కాలెండర్ గోడకు వేలాడుతోంది ఆ ఇంటి యజమాని కాలెండర్ వంక చూసి “అబ్బా రేపు ఆదివారం హాయిగా ఇంట్లో ఉండవచ్చు” అని సంతోషంగా అనుకున్నాడు. ఆ ఇంటి పిల్లలు కూడా “అమ్మా రేపు ఆదివారం. మాకు స్కూల్లేదు శలవు” అంటూ అరుస్తూ చెప్పారు. అమ్మ వంటింట్లో నుంచి ‘సరే సరే’ అని విసుగ్గా అన్నది.
గోడ మీదున్న కాలెండర్ లోని ఆదివారం, సోమవారం వంటి వారాలన్నీ ఒకదాన్నోకటి పలకరించు కుంటున్నాయి “అబ్బ! ఆదివారం నీ పని హాయి! అన్ని శలవు. ఏ పనీ ఉండదు నీకెంత అదృష్టం” అంటూ శని వారం నిష్టూరంగా అవ్వది “నాకయితే విపరీతమైన పని ఉంటుంది. ఇంటి వాళ్ళు శుభకరమని ఇళ్ళు కడుక్కోవడం, ఆడవాళ్ళంతా తలస్నానాలు చేయడం, దేవుడికి పూజలు చేయడం వంటి వన్నీ చేస్తుంటారు .నాకైతే అసలు తీరికే ఉండదు ” అంటూ శుక్రవారం తెగ బాధపడుతూ అన్నది.
‘ఊరుకో నీవున్న రోజేనా పూజలు చేసేది. మరినేనా, వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన రోజును నేను. మగ వాళ్ళందరూ నా వారం నాడే గుళ్ళకు వెళతారు. ప్రసాదాలు చేసుకుంటారు. చాలా మంది ఉపవాసాలు చేస్తూ పూజలు చేసుకుంటూ సుప్రభాతం చదువుకుంటారు అంటూ శనివారం తన గొప్పను చెప్పింది శుక్రవారాన్ని ఎద్దేవా చేసింది.
అప్పుడు సోమవారం ముందుకోచ్చి ఇలా అన్నది “ ఏమిటి ఇందాకట్నుంచి మీ గొప్పలు చెప్పుకుంటున్నారు మీ గొప్పలు ఆపండి. సోమవారం అంటే ఆఫీసులు, స్కూళ్ళు అన్ని పనిచేసే రోజు. ఏ పని కావాలన్నా ఈ రోజే వస్తారు మరియు వారాలలో మొదటి దాన్ని. ఇంత ప్రాధాన్యం గల నన్ను వదిలి మీరు గొప్పలు చెప్పుకుంటున్నారు. నాకున్న ప్రాముఖ్యం గురించి చెప్పడం లేదు. లయకారుడైన శివుడికి ఇష్టమైన రోజును నేను తెలుసా ? అంటూ కళ్ళు పెద్దవి చేసి మరీ అడిగింది. మిగతా వారాలన్నీ భయపడి వెనక్కు తగ్గాయి.
కానీ శుక్రవారం మాత్రం ధైర్యంగా ముందుకొచ్చి “ నేను ఎవరో తెలుసా ? నా షేరేమిటో తెలుసా ? నన్ను లక్ష్మీ వారమని అంటారు. లక్ష్మీ దేవి ఆశీస్సులు, అండ ఉంటేనే ఏ పనైనా జరిగేది. ఏమిటి, హెచ్చుగా మాట్లాడుతున్నావు ” అంటూ కోపంగా అన్నది.
“ఆగండాగండి! అందరూ ఎవరి గురించి వారే చెప్పుకుంటే ఎలా ? మిగతా వాళ్ళ గురించి తెలుసుకోవాలి కదా! నా గురించి కూడా తెలుసుకో! నేను కూడా గొప్పనే, నేనేమీ అశుభాల మంగళవారాన్ని కాను. సాయి బాబాకు ఇష్టమైన వారాన్ని సాయంత్రమైతే ఎన్నో భజనలు చేస్తారు ” అంటూ గురువారం ముందుకొచ్చి పరుషంగా మాట్లాడింది.
మంగళవారం ముక్కుపుటాలు అదురుతుండగా కోపంతో అన్నది ” నేను మిమ్మలి ఎవరినన్నా ఏమన్నా అన్నానా? నన్ను అశుభం అంటారా. నా పేరేమిటి మర్చిపోయారా నా పేరు మంగళవారం నేను మంగళకరమైన దాన్నని. నా కా పేరు పెట్టారు. నేను ఎవరినీ కించ పరిచేలా మాట్లాడలేదు మీరు నన్నెందుకు తక్కువగా చూస్తున్నారు? ఏడుపు గొంతుతో మాట్లాడింది. ఇక మాటలు మాట్లాడలేక గొంతు మూగబోయి ఆగింది.
ఆపండి మాటలన్నీ! ఎవరూ ఎవర్ని అనలేదు అసలు విషయం ఏమంటే ఆదివారానికి పనేమీ లేదని అందరూ ఆనాలనుకున్నాయి. మిగతా వారాలన్నీ ఏదో ఒక పనిలో బిజీగా ఉంటాయి. ఆఫీసులు స్కూళ్ళు అంటూ చాలా పనుంటుంది కానీ, ఆదివారానికె ఏమీ పనిలేదు. ఆ విషయం చెప్పాలనుకుని చివరకు మీలో మీరు వాదులాడుకుంటున్నారు. అంతే అంటూ బుధవారం ఆసలు విషయాన్ని తేల్చి చెప్పేసింది.
“అవునవును నువ్వు చెప్పింది నిజం ఆదివారానికి అసలు పనేమీ లేదు. కష్టపడేదంతా మనమే. ఆదివారం అన్నీ సెలవే, ఏపనీ ఉండదు” అంటూ అన్ని వారాలూ మూకుమ్మడిగా అన్నాయి.
అప్పటి దాకా ప్రశాంతంగా ఉన్న ఆదివారం నింపాదిగా ముందుకొచ్చి అన్నది ” ఏమిటీ ఆదివారం సెలవా ! నాకేమీ పనుండదా! మరి వారం రోజులూ వేర బెట్టిన పనులన్నీ ఏ వారం నాడు చేస్తారు. ఇల్లు బూజులూ దులపడం, ఇల్లు సర్దుకోవడం, బట్టలు ఉతకడం వంటివన్నీ ఎప్పుడు చేస్తారు. బంధువులింటికి వెళ్ళాలన్నా , సినిమాలు, షికార్లకు వెళ్ళాలన్నా ఏ వారం నాడు వెళతారు ? మీరంతా పనులు చేసే వాడావిడి తప్ప అందులో ఆనందం ఉండదు. అదే ఆదివారం నాడు ఎంత పని చేసినా సంతోషంగా ఉంటారు. నాకు పని లేదని మీరెట్లా అంటారు. చెప్పండి ! అంటూ ఆదివారం ప్రశాంతంగా అన్ని విషయాలూ చెప్పింది.
