పుడితే ఉన్నోడిగా పుట్టాలి లేకుంటే లేనోడిగా ఉండాలి మధ్యతరగతిలో ఉంటే అధోగతే ఎప్పటికీ ఇది ఎటూకాని తరగతే
లేనోడి బతుకుకు ఒక అర్థం ఉంది ఉన్నోడి బతుకులో పరమార్థం ఉంది ఈ మధ్యతరగతి లోనే అనర్ధం ఉంది
లేనోడికి అన్నిట్లో రాయితీలే ఉన్నోడికి అంగిట్లో ఆనవాయితీలే మధ్యతరగతి వాకిట్లో అన్నీ పంచాయితీలే
మేము కలలు కూడా పొదుపుగానే కంటాం పిల్లల్ని కన్నట్టే ఖరీదైన కలలు అసలే కనం గొంతెమ్మ కోరికలు తీరాలి అనం గొంతెత్తి ఇది కావాలి అనం కష్టాల్లో కూడా అడగం ఎవరినీ సాయం హాస్యానికి కూడా దేనినీ అపహాస్యం చేయం
మా జీవితాలు బాధ్యతలకు అంకితం మా జీతాలు అప్పులకు అర్పితం
ఉన్నోడికి వెన్నుపోటు భయం లేనోడికి పెన్నుపోటు భయం మాబోటి వాడికి పన్నుపోటు భయం
నెల జీతం పడంగనే ఇంట్లో కుస్తీలు బ్యాంకుల్లో కిస్తీలు గల్లీలో నయా దోస్తీలు
మా జీవితాలు…. నెలసరి వేతనాలు దినసరి మంతనాలు ఇంటింటి రామాయణాలు నట్టింటి ప్రేమాయణాలు
మా కుటుంబాలు… అర్థాకలి మంటలు ఆశ నిరాశల తంటలు ఎప్పటికీ పండని పంటలు ఎన్నటికీ వండని వంటలు
అయినా సరే….. ఈ బాధ్యతల రణరంగంలో ఈ చిక్కుముడుల చక్రవ్యూహంలో ఈ నైతిక విలువల పద్మవ్యూహంలో ఈ ప్రేమాభిమానాల కురుక్షేత్రంలో మేము ఎన్నటికీ ఓడిపోని సైనికులమే ఈ కష్టనష్టాల మధ్య తరగతి మహాభారతంలో మేము ఎప్పటికీ విజేతలైన పాండవులమే