
ఆకాశవాణిలో పత్రికల్లో గళం, కలంతో ప్రసిద్ధిగాంచినవారు డా. నాగసూరి వేణుగోపాల్ గారు. అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు సైన్స్ విషయాలు ఆయన చెప్తుంటే యువతకి జోష్ వస్తుంది. వివిధ పేపర్లలో పుంఖానుపుంఖాలుగా ఆయన రాసిన వ్యాసాలు మనల్ని ఆలోచింపజేస్తాయి. సవ్యసాచిలా ఆకాశవాణిలో నిబద్ధతతో పని చేసి, రిటైరైనా కూడా ఉత్సాహపూరిత వ్యాసాలతో, ప్రసంగాలతోఎంతో మందికి స్ఫూర్తిదాతగా నిలుస్తున్నారు ఆయన. పాలు నీరులా కలిసిన దంపతులు హంసవర్ధిని వేణుగోపాల్ గార్లు ఒక్క నిముషం సమయం వృధా చేయకుండా కొత్త ప్రదేశాలు చూడటం, సభలకు హాజరుకావటం, సోషల్ వర్క్ తో కాలం గడపటం ముదావహం.
ఇక 2020లో వెలువడిన “వేణునాదం” ప్రతి ఒక్కరూ చదివితీరాల్సిన పుస్తకం. తన బాల్యం మొదలు అంచెలంచెలుగా ఎదిగిన విధానాన్ని ఆసక్తికరంగా వివరించారు. పాఠకుల్ని ఒక్క ఊపులో చదివించిన ఆ పుస్తకంతో మనం ఎన్నో విషయాలు తెల్సుకోవచ్చు. ఆయన జీవితం వడ్డించిన విస్తరికాదు. కార్యదీక్ష పట్టుదల ఏకాగ్రతతో ఆయన సాధించిన విజయాలు యువతకు మార్గదర్శకాలు.
1961లో రాయలసీమ లోని కొనతట్టుపల్లి అనే 40, 50ఇళ్లున్న పల్లెలో వ్యవసాయ కుటుంబంలో పుట్టారు. అమ్మ నాన్నలు శ్రీమతి గౌరమ్మ, శ్రీ సంజీవయ్యగార్లు.10మంది సంతానంలో 4 ఆడ, 6గురు మగపిల్లల్ని పెంచి పోషించిన వారిని గూర్చిఇలా రాశారు:

“నేను 8వవాడిని. అమ్మ చెప్పిన సుద్దుబుద్ధులు నాకు వెలుగు దివ్వెలు. ఇతరులు ఇచ్చింది తీసుకోరాదు, అలవోకగా చెప్పిన అమ్మ మాట శిలాశాసనం…. “
” మా నాన్న తన 10వ ఏట తన అన్నతో కల్సి కట్టుబట్టలతో వచ్చారు. కొప్పు ఉండేది నాన్నకి. నా 5వ ఏట దాన్ని తీసేశారు. ఆయన చనిపోయాక 2010నుంచి తెలుగు విశ్వవిద్యాలయం పాపులర్ సైన్స్ లో మా అమ్మ, నాన్నల పేర ప్రతి ఏటా కీర్తి పురస్కారం ఇస్తున్నాం”. నాగసూరి పుట్టపర్తిలో డిగ్రీ; ఎస్.వి. యూనివర్సిటిలో ఎం.ఎస్సీ. ఎం.ఫిల్ చేశారు. ఎం.ఎస్సీ ఫస్టియర్ లో ఫిజిక్స్ క్లాస్ బోర్ కొడ్తే కొండల్ని చూసేవాడినని కుండబద్దలు కొట్టినట్లు చెప్పటంలోనే ఆయన లోని నిష్కపటత్వం అవగతమౌతుంది. ఇలా మనసులోని మాటను, బాధలను మనం ఇతరులతో పంచుకోవటం వల్ల టెన్షన్ తగ్గుతుంది. ఇది నేటి యువత తెలుసుకోవాలి. విద్యార్ధిగా తన అనుభవాలు అధ్యాపకులప్రోత్సాహాన్ని ఇలా వివరించారు: “1971లో నేను 5వక్లాసు చదివేప్పుడు గోవిందరెడ్డి సార్ సోషల్ స్టడీస్ చెప్పేవారు. రోజూ రాజకీయాలు, దేశ ప్రపంచ విషయాలు చెప్పేవారు. అలా పుస్తకం చదివే అలవాటుకి బీజం పడి నేటికీ కొనసాగుతోంది.” ఇలా నేడు ప్రతి బడిలో టీచర్ల ప్రేరణ ఉండాలి.కానీ నేడది కరువైంది కదూ? 1975-76లో అన్నయ్య అంగడికొట్టులో పనిచేస్తూ చదువుకున్నారు. 1948-49 లో ప్రచురితమైన అట్టలూడిన ‘స్వర్ణ భారతి’ పుస్తకం ఆయన లో దాగిన రచయితను బైటకి లాగిందనే చెప్పొచ్చు. 1977-78లో తేటగీతిలో 17 పద్యాలు రాశారు. అదే సం. ‘ఆంధ్రపత్రిక’లో చిన్న కవిత ప్రచురింపబడటం ఓ మలుపు. ఇక 10 వ క్లాస్ లో బాగా ప్రభావితం చేసిన వారు శ్రీ కల్లూరు జానకి రామారావు గారు.