ఆదివారం చెప్పిన మాటలన్నీ విని మిగతా వారాలన్నీ తల ఆడించాయి. తన మాటలు నిజమని ఒప్పుకున్నాయి. ఆదివారాన్ని అభినందించాయి. సోమవారం నుంచి శనివారం దాకా అందరూ. చేయి చేయి పట్టుకుని కలిసి ముందుకోచ్చాయి “అసలు మనలో మనకు తగాదాలు ఎందుకుని మనందరం కలసి ఉంటేనే మనుష్యులు మనల్ని గుర్తిస్తారు. అందరం కలిసిమెలిసి ఉంటేనే వారాలు నెలలు అంటూ గుర్తింపు లభిస్తుంది. ఇంక ఎప్పుడూ మనలో మనకు అభిప్రాయ భేదాలోద్దు” అంటూ అన్ని కలిసి చెట్టాపట్టాలేసుకుని ముందుకు నడిచాయి. ఆదివారం నుండి శనివారం దాకా అందరూ కలసికట్టుగా ‘వారాలు’ గా ఉంటున్నారు.
బాలసాహిత్యం
పూర్వం ఒక క్రూరమైన మారుతల్లి. ఆమె భర్తపేరు మ్యాలెట్. ఆమెకు ఇద్దరు కూతుర్లు. రోజీ ఆమె స్వంత కూతురు. జానీ ఆమె చనిపోయిన సవతి కూతురు. పొద్దున్నే ఆమె కూతురు రోజీకి కడుపు నిండా రుచికరమైన కోడి కూర, మాంసముతో నింపబడిన పావురము తినడానికి ఇచ్చింది. ఏదో మిగిలింది చాలీ చాలనిది జానీకి ఇస్తుండేది.
రోజీ ఏ చిన్న పని కూడా ముట్టుకోకపోయేది. మొత్తం ఇంటిపని ఉదయం నుండి సాయంత్రం వరకు జానీతో చేయించేది మారుతల్లి. అయినా మెచ్చుకోకపోయేది.
రోజీ ఎప్పుడు మంచి సిల్కు మరియు ఖరీదైన వులన్ దుస్తులు ధరించేది. జానీకి మాత్రం మామూలు కాటన్ దుస్తులు ఉండేవి.
అది జనవరి మాసం. బయట మొత్తం మంచు, విపరీతమైన చలి. చాలా మటుకు అందరు చలికి తాళలేక మంటల దగ్గర కూర్చునేది. ఒకసారి మారుతల్లి బయటికి తొంగి చూసేవరకు చలికి ముక్కు ఎర్రబడింది.
ఎంతో ప్రేమ నటిస్తూ నోట్లో పంచదార ఉన్నట్లు ఓ నా ముద్దుల జానీ అని పిలిచి నాకు మన ఇంట్లో టేబుల్‌పై గాజు వేజులో లిల్లీ పూల సువాసన ఆనందించాలని ఉంది. నీవు వెళ్ళి అడవి లోయలో పూసే లిల్లీ పూలు తీసుకరా అని అంది. అందుకు జానీ అమ్మా ఇది జనవరి మాసం, ఇప్పుడు లిల్లీలు వుండవు కదా. ఆ మాట పట్టించుకోకుండా జానీని డోర్ తీసి బయటికి నెట్టి వెనుక నుండి డోరు ఢబీల్న మూసేసింది. విధిలేక జానీ ఆ చలిలో అడుగుపెడితే జారే మంచుపై, అతి కష్టంగా నడుస్తూ అడవిలోకి చేరింది. ఆ అడవిలో ఆమె పన్నెండు మంది యువకులను చూసింది. వారు వేసవికాల దుస్తుల్లో వున్నారు. ఒకడు మాత్రం మేకతోలు కోటు వేసుకొని ఉన్నాడు. అతనే వారి లీడరు. వాళ్ళు ఈ అమ్మాయిని చూసి ఆశ్చర్యపడి జాలితో ఎక్కడికి వెళ్తున్నావని అడిగారు. ఆమె కథంతా వాళ్ళకు చెప్పింది. అప్పుడు వారిలో ఒకతని జేబు నుండి లిల్లీ పూలు తీసి ఇచ్చాడు. అవి పట్టుకొని ఇల్లు చేరింది. మారుతల్లికి ఈమె తిరిగి వచ్చినందుకు కోపమే కాని లిల్లీలు తెచ్చిందని లోనికి రానిచ్చింది.
మరుసటి రోజు ఎంతో ప్రేమను నటిస్తూ నా ప్రియమైన జానీ, నాకు బాస్కెటు నిండా స్ట్రాబెర్రీసు అడవి నుండి తీసుకురా అంది మారుతల్లి. దాదాపు కన్నీరు పెట్టుకుని జానీ అంది, అమ్మా అవి జనవరిలో అవి పండవు కదా. నోరు ముయ్యి అని గద్దించింది మారుతల్లి. నీవు లిల్లీసు తెచ్చినవు గదా. అదే మాదిరిగ స్ట్రాబెర్రీసు తే అని జానీని బయటికి నెట్టి తలుపు మూసేసింది. పాపం అమ్మాయి మోకాళ్ళ మటుకు మంచులో, చలి గాలిలో మామూలు దుస్తుల్లో అడివికి చేరింది. అక్కడ ఆ పన్నెండు మంది యువకులు కలిశారు. వారితో ఆమె తన మారుతల్లి చెప్పిన విషయం చెప్పింది. ఆ యువకులకు కోపం వచ్చింది. మేకతోలు కోటు వేసుకున్నతను సరే నీకు స్ట్రాబెర్రీసు ఇస్తాను, కాని నీ మారుతల్లి జాగ్రత్త పడాలి. అతను తనవారిలో ఒకతనితో అమ్మాయి బ్యాగ్ నిండా రుచికరమైన స్ట్రాబెర్రీసు నింపమన్నాడు. నింపినాక వాటిపై అతను ఊదాడో, అదేంటో తెలియదు కానీ ఇది నీ మారుతల్లిని బాగు చేస్తుందన్నాడు. జానీ వారికి కృతజ్ఞతలు తెలిపి ఇల్లు చేరింది. ఆమె దారిలో వెచ్చదనం అనుభవించింది. మారుతల్లికి జానీ తిరిగి రావడం ఇష్టంలేక కోపించింది, కానీ స్ట్రాబెర్రీసు బాగా ఇష్టమైనవి. వాటిని తీసుకుని ఆమె, ఆమె కూతురు రోజీ గబగబా ఒక్క పండు మిగలకుండా తినేశారు. జానీకి పాపం ఒక్క పండు కూడా ఇవ్వలేదు. కానీ తల్లి బిడ్డ ఆ రాత్రి వానరాళ్ళు తిన్నట్లు చాలా కడుపునొప్పితో బాధపడ్డారు.
