MLC ఆచార్య కోదండరాం సూచన
డా. సబ్బని లక్ష్మీనారాయణ రాసిన సమగ్ర తెలంగాణ సాహిత్య గ్రంథము ఆవిష్కరణ!
హైదరాబాద్, డిసెంబర్ 24: ప్రత్యేక తెలంగాణను సాధించుకున్న మనము తెలంగాణకు సమగ్ర సాంస్కృతిక విధానాన్ని రూపొందించుకోవాలని ఇందులకు తెలంగాణ నిపుణులు, అధ్యయన వేత్తలు, ఉద్యమకారులు ముందుకు రావలసిందిగా తెలంగాణ ఉద్యమనేత తెలంగాణ, ఉద్యమంలో జేఏసీ చైర్మన్ గా క్రియా శీలక పాత్ర పోషించిన MLC ఆచార్య కోదండరాం సూచించారు. ప్రస్తుతము పర్యాటక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వము రూపొందించినట్లు చెప్పారు. 15 ఏళ్ల తెలంగాణ మలి ఉద్యమ స్వరూపాన్ని ఈ దశాబ్ది తెలంగాణ సాధన తర్వాత పున: సమీక్షించుకోవడం ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో కనిపించని కొంతమంది నేతలు, ప్రస్తుతము తెలంగాణ పేరిట ముసుగు సమావేశాలు నిర్వహించడము ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటాన్ని దక్కన్ ముఖ్యమంత్రిగా పనిచేసిన బూర్గుల రామక్రిష్ణారావు గారు నిపుణులచే అధికారికంగా రికార్డు చేయించారని అన్నారు. తెలంగాణా ఉద్యమంలో పనిచేసిన వారికే పదవులు దక్కాలని, రాజకీయాలకు అతీతంగా ఈ ప్రక్రియ జరగాలని అన్నారు. తెలంగాణ ఉద్యమ సీనియర్ రచయిత, డాక్టర్ సబ్బని లక్ష్మీనారాయణ రాసిన సబ్బని సమగ్ర తెలంగాణ సాహిత్యము అనే గ్రంథాన్ని ఆచార్య కోదండరాం గారు హైదరాబాద్ బుక్ పేర్ వేదికపై డిసెంబర్ 24వ తేదీన,మంగళవారం సాయంత్రము ప్రధాన అతిథిగా హాజరై ఆవిష్కరించారు. తోపుడు బండి సాదిక్ అలి వేదికపై ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ప్రముఖ కవి సంకేపల్లి నాగేంద్రశర్మ అధ్యక్షత వహించారు. విశిష్ట అతిథులుగా సీనియర్ సాహితీవేత్త సంగిశెట్టి శ్రీనివాస్, హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులు యాకూబ్, జాతీయ స్వాతంత్ర సమరయోధుల కుటుంబాల జాతీయ అధ్యక్షులు బోయినపల్లి హనుమంతరావు తదితరులు వేదికను అలంకరించారు.
ఆచార్య కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ జేఏసీ 15 సంవత్సరాల క్రితం ఈ రోజున ఏర్పాటైన విషయాన్ని గుర్తుకు తెచ్చారు. తెలంగాణా మలి ఉద్యమం నీరు కారకుండా, అన్ని ఉద్యమ సంస్థలను ఏకతాటిపై నడిపించడానికి జె ఎ సీ ని నెలకొల్పామని అన్నారు. ఉద్యమంలో జె ఎ సి పాత్ర అద్వితీయమని, అప్పటి నుండే తెలంగాణా ఉద్యమ చైతన్యం ఎగిసిపడిందని అన్నారు. ఒక త్రాగుబోతు కార్యకర్త వరంగల్ సభ తర్వాత తనకు ఎదురై, ఉద్యమాన్ని సమన్వయం చేయాలని ఆసక్తికరంగా సూచించినట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమ స్వరూపాన్ని వివిధ కోణాల్లో నిపుణులతో అధ్యయనం చేసి డజన్ పుస్తకాలు దశల వారీగా రాసి ఒక సంకలనంగా మలిచిన రచయిత డాక్టర్ సబ్బని లక్ష్మీనారాయణను ఆచార్య కోదండరాం అభినందించారు.
హైదరాబాద్ బుక్ ఫేర్ అధ్యక్షులు, ప్రముఖ కవి యాకుబ్ మాట్లాడుతూ తెలంగాణ గ్రంథ రచయిత సబ్బని లక్ష్మీనారాయణ గారు ఈ గ్రంథాన్ని సంకలనం చేయడం ద్వారా తెలంగాణ ఉద్యమ చరిత్ర పునర్నిర్మాణములో తమ వంతు పాత్రను సమర్థతతో పోషించారని, వారు ఇతర రచయితల రచనలను అభినందించే విశాల హృదయం ఉన్నవారని, భేషజాలు లేని వారని ప్రశంసించారు
సీనియర్ సాహితీ విమర్శకులు సంగిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్రను పోషించి దశలవారీగా తెలంగాణ ఉద్యమస్వరూపాన్ని పుస్తకంగా తెచ్చిన డాక్టర్ సబ్బని లక్ష్మినారాయణను తెలంగాణ సీనియర్ ఉద్యమ అధ్యయనవేత్తగా అభినందించారు. సబ్బని వారిది నాలుగు దశాబ్దాల సాహిత్య జీవితమని, అందులో తెలంగాణా మలి ఉద్యమ కాలంలో ఉద్యమకారునిగా, రచయితగా ద్వి పాత్రాభినయనం చేసి, తెలంగాణా ఉద్యమ చైతన్యానికి ఆదర్శప్రాయులుగా నిలిచారని ప్రశంసించారు. ప్రస్తుతము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలంగాణ అధికార భాష సంఘం చైర్మన్ పదవులు ఖాళీలుగా ఉన్నాయని, వాటిని సత్వరమే పూరించాలని సంగిశెట్టి కోరారు. ఈ సంస్థల అభివృద్ధికి ఇతోధికంగా తోడ్పడాలని ఎం. కోదండరాం గారిని అభ్యర్థించారు.
విశిష్ట అతిథిగా విచ్చేసిన బోయినపల్లి హనుమంతరావు మాట్లాడుతూ తెలంగాణ మలి ఉద్యమాన్ని సబ్బని ఆవిష్కరించిన విధానాన్ని అభినందించారు. తన నాన్న బోవెరా గారు తెలంగాణా తొలి, మలి ఉద్యమంతో పాటు, జాతీయోద్యమంలో పాల్గొన్నారని గుర్తుకు తెచ్చారు. తెలంగాణా మలి ఉద్యమాన్ని తాను డిజైన్ చేసిన వారిలో తానొకరని గత ఉద్యమ రోజుల్ని గుర్తుకు తెచ్చుకొన్నారు. సభకు అధ్యక్షత వహించిన సంకేపల్లి నాగేంద్ర శర్మ మాట్లాడుతూ తెలుగు ప్రాచీన హోదా కేంద్ర శాఖని ఒకటి హైదరాబాదులో ఏర్పాటు చేయాలని కోరారు. ప్రస్తుతం నెల్లూర్ కేంద్రంగా పనిచేస్తోందని, దీనికి అనుబంధంగా హైదరాబాద్ లో ఒక శాఖని ప్రారంభించాలని సూచించారు. సమగ్ర పర్యావరణ విధానాన్ని రూపొందించాలని, గుట్టలను, నీటి వనరులను, ఇరిగేషన్ రంగాన్ని ఆయా మాఫీయా మట్తు పెట్టేస్తోందని అన్నారు. పుస్తక రచయిత రచయిత డాక్టర్ సబ్బని లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తెలంగాణ మలి ఉద్యమాన్ని సూక్ష్మంగా పరిశీలించి అధ్యయనం చేసి ఎప్పటికప్పుడు 12 పుస్తకాల ద్వారా ఈ సమగ్ర సాహిత్య గ్రంధాన్ని వెలువరిస్తున్నట్లు తెలిపారు. ఈ గ్రంథాన్ని త్వరలో ఆంగ్లంలోకి అనువదిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్తలు సుంకిరెడ్డి నారాయణరెడ్డి, డాక్టర్ కాలువ మల్లయ్య, కెవి సంతోష్ బాబు, పిఎస్ కిషన్, గాయకుడు కాసు మహేందర్ రాజు, కోయి కోటేశ్వరరావు, మానస అర్ఠ్స్ అధినేత రఘు శ్రీ తదితరులు పాల్గొన్నారు.
డా. సబ్బని లక్ష్మీనారాయణ, రచయిత, మరియు రిపోర్టింగ్ సంకేపల్లి నాగేంద్రశర్మ, కరీంనగర్, సెల్: 80748 26371.
Cell number: 89852 51271.