్రపంచ చలనచిత్రాలు చెడు ప్రభావాలు చూపిస్తున్న వి. ఇటు పత్రికలు అటు సోషల్ మీడియా రెండు ఈ సినిమా ల ప్రస్తావనతోనే రేటింగులు తెచ్చుకుంటున్నవి. అసలు జీవితంలోని సారాన్ని మాత్రం కోల్పోవడానికి ఇవే పెద్ద ప్రతిబంధకాలు అవుతున్నాయి. జీవితంలో ఏం కోల్పోతున్నారో కూడా తెలుసుకోలేని స్థితిలో నేటి యువతరం కొట్టుమిట్టాడుతున్నది. మానవ స్వభావాలను ఆవిష్కరిస్తూ జీవితాలకు అన్వయించుకునే శక్తి సామర్థ్యాలు కోల్పోతున్నది. ప్రకృతితో పర్యావరణంతో కాకుండా ఆయా విష సంస్కృతిని వదిలి ఇటువంటి సహజీవనాన్ని కలిగి ఉంటున్నారు . యువత ఇవ్వేవీ పరిశీలించడం లేదు. ఒక భావి ప్రణాళిక లేదు, ఓ చిత్త శాంతి లేదు. విరుద్ధంశాలతోటి వేరువేరు గొంతులతోటి అనుభూతి రహిత జీవితాలను వెళ్లిదీస్తన్నది యువత!

అందుకే రాజకీయాలు ప్రామాణికత లేకుండా అయిపోయాయి, కుటుంబాలు విలువలు తగ్గిపోయి వెలవెలబోతున్నాయి. ఎటువంటి సమస్యలు ఎదురైనా ఎదుర్కొనేందుకు ధైర్యంగా నిలిచి పోరాడే చిత్తస్థైర్యాన్ని పొందగలిగే భూమికను ఏర్పరుచుకోవాలి. ఇవి విద్యార్థి దశ నుండే నేర్పించగలిగే విద్యా బోధన వ్యవస్థ ఉండి ఉంటే బాగుండేది.కళాసాహిత్యం రెండు కళ్ళుగా ఉండవలసిన స్థితి నుండి చాలా దూరం తొలగిపోయింది హింసాత్మక ప్రవృత్తి పెట్రేగిపోయి సహజతను కోల్పోతున్న యువత రాజకీయాల్లోకి రావాలి అంటే , చదువు మీద శ్రద్ధ పెట్టాలి, మాతృభాష ను పొదవుకోని, ముందడుగు వేయాలి.

అప్పుడే స్వయం ప్రకాశ వంతంగా వెలుగుతారు

_ డాక్టర్ కొండపల్లి నీహారిణి
మయూఖ సంపాదకులు

You may also like

Leave a Comment