మరునాడు ఉదయం రోజీ మరియు ఆమె తల్లికి కొంత ఆరోగ్యం బాగయ్యింది. మారుతల్లి జానీని బయటకు పంపేందుకు ఏదో ఉపాయం ఆలోచించసాగింది. ప్రేమ ఒలకపోస్తూ ఓ నా ప్రియమైన జానీ, నువ్వు గోనెసంచీ తీసుకొని అడవికి అవతలివైపు వెళ్ళి అక్కడ పండే మంచి వెరైటీ వోర్ సిస్టర్ పియర్ మేన్స్ ఆపిల్సు సంచీ నిండ తెంపుక రా. జానీ ఈసారి ఏ అడ్డూ చెప్పకుండా ఒక నిట్టూర్పు తీసి బయటికి వెళ్ళింది. మంచులో మూడుసార్లు జారిపడింది. కాళ్ళకు దెబ్బలు తగిలి గాయాలయినాయి. ఎలాగో అడవి చేరింది. అక్కడ ఆ 12 మంది యువకులు కలిశారు. ఈమె చెప్పినట్లు సంచి నిండా ఆపీల్సు పెట్టించాడు మేకతోలు కోటులో ఉన్నతడు. ఓహో ఆమె గార్కి మంచి వెరైటీ ఆపిల్సు కావలసి వచ్చిందా అన్నాడు. సంచిలో పండ్లు నింపిన తరువాత వాటి మీద మూడుసార్లు చల్లని ఆవిరి వచ్చేట్లు ఊదాడు. ఇప్పుడు మారుతల్లి వీటిని అంతగా ఆనందించకపోవచ్చు అన్నాడు అతడు. ఆ బరువైన సంచి జానీకి ఒక ఈకవలె తేలికగా ఉండి ఆమె మంచు మీద మెత్తటి దారి మీద నడిచినట్లు నడిచి ఇల్లు చేరింది. అతను మీ చెల్లెలును వీటిని తినవద్దని చెప్పమన్నారు. ఆమె ఆ విషయం చెప్పినందుకు చెల్లెలు ఆమెను నెట్టివేసి తామే తినేశారు గబగబా. వారికి కడుపులో బాగా నొప్పి లేచింది. ఈ విశ్వాసం లేని అమ్మాయి దయ్యంతో కలిసి మనమీద కుట్ర చేసిందని మారుతల్లి అంది. వారి కడుపులో పేగులకు ఏమీ తెలీదు. కానీ వారు దూదిపింజల లాగ ఇంటి పొగ గొట్టం నుండి బయటపడి ఎంతో దూరం తేలిపోయారు. ఇంటిదారి ఎప్పటికీ దొరకలేదు. ఇంటి వద్ద తండ్రి, కూతురు వివాహమై తన మంచి భర్తతో కలిసి ముగ్గురు ఎప్పటికన్నా ఎక్కువ సంతోషంగా వుండిపోయారు. మారు తల్లికి తగిన శాస్తి జరిగింది.
ఒక చిన్న గ్రామంలో ఒక దర్జీ ఉండెను. అతనికి దేవాలయం దగ్గర చిన్న దుకాణం ఉన్నది. ఒక ఏనుగు ప్రతిరోజు ఇతని దుకాణం ముందునుండి నదిలో స్నానానికి పోతుంటుంది. ఆ దయగల దర్జీ దానికి అరటిపండ్లో లేక కొబ్బరికాయనో లేక బెల్లమో ఇస్తుండేవాడు. ఆ ఏనుగు ఆ వస్తువులను అతని చేతినుండి తీసుకుని తొండముతో దీవించేది. ఆ ఏనుగుకు ఆ దుకాణం ముందు ఆగి ఎదురు చూడడం అలవాటయ్యింది.

ఒకనాడు దర్జీ ఏదో చిరాకులో ఉన్నాడు. యథాప్రకారం ఆ ఏనుగు అతని దుకాణం ముందుకు వచ్చి నిలబడింది. ఆ దర్జీ దానికి ఏమీ ఇవ్వలేదు. ఏనుగు చాలా ఓపికగా నిలబడింది కానీ దర్జీ కనీసం దానివైపు కూడా చూడలేదు. ఏనుగు ఏదో ఒకటి తినేందుకు దర్జీ ఇవ్వాలని లాశిగా ఘీంకరించింది . ఇది దర్జీకి బాగా కోపం తెప్పించింది. అతను ఒక సూది తీసుకుని దాని తొండాన్ని గట్టిగా కుచ్చాడు. పాపం ఆ ఏనుగు చాలా బాధపడి వెళ్ళిపోయింది. దానికి దర్జీ ఎందుకు ఇలా చేసాడో అర్థం కాలేదు. కానీ అతనికి తగిన పాఠం చెప్పాలని నిశ్చయించుకుంది.
మరునాడు ఆ ఏనుగు స్నానానికి నదికి వెళ్ళింది. తిరిగి వస్తున్నపుడు దాని తొండం నిండా బురద నీరు నింపుకుంది. ఆ దర్జీ దుకాణం ముందు ఆగి బురద నీరంతా దుకాణంలోని కొత్త బట్టలపై కుమ్మరించింది. ఈ చర్యతో దర్జీ తన తప్పు తెలుసుకొని చాలా బాధపడ్డాడు. అతను మరల ఏనుగుతో స్నేహం చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఆ ఏనుగు పట్టించుకోకుండా తిరిగి వెళ్ళిపోయింది. ఆ రోజు నుండి ఏనుగు దర్జీ దుకాణం వైపు వెళ్ళడం మానేసింది.
నీతి : మనం జంతువులను హింసించకూడదు.
