Home ఇంద్రధనుస్సు మన తెలుగు నాటకాలు

మన తెలుగు నాటకాలు

by Sammeta Vijaya

రచన మాడభూషి దివాకర్ బాబు గారు . దర్శకత్వం డా. శ్రీజ సాదినేని. నటీ నటులు శ్రీజ సాదినేని, శశిధర్‌ ఘణపురం
వన్ ప్లస్ వన్ సురవరం ప్రతాపరెడ్డి విశ్వవిద్యాలయంలో రసరంజని , శ్రీ చాట్ల శ్రీ రాములు థియేటర్ ట్రస్ట్ నిర్వహణలో ప్రతిభా పురస్కారం 2025 శ్రీ ఎస్ ఎస్ రామశాస్త్రి గారికి (సీనియర్ రంగస్థల నటులు ) ప్రదానం చేసిన సభలో శ్రీ ఎస్ ఎస్ రామశాస్త్రి గారికి ప్రతిభా పురస్కారం అందించి ఘనంగా సత్కరించిన తరువాత నాటిక ప్రదర్శన జరిగింది. ఇది డా. శ్రీజ సాదినేని దర్శకత్వం వహించిన 38 వ నాటిక.
డా. శ్రీజ సాదినేని ప్రముఖ రంగస్థల, టీవీ, చలనచిత్ర నటి, రచయిత్రి, దర్శకురాలు, వ్యాఖ్యాత, యాక్టింగ్ ఫ్యాకల్టీ, డబ్బింగ్ ఆర్టిస్ట్. చిన్నతనంలోనే హరికథలు చెప్పడం ప్రారంభించిన శ్రీజ అనేక హరికథలను చెప్పడమేకాఉండా కథా వాచస్పతి, అభినేత్రి వంటి బిరుదులు కూడా అందుకుంది. 1994, ఏప్రిల్ 14న తొర్రూరు పరిషత్ లో నిర్వహించిన నాటికల పోటీలలో జన చైతన్య ఒంగోలు వారి మేడిపండు నాటికలో అమ్ములు పాత్ర ద్వారా బాల నటిగా నాటకరంగంలో అడుగుపెట్టిన శ్రీజ అనేక ఇప్పటివరకు అనేక ప్రదర్శనల్లో పాల్గొని, మూడువేలకు పైగా బహుమతులను అందుకున్నది. 150 కి పైగా సాంఘిక నాటికలు/ నాటకాలలో, 15 కు పైగా పద్య నాటకాలు, 40 నాటికలు దర్శకత్వం వహించారు . కొన్ని నాటికలు, ఏక పాత్రలు స్వయంగా రచించారు. జయా ఆర్ట్స్ , హైదరాబాద్ నిర్వహణలో ‘వన్ ప్లస్ వన్‘ నాటిక ప్రదర్శించారు.
రచయిత శ్రీ మాడభూషి దివాకర్ గారు ప్రముఖ సినీ రచయిత యమలీల, శుభలగ్నం, మావి చిగురు , చూడాలని ఉంది , టాప్ హీరో, నెంబర్ వన్ ,ఆహ్వానం, వినోదం ,సర్దుకుపోదాం రండి ,ఇద్దరు మిత్రులు మొదలైన వంద సినిమాలకు కథ, స్క్రీన్ ప్లే సంభాషణలు అందించారు. కథలు కవితలు రేడియో నాటకాలు అనేకం రచించారు .నాటక రచయితగా ప్రతి నాటికకు నాటకానికి అనేక పరిషత్తులలో ఉత్తమ రచన తదితర బహుమతులు అందుకున్నారు. యువ వాహిని డి.వి. నరసరాజు స్మారక పురస్కారం , అక్కినేని నాటక కళా సమితి అక్కినేని జీవన సాఫల్య పురస్కారం, బాపు రమణ వారి ముళ్ళపూడి వెంకటరమణ సాహితీ పురస్కారం ,సంస్కృతి సాంస్కృతిక సంస్థ గుంటూరు వారిచే ‘ఆచార్య’ బిరుదులు అందుకున్నారు. మంచి రచనా శిల్పం కలిగిన రచయిత. వైవిధ్యమైన నాటికలు నాటకాలు రచించి ప్రదర్శింపచేసారు.దివాకరబాబు నాటకములు , నాటికలు రెండు వాల్యూములుగా వచ్చాయి. వీటిలో రెండవ వాల్యూమ్ లో వన ప్లస్ వన్ ప్రచురితమై ఉంది .
