లావైన చేతిగడియారం లాగా
ప్రేమ నీ ప్రస్థానాన్ని మొదలు పెట్టింది
నర్సు నీ అరిపాదాల మీద దెబ్బ వేయగానే
నీ బోసికేక పంచభూతాల్లో చేరింది
నీ రాకను పొగడుతూ
మా గొంతుకలు ప్రతిధ్వనిస్తాయి
అదొక కొత్త ప్రతిమ.
గాలితెమ్మెరలు నిండిన మ్యూజియంలో
నీ నగ్నత్వం మా క్షేమం వెన్నంటి నడుస్తుంది
గోడల లాగా చుట్టూ ఖాళీగా నిలబడతాం మేము
గాలివాటుకు స్వీయ ప్రతిబింబం
తుడుచుకుపోయేలా చేసే
మేఘపు అద్దంకన్న గొప్ప తల్లిని కాను నేను
రాత్రంతా పెద్ద పెద్ద గులాబీల మధ్య ఉండే
కీటకపు రెక్కల లాగా
నీ శ్వాస రెపరెపలాడుతుంది
దాన్ని వినేందుకు నేను నిద్రలోంచి లేస్తాను
దూరంలోని సముద్రమొకటి
నా చెవి దగ్గరికి చేరుతుంది
స్థూలకాయంతో నైట్ గౌనులో ఉన్న నేను
నీ ఒక్క కేకకు మంచం మీంచి కింద పడతాను
నీ నోరు నిర్మలమైన పిల్లినోరులాగా తెరుచుకుంటుంది
కిటికీ చట్రం కాంతితో వెలిగి,
మసకబారిన నక్షత్రాలను మింగేస్తుంది
ఇక నువ్వు కొన్ని మాటలను
మాట్లాడేందుకు ప్రయత్నిస్తావు
స్పష్టమైన అచ్చు స్వరాలు
బెలూన్ల లాగా పైకి లేస్తాయి
ఆంగ్లమూలం: సిల్వియా ప్లాత్
