Home సంపాదకీయం శతవత్సరాల కవితా శరధి దాశరథి

శతవత్సరాల కవితా శరధి దాశరథి

by Kondapally Neeharini

ఈ ఆధునిక ప్రపంచంలో నిత్య సత్యాలకు విలువనిచ్చే సందర్భాలను తరచి చూడాల్సిన పరిస్థితులున్నవి. ఇదంతా stage of publicity నడుస్తున్న కాలం. ఈ ప్రచార పటాటోపాలు లేకుండా వాళ్ళ జీవితమంతా పోరాటాలకు ధారపోసి వెలుగులోకి వచ్చిన కొందరు మహనీయులను స్మరించుకోవడం కొరకనే శత జయంతి ఉత్సవాలను జరుపుతూ ఉంటాం.
మహాప్రళయంగా ఉద్యమించిన సముద్ర ఆటుపోటుల వంటి తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమాలకు ఎందరో వీరులు బలయ్యారు. బరిలోకి దిగి ఉద్యమించిన నేతలందరూ నిస్వార్థ జీవితాలే గడిపారానాడు. సాహిత్యం అనే కత్తిని చేతపట్టి సమాజమనే యుద్ధభూమిలో రాజునెదిరించిన విప్లవకణిక దాశరథి కృష్ణమాచార్య.
ఏ నైసర్గిక సాధన కోసం ఆనాడు గళమెత్తాడు దాశరథి? ఏ అస్తిత్వం కోసం జెండా నెత్తాడు దాశరథి?? సామాన్యుల కోసం! సంఘం కోసం!!
“ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో …” అంటూ కష్టజీవి పక్షాన కలమెత్తిన కవి. ” మా నిజాం రాజు జన్మజన్మాల బూజు …”అంటూ ప్రభుత్వ పనులను ఎదిరించి స్వాతంత్ర్యం కోసం తలయెత్తిన కవి. అలసత్వాలపై, అధికారపు పెత్తనాలపై కవిత్వ నిప్పులు చిమ్ముతూ కవిత్వం రచించినా , కరుణ రసాత్మకంగా పేదవాడి పక్షాన కవిత్వం రచించినా దాశరథి దాశరథే! ఇకమరో కవి ఉండడు అన్నంత గొప్ప కవి.
అది కవిత్వం కావచ్చు అది పాట కావచ్చు బడుగు జీవుల బాధల గాథలు దాశరథి కవిత్వంలో కవిత్వమై కన్నీరు తెప్పించాయి. కవి ధర్మం, కవిత్వ ధర్మం రెండు ఒక్కటి గా కనిపించిన దాశరథి సాహిత్యం ఇప్పుడు ఈ కాలంలోనూ స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యక్ష పోరాటాలలో పాల్గొన్న వ్యక్తిగా, పద్యాల చురకత్తులు విసిరిన శక్తిగా దాశరధి ఎట్లా నిలబడగలిగారు? ఎట్లా సినీ జగత్తులో అక్షర దివ్వె గా వెలగలిగారు? ఇవి తెలుసుకోవాలి.
ఎంతసేపు పరనింద,ఆత్మ స్తుతి తో బ్రతుకుతున్న మనుషులకు మార్గదర్శకత్వంగా దాశరథి వంటి కవుల కవిత్వాన్ని చూపించాల్సిన బాధ్యత ఈనాటి సాహితీవేత్తలది, పత్రికారంగానిది, ప్రభుత్వానిది. అతిగా పెరిగిన లంచగొండిలపై కంచు గొంతు ఎగరాలి. అడుగడుగునా అవినీతి అవతారాలు కనిపిస్తున్న కసాయి లోకానికి కనువిప్పు కలిగించే దాశరథి కవిత్వం కావాలి.