ఎప్పటివలెనే పిల్లలు బిగ్గరా వాదించుకుంటున్నారు. ”ఈరోజు మీకు శ్రవణ్ కుమార్ కథ చెపుతాను”, అని తాతగారు చెప్పారు. ఆయన మాటలు మంత్రంలా పనిచేసింది. పిల్లల అల్లరి వెంటనే ఆగిపోయింది. తాతగారి కథ వినే కంటే ముందు వారి పాఠశాల పనులు పూర్తి చేయాలనుకున్నారు.
”శ్రవణ్ కుమార్ ఎవరు?” అని సుమన్ అడిగాడు, ఎప్పటిలా ఆగలేక. ఆ రాత్రి తాతగారు కథను చెప్పడం ప్రారంభించారు.
శ్రవణ్ కుమార్ ఒక బ్రాహ్మణ అబ్బాయి. అతని తల్లిదండ్రులు చాలా ముసలి వాళ్ళు, ఇద్దరూ గ్రుడ్డివారు. వారికి ఒక్కడే కుమారుడు శ్రవణ్ కుమార్. అతను చాలా ఓపికతో తల్లిదండ్రులకు సేవ చేసేవాడు. తన తల్లిదండ్రులను చాలా భక్తి, ప్రేమతో చూసేవాడు. వారు కూడా అతని గురించి గర్వంగా ఉండేవారు.
ఒకరోజు శ్రవణ్ కుమార్ తన తల్లిదండ్రులు మాట్లాడుకోవడం విన్నాడు.
”ఓహ్‌ా, నేను బనారస్ మరియు పుణ్యక్షేత్రాలు ఎలా వెళ్ళగలను” అని తల్లి అన్నది. ”అవును అది మాకు అసంభవమైన కథ”.
మనకు శ్రవణ్ కుమార్ వంటి కొడుకు ఉండటం మన అదృష్టం. అతను మనల్ని చాలా బాగా చూసుకుంటున్నాడు. మన కోరికల్ని అతని మీద మోపి అతనికి భారం కాకూడదని తండ్రి సౌమ్యంగా సమాధానం ఇచ్చాడు.
శ్రవణ్ కుమార్ తన తల్లిదండ్రుల కోరిక ఎలాగైనా తీర్చాలనుకున్నాడు. దూర ప్రయాణానికి అన్నీ సమకూర్చడం మొదలెట్టాడు. అతను వాళ్ళకు యాత్రలకు తీసుకుని పోగలడు. వారిని తన భుజాల మీద మోసుకుపోగల బలిష్టుడు శ్రవణ్ కుమార్. అతను వెదురుతో రెండు బుట్టలు తయారు చేసాడు. వాటిని ఒక కర్రకు అటూ ఇటూ కట్టాడు. తల్లిదండ్రులను చెరొక బుట్టలో కూర్చోబెట్టాడు. ఆ కఱ్ఱను తన విశాలమైన భుజాల మీద ఎత్తుకుని బయలుదేరాడు. (దీన్ని మనం కావడి అంటాం.)

శ్రవణ్ కుమార్ తన తల్లిదండ్రులను మోసుకుంటూ చాలారోజులు ప్రయాణం చేశాడు. అతను అడవులు, పర్వతాలు, గ్రామాలు, పట్టణాలను దాటి నడిచాడు. అతను అలసిపోయేంతవరకు ఆగకుండా నడిచాడు. అతను తన తల్లిదండ్రులను దింపి వారికి తినేందుకు ఏమైనా తేవాలనుకున్నాడు. ఆ అడవిలో తినేందుకు పండ్లు, దుంపలు ఉన్నాయి. రాత్రి విశ్రాంతి తీసుకున్న తరువాత శ్రవణ్ కుమార్ మళ్ళీ తల్లిదండ్రులతో సహా కర్రను లేపి మళ్ళీ నడక ప్రారంభించాడు.
వారు దారిలో ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నాడు. అలా వారు అయోధ్య చేరుకున్నారు. ఆ రోజు ఎండ ఎక్కువగా ఉంది. వారు అయోధ్య దగ్గరి అడవిని దాటుతునానరు. అతని తల్లిదండ్రులు దాహంతో తాగేందుకు నీళ్ళు అడిగారు. అతను వెంటనే వారిని జాగ్రత్తగా ఒక చెట్టునీడలో దింపి నీళ్లను వెతుక్కుంటూ వెళ్ళాడు.
అక్కడ అయోధ్యను పాలిస్తున్న థరథ మహారాజు ఆ అడవిలో వేటకు వచ్చాడు. అతను ఉదయం నుండి వేటకు తిరుగుతున్నాడు కానీ, ఏ జంతువు కూడా కనబడలేదు. ఆయన గొప్ప విలుకాడు. అతని వేట సామర్థ్యంపై విల్లు, బాణం కూడా ఎంతో గర్వపడేవి. వేటకోసం వెళుతూ తన పరివారాన్ని దాటి చాలాముందుకు వెళ్ళి ఒక్కడే అయినాడు.
శ్రవణ్ కుమార్ ఈలోపు సరయూనది యొక్క చిన్న కాలువను చూసాడు. అతను తన కుండలో నీళ్ళు నింపుకుంటున్నాడు. అక్కడికి దగ్గరలో వున్న థరథ మహారాజుకు నీళ్ళ శబ్దం విన్నాడు. ఆ ధ్వని వస్తున్న వైపుకు బాణం వేసాడు. వెంటనే ఒక మనిషి నొప్పితో గట్టిగా ఏడుస్తున్న శబ్దం వినబడింది. ఆ రాజు భయపడి ఆవైపు వేగంగా వెళ్ళాడు. ఆయన భయం నిజమైంది. అతను శరీరంలో గుచ్చుకున్న బాణంతో రక్తంలో పడి ఉన్నతన్ని చూసాడు.
”అయ్యో నేనెంత పని చేశాను? ఓ దేవుడా, నేనేమి చేశాను?” అని థరథ మహారాజు ఆ యువకున్ని తన ఒడిలోకి తీసుకుని తాగేందుకు నీళ్ళు ఇచ్చాడు. ఆ యువకుడు గాయపడి, కొద్దిపాటి ధ్యాసతో ఉన్నాడు.
”కుమారా, నీవెవరు? ఎక్కడినుండి వచ్చావు? త్వరగా చెప్పు, నేను నీ బాధ్యతను తీసుకుంటాను” అని ఎంతో విచారంగా అడిగాడు రాజు. దయతో నన్ను క్షమించు, నేను వేటకు వచ్చాను. ఈ అడవిలో ఎవరూ ఉండరనుకున్నాను. నేను థరథ మహారాజును, ఇప్పుడు నిన్ను నాతో తీసుకపోగలను.
నొప్పిలో కూడా శ్రవణ్ కుమార్ చిరునవ్వు నవ్వాడు. అతి కష్టంగా ”ఓ థరథ మహారాజా, మిమ్ముల చూడటం నాకు సంతోషం. మీ గురించి గొప్పగా విన్నాను. నేను మీరు తప్పు చేశారని అనుకోవడం లేదు. నాకు తెలుసు అది ఒక పొరపాటు. నా బాధ ఒకటే. అది నా తల్లిదండ్రులను ఇప్పుడు ఎవరు చూసుకుంటారు. ఇద్దరు గుడ్డివారు, వృద్ధులు. నేను వాళ్ళను యాత్రలకు తీసుకెళ్తున్నాను”
ఆ మహారాజు ఇది విని ఇంకా ఎక్కువ బాధపడినాడు. అతను తన చుట్టూ చూశాడు. మనుషుల జాడ కనపడలేదు. ఆ రాజు ఆ అడవిలో శ్రవణ్ కుమార్ కు సహాయపడేందుకు ఎవరూ లేనందున నిస్సహాయుడయ్యాడు.
”కుమారా, చెప్పు. నీ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు” అని అడిగాడు.
ఎంతో ప్రయత్నంతో శ్రవణ్ కుమార్ తల్లిదండ్రులను కూర్చోబెట్టిన వైపు చూపాడు. అతను చాలా నొప్పితో ఉన్నాడు. ”నీ తల్లిదండ్రుల గురించి బాధపడకు” థరథ మహారాజు అన్నాడు. ఇప్పటి నుండి వారి సంరక్షణ నేను చూసుకుంటాను. నేను వారి బాగోగులు నీ స్థానంలో ఉండి చూసుకుంటాను. శ్రవణ్ కుమార్ చూపిన వైపుకు గాయపడిన ఆయనను రాజు తన చేతులపై మోసుకుంటూ వెళ్ళాడు.
రాజు మాటలు విని తృప్తి చెందాడు. శ్రవణ్ కుమార్ రెండుచేతులు ఎత్తి రాజుకు నమస్కరించాడు. రాజు తన తల్లిదండ్రులను చూసుకుంటాడని తృప్తి చెంది, ప్రశాంతంగా శ్రవణ్ కుమారుడు చివరి శ్వాస విడిచాడు.
ఈలోపు శ్రవణ్ కుమార్ తల్లిదండ్రులు కుమారుని కోసం వేచి చూస్తున్నారు. ఇద్దరు గ్రుడ్డివాళ్ళు, తెలియని చోటు కాబట్టి కుమారుని కొరకు ఎటువైపుకు వెళ్ళాలో తెలియడం లేదు. ఒకరినొకరు పట్టుకుని శ్రవణ్ కుమార్ ను ఎన్నోసార్లు పిలిచారు. కానీ ఏ జవాబు రాలేదు. వారి అబ్బాయికి ఏదో ప్రమాదం జరిగి వుండవచ్చని భయపడ్డారు. కొన్ని నీళ్ళు తెచ్చేందుకు ఇంత సమయం పట్టదు.
థరథ మహారాజు వారి ఎదురుగా వచ్చేవరకు తమ కుమారున్ని పిలుస్తూ ఉన్నారు. అడుగుల చప్పుడు విని తల్లి ”ఇది నీవేనా నా అబ్బాయి? నీకు ఇంత సమయం ఎందుకయ్యింది. అక్కడ జవాబు లేదు. ”మేము భయపడుతున్నాము” దానికీ సమాధానం లేదు. అడుగుల చప్పుడు దగ్గరికి వస్తున్నప్పుడు అది వారి కుమారుడు కాదని గ్రహించారు. ఏదో తప్పు జరిగిందని గ్రహించారు.
”ఆగు అక్కడ!” శ్రవణ్ కుమార్ తండ్రి అరిచాడు. ”నీవెవరవు? శ్రవణ్ కుమార్ ఎక్కడ?”
థరథ మహారాజు తెలియకుండా తాను చేసిన పనికి మానసిక క్షోభ పడ్డాడు. వారి కుమారుని మరణం గురించి ఎలా చెప్పాలో తెలియడం లేదతనికి. కళ్ళల్లో నీరుతో ఆయన మర్యాదపూర్వకంగా ”నాన్నగారు, నేను అయోధ్య రాజు థరథుడను. నా వద్ద మీకొక దుర్వార్త ఉన్నది. దయచేసి కూర్చోండి వార్త వినేముందు. ఇది మీ కుమారుని గురించి”.
”ఏమంటున్నావు? మా కుమారున్ని ఏం చేశావు?” ఇద్దరూ భయంతో అడిగారు.
థరథ మహారాజు ముందుకు అడుగేసి మర్యాదగా శ్రవణ్ కుమార్ శరీరాన్ని వారి ముందు ఉంచాడు. ఆ రాజు శ్రవణ్ కుమార్ తల్లిదండ్రుల పాదాలపై పడి ”నాన్నగారు, అమ్మగారు దయచేసి మొదట నేను చెప్పేది వనండి. తర్వాత మీ ఇష్టమొచ్చినట్లు చేయవచ్చు. ఏం జరిగిందో నన్ను చెప్పనీయండి”.
అతను వారిని చెట్టునీడకు తీసుకపోయి కూర్చోబెట్టాడు. నేను ఈ అడవిలో వేటకు వచ్చాను. నీటి శబ్దం విన్నానో….” అతను మొదలు పెట్టి, వారికి జరిగినదంతా వివరించాడు.
”మా అబ్బాయి, నా కుమారుడు ఎక్కడ?” శ్రవణ్ కుమార్ తండ్రి అడిగాడు.
”ఒక తప్పు జరిగింది. అది తెలియక చేసినప్పటికీ, దయచేసి నా జీవితాంతం మీ సేవ చేయనీయండి” అని థరథ మహారాజు అన్నాడు.
”ఓ రాజా, నీకు క్షమాపణ లేదు. నీ అశ్రద్ధ ఒక్కడిని తీసుకోలేను. కానీ ముగ్గురు ప్రాణాల్ని. మేము సంపూర్ణంగా మా కుమారునిపై ఆధారపడి ఉన్నాము. అతను లేకుండా మేము చచ్చినవారితో సమానం. ఓ రాజువై నీ బాధ్యత మనుషులను, జంతువులను రక్షించుట నీ కర్తవ్యం. దానికి బదులుగా నీవు అమాయక జంతువులను నీ వినోదం కోసం చంపుతున్నావు. అవి నీకు ఏం హాని చేశాయని వాటిని నీవు చంపుతున్నావు?”