నెలకు 20 పైసలు పిల్లల దగ్గర వసూలు చేసి సోషల్ స్టడీస్ క్లబ్ నడిపి రకరకాల తెలుగు వారపత్రికలు, రీడర్స్ డైజెస్ట్, విజ్డమ్ మొదలైన పుస్తకాలు తెప్పించి పిల్లల చేత చదివించేవారు. ఇంటికి తీసుకెళ్లి చదువుకునే వారు. అలా వేణుగోపాల్ గారిలో సాహిత్య పిపాస రచనాసక్తి పొటమరించి రచయిత కావడానికి పునాది వేసింది.

2001-2010లో జర్నలిజంలో ఎం.ఏ., పి.హెచ్.డి చేయటంతో ఇక ఆయన కలం విజృంభించింది. అంతులేని అగాధ సముద్రం వంటి సాహిత్యంలో ఆయన కలం కదం తొక్కింది. ఆంధ్ర ప్రభ, ఆంధ్ర పత్రిక పఠనంతో పాటు నార్ల, విద్వాన్ విశ్వం, శ్రీపాద గార్లపై పుస్తకాలు రాశారు డా. నాగసూరి.
1968లో ఇంట్లో రేడియో మోగటంతో పొందిన ఆనందం అమూల్యం. ఇక ఆకాశవాణిలో ఉద్యోగం అదీ గోవాలో రావటం ఇంకో మైలురాయి. రొట్టె విరిగి నేతిలో పడింది అన్నట్లు ఆకాశవాణి ఉద్యోగంతో ఆయన కలలు సాకారమై రచయితగా, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా ఎందరో సాహితీమూర్తుల్ని కలుసుకొన్న భాగ్యం అబ్బింది. కలానికి బలం,గళానికి గుర్తింపు, శ్రోతల, పఠితల అభిమానంతో పాటు అవార్డులు, రివార్డులతో దేశమంతటికీ పరిచయమైనారు. గోవా, అనంతపురం, విజయవాడ, విశాఖపట్టణం, మద్రాసు, కడప తిరుపతి, హైద్రాబాద్ ఆకాశవాణి కేంద్రాలలో ఆయన వాణి బాణి, ఎందరో మహానుభావులతో పరిచయాలు మైలురాళ్లు. రోజుకి 8గంటలపైగా రేడియో ఉద్యోగం, 3 గంటలు రచనలతో కొన్నివేల వ్యాసాలు, 80పైగా పుస్తకాలు వేణుగారి అకుంఠిత దీక్ష ,పట్టుదల కి నిదర్శనం. “గౌరమ్మ నుంచి హంసమ్మ” దాకా సాగుతున్న ఆయన జీవిత ఆశయం ఏమంటే తెలుగు భాష పరివ్యాప్తికి సైన్స్ సామాన్యులకు చేరాలనేది. 1997 నుంచి 2010 దాకా ఆంధ్రభూమి దినపత్రికలో తెలుగులో రాసిన మీడియా టి.వి. ధారావాహికా వ్యాసాలు యూనివర్శిటీ విద్యార్థుల పరిశోధనలకు ఉపయోగపడ్డాయి.

