వెన్ను భాగాన్ని పరచుకున్న జుట్టును
వేళ్ళతో సుతారంగా ముడివేసి
కంటిరెప్పల బరువును
అమాంతం దించుకొని
కాలి అందెల సవ్వడి ప్రణవంగా
మెత్తని అడుగులతో వడివడిగా
ప్రపంచంపై సూరీడు పాకక ముందే
మొదలయ్యే ఉదయం ఆమెతో
తెల్లటి ముగ్గు రేఖలు
వేలి సందుల నుండి జాలువారి
వయ్యారాలు పోతుంటాయి
చేతి రుచుల కమ్మదనాలు
బయటివారిని ఒకింత
నిలువరిస్తాయి ఇంటిముందు
అగరొత్తుల పరిమళాలు
దేవతా దీవెనలై వ్యాపిస్తాయి
ఇంటినిండా..
బద్ధకం కప్పుకున్న దేహాలు
మగతగా దొర్లుతుంటాయి
వారి అవసరాల కోసం ఆమె
శరీరంలో ఇంకిన తేజస్సును
అరువు తెచ్చుకుంటుంది
మళ్లీ మళ్లీ కొత్తగా
త్యాగాల కుంచె ధరించి
ప్రతి క్షణం వారి కోరికలకు
నునువెచ్చని మమకారాల
వన్నెలద్ది
జీవన కాంతిని ప్రసరిస్తూ ఆమె
అడుగడుగున ఆమె పదనర్తనం
వెన్నెల చల్లదనంలా
స్వచ్ఛతకు మారు పేరవుతుంది
తనకు తాను తప్ప
అందరికి మాత్రం ఆమే
ఆమే అలిగిన నాడు….?
ఏ భాషా భావం
విప్పలేదు ఆ శక్తిని
కూర్చలేదు ఆనందాకృతిని !
అరుణ ధూళిపాళ
8-3-2024
(అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా)