మనిషికి జీవితమే ఒక గొప్ప అనుభవం మన అనుభవంలోకి తొంగి చూస్తే తరచి చూస్తే కొందరి పరిచయాలు ప్రత్యేకతను సంతరించుకుంటాయి. ఆ ప్రత్యేకత ఒక ప్రేరణ కావచ్చు మనకు దారి చూపే మార్గదర్శనం కావచ్చు అలాంటి అనుభవాలు అతి అరుదుగా మన జీవితంలో దర్శిస్తాము ఒక వ్యక్తిలో భిన్న కోణాలు బిన్నపార్శాలు విభిన్న దృక్పదాలు దర్శిస్తాం ఏక వ్యక్తిలో బహుమఖీన ప్రజ్ఞాశాలిని అతి అరుదుగా చూస్తుంటాం ముఖ్యంగా అట్టడుగు స్థాయి నుంచి అట్టడుగు వర్గం నుంచి యూనివర్సిటీ మెట్లు ఎక్కడం ఒక గొప్ప మలుపు అదే యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా అసిస్టెంట్ ప్రొఫెసర్ గా అసోసియేట్ ప్రొఫెసర్ గా ప్రిన్సిపాల్ గా అంచలంచెలుగా ఎదిగి యూనివర్సిటీ ఒక విభాగానికి పాలన దక్షత నిర్వహించడం అంటే ఎంతో అనుభవం నైపుణ్యం తన చుట్టూ ఉన్న అందరినీ సమన్వయంతో అంకిత భావంతో మెలగాలి, అందరినీ గుర్తెరగాలి అంటే కత్తి మీద సాము కొందరిలో అతికొద్ది మందికి అంతటి పరిణతి ప్రతిభ మూర్తిభవించిన ఘనాపాటిలను చూస్తాం.
మన కాలంలో అరుదైన వ్యక్తి డా. బన్న అయిలయ్య గారు వారిని దర్శించడం నా అదృష్టం . రకరకాల భావజాలాలు కలిగిన కళాశాల విద్యార్థిని విద్యార్థుల రీసెర్చ్ స్కాలర్స్ గా పిహెచ్డి స్టూడెంట్స్ గా పరిణతి చెందే మేధావి వర్గాల కార్యశాల విశ్వవిద్యాలయం తెలంగాణలో ఎంతో పేరున తెలంగాణకే మణి మకుటం గా బాసిల్లుతున్న కాకతీయ విశ్వవిద్యాలయం లో హెచ్ ఓ డి గా ప్రిన్సిపల్ గా డీన్‌గా గైడ్‌గా రకరకాల అధికార ప్రతినిధిగా ఉపన్యాసకుడుగా రాణించి జీవితంలో సగానికి పై భాగము యూనివర్సిటీ కి అంకితమైన మహోన్నత వ్యక్తి మహోజ్వల నిప్పు కణిక మేరునగ దీపశిఖా డాక్టర్ బన్న ఐలయ్య గారు ఆకోవలో ఒకరు. వారితో గడిపిన కొన్ని క్షణాలు గొప్ప స్మృతి జ్ఞాపకాలు నా జీవితంలో చెరగని శిలాక్షరాలు. అప్పుడప్పుడు కొందరి పేర్లు సాహితీ ప్రస్థానంలో వింటుంటాం సాహిత్య శోధనలో భాగంగా కంటుంటాం అడపాదడపా సాహితీ పఠనం కథలు కవితలు చదువుతున్న సందర్భంలో కొందరి పేర్లు మననం లోకి వస్తాయి అట్లా నేను చూసిన ఒక గొప్ప కవిత నిప్పు కణిక
” ఇప్పుడిక ఎవడికి సంజాయిషీలు ఇచ్చుకొనక్కర్లేదు
ఏది శబ్దమో ఏది నిశ్శబ్దమో తెలిసి నటించే
నంగనాచి చెవిటి మాలోకానికి ఇది సంగీతమని…..
….
…..
చీకటి చిత్రపటం వెనుక ఒకే ఒక రంగులోంచి…
ఒక బహుజన ప్రేమ లేక మొదలెడదామా……
……
……
ఎన్ని హరితవనాలు మావి కాకుండా పోయాయి.