వన్ ప్లస్ వన్ నాటిక నేపథ్యం :
ఈ నాటికకు ఓ ప్రత్యేకత. నాటకం లో రెండు పాత్రలు. సరిగ్గా రెండు పాత్రలే. జీవితాన్ని ఒంటరిగా గడపడం తప్ప వేరే దారి లేదని భావించే అతను , జీవితాన్ని ఇష్టం లేని వృత్తిలో కొనసాగుతున్న ఆమె ఒకానొక పరిస్థితి లో ఎలా కలిశారు వాళ్ళ మధ్య జరిగిన హృద్యమైన సన్నివేశాల సమాహారం ఈ నాటిక . మనసు విప్పి ఒకరి భావాలు మరొకరు తెలియజేసుకున్న వైనం , ఎలాంటి పరిణామానికి దారి తీసిందో రచయిత సున్నితంగా ఆవిష్కరించారు.
కేవలం రెండు పాత్రలతో కథ నడపడం నాటిక ఎక్కడా విసుగు రాకుండా సాగించిన విధానంలో దర్శకత్వ ప్రతిభ కనబడింది. నాటకం ఆద్యంతం తమ నటనతో ఎప్పటికప్పుడు తగిన హావ భావాలు పలికిస్తూ విరామం లేకుండా నటించడం కష్టసాధ్యమైనప్పటికీ తమ నటనతో ఆకట్టుకున్నారు శశిధర్‌ , శ్రీజ. నాటిక ను సహజ నటనతో శశిధర్‌ సొంతం చేసుకుని ఆ పాత్రకు తగిన న్యాయం చేసాడు. శ్రీజ ఎక్కడా ఏ మాత్రం తడబాటు లేకుండా హుషారుగా పాత్రకు ప్రాణం పోసింది. ఇద్దరి మధ్య సున్నితమైన బంధం ఎక్కడా ఇబ్బందికరంగా లేకుండా కొనసాగింది. వారి మధ్య ఒకరిపై ఒకరికి ఏర్పడిన అనుబంధాన్ని
చూపించే ప్రయత్నంలో సంభాషణలు “మాటి మాటికి నిన్ను పిలిపించుకునే ఆర్థిక స్థోమత నాకు లేదు” అన్న అతను “నీ దగ్గర నేనీ ఇంటి ఇల్లాలిననిపించేది” అన్న ఆమె సమాజంలోని స్థితిగతులను ప్రశ్నిస్తాయి.
నాటికకు సహకారం సాంకేతిక నిపుణులు మేకప్ అవినాష్, సంగీతం రాజశేఖర్, సెట్& లైటింగ్ సురభి ఉమా శంకర్ అందించారు.
జయా ఆర్ట్స్ , హైదరాబాద్ నిర్వహణలో ప్రదర్శించిన ‘వన్ ప్లస్ వన్‘ నాటికకు దర్శకత్వం వహించిన శ్రీజను రసరంజని వారు సత్కరించారు. నగదు బహుమానం అందించారు . కార్యక్రమ అతిథి శ్రీ బొల్లినేని కృష్ణయ్య గారు శ్రీజకు , శశిధర్‌కు , రచయితకు , సాంకేతిక నిపుణులు అవినాష్, రాజశేఖర్, ఉమా శంకర్ లకు నగదు బహుమానం అందజేసారు.
రెండు పాత్రలు అనగానే భూమిక థియేటర్ గ్రూప్ లో ఝాన్సీ రచించి వంశీ చాగంటి తో కలిసి ఇదే విధమైన రెండు పాత్రలతో నటించిన నాటకం రవీంద్ర భారతిలో ప్రదర్శించిన విషయం గుర్తు రాక మానదు. ఇటువంటి వైవిధ్య భరితమైన రచనలు తెలుసుకొని నాటకసాహిత్యంలో వాటి వైశిష్ట్యాన్ని తెలియజేయాలి. ప్రదర్శనలు జరిగినప్పుడు ఎంతో శ్రమకోర్చి సాధన చేసి ప్రదర్శించిన నాటిక చూడటం మన సాంస్కృతిక శోభను ఇనుమడింప చేసుకున్నట్లు అవుతుంది.
రచయిత శ్రీ మాడభూషి దివాకర్ బాబు గారు , దర్శకురాలు డా. శ్రీజ సాదినేని, నటుడు శశిధర్‌ , సాంకేతిక నిపుణులు సర్వదా అభినందనీయులు.

You may also like

Leave a Comment