“మీరెన్ని చెప్పండి. మీ అమ్మగారిని యిక్కడికి తీసుకురావడానికి నేనొప్పుకోను. అలవాటైన ఊరు. అలవాటైన పరిసరాలు. అయినా కాలు చెయ్యి బాగానే ఆడుతున్నాయి కదా! కాలు చెయ్యి పడిపోయినప్పుడు ఆలోచిద్దాంలెండి”.
“అదేమిటి సరసూ! అంత మాటన్నావు?”
“ఆవిడ అత్తగారి గురించి మీ అమ్మగారన్న మాటలే కదా! నేనేమైనా కొత్తగా అన్నానా ఏమిటి?” “ఎప్పుడో అయిపోయిన దాని గురించి ఇప్పుడెందుకు?”
“ఎందుకంటే, అది ఆవిడ చూపిన త్రోవే కదా! నేను అనుసరిస్తున్నానంతే!”
“అది తప్పని నీకు తెలియదా?” “మీకు తెలియదా?”
“తెలుసు కాబట్టే, అమ్మను యిక్కడకు తీసుకొద్దానుకుంటున్నాను”.
“కాలానుగుణంగా మనుషులను బట్టి మీ తప్పొప్పులు మారిపోతాయంటే నేను లెక్కచెయ్యను”
“సరసూ దయచేసి అర్థం చేసుకో! అప్పుడు మా అమ్మ చేసినది తప్పే. కాని ముప్పయ్యేళ్ళ క్రిందట జరిగిన దానికి యిప్పుడు నేనేం చెయ్యగలను?” నాన్న అమ్మను బ్రతిమలాడుతున్నారు.
“ఇప్పుడూ అలాగే అనుకొని ఊరుకోండి. మీకు అమ్మ అయితే అవ్వచ్చు. గాని ఆవిడ మా అమ్మమ్మకు చేసినదానికి, ఆవిడ క్షమించినా నేను క్షమించలేను. కొడుకుగా మీరేం చేసినా నేను అడ్డు చెప్పను. కానీ ఒక కోడలుగా ఆవిడ ఎంతవరకు చేశారో, నేనూ అంతవరకే చేస్తాను. నన్ను ఎక్కువగా బలవంత పెట్టవద్దు” అమ్మ నిష్కర్షగా చెప్తుంది నాన్నతో.
అమ్మానాన్నల సంభాషణను పక్కగదిలో ఉన్న నేను పూర్తిగా విన్నాను. నేను గదిలో లేననుకొని వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారో, ఉన్నా ఫరవాలేదు అనుకొని మాట్లాడుకున్నారో నాకు తెలియదు. కానీ వారం రోజులనుండి అమ్మానాన్నల మధ్య ఈ ప్రచ్చన్న యుద్ధం జరుగుతూనే ఉంది నాన్నమ్మ విషయంలో. ఈరోజు ఇద్దరూ బయటపడ్డారు.
అమ్మ, నాన్నకు అత్త కూతురే. తాతమ్మ నాన్నకు నాన్నమ్మ అయితే అమ్మకు అమ్మమ్మ అవుతుంది. నాన్నమ్మ తాతమ్మను బాగా చూసుకోలేదని అమ్మకు కోపం. ముత్తాత చనిపోయాక, తాతయ్య వాళ్ల అమ్మ… అదే తాతమ్మను ఇంటికి తీసుకువస్తానంటే నాన్నమ్మ ఒప్పుకోలేదంట. చివరకు ఆ పల్లెటూరిలోనే తాతమ్మ చనిపోయిందంట. అప్పటికి నాన్నగారు ఉద్యోగం చేస్తున్నా తాతమ్మ విషయంలో ఏమి చేయలేదని అమ్మకు కోపం. అందుకని ఇప్పుడు తాతగారు చనిపోయాక నాన్నమ్మను తీసుకువస్తానంటే ఒప్పుకోవడం లేదు.
దానికితోడు… మనలో మనమాట… నాన్నమ్మ ఎప్పుడూ అమ్మను కూడా బాగా చూసుకోలేదు. నాన్నమ్మకు ఇష్టం లేకుండా, తాతమ్మ బలవంతంతో అమ్మానాన్నల పెళ్లి జరిగిందని ఒక కారణం. ఏదైతేనేం నాన్నమ్మ, అమ్మల మధ్యలో సయోధ్య ఎప్పుడూ లేదు. నాన్నమ్మ అటు ఆవిడ అత్తగారి విషయంలోనూ, ఇటు కోడలి విషయంలోనూ తన మాటే నెగ్గేటట్లు చూసుకుంది. అధికారం చలాయించింది. ఆ విషయం జగమెరిగిన సత్యం.
ఒకప్రక్క తన అమ్మమ్మకు అన్యాయం చేసిందని, ఇంకొక ప్రక్క తనను ఏ రోజూ ప్రేమగా చూసుకోలేదని అమ్మకు, నాన్నమ్మ అంటే కోపం. ఆ కోపం ఇప్పటికీ అలానే ఉంది. అందరి విషయంలో మంచిగా ఆలోచించే అమ్మ, నాన్నమ్మ విషయంలో మాత్రం తన గతంనుండి బయటపడలేక పోతుంది. మధ్యలో నాన్న నలిగిపోతున్నారు.
ఇప్పుడు పరిస్థితి యిలా ఉంటే…. మరో పాతికేళ్ల తర్వాత…. ఇదే పరిస్థితి నేనూ ఎదుర్కోవలసి వస్తుందా? మీ నాన్నమ్మ గారిని మీ అమ్మగారు చూశారా, నేను మీ అమ్మగారిని చూడడానికి? అని నా భార్య అంటే నేనేమి చెయ్యాలి? నా భార్య మా అమ్మల మధ్య నలిగిపోవాలా! అమ్మో! నా వల్ల కాదు. ఆ పరిస్థితి నాకు ఎదురవ్వకూడదంటే ఇప్పుడే నేను సరైన దిశగా ఆలోచించాలి అనుకుంటూ ఒక నిర్ణయానికి వచ్చాను.
“అమ్మా! నీ బాధను, మనోభావాలను నేను అర్థం చేసుకోగలను. గాని కొత్తవారికి ఇవన్నీ అర్థం కాకపోవచ్చు. పాతికేళ్ల తర్వాత ఇదే పరిస్థితిలో నేనూ వుంటానేమోనన్న ఆలోచన నన్ను స్థిమితంగా ఉండనివ్వడం లేదు. ఏం చేయమంటావు నన్ను?” ఆ రాత్రి అమ్మ చరవాణికి ఒక సందేశం పంపించాను.
*
“సరసూ! తలుపేసుకో” వేకువజామునే నాన్న మాటలు.
“రేపు పెందరాళే బయలుదేరండి. ఎండ పడ్డాక బయలుదేరవద్దు. మీ అమ్మగారి ఆరోగ్యం అసలే అంతంత మాత్రం” అమ్మ నాన్నకు చెప్తుంది.
నాన్నమ్మను తీసుకురావడానికి ఊరికి బయలుదేరినట్లున్నారు.
నాకు తెలుసు. మా అమ్మ వివేకవంతురాలు. అర్థం చేసుకోగలదు.
Maji Bharathi
Maji Bharathi
నా గురించి👇 రచయిత్రి పరిచయం: డా. మజ్జి భారతిగారు మజ్జి చంద్రినాయుడు, లోలాక్షి దంపతులకు 1965లో డోలపేట గ్రామంలో (శ్రీకాకుళం జిల్లా) జన్మించారు. ఆంధ్ర వైద్య కళాశాలలో వైద్యవృత్తిని అభ్యసించాక, శ్రీకాకుళం జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిగా పనిచేసి, సూక్ష్మజీవ శాస్త్ర విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి, ఆంధ్ర వైద్యకళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసరుగా, ప్రస్తుతం రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్యకళాశాలలో ప్రొఫెసరు & విభాగాధిపతిగా సేవలందిస్తున్నారు. తన సాహితీ ప్రస్థానం గురించి చెప్తూ “కవితలు, కథలు వ్రాయడానికి ప్రేరణ అంటూ ఎవరూ లేరు. కాని, వ్రాయాలనే ఆలోచన చిన్నప్పటినుండే ఉంది. నాకు పదకొండేళ్ళ వయసులో తొలిసారి వ్రాసిన కవిత దేశభక్తి మీద. అప్పటినుండి మనసు స్పందించిన ప్రతిసారి ఆ భావాన్ని అక్షరబద్ధం చేయటం అలవాటు. ఆలోచనలలో ఏదో అంశం స్ఫురిించగానే, దాన్ని కథగానో, కవితగానో, పద్యంగానో మరల్చి, అక్షరరూపం ఇస్తాను” అనే డా.భారతిగారు విద్యార్థులకు వైద్యవిద్యా బోధనతోపాటు నైతిక విలువలనూ నేర్పించేవారిలో ముందుంటారు. వృత్తిపరంగా ఎన్నో అవార్డులు అందుకున్నారు. వ్రాయడంతోపాటు ఆమెకు చిత్రలేఖనమన్నా, ఛాయా చిత్రగ్రహణమన్నా మక్కువ ఎక్కువ. తీసిన ఛాయాచిత్రాలపై కవితలువ్రాసి స్నేహితులకు పంపించడం ఆమెకు ఇష్టమైన వ్యాపకం. ప్రముఖ రచయిత శ్రీ అట్టాడ అప్పలనాయుడుగారి ప్రోత్సాహంతో పత్రికలకు కథలను పంపించడం మొదలుపెట్టిన ఈ రెండు సంవత్సర కాలంలో సుమారు 40 కథలు వివిధ పత్రికలలో (ఈనాడు ఆదివారం, మాతృక, భూమిక, విశాలాక్షి, విశాఖ సంస్కృతి, ప్రసారిక మొదలైన మాస పత్రికలలో, కథామంజరి, మాధురి, సంచిక, విహంగ, సారంగ, కౌముది, గో తెలుగు. కామ్ మొదలైన అంతర్జాల పత్రికలలో, వైద్యకళాశాలల మేగజైన్లలో, ఆంధ్ర వైద్య కళాశాల శతాబ్ది ఉత్సవాల మేగజైన్లో) ప్రచురింపబడ్డాయి. మరియు “ఆలోచనాతరంగాలు” కథల సంపుటి 2022లో విడుదలయింది. మరొక కథల సంపుటి "వేకువ" ప్రచురణకు సిద్ధముగా వున్నది.
హిందువులు జీవితంలో ఒక్కసారైనా చేసుకోవాలనుకున్న యాత్రలలో, అతి ముఖ్యమైనది ఛోటా చార్ థామ్ (హిమాలయన్ చార్ థామ్) యాత్ర ఒకటి. ఇందులో హిమాలయ పర్వతశ్రేణులలో వుండే బదరీనాథ్, కేదారనాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయ దర్శనాలుంటాయి. అక్షయ తృతీయ నుండి, దీపావళి వరకు (ఆరు నెలలు) మాత్రమే ఈ చార్ థామ్ యాత్ర తెరిచి ఉంటుంది. మిగిలిన ఆరునెలలు, మంచుతో కప్పబడి, ఆ ప్రాంతం ఆవాసయోగ్యంగా ఉండదు.
[ఆదిశంకరాచార్యుల వారి చార్ థామ్ అంటే నాలుగు దిక్కులా ఉండే నాలుగు థామాల దర్శనం: అవి తూర్పున పూరీ (జగన్నాథ్), దక్షిణాన రామేశ్వరం (రామనాథేశ్వర్), పశ్చిమాన ద్వారక (శ్రీకృష్ణ), ఉత్తరాన బదరి (బదరీనాథ్)].

ఈ యాత్రలో ఎక్కువ భాగం తలెత్తి చూడలేనంత ఎత్తులో మహోన్నతమైన మంచు శిఖరాలు. గలగల పారుతున్న హిమనదులు. త్రోవ పొడవునా ప్రకృతి రమణీయ దృశ్యాలే. ఎంత చూసినా తనివి తీరని అందం ఈ యాత్ర ప్రత్యేకం. త్రోవ పొడవునా, ఒకవైపు మహోన్నత పర్వతాలు. ఇంకొక వైపు, ఒళ్ళు జలదరింపజేసే లోయలు. కళ్ళను కట్టిపడేసే పచ్చదనం. పాము మెలికల్లా తిరుగుతున్న రహదారుల సొబగులు. ఒళ్లంతా కళ్ళు చేసుకుని చూస్తున్నా తరగని అనుభూతినిస్తాయి. ఆ అనుభూతులను మనసు పొరల్లో నిక్షిప్తం చేసుకోవాలే తప్పించి, కెమెరా కళ్ళకు కూడా పూర్తిగా అందవవి.
ఈ యాత్ర, యెన్నో సవాళ్లతో కూడుకొని వుంటుంది. ప్రతికూల పరిస్థితులు వుంటాయని తెలిసీ, ఒక్కోసారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదముంటుందని తెలిసీ, యాత్రలో అనుక్షణమెదురయ్యే సవాళ్లను తట్టుకుంటూ, యీ యాత్ర చెయ్యడానికి సంకల్పిస్తారు భక్తులు. ఏ నిమిషంలో వాతావరణం మారిపోతుందో… కొండచరియలే విరిగి పడతాయో, కుండపోత వర్షమే కురుస్తుందో, మంచు తుఫానే ముంచుతుందో… ప్రకృతి ఏ రకమైన బీభత్సాన్ని సృష్టిస్తుందో చెప్పలేని పరిస్థితుంటుంది. అందుకని మన చేతిసంచిలో అవసరమైన అన్ని రకాల మందులు, మంచినీళ్లు, శక్తినిచ్చే ఆహార పదార్థాలు, చలికి ఆగే దుస్తులు వుంచుకోవాలి. మార్గమధ్యంలో అవరోధమేర్పడితే, ముందుకు వెనుకకు వెళ్ళలేని పరిస్థితి, చాలా గంటలు రోడ్డుమీదే వుండాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. అందుకని ముందు జాగ్రత్తలన్నీ తీసుకొని మానసికంగా సంసిద్ధమై వుండాలి.