ఆ వృద్ధుని మాటలు రాజు కండ్లు తెరిపించాయి. అతను ఇకముందు ఎప్పుడూ జంతువులను వేటాడనని ఒట్టు పెట్టుకున్నాడు. ”దయతో నన్ను ఆశీర్వదించండి” అని రాజు థరథుడు అన్నాడు.
నీవు ఏమి చేసినా, మా అబ్బాయిని బతికించగలవా? అతను మా ప్రాణాలకు ధనాగారం నీకు తెలుసా? ఇన్ని సంవత్సరాల నుండి మమ్మల్ని ఎలా కాపాడుతున్నాడో తెలుసా? అతని స్థానాన్ని ఎవరూ తీసుకోలేరు. ఓ రాజా, నీవు కూడా.
మీరు అనేది నేను ఒప్పుకుంటాను, ఎవరు కూడా శ్రవణ్ కుమార్ లా ఉండరు. అతను నిజంగా కర్తవ్యపాలకుడు మరియు బాగా ఇష్టపడే కుమారుడు. మరియు అతను అందుకు ఎప్పుడూ గుర్తుకుంటాడు” అని రాజు అన్నాడు.
దయచేసి నన్ను మిమ్మల్ని చూసుకోనీయండి. నేను మిమ్ముల్ని జాగ్రత్తగా చూసుకుంటానని మీ శ్రవణ్ కుమార్ కు మాటిచ్చాను”
”ఓ రాజా, మా కుమారున్ని పోగొట్టుకున్నాక మేము బతకడం వ్యర్థం? ఈ వయసులో మా అబ్బాయిని తీసేసుకున్నావు. నీవు కూడా ఇదే మాదిరిగా నీ పిల్లలు ఎవరూ నీ సంరక్షణకు దగ్గర లేనప్పుడు చనిపోతావు” అని శ్రవణ్ కుమార్ తండ్రి శపించాడు. మేము ఇప్పుడు పడుతున్న బాధ నీవు అప్పుడు అర్థమవుతుంది”
భరించలేని బాధతో శ్రవణ్ కుమారుని తల్లిదండ్రులు చనిపోయి తమ కుమారుని శవం పక్కనే పడిపోయారు.
థరథ మహారాజు ఎంతో పశ్చాత్తాపపడ్డాడు. అతను శ్రవణ్ కుమార్, అతని తల్లిదండ్రుల అంత్యక్రియల కోసం ప్రయత్నం మొదలుపెట్టాడు. ఇంతలో రాజు మనుషులు అతన్ని కలిశారు. వారు కూడా ఆ దురదృష్ట సంఘటన గురించి బాధపడినారు. తర్వాత వేటకు వెళ్ళిన అందరూ అయోధ్యకు తిరిగి చేరుకున్నారు. థరథ మహారాజు ఎంతో నిరుత్సాహంతో, విచారంతో దేనిపై ఆసక్తి లేకుండా ఉన్నాడు. అతన్ని శ్రవణ్ కుమార్ మరణం బాధిస్తుంది. ప్రజా సేవ కూడా జ్ఞాపకం చేయాల్సి వచ్చింది.
అనుకున్నట్లే శ్రవణ్ కుమార్ తల్లిదండ్రుల శాపం కార్యరూపం ధరించింది. అతని చివరి రోజుల్లో థరథుని కుమారులు ఎవరూ అతనితో లేరు. రాముడు మరియు లక్ష్మణుడు వనవాసానికి వెళ్ళారు. భరతుడు మరియు శత్రఘ్నుడు కూడా అతని మరణ సమయంలో అతనితో లేరు.
చివరికి రామా రామా అంటూ బాధతో ప్రాణాలు వదిలాడు థరథ మహారాజు.
ఈరోజు కూడా తల్లిదండ్రులపై చూపిన ప్రేమ మరియు చేసిన సేవ గురించి శ్రవణ్ కుమారుడిని జ్ఞాపకం చేసుకుంటారు.
ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు పశ్చిమ బెంగాల్ లో ఒక గొప్ప పండితుడు. వారు చాలా కఠినంగా క్రమశిక్షణ పాటిస్తూ సాదాసీదా జీవితాన్ని గడిపారు. పశ్చిమ బెంగాల్ ప్రజలు వారిని ఎంతో గౌరవిస్తూ, ప్రేమతో చూసేవారు.
ఒకరోజు కలకత్తాలో వారిని గౌరవించేందుకు గొప్ప సభను ఏర్పాటు చేశారు. ఎంతోమంది ముఖ్యులను ఆ సభకు ఆహ్వానించారు. ప్రజలందరు మంచి డ్రెస్సుల్లో వారి వారి ఖరీదైన కార్లలో రావడం మొదలయింది. గేటు దగ్గర గేటు కీపర్ ఆహ్వానితుల కార్లను సభాస్థలానికి పంపిస్తున్నాడు. ఒక మనిషి నడుస్తూ గేటు వద్దకు వచ్చాడు. గేటు కీప్ ధోతీ, కుర్తా, శాలువా తన భుజాల చుట్టు వేసుకున్న ఆయనను చూశాడు. అతడు ఒక ఆహ్వానితుడిలాగా కనబడలేదు.
ఆ మనిషి గేటు కీపర్ ను ”ఇక్కడ ఏమి జరుగుతున్నదని” అడిగాడు.
”ఏం నీకు తెలియదా, ఒక గొప్ప వ్యక్తి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఇక్కడికి వస్తున్నారు. అతను ఈరోజు ఇక్కడ గౌరవింపబడుతున్నాడు. ఇక దయచేసి పక్కకు జరగండి. చాలామంది వస్తున్నారిప్పుడు” గేట్ కీపర్ జవాబిచ్చాడు.

”నేను ఈ ఆడిటోరియంలోకి వెళ్ళాల్సి ఉంది. ఇదిగో చూడు. నేను ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ని” అని ఆ మామూలు డ్రెస్ లో ఉన్న మనిషి అన్నాడు.
