Home సంపాదకీయం ఈ మౌనం మంచిది కాదు

ఈ మౌనం మంచిది కాదు

by Kondapally Neeharini

జనవరి మయూఖ పత్రిక సంపాదకీయం

 – డాక్టర్ కొండపల్లి నీహారిణి

అందమైన జీవితాన్ని ఎవరు ఆశించరు? ఆనందమైన బ్రతుకు పయనాన్ని ఎవరు కోరుకోరు? తరతమ బేధాలలో శాతాలుగా విభజించుకొని నైతికతను తినేస్తున్నది ఇప్పటి సభ్య సమాజం. దీన్ని ఎవరికి వాళ్లు వాళ్లలోకి వాళ్లు చూడడానికి నిరాకరించుకుంటున్నారు.

“బూడా గోడా లాల్ లగామ్”ముసలి గుర్రానికి షో కైన కళ్లెం” కాదు జీవితమంటే.లౌక్యం వేరు లోకజ్ఞత వేరు. అసలే ఒకే తరహా రాజకీయ పద్ధతిని చూస్తున్నాం. అదెంతా వికారమో తెలుసు. ప్రజాస్వామ్యం ఎట్లున్నది అప్పుడు ఎలా ఉన్నది ఇప్పుడెలా ఉన్నది అని అర్థం చేసుకోవాలి. పార్లమెంటరీ పాలనా విధానాలు అనేవేవీలేవు. వందరెట్ల నిరంకుశతత్వాన్నే చూస్తున్నాం. పార్టీలు కాదు గెలిచేది పైసలు గెలుస్తున్నాయి అన్నట్టున్నవి పరిస్థితులు. ధైర్యం అనేది కొనుక్కుంటే వచ్చేదా?  ఇది అన్యాయం అన్నప్పుడు నిరసనను ఏ విధంగానైనా తెలియజేయాలి కదా !కేవలం నిందలు ఆరోపణలు చేస్తే ఎట్లా? ఒక అప్రకటిత ఎమర్జెన్సీ లాగా  అంతర్లీనంగా ఒకటి నడుస్తున్నది. ప్రత్యామ్నాయ శక్తి లేకుండా పోతున్న రోజులు . అది ఏ పార్టీ గాని అది ఏ ప్రాంతం కానీ ఇదే పరిస్థితి. ఈ రాజకీయాలు విద్యావ్యవస్థలోనూ జొరబడ్డాయి.

సమాజము, ప్రజలు ,విలువలు అనేవి ఏవి మాట్లాడే పరిస్థితి లేదు. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ ….ఇవి మాత్రమే రాజ్యమేలుతున్నాయి. ఈ భావ దారిద్ర్యం ప్రజల పట్ల ఒకే సారాంశంతో సంచరిస్తున్నది. Political గా అస్తిత్వం అనే భావన కనుమరుగవుతున్న రోజులు.

ఇవన్నీ పాఠశాలలను, ఉపాధ్యాయులను, విద్యార్థులను ప్రభావితం చేస్తున్నవి. కళాశాల విశ్వవిద్యాలయాల స్థాయికి వెళ్లిన తర్వాత

వంటబట్టాల్సిన రాజకీయాలు, ఉన్నత ప్రాథమిక పాఠశాల నుండే కుటుంబ పరంగా, కుల పరంగా వాళ్ల మెదడులలో దూర్చి పిల్లల చైతన్యవంతమైన ఆలోచనలను శాసించి చైతన్య హీనంగా చేస్తున్నవి.  మార్కులు, ర్యాంకులు మరో విధమైన చెలగాటం ఆడుతున్న విద్యార్థులతో …దీనివల్ల తల్లిదండ్రులు, కుటుంబం, బడి ,చదువు ,టీచర్ అనే వాతావరణం నుండి మరింకేదో వాతావరణం కోరుకుంటున్నది ఈ తరం. అది కాస్త వికృత రూపం దాలుస్తున్నది. వీటి నుండి బయట పడాలంటే ఒక్కటే మార్గం… పుస్తకాలను చదివించడం. బవంతంగా నైనా చదివించడం…. ఇష్టపడేలా చేసి చదివించడం… ఎలా? రెండు వైవిద్యమైన భావాలు ఒక్కచోట చెప్పాల్సిన పరిస్థితి వస్తున్నాయి.దీనిలోని మంచి చెడులను గ్రహించి తల్లిదండ్రులు టీచర్లు కలిసి పిల్లల ముందు చర్చించుకోకుండా వాళ్ళ లేత మనసులు గాయపడకుండా జాగ్రత్తగా  ఒక ప్రణాళికను ఏర్పరచుకొని చేయాలనుకుంటే…

