Home ఇంద్రధనుస్సు సమాజ మార్పు కోసం పోరాడిన మహనీయుడు పెండ్యాల రాఘవరావు

సమాజ మార్పు కోసం పోరాడిన మహనీయుడు పెండ్యాల రాఘవరావు

by mayuukha

‘ది ఫర్గాటెన్ మావెరిక్’ పుస్తకావిష్కరణ సభలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య

సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, విద్యా వ్యాప్తి, సామాజిక సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన మహోన్నత ప్రజానాయకుడు పెండ్యాల రాఘవరావు జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు.

హైదరాబాద్ తేది:24-11-2026

హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన పెండ్యాల రాఘవరావు జీవితం ఆధారంగా మనూ నెల్లుట్ల రచించిన ‘ది ఫర్గాటెన్ మావెరిక్ – ఏ బయోగ్రాఫికల్ ఫిక్షన్’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి వరంగల్ పార్లమెంట్. సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ముఖ్యఅతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య మాట్లాడుతూ… పూల మధ్య నుంచి ఆవిష్కరించిన ఈ పుస్తకం వెనుక పెండ్యాల రాఘవరావు ఎదుర్కొన్న ఎన్నో కష్టాలు, అవమానాలు, సామాజిక సంఘర్షణలు, సమాజాన్ని మార్చాలనే అచంచల సంకల్పం ఉన్నాయని పేర్కొన్నారు. అణగారిన వర్గాలకు విద్య అందించేందుకు పాఠశాలలు, కళాశాలలు, కమ్యూనిటీ లైబ్రరీలు ఏర్పాటు చేయడం ద్వారా ఆయన సమాజంలో చైతన్యం తీసుకొచ్చారని కొనియాడారు.

ప్రస్తుతం తాను 18వ లోక్‌సభలో ఎంపీగా కొనసాగుతుండగా, పెండ్యాల రాఘవరావు తొలి లోక్‌సభలో సభ్యుడిగా ఉండటం ఎంతో గర్వకారణమన్నారు. జైలు నుంచే నామినేషన్ వేసి ఎన్నికల్లో విజయం సాధించడంతో పాటు రెండు అసెంబ్లీ స్థానాల్లోనూ గెలుపొందడం ఆయన ప్రజాబలానికి, పోరాట పటిమకు నిదర్శనమన్నారు. నేటి తరానికి పెద్దగా పరిచయం లేని ఇలాంటి మహనీయుల చరిత్రను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.

నిజాం పాలనలో అణగారిన వర్గాలు విద్యకు, కనీస సామాజిక గౌరవానికి దూరమైన పరిస్థితుల్లో పెండ్యాల రాఘవరావు వారి అభ్యున్నతి కోసం అనేక పోరాటాలు చేశారని వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య గుర్తుచేశారు. దళితులకు విద్య అందించేందుకు పాఠశాలలు ఏర్పాటు చేయడం, వారిని తన ఇంటికి తీసుకురావడం వంటి చర్యలతో కుటుంబం నుంచి, సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నప్పటికీ వెనక్కి తగ్గలేదన్నారు. మతం మారితేనే జీవితాలు మారుతాయనే భావనను వ్యతిరేకిస్తూ, ప్రతి ఒక్కరూ తమ మతంలోనే గౌరవంగా జీవించేలా ఆయన చొరవ చూపారని పేర్కొన్నారు.

సమాజంలో మార్పు ఇంటి నుంచే ప్రారంభం కావాలని నమ్మిన పెండ్యాల రాఘవరావు మొదట తన కుటుంబంలోని మహిళలకు విద్య అందించేందుకు ప్రయత్నించారని తెలిపారు. తన వితంతు సోదరికి రాత్రివేళల్లో చదువు నేర్పించడంతో పాటు, వివాహం అనంతరం తన భార్యను కూడా చదివించారని చెప్పారు. ఆ కాలంలో మహిళల విద్యకు వ్యతిరేకత ఉన్నప్పటికీ వారి అభ్యున్నతికి కృషి చేయడం గొప్ప విషయమన్నారు. మహిళలకు నేడు లభిస్తున్న అవకాశాల వెనుక అంబేడ్కర్ వంటి మహనీయులతో పాటు తెరమరుగున ఉండిపోయిన ఎంతోమంది సంఘ సంస్కర్తల కృషి ఉందని పేర్కొన్నారు.

