Home బాల‌సాహిత్యం స్నేహం ముద్దు, యుద్ధం వద్దు

స్నేహం ముద్దు, యుద్ధం వద్దు

అనగనగా ఒక రాజు. అతని పేరు పగ్నాషియన్‌. అతనికి బాల్యం నుండి కొట్లాట ఆటలే ఇష్టము. చెక్క గుఱ్ఱం ఎక్కి కఱ్ఱ ఖడ్గం తిప్పుతూ ఊగుతూ సంతోషంగా ఆడుకునేవాడు. అతను పెరిగి పెద్దవాడయ్యాడు. యువరాజు అయ్యాడు. అతను రాజు అయిన వెంటనే మావుడ్‌ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు.
అతను ప్రతీ యుద్ధంలో పాల్గొనేవాడు. అతనికి ఎప్పుడు యుద్ధకాంక్షే. అతను ఎప్పుడూ స్నేహం వద్దు, యుద్ధం ముద్దు అనుకునేవాడు. అతని యుద్ధాల వలన పక్క రాష్ట్రాల రాజులకు కష్టం, నష్టం జరుగుతుండేది. ఈ తలనొప్పి తగ్గించుకోవడం కోసం పక్క మూడు రాష్ట్రాల రాజులు కలిసి ఒక ఒడంబడిక చేసుకున్నారు, ఇతనికి గుణపాఠం నేర్పాలని. ఇతనిపై సవాలు విసిరారు.
ఇది సామాన్యమైన యుద్ధం కాదని భార్యతో చెప్పాడు. తను ఒక సంవత్సరం వరకు తిరిగి రాకపోతే తను ప్రపంచంలో లేననుకొని లేక జైల్లో బంధించబడినానని అనుకొని నీవు స్వేచ్ఛగా వేరే వివాహం చేసుకో అని చెప్పాడు. అంతవరకు ఒంటరిగా వుండలేవు కాబట్టి నీవు రాత్రిళ్ళు పొద్దుపోయే వరకు మన న్యాయశాఖ పెద్ద గుమాస్తాచేత పుస్తకాలు చదివించుకో. అతను ప్రపంచంలో జీవించి లేననుకోమనే మాట ఆమె మనసుకు బాధను కలిగించింది. అయినా ఒంటరిగా కాలక్షేపం చేయడం కష్టమనుకొని భర్త చెప్పిన పెద్ద గుమాస్తాతో రాత్రిళ్ళు పుస్తకాలు చదివించుకుంటూ వుండమన్న మాట కొంత నయమనుకుంది.
ఆ పెద్దగుమాస్తా కోటలో వున్న పుస్తకాలన్నీ అరడజన్‌ సార్లు ఇదివరకే చదివేశాడు. అతను చాలా గౌరవంగా రాణీగారికి కొన్ని పుస్తకాలు, మరికొన్ని ఆయన రాసినవి ప్రతిరోజు చాలాసేపు వరకు చదివి వినిపించేవాడు. ఆమెగారు అతనితో సంతోషంగా మాట్లాడుతూ ఆ కథలన్నీ వింటూ ఒక సంవత్సరంపైన ఒక దినం కాలం గడిపింది.
భర్త చెప్పిన కాలం గడిచింది కాబట్టి, గుమాస్తాతో తనను వివాహం చేసుకోమని కోరింది రాణి. దానికి గుమాస్తా నేను ధన్యుడను మహారాణి. కానీ నేను చాలా మామూలు వాడిని. మీరు రాజ వంశీయులు. అదీగాక రాజు ఏదైన జైలులో బంధింపబడి ఉండవచ్చు. నాకు ఇష్టం లేదని చెప్పను కాని, ఇంకొక సంవత్సరం, ఒక దినం వేచి ఉండటం మంచిదన్నాడు. ఆ సమయం కూడా గడిచింది. కానీ రాజు రాలేదు.