”నువ్వా !” గేట్ కీపర్ నవ్వడం ప్రారంభించాడు. ”నీవు నన్ను తెలివితక్కువ వాడిగా అనుకుంటున్నావా? విద్యాసాగర్ అనే మనిషి మామూలు డ్రెస్ లో కార్యక్రమానికి నడుచుకుంటూ వస్తాడని నన్ను నమ్మమంటావా? ఇప్పుడు. నువ్వు నా సమయాన్ని వృథా చేస్తున్నావు” అని అనుకుంటూ గార్డు ఆ మనిషిని పక్కకు తోసేసాడు.
ఈశ్వరచంద్ర విద్యాసాగర్ తనే గొప్ప మనిషి అయి కూడా మాట్లాడకుండా తిరిగి నడిచి వెళ్ళాడు. ఎవరో ఇతడ్ని గుర్తించి బయటికి పోతున్నవాడిని ఎంతో గౌరవంగా వెంట తీసుకొని ఆడిటోరియంలోకి వెళ్ళాడు. గార్డు చేసిన తప్పుకు సభ ఏర్పాటు చేసిన వ్యక్తులు క్షమాపణ కోరారు.
ఆ గొప్ప వ్యక్తి గార్డుపై కోపం తెలుపలేదు. ”అతను కేవలం అతని డ్యూటీ చేస్తున్నాడు” అన్నాడు. మరియు గార్డును తిట్టకుండా వారిని ఆపేశాడు.
వారికోసం ఏర్పాటు చేసిన సభ తరువాత, వారిని కొన్నిమాటలు మాట్లాడమని కోరారు.
”నా మిత్రులారా” అని మొదలుపెట్టారు. నేను ఈ రోజు ముఖ్యమైన పాఠం నేర్చుకున్నాను. ఒక మనిషి తను వేసుకున్న బట్టలతో గుర్తింపబడతాడు. కానీ వాస్తవంగా లోపల అతడు / ఆమె ఏమిటో కాదు.
కార్యక్రమానికి వచ్చిన జనులు ఈ మాటలు విని తలలు వంచుకున్నారు. వారు గార్డు అతడిని పక్కకు నెట్టివేసిన ఘటన విన్నారు. ఆ సభకు వారందరూ మంచి మంచి డ్రెస్సుల్లో వచ్చారు. కానీ ఈ గొప్ప వ్యక్తి ఎవరైతే గౌరవింపబడుతున్నాడో చాలా మామూలు బట్టల్లో వచ్చారు.
గోదావరి నది పొంగి ప్రవహిస్తోంది. ఆ నదిలో ఒక కుక్క ఒకటి కొట్టుకొని వచ్చింది. దానికి ఈత వచ్చు. ఆ ప్రవాహ వేగంలో అది కొట్టుకొని వచ్చి దిగువన ఉన్న ఒక గ్రామానికి చేరింది. అది ఆ గ్రామంలోకి ప్రవేశించింది . ఆ కుక్కను చూసి ఇతర కుక్కలన్నీ వెంబడిపడి మొరగడం ప్రారంభించాయి . అయినా అది వాటిని లెక్క చేయలేదు. ఆ తర్వాత అది ఒక ఇంటిలోనికి ప్రవేశించింది . ఆ ఇంటి యజమాని చాలా దయార్ద్ర హృదయుడు. వెంటనే అతడు ఆ కుక్కకు ఆహారం పెట్టాడు. అది తిన్న కుక్క ఆ యజమాని ఇంటి బయటనే ఉండసాగింది.
ఒకసారి ఆ యజమాని తన కుటుంబంతో సహా ఒక ఊరుకు వెళ్లాడు . ఆ కుక్కను ఇక్కడనే ఉంచిపోయాడు. ఆ సమయంలో ఒక పెద్ద త్రాచుపాము వారి ఇంటిలోనికి దూరడానికి ప్రయత్నించింది. ఇది గమనించిన ఆ కుక్క మొరుగుతూ ఆ త్రాచు పామును అడ్డుకుంది . ఆ కుక్కకు భయపడిన ఆ త్రాచుపాము దూరంగా ఉండి ఆ ఇంటిలోనికి ఎలాగైనా ప్రవేశించాలని తాపత్రయపడింది . కానీ ఆ కుక్క ముందు దాని ఆటలు సాగలేదు.
ఇంతలో ఆ ఇంటి యజమాని ఊరినుండి వచ్చాడు. ఆ కుక్క ఎందుకు మొరుగుతున్నదోనని అతడు చూశాడు. అక్కడ అతనికి ఒక విష సర్పం తన ఇంటిలోనికి ప్రవేశించడానికి చేస్తున్న ప్రయత్నాన్ని చూశాడు. దానిని కుక్క అడ్డుకుంటున్న సంగతి కూడా గమనించాడు . అది చూసి వెంటనే అతడు పాములు పట్టే వ్యక్తిని పిలిపించాడు. అతడు ఆ పామును పట్టుకొని ఒక సీసాలో బంధించాడు. తర్వాత ఆ యజమాని ఇచ్చిన డబ్బును తీసుకొని దాన్ని తీసుకుని వెళ్లి దూరంగా అడవిలో వదిలిపెట్టాడు.
మరొక్కసారి యజమాని, ఆయన భార్యా పిల్లలు అర్దరాత్రి నిద్రలో ఉన్నారు. అప్పుడే కొందరు దొంగలు వారి ఇంట్లో ప్రవేశించి వారు ఉన్న గది తలుపు బయట గడియ పెట్టి వారి ఇంటిలోని డబ్బు, బంగారం దోచుకెళ్లారు. ఈ సమయంలో ఆ కుక్క ఎక్కడికో వెళ్లింది. ఇంతలో ఆ యజమాని కి తెలివై బిగ్గరగా ” దొంగలు, దొంగలు” అంటూ కేకలు వేశాడు. ఆయన వేసిన ఆ కేకలకు ఆ వీధిలోని వారు మేల్కొని వారి ఇంటికి వచ్చి తలుపు గడియ తీశారు. అప్పటికే ఆ దొంగలు పారిపోయారు. వారి బీరువా తలుపులు తెరచి ఉన్నాయి. అప్పుడు యజమానికి తన కుక్క ఏమైందని జ్ఞాపకం వచ్చింది. వెంటనే అతడు ఇరుగు పొరుగు వారితో “నా కుక్క కనిపించిందా !”అని అడిగాడు. వారు లేదని చెప్పారు. వెంటనే ఆ యజమాని కుక్క కొరకై బయటకు వచ్చి చూశాడు. అప్పుడే ఎక్కడినుండి యో వస్తున్న ఆ కుక్క నోటిలో ఒక డబ్బు, నగల మూట కనిపించింది. అది తీసుకుని విప్పి చూశాడు. అది తన బంగారం, డబ్బులే. ఆ యజమాని జరిగినది ఊహించాడు. ఇరుగు పొరుగు వారికి తన కుక్క ఆ దొంగల వెంటబడి వారిని తరిమి తన బంగారం, నగదును పట్టుకుని తెచ్చిందని చెప్పి సంబరపడ్డాడు. ఇరుగు పొరుగు వారు ఆ కుక్క చేసిన పనికి ఎంతగానో సంతోషించారు. తర్వాత ఆ ఇంటి యజమాని తను పెట్టిన ఆహారం తిని తన పట్ల తన కుటుంబం పట్ల విశ్వాసం చూపిన ఆ కుక్కను ప్రేమతో దాని తలపై నిమిరాడు.
