డాక్టర్ అమృతలత మయూఖ అంతర్జాల పత్రిక సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీలోద్వీతీయబహుమతి పొందిన కథ (రూ.5,000)
కరీంనగర్ జిల్లా హెడ్ క్వార్టర్లో అదో వాడ. పేరు మంకమ్మతోట. ఆ వాడలో రాజభవనం లాంటి పెద్ద బంగ్లా. ఆ బంగ్లాముందు విశాలమైన ఖాళీస్థలం. ఆ ఖాళీ స్థలంలో వందల మంది వచ్చినా సరిపోయేంత స్థలంలో టెంట్లు. ఆ టెంటు నీడలో నాలుగైదు వందల కుర్చీలు. అటు ప్రక్కన భోజనాలు చేయడానికి టేబుళ్లు.. వాటిపై మటన్, చికెన్, ఫిష్,గుడ్ల కూరలున్న పాత్రలు అందులోంచి వస్తున్న మసాలా ఘాటు ఘుమఘుమలు. కుర్చీలకెదురుగా ఓ మలకు టేబుల్‌పై లక్ష్మారెడ్డి నిలువెత్తు విగ్రహం. ఆ విగ్రహానికి వేయబడున్న పెద్ద పూలమాల. టేబుల్‌పై ఓ పాత్రలలో పువ్వులు, పసుపు కలిపిన బియ్యం, కుంకుమ ఉన్నాయి. ఆరోజు లక్ష్మారెడ్డి గారి పెద్దకర్మ దినం. శ్మశానానికి వెళ్ళి కర్మ కార్యక్రమాదులన్నీ ముగించుకొని తిరిగి వచ్చారు ఇద్దరు కొడుకులు, వారి కుటుంబ సభ్యులు, అపరాహ్నవేళ దాటింది. జనం వస్తున్నారు. లక్ష్మారెడ్డి ఫోటోపై పూలు, అక్షింతలు చల్లి నుదుటిపై బొట్టుపెట్టి వచ్చి కుర్చీల్లో కూర్చుంటున్నారు. లక్ష్మారెడ్డి కొడుకులను కలుసుకొని మాట్లాడుతున్నారు. ‘‘రాంరెడ్డి, ప్రకాశ్‌రెడ్డి ఒక్కపొద్దు విడిచిండ్రు కదా! ఇక భోజనాలకు లేవండి’’ అన్నాడో పెద్దమనిషి. జనమంతా టేబుళ్ళ దిక్కు కదులుతున్నారు. చావు విందు మొదలయ్యింది. నాన్‌వెజ్ కూరల ఘుమఘుమలు ఆ ప్రదేశమంతా వ్యాపించాయి. వడ్డించేవాళ్లు వడ్డిస్తున్నారు. తినేవాళ్ళు తింటున్నారు. లోపలి గదుల్లో కూచొని కొందరు మద్యపానం సేవిస్తున్నారు. ఆ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళంతా విదేశీమద్యం సీసాలు తెస్తున్నారు. వాళ్ళతో కలిసి మద్యం సేవిస్తున్నారు. గత పదిరోజులుగా ఆ ఇంట్లో మద్యం ఏరులై పారుతుంది. ఆచారం, సాంప్రదాయం పేరుమీద మద్యపానం ఇంటి ఓనర్లతో కలిసి తాగడం జరుగుతూనే ఉంది. కర్మరోజు వందల సంఖ్యలో మంది రావడం వల్ల మద్యసేవనం, మాంసం విందుతో ఇంటి గాల్లో కూడా ఆ వాసనే వీస్తుంది. మాంసాహార టేబుళ్ళ ముందే తండోపతండాలుగా జనాలు. వెజిటేరియన్ దిక్కుపోయేవాళ్ళు వేళ్ళమీద లెక్కబెట్టేంతమంది కూడా లేరు. చావు విందు బహు పసందుగా సాగుతుంది. విందుకొచ్చిన జనాల్లో కార్పొరేటర్లు. మాజీ ఎమ్మెల్యేలు, గ్రామాలనుంచి వచ్చిన చుట్టాలు, బంధువులు అనేకులున్నారు. బగారన్నం, మాంసం, చికెన్లతో సుష్టుగా భోంచేస్తూ తండ్రికి ఘనంగా కర్మ చేస్తున్న కొడుకుల గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు జనం. ‘‘పదకొండు రోజుల్నుంచి వచ్చే జనం పోయే జనం. మందలించుటానికి వచ్చి తాగడం. ఇంటి నిండా జనమే…’’ బొక్కలోని పూలుగు పీలుస్తూ అన్నాడు వెంకటయ్య. ‘‘బహుగ బతికిండు లక్ష్మారెడ్డి. పెద్దపల్లి జిల్లాలున్న ఊళ్ళె మస్తు భూములుండె. అన్నల లొల్లికి కరీంనగర్‌కు వచ్చిండు. భుములమ్ముకోని ఇక్కడ ఇండ్లు గట్టుకున్నడు. కిరాయలతోనే బతికేంత ఆదాయం.’’ ‘‘కొడుకుల సదివిచ్చిండు. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. కోడండ్లు గూడ ఇంజనీర్లే. వాళ్ళు హైదరాబాద్‌ల విల్లాలల్ల ఉంటున్నరు…’’ ‘‘కొడుకులు కర్మ మాత్రం బ్రహ్మాండంగ చేస్తున్నారు….’’ ‘‘పదిగొర్లు తెగినయనుకుంట…’’ ‘‘అగో.. గా అండలు చూస్తె అర్థమైతలేదా?’’ ‘‘పది రోజుల్నుంచి ఇంట్ల మందు విందులు మస్తు నడుస్తున్నయి…’’ ‘‘వంటలు బాగున్నయి. ఎవ్వలకిచ్చిండో?’’ ‘‘క్యాటరింగ్ వాళ్ళను పిలిచి సామాన్లు కొనిచ్చి వండినందుకు ఇంత ఇవ్వడమని కాంట్రాక్టు మాట్లాడుకున్నడట….’’ ‘‘క్యాటరింగ్ వాళ్ళయితెనే బాగ వండుతరు…’’ మాంసాహార భోజనం పసందుగా తింటూ మాట్లాడకుంటున్నారు వాళ్ళు. ‘‘హోటల్వాళ్ళకు ప్లేట్‌కు ఇంతని ఇస్తే ఐపోయేది కద!’’ ‘‘వాళ్ళు ప్లేట్‌కు ఏడెనిమిదివందలు తీసుకుంటరు. బిర్యానీల వేసేది ఒక్క ముక్క. ఇప్పుడు జూడు చికెన్ బిర్యాని, మటన్ బిర్యాని, మటన్, చికెన్, ఫిష్ కర్రీలు, బగారన్నం, తెల్లన్నం. అదే ఖర్చుతోని రెండు మడింతలు తినచ్చు’’ బిర్యానీ ముక్క కొరుకుతూ అన్నాడొకాయన. ‘‘ఎంతయినా చావు కూడ పెండ్లంత ఖర్చుతో కూడుకున్నదవుతుంది ఇవన్ని చూస్తుంటే’’ ‘‘లక్ష్మారెడ్డి బాగానే సంపాయించిండు. కొడుకులు లక్షలల్ల సంపాయిస్తున్నరు. ఖర్చుపెడితె ఏం బోతంది?’’ ‘‘కాదోయ్ నర్సిరెడ్డీ! నాకు అర్థం కాని దొక్కటుంది’’ ‘‘నర్సింలూ! జగమెరిగిన బ్రాహ్మణసోంటని నువ్వు నీ కర్థం కాని దేముంటదో చెప్పు! గదేందో చెప్పలేవు’’ అన్నాడు నర్సిరెడ్డి. ‘‘నాతోనే చెప్పియ్యన్ననని కని నీకు తెలవదా నర్సిరెడ్డీ! ఓ దిక్కు ఇంట్ల మనిషి చనిపోయిన దుఃఖముంటది. మరో దిక్కు చనిపోయిన్నాటి నుంచి మాట్లాడించుటానికని వచ్చినోల్లు కల్లో, బ్రాందో తెచ్చి చనిపోయినోల్ల కొడుకులతో కలిసి తాగుడు. మనిషి చచ్చిపోయిండని ఏడ్సుడా? మందలిచ్చి వత్తామన్న పేరుమీద తాగుడా? గీ పనయితె నాకు మంచిగని పియ్యది. పది పన్నెండు రోజులు చనిపోయినింట్ల మద్యం. ఇప్పుడయితె బ్రాంది, విస్కీలు, బీర్లు, వరదలై పారుతయి? గిదేం సంస్కృతి?’’ అన్నాడు నర్సింలు. ఆ మాటలతో తినడమాపారా నలుగురైదుగురు. నర్సింలు మాటల్లోని నగ్నసత్యాల గురించాలోచిస్తున్నరు. ఇది ఈ రోజు కాదు. తరతరాలుగా నడుస్తున్నదని వాళ్ళందరికీ తెలుసు. ఎంత సంపన్న కుటుంబమైతే అంతెక్కువగా ఆ ఇంట్లో మద్యం వరదలై పారుతుంటుంది. ‘‘నర్సింలూ! నాగ్గూడ గిది ఆచారమో, మరేందో కాని మంచిగని పియ్యది. కాని ఓ దిక్కు ఆడోల్ల ఏడ్పులు, మనిషి పోయాడన్న బాధ మరో దిక్కు చూడటానికి వచ్చిన అతిథులతో కలిసి తాగుడు. నా కయితె ఇగో దినాల రోజు మాంసం ముక్కలు నోట్లె పెట్టుకోవన్నంటెనే మంచిగనిపించదు. ఒక్కొక్కడు ఎలా తింటున్నాడో సూడు. లోపల కూసుండి ఎట్ల తాగుతున్నరో సూడు?’’ అన్నాడు శంకర్రావు. ‘‘అనుకుంటనుకుంటనే అరకిల మాంసం తిన్నవు కదనోయ్ శంకర్రావు… ఇది మనకు ఆచారంగ వస్తుంది. ఇంట్లో ఆత్మీయులు పోయి దుఃఖంలో ఉన్న మనిషిని ఆ దుఃఖంను మరిచిపోయేట్టు చేయడానికి ఆతనితో కూసుండి తాగడం మామలే. మాట్లాడుకుంటూ తాగడం వల్ల ఆ సమస్యనుండి వ్యక్తి దృష్టి మరలుతుంది. ఇది వట్టిగ పెట్టిన ఆచారమేం కాదు. కాకపోతే రోజు రోజుకు ఇది మరింత పెరుగుతుంది.