ఎప్పుడెప్పుడా అని యెదురుచూస్తున్న మా చార్ థామ్ ప్రయాణం (ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి) మే 29న (2024), ఫ్లైట్‌లో ఢిల్లీ చేరుకోవడంతో మొదలైంది. ఢిల్లీనుండి బస్సులో, రాత్రికి హరిద్వార్ చేరుకున్నాం. 30వ తేదీన, ఉదయాన్నే లేచి హరిద్వార్ లో గంగానది దర్శనం చేసుకుని, బార్కోట్ కు ప్రయాణమయ్యాం. బార్కోట్ చేరుకునే మార్గమధ్యంలో వెహికల్ పర్మిట్ తీసుకోవాలి.
31st May: బార్కోట్ -యమునోత్రి- బార్కోట్
బార్కోట్ నుండి 46 కిమీ దూరంలో వున్న యమునోత్రి జన్మప్రదేశం కాళింది పర్వతం. గంగానదికి అతి పెద్ద ఉపనది. మీదకు వెళ్లడానికి, నడకకు ఆరు గంటలు, గుర్రంమీద రెండు గంటలు పడుతుంది. వాలు తక్కువగా వుండి, యెత్తుగా వుంటుంది. అందుకని నడవడం కష్టం. ఇరుకైన దారి. దానికి తోడు పోనీల వాళ్ళు, డోలీల వాళ్ళు మనల్ని తోసేస్తూ వుంటారు. ఆలయంలో ప్రధాన మూర్తి యమునా దేవి. ఆమె వాహనం తాబేలు. యమునకు ఇరుప్రక్కల గంగ, సరస్వతి వుంటారు.
అతి ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఒక ప్రక్క మంచు పర్వతాలు.,.. ఆ మంచు కరిగి, జలమై, నదాలుగా మారి, మనకి అడుగుల దూరంలో ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నీటిలో చెయ్యి పెడితే జిల్లుమని, వేళ్లు కొంకర్లు పోతూ ఉంటాయి. ఆ శీతల నదాలకు చేరువలోనే, వేడి పొగలను వెలువరిస్తూ, వేడి నీటిబుగ్గలుంటాయి. ఈ ఆలయ ప్రాంతంలో కూడా రెండు వేడినీటి బుగ్గలున్నాయి. ఒకటి ఆలయం కుడివైపున ఉంటే, ఇంకొకటి ఆలయం బయట ఉన్న సూర్యదేవాలయం దగ్గర ఉష్ణకుండం పేరుతో ఉంటుంది. ఇందులో బియ్యం మూట కట్టి ఐదు నిమిషాలుంచితే ఉడికిపోతుంది. దీని ప్రక్కన యమశిల వుంటుంది. అక్కడ సంకల్పం చెప్పించుకుంటారు. (యమున సోదరుడు యముడు). సూర్యదేవుని పిల్లలే యమున, యముడు.

యమునోత్రి దర్శనమయ్యాక, ఉత్తర కాశి చేరుకోవాలి. కాని ఆలస్యమైనందున బార్కోట్ లోనే రెండవ రాత్రి కూడా వుండవలసి వచ్చింది.
మేమున్న హోటల్ నుండి చూస్తే, ఎంతసేపు చూసినా అలానే ఉండిపోవాలనిపిస్తుంది. అందమైన లతలతో, పువ్వులతో అల్లుకున్న పచ్చని వృక్షాలు. ఎటు చూసినా పచ్చని కొండలే! వాటిమధ్య అక్కడక్కడ హోటల్స్, కంటికింపైన వర్ణాలతో.
హిమాలయాలలో ఆలస్యంగా సూర్యాస్తమయం అవుతుంది. స్వచ్ఛమైన నీలి రంగులో ఆకాశం. ఆ నీలి రంగును ఆక్రమిస్తూ, అస్తమిస్తున్న భానుని కిరణాలు, ఆకాశాన్ని సింధుర వర్ణంలో మెరిపిస్తూ… ఏ చిత్రకారుడో చిత్రాన్ని గీసి ఇక్కడ మర్చిపోయాడేమోనని, చూస్తూ అలా మైమరచిపోతాం.
1st June: బార్కోట్-గంగోత్రి- పిపాల్ కోటి
వేకువనే గంగోత్రికి బస్సులో బయలుదేరాం. త్రోవలో మెడికల్ కేంపుంది. ప్రకృతి అందాలను తిలకిస్తూ, కొండల మధ్య పయనిస్తూ, అడవులను దాటుకుంటూ, మధ్యాహ్నం రెండు గంటలకు గంగోత్రి చేరుకున్నాం.
గంగోత్రికి వెళ్లే త్రోవలో అక్కడక్కడా చిన్న చిన్న గ్రామాలు, ఆర్మీ బేస్ లు, పవర్ ప్రాజెక్టులు కనిపిస్తాయి. త్రోవ కిరువైపులా పూలతో కూడిన పొదలు, చిన్న చిన్న చెట్లు. ప్రయాణం భారమనిపించదు. పగలు ఎండ చాలా తీక్షణంగా ఉంటుంది. ప్రయాణమంతా ఘాట్ రోడ్డే కాబట్టి, బస్సులో ఏసీ వెయ్యరు. లోపల మనకి కాస్త వేడిగా ఉన్నా, క్రిందకి దిగేటప్పటికి చల్లగా ఉంటుంది. వెళ్తున్న కొద్దీ, ఉష్ణోగ్రతలో మార్పు స్పష్టంగా తెలుస్తుంది మనకు.
గంగోత్రిలో మన యాత్రా రిజిస్ట్రేషన్ ను చెక్ చేసి, ముందుకు పంపిస్తారు. వెహికల్ పార్క్ చేసి, కొంత దూరం నడవాల్సింటుంది. వీల్ చైర్స్ వుంటాయి. త్రోవలో షాపులున్నాయి.
గంగోత్రి ఆలయం పాలరాతి నిర్మితం. గంగామాతను ఎంతసేపు చూసినా చూడాలనే అనిపిస్తుంది. కరుణతో నిండిన ఆ కళ్ళు, మనపై ఆశీస్సుల వర్షాన్ని కురిపిస్తాయి. ఇక్కడ గంగను భగీరథి అంటారు. దేవప్రయాగలో, అలకానందతో కలిసాక గంగ అవుతుంది. అక్షయతృతీయ నుండి దీపావళి వరకు మాత్రమే ఆలయం తెరిచివుంటుంది. ఆ తర్వాత, హర్షిల్ పట్టణానికి దగ్గర ముఖ్బా గ్రామంలో, గంగామాత పూజలందుకుంటుంది. ఆలయంలో అన్నపూర్ణ, సరస్వతి, లక్ష్మీదేవి, ఆదిశంకర, భగీరథ విగ్రహాలున్నాయి.
ఆలయం బయట శివాలయం, హనుమాన్ ఆలయం వున్నాయి. మెట్లు దిగి క్రిందకు వెళ్తే, భగీరథ శిల వుంది. ఈ శిల నుండి నీళ్ళు వస్తూనేవున్నాయి. ఇక్కడ భగీరథుని విగ్రహం కూడా వుంది. కొంచెం ముందుకెళితే, పరవళ్ళు తొక్కుతూ, ధవళ వర్ణంలో, ఉదృతంగా గంగ. ఉరవడి శబ్దం వింటూనే మనసు పులకించిపోతుంది. గంగా స్నానం చేయాలని వున్నా, స్నానం మాట దేవుడెరుగు, గంగను ముట్టుకుంటేనే వేళ్ళు కొంకర్లు పోతున్నాయి. ఇక్కడికి 19 కిలోమీటర్ల దూరంలో, గంగానది పుట్టిన స్థలం గోముఖం వుంటుంది. అక్కడికి వెళ్లడానికి రోజుకి 150 టికెట్లు మాత్రమే యిస్తారు. ట్రెక్కింగ్ చాలా కష్టం.
గంగా ప్రవాహపు హోరుమంటున్న శబ్దం వింటుంటే మనసు పరవశించిపోతుంది. ఆ తల్లి పరవళ్ళను తిలకిస్తుంటే తనువు పులకాంకితమౌతుంది. వేళ్ళు కొంకర్లు పోతున్నా, గంగమ్మ తల్లిని ముట్టుకోకుండా ఉండలేకపోతున్నాం. అంతటి శీతల వాతావరణంలో కూడా అక్కడ నుండి కదలాలనిపించడం లేదు. గంగోత్రి నుండి కదలాలని లేకపోయినా, మారే శీతోష్ణ పరిస్థితులను జ్ఞప్తి పెట్టుకొని బలవంతంగా బయలుదేరాం. ఎంత తొందరగా, అక్కడినుండి బయటపడితే అంత మంచిది.
కొండ చరియలు విరిగిపడినా, మంచు తుఫాను కురిసినా, కొండల మధ్య చిక్కుకుపోతాం. ఎటూ వెళ్లేందుకు వీలుండదు. బార్కోట్ నుండి బయలుదేరినప్పుడు వేడిగా వుంటే… ప్రయాణం సాగేకొద్దీ చల్లగా వుంటుంది. మధ్యాహ్నం తర్వాత ఆ చల్లదనం ఎక్కువవుతుంది. మార్గమధ్యంలో వుండిపోవాల్సి వస్తే, చలికి గడ్డకట్టుకుపోతాం. అందుకని మనతోపాటు అత్యవసర మందులు, బలాన్ని, శక్తినిచ్చే ఆహార పదార్థాలు, స్వెటర్, షాల్ వంటి వాటిని తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఎప్పుడు యెక్కడ, యే అవసరం పడుతుందో చెప్పలేం. ఈ రాత్రికి మేం ఉత్తరకాశి చేరుకోవాలి. కాని సమయాభావం వలన మార్గమధ్యంలో, పిపాల్ కోటిలో బస చెయ్యాల్సి వచ్చింది.
2-6-24: పిపాల్ కోటి – ఉత్తరకాశి – సీతాపూర్
ఉదయాన్నే పిపాల్ కోటి నుండి బయలుదేరి, ఉత్తర కాశీ చేరుకొని, అక్కడ కాశీ విశ్వనాధేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని, రాత్రికి సీతాపూర్ చేరుకున్నాం.
3-6-24: సీతాపూర్ – గౌరీకుండ్ – కేదారనాథ్
ఉదయం 3 గంటలకే సీతాపూర్ నుండి బయలుదేరి గౌరీకుండ్ మీదుగా కేదారనాథ్ చేరుకొని, కేదారనాథుని దర్శించుకుని, రాత్రికి కేదార్‌నాథ్‌లో ఉండి, మరుచటి రోజు గౌరీకుండ్ సీతాపూర్, ఋషికేశ్ ల మీదుగా జోషిమఠ్ చేరుకున్నాం.
ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఐదవదైన కేదారనాథ్, ఉత్తరాఖండ్ లోని, రుద్రప్రయాగ జిల్లాలో, సముద్రమట్టానికి 3,584 మీటర్ల ఎత్తులో, గర్వాల్ కొండల పైభాగంలో వుంటుంది. ఈ గుడిని యెప్పుడు, యెవరు కట్టించారో చారిత్రక ఆధారాలైతే లేవు గాని, ఆదిశంకరాచార్యులు వారు నిర్మించినట్లు విశ్వసిస్తారు. ఇక్కడ కేదారేశ్వరుడు స్వయంభువు.
పురాణాల ప్రకారం కురుక్షేత్ర యుద్ధానంతరం సగోత్రీకుల హత్యాపాతకం నుండి విముక్తి కోసం, మహాశివుని వెతుకుతూ హిమాలయాలకు వెళ్లిన పాండవులకు దర్శనమివ్వడం యిష్టం లేక, వృషభరూపంలో శివుడు మంచు లోపలికి చొచ్చుకుపోయాడని, అది తెలిసి పాండవులు వృషభం (శివుని) పృష్టభాగాన్ని స్పర్శించి పాపవిముక్తులైనట్లు కథనం. పృష్టభాగం కేదారనాథ్‌లో వుంటే, మంచులో కూరుకుపోయిన తలభాగం నేపాల్ లోని, ఖాట్మండులో పశుపతినాధునిగా పూజలందుకుంటున్నట్టు భక్తుల విశ్వాసం.

గౌరీకుండ్ నుండి రోడ్డు మార్గం లేదు. కొండల మధ్య ప్రయాణించవలసి వుంటుంది. గౌరీకుండ్ చేరుకోవడానికి వున్న మార్గాల్లో, మేం సీతాపూర్ నుండి చేరుకున్నాం.
కేదార్ నాథ్ కు హెలికాప్టర్ సదుపాయమున్నా టికెట్లు దొరకకపోవచ్చు. దొరికినా, మనం వెళ్లే సమయానికి వాతావరణం సరిగ్గా లేకపోతే, హెలికాప్టర్ క్యాన్సిల్ చేస్తారు. ఒక్కోసారి, మరో ఐదు నిమిషాల్లో ల్యాండ్ అవుతామనగా కూడా, హఠాత్తుగా వాతావరణం మారిపోయి, హెలికాప్టర్లు వెనక్కి వచ్చేస్తాయి. టికెట్ బుక్ చేసుకునేటప్పుడే, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి.
ప్రీపెయిడ్ పోనీ స్టేషన్ నుండి పోనీలుంటాయి. అక్కడ ఫిక్స్డ్ రేటు ఉంటుంది. నలుగురు మనుషులు మోసే డోలి, ఒక్క మనిషి వీపున మోసే పిట్టూ… వీటికి ప్రీ పెయిడ్ స్టేషన్ ఉండదు. డిమాండ్ బట్టి రేటు మారుతుంది.
గౌరీకుండ్ నుండి కేదార్ నాథ్ కు నడిచి వెళ్లవచ్చు. (21 కి.మీ.) ప్రయాణంలో చలిని తట్టుకునే దుస్తులు వేసుకొని, సన్ స్క్రీన్ లోషన్, క్యాప్, రెయిన్ కోట్, ఎమర్జెన్సీ మందులు తప్పనిసరిగా వెంట వుంచుకోవాలి. త్రోవంతా రాతి పలకలతో వేసిన మెట్లుంటే, కొన్ని దగ్గర్ల మెట్లు లేకుండానే వుంటుంది. కొండల మధ్య నుండి, కొండలమీద నుండి ప్రయాణముంటుంది. చుట్టూ పచ్చని ప్రకృతి. త్రోవలో అక్కడక్కడా జలపాతాలు.