ఎన్ని అడవుల మీది గాలులు మమ్మల్ని తాకకుండా వీచాయి…. ……
కవిత పాద వాక్యాల్లో బన్న అయిలయ్య దళిత వైతాళికుడుగా అవతరించాడని అనడంలో సందేహం లేదు. ఈ కవిని గూర్చి మహాకవి మద్దూరి నగేష్ బాబు అన్నట్లు ఖాదర్ మొహిద్దిన్ గారి “పుట్టుమచ్చ” కానీ జూలూరు గౌరీశంకర్ గారి”పాదముద్ర ” కానీ సతీష్ చందర్ “నాన్న సైకిలు” కానీ సుంకర రమేష్ “తల్లి కోడి హెచ్చరిక” కానీ మద్దూరి నగేష్ బాబు “రచ్చబండ” పైడి తెరేష్ బాబు “హిందూ మహాసముద్రం కానీ ఇప్పుడు “నిప్పు కణిక” అన్నట్టు అక్షర సత్యం.
నేను దళిత సాహిత్యాన్ని విస్తృతంగా పటిస్తున్న క్రమంలో మేదరి బాగయ్య, కూసుమ ధర్మన్న, బోయి భీమన్న ,కొలకలూరి ఇనాక్, వేముల ఎల్లయ్య, బన్న ఐలయ్య, శిఖామణి, ఎండ్లూరి సుధాకర్ , కలేకూరి ప్రసాద్, మద్దూరి నగేష్ బాబు, పైడి తెరేష్‌బాబు , మద్దెల శాంతయ్య , బోయ జంగయ్య , డా. జీవి రత్నాకర్, డా. దార్ల వెంకటేశ్వరరావు లాంటి వారి రచనలు చదువుతున్నప్పుడు దళిత ఆర్తితో వారు వినిపించిన గొంతుక దళితుల వెతలబతుకులకు దర్పణం పడుతుంది కొందరి రచనలు మనకు మార్గం చూపడమే కాకుండా మనకు దశ దిశను కూడా నిర్ణయిస్తుంది కొందరిని చూడలేకపోయినా మరికొందరిని స్వయంగా కలిసి కరచాలనం చేసి సహవాసిగా వారితో గడిపిన క్షణాలు నా జీవితంలో అద్భుతాలు అని చెప్పాలి.
నేను ఒక సాధారణ రచయితను వృత్తిరీత్యా ఉపాధ్యాయుడని నాకంటే ముందు సాహితీ ఎవనికలో ఉండి దళిత దృక్పథంతో అంబేద్కర్ భావజాలంతో దళిత అస్తిత్వానికి నాంది పలికిన వారు అనక తప్పదు ఎవరైనా పుస్తక రూపేనా వేస్తుంటారు ముద్రిస్తుంటారు కానీ యు యూనివర్సిటీ మెట్లు ఎక్కించడం అంటే ఒక తపస్సు ఒక యజ్ఞం 20 ఏళ్ల కింద నేను రాసిన దళిత నవల సూర 2012 13 సంవత్సరంలో కాకతీయ విశ్వవిద్యాలయం ఎం ఏ తెలుగు నాలుగవ సెమిస్టర్ లో వేముల ఎల్లయ్య కక్కతోపాటు నా నవల సూర పాఠ్యాంశంగా చేర్చారు నా నవలకి ఘనతని కల్పించినవారు డాక్టర్ బన్న అయిలయ్య గారు ముఖ్యులు. విస్తృతంగా సాహిత్యం వస్తున్న నేటి తరుణంలో దళిత భాషని దళిత సంస్కృతిని దళిత జీవితాన్ని ఆవపోసన పట్టి యూనివర్సిటీలో దళిత అస్తిత్వానికి ప్రాణ ప్రతిష్ట చేశారు వివిధ యూనివర్సిటీలలోని ప్రొఫెసర్లు వారి వారి గురించిన వాటికి ప్రాధాన్యం ఇస్తూ సాంప్రదాయ ఒరవడిని కొనసాగిస్తూ వస్తుంటారు అలాంటి సాంప్రదాయానికి తిలోదకాలు ఇచ్చి ఒక కొత్త ఒరవడికి నాంది పలికి అభ్యుదయ, దళిత బహుజన పునసృష్టి చేశారు. వారు స్వయంగా రచయిత కవి డా.బన్న అయిలయ్య దళిత నేపథ్యం నుండి వచ్చిన వారు కనుకనే దళిత వాదం వైపు మొగ్గు చూపారు . అలా తన మూలాలను గుర్తించి ఉన్న కొద్దిపాటి దళిత సాహిత్యం నవల కథ కవిత్వం మరుగు కాకుండా వెలుగులోకి తీసుకవస్తున్నారు. దళిత భాష కూడా జీవభాష తెలంగాణ అంటేనే మాండలికానికి పెట్టింది పేరు అలాంటి భాష విస్మరణకు గురి అయిన మాండలిక భాష జవసత్వాలను వ్యవహారిక భాషకు భిన్నంగా సాహితీ యవనిక పై నిలిపేందుకు దళిత భాష కొత్త పుంతలు తొక్కేందుకు దారులు వేసి ఎంతో గొప్ప మేలు చేశారు.