ఎంతసేపు వాగాడంబరమూర్తుల ఉపన్యాసాలు వినీ వినీ యువత నిస్తేజం లో పడిపోతున్నది. అభ్యుదయ భావకాంక్షతో సత్కవిలోకానికే సంభ్రమాశ్చర్యాలు కలగజేసిన దాశరథి పద్య శక్తి ని తెలుపాలి.
సంగీతం ఆపాత మధురం, సాహిత్యం ఆలోచనామృతం అనే మాట దాశరధి నోట వచ్చిన పాట, పద్యాలు పెద్ద రుజువు.
ఋతు బద్ధంగా వికసన చెందే పంట చేను,ఎండి కడుపు ఆకలి మంటను చల్లార్చే పంట దాశరథి సాహిత్యం. కవుల గురించి రచించినా , పీఠికలు రాసినా, సభనుద్దేశించి మాట్లాడినా జవం జీవం ముప్పిరిగొని పాఠకులకు శ్రోతలకు ఆనందాన్ని ఆలోచనలని కలిగించినవి.
నాటి ఖమ్మం జిల్లా మానుకోట తాలూకా లోని చిన్న ఊరు గూడూరు లో 1925 సంవత్సరంలో జూలై నెలలో జన్మించాడు దాశరథి. పల్లెటూరి చదువు నుండి పట్నం చదువులకు ఎదిగిన ఈ పట్టభద్రుడు పాటను పట్టుకొని చిత్రసీమలోకి అడుగు పెట్టే వరకు దాటిన మైలురాళ్ళు ప్రతి అడుగులో దాశరథికి కొత్త పాఠాలు నేర్పించాయి. తిమిరంతో సమరం జరిపినా ,రుద్రవీణలు మోగించినా, అగ్ని ధారలు కురిపించినా, నవ మంజరులు మ్రోగించినా,కవితా పుష్పకం వికసింపజేసినా, పునర్నవం తో కవితా ప్రక్రియని పరిపుష్టం చేసినా దాశరథి దాశరథే!!
” ఇట వసంతము లేదు, సహింపరాని
గ్రీష్మ హేమంత కాల కాళికలె గాని
ఇట ఉషస్సులు లేవు,భరింపరాని
అంబువాహన సందోహ నివాళిగాని…..”
భాషా పాండిత్యాల విలువ ఏమిటి అంటే , దాశరథి గారి ఇటువంటి కవిత్వం చదివితే తెలుస్తుంది.
” అది తెలంగాణలోన దావాగ్ని లేచి
చుట్టుముట్టిన భయద సంక్షోభ వేళ
అది నిజాము నృపాలుని అండదండ
చూసుకొని నిక్కినట్టి పిశాచహేల…”
తప్పు చేసే ప్రభువును ఎదిరించే ధైర్యం అంటే ఇటు ఉండాలి అనేది దాశరథి గారి ఇటువంటి కవిత్వాన్ని చదివితే తెలుస్తుంది.
” ఇదే మాట ఇదే మాట పదే పదే అనేస్తాను
కదం తొక్కి పదం పాడే ఇదే మాట అనే స్తాను….”అంటూ వాస్తవికతకు అద్దం పడుతూ కృతకంగా లేకుండా స్వచ్ఛమైన కవిత్వాన్ని రాయడం అంటే ఏమిటో దాశరథి గారి ఇటువంటి కవిత్వాన్ని చదివితే తెలుస్తుంది.
” అంబర చుంబి సౌధములు కాయవు పోసెడి నీ శ్రమ ప్రభా
వంబు నెరుంగలేని ధనవంతుల బంగారు పళ్ళెరాలలో
అంబలి పోసి త్రాగు సమయంబులు దగ్గరెలెమ్ము! నీ నవా
స్యంబున రుద్రనేత్ర విలయాగ్నుల కుంకుమ బొట్టు పెట్టు మా! ” అంటూ పీడిత పక్షాన ఎలా గొంతెత్తాలో దాశరథి గారి ఇటువంటి పద్య రచనా పాటవాన్ని చూస్తే తెలుస్తుంది.
జైలులోను తమ నిరసన గళాన్ని పద్యమై బొగ్గుతో రాసే వినిపించినా,
తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించి సాహితీ చైతన్యాన్ని రగిలించినా, అద్భుతమైన ఉపన్యాసాలతో సాంస్కృతిక చైతన్యాన్ని రగిల్చినా కవిగా ఉద్యమ తేజంగా దాశరథి ఓ పెద్ద ఉదాహరణ. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును గెలుచుకున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా పనిచేసినా ఎందరో కవులకు దాశరథి మార్గదర్శి అయ్యాడు.
“నా కంటి పాపలో నిలిచిపోరా, నీ వెంట లోకాల గెలవని రా” అంటూ మచ్చలేని ప్రేమ, మలినం కాని ప్రేమ విలువేమిటో తెలిపాడు.
“గోదారి గట్టుంది, గట్టుమీద చెట్టుంది,చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది” అంటూ పల్లె పట్టున గంతులేసే యవ్వన కాలాన్ని ప్రాసాలంకారాల పాటల్లో పలికించాడు.
” మనసే కోవెలగా మమతలు మల్లెలుగా నిన్నే కొలిచెదరా నన్నెన్నడు మరువకురా కృష్ణా”అన్నా,” రారా కృష్ణయ్యా రారా కృష్ణయ్యా దీనులను కాపాడ రారా కృష్ణయ్య” అని వేడుకొనమన్నా,