వీక్షించాలేగాని, త్రోవంతా కళ్ళను తిప్పుకోనివ్వని ప్రకృతి సోయగాలు. గలగల కదిలే జలపాతాలు, మన పాదాలనంటి ప్రవహిస్తాయి. లోయల్లో నదులు ప్రవహిస్తూ, ముచ్చట గొలుపుతూ ఉంటాయి. అధిరోహించే కొండలు అనంతంగా సాగుతూనే ఉంటాయి. చల్లనిగాలి ముఖానికి స్వాంతన చేకూర్చుతుంటే, ప్రకృతి సోయగాలు మనసును మైమరిపిస్తుంటే, కాళ్లు వాటంత అవే ముందుకు సాగుతాయి.
హఠాత్తుగా క్లౌడ్ బరస్టై, జలపాతాలు మార్గాన్ని ముంచెత్తే సందర్భాలు, కొండ చరియలు విరిగిపడి, మార్గం మూసుకుపోయే పరిస్థితులు, మంచు తుఫానులు, విపరీతమైన వర్షాలు… యిటువంటి ప్రతికూల పరిస్థితులు యెన్నో ఎదురుకావచ్చు. అటువంటి సందర్భాలలో యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తారు. మన ప్రయాణం యెక్కడైనా ఆగిపోవచ్చు. మానసికంగా సిద్ధపడాలి.
కేదారేశ్వరుని నిజరూప దర్శనం మధ్యాహ్నం 12 వరకు ఉంటుంది. అప్పుడు స్పర్శ దర్శనం కూడా చేసుకోవచ్చు. 12-2pm మధ్యలో ఆలయాన్ని మూసివేస్తారు. ఆ తర్వాత బంగారు తొడుగుతోనే మనకు స్వామి దర్శనమిస్తారు. ఆలయం ముందు విశాలమైన ప్రాంగణం. ఎదురుగా నందీశ్వరుడు. అక్కడ నుండి చూస్తే, చుట్టూ పచ్చని కొండలతో, మంచు శిఖరాలతో, మంచు కరుగుతుంటే జాలువారే జలపాతాలతో, ప్రకృతి ఆహ్లాదకరంగా వుంటుంది. నీలి రంగులో స్వచ్ఛంగా ఆకాశం. ఆకాశాన్ని చీల్చుకుంటూ తన ప్రతాపాన్ని చూపించే సూర్యుడు. మేఘాలు లేకపోతే, సూర్యకిరణాల తీక్షణత చాలా ఎక్కువగా ఉంటుంది.
దర్శనమెప్పుడవుతుందా అన్న ఆతృత ఒకవైపు. ఆ పరిసరాలలోనే ఉండిపోవాలనే కాంక్ష ఇంకొక వైపు. భలే చిత్రంగా ఉంటుంది ఆ అనుభూతి. దర్శనమయ్యాక, అక్కడి ప్రకృతిలో లీనమైపోతాం. కదలాలనిపించదు. గాని, మరుక్షణం ఏమౌతుందో ఊహించలేం.
హఠాత్తుగా మేఘాల విష్పోటనం సంభవించవచ్చు. నదులు పొంగి పొరలవచ్చు కొండ చరియలు విరిగిపడి దారులు మూసుకుపోవచ్చు. మరల మార్గం సుగమమావటానికి ఎంత కాలం పడుతుందో తెలియదు. అందుకని, దర్శనం చేసుకున్నాక, ఆ అనుభూతులను మూట కట్టుకుంటూ, క్రిందకు చేరుకోవడం ఉత్తమం.
గర్భగుడి ముందున్న మంటపంలో భీముడు, అర్జునుడు, సహదేవుడు, నకులుడు, ద్రౌపది, లక్ష్మీనారాయణుల విగ్రహాలు చిన్న చిన్న గూటిలో వున్నట్టుంటాయి. ఇక్కడ శివుడు లింగాకారంలో కాకుండా, అసమానంగా ఉన్న పెద్ద రాయి ఆకారంలో వుంటారు. పురాణ కథనం ప్రకారం, వృషభపు వెనుక భాగమది. కేదారేశ్వరుని దర్శనం చేసుకుని బయటికొస్తే, అక్కడొక చిన్న ఆలయముంటుంది. అదే అసలైన కేదారేశ్వర ఆలయమంటారు.
కేదారేశ్వర ఆలయం వెనక భీమశిల వుంటుంది. 2013లో వచ్చిన వరదల్లో కొట్టుకొని వచ్చి, ఆలయానికి వెనక ఉండి వరద ప్రవాహాన్ని రెండు పాయలుగా చీల్చి, ఆలయాన్ని కాపాడిందని… అలాగని అది ఆలయాన్ని కాపాడేంత పెద్ద శిలైతే కాదు. ఆ కొండల మీద అంత పెద్ద శిలలున్న ఆనవాళ్లేమీ కానరాలేదు. అంతవరకు ప్రవాహంతో పాటు కొట్టుకొని వచ్చి, సరిగ్గా ఆలయం వెనకే కాపు కాసినట్టు యెలా వుండిపోయిందన్నది ఆశ్చర్యకరమే?
ఆలయం వెనక కొండమీద క్షేత్రపాలకుని ఆలయం. దగ్గరలో ఆదిశంకరాచార్యుల వారి ఆలయం కూడా వుంటుంది. ఇక్కడే వారు శివసాన్నిధ్యం చెందారు.
ఈ చార్ ధామ్ యాత్రలో ప్రయాణమెక్కువగా, దర్శన సమయం తక్కువగా వుంటుంది. అంతా ఘాట్ రోడ్ ప్రయాణమే. పైకి వెళుతున్న కొద్ది మౌంటైన్ సిక్ నెస్ వచ్చే అవకాశమెక్కువ.
ప్రయాణమెంత కష్టమనిపించినా, కేదారనాథుని దర్శనం కాగానే, ప్రయాణ బడలిక మాయమై, తనువు పులకితమౌతుంది. దేవదేవుని సన్నిధిలోనే వుండిపోవాలనిపిస్తుంది. ఎన్ని జన్మల భాగ్యమో, సశరీరంగా యీ పవిత్రభూమిపై కాలూనామని తలుచుకోగానే, మనసు అలౌకిక ఆనందాన్ని పొందుతుంది. ఉద్విగ్నతకూ లోనవుతుంది. ఆ మధురక్షణాలను వర్ణించలేం. అనుభవించగలమే తప్ప. అనంతమైన ఆ హిమవత్పర్వతాల మధ్య, ఆలయ సన్నిధిలో నిల్చున్నామన్న భావనే మధురం. ఆ అనుభూతులనన్నిటినీ మదిలో పదిల పరుచుకొని, ఇంకొకసారి దర్శించుకునే అవకాశమొస్తే బాగుండునని, శివుని ప్రార్ధించుకుంటూ వెనుదిరిగాం.
4-6-24: కేదారనాథ్- గౌరీకుండ్ – సీతాపూర్ – ఋషికేశ్ – జోషిమఠ్
రుషికేశ్ (హృషికేశ్) యోగాకు పుట్టినిల్లుగా కొలవబడుతుంది. ఎన్నో ఆశ్రమాలు ఇక్కడున్నాయి. 2015లో, రుషికేశ్, హరిద్వార్ నగరాలు దేశ వారసత్వసంపదగా పేర్కొనబడ్డాయి. ఇక్కడే గంగానదిపై రామ్ జూలా, లక్ష్మణ జూలా వంతెనలున్నాయి. ఇది దాటాక టెహ్రి డ్యాం వస్తుంది. చాలా పెద్ద ప్రాజెక్ట్. ఆ డ్యామ్ చుట్టూ రెండు మూడు గంటలు పైనే తిరిగినట్టున్నాం. డ్యాముని దాటేసామని అనుకునేలోగా మరలా కనిపించేది.
5-6-24: జోషిమఠ్ – బదరీనాథ్
ఉత్తరాఖండ్, ఛమోలి జిల్లాలో జోషిమఠ్ (జ్యోతిర్ మఠ్) ఆదిశంకరాచార్యులు ప్రతిష్టించిన పీఠాలలో (మిగిలినవి- శృంగేరి, పూరి, ద్వారక, కంచి) ఒకటి. ఈ మఠము అధర్వణ వేదానికి ప్రతీక. 108 దివ్యదేశాలలో ఒకటి. ఆదిశంకరాచార్యులు వారు ప్రతిష్టించిన నరసింహస్వామి యిక్కడ ఆలయంలో కొలువు తీరారు. అమ్మవారు పరిమళవల్లి. ఇక్కడ నరసింహ స్వామి వారి ఎడమ చేయి సన్నంగా ఉంటుంది. ఆ చెయ్యి పడిపోయిన నాడు బదరీనాథ్ ఆలయం మాయమైతుందని, సాలగ్రామ ఆకారంలో, యిక్కడికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న భవిష్య బద్రిలో ప్రత్యక్షమవుతుందని యిక్కడి వారి నమ్మకం. బదరి ఆలయాన్ని ఆరునెలలు మూసి వేసినప్పుడు, బదరీనాథుడు యిక్కడికి వచ్చి పూజలందుకుంటారు. ఈ ఆలయం వెనక దశావతారాలు, శివ, అమ్మవార్ల ఆలయాలున్నాయి.

మఠంలో బదరి నారాయణ, రాజరాజేశ్వరి దేవి ఆలయాలు, ఆదిశంకరాచార్యులు వారి ప్రతిమ యిక్కడ నిత్యం పూజలందుకుంటాయి. శంకరాచార్యుల వారు వాడిన సామాన్లు, తపస్సు చేసిన గుహ కూడా యిక్కడ చూడవచ్చు.
ఇక్కడ ఆర్మీ మిలటరీ కంటోన్మెంట్ (ఘర్వాల్ రైఫిల్స్ వారి స్థావరం) కూడా యిక్కడే వుంది.
ఇక్కడికి 10 కి.మీ. దూరంలో తపోవన్ వుంది. ఇక్కడ వేడి నీటి బుగ్గలుంటాయి. ఇక్కడి నుండి మనం ధవళగంగను చూడవచ్చు. ఇక్కడికి దగ్గరలోనే ఔలి రోప్ వే, గారి భవాని ఆలయాలున్నాయి.
ఉత్తరాఖండ్‌లో 2021 లో వచ్చిన వరదల తరువాత, ఇక్కడి నేల కొద్దిగా కృంగిపోయి, యిల్లులు బీటలు వారి ప్రజల్లో ఆందోళనకు కారణమైంది. ఇక్కడి నుండే బదరీనాథ్ యాత్ర మొదలవుతుంది. జోషిమట్ దాటాక విష్ణు ప్రయాగ్ హైడల్ ప్రాజెక్ట్, తపోవన్ విష్ణుజాడ్ హైడెల్ ప్రోజెక్ట్ లు మార్గమధ్యంలో కనిపించాయి.
బదరీనాథ్: సాయంకాలనికి బద్రీనాథ్ చేరుకుని, దర్శనం చేసుకున్నాం.
ఉత్తరాఖండ్, ఛమోలి జిల్లాలో, అలకానంద నదీతీరంలో, ఘర్వాల్ పర్వతశ్రేణుల్లో, 108 దివ్యక్షేత్రాలలో ఒకటైన, ప్రముఖ వైష్ణవ ఆలయం, బదరీనాథ్. ఈ ఆలయ ప్రాముఖ్యత గురించి వేదాలలో, భాగవతంలో, స్కంద పురాణంలో, పద్మ పురాణంలో వివరించబడింది. బదరికా (రేగు) వనం వలన యిక్కడ స్వామికి బద్రీనాథ్ అనే పేరు వచ్చిందని ఒక కథనం. అశోకుని కాలంలో బౌద్ధ క్షేత్రంగా, తర్వాత ఆదిశంకరాచార్యులచే హిందూ క్షేత్రంగా పునరుద్ధరించబడిందన్న చారిత్రక ఆధారాలున్నాయి. ఈ ఆలయం వెనుక ఉన్న రెండు కొండలను నరనారాయణులంటారు. ఈ స్థలానికి వున్న ప్రాముఖ్యతను బట్టి ఇక్కడ చాలా మఠాలున్నాయి.
దక్షిణాదిలో ఉన్నట్లు ఉత్తరాదిలో ఆలయాలు పెద్దగా వుండవు. శిల్పకళా నైపుణ్యం కూడా యెక్కువగా కనిపించదు. ఎత్తైన మెట్లెక్కి, ప్రవేశద్వారం, మంటపం దాటి, ఆలయం లోపలికి ప్రవేశిస్తే, ఒక అడుగు ప్రమాణంలో, నల్లరాతిలో ఒదిగి, రెండు చేతుల్లో శంఖు చక్రాలతో, మరో రెండు చేతులు యోగముద్రలో, పద్మాసనం వేసుకొని, బదరీనాథుడు, బదరీ వృక్షం క్రింద దర్శనమిస్తాడు. సంవత్సరానికి ఆరునెలలు మాత్రమే యిక్కడ కొలువై, తర్వాత జోషిమఠ్ కు చేరుకుంటాడు. ఆలయంలో పైకప్పు బంగారు తాపడంతో, స్తంభాలు, గోడలు వివిధ రకాల డిజైన్లతో అలరారుతున్నాయి. ఆలయంలోపల కుబేర, నారద, ఉద్ధవ, నరనారాయణుల మూర్తులుంటే, ఆలయం చుట్టూ లక్ష్మి, గరుడ, నవదుర్గ, లక్ష్మీనరసింహ, ఆదిశంకరాచార్య, ఘంటకర్ణల ఉపాలయాలు వున్నాయి. మేము వెళ్లిన సమయానికి చాలా పెద్ద లైన్లు వున్నాయి. సెక్యూరిటీ బాగుంది. మొబైల్ ఫోన్స్ ఎలౌ చేశారు. చక్కగా ఫోటోలు తీసుకున్నాం. ఇక్కడ పచ్చి శనగపప్పు ప్రసాదంగా యిస్తున్నారు.

ఆలయానికి సమీపంలో, కొద్దిగా క్రిందకు దిగితే, అలకానంద నదిని ఆనుకొని, తప్తకుండ్ వేడినీటి బుగ్గలున్నాయి (నారద కుండ్, సూర్య కుండ్). ప్రక్కనే వున్న అలకానంద నదిలో నీళ్లు మంచులా చల్లగా వుంటే, యిక్కడి నీళ్లు పొగలు చిమ్ముతున్నాయి. స్త్రీలు స్నానాలు చేసేందుకు వీలుగా, ఒక దాని చుట్టూ గదిలా కట్టారు. అది చిన్నగా వుండడంతో, అక్కడ రద్దీగా వుంది. మగవారు వేరే బుగ్గల్లో స్నానాలు చేసి, పిండ ప్రదానం చేస్తున్నారు. ఈ వైపు తీరమంతా సిమెంటుతో గచ్చు చేసి వుండడంతో, పితృ కార్యాలు చేసేవాళ్లకి సులభంగా వుంది.