డబ్బు, ఉద్యోగాలు, చదువులు పెరిగిం తర్వాత ఇది మరీ ఎక్కువయింది. ఎంత బాగ తాగుతె, తాగిస్తె, ఎంత ఖర్చెక్కువ పెట్టి మాంసాహారం పెడితె అంత గొప్పన్నట్టు తయారైంది’’ అన్నాడు వీరారెడ్డి. ‘‘అగొజూడు ఎట్ల తింటున్నరో? చావుకొచ్చిన వాళ్ళు జోకులేసుకుంట పెళ్ళి విందు కంటెక్కువ చావు విందును ఎంజాయ్ చేస్తున్నారు. ఇపుడు చాలా పెళ్ళిళ్ళలో వెజటేరియన్ భోజనమే ఉంటే చాలా చావుల్లో మాత్రం మటన్, చికెన్, తాగుల్లు తప్పడం లేదు. అంటె పెళ్ళి కంటె చావే ఖర్చుతోని కూడుకున్నదయింది…’’ గుంపులుగా కూర్చొని, నిల్చొని రకరకాలుగా మాట్లాడుకుంటూ చావు విందును పసందుగా ఆరగిస్తున్నారు జనం. లక్ష్మారెడ్డికి కూతుర్లు లేనందువల్ల ఆడవాళ్ళ ఏడ్పులూ వినబడటం లేదు. పల్లెటూళ్ళలోలా గొంతెత్తి వల్లించుకుంటూ ఏడ్చే సాంప్రదాయం క్రమక్రమంగా దూరమవుతుంది. పల్లెల్లోనూ ఇందువరకటిలా భోరుమని తల, కడుపుపై కొట్టుకుంటూ ఏడ్వడం జరుగడం లేదు. పట్టణాల్లో, సంపన్న కుటుంబాల్లో నయితే చావు విందంటే ఓ విలాసవంతంగా తాగితినే పార్టీగా మారిపోయింది. ‘‘రాంరెడ్డి, ప్రకాశరెడ్డి తండ్రి కర్మను మస్తు చేస్తున్నరు….’’ ‘‘వాళ్ళకేంది? ఇద్దరు షాఫ్ట్వేర్ ఇంజనీర్లు. తండ్రి సంపాయించి ఇచ్చింది గూడ మంచిగనే ఉంది. చచ్చిపోయినంక పార్టీ అయినా మంచిగ చెయ్యకుంటేం జేత్తున్నరు…?’’ ‘‘తెలంగాణల గీ పార్టీలల్ల మందు, మాంసం విందులు అతి మామలే. ఎవ్వల శక్తి కొద్ది వాళ్ళు మందు తాగిస్తరు. తాగుతరు. విదేశీ మందు బాటిల్ల పెట్టెలు, మిలట్రీ కాంటీన్ల పెట్టెలు మస్తు తెప్పిచ్చిండ్రు రాంరెడ్డి, ప్రకాశరెడ్డి. హైదరాబాద్‌ల ఉంటున్నరు గద! అక్కడన్ని దొరికె..?’’ ‘‘మరి గక్కడుండెటోల్లు గీ కరీంనగర్ల ఎందుకు కర్మ జేత్తన్నడు?’’ ‘‘ఎందుకంటె కరీంనగర్ జిల్లాలనే ఆల్ల బంధువులందరున్నరు. ఇగొ గీపెద్ద ఇల్లున్నది. ఆస్తులున్నయి. లక్ష్మారెడ్డి స్నేహితులున్నరు. వీళ్ళందర్ని హైదరాబాద్ కచ్చి తాగితిని పొమ్మంటె పోతరా? ఏదో కొద్దిమంది గక్కడికి పోతరు గావచ్చు…’’ ‘‘ఇద్దరు కొడుకులు కోట్ల విలువలు చేసే విల్లాలల్ల ఉంటున్నరు. నెలకు లక్షల్లో సంపాయిస్తున్నరు. తండ్రి కోసం గీ మాత్రం చేయడం పెద్దగొప్పేం కాదు…’’ చాలా సేపట్నుంచి వాళ్ళ మాటలు వింటున్నాడు కొంరయ్య ఆయన రిటైర్డ్ హెడ్ మాస్టర్. లక్ష్మారెడ్డికి ప్రాణస్నేహితుడు. మిత్రుడి గురించిన ప్రతి విషయమ కొంరయ్యకు తెలుసు. ఊళ్ళో ఉన్నప్పట్నుంచే బాల్య స్నేహితుడైన కొంరయ్య ప్రస్తుతం కరీంనగర్‌లోనే ఉంటున్నాడు. తన స్నేహితుడి పెద్దకర్మ కార్యక్రమానికి రావాల్సి రావడం కొంరయ్యకు బాధాకరంగానే ఉంది. రుచికరమైన ఆ మాంసాహార భోజనం, బిర్యానీ ఎంత ప్రయత్నించినా నోట్లోకి పోవడం లేదు. వందలాది జనం అదో పెండ్లి విందు అన్నట్టుగా మాట్లాడుకుంటూ , జోకులేసుకుంటూ విందుభోజనం చేస్తున్నా కొంరయ్యకది నచ్చడం లేదు. గరం మసాలా దట్టించిన ఆ మాంసం ముక్కలు, చికెన్ ముక్కలు రుచించడం లేదు. మొదటిసారి కంచంలో వేసుకున్న అన్నాన్నే వేళ్ళతో గెలుకుతున్నాడు. ఆ అన్నమే కాదు. ఆ కార్యక్రమానికి వచ్చిన మిత్రులు, ఆహూతులు మాట్లాడుతున్న మాటలూ ఆయనకు నచ్చడం లేదు. అందుక్కారణం లక్ష్మారెడ్డి తనకు ప్రాణస్నేహితుడు కావడం మాత్రమే కాదు. ఆతని జీవితాన్ని దగ్గరగా చూడడం. చావుబువ్వను సుష్టుగా భోంచేస్తూ జనం అనుకుంటున్న మాటలను భరించలేకపోతున్నాడు