లోకమంతా స్వార్థపు రంగులు పులుముకున్నా మమత అనే నీడను పంచుకుందాం పక్కవాడి కంటనీరు తుడవ చూపుడు వేలు చాచుదాం మన కంట కన్నీరు జలజలరాలగ ప్రేమను చూపుదాం
గాలి లోనే నిట్టూర్పులను వదిలివేద్దాం కాలం వెంట పరిగెత్తి పరిగెత్తి అలసిపోదాం నీ కష్టం నాదని భావిస్తే మానవత్వం ఉన్నట్లే నీ ఆకలి నాదనుకుంటే ప్రేమ పంచినట్లే
పదవుల పండుగ నీడన అహంకారాన్ని వదిలేద్దాం సాటి మనిషి గుండె గాయానికి నవనీతం రాద్దాం మోడు వారిన జీవితాల్లో చిరునవ్వులు పూయిద్దాం ఆపన్న హస్తం అందించి ఆశల దీపం వెలిగిద్దాం
భాష ఏదైనా ప్రాంతం వేరైనా ప్రాణం ఒక్కటే స్పందించే గుణమే మనిషికి మకుటం మంచి మాటలతో చేయూత నందించి తోటి వారికి సాయపడదాం సాటి గుండె సవ్వడిని ప్రేమతో విందాం ప్రేమకు మించిన మతం లేదని కరుణకు మించిన దైవం లేదని చాటుదాం
మనిషికి మనిషికి మధ్య మమకారపు వంతెన కడదాం ప్రేమే జగతికి ప్రాణమని కరుణే ఈ లోకానికి ఊపిరి అని వివరిద్దాం ఎదుటి హృదయం ఓదార్పు కోరితే మౌనం వీడి అనునయిద్దాం సాటి గుండె సవ్వడి విందాం
నీతి నిజాయితీకి నిలువుటద్దంగా నిలుద్దాం కలిసి మెలిసి ఉందాం సంతోషాలు పంచుదాం సాటి మనిషి సౌఖ్యానికి సాయపడదాం చేతనైనంత వరకు పరుల కష్టం తీరుద్దాం అందరం ఒకటై వడివడిగా సాగుదాం భువికి స్వర్గాన్ని తీసుకువద్దాం