పూర్వం సిద్ధార్థుడు అనే ఒక రాకుమారుడు ఉండేవాడు. అతడు దయగలవాడు. అతడు వయసులో చిన్నవాడైనప్పటికీ ఎవరు బాధపడుతున్నా ఇష్టపడేవాడు కాదు. అతను జంతువులను కూడా ప్రేమించేవాడు. అతను ఎప్పుడూ అందరినీ దయగా చూసేవాడు కాబట్టి అందరు అతన్ని ఇష్టపడేవారు.
ఒకరోజు రాజుగారి తోటలో సిద్ధార్థ నడుస్తుండగా, ఏదో బాధతో ఏడుస్తున్న శబ్దం విన్నాడు. వెంటనే తనముందు ఏదో పడింది. అతను అక్కడికి వెళ్ళి చూస్తే, ఒక అందమైన తెల్లని హంస ఉంది. అది నొప్పితో మూల్గుతున్నది. ఒక బాణం ఆ పక్షి శరీరంలో గుచ్చుకుని రక్తం కారుతుంది.
దాని అవస్థ చూసి బాధపడి రాకుమారుడు సిద్ధార్థ చాలా జాగ్రత్తగా ఆ పక్షిని లేపి తన చేతులపై పెట్టుకొన్నాడు. ”దాన్ని ముట్టుకోకు, అది నాది” అనే అరుపు విన్నాడు. సిద్ధార్థ అటు చూసేవరకు అతని మేనమామ కొడుకు దేవదత్ తనవైపు పరుగెత్తుకుంటూ వచ్చాడు. అతని ఒక చేతిలో ఒక బాణం ఉంది. రెండవ చేతిలో బాణాల పొదిలో నిండా బాణాలు ఉన్నాయి.
”ఆ పక్షి నాది, నాకు తిరిగి ఇచ్చేయి” అని అన్నాడు.
”ఈ పక్షి నాకు దొరికింది. నేను పాపం ఈ పక్షిని జాగ్రత్తగా చూసుకుంటాను” అన్నాడు సిద్ధార్థ.
”నేను ఆ పక్షిని బాణంతో కొట్టి పడేశాను, కాబట్టి అది నాది” అన్నాడు దేవదత్.

ఇద్దరు వాదులాడుకొంటున్నారు. చివరకు వారు తీర్పు కోసం రాజుగారి దగ్గరికి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. రాజు శుద్ధోదనుడు దర్భారు నడిపిస్తున్నాడు. ఇద్దరు బాలురు లోనికి వెళ్ళి వారికి తీర్పు కావాలని కోరారు.
”చెప్పండి మాకు, మీ సమస్య ఏమిటి, మేము వింటున్నాము”, రాజు శుద్ధోధనుడు అన్నాడు.
దేవదత్ ”మహారాజా! సిద్ధార్థ నా పక్షిని తీసుకున్నాడు. నేను బాణంతో ఆ పక్షిని పడేశాను, కాబట్టి అది నాదే. దయచేసి నా పక్షిని నాకు ఇప్పించండి” అన్నాడు.
”రాకుమార సిద్ధార్థ ఇది నిజమేనా?” అడిగాడు శుద్ధోధనుడు.
”మహారాజా, ఈ పక్షి ఘోరంగా గాయపడి తోటలో పడి ఉంది. నేను దాన్ని పైకి లేవదీశాను” అన్నాడు సిద్ధార్థ.
”తరువాత” సిద్ధార్థ చెప్పసాగాడు, ”నేను దాని గాయాన్ని శుభ్రపరిచాను. ఇప్పుడు అది కోలుకుంటున్నది. నేను దాన్ని చంపనీయను. ఎవరికి కూడా ఇతరుల ప్రాణం తీసే హక్కు లేదు. నేను దాన్ని అతనికి ఇవ్వను” అన్నాడు.
రాజ దర్భారు (కోర్ట్)లో ఉన్న ప్రజలందరు రాకుమారుడు సిద్ధార్థ చూపిన దయకు ముగ్ధులైనారు. వారు రాజు గారి తీర్పు కొరకు ఎదురు చూస్తున్నారు.
రాజు సమస్యపై విచారణ చేసి, అతని నిర్ణయం వెలిబుచ్చాడు.
కేవలం సృష్టికర్తకే ప్రాణాన్ని తీసుకునే హక్కు ఉంటుంది. ఒకరు చేసిన సృష్టిని వేరే వారు నాశనం చేసే హక్కు ఉండదు. ఈ కేసులో దేవదత్ పక్షిని చంపే ప్రయత్నం చేశాడు. కాని సిద్ధార్థ దాన్ని రక్షించాడు.
కాబట్టి ప్రాణం తీసే వ్యక్తి కన్నా, ప్రాణాన్ని కాపాడిన వారికి ఎక్కువ హక్కు ఉంటుంది. కనుక ఆ పక్షి సిద్ధార్థకు చెందుతుంది కానీ దేవదత్ కు చెందదు.
రాకుమారుడు సిద్ధార్థ ఇది విని చాలా సంతోషించాడు. దర్భారులో ఉన్న ప్రజలు కూడా అంత తెలివైన, దయగల రాజు పాలనలో ఉన్నందుకు చాలా ఆనందించారు.
”ఆ యువ రాకుమారుడు ఎవరో మీకు తెలుసా?” కథ చెప్పిన తరువాత తాతగారు అడిగారు. ”అతను ఇంచా చాలా నెమ్మదస్తుడు మరియు దయగల వాడిగా ఎదిగాడు. అతను కేవలం దయగల వాడేగాక తన చుట్టు ఉన్నవారికి కూడా బోధించేవాడు. అతను గౌతమ బుద్ధుడు”.