కొంరయ్య. ఇక మౌనంగా ఉంటూ ఆ మాటలను వినదలుచుకోలేదు. ‘‘అవును లక్ష్మారెడ్డి కొడుకులు తండ్రి కర్మను ఘనంగా చేస్తున్నారు. ఎందుకంటే మీరంతా వారం పదిరోజుల్నుండి మందు మాంసం విందులతో ఎంజాయ్ చేస్తున్నారు కదా! చచ్చినాక కర్మ ఎంత ఘనంగా చేసినా ఒరిగేదేంటి? చచ్చిన వ్యక్తేమైన చూస్తాడా? వృద్ధాప్యంలో నిర్లక్ష్యానికి గురిచేసి చచ్చినాక లక్షలు, కోట్లు ఖర్చు చేసినా ఒరిగేదేంటి? నాకయితే ఈ కర్మలు, చావుతంతు బాగా తినడానికి తాగడానికే ననిపిస్తుంది. దయచేసి మీరు ఎన్నడూ మటన్ మొకం చూడనట్టు తినడం, కృతజ్ఞత కోసమన్నట్టు పొగడ్తలాపండి’’ మిత్రుడు జ్ఞాపకం వచ్చి కన్నీరు కారుస్తూ అన్నాడు కొంరయ్య. ఆ మాటలతో కొంరయ్య చుట్టు ప్రక్కలున్న జనం మాటలాపారు. నోట్లో పెట్టుకోబోయిన మాంసపు ముక్కలనూ అలాగే చేతిలో పట్టుకొనున్నారు లక్ష్మారెడ్డికి సన్నిహిత మిత్రుడైన కొంరయ్య కళ్ళవెంట నీళ్ళు కారుతుండటం చూసి చలించిపోయారు. కొద్దిసేపక్కడ మౌనమే రాజ్యమేలింది. ‘‘ఏంటి కొంరయ్యా నువ్వనేది? లక్ష్మారెడ్డికి ఆయన కొడుకులు ఏం తక్కువ చేసారు? వృద్ధాప్యంలో తమతోనే ఉంచుకున్నారు కదా! హైదరాబాద్‌లో రాజభవనాల్లాంటి విల్లాలు కొన్నారు. నీ మాటలు వింటుంటే కొడుకులు తండ్రిని కడుపు మాడ్చారన్నట్లర్థమవుతుందరికీ. నీకు ఇలాంటి తద్దినఖర్చులు ఇష్టం లేనంతమాత్రాన రాంరెడ్డి, ప్రకాశ్‌రెడ్డిలను బదునాం చేయడం బాగా లేదు. నాకు తెలిసి వాళ్ళు తండ్రిని బాగానే చూసుకున్నారు…’’ అన్నాడు మల్లారెడ్డి. ‘‘మల్లారెడ్డీ! నీకు పైపై విషయాలు మాత్రమే తెలుసు. లక్ష్మారెడ్డి నాకు చాలా దగ్గరి మిత్రుడు కాబట్టి ఆయన అంతరంగం తెలుసు. వృద్ధాప్యంలో ఆయన అనుభవించిన వేదన తెలుసు. బతికున్నప్పుడు తల్లిదండ్రుల కడుపులు మాడ్చి చచ్చింతర్వాత జనం చూసేట్టు కర్మ కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేసే మధ్యతరగతి ప్రబుద్ధులూ ఉన్నారు. లక్ష్మారెడ్డికి అలా జరిగిందని నేననడం లేదు. కాని ముసలివయస్సులో వాళ్ళకు కావాల్సింది కడుపునిండా తిండిమాత్రమే కాదు రెడ్డీ! ఒకింత ప్రేమ. ఆప్యాయత, తన రక్తం పంచుకు పుట్టిన వాళ్ళతో, వాళ్ళ పిల్లలతో గడుపాలన్న కోర్కె. ఇవేవీ లక్ష్మారెడ్డికి లభించలేదు. ముసలితనాన్ని ఖరీదైన వృద్ధాశ్రమంలో ఒంటరిగా గడిపాడు. బిక్కు బిక్కుమంటూ గడిపాడు. తన మనుమలు, మనుమరాడ్రంతోని పిల్లల్లో పిల్లవాడై బతకలేక పోతున్నాన అంగలారుస్తూ బతికాడు’’ కళ్ళనీళ్ళు తీసుకుంటూ అన్నాడు కొంరయ్య. కడుపులోంచి తన్నుకొస్తున్న దుఃఖాన్ని బలవంతంగా అణుచుకుంటున్నాడు. అప్పటికే సుష్టుగానే భోంచేసారు కొంరయ్య చుట్టున్న వాళ్ళంతా. కొంరయ్య మాటలు విన్న తర్వాత, కన్నీరు చూసిం తర్వాత మరింత తినాలనున్నా తినడానికి మనసొప్పలేదు. ప్లేట్లలో మిగిలిన అన్నంలో పెరుగు వేయించుకున్నారు. ‘‘కొంరయ్యా! లక్ష్మారెడ్డిని హైదరాబాద్‌లో ఖరీదైన వృద్ధాశ్రమంలోనే లక్షల డొనేషన్ కట్టి నెలకు వేలల్లో ఖర్చు పెడుతూ ఉంచారు కదా! ఇంకేం చెయ్యమంటావు వాళ్ళను? ఇక్కడ ఒంటరిగా ఉండలేడని తండ్రిని హైదరాబాద్ తీసుకెళ్ళారు. లక్ష్మారెడ్డి కొడుకులు, కోడండ్లు ఉద్యోగులే కాబట్టి వృద్ధాశ్రమంలో ఉంచడంలో తప్పేముంది? ఇద్దరూ ఉద్యోగానికి వెళ్తూ తండ్రినెలా చూసుకోగలరు? నిజానికి ఈ కాలంలో వృద్ధాశ్రమంలోనే ఇంట్లో కంటె ముసలివాళ్ళను బాగా చూసుకుంటున్నారు. కోట్లున్న వాళ్ళు కూడా పట్టణాల్లో తమ తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లోనే ఉంచుతున్నారు. అదేదో నేరమైనట్లు మాట్లాడవడ్తివి నువ్వు’’ అన్నాడు ఆనందరావు. ఆ మాటలకు నవ్వాలో ఏడ్వాలో అర్థం కాలేదు కొంరయ్యకు. ‘‘మనం పెండ్లికొచ్చినట్లు చావు తిండి బాగానే తిన్నాం. కొంరయ్య మాటలు విన్న తర్వాత మనకు మరో ముక్క నోట్లెకు పోవడం కష్టమే. కొంరయ్యకు తెలిసినంతగా లక్ష్మారెడ్డి కుటుంబం గురించి వాళ్ళ చుట్టాలకు కూడా తెలియదు. పెరుగుతో కూడా తినడమయి పోయింది. మనమిప్పుడు చేతులు కడుక్కొని చివర్లో ఉన్న కుర్చీల్లో కూర్చొని మాట్లాడుకుందాం.’’ రాజేశం మాటలందరికీ నచ్చాయి. షామియానా చివర్లో ఉన్న ఖాళీ కుర్చీల్లో కూచొని మాటల్లో పడ్డారు పదిమంది మిత్రులు. చావువిందు పార్టీ నడుస్తూనే ఉంది. ‘‘ఆనందరావుగారూ! మీకు వృద్ధాశ్రమాలు కొడుకులతో ఉండటం కంటె మేలైనవిగానే కనిపించవచ్చు. ఎందుకంటే మీకు ఏ సెంటిమెంట్లూ, విలువలూ లేవనను కాని డబ్బు ముందు అవన్నీ హాస్యాస్పద మాటలుగానే కనబడుతాయి. కాని లక్ష్మారెడ్డికి అలా కాదు. తనకు. యాభై ఏండ్లు దాటేవరకూ అంటే తన తల్లిదండ్రులు చనిపోయేవరకు ఇంటిపెద్ద కొడుకుగా తన కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబంగానే ఉంచాడు. తల్లిదండ్రులను అన్నదమ్ములు ముగ్గురూ తమ కొడుకుల్లా చూసుకున్నారు. తన పిల్లలకు ఉమ్మడి కుటుంబంలోని మాధుర్యాన్ని చవిచూపాడు కాని తన దగ్గరికొచ్చేసరికి అంతా తారుమారైంది’’ అన్నాడు కొంరయ్య. కొంరయ్య మాటలకు ఆనందరావు బాధపడినా కొంరయ్య ఇంకా ఇరవయ శతాబ్దిలోనే ఉన్నట్టు భావించాడు. తగిన సమాధానం చెప్పడానికే నిర్ణయించుకున్నాడు. ‘‘కొంరయ్యా! నువ్వింకా నీ బాల్యం, యవ్వనం నాటి కాలంలోనే ఉన్నావు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను గమనించడం లేదు. మానవ సంబంధాలు మనీ సంబంధాలుగా మారడాన్నీ గుర్తించడం లేదు. మనమిపుడు ప్రపంచీకరణాన్ని దాటి ఎలక్ట్రానిక్ యుగంలో బతుకుతున్నాం. ముఖ్యంగా ఈనాటి యువతరాన్ని నీలాగే బతుకమని శాసించడం సరైందేమో ఆలోచించు’’ అన్నాడు. ఆ మాటలకు చిన్నగా, నవ్వాడు కొంరయ్య. ‘‘మీ ప్రపంచీకరణం, ఎలక్ట్రానిక్ యుగం ముసలివాళ్లను ఇంట్లోంచి తరిమెయ్యమని చెప్పిందా? వృద్ధాశ్రమాలకు అంకితం చేయమని చెప్పిందా? పిల్లలకు ముసలివాసన రాకుండా చేయమని చెప్పిందా? పసివాళ్ళను అమ్మమ్మలు, నాన్నమ్మలు తాతయ్యలకు దూరంగా ఉండాలని చెప్పిందా? చెప్పుండ్రి ఆనందరావుగారూ! లక్ష్మారెడ్డి గత నాలుగు సంవత్సరాలుగా వృద్ధాశ్రమంలోఎంత ఏకాంతత అనుభవించాడో, తన వాళ్ళ కోసం ఎంత తపించాడో నాకు తెలుసు. ఎందుకంటే నేను హైదరాబాద్ వెళ్ళిన ప్రతిసారీ నా మిత్రుడు లక్ష్మారెడ్డి దగ్గరికి వెళ్ళి కొద్దిగంటలు గడిపివచ్చేవాన్ని’’ అన్నాడు కొంరయ్య. ఆ మాటలు అక్కడున్న చాలామందికి గాయాలుగా బాధించినా కొద్దిమంది మాత్రం లక్ష్మారెడ్డి అంత వేదన ననుభవించాడా అని అనుకోకుండా ఉండలేకపోయారు. ‘‘అయితే కొంరయ్యా! లక్ష్మారెడ్డికి వృద్ధాశ్రమానికి పోవడం ఇష్టం లేదా? ఆ విషయం తెలిసినవాడివి నువొక్కడివే… చెప్పగలవా? అసలేం జరిగింది?’’ అన్నాడు మల్లారెడ్డి . తనకు తెలిసిన విషయాన్ని ఈ సమయంలోనైనా చెప్పకుండా దాచుకోవడం సరైంది కాదనిపించింది కొంరయ్యకు. ఈ విషయం చెప్పడం వల్ల రాంరెడ్డి ప్రకాశ్‌రెడ్డికి జరిగేనష్టమేం లేదు. కాని కొందరైనా ఆ వయసువారు తల్లిదండ్రుల విషయంలో మారే అవకాశముందని భావించి చెప్పడానికే నిర్ణయించుకున్నాడు. లి లి లి లి లక్ష్మారెడ్డి కొడుకులిద్దరూ హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేస్తున్నారు. లక్ష్మారెడ్డి భార్యతో కలిసి కరీంనగర్ ఇంట్లోనే ఉంటున్నాడు. భార్య చనిపోయిం తర్వాత లక్ష్మారెడ్డి ఎక్కడుండాలన్న చర్చ వచ్చింది. కరీంనగర్ ఇంట్లో ఒంటరిగా ఉండటం లక్ష్మారెడ్డికి ఇష్టం లేదు. మనుమలు, మనుమరాల్లు, కొడుకులు, కోడళ్ళతో సమహంలో ఉండటమే అతనికిష్టం. అదే మాట కొడుకులతో అన్నాడు. కొడుకులకూ తండ్రిని తమతోనే ఉంచుకోవాలనుంది. ‘‘రాంరెడ్డీ! ప్రకాశ్! మీనాన్న మా కాలపు మనిషి, సమహంలో జీవించడం ఆతనికిష్టం. స్నేహితులు, బంధువులు, కుటుంబసభ్యుల మధ్య జీవించడానికి ఇష్టపడతాడు. అమ్మ ఉన్నంతవరకు మీ నాన్న కోర్కె నెరవేరింది. ఇప్పుడు ఒంటరి అయ్యాడు. మీతో ఉంచుకుంటేనే మంచిది. ఇక్కడ ఎంత మంది స్నేహితులున్నా తన వాళ్ళతో ఉండడం మీ నాన్న కిష్టం’’అన్నాడు కొంరయ్య. ‘‘అలాగే చేస్తాం అంకుల్. నాన్నను మాతో హైదరాబాద్ తీసుకెల్తాం. మా ఇద్దరి విల్లాలు ఒకే దగ్గర. తన ఇష్టమున్నచోట ఇష్టమున్నన్ని రోజులుంటాడు’’ అన్నాడు రాంరెడ్డి. ‘‘అవును ఈ వయసులో మానాన్న మాతో ఉండటమే సరైంది. ఇక్కడ ఒంటరిగాఎలా ఉంటాడు?’’ అన్నాడు ప్రకాశ్‌రెడ్డి. ఆ మాటలు లక్ష్మారెడ్డి కోడళ్ళకు నచ్చలేదు. వ్యవసాయం చేస్తూ పల్లెటూళ్ళో బతికిన తనమామ కరీంనగర్లో ఉండడమే ఎక్కువంటే హైదరాబాద్ కొచ్చి తమతో ఉండాలనటం అసలే నచ్చలేదు. ‘‘అంకుల్. మగవాళ్ళకేం తెలుసు మా ఇబ్బందులు. మేమ ఆఫీసుకెళ్ళాలి. అందులో సాఫ్ట్వేర్ ఉద్యోగం. మేమందరం ఆఫీసుకెళితే మామగారు ఇంట్లో ఒక్కరెలా ఉంటారు? అక్కడ మాట్లాడే వాళ్ళు కూడా తక్కువే. ఇక్కడయితే మామగారి స్నేహితులు, చుట్టాలెంతో మందున్నారు. లేదా ఊళ్ళోని పాత ఇల్లును బాగు చేసుకొని అక్కడున్నా మంచిగా టైమ్‌పాస్ అవుతుంది’’ తన అభిప్రాయాన్ని ఖచ్చితంగా చెప్పేసింది పెద్దకోడలు రజని. ‘‘అంకుల్! అక్క చెప్పింది నిజం. మీరు మామగారికి దగ్గరి స్నేహితులు. ఆయన స్వభావం మీకు తెలుసు. హైదరాబాద్‌లో ఆయన ఉండలేరు. ఊళ్ళో, కరీంనగర్లో అలవాటయిన మామగారు మాతో ఉండలేరు. పోతే నున్నని పాలరాతితో చేసిన గచ్చునుంచి జారిపడినా అదో పెద్ద ప్రమాదం’’ అంది చిన్న కోడలు శ్రీలక్ష్మి. ‘‘నిజమే అంకుల్! మేమివన్నీ ఆలోచించలేదు. విల్లాల్లో ఉంటున్నామన్నట్టే కాని అవి ఈ ఇల్లంత కూడా ఉండవు. ఎవరి రూంలు వారికే. నాన్నకు ప్రత్యేకగది కేటాయించలేం..’’ ‘‘అందరం బిజీ కదా అంకుల్. రోజుకు రానుపోనులతో కలిపి పదకొండు గంటలు డ్యూటీకే. కార్లలోనే వచ్చి పోవడమైనా ప్రయాణాలతోనే అలసిపోతాం. నాన్నను ఇక్కడే ఉంచి కేర్‌టేకర్‌గా ఓ మనిషిని పెడుదాం…’’ కొడుకులు, కోడళ్ళ మాటలు విన్న తర్వాత కొంరయ్యకు ఇలాంటి కొడుకుల కోసమా తాను రెక్కలు ముక్కలు చేసుకొని డబ్బు సంపాదించింది. కొడుకులను విదేశాలకు పంపి ఎం.