ఆలయం చుట్టూ చిన్న చిన్న వీధులు, అందులోనే దుకాణాలు, భోజనాలయాలు, చిన్న చిన్న యిల్లులున్నాయి. ఈ ప్రదేశం సంవత్సరానికి ఆరునెలలు మూసి వుంటుంది కాబట్టి, ఇళ్ల నిర్మాణాల మీద పెద్దగా ఖర్చు పెట్టరు. ఆలయానికి 300- 400 మీటర్ల దూరంలో మెయిన్ రోడ్డు, హోటళ్లు, లాడ్జిలు, దుకాణాలు, మఠాలు చాలా వున్నాయి.
6-6-24: బదరీనాథ్ – హరిద్వార్ వయా ఋషికేశ్
ఉదయాన్నే మరల దర్శనం చేసుకుని తప్తకుండ్ నీటిబుగ్గలను చూసాం. మాతో వచ్చిన కొంతమంది పితృకార్యాలు చేసుకున్నారు. బద్రీనాథ్‌లో మేము జీయర్ స్వామి మఠంలో వున్నాం. వసతిసౌకర్యం బాగుంది. అక్కడున్న సత్రంలో ఉచిత భోజనసదుపాయం కూడా వుంది. మధ్యాహ్న భోజనాలయ్యాక బయలుదేరి, రాత్రికి హరిద్వార్ చేరుకున్నాం. హరిద్వార్ వెళ్లే త్రోవలో, అలకానంద నది మధ్యలో వుండే ధారీదేవి ఆలయాన్ని దర్శించుకున్నాం. అమ్మవారి ముఖం మాత్రమే పూజలందుకుంటుందిక్కడ. ఈ ఆలయానికి పైకప్పు ఉండదు. చార్ థామ్ ల రక్షకురాలిగా పరిగణించబడుతుంది ఈ అమ్మవారు.
7-6-24: హరిద్వార్
అమృతభాండాన్ని గరుత్మంతుడు తీసుకొని వచ్చే సమయంలో, అమృతం చిందిన నాలుగు ప్రదేశాలలో, హరిద్వార్ ఒకటని పురాణ కథనం. (ప్రయాగ్, ఉజ్జయని, నాసిక్- మిగిలిన మూడు క్షేత్రాలు). ఈరోజు హరిద్వార్ లోనే బస. ఇక్కడ కూడా చాలా ఆశ్రమాలున్నాయి. వసతి సదుపాయం బాగుంది. ముందుగా దక్షమహాదేవ్ ఆలయాన్ని దర్శించుకున్నాం. దక్షుడు యజ్ఞం చేసిన ప్రదేశం, సతి దేవి యజ్ఞగుండంలో దూకిన ప్రదేశమిది. ఆ తర్వాత బిల్వ పర్వతం మీదున్న వున్న మానసా దేవి ఆలయాన్ని దర్శించుకున్నాం. పైకి వెళ్లడానికి, మెట్ల మార్గంతో పాటు, రోప్ వే కూడా ఉంది. కొద్ది దూరంలో నీలపర్వత శిఖరంపై చండీదేవి ఆలయముంటుంది. ఇదొక శక్తిపీఠం. సమయం లేక దర్శించుకోలేకపోయాం.

ఆ రాత్రి గంగాహారతి చూసాం. వారణాసిలో, గంగాహారతి చూశాక, యిక్కడ గొప్పగా అనిపించలేదు. కాని విపరీతమైన జన సందోహం.
8-6-24: హరిద్వార్- ఢిల్లీ – విశాఖపట్నం
ఉదయాన్నే బస్సులో ఢిల్లీ చేరుకొని అక్కడి నుండి ఫ్లైట్‌లో విశాఖపట్నం చేరుకున్నాం.
ప్రకృతి అందాల నడుమ కొలువైన ఈ చార్ థామ్ లను సందర్శించుకుని, ఆ లౌకిక ఆనందాన్ననుభవించి, జీవితకాలానికి సరిపడా మధురానుభూతులను మూట కట్టుకొని, సంతృప్తితో, స్వగృహాలకు చేరుకున్నాం.
మనం చిన్నప్పటినుండి విన్న కథలలో మొదటి కథ ఎప్పుడూ, అనగనగా ఒక రాజు… అంటూనే మొదలవుతుంది. అటు పౌరాణికమైనా, యిటు చారిత్రికమైనా రాజులు, రాణుల గురించిన కథలు మనల్నెప్పుడూ ఉర్రూతలూగిస్తూనే ఉంటాయి. మరలా మరలా చదవాలనిపించేలా ఆ పాత్రల ఔచిత్యాలుంటాయి. అలనాటి ఆ కథాగమనంలో భాగస్వాములమై, అటువంటి పాత్రల్లో ఊహించుకోవడం ఎవరికైనా తీయని అనుభూతినిచ్చేదే.
అటువంటి కథలు మృగ్యమవుతున్న నేటి కాలంలో, ఒక కాల్పనిక చరిత్రను మన ముందుకు తెస్తున్నారు ప్రొఫెసర్ భారతి. నిండు గోదారిలా ఉరకలెత్తే కథాగమనంతో, చక్కని కథాశిల్పంతో, అబ్బురపరచే రచనా కావ్యంతో, కనుల ముందు కనిపించేలా అన్ని పాత్రలనూ ప్రతిసృష్టి చేసి, మనలను అలరించడానికి “శుభ ముహూర్తం” చూసుకుని మరీ, ధారావాహిక నవలగా మనకందించడానికి మన ముందుకు వస్తున్నారు. మరెందుకాలస్యం… ఆ “శుభముహూర్తం”లో, కళ్లకు కట్టినట్టు కనిపించబోయే రాజప్రసాదాలను అవలోకిస్తూ, మాధవీలత లల్లుకున్న వనాలలో విహరిస్తూ, యుద్ధతంత్రాలతో అచ్చెరువొందుతూ, మనకందించబోయే, అపురూపమైన ప్రేమకథా విందుకు మీకిదే మా ఆహ్వానం.
సంపాదకవర్గం, తరుణి
రచయిత్రి పరిచయం
ప్రొఫెసర్ (డాక్టర్) మజ్జి భారతి గారు, మన తరుణి పాఠకులకు సుపరిచితులే. భారతీయం పేరుతో కాలమ్ నిర్వహించారు. “విధి నిర్వహణలో నా అనుభవాలు” అంటూ, వైద్యవృత్తిలోని తన అనుభవాలను, మైక్రోబయాలజిస్టుగా వ్యాధులు గురించిన వ్యాసాలను మనకందించారు. “ఆలోచనా తరంగాలు”, “వేకువ” అనే రెండు కథా సంపుటాలను వెలువరించి, మూడవ కథాసంపుటి “జీవనగానం”ను త్వరలో విడుదల చేయబోతున్నారు.
“కళింగ కథాజాడ”లో నాలుగు తరాల రచయితలలో వీరూ ఒకరు కావడం అభినందించదగ్గ విషయం. దగ్గరగా 80 పై చిలుకు కథలు వివిధ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఒక్క ఈనాడు ఆదివారం అనుబంధంలోనే ఎనిమిది కథలు ప్రచురింపబడ్డాయంటే, ఆమె కలానికున్న పదును తెలుస్తుంది.
వృత్తిపరంగా రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రొఫెసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, ప్రవృత్తిపరంగా రచనా వ్యాసంగంలో ఉన్న, ప్రొఫెసర్ మజ్జి భారతిగారి కలం నుండి వెలువడుతున్న ధారావాహిక నవల “శుభ ముహూర్తం”, మన పాఠకుల కోసం…సంపాదకవర్గం తరుణి
మగధ దేశపు మహారాజు విక్రమసింహ మనసు గాలిలో తేలిపోతున్నది. కోరుకున్న కన్య, వలచి చేపట్టిన సుగుణాల రాశి, అందాల ప్రోవు విదర్భ దేశపు రాకుమారి ప్రమీలాదేవితో ఈరోజు తన జీవితం పండబోతుంది. ఎంత గంభీరంగా ఉందామనుకున్నా, విశాలమైన కళ్ళు వెలుగులను వెదజల్లుతున్నాయి. పెదవులు చిరునవ్వుతో విచ్చుకుంటున్నాయి. అసలే సమ్మోహనాకారం. దానికి తోడు మనసులోని ఆనందం మోముపై ప్రతిఫలించగా, మగవారి మనసులను కూడా కొల్లగొట్టేంత సమ్మోహనంగా కనిపిస్తున్నాడు విక్రమసింహ.
అది చూసి “మన్మధుడే స్వయంగా వచ్చి పూల బాణాలు వేసినా, మరులు గొనరని పేరు గాంచిన మీరు, ఈరోజు యిలా అయిపోయారేమిటి మహారాజా! పున్నమి చంద్రుడు నీ మోమును ఆవహించాడా ఏమి? ప్రేమానురాగాల వెన్నెల సోనలు కురిపిస్తున్నాయి మీ కళ్ళు. మహారాణి వారు ఏం మాయ చేశారో?” అని హాస్యం ఆడనే ఆడాడు చిన్ననాటి నుండి స్నేహితుడు, ప్రస్తుతం ఈ దేశ సర్వ సేనాధిపతి, అనంతుడు.
ఆ మాట గుర్తొచ్చి ఒళ్లంతా పులకాంకితం కాగా, రాకుమారి ప్రమీలాదేవితో సమాగమానికి మనసు ఉరకలు వేసింది. ఇన్నినాళ్ళ తన తపఃఫలం ఈరోజు ఫలించబోతుంది. ఈరోజు కోసం ఎంత వేచి చూశాడో! ఎంతమందిని చూసినా చలించని తన మనస్సు, రాకుమారి ఆలోచన రాగానే అలా అయిపోతుందేమిటి? పురుషుడ్ని… నాకే యిలా ఉంటే మరి రాకుమారి? ఆమె కూడా తన రాక కోసం ఎదురుచూస్తూ ఉంటారేమోనన్న ఆలోచన రాగానే, అంతఃపుర శయనమందిరం వైపు అడుగులు గబగబా పడ్డాయి. ప్రమీలాదేవిని చూడగానే మనసు ఆనందంతో ఉరకలేసింది.
పరిమళాలు వెదజల్లే పూమాలలతో అలంకరించిన అందమైన శయన మందిరంలో, విశాలమైన పాన్పుకు ఒక చివర, మేలి ముసుగులో, సిగ్గుతో తలదించుకొని రాకుమారి. పరాక్రమంలో పురుషులనెంత ఎదిరించినా, స్త్రీలకు సిగ్గే అలంకారమేమో! యుక్తవయసు వచ్చాక ఏ స్త్రీని ఇంత దగ్గరగా చూడాలని కూడా అనిపించని విక్రమసింహ మనసుకు, ఆమెను చూడగానే ఏమవుతుందో మరి? పరవశించిపోతుంది. ఇందుకేనా! మనిషి జీవితంలో వివాహానికి అత్యంత ప్రాముఖ్యతనిచ్చారు మన పెద్దలు. ఇంకా జాగు చేసి రాకుమారి మనసు నొప్పించకూడదు. ఎప్పటినుండి ఎదురుచూస్తున్నారో, మా కోసం! ఈ ఆలోచన వచ్చిన తడవే, ఆమెను సమీపించి, “రాకుమారీ. ఈ శుభదినం కోసం మేము ఎన్నినాళ్ళ నుండి వేచి చూస్తున్నామో! యిన్నినాళ్ళకు మా కల ఫలించింది” అని ఆమె కరస్పర్శకు చేయి చాచాడు.
విక్రమసింహ కరస్పర్శ కాగానే, రవికిరణాలు సోకిన కలువలా, ఆమె ముడుచుకుపోయింది. సిగ్గుతోనేమో అనుకుని, “రాకుమారీ! అగ్నిసాక్షిగా మిము వివాహమాడిన వారము. మా దగ్గర మీకీ బిడియమేల! నేటి నుండి మనమిరువరమూ ఒకరమే. తనువులే వేరుగాని, హృదయమొక్కటే” లాలనగా ఆమె చుబుకాన్ని ఎత్తి మేలిముసుగు తీయబోయాడు. పర పురుషుని స్పర్శ తగిలిన దానిలా అడుగు వెనుకకు వేసి, మరింత తలదించుకుంది. అది గ్రహించుకునే స్థితిలో లేడు. ఆనందంతో మబ్బుల్లో విహరిస్తున్నాడు. అందుకే, ఊహించని ఆమె చర్యకు “రాకుమారి! మేము, మిమ్ము వలచిన విక్రమ సింహులం. మా దగ్గర మీరు స్వేచ్ఛగా ఉండవచ్చు” అని అనునయంగా చెప్పాడు.
“క్షమించాలి. మేము మిమ్ములను అలా తలచలేము. మా మనసు అన్యాక్రాంతం” హీనస్వరంతో చెప్పింది.
అప్పటికి ఈ లోకంలోకి వచ్చాడు. ఐనా, తాను వింటున్నది నిజమేనా! లేక పొరపడుతున్నాడా! మమ్ము వివాహం చేసుకొని, వారలా ఎందుకంటారు? ఎక్కడో పొరపాటు జరిగింది. “రాకుమారీ! మేము మగధ దేశాధీశులం. మిమ్ము అగ్నిసాక్షిగా వివాహమాడిన వారం. మా చెంత మీరు బిడియపడనవసరం లేదు” మరింత అనునయంగా చెప్పాడు.
“క్షమించాలి. మా మనసు అన్యాక్రాంతం” ఈసారీ నెమ్మదిగానే, ఐనా పొరపాటుకు ఆస్కారం లేని విధంగా, చాలా స్పష్టంగా చెప్పింది.