పెండ్యాల రాఘవరావు జీవితానికి సంబంధించిన పాత పత్రాలను ఆయన కుటుంబ సభ్యులు భద్రపరచడం, వాటిని రచయిత మనూ నెల్లుట్లకు అందించడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా, తన తాతను దేవుడిగా చిత్రీకరించకుండా, సమాజ మార్పు కోసం ఆయన చేసిన ప్రయత్నాలను ఒక మనిషి కోణంలోనే ఆవిష్కరించాలన్న కుటుంబ సభ్యుల సూచన గొప్పదన్నారు. పాత పత్రాల ఆధారంగా చరిత్రను భావోద్వేగంతో, ఆసక్తికరంగా పాఠకులకు అందించిన రచయితను అభినందించారు. ప్రజల సమస్యలు, వారి హక్కులు, స్థానిక పరిస్థితులపై అవగాహన ఉన్నవారే సమాజానికి సరైన దిశానిర్దేశం చేయగలరని ఆయన జీవితం నిరూపిస్తోందన్నారు.

తాను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నిరుపేద దళిత కుటుంబంలో పెరిగానని, ఆస్తులు, భూములు లేని కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి నేడు పార్లమెంట్‌లో ప్రజల తరఫున మాట్లాడగలుగుతున్నానంటే అందుకు డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ అందించిన రాజ్యాంగ హక్కులే ప్రధాన కారణమని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. సమాజంలో ఇంకా అనేక అసమానతలు, ఆంక్షలు ఉన్నాయని, అట్టడుగు వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

తన తండ్రి కడియం శ్రీహరి సుమారు నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదురైనా ఆత్మగౌరవంతో నిలబడి, పేదలు, బడుగు బలహీన వర్గాలు, మహిళలు, మైనారిటీల హక్కుల కోసం పోరాడే స్ఫూర్తిని తనకు అందించారని తెలిపారు. పార్లమెంట్‌లో ప్రజా సమస్యలపై ధైర్యంగా మాట్లాడేందుకు తన తండ్రి జీవితం, పోరాటమే దిశానిర్దేశం చేస్తోందన్నారు.

ప్రతి ఒక్కరూ జీవితాంతం విద్యార్థులుగానే ఉండాలని, చదవడం, నేర్చుకోవడం ఆపిన రోజే మనిషి ఎదుగుదల ఆగిపోతుందని అన్నారు. ప్రతి మహిళ నుంచి, ప్రతి పేద కుటుంబం నుంచి, జీవితంలో పోరాడుతున్న ప్రతి ఒక్కరి నుంచి తాను స్ఫూర్తి పొందుతానని చెప్పారు. నిరంతరం నేర్చుకుంటూ, సమాజం కోసం పోరాడుతున్నంతకాలమే మనిషి జీవితం సార్థకమవుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, తెలుగు అకాడమీ చైర్మన్ కూరపాటి వెంకట్ నారాయణ, కాళోజీ అవార్డు గ్రహీత నెల్లుట్ల రమాదేవి, తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ కార్యదర్శి కన్నిమల్ల ప్రతాప్ రెడ్డి, నల్సార్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పెండ్యాల శ్రీకృష్ణ దేవరాయ, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ దేవులపల్లి అమర్, వీక్షణం ఎడిటర్ నెల్లుట్ల వేణుగోపాల్, డాక్టర్ పాలకుర్తి దినకర్, కొండపల్లి నిహారిణి, రచయితలు, పాత్రికేయులు, పెండ్యాల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

You may also like

1 comment

homepage November 26, 2026 - 7:48 am

Hello to all, how is the whole thing, I think every one is
getting more from this site, and your views are fastidious
for new users.

Reply

Leave a Comment