నేను డాక్టర్ బన్న ఐలయ్య గారితో రెండు దశాబ్దాల కాలంలో ఓ నాలుగు సార్లు కలిసా. నేను వారిని రెండు దశాబ్దాలకు పైగా గా ఎరుగుదును వారి గురించి వేముల ఎల్లన్నకు నాకు మధ్య సాహిత్య చర్చ జరిగిన సార్ గురించి ప్రస్తావించేవారు అలా వారు నాకు గుర్తుండిపోయారు కొన్నిసార్లు ఫోన్లో పలకరించాను అంత పెద్దాయన తన పనులు పక్కన పెట్టి మరి నాతో మాట్లాడడానికి టైం కేటాయించేవారు నేను నన్ను గురించి తెలుపుకుంటూ సాహిత్యానికి సంబంధించి వారితో చర్చించేవాడిని.సార్ ఇచ్చిన కాసింత చనువును సద్వినియోగం చేసుకున్నాను వారితో ఫోన్లో పలకరింపు మాత్రమే అప్పటికే వారు నన్ను గురించి విన్నారు నా సాహిత్యాన్ని చదివి ఉన్నారు “సూర” దళిత నవల వారి దృష్టిని ఆకర్షించింది దాని స్థానాన్ని పదుల పరుస్తూ 2012-13లో కాకతీయ యూనివర్సిటీలో పి.జి . తెలుగు లో పాఠ్యాంశంగా చేర్చారు అంతకంటే నా జీవితంలో నేను పొందిన గొప్ప అవార్డు మరొకటి లేదు అలా వారికి నేను ఆత్మీయుడినయ్యా.
నేను రాసిన “మాలవారి చరిత్ర” పుస్తక ఆవిష్కరణకు నల్లగొండకు ముఖ్య అతిథిగా ఆహ్వానించాను వారు సహృదయంతో వస్తానన్నారు అన్నమాట ప్రకారం నల్లగొండకు వచ్చారు అంబేత్కర్ జయంతి రోజున 14/4/2017 నల్లగొండ లో నా మాలవారి చరిత్ర ఆవిష్కరించబడింది. ఈ కార్యక్రమం లో సార్ తో పాటుగ నల్లగొండ జిల్లా కు చెందిన ప్రముఖ కవులు వేముల ఎల్లయ్య, వేణు సంకోజు, గాయకులు పైలం సంతోష్ పాల్గొన్నారు. “మాలవారి చరిత్ర ” పుస్తక ఆవిష్కరణ సభ లో డా. బన్న అయిలయ్య మాట్లాడుతూ ” దేశాన్ని సామాజికత వైపు నడిపించిన సామాజిక విప్లవకారుడు అంబేద్కర్ అని, అంబేత్కర్ భావజాలంతో వారి అడుగుజాడలో భూతం ముత్యాలు మాలవారి చరిత్ర ఆవిష్కరణ చేయడం ఒక చారిత్రక సంఘటన అని చెప్పుకోవచ్చు . దళిత, గిరిజనజాతి ప్రధాన జీవన స్రవంతికి దూరంగా ఉండి ఎవరైతే మేము గొప్ప సంస్కృతి కలిగిన కులాలం అని చెప్పుకుంటున్న ఆధిపత్య వర్గాలకు దీటుగా మాల మాదిగ కులాలు తమ తమ జాతి చరిత్రలను రాసుకోవడానికి సిద్ధపడుతున్నారు ఆ క్రమంలోనే భూతం ముత్యాలు మాలవారి చరిత్ర గ్రంథం తీసుకురావడం శుభ పరిణామం వారికి శుభాకాంక్షలు అంటూ సార్ నాకు కితాభిచారు . ఆరోజు సార్ ని మా ఇంటికి సాదరంగా ఆహ్వానించు డాక్టర్ బన్న ఐలయ్య సార్ మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించారు ఆ రాత్రి సార్ కోసం నేను చొరవ తీసుకొని బురద మట్ట చేపల కూర మా శ్రీమతి చే చేయించా ను సార్ సంతృప్తిగా భోంచేసి మెచ్చుకోలుగా ఆశీస్సులు ఇస్తూ రాత్రి తిరిగి వరంగల్ వెళ్లిపోయారు అప్పుడప్పుడు ఫోన్లో పలకరింపులు.