ఆ మాట వీనులకు సోకగానే, శరాఘాతం తగిలినట్లు, పాతాళానికి కృంగిపోతున్నట్టు అనిపించింది. అంతటి మహారాజూ ఆ క్షణంలో మామూలు మనిషైపోయాడు. గడియపాటు ఏమనాలో తోచలేదు. ఎన్నో యుద్ధాలలో అలవోకగా నెగ్గిన ఆ ప్రభువుకు, నిలదొక్కుకోవడానికి కొద్దిసేపు పట్టింది. తాను ఊహించినదేమిటి? ఇక్కడ జరుగుతున్నదేమిటి? ఇన్ని దినముల నుండి, క్షణాలు లెక్కపెట్టుకుంటూ, వేచి చూస్తున్నది, యిందుకొరకా? ఈ మాట వినడానికేనా తామిన్నాళ్లూ నిరీక్షించింది? తామొక్కరేనా, వారిని వలచినది? వారికి తమయందు అటువంటి అభిప్రాయం యెన్నడూ కలగలేదా? అటువంటప్పుడు వారు తమనెందుకు వివాహం చేసుకున్నారు? తమనెందుకు ఆశల పల్లకిలో విహరింప చేశారు?
రాకుమారి వైపు చూశాడు. తన ఆలోచనలతో సంబంధం లేనట్టు, ఎదురుగా శిల్పంలా… అంతే! తనదనుకున్న కన్య మనసు, వేరేవాళ్ల మీద లగ్నమై ఉందన్న విషయం గ్రహింపుకు రాగానే, ఆవేశం ముంచుకొచ్చింది. అంతవరకు కళకళలాడిన ముఖం, పొద్దు గ్రుంకుతున్న సూర్యునిలా ఎర్రబారింది. కళ్ళల్లో రక్తమే పొంగి వస్తున్నట్టు… కళ్ళు మరింత విశాలమయ్యాయి. నాసికాపుటాలు అదురుతున్నాయి. వీటితో తనకేమీ సంబంధం లేనట్టు రాకుమారి, శిల్పంలా అలాగే నిలుచున్నారు.
“మరి మమ్ము ఎలా వివాహం చేసుకున్నారు?” కోపంతో ప్రశ్నించాడు విక్రమసింహ.
“మేము చేసుకోలేదు. మీరే చేసుకున్నారు. పెండ్లి కోసం మీరు రాయబారం పంపినప్పుడు, మా తండ్రిగారు మీతో ఉద్వాహం చేయలేనని విన్నవించుకున్నారు. ఎందుకలా చెప్పారా అని, ఆనాడే మీరు ఆలోచించి ఉండాల్సింది? అనాలోచితంగా మాపై యుద్ధాన్ని ప్రకటించి, మా రాజ్యాన్ని గెలుచుకున్నారు. మాది చిన్న రాజ్యమని మీకు తెలుసు. యుద్ధంలో మీతో నెగ్గలేమనీ తెలుసు. రాజ్యం కోసం మా తండ్రిగారు నన్ను మీకిచ్చి వివాహం చేయడానికి అంగీకరించారు. మా తండ్రిగారి గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత, ఒక పుత్రికగా నాపై ఉంది. అందుకే మీతో వివాహానికి అంగీకరించాను. నా మనసు వేరే వారిమీద లగ్నమై వున్నా కూడా, కుమార్తెగా నా బాధ్యత నిర్వర్తించాను.”
ఆ మాటలు విన్న విక్రమసింహ, నిజమే! మీ కన్యను మా రాజ్య పట్టమహిషిగా చెయ్యమని, రాజమాత శుభపత్రిక పంపించినప్పుడు, వారు నిరాకరించారు. తామే ఈ నిజాన్ని గ్రహించుకోలేకపోయారు. కనీసం వివాహానికి ముందైనా రాకుమారి తన అభిప్రాయం చెప్పి ఉండాల్సింది అనుకుంటూ “మీకు యిష్టం లేనప్పుడు, ఈ వివాహానికి అంగీకరించకుండా ఉండాల్సింది మీరు” అన్నాడు.
“ఓడిపోయిన రాజు, రాజ్యంతో పాటు వారి కన్యలు కూడా విజయుడైన రాజు సొత్తన్న విషయం మీకు తెలియనిది కాదు. ఆ ధర్మాన్ని అనుసరించి, మీతో వివాహానికి అంగీకరించాను. వివాహం చేసుకోని పక్షంలో, నాకున్న ఇంకో మార్గం ఆత్మార్పణ చేసుకోవటం. ఆత్మార్పణ చేసుకుని, నా తల్లిదండ్రులను క్షోభ పెట్టి, నరకానికి పోలేను. అందుకే ఈ వివాహానికి అంగీకరించాల్సి వచ్చింది.” వేదన నిండిన స్వరంతో సమాధానమిచ్చి తలదించుకుంది.
తల దించుకున్న ప్రమీలాదేవిని చూశాడు. ఆమె ముఖంలో విపరీతమైన బాధ గోచరిస్తుంది. ఆ బాధ చూడగానే విక్రమసింహ కోపం, నీరు తాకిన పాలపొంగులా చల్లారిపోయింది. వివేకం మేలుకుంది. అవును! ఆమెను ప్రాణాధికంగా ప్రేమించాడు. కాని, ఆమె మనస్సు, తనమీద వుందో లేదో గ్రహించుకోకుండా రాయబారం చేశాడు. ఆమె తండ్రిగారు వివాహానికి అంగీకరించలేదు. యోగ్యుడైన తనతో, వారి కుమార్తె వివాహానికి వారెందుకు అంగీకరించలేదోనని, అప్పుడే తాను ఆలోచించవలసింది? తన తల్లిగారి మరణానికి ఆమే కారణమని, తొందరపడి యుద్ధం ప్రకటించాడు. తన రాజ్యంతో పోలిస్తే, విదర్భ దేశం చాలా చిన్న రాజ్యం. గెలవడం తనకు నల్లేరు మీద నడక. రాచమర్యాద నిలుపుకోవడం కోసం కుమార్తెకు యిష్టం లేకపోయినా తనతో వివాహం జరిపించేటప్పుడు ఆమె తండ్రిగారు ఎంత క్షోభ అనుభవించి వుంటారో, ఒక్కక్షణం కళ్ళముందు కనిపించింది.
తన తొందరపాటుతనానికి ప్రమీలాదేవి బలి అయిపోయింది. ఆమె మనసును చూరగొన్న ఆ భాగ్యవంతుడు ఎవరో? ఎంత అదృష్టవంతుడో? కాని, ఆ ఊహ రాగానే మనసు మరల బాధతో నిండిపోయింది. తనకు దక్కని అదృష్టం ఎవరికో దక్కినందుకు మనసు కృంగిపోయింది. రాజుననే విషయం మర్చిపోయాడు. తనమీద తనకే జాలి వేసింది. ఎందరో మహారాజులు వారి కన్యలను వివాహం చేసుకోమని రాయబారం నడిపారు. కానీ, తన మనసంతా ప్రమీలాదేవి మీదే లగ్నమై ఉండడం చేత, వారందరికీ సామరస్య పూర్వకంగా, కాదు అని బదులు చెప్పగలిగాడు.
ఈరోజు దేశమంతా రాజుగారి వివాహ వేడుకలలో మునిగివుంది. కాని, ఈ అంతఃపురంలో తన మనసు, తన ఎదురుగా ఉన్న ప్రమీలాదేవి మనసు విచారంలో మునిగి ఉన్నాయి. ఇంకా ఆమెను ప్రతిరోజూ చూస్తూ, ఈ క్షోభ భరించడం తన వల్లకాదు. ఆమెను, ఆమె తండ్రిగారి దగ్గరికి పంపించడం ఉత్తమం. ఇలా నిర్ణయించుకున్న విక్రమసింహుడు, “రాకుమారి! జరిగిన దానిని మేము వెనుకకు తీసుకురాలేం. కాని, మీ మనసుకు కష్టం కలిగించేలా, యిక్కడ మిమ్మల్ని ఉంచడం భావ్యం కాదు. మిమ్మల్ని మీ తండ్రిగారి దగ్గరకు పంపించి వేస్తాను. సిద్ధం కండి” అని వెనుదిరిగాడు.
“క్షమించండి. ఈ పరిస్థితులలో, నేను మరలా మా రాజ్యానికి వెళ్ళలేను. ఒకసారి వివాహం అయ్యాక, ఆ కన్యకను భరించవలసినది ఉద్వాహం చేసుకున్న వారే. వివాహం అయిన వెంటనే కొమరిత, భర్తను విడిచి పుట్టింటికి చేరుకుందంటే, దాని పర్యవసానాలు మీకు తెలిసే ఉంటాయి. ఒకసారి వివాహం అయ్యాక, నేనిక విదర్భ రాజ్య రాకుమార్తెను కాదు. మగధ రాజ్యపు పట్టపురాణినే. ఆ మర్యాదను నేను కాపాడతాను” తలవంచుకొని నెమ్మదిగా బదులిచ్చింది ప్రమీలాదేవి.
“మనసు ఎవరికో అంకితం చేస్తూ, ఇక్కడ తన దేశపు పట్టపురాణిగా ఉంటానని, ఆమె అనడం చాలా అన్యాయమని మనసు ఆక్రోశించింది. తాను ప్రాణాధికంగా ప్రేమించిన స్త్రీమూర్తి, వేరే వాళ్లను మనసులో నిలుపుకుని, అనుక్షణం తన ఎదురుగా ఉంటానంటే ఎలా భరించేది?” ఆమె కోరికను మన్నించవద్దని విక్రమసింహ మనసు చెప్తుంది. కాని, వేరు మార్గం లేదు. ఎందరో రాజుల కొమరితలను తిరస్కరించి, వివాహం చేసుకున్న కన్యక, వివాహం కాగానే పుట్టింటికి వెళ్ళిపోతే, ఆమె రాజ్యం సంగతేమో కాని, తన రాజ్యప్రతిష్ట ఏమవుతుందో ఒక్కక్షణం కళ్ళముందు కనిపించింది విక్రమసింహకు.
మనసుకు ఇష్టం లేకపోయినా, “సరే” అన్నమాట బయటకు వచ్చింది. “సరే” అని చెప్పి వెళ్ళిపోతున్న విక్రమసింహను, “ఇంకొక విషయం” అన్న ప్రమీలాదేవి మాట ఆపింది. వెనుదిరగకుండానే “చెప్పండి” అన్నాడు.
“మీరు మా రాజ్యాన్ని గెలవడానికి కారణం, మాది చిన్నరాజ్యం అనేకాదు, వారసుడు లేకపోవడం కూడా ఒక కారణం. నేనే పురుషున్ని అయి, మీతో సమానంగా యుద్ధ విద్యలలో, శౌర్య పరాక్రమాలలో ఆరితేరిన దానినయి ఉంటే, మీతో యుద్ధం చేసి గెలిచేదాననేమో!”
ఆమె మాట ముగియలేదు. నేనే పురుషున్ని అయితే అన్న ఆమె మాటకు, ఒక్కసారి ప్రమీలాదేవిని… ఈ అందాల లావణ్యరాశి, ముట్టుకుంటే కందిపోయేలా ఉన్న సుకుమారిని, దృఢమైన శరీరంతో, వీరోచితంగా పోరాడే ఒక పురుషునిగా ఊహించుకుని, ఫక్కున నవ్వాడు విక్రమసింహ.
“మా బాధ, మీకు హాస్యాస్పదంగా ఉందా?” తలెత్తకుండానే అడిగింది ప్రమీలాదేవి.
“క్షమించాలి. నా ఉద్దేశం అదికాదు. మీరు పురుషుడై ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని. అంతే.” సున్నితంగా బదులిచ్చాడు విక్రమసింహ.
తనను తాను పురుషునిగా ఊహించుకున్న, ప్రమీలాదేవికి కూడా పెదవులపై నవ్వు పారాడింది. అది బయటపడకుండా తల మరింత దించుకుంది ఆమె. పెదవులపై చిరునవ్వును బయటకు రాకుండా కన్నులలోనే అదమగా, అది మోమంతా పరుచుకొని, ఆమె వదనం చంద్రకిరణాలు సోకిన కలువలా వికసించింది. మోము మరింత అందంతో కాంతులను వెదజల్లింది. అందంతో ఇనుమడించిన ఆమె మోముని చూసి ఒక్కసారిగా మైమరిచిపోయాడు విక్రమసింహ. అలా ఎంత కాలం గడిచిందో తెలియదు.
“ఇంకొక మనవి” అడగలేక అడిగిన, ప్రమీలాదేవి మాటలకు ఈ లోకంలోకి వచ్చాడు. “మన, ఈ రహస్యం ఎవరూ గ్రహించకుండా ఉండాలంటే, అంతఃపురం పూర్తిగా మా అధీనంలో ఉండాలి.”
అంతఃపురం వారి అధీనంలో అంటే… ప్రస్తుతం ఆమె ఈ దేశపు మహారాణి కాదు. శత్రుదేశపు రాకుమారి. వారి అధీనంలో అంతఃపురం ఉంచడమంటే నిప్పుతో చెలగాటమే! అలాగని, ఆమెను చూస్తూ కాదనలేడు. వలచిన వనిత కోరికను కాదనలేని తన నిస్సహాయతకు, వగచక తప్పలేదు విక్రమసింహకు. “సరే” అన్నాడు.
“మరొక్క మనవి. క్షమించాలి. మీతో ఎలా చెప్పాలో! కానీ మా తండ్రిగారికి మేము యుద్ధంలో ఏ విధమైన సహాయం చేయలేక పోయినందుకు మేము ఓడిపోయాం. అందుకని … ” అంటూ సందిగ్ధంలో ఆగిపోయింది ప్రమీలాదేవి.
“ఫరవాలేదు. చెప్పండి.” ఇంతవరకూ వచ్చాక, ఏమైనా జరగనీ, అనే నిశ్చయానికి వచ్చాడు విక్రమసింహ.
“మాకు యుక్తవయసు వచ్చినవరకు, మమ్ములను మగబిడ్డగానే పెంచారు మా తండ్రిగారు. మేము అన్ని యుద్ధవిద్యలూ నేర్చుకున్నాం. కాని, మాకు యుక్తవయసు రాగానే మమ్ములను అంతఃపురానికే పరిమితం చేశారు. అందుకని నేను యుద్ధ విద్యలలో ఆరితేర లేకపోయాను. నాకు ఇప్పుడవన్నీ నేర్చుకోవాలని ఉంది. ఎవరైనా నా మీదకు దాడికి వస్తే ఎదురొడ్డి గెలవాలని ఉంది. నాకు, నా చెలికత్తెలకు యుద్ధవిద్యలు నేర్పించే బాధ్యత మీరు తీసుకోవలసినదని సవినయంగా వేడుకుంటున్నాను” అంటూ చేతులు జోడించింది ప్రమీలాదేవి.