రాజు పగ్నాషియస్‌ యుద్ధంలో చంపబడలేదు. కానీ అతడ్ని గాయపరిచి రెండు సంవత్సరాలు జైలుశిక్ష విధించాడు రాజు లిటిల్‌ గోర్ము. అతను మూడు ప్రక్క రాష్ట్రాల ప్రతినిధి రాజు. ఆ సమయం గడిచాక రాజు పగ్నాషియస్‌ ను అతను జైలు నుండి విడిపిస్తూ ఇప్పుడు నీకు యుద్ధకాంక్ష జబ్బు కుదిరందనుకుంటా అన్నాడు. ఇకముందు నీపై జాలి చూపను. యుద్ధభూమిలో పట్టుబడితే నీ తల నరికేయబడుతుంది. ఇప్పుడు నిన్ను వదిలి పెడుతున్నాను. రాజు లిటిల్‌ గోర్ము, పగ్నాషియస్‌ గుఱ్ఱాన్ని జుర్మానా కింద తన వద్దనే ఉంచుకున్నాడు. కాబట్టి పగ్నాషియస్‌ తన ఇంటికి నడిచి పోవలసి వచ్చింది.
అతను నడిచి నడిచి చివరకు తన కోట చేరేవరకు అక్కడ పెండ్లికి జోరుగ తయారీలు అవుతున్నాయి. ఎందుకనగా గుమాస్తా పెట్టిన రెండు సంవత్సరాల ఒక దినం గడువు పూర్తి అయింది. పగ్నాషియస్‌ అప్పటికి రాలేదు, కాబట్టి గుమాస్తా వివాహానికి ఒప్పుకున్నాడు.
అప్పుడు ఆ రాణి ఆ గుమాస్తా తను మామూలువాడినన్న మాటను మదిలో ఉంచుకొని, అతడిని రాజవంశంలో చేర్చి, రాజ్య వ్యవహారాలు చూచే అర్హత ఇచ్చింది. ఇప్పుడు అతను ఆమెకు తగిన వాడైనాడు. వారు వారి పెండ్లి వేడుకలకు గొప్ప ఏర్పాటు చేశారు. దానికి దూర దూరాలనుండి రాజులు, ధనికులు, గొప్పవారు అక్కడికి చేరారు. వచ్చిన వారిలో రాజు లిటిల్‌ గోర్ము రాణి మావుడ్‌ కు శుభాకాంక్షలు తెలిపాడు, కాని రాజు పగ్నాషియస్‌ గురించి ఏమీ అడగలేదు. కేవలం ఒక ముసిముసి నవ్వు నవ్వాడు.
విందు భోజనాలు చివరకు వచ్చేవరకు పగ్నాషియస్‌ కోట వద్దకు చేరాడు. ఆ చింపిరి వెంట్రుకల నెత్తితో, చిరిగిన గుడ్డల్లో ఉన్న తమ రాజును ఖడ్గం మరియు గుఱ్ఱం లేనందున ఎవరూ కూడా గుర్తించలేదు. పగ్నాషియస్‌ బాధతో కన్నీరు కార్చాడు. తను యుద్ధం వలన రాజ్యాన్ని, ధనాన్ని, చివరకు తన భార్యను కూడా పోగొట్టుకున్నానని అంటూ మూల్గాడు. నా పని అయిపోయిందన్నాడు. నౌకర్ల ఇండ్లలో అతనికి ఒక కోడి కాలును తినేందుకు ఇచ్చారు. అది తిని నోరు మరియు కండ్లు తుడుచుకొని వెళ్ళిపోయాడు ఎక్కడికో. ఎక్కడికి పోయాడో ఎవరికి తెలియదు. కనీసం తన పాత రాజ్యంలో మరెప్పుడూ కనబడలేదు. అతను చివరకు అనుకున్నాడు. స్నేహం ముద్దు, యుద్ధం వద్దు. అది ఆనాటికే కాదు, ఏనాటికైనా అదే సత్యం .అదే క్షేమం. ఇదే అతనిలో కలిగిన పరివర్తన.

You may also like

Leave a Comment