ఎస్. చేయించింది? అని అనుకోకుండా ఉండలేక పోతున్నాడు. వాళ్ళపై అసహ్యం వేస్తుంది. ‘‘హైదరాబాద్‌లో లంకంత కొంపలున్న మీకు మీనాన్నకో గది కేటాయించే వసతి కూడా లేదంటున్నారు. మీ నాన్న కూడా మీలాగే అనుకొనుంటే మీరు బురదలో జంబు కొడుతూ ఉండేవారు. మీ పిల్లల విషయంలో కూడా మీరు ఇలాగే ఆలోచిస్తారా? మీ పిల్లలు కూడా మీలాగే ఆలోచిస్తే వృద్ధాప్యంలో మీ గతేంటి? మీ చదువు, ఉద్యోగం, బతుకు మీ నాన్న పెట్టిన భిక్షేనని మరిచిపోకుండ్రి. తాము కరిగిపోతూ మిమ్ములనీ స్థితికి తెచ్చారు. ఇప్పుడు మీకు వాళ్ళు కాని వారయ్యారు. మీ ఇంట్లో ఉండటానికి అర్హతలేని వారయ్యారు? పదిమందిలో పంచాయితీ పెట్టించి మీ ఇజ్జత్ తీయాల్సింది. కాని నన్నొక్కన్నే రమ్మన్నారు.’’ అసహ్యంతో ముఖం చిట్లించాడు కొంరయ్య. వాళ్ళ ముఖాలు నల్లబడ్డాయి. ‘‘అంకుల్! మీరు మమ్మల్ని కాలమాన పరిస్థితులను చూడకుండా దోషులను చేస్తున్నారు. వేగవంతమైన ఈ కాలంలో ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తమ తల్లిదండ్రులను తమతో ఉంచుకుంటున్నారు? బిజీ షెడ్యూల్లో అదెలా సాధ్యమవుతుంది? ఎంత ఖర్చయినా సరే మేం నాన్నను హైదరాబాద్‌లోని విలువైన వృద్ధాశ్రమంలో ఉంచుతాం. మేమ హైదరాబాద్‌లోనే ఉంటాం కాబట్టి ఫోన్ వస్తే చాలు వెంటనే చూసి రావచ్చు. ఈ కాలంలో ఇంట్లో కంటె అక్కడే వృద్ధులకు ఎక్కువ సౌకర్యంగా ఉంటుంది…’’ ‘‘పైసలతో అన్నీ కొనొచ్చు అనే భ్రమల్లో ఉన్నారు మీరు. మీ నాన్నకు కుటుంబంతో ఉన్న పేగుబంధాన్ని ఎన్ని లక్షలిచ్చి కొంటారు? తన కొడుకుతో, మనుమలు మనుమరాల్లతో కలిసి భోంచేయాలనుంటుంది మీనాన్నకు. మనుమలు, మనుమరాల్లతో పిల్లల్లో పిల్లవాడై ఎగరాలనుంటుంది. చేతగాకున్నా భుజాలపై ఎత్తుకొని తిప్పాలనుంటుంది. ముద్దుముద్దుగా కథలు చెప్పాలనుంటుంది. మీ నాన్నతరం, మాతరం తాతలు, తండ్రులు చెప్పే నోటికథలు వింటూ పెరిగాం. ఇవన్నీ వృద్ధాశ్రమంలో కానీ ఎక్కడైనా దొరుకుతాయా? ఒక్క ఇంట్లో తప్ప చెప్పురాం రెడ్డీ! ప్రకాశ్!’’ అన్నాడు కన్నీళ్ళు తీసుకుంటూ కొంరయ్య. ఆ మాటలకు రాంరెడ్డి ప్రకాశ్ హృదయాలు చలించిన మాట నిజమే. కాని తాము చేస్తున్నది తప్పని వాళ్ళ కర్థం కావడం లేదు. ఎందుకంటే వాళ్ళ స్నేహితుల్లో చాలామంది తమ తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లోనే ఉంచుతున్నారు. ‘‘అంకుల్! మీరన్న ఈ మాటలు మీ స్వంత కవిత్వమా? మానాన్న మాటలా?’’ అన్నాడు ప్రకాశ్‌రెడ్డి కొంరయ్యను చూస్తూ. ఆ మాటలకు ప్రకాశ్‌పై విపరీతమైన ఆగ్రహమొచ్చినా తనను తాను నిగ్రహించుకున్నాడు కొంరయ్య. ‘‘ప్రకాశ్! నేను కవినయ్యుంటే మీ ప్రవర్తనపై నేనో కవితరాసి దాన్ని చదివిన వాళ్ళు మెచ్చుకుంటుంటే విని ఉప్పొంగిపోయి గొప్పపని చేసానని చేతులు దులుపుకొనుండేవాడిని. కాని నేను కవిని కాదు. మామలు ప్రాక్టికల్ మనిషిని. మీ నాన్న హృదయాన్నెరిగిన బాల్య స్నేహితున్ని. మీ నాన్న ఎన్నోసార్లు నాతో ఆ మాటలన్నాడు. కాని మీకు ఆ సెంటిమెంట్లేమీ లేవు కదా! మీ పిల్లలను ఎత్తుకొని ముద్దాడితే ముసలివాసనొస్తుందంటారు. దగ్గర