సారస్వత క్షేత్రంలో బంగారు పంటలు పండించిన ఇతిహాసాలు మనకున్నాయి. కావ్య యుగంలో రసవత్తరమైన రచనలు వెలువడిన సాహిత్య చరిత్ర మనకు ఉన్నది. విద్వత్ కవుల అద్భుత రచనలు అక్షర దీపాలుగా ప్రజ్వలిల్లిన వాజ్మయ చరిత్ర మనకున్నది. శాస్త్ర సాంకేతిక విద్య సంబంధించిన గ్రంథాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన, యోగాభ్యసన, తాత్వికచింతన ఉన్న మన దేశం విలువలను ప్రస్ఫుటించే పుస్తకాలెన్నో ఉన్నాయి.  గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు, ఆత్మకథలు ఉన్నాయి. అటువంటివన్నీ అందుబాటులోకి తీసుకువచ్చి కొత్త తరం వాళ్లకు నేర్పించాలి. లేకుంటే చెప్పలేనంత సాచ్యురేషన్ అనేది వచ్చి అన్నీ పోతాయి . ఎక్కడికి పోతాయి?  ఆ గ్రంథాలు అలాగే ఉంటాయి భాండాగారాలలో!! ఆ  జ్ఞానసంపద అంతా అలా నిక్షిప్తమైపోయి ఉంటుందే కానీ ఏ సమాజానికైతే అవసరమో భావి పౌరుల జీవన్ మార్గానికి తోడుగా ఉంటాయో అవి ఏవి వాళ్లకు అందకుంటే అవన్నీ అక్కడ భద్రపరిచి ఉన్నా లేనట్టే!

అయితే అవన్నీ ఈ కాలం పిల్లలు చదవలేరు అనుకుంటే వాళ్లకు అర్ధమయ్యే రీతిలో వాళ్ళ వాళ్ళ మాతృభాషలో నే కాకుండా ఇప్పుడు వాళ్లు ఇంగ్లీష్ మీడియం లో  చదువుతున్నారు కాబట్టి ఇంగ్లీష్ లో నైనా

చిన్న చిన్న వాక్యాలతో ఆ పెద్ద భావాన్ని ప్రోది చేస్తూ కొత్తగానైనా పుస్తకాలు రాయాలి. రాయించాలి. ఇటువంటి పుస్తకాలు యూనిక్ గా ఉండి సమాజ యోగ్యమైనవి  రచింపజేస్తే పిల్లలకు రురించి అవి మాత్రమే నిలుస్తాయి.

   గ్రూపులు కట్టడాలు, నిందలు వేయడాలు…. తీవ్రమైన లొసుగులు తో నడుస్తున్నవి రోజులు.అవినీతి చాలా పెరిగిపోయి పాఠశాలలను కూడా వ్యాపార కేంద్రాలుగా చూస్తున్నారు. విద్యార్థులను, వాళ్ళ తల్లిదండ్రులను  పావులుగా వాడుకుంటున్నారు.

“జై సాకరోగే వైసా బరోగే” “మనం ఎట్లా చేస్తే ఫలితం అట్లా వస్తుంది”

పాఠశాలల ఉపాధ్యాయులు శ్రద్ధగా పాఠాలు చెప్పకుంటే పిల్లలు చదువరు. పిల్లల స్థాయికి తగినట్టుగా చదువు చెప్పే వాళ్ళు లేకుంటే విద్య నిలువదు. చాలా వరకు తెలుగు మీడియంలో చదువుకున్న టీచర్లు ప్రస్తుతం ఇంగ్లీష్ మీడియం వాళ్లకు బోధనలో ఉండడం అనేది శోచనీయమైనటువంటి విషయం. అంతటా కాకుండా గ్రామీణ ప్రాంత బళ్ళలో ఇదే జరుగుతుందని వినికిడి. టీచర్స్ కే రాకుంటే పిల్లలకి ఏం చెప్తారు? భాష పై పట్టు ఉండి, భాషా సౌందర్యాన్ని విడమర్చి చెప్పగలిగే శక్తి ఉండి గ్రామర్ మిస్టేక్స్ పిల్లలు ఎక్కడ చేస్తున్నారో పట్టుకొని నేర్పించగలిగే యుక్తి ఉంటేగాని విద్యార్థులకు  సరైన ఇంగ్లీష్ వస్తుంది , న్యాయం జరుగుతుంది. అసలే smart phone మాయాజాలంలో అంతా బూటకపు వార్తల ప్రపంచంలో సమాజం . ఎన్నో మంచి విలువైన విశేషాలు ఉన్నా కూడా ఫోన్ ను miss use చేస్తూ పిల్లలు వాళ్ళ జ్ఞాపకశక్తిని కోల్పోతున్నారు. తల్లిదండ్రులకు ఈ విషయంపై అంతుపట్టడం లేదు. చదువుతున్నారు… ఎందుకు మార్కులు తక్కువ వస్తున్నాయి.. అని మాత్రమే అనుకుంటున్నారు. కానీ, తమ పిల్లలపై ఇన్ని రకాల చెడు ప్రభావాలు పడుతున్నాయి… ఈ ఆవరణలో నుంచి బయటికి రాలేకపోతున్నారు మా పిల్లలు  అని గ్రహించలేకపోతున్నారు.ఏం చేయాలో  వాళ్ళ కూ అర్థం కావడం లేదు. మొక్కలలోనూ divinity ఉన్నదని చెప్తున్న పరిస్థితులను చూస్తున్నాం … అటువంటిది మనుషులలో ఎందుకు లోపిస్తుంది ? లోపించదు. వెలికి తీయాలి. అన్ని మతాలలోనూ నిత్య నూతనమైన సనాతనమూ ఉన్నది. నిలువెత్తు ధర్మాన్ని ఆపాదించుకున్న సంస్కృతి మనకున్నది. అన్ని మతాల వాళ్ళు కలిసిమెలిసి జీవిస్తున్న