నవ్వొచ్చింది విక్రమసింహకు. ప్రేమించి, యుద్ధంలో గెలిచి వివాహం చేసుకున్న స్త్రీమూర్తి, నా మనసు వేరే వారికి అంకితం, మీ రాజ్యంలో ఉంటాను గాని, మీకు సంబంధించిన వ్యక్తిని కాను. రేపు అవసరమొస్తే మీతో యుద్ధం చేయటానికి యుద్ధవిద్యలలో నేను ఆరితేరాలి. అందుకు మీరే నాకు సహాయం చేయాలి అని అడుగుతున్నందుకు. ప్రమీలాదేవి ముఖం చూస్తూ కాదని చెప్పలేకపోయాడు. “మీ అభిమతం. అలాగే కానివ్వండి” అని చెప్పి వడివడిగా ముందుకు అడుగులు వేశాడు విక్రమసింహ.
*
చిన్ననాటి నుండి ప్రాణస్నేహితుడు, ఈ దేశపు మహారాజు, కోరుకున్న సఖితో వివాహం జరిగి ఆనందపు అంచులు చూస్తూ ఉండి వుంటాడు. మహారాజు ప్రేమ సామ్రాజ్యంలో ఆనందం ఆవలి అంచులను తాకే వరకు, దేశ భద్రతను పరిరక్షించాల్సిన బాధ్యత తన భుజస్కంధాలపై ఉంది. మహారాజు ఆనందానికి ఎవరూ అడ్డురాకుండా, రాజ్యవ్యవహారాలను చూసుకోవలసిన బాధ్యత కూడా స్నేహితుడిగా తనమీద ఉంది, మనసులో ఇలా అనుకుంటూ, వెనక్కి తిరిగి అంతఃపురాన్ని అవలోకించాడు అనంతుడు. దీపాల కాంతుల్లో ధగధగలాడుతుంది అంతఃపురం. తన మహారాజు వదనంలాగే… మహారాజు తలపుకు రాగానే ప్రఫుల్లమయింది అనంతుని మనసు.
నెల రోజుల నుండి మహారాజు పరిణయ మహోత్సవ సందర్భంగా పేదవారికి దానధర్మాలు, ప్రముఖులకు కానుకలు, దేవాలయాలకు మడులు మాన్యాలూ అందజేయబడ్డాయి. పేద ధనిక అన్న తేడా లేకుండా పుర ప్రజలంతా ఈ సంబరాన్ని గొప్పగా జరుపుకుంటున్నారు. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరుపుతున్నారు. ఇంటింటినీ, వాడవాడనూ అలంకరించారు. మహారాజంటే, ప్రజలకున్న అభిమానం అటువంటిది. అంతటి మహారాజును, అంతఃపురం వరకూ తోడ్కొని వచ్చి సింహద్వారం దగ్గరే ఆగిపోయి “మీ ముఖంలో ఆనందం ఎప్పుడూ ఇలాగే కలకాలం ఉండాలి” అని ఆలింగనం చేసుకుని వీడ్కోలు చెప్పాడు.
అంతఃపురం నుండి వెను తిరుగుతుంటే, అంతకు ముందు జరిగిన సంభాషణ గుర్తుకొచ్చింది. “ఎప్పుడూ గంభీరంగా, సూర్యుని ప్రతాపంతో నిండి ఉందా అనిపించేలా ఉన్న మా మహారాజుల ముఖం, ఈనాడు పున్నమి చంద్రునిలా ప్రేమానురాగాల సోనలు కురిపిస్తుంది. ఏలనో! ఎవరేమి మాయ చేసారో”నని తాను హాస్యమాడగానే, “అలాగే చూస్తూ ఉండు, అనంతా! శత్రువుల పట్ల కర్కశుడని పేరొందిన ఈ దేశ సర్వసేనాధిపతిని, తమ ప్రేమానురాగాల ధారలతో ముంచెత్తి, ముట్టుకుంటే కరిగిపోయే హిమఖండంలా మార్చటానికి, యెవరో యెక్కడో యెదురు చూస్తూనే ఉన్నారు. ఆ శుభ ఘడియలు రానీ! అప్పుడు చూద్దాం. నీ మోము యే సోనలు కురిపిస్తుందో!” అని బదులిచ్చాడు ప్రాణ స్నేహితుడు విక్రమసింహ. అది గుర్తుకు రాగానే అనంతుని ముఖంలో చిరునవ్వు తొణికిసలాడింది.
నిద్రించిన సమయంలో తప్ప, యింతవరకు ఎప్పుడూ విక్రమసింహను విడిచిపెట్టింది లేదు. ఇప్పుడు ఆ అలవాటు మార్చుకోవాలి. తనలో తానే అనుకుంటూ అంతఃపురం భటులను మరొక్కమారు హెచ్చరించి, తన మందిరం వైపు నడుస్తున్న అనంతుడు, దూరంగా చీకటి ముసుగులో మహారాజ మందిరం వైపు, గబగబా వెళ్తున్న వ్యక్తిని చూశాడు. ఇంత రాత్రివేళ మహారాజ మందిరం వైపు… మనసొక్కసారిగా త్రుళ్ళి పడింది… త్రుళ్ళి పడడమే కాదు, భయాందోళనలకు లోనయింది. ఏమి జరుగుతుంది? ఆలోచనలతో తలబ్రద్దలై పోతుంది. ఏమి చెయ్యాలో తోచడం లేదు. అడుగు ముందుకు పడడం లేదు. మనసు కీడును శంకిస్తుంది. శిలలా బిగుసుకుపోయాడు అనంతుడు.
*
తర్వాత భాగం మలి సంచికలో…..
దానములన్నిటికన్న రక్తదానం మిన్న. ఎందుకంటే రక్తదానం వలన ఒక నిండుప్రాణం కాపాడవచ్చు. అట్లాగే అవయవ దానం నుండి కూడా. మిగిలిన ఏ దానములలోనైనా, ఒక ప్రాణాన్ని కాపాడే అవకాశముండదు. అందుకని అన్ని దానములలో కన్నా ఈ రెండు దానములే శ్రేష్టం. ఈరోజు మనం రక్తదానం గురించి తెలుసుకుందాం.
అసలు రక్తం దేనితో తయారవుతుంది. ఇది ప్లాస్మా, ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్లెట్స్ అనే వాటి కలయికతో కూడి ఉంటుంది. ఎర్ర రక్తకణాలు శరీరావయవాలకు కావాల్సిన ప్రాణవాయువును అందిస్తే, తెల్ల రక్తకణాలు రోగ నిరోధకతను పెంపొందిస్తే, ప్లేట్ లెట్స్ రక్తాన్ని గడ్డ కట్టించి, రక్తస్రావం జరగకుండా కాపాడుతాయి. రక్త కణాలు ఎముక మూలుగు లేక మజ్జ (Bone marrow) నుండి తయారవుతాయి. ఎర్ర రక్తకణాల జీవితకాలం 120 రోజులైతే, తెల్ల రక్తకణాలు- వాటి రకాన్ని బట్టి జీవితకాలం మారుతుంది. జీవితకాలం దాటిన రక్తకణాలు నాశనమై, కొత్త రక్తకణాలు రక్తంలో చేరుతుంటాయి.
ఏదైనా కారణము వలన శరీరంలో రక్తస్రావమైనా (ఉదాహరణకు స్త్రీలలో వచ్చే నెలసరి, ప్రసవము, పెద్ద ప్రేవుల క్యాన్సర్, కొన్ని రకాలైన నులిపురుగులు… మొదలగు సందర్భాలలో జరిగే రక్తస్రావము), శరీరంలోని రక్త పరిమాణం (5L) తగ్గకుండా శరీరం తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్లాస్మా పరిమాణం తగ్గకుండా, కణాల నుండి నీరు రక్తంలో చేరుతుంది. అలాగే బోన్ మేరో ఎక్కువ పనిచేసి రక్తకణాలను అందిస్తుంది. ఆ రకంగా, రక్తం ద్వారా అవయవాలకు అందే ప్రాణవాయువు పరిమాణం తగ్గకుండా జాగ్రత్తపడుతుంది శరీరం. దీనికి కొంత సమయం పడుతుంది.
కాని కొన్ని సందర్భాలలో (రోడ్డు ప్రమాదాలు,శస్త్ర చికిత్సల్లో మరియు ప్రసవ సమయాల్లో కాంప్లికేషన్స్ తలెత్తితే), రక్త పరిమాణము పెంచే సమయం శరీరానికి తగినంత లేకుంటే, రోగి షాక్ లోకి వెళ్లి మరణించే అవకాశాలెక్కువ. అటువంటి సందర్భాలలో, రక్తమార్పిడి రోగి ప్రాణాలను కాపాడుతుంది. అలాగే రక్తకణాలు తొందరగా విచ్ఛిన్నమయ్యే తలసీమియా, హిమోఫిలిక్ రోగుల్లో, రక్త కణాలు సరిగ్గా తయారవ్వని ఎప్లాస్టిక్ ఎనీమియా రోగుల్లో మాటిమాటికీ రక్తాన్ని ఎక్కించవలసి ఉంటుంది.
అయితే ఈ రక్తదానం చెయ్యడానికి అర్హులెవరంటే… 18- 65 సంవత్సరాల మధ్య ఉన్న ఆరోగ్యవంతులైన స్త్రీ పురుషులు. హిమోగ్లోబిన్ శాతం స్త్రీలకు 12.5%, పురుషులకు 13% తగ్గకుండా వుండాలి. వారికి ఏ విధమైన వ్యాధులు ఉండకూడదు. (ముఖ్యంగా హెచ్ఐవి, హెచ్.బి.వి, హెచ్.సి.వి. మరియు కొన్ని రకాలైన సుఖ వ్యాధులు). దీర్ఘకాలిక జబ్బులతో బాధపడేవారు, క్యాన్సర్ రోగులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, 45 కేజీల కన్నా తక్కువ బరువు ఉన్నవారు, రక్తదానము చేయడానికి అనర్హులు. రక్తదానానికి, రక్తదానానికి మధ్య కనీసం రెండు నెలల వ్యవధి ఉండాలి.
రక్తదాత నుండి 300 మిల్లీలీటర్ల రక్తాన్ని సేకరించి, హెచ్ఐవి, హెచ్.బి.వి, హెచ్.సి.వి. మరియు సిఫిలిస్ వ్యాధులు లేవని నిర్ధారించుకున్నాక, ఆ రక్తాన్ని బ్లడ్ బ్యాంకులో అలాగే (Whole blood), 4°C వద్ద ఏడు వారాల వరకు నిల్వ ఉంచవచ్చు. లేనిపక్షంలో ఆ రక్తాన్ని, ప్యాకెడ్ సెల్స్, ప్లేట్లెట్స్ (ఏడు రోజుల వరకు), ప్లాస్మా (ఫ్రేజెన్ ప్లాస్మా: -20°C వద్ద కొన్ని సంవత్సరాలు)… యిలా వేరు చేసి దాయవచ్చు. రక్తహీనత ఉన్నవారికి ప్యాకెడ్ సెల్స్, ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నవారికి (ఉదాహరణకు డెంగ్యూ జ్వరం) వాటిని, ఆటోయిమ్యూన్ డిసీజ్ ఉన్నవారికి ప్లాస్మాను అందిస్తారు. రక్తాన్ని సంగ్రహించాక మాత్రమే పరీక్షలు చేస్తారు. ఒకవేళ పరీక్షల్లో ఏ వ్యాధి అయినా ఉన్నట్లు నిర్ధారణ అయితే ఆ రక్తాన్ని ఉపయోగించరు.
రక్త మార్పిడి చేసేముందు, రోగికి ఆ రక్తం సరిపోతుందా లేదా అనేది బ్లడ్ గ్రూపింగ్, క్రాస్ మ్యాచింగ్ అనే పరీక్షలు చేసి నిర్ధారించుకుంటారు వైద్యులు. O, A, B, AB అనే నాలుగు రకాల రక్త గ్రూపులు, వాటిలో Rh పాజిటివ్, నెగిటివ్ అని రెండు రకాలు ఉంటాయి. “O నెగిటివ్” రక్తాన్ని ఎవరికైనా ఇవ్వవచ్చు. వారిని “యూనివర్సల్ డోనార్స్” అంటారు. “AB పాజిటివ్” వ్యక్తులకు ఎవరి రక్తాన్నైనా ఇవ్వవచ్చు. వారిని “యూనివర్సల్ రెసిపియంట్స్” అంటారు.
రక్తదానం చేసిన వారికి ఏ రకమైన ఇబ్బందీ, తలెత్తదు. ఒక రెండు గంటలు రెస్ట్ తీసుకున్నాక, మామూలుగా విధులు నిర్వర్తించుకోవచ్చు. ముందే చెప్పుకున్న ప్రకారం, దానం చేసిన రక్తాన్ని దాత శరీరం కొద్ది కాలంలోనే సమకూర్చుకుంటుంది.
ప్రతి సంవత్సరం జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని జరుపుకుంటున్నా, ఎప్పటికప్పుడు ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ శాఖలు, స్వచ్ఛంద సేవా సంస్థలు రక్తదాన శిబిరాలను నిర్వహించి, రక్తాన్ని సేకరించి, అవసరమైన వారికి అందిస్తూ, మానవ సేవను చేస్తున్నారు. వారితో పాటు మనం కూడా ఆ సేవలో పాల్గొందాం రండి.
మొన్న వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో, నిన్న ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో, ఆ ముందు… బోలె బాబా ఆశ్రమంలో
(పాదధూళి కోసం)… చెప్పుకుంటూ పోతే ఎన్నో… గాలిలో కలిసిపోతున్న ప్రాణాలెన్నో? జాగ్రత్తలెన్ని తీసుకున్నా ఇలాంటి అపశ్రుతులెందుకు జరుగుతాయి?
భారతదేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం మీద జరుగుతున్న తొక్కిసలాటల్లో అశువులు బాస్తున్న ప్రాణాలెన్నో! ఈ తొక్కిసలాట జరగడమనేది మతసంబంధ కార్యక్రమాలలోనే కాదు, ఫుట్ బాల్ క్రీడా ప్రాంగణాల్లోనూ, సెలబ్రిటీలు పాల్గొనే కార్యక్రమాల్లోనూ… ఒక రకంగా చెప్పాలంటే, ఎక్కడైనా జన సందోహమెక్కువగా ఉంటుందనుకున్న ప్రదేశాలలో ఈ తొక్కిసలాట జరగడమనేది సాధారణమై పోయింది. అయినా ప్రజలు, అటువంటి కార్యక్రమాలకు ఎందుకు హాజరవుతారో ఒకసారి అవలోకిద్దాం.
మత విశ్వాసాలకు సంబంధించిన కార్యక్రమాలలో పుణ్యం సంపాదించుకోవడమే ధ్యేయమైతే, మిగిలిన వాటిలో తమకిష్టమైన బాబాలనో, క్రీడాకారులనో, నటీనటులనో దగ్గర నుండి చూసామని చెప్పుకోవడం కోసం హాజరవుతారు. లింగ, వయోభేదాలు లేకుండా అన్ని సామాజిక వర్గాల నుండి వీటికి హాజరవుతారు. కొంతమంది విశ్వాసంతో వస్తే, మరి కొంతమంది, మేము కూడా ఆ కార్యక్రమానికి వెళ్లామని చెప్పుకోవడానికి… ముఖ్యంగా యువత… వస్తారు.
జనసమ్మర్దం ఎక్కువగా ఉండే కార్యక్రమాలకు ఎంతమంది వస్తారనేది ఇంచుమించుగా లెక్కలు వేసుకుని ప్రభుత్వాలు, తగిన ఏర్పాట్లను చేస్తూనే ఉంటాయి. అయినా విషాదాలు చోటు చేసుకుని, అయినవారికి కన్నీళ్లు మిగిల్చిపోతుంటాయి. వీటిని అరికట్టలేమా?
ఇప్పుడు మనం ప్రస్తావించుకునేది ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో జరిగిన విషాదం గురించి. భోగి పర్వదినాన మొదలైన ఈ కుంభమేళాలో 15 కోట్ల మంది, జనవరి 28 వరకు గంగాస్నానం చేశారని లెక్కలు చెబుతున్నాయి. ఇంతమంది హాజరైనా, ఒక్క అవాంఛనీయ సంఘటన కూడా జరగలేదని అందరూ సంతోషిస్తున్న వేళలో, జరగకూడనిదే జరిగి పోయింది. 30 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. దీనికి కారణాలు ఏమిటన్నది మనం పరిశీలిస్తే, ఒకే ఒక్క విషయం అర్థం అవుతుంది.

ఒకేరోజు, ఒకే సమయానికి, ఒకే స్థలానికి, ఎక్కువ మంది చేరుకోవడం… మహాకుంభ మేళా, పుష్య మాసపు చివరి రోజు, మౌని అమావాస్య, అమృత ఘడియల్లో దేవతలు దిగి వస్తారని, ఆ సమయంలో త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయని, దానధర్మాలు చేస్తే సకల శుభాలు కలుగుతాయని, పిండ ప్రదానం చేస్తే పితృదేవతలకు సద్గతులు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అందుకే జనవరి 29, మౌని అమావాస్య నాడు 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేసిన ప్రభుత్వం దానికి తగిన ఏర్పాట్లనే చేసింది. కాని, ఉదయం రెండు గంటల సమయంలో ఒకేసారి భక్తులు పోటెత్తడంతో బారికేడ్లు విరిగి, తొక్కిసలాటకు దారి తీసింది. దానికి తోడు చీకటిగా ఉండడంతో, ఏమి జరుగుతుందో తెలియని గందరగోళ పరిస్థితి… దాంతో కొంతమంది కింద పడి ప్రాణాలు కోల్పోతే, మరి కొంతమంది గాయాల పాలయ్యారు.
12 కిలోమీటర్లు పొడవునా 44 పుష్కర ఘాట్లతో ఉన్న నదీతీరంలో స్నానం చేయకుండా, ఆ ఒక్క ప్రదేశానికే, ఆ సమయంలోనే, ఆ రోజే, వెళ్లాలని అనుకోవడమెందుకు?
మనసా, వాచా, కర్మణా పరిశుద్ధంగా ఉండడం, ఎల్లప్పుడూ సత్యాన్ని పలకడం, పరిశుద్ధమైన భావాలుంటే చాలు నన్ను పూజించినట్టేనని, ఇవేవీ లేకుండా చేసిన హోమము, దానము, తపస్సు, మరి ఏ ఇతర క్రియ అయినా ఇహపరాలలో ఫలమివ్వదని, మనం చేసిన కర్మలే మనను అనుసరిస్తాయని గీతాబోధకుడే స్వయముగా అర్జునునితో చెప్పాడని భగవద్గీతలో నేర్చుకుంటూనే ఉంటాం.
పైగా హిందూ శాస్త్రాలలో, ఏ క్రతువు గురించి చెప్పినా అందులో దానధర్మాల ప్రసక్తి ఉంటుంది. దానర్థమేమిటి? అవసరంలో ఉన్న వారిని ఆదుకోమన్న అర్థమే. వీటన్నిటినీ వదిలి, ఆ రోజే, ఆ సమయంలోనే, ఆ త్రివేణి సంగమంలోనే స్నానం చేస్తే, చేసిన పాపాలన్నీ పోతాయనుకుంటే, భగవంతుడు చెప్పిన కర్మ సిద్ధాంతానికి విలువేమిటి?
అందుకని మనం చేయాల్సిందేమిటంటే, మంచి చెప్పే మత విశ్వాసాలను, బోధనలను అనుసరిద్దాం, ఆచరిద్దాం. చేసిన పాపాలు చేసేసి, ఒక్క స్నానంతో ఆ పాపాలన్నిటినీ కడిగి వేసుకుందామనే మూఢనమ్మకాలను విడిచిపెడదాం. ఈ విషయం అందరూ పాటిస్తే, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతమవ్వకుండా ఉంటాయి. అందుకని ప్రజలు కూడా, గుడ్డిగా ఎవరు ఏది చెప్తే అదే నిజమని భ్రమించకుండా, విచక్షణా జ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ, జన సాంద్రత ఉన్న ప్రదేశాలకు వెళ్ళినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు, వృద్దులు ఉన్నప్పుడు మరింత జాగ్రత్త అవసరం.
అలాగే న్యూస్ చానల్స్, పత్రికా యాజమాన్యాలు మూఢాచారాలను పెంచే వార్తలను ప్రోత్సహించకుండా, ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వారిలో అవగాహన పెంచే కార్యక్రమాలను చేస్తూ, ధర్మాధర్మ విచక్షణ తెలియజేసే కార్యక్రమాలను ప్రసారం చేస్తూ, సమాజంలో జరుగుతున్న చెడుని పదే పదే చూపించకుండా, తక్కువ ప్రాధాన్యమిచ్చి, సమాజంలో జరుగుతున్న మంచి కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యమివ్వడం ద్వారా, మంచిని ప్రోత్సహించే కార్యక్రమాలను ఒకటికి రెండుసార్లు టెలికాస్ట్ చెయ్యడం ద్వారా, సమాజమూ బాగుపడుతుంది. మన పూర్వీకులు నమ్మిన సనాతన ధర్మమూ పునరుత్తేజమవుతుంది.
అలాగే ప్రభుత్వాలు కూడా, అధిక ప్రాధాన్యం సంతరించుకున్న ఇటువంటి కార్యక్రమాలలో, వి.ఐ.పి. లు వచ్చినప్పుడు ప్రోటోకాల్ పేరుతో, సామాన్యులను కట్టడి చేసి, వారు వెళ్లగానే ఒకేసారి గేట్లు తెరవడం ద్వారా తొక్కిసలాటకు అవకాశం ఏర్పడుతుంది. అందుకని జనసమ్మర్ధం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో విఐపి ల, రాకపోకలను నియంత్రిస్తే, చాలా ప్రమాదాలను అరికట్టవచ్చు.
అలాగే, సామాన్య ప్రజల అవసరాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తూ, అవసరాన్ని బట్టి అప్పటికప్పుడు ఏర్పాట్లలో తగిన మార్పులు చేర్పులు చేసుకుంటూ, జాగ్రత్తలు తీసుకుంటూ, ప్రజలకు దిశా నిర్దేశం చేస్తూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని, జనసాంద్రత ఎక్కువున్న ప్రదేశాలలో, కఠిన నిబంధనలను అమలు చేస్తూ, సాంఘిక మాధ్యమాల ద్వారా ప్రజలలో ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదనే విషయాలపై ముందు నుండి అవగాహన పెంచగలిగితే, ఇటువంటి విషాదాలను అరికట్టవచ్చు. భక్తులకు మధురానుభూతులను మిగిల్చవచ్చు.
చెయ్యి వెయ్యగానే ముడుచుకుపోయిన ఆమెను జూసి “నేనంటే యిష్టం లేదా?” అడిగాడతను.
“అబ్బే అటువంటిదేమీ లేదు” సర్దుకొని అతని భుజం మీద చెయ్యవేసిందామె. ఎందుకంటే కస్టమరు తన గురించి నెగిటివ్ రిపోర్ట్ ఇస్తే జరగబోయే పరిణామాలు ఆమెలోని అణువణువుకూ తెలుసు. నెత్తురొలికే గాయాలు తనువునీ, మనసునీ కబలించేస్తాయి. తేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. దానికితోడు మనసుకయ్యే గాయాలు కప్పిపుచ్చుకోవచ్చు. కాని తనువుకయ్యే గాయాలు అలా కాదు కదా! నొప్పితో విలవిల్లాడుతూ, మేమున్నామంటూ గుర్తుచేస్తూనే ఉంటాయి. దాని బదులు ఇప్పుడిది భరించడమే సులువనుకొని, అయిష్టంగా ముడుచుకుపోబోతున్న కండరాలను మందలించి, మనసుకు సర్దిచెప్పి, అతనికనుగుణంగా కదిలించింది తనువును. తన స్పర్శకు స్పందిస్తున్న ఆమెను అల్లుకుపోతున్నాడతను.
మధ్యలో చేస్తున్న పనినాపి హఠాత్తుగా “నేనందుకు పనికొస్తానా?” ప్రశ్నించాడతను.
కస్టమరుకి ఏది కావాలో అది అందించి, వాళ్లని సంతృప్తి పరిచి పంపించాలిక్కడ. అందుకే “ఎందుకలా అనుకుంటున్నారు? మీకేమి తక్కువ?” అని లేని ఉత్సాహాన్ని గొంతులో నింపుకొని అడిగింది.
“నిజంగానా! నువ్వబద్దం చెప్పడం లేదు కదా!” అని అంటూ, “పర్వాలేదా! నీకేమీ ఇబ్బంది కలగడం లేదు కదా! ఉంటే చెప్పంటూ” ఆమెను పెనవేసుకుంటున్నాడు.
ఇదో కొత్త అనుభవమామెకు. తన తనువుతో ఆడుకునేవాళ్లే గాని, “నీకేమీ ఇబ్బంది లేదు కదా!” అని అడిగిన కష్టమరుని ఇంతవరకు తన సర్వీసులో చూడలేదామె. తొలిసారిగా ఆమె మనసు స్పందిస్తోంది పరస్పర్శకు. ఆమె తనువును తీగగా చేసి మీటుతున్నాడు. తీగ మీటితే నాదము పలికినట్టు, ఆమె మనసు ఆనందనాదాన్ని పలుకుతోంది. పారవశ్యం ఉత్తుంగ తరంగంలా ఇద్దరినీ అల్లుకుపోతుంది.
అలసి, సేదదీరిన అతను “నాలో ఏమీ లోపం లేదు కదా?” ఆమె చెవిలో గుసగుసలాడాడు. అలసి అతని చేతుల్లో సేదతీరుతున్న ఆమె “మీకా అనుమానమెందుకొచ్చిందంది ఆశ్చర్యంగా.
ఆమె స్వరంలోని మాధుర్యమో, మార్దవమో కదిలించిందతనిని. “నేనందుకు పనికిరాని వాడినంటున్నారంతా!” చిన్నపిల్లాడిలా చెప్పాడతను.
“మీమీద మీకా నమ్మకం లేదా?” అని అడిగిన ఆమెతో “ఏమో! నా మీద నాకే నమ్మకం పోయింది” నిట్టూర్చాడతను.
“ఎందుకలా?” అని అడిగిన ఆమెతో “తానిష్టపడ్డ వాడిని పెళ్లి చేసుకుంటానని, ఇంటినుండి వెళ్లిపోయిన నా మరదలిని తీసుకొచ్చి, పరువుమర్యాదల కోసం నన్ను పెళ్లి చేసుకోమంటే ఆనందంగానే చేసుకున్నాను. ఎందుకంటే తనంటే చిన్నప్పటినుండి నాకిష్టం కనక. మొదటిరాత్రి ‘యింతకుముందు జరిగిందంతా మర్చిపోదాం. ఇకనుండి ఒకరికొకరమవుదాం’ అని తనను దగ్గరకు తీసుకుంటున్న నాతో, ‘ఛీ! నువ్వసలు మగాడివేనా? చీమూ నెత్తురూ లేదా!’ అని ఛీత్కరించుకొని గదిలోనుండి వెళ్ళిపోయింది. ఎంత ఆలోచించినా, నేను చేసిన తప్పేమిటో అర్థం కాలేదు. ప్రేమించాననుకున్నవాడు దక్కలేదన్న బాధతో అలా అందేమోనని సరి పెట్టుకున్నాను. కాని, ఎప్పుడు తనకి దగ్గరవుదామని చూసినా ఆమె ముఖంలో ఒక రకమైన చీదరింపు… ‘నువ్వు మగాడివి కావంటూ….’