గత సంవత్సరం సెప్టెంబర్ 20న భూతం ముత్యాలు ఆత్మకథ ” సూరీడు ” షార్ట్ మూవీకి ప్రత్యేక ఆహ్వానితులుగా నేను ఆహ్వానించిన వారు వేముల ఎల్లన్న డాక్టర్ బన్న ఐలయ్య సార్ డాక్టర్ కొలగలూరి ఆశాజ్యోతి మేడం. నా మిత్రుడు గ్యార నరసింహ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కు ఆహ్వానించా. ఆరోజు ఉదయం 11 గంటలకల్లా అతిథులుగా విచ్చేసిన వారు డాక్టర్ శ్రీ బన్న ఐలయ్య గారు వరంగల్ కాకతీయ యూనివర్సిటీ నుండి విచ్చేయగా మరియు శ్రీమతి డాక్టర్ కొలకలూరి ఆశాజ్యోతి బెంగళూరు యూనివర్సిటీ నుండి హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కు విచ్చేసినారు. షూటింగ్ ప్రారంభ వేడుకలో నన్ను గురించి వేదికపై సార్ మాట్లాడుతూ కవి రచయిత బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన భూతం ముత్యాలు అనే కవి ని ప్రసిద్ధ దళిత కవి వేముల ఎల్లయ్య చెక్కిన శిల్పం భూతం ముత్యాలు వారి నుండి మరిన్ని రచనలు రావాలని, కాకతీయ విశ్వవిద్యాలయంలో తానే స్వయంగా చొరవ తీసుకొని భూత ముత్యాలు సూర అనే నవలను పాఠ్యాంశంలో చేర్చానని డాక్టర్ బన్న ఐలయ్య గారు పేర్కొన్నారు. అలాగే ఆశాజ్యోతి గారు బెంగళూరు యూనివర్సిటీలో తెలంగాణ నుండి తెలుగు దళిత జీవితానికి ప్రాముఖ్యతనిస్తూ భూతం ముత్యాలు రాసిన “సూర” అనే నవలను పాఠ్యాంశంగా చేర్చినట్టు ఈ సందర్భంగా పేర్కొన్నారు అలా రచయిత ముత్యాలు ను ప్రశంసిస్తూనే అతని రచనలను వివరిస్తూనే తెలంగాణ దళిత జీవితానికి ఉన్న గొప్పతనాన్ని వివరిస్తూ అలా దళితుల భాష దైనందిన సంస్కృతి సాంప్రదాయాలను రికార్డు చేస్తూ కథలు నవలలు తీసుకొస్తున్న భూతం ముత్యాలు ఒక గొప్ప రచయితగా స్లాగిస్తూ ఇరువురు భూతం ముత్యాలకు శుభ ఆశీస్సులతో పాటు శుభాకాంక్షలు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో ప్రసిద్ధ కక్క నవల రచయిత వేముల ఎల్లయ్య సైతం పాల్గొని నాకు అభినందనలు తెలియజేశారు ఇంకా ఈ కార్యక్రమంలో మూవీ డైరెక్టర్ లింకా బుక్ ఆఫ్ రికార్డు శ్రీకర్త డాక్టర్ పి సి ఆదిత్య గారు హిట్ చిత్రాల దర్శకులు రేలంగి నరసింహ రావు గారు ముత్యాలు పై తొలి క్లాప్ ఇవ్వగా తెలుగు ప్రసిద్ధ సినీ నటులు తారాగణం పాల్గొన్నారు ఈ సందర్భంగా నా స్వీయ జీవిత ఆత్మకథ ఒక లేశ భాగం 55 నిమిషాల నిడివి కలిగిన “సూరీడు” సినిమా షూటింగ్ ప్రారంభోత్సవానికి విచ్చేసి ఆశీస్సులు తెలియజేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకున్న సందర్భం నా జీవితంలో ఓ మైలురాయి అలా బన్న ఐలయ్య సార్ తో రెండోసారి అతి రధ మహా రథుల ముందు ఒక మధుర జ్ఞాపకం.