పడుకోబెట్టుకుంటే ముసలివాళ్ళ రోగాలు తగులుతాయంటారు. పాతిక ముప్పయేండ్లు సాది పెంచి పెద్ద చేసి, ఉన్న ఆస్తినిచ్చి, ప్రయోజకులను చేసిన తల్లిదండ్రులను చివరిదశలో నాలుగైదేండ్లు దగ్గరుంచుకొని మీ పిల్లల్లో పిల్లల్లా చూసుకోవడం చేతగాని మీ బతుకులేం బతుకుల్రా… ఛీ’’ అన్నాడు కొంరయ్య కోపంగా. ఆ మాటలతో నలుగురి ముఖాలూ నల్లబడ్డాయి. ‘‘కొరయ్య తాతా! మాకు మా తాతంటే ఇష్టం. తాత మాతోని ఉండుడంటే ఇష్టం. తాత చెప్పే పల్లెటూరి కథలంటే ఇష్టం. మేం తాతతోని మంచిగ ఆడుకుంటం. మాకు పెద్ద పెద్ద ఇండ్లున్నయి. తాతను మా ఇంట్లనే ఉంచుకుంటం. మమ్మీ! డాడీ ప్లీజ్ తాతను హైదరాబాద్‌ల మనింట్ల ఉండనీయిండ్రి’’ అన్నాడు రాంరెడ్డి కొడుకు పన్నెండేళ్ళ అనిల్‌కుమార్ రెడ్డి. ‘‘మాకూ తాతంటే ఇష్టమే’’ అన్నారు మిగతా ముగ్గురు పిల్లలు. ఆ నలుగురిప్పుడు సందిగ్ధంలో పడ్డారు. రజని త్వరలోనే ఈ లోకంలో కొచ్చింది. ‘‘నేం చెప్పలేదా? ఈ ముసలాయన ఇంట్లో ఉంటే పిల్లలు చెడిపోతారు. ఇంగ్లీషు మీడియం చదివే పిల్లలకు కథలు! కాకరకాయలని చెప్పి చదువును నాశినం చేస్తడు. తీవ్ర కాంపిటీషనున్న ఈ కాలంలో గా తెలుగు కథలు, కాకమ్మ కబుర్లు ఎవ్వలకు కావాలె. ఈనె తన రోగాలను కూడా పిల్లలకు అంటబెడుతడు. వృద్ధాశ్రమంలో వేయడమే మంచిది. మా ఇంట్లో ఉంచుకోవడాని కొప్పుకోం…’’ అంది. శ్రీలక్ష్మి యారాలును సమర్ధించింది. అక్కడ వాతావరణం మరింత గంభీరమైంది. కుర్చీలో కూర్చొనున్న లక్ష్మారెడ్డి లేచి నిల్చున్నాడు. ఆతని కళ్ళవెంట పటపటా నీళ్ళుకారుతున్నాయి. ‘‘రాంరెడ్డీ, ప్రకాశ్ పోస్టాఫీసులో నా పేరుమీద ఐదులక్షల డిపాజిట్లున్నాయి. అవి తీసి డొనేషన్‌గా సి.ఆర్. ఫౌండేషన్ హైద్రాబాద్ వృద్ధాశ్రమంలో కట్టుండ్రి. ఈ ఇంటిపై వచ్చే కిరాయలను నా నెలభత్యం, ఇతర ఖర్చులకు వాడుకుంటాను. మీరు నా కోసం ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల్సిన అక్కర్లేదు. రేపే మనం హైదరాబాద్ పోదాం..’’ అని కళ్ళు తుడుచుకుంటూ ఇంట్లోకెళ్ళాడు. ‘‘ప్రకాశ్, రాంరెడ్డీ! మీ నాన్నను దూరం చేసుకుంటూ మీరు కోల్పోతున్న విలువ వెలకట్టలేనిది. మీనాన్న చెప్పినట్టు చేయిండ్రి’’ అని అక్కన్నుంచి వెళ్ళిపోయాడు కొంరయ్య. లి లి లి లి ఇదీ నాలుగేండ్ల కింద జరిగిన లక్ష్మారెడ్డి వృద్ధాశ్రమ కథ అని చెప్పడం ముగించాడు కొంరయ్య. దూరదూరంగా తిరుగుతూ కొంరయ్యవాళ్ళ మాటలు విన్న ప్రకాశ్‌రెడ్డి, రాంరెడ్డి వెక్కెక్కి పడి ఏడుస్తూ వాళ్ళ దగ్గరికొచ్చారు. దుఃఖభారం దిగేవరకూ ఏడ్చారు. ‘‘కొంరయ్య బాపూ! మాలాంటి పుత్రరత్నాలు ఏ తల్లిదండ్రులకూ పుట్టకూడదు. మా కళ్ళకున్న. ‘రూపాయి’ మాయ పొరలు తొలగిపోయాయి. ఇది చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడమే కాని మా నాన్న ఉన్న వృద్ద్ధాశ్రమానికి నేను మాతమ్ముడు చెరో పాతికలక్షలు విరాళంగా ఇస్తున్నాం. ఇది మా పాపానికి ప్రక్షాళన కాదు. మమ్మల్నెవరూ క్షమించాల్సిన అవసరం లేదు. మా కథను నేటితరం గుణపాఠంగా తీసుకుంటే చాలు….’’ అన్నాడు రాంరెడ్డి. ప్రకాశ్‌రెడ్డి కళ్ళవెంటా పటపటా నీళ్ళు కారుతున్నాయి. కొంరయ్య చెప్పిన యదార్థగాథ విన్న అక్కడున్నవాళ్ళకు ఆ చావుతిండి రుచించడం లేదు.