పూశిశువుకు పాలపీకనై
జీవరసాలను కుడిపికుడిపి
తల్లి కాని తల్లినవుతాను
కష్టసుఖాల సంవేదనలను
అటుయిటు మోసుకుపోతూ
చెట్టుకూ పూవుకూ నడుమ
పచ్చటి చిరువంతెననవుతాను
పూవును చెట్టునుండి విడదీసే
కఠినమైన బాధ్యతను నాపై పెట్టింది ప్రకృతి
ప్రేగుతో బిడ్డ తల్లిని వీడినట్లు
ఒకనాటికి నాతోపాటు పూవూ
చెట్టును వీడి నేలరాలుతుంది
నన్నే తల్లిగా తలపోస్తూ
గట్టిగా హత్తుకునుండే పూవు
గాలికీ ఎండకూ కమలిపోయి
మట్టిలో కలిసిపోతూ కంటతడిపెట్టుకుంటూ
చివరివరకూ కనిపెట్టుకునున్న నన్ను
ఓరిమికవచంగా కొనియాడుతుంది
జీవితాంతం నన్నంటిపెట్టుకున్న పూవు
తుదిశ్వాస విడిచాక
నా బాధ్యత తీరిపోయినట్లే
ఇక నా పాత్రా చివరి అంకానికి చేరినట్లే
రంగూ రూపం తేనే తావీ
కలగలిసిన భువనైకసౌందర్యం పువ్వు
విత్తుకూ వేరుకూ ఆకుకూ రెమ్మకూ
కొమ్మకూ మానుకూ లేని విలువ
నేను సాకిన పువ్వుకే
చెట్టుకిరీటంలో
మెరిసే అనర్ఘరత్నం పువ్వే
ఆ పూవుకు జీవితాంతం సేవలు చేసిన నన్ను
కనీసం ఆయాగా గుర్తిస్తారా ఎవరైనా
మనసారా ఒక పద్యం రాస్తారా ఎపుడైనా