అటు పిమ్మట అదే సంవత్సరం డిసెంబర్ 26న హైదరాబాద్ రవీంద్ర భారతిలో ( ఖమ్మం జిల్లా మధిర కు చెందిన ఉపాధ్యాయ మిత్రులు వేము రాములు నా సాహిత్యం మీద మక్కువతో బ్లాక్ సిగ్నేచర్ పేరున పుస్తకం తీసుకువచ్చారు ) బ్లాక్ సిగ్నేచర్ పుస్తక ఆవిష్కరణ మహోత్సవం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశిష్ట అతిథులుగా డాక్టర్ మామిడి హరికృష్ణ, డాక్టర్ బన్న ఐలయ్య గారు, డాక్టర్ దార్ల వెంకటేశ్వరరావు సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు హెచ్డి, డాక్టర్ జివి రత్నాకర్ మౌలానా ఉర్దూ యూనివర్సిటీ హిందీ హెచ్‌వోడి, తెలంగాణ ప్రఖ్యాత విమర్శకులు రచయిత సంగిశెట్టి శ్రీనివాస్ గారు, ప్రముఖ రచయిత కోట్ల వెంకటేశ్వర రెడ్డి డాక్టర్ గంజికుంట్ల రామారావు బ్లాక్ సిగ్నేచర్ పుస్తక రచయిత వేము రాములు కుటుంబ సమేతంగా పాల్గొనగా నేను సతీసమేతంగా ఇరువురం పాల్గొన్నాము భూతం ముత్యాలు సాహిత్యాన్ని కథ నవల వ్యాసం కవిత్వం మొత్తం పది వ్యాసాలు సద్విమర్శతో కూర్చి రాసిన వేము రాములు ఈ పుస్తకాన్ని డాక్టర్ బన్న ఐలయ్య సార్ కు అంకితం ఇచ్చారు వినమ్రతతో వారు రవీంద్ర భారతి హైదరాబాద్ వేదికగా బ్లాక్ సిగ్నేచర్ వ్యాస కృతిని స్వీకరించారు వచ్చిన వారందరూ బ్లాక్ సిగ్నేచర్ రచయితను అందులోని వస్తువుకు కారణమైన భూతముత్యాలు అనే నన్ను మెచ్చుకోలుగా ఆశీర్వచనాలు శుభాశీస్సులు పలికారు వారందరినీ నేను ఎరుగుదును వారితో నా సాహితీ ప్రయాణంలో చిరపరిచితులే వారందరూ
అలా మూడవసారి డాక్టర్ బన్న అయిలయ్య సార్ తో వేదిక పంచుకున్నాను వారితో నాకున్నా అనుబంధం విడదీయలేనిది వారికి నేను స్టూడెంట్ ని కాకపోయినా శిష్యుడుగానే భావిస్తున్నారు ఆయన కాకతీయ విశ్వవిద్యాలయం అనే పూతోటమాలి అని నా అభిప్రాయం ఆయన చల్లని చూపుల కింద ఎందరో విద్యార్థులు పేజీలు పిహెచ్డీలు చేసి పట్టభద్రులు వివిధ హోదాలలో పనిచేస్తుండడం గమనార్హం 30 ఏళ్లకు పైన కళాశాల ఆచార్య వృత్తికే వన్నెలద్దినవారు. ఆయన సేవలు చిరస్మరణీయం ఆచార్యుని గానే కాక కవి రచయితగా ఎన్నో గ్రంథాలు వెలువరించి సాహితి పిపాసిగా వినతికెక్కారు నాకు నా నవల సాహిత్యానికి మీరు ఇచ్చిన గుర్తింపు ఎన్నటికీ తీరనిది ఇంతటి ఘనాపాటి అయిన డాక్టర్ బన్న ఐలయ్య సార్ కి నేనేమీ ఇవ్వగలను చంద్రునికో నూలుపోగు చందం ఎప్పటికీ ఆరిపోని వసివాడని అజరామరా నిప్పు కణిక మీరు. మీకివే నా ఈ అక్షరాల పాదాభిషేకం సమర్పించుకుంటున్నారు.