ప్రకృతిలోని చెట్టూ పుట్టా, రాయీ రప్పా ఏదైనా కావచ్చు. కానీ ఆయన ‘దృష్టి’ అందులోని సౌందర్యాన్ని దర్శిస్తుంది. మనసు అంతకంటే వేగంగా స్పందిస్తుంది. చేతులు అమాంతం కుంచెను పట్టుకుంటాయి. వేళ్ళకొనల నుండి మిశ్రమ వర్ణాలు జారుతూ వివిధ ఆకృతులుగా రూపాన్ని సంతరించుకుంటాయి. అవి హృదయాలను ముగ్ధమనోహరంగా దోచుకుంటాయి. అంతటి మహనీయుడు, మాననీయుడు మరెవరో కాదు. ఆయనే భరతజాతి గర్వించదగిన తెలుగు బిడ్డ ప్రముఖ చిత్రకారుడు కొండపల్లి శేషగిరిరావు.

ఆయన శత జయంత్యుత్సవ సందర్భంగా హైదరాబాదులో ఆయన చిత్రకళాప్రదర్శన ఏర్పాటు చేయాలనే సంకల్పం కుటుంబ సభ్యులకు కలగడం ముదావహం. పట్టుదలతో శ్రమించి ఆయన చిత్రాలన్నీ భద్రపరచి పదిరోజులపాటు ప్రజల సందర్శనార్థం ప్రదర్శనను ఏర్పాటు చేయడం ఆషామాషీ వ్యవహారం కాదు. వృద్ధాప్యదశలో తల్లిదండ్రులను పట్టించుకోకుండా
వృద్దాశ్రమాల్లోనూ, రోడ్లపైనో వదిలివేస్తున్న వారసులున్న ఈ రోజుల్లో తమ ఇంట్లో విరిసిన చిత్రకళా కుసుమాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆయన వారసులుగా గర్విస్తూ, ఆ కళావిభవాన్ని నలుగురికీ పంచాలనుకున్న వారి ఆకాంక్ష ఎంతగానో ప్రశంసనీయమైనది.

కొండపల్లి శేషగిరిరావు 1924, జనవరి 27న తెలంగాణలో వరంగల్ జిల్లా, మహబూబాబాద్ మండలంలోని పెనుగొండ గ్రామంలో జన్మించారు. బాల్యం నుండే ఆయన మదిలో చిత్రకళా బీజాలు నాటుకున్నాయి. పాఠశాలలో డ్రాయింగ్ మాష్టర్ దీన్ దయాళ్ “భవిష్యత్తులో ఈయన ఒక గొప్ప చిత్రకారుడు అవుతాడ”న్న విషయాన్ని ఆనాడే ఊహించడం చిన్ననాటనే వెలువడిన శేషగిరిరావు సృజనాత్మకతకు అద్దం పడుతుంది. మాష్టారు గారి ఊహ వమ్ము కాలేదు. శేషగిరిరావు అఖండ ప్రజ్ఞాపాటవాలతో వెలువడిన అపురూప చిత్రకళాఖండాలు అశేష జనులను ఆకర్షించాయి. ఆయనకు వెలకట్టలేని గౌరవాన్ని ఆపాదించాయి.
వరంగల్ జిల్లాలోని రామప్ప దేవాలయం మన శిల్పకళకు కాణాచి. అటువంటి ఘన శిల్పసంపద

ఆయనను ఉత్తేజితుణ్ణి చేసింది. వాటి నుండి స్ఫూర్తి పొంది ఆ శిల్పకళను లావణ్యవంతమైన చిత్రకళగా మార్చి ప్రముఖుల చేత ఔరా! అనిపించుకున్నాడు. ఆయనకున్న భక్తి తత్పరతలు అపారం. అందుకే అనేక పర్యాయాలు భాగవతాన్ని చదివి భక్త కవిపుంగవుడైన పోతన చిత్రానికి జీవం పోశాడు. ఆనాడు ఆంధ్రపత్రిక ముఖచిత్రంగా వచ్చిన ఆ చిత్రాన్ని చూసిన తెలుగు ప్రజలకు పోతన పట్ల ఆదరాభిమానాలు ఇనుమడించి దాన్ని ఫ్రేములు కట్టించుకున్నారంటే శేషగిరిరావు చిత్రకళా సామర్థ్యం అవగతమవుతున్నది. ఆయన చిత్రాల్లో ఇతిహాస గాథలు, కావ్యాలు, చారిత్రకాలు కూడా చోటు చేసుకోవడం ఆయనకున్న విషయ పరిజ్ఞానాన్ని విదితపరుస్తున్నాయి. 1975వ సంవత్సరంలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన వేసిన తెలుగుతల్లి చిత్రం ఆయనకు ప్రముఖుల ప్రశంసలతో పాటు అభిమాన నీరాజనాలు అందించింది.
శేషగిరిరావు శకుంతల కథను విశ్వామిత్ర, మేనకల నుండి మొదలుకొని క్రమపద్ధతిలో తీర్చి చిత్రకావ్యంగా మలిచారు. శ్రీమద్రామాయణంలో గుహుడు, అహల్య, పట్టాభిషేకం, శబరి, లంకానగరంలో సీత దుఃఖం మొదలైన ఘట్టాలు వర్తమానంలోజరుగుతున్న అనుభూతిని కలిగిస్తాయి. పోతనకు సరస్వతీ దేవి సాక్షాత్కరించడం, గజేంద్రమోక్షం, మహిషాసురమర్దనం, పాండవుల అరణ్యవాసం, గీతాబోధ, రాధాకృష్ణుల ప్రణయం, రుద్రమదేవి, వీరనారి ఝాన్సీలక్ష్మి మొదలైన అనేక చిత్రాలు అత్యంత సుందరంగా ఆయన కుంచె నుండి రూపుదిద్దుకున్నాయి.


జానపదుల జీవితంలోని కాయకష్టాన్ని కూడా ఆయనచేయి స్పృశించింది. కళాకారులందరూ ప్రకృతి ఆరాధకులు. శేషగిరిరావు కూడా అంతే తాదాత్మ్యంతో, అత్యంత ప్రావీణ్యంతో పశు పక్ష్యాదులను తీర్చిన వైనం అనన్యసామాన్యం. ఎంతో జాగరూకతతో ఈ చిత్రాలను పరిశీలిస్తే పరమాణువంత చిన్న విషయాన్ని కూడా ఆయన ఎంత సునిశితంగా పరిశీలించి పరిగణనలోకి తీసుకున్నారో తేటతెల్లమవుతుంది.
ఇది మన వారసత్వం. ప్రజలకు ఆనందాన్ని, ఆహ్లాదాన్నిచ్చేవి లలితకళలు. వీటిని కాపాడుకోవాల్సినబాధ్యత మనందరి మీదా ఉంది. అంతేకాదు. ఇంతటితో ఆగిపోకుండా ఈ మార్గదర్శకత్వంలో ఇటువంటి మరోతరం రావాలి. భారతీయ కళ నలువంకలా కీర్తిపతాకాలను ఎగురవేయాలి. శేషగిరిరావు కుటుంబసభ్యులు ఆయన చిత్రకళా ప్రదర్శన ఏర్పాటుచేసి ఆయన గురించి అందరికీ తెలిసేలా చేస్తున్నందుకు వారికి శుభాభినందనలు.