” నా తెలంగాణ కోటి రత్నాల వీణ” అంటూ ఆనాటి దురాగతాలను ఎదిరించే రుద్రవీణను మోగించిన దాశరథి అంటే అక్షర విప్లవం.

చదువు అంటే బద్ధకం,పనిచేయడం పైన నిరాసక్తత, ఏదో సాధించాలన్న తపన లేని తనం, అయిన వాళ్ళను కూడా ఆదరించలేని యువతరం ఇప్పుడు మన ముందుంది. ఒక నిబద్ధతతో ఒక విశ్వాసంతో ఆనాడున్న ఆర్థిక, సాంఘిక, రాజకీయ పరిస్థితులను ఎదిరించినా,స్వాతంత్ర్య అందిన తర్వాత ధీటుగా నిలబడినా దాశరథి గారు ఇప్పటికీ ఆదర్శవంతులే. స్వదేశాభిమానమైనా సంప్రదాయ వాదమైనా దాశరథికి ఇష్టమైనవి. ప్రకృతికి మనుషులకు పారస్పరిక బాంధవ్యాన్ని ఆకాంక్షించాడు, వ్యక్తికి సమాజానికి మధ్య సాన్నిహిత్యాన్ని చాటి చెప్పాడు, సాహిత్యం సంఘానికి చేసే మేలును తన రచనలలో చూపాడు.
” రక్తం నదులై పారకపోతే రాదా రెవల్యూషన్?
బుర్రలు పగులకపోతే లేదా సొల్యూషన్?
హింసా యుద్ధం అవుట్ డేటెడ్ అని నేనంటాను!
శాంతి ఒక్కటే మానవజాతికి సరియగు సాల్వేషన్!!” అంటూ ఈ కవిత్వమేదో నిన్న మొన్న రాసినట్టున్నదే అనే ఆలోచనలో పడవేసే దాశరథి అంటే మోడరన్ థింకింగ్ కు నిలువెత్తు నిదర్శనం.
దాశరథి గారి కవిత్వం సార్వకాలికమైంది సర్వజనీనమైనది.

“గతాన్ని కాదనలేను, వర్తమానం వద్దనబోను, భవిష్యత్తు వదులుకోను, కాలం నా కంఠమాల” అని చెప్పిన మాటలు దాశరథి శతవత్సరాల కవితా శరధి అంటున్నాయి. నూరేళ్ళ వారి జీవితమే స్ఫూర్తి దాయకం.

You may also like

Leave a Comment