భారతదేశం  ఇది. ఈ ఉన్నత విలువలను జారవిడుచుకుంటే భవిష్యత్తు అంతా అంధకారమే. సనాతన ధర్మము అంటే, సంస్కృతి అంటే, ఆచారాలు అంటే ఏవో తప్పు మాటలు అనే భావాన్ని కొత్త జనరేషన్ కు నేర్పిస్తున్నారు. ఇది ఎంతో ప్రమాదం. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో కూడా ఇవన్నీ పాటిస్తుంటారు. మరి మన దేశానికి ఏమైంది? మనుషులం… మనం ఆకాశం నుంచి ఊడిపడలేదు.  ఇవన్నీ తప్పకుండా అందరూ గ్రహించాలి. ఒక సమయమనంతో సాగాలి.

  ఒకప్పుడు ఉపాధ్యాయులు ఎంతో శ్రద్ధాసక్తులతో పాఠ్య బోధన చేసేవాళ్లు. ఆనాటి టీచర్స్ ను గుర్తు చేసుకుంటే down to Earth  అని చాలామంది అంటారే… ఆ విధమైన మనస్తత్వాలతో సమాజ నిర్మాణం వాళ్ల చేతుల్లోనే ఉన్నది అనే గొప్ప భావనతో పాఠ్య బోధన చేసేవాళ్ళు. ఇది మళ్ళీ పునరావృతం కాకుంటే…

రాబోయే తరాలకు జవాబుదారీగా నిలవాల్సింది ఎవరు? మేధావులు ఇలా మౌనం వహించడం మంచిది కాదు. ఈ మౌనం దేశ సామాజిక ఆర్థిక రాజకీయ చైతన్యాలను ఎదగకుండా చేస్తుంది. కౌన్సిలింగ్ క్లాసెస్ టీచర్స్ కి కూడా పెట్టి వాళ్లలో దాగి ఉన్న మంచితనాన్ని , తెలివినీ, కృషి తత్వాన్ని, ఋషి తత్వాన్నీ  మేలుకొలిపి మళ్లీ పాత రోజులు గుర్తుకొచ్చేలా … ఎ గుడ్ టీచర్ మేక్స్ ఎ గుడ్ సొసైటీ అనే నినాదాన్ని ఎలుగెత్తి చెప్పాలి.

“పట్టుపట్టగ రాదు పట్టి విడువగ రాదు

పట్టెనేని బిగియపట్టు పట్టవలయు….” అన్నారు పెద్దలు . ఈ మాటలకున్న అర్ధాన్ని అందిపుచ్చుకొని మరణం అంచుల్లో పడిపోకుండా నిలపాల్సిన బాధ్యత ఇప్పుడు మన అందరిదీ. చాలాచోట్ల  మంచి ఉద్దేశంతో కృషి చేస్తున్న ఉపాధ్యాయులు లేకపోలేదు. వాళ్ల కృషిని గ్రహించి వాళ్లకు చేయూతనిచ్చి వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని నింపి, ఇంకా ఇంకా న్యాయమైన పద్ధతిలో నిజాయితీగా సేవలు చేసే దిశగా పెద్దలు మాట్లాడాలి.

మన మెప్పులో వేయి సౌదామినుల మెరుపు ఉండాలి. ఎప్పుడైతే హృదయపూర్వకంగా … గుండె లోతుల్లోనుంచి మెచ్చుకుంటామో ఈ ఫలితాలు వస్తాయి.

అన్ని సమయాలలో మౌనం మంచిది కాదు!!

____***____

You may also like

Leave a Comment