ఈయనకు వచ్చిన ముఖ్య పురస్కారాలు :
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ తెలుగుభాషా పురస్కారం,
తాపీధర్మారావు,
నార్ల వెంకటేశ్వరరావు పురస్కారాలు,
అధికార భాషాసంఘం అవార్డ్,
పాపులర్ సైన్స్ వ్యాసప్రచురణకు
డా.పరుచూరి రాజారాం గౌరవం,
జమ్మి శకుంతల అవార్డు మొదలైనవి.
ఇక పదవీవిరమణ చేసిన తర్వాత
మల్లవరపు జాన్ సాహితీ పురస్కారం,
జానమద్ది సాహితీ సేవా పురస్కారం,
పుట్టంరాజు బుల్లెయ్య రామలక్ష్మమ్మల సాహితీ పురస్కారం,
కొంపల్లి బాలకృష్ణ స్మారక సాహితీ ప్రతిభా పురస్కారం వచ్చాయి.
2025 నవంబర్ లో
ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం నుంచి జ్ఞానజ్యోతి పురస్కారం రాగా,
డిసెంబర్ మూడోవారంలో రామానుజన్ స్మారక గణిత అవార్డు ప్రదానమయ్యింది.

‘ముద్ర’ పేరుతో ఆంధ్రప్రభ ఆదివారం సంచికలో 2012-’13 కాలంలో తన బాల్యదశ విశేషాలతో జీవిత యాత్రను, స్వానుభవాలను ‘వేణునాదం’లా ఎదురుగా నిలబడి చెప్తున్నట్లు ఆయన కలం చేసిన విన్యాసం రచయిత ప్రతిభకు మచ్చుతునక. ఆయనకు భుజంతట్టినవారు శ్రీ కాళీపట్నం రామారావుగారు. అంతే విభిన్న విషయాలపై ఆయన కలం విన్యాసం పాఠకుల్ని అలరిస్తుంది. ఇప్పటిదాకా 80కి పైగా గ్రంథాలు వెలువరించారు. ఇంకా శతాధికం దాటాలని ఆశిస్తున్నాను.
పర్యావరణ కార్యక్రమాల రూపకల్పనలో ఆకాశవాణి తరుఫున ఆసియా పసిఫిక్ బ్రాడ్ కాస్టింగ్ సంస్థ మనిలా (ఫిలిప్పైన్స్)లో నిర్వహించిన సదస్సు- 2010లో పాల్గొనడం మరువలేని అనుభవం. వృత్తిలో సంతృప్తిపొందిన భాగ్యశాలి వేణుగారు. విజ్ఞాన శాస్త్రం ప్లస్ మానవతావాదం ఆయన మతం. ఈయన రాసిన వ్యాసాలను బడి పాఠ్యపుస్తకాలలో చేర్చితే సైన్స్ పై అవగాహన విద్యార్థులకు కలుగుతుంది. సరళమైన భాష, హాయైన శైలిలో సూటిగా, స్పష్టంగా రాసే, చదివించే నేర్పున్న రచయిత డా. వేణుగోపాల్ గారి కలం నిండు నూరేండ్లు సాహిత్య సేవ చేయాలని కోరుకుందాం.