నేను మగాడిని కానా అని నామీద నాకే అపనమ్మకమేస్తుంటే …. నాలోనే ఏదో లోపం ఉందేమోనని నామనసుకే అనుమానం వేస్తుంటే… అవునో కాదో తెలుసుకోవడానికి రహస్యంగా యిలా అప్పుడప్పుడూ ఎక్కడెక్కడికో వెళ్ళినా… వాళ్లు నా మీద చెయ్యి వెయ్యగానే నేను చేస్తున్నది తప్పని నా మనసు నన్నే మందలిస్తుంటే… ముడుచుకుపోయి, ఏమి చెయ్యని నన్ను, జాలిగా చూస్తూ… ‘మగతనం లేనప్పుడు ఎవరి దగ్గరైనా అంతే!’ అనేవాళ్లే గాని నీలా మృదువుగా నన్ను దగ్గరకు తీసుకున్న వాళ్ళెవరూ లేరు. అందుకే ఆ అనుమానం” యేమి గుర్తొచ్చిందో కాసేపాగిపోయి….
తాను ప్రేమించిన వాడికి దగ్గరవ్వాలని…. నేను సంసారానికి పనికి రానని, విడాకులు కావాలని నా మరదలు కోర్టుకెక్కితే… వీడు మగవాడు కాదని కొంతమంది జాలిగా… కొంతమంది హేళనగా చూస్తుంటే… కట్టుకున్న భార్యే అవమానాన్ని మిగిల్చి వెళ్లిపోతే ఎందుకీ జీవితమని… బ్రతికి ఎవరినుద్ధరించాలని… ఇంకొకవైపు నా తప్పూ లేదు, నాలో యే లోపమూ లేదు, నేను మగవాడినే… అని అరిచి చెప్పాలని… ఇటువంటి విరుద్ధ భావాలతో, పోయేముందు ఒక్కసారైనా నేను మగవాడినేనని నిరూపించుకోవాలని…. యిదిగో యిప్పుడిలా నీ ముందు…. నీలా నన్ను ప్రేమగా దగ్గరకు తీసుకున్న వాళ్ళెవరూ లేరు. నువ్వైనా నిజం చెప్పు” అన్న అతని ప్రశ్నకు జవాబు చెప్పకుండా “నీకేమి? నువ్వు బంగారు కొండవి. నిన్ను వద్దనుకున్నవాళ్లే దురదృష్టవంతులు” అతని పెదవులను తన పెదవులతో సన్నగా స్పర్శిస్తూ అందామె.
“నిజంగానా?” అతని మాటల్లో చిన్నపిల్లవాడిలోని ఉత్సుకత. “కాక?” సమాధానాన్ని అతనికే వదిలేసిందామె. తృప్తిగా ఆమెను మరింత దగ్గరగా తీసుకున్నాడు.
“నన్ను పెళ్లి చేసుకుంటావా?” కౌగిట ఆమెను బంధించి అడిగాడతను. దూరంగా జరిగిందామె.
“చూసావా! పెళ్లి విషయమొచ్చేసరికి నువ్వూ దూరంగా జరిగావు. అంటే నిజంగానే నాలో ఏదో లోపముండి, నా మరదలు నన్ను విడిచి వెళ్లిందన్నమాట” విచారంగా అన్నాడతను.
“ఆమె మిమ్మల్ని విడిచి యెందుకు వెళ్లిందో తెలియదు గాని, మీలో యే లోపమూ లేదు” అతని చెయ్యిమీద చెయ్యివేసి చెప్పిందామె.
“నన్ను పెళ్లి చేసుకోమంటే, దూరంగా జరిగావెందుకు?” సూటిగా చూస్తూ ఆమెనడిగాడతను.
“నా సంగతి తెలిసే అడుగుతున్నారా?” దిగులుగా అడిగిందామె.
“నీకేమి? నీలాంటి మంచిమనిషిని నేనింతవరకూ చూడలేదు.”
“నా మంచితనాన్ని మీరేమీ చూసారు?” అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగిందామె.
“ఇంకొకరి బలహీనతను అలుసుగా తీసుకోకపోవడమే అసలైన మంచితనం. చావు అంచుల దగ్గర వేల్లాడుతున్న నన్ను, వొడ్డున పడేసావు. మోడైపోయిన చెట్టు వసంతంలో విరబూసినట్టు, మగవాడినేనన్న ధైర్యాన్ని నాలో విరబూయించావు. ఒక రకంగా నాకు పునర్జన్మనిచ్చిన నీ రుణమెలా తీర్చుకోగలను? నిన్ను పువ్వుల్లో పెట్టి నీ రుణం తీర్చుకోవాలని వుంది. నన్ను పెళ్లి చేసుకొని, నా జీవితానికొక అర్ధాన్ని కల్పించవా?” అభ్యర్థించాడతను.
ముసుగు వేసుకున్న ఆమె మనసు, లోపలి పొరలను తాకుతున్నాయతని మాటలు. కాని ఆ మాటలు నమ్మొచ్చా! లేదా! ఆమె మనసు తేల్చుకోలేక పోతుంది. నాలుగేళ్ల క్రింద ఇటువంటి మాటలే విని గడప దాటింది. ఏమైంది? జీవితమే చిధ్రమైపోయింది. ఎన్ని కలలో… ఎన్ని ఆశలో…. అరచేతిలో స్వర్గాన్ని చూపించాడు. నిజమేనని నమ్మింది. తనలాంటి వాళ్ళను మోసం చెయ్యడమే అతని వృత్తని తెలుసుకోలేకపోయింది. తెలిశాక ఏమి చెయ్యగలిగింది? కొన్నాళ్లు పోరాడింది బయటపడాలని. కానీ వోడిపోయింది. ప్రాణం తీసుకునే ధైర్యం చెయ్యలేక, ప్రతిక్షణం చస్తూ బ్రతుకుతుంది. అలాగని యిప్పుడితని మాటలు అబద్ధమని నమ్మడానికి మనసు అంగీకరించడం లేదు. ఒకవేళ యితని మనసే నిజమైతే…? జీవితంలో కోల్పోయిన వసంతమే తిరిగి వస్తానంటుంటే… కాని, మరొక్కసారి మోసపోవడానికి మనసు అంగీకరించడం లేదు. ఆశపడి, భంగపడడానికి మనసు సిద్ధపడడం లేదు. అయినా భంగపడడానికి ఏమి మిగిలిందని తనకు జీవితంలో?
కాదంటే, జీవితంలో మరల ఇటువంటి అవకాశం తనకొస్తుందా? ఒకవేళ ఈ అవకాశాన్ని తాను అందిపుచ్చుకుంటే…. అది తనకూ పునర్జన్మే అవుతుంది. కానీ తానతనిని పెళ్లి చేసుకుంటే అతని పరిస్థితెలా ఉంటుంది? ఇప్పటికే అతనెన్నో అవమానాలను మూట కట్టుకున్నాడు. ఇప్పుడు తనను పెళ్లి చేసుకుంటే, మరింత అవమానించి, అవహేళన చెయ్యదా లోకం? తన నుండి ఆయన మరిన్ని అవహేళనలకు గురికావాలా? ఒప్పుకుంటే… ఏమవుతుంది? ఒప్పుకోకపోతే అతనెలా స్పందిస్తాడు? ఏమి చెయ్యాలో తోచడం లేదు. విరుద్ధ భావాల మధ్య ఊగిసలాడుతుంది ఆమె మనసు.
***
“రమణగాడు పెళ్లి చేసుకున్నాడట”.
“వాడి సంగతి తెలిసి ముందుకొచ్చిన అభాగ్యురాలెవ్వరో?”
“నీకీ సంగతి తెలుసా! వాడు చేసుకున్న ఆడది ఆ టైపట”
“అంతేలే! లేకపోతే వీడి సంగతి తెలిసి ఎవరు ముందుకొస్తారు? వాడికున్న ఆస్తి పీల్చేశాక, ఛీ! నువ్వు మగాడివే కాదు పొమ్మంటుంది”
“మగవాడిననిపించు కోవడానికి బజారుదాన్ని పెళ్లి చేసుకోవాలా? ఛీ! ఇంతకన్నా చావే మేలు”
“వీడి చాటుగా దుకాణం తెరుస్తుందంటావా?” అది అనుమానమో! లేక అలా అవ్వాలన్న కోరికో!
“రామ! రామ! ఆఖరికి ఏ స్థాయికి దిగజారిపోయాడో! పదిమందికి పక్క వేసిన దానిని పెళ్ళాడాడా? దాని బదులు కొజ్జా అనిపించుకోవడమే మేలు”
“మమ్మల్నడిగితే మేము మంచి సంబంధం కుదర్చమా! లోకంలో ఆడపిల్లలే గొడ్డు పోయారా? ఇదేమి పనని, లేని పెద్దరికాన్ని నెత్తినేసుకొని మందలిస్తూ కొందరు…
“అదెన్నాళ్ళుంటుందిలే? ఆరునెలల్లో వీడిని తన్నితగిలెయ్యకపోతే, మీసం గొరిగించుకుంటానని ఒకడి శపథం. మనిషి ఎర్రగా బుర్రగా బాగానే ఉన్నట్టుంది. వీడెలాగూ అందుకు పనికిరాడు. ఎన్నాళ్ళు మడికట్టుక్కూర్చుంటుంది. ట్రై చేస్తే పడిపోతుందని ఇంకొకడి దురాలోచన.
రకరకాల వ్యాఖ్యానాలు. మనసును తూట్లు పొడిసేలా మాటల తూటాలు. గుండె గాయమయ్యేలా అసహ్యకరమైన చూపులు…… కుతూహలం ఆపుకోలేక కొందరు… దురుద్దేశాలు మనసుల్లో పెట్టుకొని కొందరు…. రకరకాల ఉద్దేశాలతో రమణ ఇంటి గడప తొక్కుతూనే వున్నారు.
వేటినీ లెక్కించలేదు రమణ. చాలా నిబ్బరంగా ఉన్నాడు. పూర్వాశ్రమంలో ఆమె పేరేమిటో? అడగనే లేదు. వసంత అని పిలుస్తున్నాడు. ఎందుకా పేరని ఆమె అడిగితే నా జీవితంలో తిరిగి వచ్చిన వసంతానివి నువ్వన్నాడు. ఆమె రమణ నమ్మకాన్ని నిలబెడుతూ, యెవరు యెటువంటి వ్యాఖ్యానాలు చేసినా చలించకుండా, రాయిలా రమణ వెన్నంటే స్థిరంగా నిలబడింది.
***
రమణ పెళ్ళై యెన్నాళ్ళో గడవలేదు. రమణ పెళ్ళాం నెల తప్పిందని యిరుగుపొరుగుల గుసగుసలు.
“కారణం రమణేనంటావా?” ఒకమ్మ అనుమానం. “ఆవిడికే తెలియాలి” ఒకరి సమాధానం.
“ఆవిడకైనా తెలుసంటావా?” ఇంకొకరి సందేహం. “నిజమేలే! ఎంతమందో!” ఇంకొకరి కనుబొమ్మల ఎగురవేత.
“ఛీ! ఊరుకోండే. కడుపుతో వున్న పిల్లని గురించి అవేం మాటలు” మందలించింది ఒక పెద్దామె.
“మనకెరుక లేని ఆ పిల్ల గతం గురించి మనమెందుకు మాట్లాడుకోవడం? నాలుగునెలల నుండీ చూస్తూనే వున్నాం కదా! వంక పెట్టడానికి వీల్లేని పిల్ల. మీరేమంటే అనండి గాని, ఆ పిల్లని పెళ్లి చేసుకొని రమణ మంచిపనే చేశాడు” వత్తాసు పలికింది ఒకామె.
“మనకెందుకులేమ్మా! ఆవిడ గురించిన తగువులు” ఒకరి నిష్టూరపు మాటలు. నీలాటిరేవు దగ్గర మాటలిలా వుంటే, రచ్చబండ దగ్గర మాటలెలా వున్నాయంటే….
“ఆవిడ నెల తప్పిందట కదా!” కళ్లెగరేసాడొకడు.
“మనోడి ప్రతాపమేనంటావా?” అదోరకంగా చూస్తూ ఒకడు.
“ఏమో! ఎవడికి తెలుసు? లోగుట్టు పెరుమాళ్ళ కెరుక” పెదవి విరిచాడొకడు.
“మీరేమంటే అనండి గాని, మనందరిలోకెల్లా అదృష్టవంతుడు వాడే” అన్నాడొకడు.
“నిజమేరా! ఈ పిల్లను పెళ్లి చేసుకొని సుఖపడ్డాడు. గతానిదేముంది? ఇప్పుడెలా వుందో చూడాలి గాని!” వత్తాసు పలికాడు ఇంకో స్నేహితుడు.
“ఏరా! మీకేమైనా మత్తు జల్లిందా! వెనకేసుకొస్తున్నారు” ఒకడి వెటకారం. “చూస్తుంటే తెలుస్తోంది కదా!” ఇంకొకడి వేళాకోళం.
“ఛీ! మీరు మారరురా!” ఛీత్కరించి అక్కడ నుండి లేచిపోయారు, రమణ అదృష్టాన్ని పొగిడిన ఆ ఇద్దరు స్నేహితులు.
“రమణను వాళ్ళావిడ గౌరవించినట్టు, మీ భార్యలు మిమ్మల్ని గౌరవిస్తున్నారా? గుండెలమీద చెయ్యి వేసుకుని చెప్పండిరా! పోకిరి కబుర్లు చెప్పడం కాదు. ఆవిడ గురించి ఇంకొక్క మాట మాట్లాడితే, మీ అందరి జాతకాలూ బయట పెట్టీగలను” భుజంమీద తువ్వాలు దులిపి వార్నింగిచ్చాడు, అక్కడ కూర్చున్నవాళ్ళలో ఒకడు.
అక్కడున్న ఎంతోమందికి అనుభవమే. రమణ భార్య నిప్పులాంటి మనిషని, ముట్టుకోబోతే కాలుతుందని. దానికి తోడు రమణను ఆమె యెంత అపురూపంగా చూసుకుంటుందో, అక్కడ వున్న అందరూ చూస్తూనే వున్నారు. అందుకే నోరు మెదపలేదు యే ఒక్కడూ.
***
అప్పటినుండీ చర్చల్లో అగ్రస్థానం రమణ గురించే, పుట్టబోయే బిడ్డ గురించే… ఎవరి పోలికలొస్తాయా అని. వీళ్లందరి చర్చలకు తెరదించుతూ అచ్చు గుద్ధినట్టు రమణ పోలికలతో పుట్టి, రమణ లలితలను ఆనంద డోలికలలో ముంచేస్తూ, వాళ్ల జీవితాల్లో వచ్చిన వసంతాన్ని మరింత వర్ణమయం చేశాడు రమణ, లలితలకు పుట్టిన మగబిడ్డ.
***
